‘ఘర్‌ మె ఘుస్‌కర్‌ మారేంగే’`

‘ఘర్‌ మె ఘుస్‌కర్‌ మారా’

(ఇంట్లోకి చొరబడి నిర్వీర్యం చేస్తాం)

 ఈ రెండు ప్రకటనలు దేశంలో రేకెత్తించిన సంచలనం, వచ్చిన స్పందన ఉగ్రవాదం పట్ల భారత్‌ కఠిన వైఖరిని జేగంటలా మోగించి చెప్పాయి. అవి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చాయి. దీనితో దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అనుకున్నవారు అవాక్కయ్యారు. అవి బీజేపీ ప్రతిష్ఠను ఇనుమడిరపచేశాయి. మోదీ సాహసాన్ని చాటి చెప్పాయి. భారత ప్రధాని ఇలాంటి ఒక ప్రకటన చేయక తప్పని పరిస్థితిని కల్పించినది ఇంగ్లండ్‌ వార్తాపత్రిక ‘ది గార్డియన్‌’. ఎన్నికలలో నరేంద్ర మోదీ హవా తగ్గించడమే, బీజేపీ విజయావకాశాలను బలహీన పరచడమే ధ్యేయంగా ‘ది గార్డియన్‌’ ఈ మేరకు ఒక వ్యాసం ప్రచురించినా దానినే తమకు అనుకూలంగా మార్చుకుంది భారత నాయకత్వం. ‘ఇండియా గవర్నమెంట్‌ ఆర్డర్డ్‌ కిల్లింగ్స్‌ ఇన్‌ పాకిస్తాన్‌, ఇంటెలిజెన్స్‌ అఫీషియల్స్‌ క్లెయిమ్‌’ పేరుతో ఏప్రిల్‌ 4న ఈ వ్యాసం వెలువడిరది. హన్నా ఎలీస్‌`పీటర్సన్‌, ఆకాశ్‌ హసన్‌, షామీర్‌ బలోచ్‌ ఈ వ్యాసం రాశారు. పైగా కెనడా కూడా ఇలాగే అభిప్రాయపడుతున్నదంటూ సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఏమైనా తమ వ్యాసంతో భారత ప్రభుత్వం బెంబేలెత్తిపోతుందని భావించిన గార్డియన్‌ వ్యాసకర్తలకు చుక్కెదురైన మాట నిజం. ఒకటి నిజం! ఏ ఉగ్రవాద సంస్థ ఈ హత్యలను ఖండిరచలేక పోయింది. ఆ పనిని ఉగ్రవాద సంస్థల తరఫున ది గార్డియన్‌ స్వీకరించింది. అదెందుకో కూడా ఆ పత్రిక చెబితే ప్రపంచం సంతోషిస్తుంది. 


ఎన్నో దశాబ్దాలుగా పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు, కశ్మీర్‌లోనే కాదు, దేశంలో పలు చోట్ల చేసిన ఉగ్రదాడులకు నీళ్లు నమలకుండా నిక్కచ్చైన సమాధానం చెప్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గాన్ని ప్రజలు ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు. గతంలో ప్రధాని మోదీ పాక్‌ సీమాంతర ఉగ్రవాద దాడుల విషయంలో పాకిస్తాన్‌కు అర్థమయ్యే భాషలోనే దానితో మాట్లాడాలంటూ చేసిన ప్రకటనను ప్రజలు ఆహ్వానించారు.

విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అయితే, పాకిస్తాన్‌ తన ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, తీవ్రవాద కార్యకలాపాలను మానుకోకపోతే, వారితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే, భారత్‌లో శాంతిభద్రతలకు, రక్షణకు భంగం కలిగించాలని పాకిస్తాన్‌ నుంచి ఏ తీవ్రవాది ప్రయత్నించినా, తగిన జవాబు ఇస్తామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరిక చేశారు. అవసరమైతే, ఇంట్లో చొరబడి చావకొడతాం, వదిలిపెట్టం అని స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలు సరైనవని, ఎందు కంటే భారత్‌కు అంత శక్తి ఉందని, పాకిస్తాన్‌ ఆ విషయాన్ని గ్రహించిం దని కూడా ఆయన అన్నారు. ఈ ఆత్మ విశ్వాసాన్ని ప్రతి పక్షాలు, వారికి మద్ద తునిచ్చే పాశ్చాత్య దేశాలు సహించలేక పోతున్నాయి. ప్రధాని మోదీ చెప్పినట్టుగా 400 సీట్లు ఎలా సాధిసారో అన్న భయంతో ఈ ప్రకటనలను ఆధారం చేసుకుని వారు దుమ్ముజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సమయంలో లండన్‌ నుంచి వెలువడే ‘ది గార్డియన్‌’ అన్న పత్రిక పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక తీవ్రవాదుల హత్యలకీ, భారత్‌కూ ముడిపెడుతూ ఈ వ్యాసం/ నివేదిక వెలువరించింది. సుదీర్ఘమైన ఈ నివేదికలో ఎక్కడా విశ్వసనీయత కలిగిన ఆధారాలు కానీ సరైన దర్యాప్తు కానీ కనిపించడం లేదని రక్షణ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఈ ఘటనలు ఎలా జరిగాయన్న విషయంలో కూడా టైమ్‌లైన్‌ను సరిగ్గా ఇవ్వకపోవడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. భారత్‌కు చెందిన నిఘా విభాగమైన రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (ఆర్‌ఎడబ్ల్యు) 2020వ సంవత్సరంలో పాకిస్తాన్‌లో 20 వరకు హత్యలు చేయించిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాదు, కెనడాలో కూడా ఖలిస్తానీ తీవ్రవాదుల హత్యలకు భారత్‌దే బాధ్యత అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గుడ్డిగా భారత వ్యతిరేకతతోనే హన్నా ఎల్లిస్‌ పీటర్సన్‌ అన్న ఆ విలేకరి దీనిని వెలువరించినట్టు అర్థమవుతుంది.

కాగా, ఈ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశంతో కూడుకున్నవని భారత ప్రభుత్వం తోసి పుచ్చింది. అయితే, ఈ వ్యాసం వచ్చిన సందర్భంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రవాదులు భారత్‌లో తీవ్రవాద చర్యలకు పాల్పడి, పాక్‌లో వెళ్లి దాక్కుంటే అక్కడికి వెళ్లి వారిని నిర్వీర్యం చేస్తామంటూ అనడంతో మరురోజే ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని, భారత్‌ తమ ఆరోపణలను అంగీకరించి నట్టుగా గార్డియన్‌ మరొక వ్యాసాన్ని వెలువరించింది. సార్వభౌమత్వం కలిగిన ఏ దేశమైనా తన శత్రువుల విషయంలో మరొకరకంగా మాట్లాడదన్న విషయాన్ని విస్మరించి, తిరిగి ప్రతివ్యాసాన్ని ప్రచురించడం గార్డియన్‌ తప్పిదం.

భారత్‌కు పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుందని, అది ఏనాడూ ఎవరిపైనా దాడి చేయలేదని, ఎవరి భూమినీ అంగుళం కూడా ఆక్రమించలేదని ఆయన చెప్పినప్పటికీ, ఈ మాటలు ఆ వ్యాసంలో కనిపించలేదు. పదే పదే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, తీవ్రవాదాన్ని వ్యాప్తిచేస్తుంటే మాత్రం సహించేది లేదని కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

 ఈ నేపథ్యంలోనే, గార్డియన్‌ వ్యాసానికి అది ఊహించని విధంగా సామాజిక మాధ్యమాల్లో దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురు కావడాన్ని చూడాలి. కానీ పాకిస్తానీ అధికారులు మాత్రం భారత్‌పై బురదజల్లేందుకు గార్డియన్‌ పత్రిక ఇచ్చిన అవకా శాన్ని పూర్తిగా వినియోగించుకొని ‘రా’ (ఆర్‌ఎడబ్ల్యు) విదేశీ గడ్డపై దాడులు చేయిస్తోందంటూ విరుచు కుపడ్డారు.

ఎన్నికలకు ముందు ఇది తొలిసారి కాదు

ఒకనాడు తమ చెప్పు చేతుల్లో ఉండి, 2014 నుంచి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ అంతర్జాతీయ యవనికపై వెలిగిపోతున్న భారత్‌, ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రతిష్ఠను మసకబార్చడం ద్వారా దానిని తిరిగి తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నదే ఈ వ్యాసం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి 2014లో పాశ్చాత్య దేశాలు ప్రోత్సహిస్తున్నవారు (కేజ్రీవాల్‌ అని ఒక వాదన) కాకుండా ప్రధాని మోదీ విజేతగా అవతరించినప్పుడే వారు షాక్‌కు లోనయ్యారు. అయితే, మోదీ తన కార్యాచరణతో ఇంతింతై… వటుడిరతై.. అన్న చందంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయికి పెరిగి బలపడిపోవ డాన్ని చూసి సహించ లేకపోతున్నారు. బహుశ, బీజేపీ విజయం మూడవసారి కూడా అనివార్యమని తెలియడంతో, కనీసం వారు ప్రకటించిన 400 స్థానాలు రాకుండా ఉండేందుకు ఈ ప్రతికూల తమ దుష్ప్రచారాన్ని ఉద్దేశించి ఉంటారు.

2019లో టైమ్స్‌ పత్రిక

అందుకే, 2019 ఎన్నికల ముందే ‘ది టైమ్‌’ పత్రిక ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అన్న శీర్షికతో ముఖపత్ర కథనాన్ని వెలువరించింది. భారత తొలి ప్రధాని నెహ్రూ ఎంతో గౌరవించి, ప్రేమించిన సెక్యులరిజాన్ని ప్రధాని మోదీ పక్కన పెట్టేసి ట్రిపుల్‌ తలాక్‌ వంటి బిల్లులు తీసుకువచ్చి ముస్లిం మైనార్టీకి అన్యాయం చేస్తున్నారన్నది ఆ కథనంలో ఒక ఆరోపణ మాత్రమే. దీనికితోడుగా, ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అన్న మోదీ నినాదం ఆ పత్రికకు ఎంతో వేదన కలిగిం చింది. ఈ వైఖరితో హిందు, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంచి పోషించే కోరికను ఆయన ప్రదర్శించలేరంటూ వ్యాసం విమర్శించింది. ఎటువంటి నైతిక దిశను అందించకుండానే, భారత్‌ ప్రమాణాలను పనికిమాలినవని కొట్టివేస్తూ, ఈ నైతిక నిర్ణయాలన్నీ కూడా వర్గ, సాంస్కృతిక యుద్ధపు ప్రమాణాలకు ఉన్నట్లు అనిపించేలా చేశారంటూ ఆరోపణలు చేసింది. జాతీయభావనను కలిగి ఉండటమే ఒక నేరంలా చిత్రీకరించింది. కానీ దానిపప్పులు ఉడకలేదు. ఎందుకంటే, పాక్‌పై భారత్‌ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను 2019ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ‘ఘర్‌ మె ఘుస్‌కర్‌ మారా’ (వాళ్లింటికెళ్లి కొట్టొచ్చాం) అంటూ తన ఉపన్యాసా లలో పేర్కొనడం ప్రజామోదం పొంది ప్రధాని మోదీ రెండవ పర్యాయం కూడా భారీ మెజారిటీతో నెగ్గారు.

ఈసారి గార్డియన్‌

ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే 400 స్థానాలను దాటుతుందంటూ బల్లగుద్ది మరీ మోదీ ప్రకటించడం కేవలం ప్రతిపక్షల్లోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా అలజడి రేపిందనే విషయానికి సంకేతమే గార్డియన్‌ ప్రచురించిన నివేదిక. అధికారికవర్గాలు ఈ వ్యాసం దురుద్దేశాలతో కూడుకున్నది, అబద్ధమంటూ ప్రకటించినా, వ్యాసం వెలువడే కొన్నిగంటల ముందు బిహార్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ‘ఆజ్‌ కా భారత్‌ ఘర్‌మె ఘుస్‌కర్‌ మార్తా హై’ (ఇంట్లోకి వెళ్లి తన్ని వచ్చేది నేటి భారత్‌) అంటూ ప్రధాని మోదీ ప్రజల హర్షోల్లాసాల మధ్య ప్రకటించడం గమనార్హం. నిజానికి ప్రకటనలు చేయడమే కాక చేసి చూపడంతో భారతీయులు దీనిని ‘వీరత్వానికి’ సంబంధించిన అంశంలా పరిగణి స్తున్నారు. ఒకవేళ ఆ 20మంది తీవ్రవాదులను ఆర్‌ఎడబ్ల్యు చంపిందని భారత ప్రజలు నమ్మినా వారికి ఆ సంస్థ పట్ల, ప్రధాని మోదీ పట్లా గౌరవాభిమానాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. గార్డియన్‌ ఊహించినట్టుగా, మోదీని తిరస్కరించక పోగా నెత్తినపెట్టుకుంటారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న ఆమోదాన్ని, గౌరవాన్ని చూసిన తర్వాత కూడా ఆ పత్రిక ఈ వ్యాసం రాయడం విఫలయత్నం తప్ప మరొకటి కాదు.

గురివింద గింజ చందంగా

రష్యా, ఇజ్రాయిల్‌కు చెందిన కేజీబీ, మొస్సాద్‌ సంస్థల నుంచి స్ఫూర్తిపొందిన భారత ఏజెన్సీలు ఈ కృత్యాలకు పాల్పడుతున్నాయంటూ ‘ది గార్డియన్‌’ ఆరోపణల వర్షం కురిపించిందే తప్ప సిఐఎ, ఎంఐ6 సంస్థలు ఇతర దేశాలలో చేసే రాజకీయనాయకుల, శాస్త్రవేత్తల హత్యల గురించి ఎటువంటి ప్రస్తావన చేయక పోవడం వారి ఉద్దేశాలకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, నిన్నటి వరకూ అది ఐక్యరాజ్య సమితి సహా అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాలలో బలమైన లాబీలను కలిగి ఉండేది. భారత్‌లోకి, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తూనే, మరోవైపు అమాయకత్వం నటిస్తూ ప్రకటనలు చేస్తుంటే, ఈ దేశాలు, సంస్థలు వారికి అండగా నిలబడేవి. నేడు పాకిస్తాన్‌కు ఆ మద్దతు కానీ, ఆర్ధిక పరిస్థితి కానీ లేవు. అందుకే, తామే ఈ హత్యలను జరిపి, భారత్‌పై చెత్తవేసే మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్‌ నేడు తమ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ కొత్తకొత్త తీవ్రవాద గ్రూపులు అవతరించి, వారిపైనే దాడులకు పాల్పడుతున్న క్రమంలో తప్పు ఎక్కడ జరుగుతోందో పాక్‌ చూసుకోవాలి.

పాక్‌లో పెరిగిన ఉగ్రదాడులు

ఇటీవలి కాలంలో, పాకిస్తాన్‌లో పెరిగిపోయిన తీవ్రవాద దాడులను గార్డియన్‌ ప్రస్తావించక పోవడం ఆశ్చర్యం. ఒకవైపు బెలూచీలు, పష్తూన్లు, సింధుదేశంలో తీవ్రవాదులు, వీరందరినీ మించిన పాకిస్తానీ తాలిబాన్లు (టీటీపీ) దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అసలు ఈ గ్రూపులే ఒకనాడు హీరోలుగా చెలామణి అయిన తీవ్రవాదులను లేపేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధంగా దీనిని చూడకుండా పాక్‌ ప్రభుత్వం, ఎదుటి వారిపై బురదజల్లడం దాని దుర్బుద్ధిని పట్టి చూపుతుంది. పాక్‌ ప్రభుత్వ వైఖరిని పక్కకుపెట్టినా, పాక్‌ రక్షణ దళాలపై దాడులే కాదు, చైనా చేపట్టిన సీపెక్‌ కారిడార్‌పై, గ్వాదర్‌ రేవు వద్ద, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జరుగుతున్న దాడులు, దుర్ఘటనలపై ఒక్క అంతర్జాతీయ పత్రిక దృష్టీ పడకపోవడం విచిత్రమే.

భారత్‌కు ఇప్పుడు ఒక బలమైన ప్రభుత్వం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాల యుగం కాదిది. ఇదే, పాశ్చాత్య దేశాలను ఇబ్బంది పెడుతోంది. వారు గతంలోలా తమకు అనుకూలమైన, లాభదాయకమైన విధానాల కోసం భారత్‌ను నియంత్రించ లేకపోతున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిర్ణయాలు తీసుకుంటోంది. ఏమీ చేయలేకపోతున్న పాశ్చాత్య దేశాలు ఈ రకంగా భారత్‌ను రకరకాల సూచీల ఖైదీలో బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, భారత్‌ వాటిని కూడా లెక్కచేయడం లేదు. పొరుగుదేశం నుంచి ఉద్భవిస్తున్న తీవ్రవాద ముప్పుకు ముగింపు పలకాలన్న సంకల్పాన్ని శక్తిని రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రతిఫలిస్తున్నాయి. ఇతర దేశాలలాగే, తన శత్రువులు ఎక్కడ ఉన్నా వారిని వెంటాడి పట్టుకునే అధికారం భారత్‌కు కూడా ఉంది. ఆత్మగౌరవంతో కూడిన నయా భారతంతో ఒకప్పటిలా ఆటలు ఆడటానికి ఇకపై అవకాశం లేదు.


ఎవరు..ఎక్కడ..ఎలా?

ప్రపంచంలో ఎక్కడ ముస్లిం మతోన్మాదుల రక్తపాతం సృష్టించినా  ఆ దుర్ఘటనతో పాకిస్తాన్‌కు సంబంధం ఉంటుంది. ముస్లిం మతోన్మాదం ఆధారంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదానికి బీజాలు అక్కడే ఉన్నాయి. అంతేకాకుండా, భూప్రపంచం మీద ఎక్కడ హింసకు పాల్పడినా పాకిస్తాన్‌లో తలదాచుకోవచ్చు. కానీ ఆ దోబూచులాట చిరకాలం సాగదని ఇటీవలి కాలంలో తేలిపోయింది. అక్కడ నక్కిన పలువురు ఉగ్రవాదులు వరసగా హతం కావడం మొదలయింది. వీరంతా భారత్‌లోని జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, ఇతర రాష్ట్రాలలో దారుణాలకు పాల్పడినవారే. పెద్ద పెద్ద నేరాలలో నిందితులే. భారత రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ విభాగం (రా) వీరిని మట్టుపెడుతున్నదని మొదట గుసగుసలు వచ్చాయి. కానీ భారత్‌ మీద ఎంత పగ ఉన్నా ఆ మాట పాక్‌ పైకి అనలేకపోయింది. దానికి బోలెడు కారణాలు. వీరందరిని గుర్తు తెలియని సాయుధులే మట్టుపెట్టారు.

కొద్దికాలం క్రితమే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ తుదముట్టించడమే ధ్యేయంగా నడుస్తు న్నట్టు కనిపిస్తుంది. ఉగ్రవాద నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున ఎన్‌ఐఏ 43 మంది కరుడగట్టిన నేరగాళ్ల జాబితాను ఫోటోలతో సహా సెప్టెంబర్‌ 21, 2023న  విడుదల చేసింది. వీరిలో కొందరు కెనడా కేంద్రంగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్‌ తరువాత భారత వ్యతిరేక ఉగ్రవాద మూకలకు కెనడా స్థావరంగా తయారైన సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో విదేశీ గడ్డ మీద ‘గుర్తు తెలియని సాయుధుల’ చేతిలో మరణించిన కొందరు:

దావూద్‌ మాలిక్‌ (అక్టోబర్‌ 21, 2023)

పేరుమోసిన ఉగ్రవాది మౌలానా మసూద్‌ అజర్‌ సన్నిహితుడు దావూద్‌ మాలిక్‌. లష్కర్‌ ఎ జబ్బార్‌ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాప కుడు. ఇతడు అనేక భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. పాకిస్తాన్‌ లోని ఉత్తర వజీరిస్తాన్‌లో మిరాలీ ప్రాంతంలో ఇతడిని సాయుధులు హత్య చేశారు. మసూద్‌ అజర్‌, మాలిక్‌ ఇద్దరూ భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవా దులే. మాలిక్‌ ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఉండగా కాల్చి చంపారు.

షాహిద్‌ లతీఫ్‌ (అక్టోబర్‌ 11,2023)

లతీఫ్‌ లష్కరే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. భారత నిఘా బృందాలు ఇతడి కోసం గాలిస్తున్నాయి. 2016 నాటి పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడిలో ఇతడు కీలకపాత్ర వహించాడు. అందులో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఇతడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

జియా ఉర్‌ రెహమాన్‌ (సెప్టెంబర్‌ 29,2023)

జియా లష్కర్‌ ఏ తాయిబా సభ్యుడు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించ డానికి యువకులకు శిక్షణ ఇచ్చాడు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇతడిని కరాచీలో కాల్చి చంపారు.

సుఖ్‌దూల్‌ సింగ్‌ (సెప్టెంబర్‌ 21,2023)

సుఖ్‌దూల్‌ సింగ్‌కే సుఖ దునేకె అని కూడా పేరుంది. ఇతడు ఖలిస్తానీ ఉగ్రవాది. అర్షదీప్‌ సింగ్‌తో కలసి కార్యకలాపాలు నిర్వహించాడు. కెనడా కేంద్రంగా పనిచేసేవాడు. అక్కడే విన్నీపెగ్‌ అనేచోట హత్యకు గురయ్యాడు.

అబూ ఖాసిం కశ్మీరీ (సెప్టెంబర్‌ 8,2023)

ఖాసిం మరొకపేరు రియాజ్‌ అహ్మద్‌. ఇతడు జమ్ముకు చెందినవాడు. రాజౌరీలోని ధాంగ్రి దాడిలో ఇతడు కీలకంగా ఉన్నాడు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే ఇతడిని గుర్తు తెలియని వ్యక్తులు మట్టుపెట్టారు.

సర్దార్‌ హుసేన్‌ అరియన్‌ (ఆగస్ట్‌ 1,2013)

అరియన్‌ లష్కర్‌ ఏ తాయిబా నాయకుడు. అంత ర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు సన్నిహితుడు. జమాత్‌ ఉద్‌ దవా అనే మదరసా నెట్‌వర్క్‌ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించాడు. కరాచీలోని నవాబ్‌షాలో ఉన్న ఇతడి సొంత దుకాణంలోనే ఆగంతకులు కాల్చి చంపారు. సిధుదేశ్‌ రివల్యూషనరీ ఆర్మీ అరియన్‌ను చంపినట్టు ప్రకటించుకున్నది.

హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ (జూన్‌ 19, 2023)

నిజ్జర్‌ ఖలిస్తానీ కార్యకలాపా లలో కీలక వ్యక్తి. ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ అధిపతి ఇతడే. గురు నానక్‌ సిక్‌ గురుద్వారా సాహెబ్‌ అధిపతి కూడా ఇతడే. గురుద్వారా ప్రాంగణంలోనే ఇతడిని చంపారు. భారత్‌లో జరిగిన అనేక హింసాత్మక ఘటనలతో ఇతడికి సంబంధం ఉంది.

అవతార్‌సింగ్‌ ఖాండా (జూన్‌ 16,2023)

బ్రిటన్‌ కేంద్రంగా పనిచే ఖాండా ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. బ్రిమింగ్‌హామ్‌ ఆసుపత్రిలో చనిపోయాడు. 2023 ఆరంభంలో లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిలో ఇతడూ ఉన్నాడు.

పరంజిత్‌ సింగ్‌ పంజ్వార్‌ (మే 6, 2023)

పంజ్వార్‌ ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌ అధిపతి. మాలిక్‌ సర్దార్‌ సింగ్‌ అని కూడా ఇతడిని పిలిచేవారు. లాహోర్‌లోని అతడి నివాసం వద్ద హత్యకు గురయ్యాడు. భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదులలో ఇతడు ఒకడు.

సయ్యద్‌ నూర్‌ షాలోబార్‌ (మార్చి 4,2023)

షాలోబార్‌ కశ్మీర్‌ లోయలో యువకులను ఉగ్రవాద సంస్థలకు ఎంపిక చేసే పని చేసేవాడు. ఇతడికి పాకిస్తాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతు ఉండేవి. ఖైబర్‌ ఫంక్తుంక్వా ప్రాంతంలో ఇతడిని చంపారు.

బషీర్‌ అహ్మద్‌ పీర్‌ (ఫిబ్రవరి 20, 2023)

పీర్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో ప్రముఖుడు. ఇతడికే ఇంతియాజ్‌ ఆలం అని మరొక పేరు. రావల్పిండిలో హత్య చేశారు. కశ్మీర్‌ లోయలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే ఇతడు గడచిన 15 ఏళ్లుగా పాకిస్తాన్‌లోనే నివాసం ఉంటున్నాడు.

సయ్యద్‌ ఖాలిద్‌ రజా (ఫిబ్రవరి 27, 2023)

రజా ఉగ్రవాద సంస్థ అల్‌ బదర్‌ ముజాహిదీన్‌ కమాండర్‌. కరాచీలో ఇతడిని చంపారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధిపతి సయ్యద్‌ సలాహుదీన్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాకు ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయిజజ్‌ అహ్మద్‌ అహంగర్‌ (ఫిబ్రవరి 14,2023)

అహంగర్‌ కశ్మీర్‌ ఉగ్రవాది. ప్రపంచంలోనే ప్రముఖ ముస్లిం ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ నాయకుడు. అఫ్ఘానిస్తాన్‌లోని కునార్‌ ప్రాంతంలో ఇతడి శవం కనిపించింది. అయితే ఇతడిని తాలిబన్‌ చంపారని భావిస్తున్నారు.

హర్విందర్‌ సింగ్‌ సాంధు (నవంబర్‌ 19,2022)

సాంధునే హర్విందర్‌ సింగ్‌ రిండా అని కూడా అనేవారు. ఇతడు కూడా ఖలీస్తానీ ఉగ్రవాదే. లాహోర్‌లోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. పంజాబీ గాయకుడు సిధు మూసేవాలే హత్యతో పాటు పలు నేరాలలో ఇతడు భాగస్వామి.

రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ (జూలై 14, 2022)

రిపుదమన్‌ బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాది. ఇది కూడా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అని తెలిసిందే. కెనడాలోని సురే అనే చోట ఇతడిని కొందరు కాల్చి చంపారు. 1985 నాటి ఎయిరిండియా విమానం మీద బాంబులు వేసిన ఘటనతో కూడా ఇతడికి సంబంధం ఉంది.

జహూర్‌ మిస్త్రి (మార్చి 1,2022)

మిస్త్రి జైష్‌ ఏ మహమ్మద్‌ ఉగ్రవాది. ఎయిర్‌లైన్స్‌ ఐసి 814 విమానం దారి మళ్లించిన నేరంలో ఇతడు ఉన్నాడు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన దుండగులు కరాచీలో కాల్చి చంపారు.

–  జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram