మూడేళ్ల విరామానంతరం తన చమురు సరఫరాలను కరేబియన్‌ ‌నుంచి పునరుద్ధ రించాలని భారత్‌ ‌యోచిస్తఉన్న సమయం లోనే, ఆ ప్రాంతంలో ఒక నూతన ఫ్రంట్‌ ‌వృద్ధి చెందుతోంది. ట్రంప్‌ ‌కాలంలో యుఎస్‌ ‌ప్రభుత్వం వెనిజులా పై విధించిన ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేయడంతో, చమురు ఎగుమతులను ప్రారంభిం చేందుకు భారతీయ సరఫరాదారులు సిద్ధమవుతున్నారు. దేశంలో 2024 ద్వితీయార్ధంలో అంతర్జాతీయ పర్యవేక్షణలో దేశ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆరు నెలలపాటు వెనిజులాపై ఆంక్షలను ఎత్తివేస్తూ అక్టోబర్‌ ఆఖరులో యుఎస్‌ ‌ట్రెజరీ సాధారణ లైసెన్సును జారీ చేసింది.

ఆం‌క్షలు విధించక ముందు భారతదేశం తన దిగుమతులలో నెలకు 5-7 శాతానికి సమాన మైన10 మిలియన్‌ ‌బారెళ్ల చమురును సేకరించేది. యుఎస్‌ 2019‌లో విధించిన ఆంక్షల కారణంగా వెనిజులా నుంచి ముడి దిగుమతులను భారత్‌ ‌నిలిపివేయవలసి వచ్చింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధా నంతరం, చమురు ధరలు పెరుగుతాయేమోనన్న భయంతో యుఎస్‌ ‌వెనిజులా పట్ల తన వైఖరిని సడలిం చుకోవడం ప్రారంభించింది. ఈ ఎత్తుగడలు త్వరలోనే ఇరు దేశాల మధ్య బందీల మార్పిడికి దారితీసింది. ఒపెక్‌ (‌జు) చమురు ఉత్పత్తిని తగ్గించిన క్రమంలో వెనిజులా అంతర్జాతీయ చమురు మార్కెట్లలోకి తిరిగి ప్రవేశించడాన్ని ఆహ్వానించారు. వివాదాస్పద ఎస్సెక్విబో ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలంటూ డిసెంబర్‌ 3‌న చవిస్తా పాలకులు పిలుపునివ్వడం సుదీర్ఘకాల ఘర్షణను తిరిగి రెచ్చగొట్టింది.

గయానా పశ్చిమ సరిహద్దులో ఉన్న ఎస్సెక్విబోపై అధిపత్యం కోసం వెనీజులా, గయానా తీవ్రమైన ప్రాదేశిక యుద్ధంలో చిక్కుకున్నాయి. దట్టమైన అడవులు కలిగిన ఎస్సెక్విబొ ప్రాంతం సహజ వనరులు, ఖని సంపదతో సుసంపన్నంగా ఉంటూ గయానాలో మూడింట రెండొంతులు ఉంటుంది. ఒకప్పుడు సామరస్య పూర్వకంగా పరిష్కృతమైన దాదాపు రెండు శతాబ్దాల కాలం నాటి వివాదాన్ని, రాజకీయ, ఆర్ధిక లబ్ధి చేకూరుతుందనే భావనతో చవిస్తా ప్రభుత్వం తిరిగి రెచ్చగొట్టింది.

స్పెయిన్‌ ‌నుంచి 1821లో కొలంబియా, పనామా, ఈక్వెడార్‌లతో కూడిన రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌గ్రాన్‌ (‌గ్రేటర్‌) ‌కొలంబియాగా వెనిజులా స్వాతంత్య్రాన్ని సాధించింది. అనంతరం 1830లో వెనిజులా గ్రాన్‌ ‌కొలంబియా నుంచి విడిపోయింది. కాగా, 1814లో డచ్‌ ‌వలస కాలనీలను స్వాధీనం చేసుకుని బ్రిటిష్‌ ‌గయానాలో కలిపివేసుకుంది. ఇందులో ఎస్సెక్విబో నది పశ్చిమ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలు కొన్ని తమవంటూ స్పెయిన్‌ ‌హక్కులు కోరినప్పటికీ, లాటిన్‌ అమెరికన్‌ ‌దేశాల వ్యాప్తంగా స్వాతంత్య్రం కోసం ఉద్యమాలలో నిమగ్నమై బ్రిటిష్‌ ఆ‌క్రమణను స్పెయిన్‌ ‌విస్మరించింది.

బ్రిటిష్‌ ‌గయానా హద్దులను నిర్ణయించేందుకు 1835లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం జర్మన్‌ అన్వేషకుడు రాబర్ట్ ‌హెర్మాన్‌ ‌షోమ్‌బర్గ్‌ను పంపి, 1840లో బ్రిటిష్‌ ఒక మ్యాప్‌ను ప్రచురించింది. ఈ మ్యాప్‌పై వెనిజులా వివాదానికి తెరలేపుతూ, ఎస్సెక్విబో నది పశ్చిమ ప్రాంతం అంతా తమదేనని ప్రకటించింది. తర్వాత 1850ల్లో ఎస్సెక్విబో ప్రాంతంలో బంగారాన్ని కనుగొనడంతో ఈ వివాదం తిరిగి రాజుకుంది.

1899లో ప్యారిస్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యూనల్‌లో సభ్యులైన యుఎస్‌, ‌యుకెకు చెందిన న్యాయనిపుణులు ఈ ప్రాంతంలో 94శాతం ప్రాంతాన్ని బ్రిటిష్‌ ‌గయానాకు, ఒరినొకొ నది ముఖద్వారానికి సన్నిహితంగా ఉన్న ప్రదేశాన్ని, అట్లాంటిక్‌ ‌సముద్ర తీర ప్రాంతం పక్కన విస్తరించి ఉన్న చిన్న ప్రాంతాన్ని వెనిజులాకు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వెనిజులా అసంతృప్తిగా ఉన్నప్పటికీ 1905లో ఇరు పక్షాలూ ఈ తీర్పును అంగీక రించాయి. బ్రిటిష్‌ ‌గయానాకు స్వాతంత్య్రాన్ని ఇచ్చేందుకు 1962లో తీవ్రంగా చర్చలు జరుపుతున్న సమయంలో 1899 తీర్పు చెల్లదని వెనిజులా ప్రకటించింది. గయానాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, 1966లో వెనిజులా సరిహద్దులలో సైన్యాన్ని మోహరించింది. అక్కడ వివాదాస్పద దీవులపై సైనిక మౌలిక సదుపాయాలను ఏర్పరచడమే కాక దేశీయ జనాభాను గయానాకు వ్యతిరేకంగా తిరగబడేలా రెచ్చగొట్టింది. తీవ్రమైన దౌత్య ఒత్తిడికి తల ఒగ్గి రెండు దేశాలూ 1970లో స్పెయిన్‌ ఆఫ్‌ ‌పోర్ట్ ‌వద్ద 12 ఏళ్ల మారటోరియంపై సంతకాలు చేశాయి.

ఈ వివాదం అదుపుతప్పి పోకుండా పెరిగి పోవడాన్ని నిరోధించేందుకు, 1990లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇరు దేశాలూ ఒప్పందం చేసుకోవడంలో విఫలం కావడంతో 2018లో ఐక్యరాజ్య సమితి ఈ వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ముందు పెట్టింది. మానవహక్కుల ఉల్లంఘన ఘటనలలో అధ్యక్షుడు మదురో అంతర్జాతీయ క్రిమినల్‌ ‌కోర్టు దర్యాప్తును ఎదుర్కొనవలసి వస్తుందన్న భావనతో వెనిజులా ఐజీజే పరిధిని తిరస్కరించింది.

కాగా, 2015లో ఎక్సాన్‌ ‌మొబిల్‌ ఎస్సెక్విబోలో కొత్త చమురు క్షేత్రాలను కనుగొనడంతో ఈ వివాదం తీరుతెన్నులు మారిపోయాయి. గయానాలో పెట్టుబడి పెట్టేందుకు దేశాలు పోటీపడుతుండడం, ఖండంలోని అత్యంత నిరుపేద దేశాలలో ఒకటైన గయానాలో అవకాశాలు, ఆర్ధిక భవిష్యత్తు కనిపించడంతో ఈ వివాదాస్పద ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఎస్సెక్విబో తీరంలో అతిపెద్ద ముడిచమురు నిల్వలు బయిటపడిన తర్వాత వెనిజులా తన వైఖరిని మరింత కఠినతరం చేసింది.

మదురో అణచివేత, బెదిరింపు వ్యూహాలను ప్రారంభించాడు. వెనిజులా నావికాదళం గయానా షిప్పింగ్‌ ‌నౌకలను వేధించి, ఎస్సెక్విబో ప్రాంతంలో ఎక్సాన్‌ ‌మొబిల్‌ ‌చమురు అన్వేషణకు ఆటంకాలు కల్పించడం మొదలుపెట్టాడు. గయానా ప్రత్యేక ఆర్ధిక జోన్‌పై తీరప్రాంత సరిహద్దులను నిర్ణయించి, ఆ ప్రాంతాన్ని సైనిక మోహరింపులతో పటిష్ట పరిచేందుకు మదురో 2015- 2021లో రెండు డిక్రీలను జారీ చేశాడు.

తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2021లో అరుదైన ప్రతిపక్ష సంఘటనను జాతీయవాదానికి చిహ్నంగా మార్చేందుకు ఈ వివాదాన్ని మదురో ఉపయోగించుకున్నాడు. రష్యన్‌ ఆయుధాలు, సైనిక మద్దతు కలిగిన వెనిజులాకు సైనికపరంగా గయానా పోటీ కాదు. యుఎస్‌తో భదత్రా సహకార ఒప్పందంతో గయానాకు ఉన్నప్పటికీ, అది ఇంటర్‌ అమెరికన్‌ ‌ట్రీటీ ఆఫ్‌ ‌రెసీప్రోకల్‌ అసిస్టెన్స్ (‌దీని ప్రకారం దేశాలు ఒకరినొకరు కాపాడుకోవడం తప్పనిసరి)లో భాగం కానందువల్ల దాడి చేసే పరిస్థితిలో గయానాలేదు. సహజవనరులతో నిండిన ఎస్సెక్విబో ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వెనీజులా, గయానా మధ్య వివాదం హఠాత్తుగా పెరిగిపోవడం అన్నది అనుమానాలను రేకెత్తిస్తుంది.

వెనిజులా చమురు రంగంపై అమెరికా ఆంక్షలు ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీశాయి, వెంటనే పెట్టుబడులు కూడా అదృశ్యమయ్యాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు, ప్రతిపక్ష నాయకులపై నిషేధం, 2024లో అంతర్జాతీయ పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు మదురో అంగీకరించిన అనంతరం అమెరికా ఆంక్షలు పాక్షికంగా ఎత్తివేశారు. తాజా రాయితీలపై లబ్ధి పొందుతూ, జాతీయవాద రాజకీయాలు చేస్తూ ఎస్సెక్విబో సమస్యను ప్రధాన స్రవంతిలోకి ఆయన తెచ్చాడు. డిసెంబర్‌ 3‌వ తేదీన ఎస్సెక్విబో వివాదంపై ఐదు ప్రశ్నలతో కూడిన రెఫరెండం నిర్వహించాలని పిలుపిస్తూ సెప్టెంబర్‌ ‌నెలలో వెనిజులా జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దీనితో ఆందోళన చెందిన గయానా ప్రభుత్వం, ఎస్సెక్విబో ప్రస్తుత యథాతథ స్థితిని వెనిజులా మార్చకుండా నివారించేందుకు తాత్కాలిక చర్యలు తీసుకో వలసిందిగా ఐసీజేను అభ్యర్ధించింది. దీనిపై డిసెంబర్‌ 1‌వ తేదీన ఐసీజే తీర్పునిస్తూ, ‘ప్రస్తుతమున్న పరిస్థితిని మార్చేందుకు ఎటువంటి చర్యలను తీసుకోరాదంటూ’ వెనీజులాను ఆదేశించింది. న్యాయస్థానం నిర్దిష్టంగా రిఫెరెండమ్‌ను నిషేధించ నప్పటికీ, యథాతథ స్థితిని మార్చే ఎటువంటి పటిష్ట చర్యలను తీసుకోవద్దని వెనిజులాను కోరింది.

 ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విలీనానికి 95 శాతం మంది మద్దతు లభిం చిందని మదురో పేర్కొన్నారు. మదురోకు రాజకీయ గురువు అయిన హ్యూగో ఛావెజ్‌ 2005‌లో ఈ అంశాన్ని పట్టాకిందకు తోసేసి, గయానా, ఇతర కరేబియన్‌ ‌దేశాలతో రాజకీయ, ఆర్ధిక పొత్తును పెట్టుకున్నారు. ఈ పెట్రోకారీబ్‌ (‌వ•తీశీ •తీఱవ) పొత్తు ద్వారా గయానా నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు శుద్ధి చేసిన పెట్రోల్‌ ఉత్పత్తులను వెనిజులా వర్తకం చేసింది. కానీ మదురో ఈ పొత్తును ధ్వంసం చేశాడు.

రెఫరెండాన్ని అధికారికం చేసేందుకు, యుద్ధ ఉద్ఘాటనలను పెంచేందుకు మదురో తీసుకుంటున్న చర్యలతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ కరీబియన్‌ ‌సమాజమైన కరీకామ్‌ను కాపాడేందుకు తోడ్పాటునందించవలసిందిగా యుఎస్‌, ఐక్యరాజ్య సమితిని కోరారు. గయానాకు మద్దతు తెలిపి, సహాయాన్ని అందిస్తామని యుఎస్‌ ‌హామీ ఇచ్చింది. రెఫరెండం, దాని సంభావ్య పరిణామాలపై అంతర్జా తీయ దృష్టి కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో మదురో 10 మంది ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు.

 ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలపై కూచొని డచ్‌ ‌డిసీజ్‌ (‌సుసంపన్నమైన వనరులు దేశ కరెన్సీ విలువను కృత్రిమంగా పెంచి, చమరుయేతర ఎగుమతులను సరైన పోటీ లేకుండా చేయడం), సోషలిస్టు ఆర్ధిక విధానాల కారణంగా వెనిజులా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. కానీ, ఇది వనరుల కోసం మరొక ఘర్షణను మదురో రేకెత్తించడం నుంచి నిలువరించలేకపోయింది. దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని విస్మరిస్తున్న నేపథ్యంలో మదురో ఉద్రిక్తత లను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఘర్షణలతో నలిగిపోతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అస్థిరం చేస్తున్నాయి.

గయానాతో భారత సంబంధం

బ్రిటిష్‌ ‌వలసపాలనలో భారత్‌ ‌నుంచి ఒడంబడికలతో దిగుమతి చేసుకున్న కూలీల సంతతే గయానాలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. అతిపెద్ద హిందూ జనాభాకు ఆవాసమైన లాటిన్‌ అమెరికాతో భారత్‌, ‌గయనాలు ప్రత్యేక బంధాన్ని పంచుకుంటున్నాయి. ప్రవాసీ భారతీయ దివస్‌కు గౌరవ అతిథిగా హాజరైన గయానా అధ్యక్షుడు ఆలీ ఇంధనం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో భారత్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలన్న ఆకాంక్షను ప్రకటించారు. 2015 నుంచి గయానా చమురు ఉత్పత్తిని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకొని, తన తొలి చమురు రవాణాను 2021లో భారత్‌కు పంపింది. దాదాపు 14 చమురు బ్లాకులను వేలం వేయాలని గయానా యోచిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్లను నెరవేర్చేందుకు భారత్‌ ‌చురుకుగా పెట్టుబడి అవకాశాలను అన్వే షించాలి. మరోవైపు, చైనా వేగంగా తన పాదముద్ర లను విస్తరిస్తున్న క్రమంలో లాటిన్‌ అమెరికా దేశాలు డ్రాగన్‌ ఉనికిని సమతులం చేసేందుకు భారత్‌ ఉనికిని కోరుకుంటున్నాయి. భారత్‌ ‌కు చెందిన జిఆర్‌ఎస్‌ఇ (‌గార్డెన్‌ ‌రీచ్‌ ‌షిప్‌ ‌బిల్డర్స్ అం‌డ్‌ ఇం‌జినీర్స్) ‌సరుకురవాణా, ప్రయాణీకుల ఓడ ‘ఎంవి మా లిషా’ను ఏప్రిల్‌ 2023‌లో జార్జి టౌన్‌లో ప్రారంభించడం, కోల్‌కతా నుంచి రెండు ఓడలు ఎస్‌ఎస్‌ ‌విట్బీ, ఎస్‌ఎస్‌ ‌హెస్పెరస్‌ ‌ప్రయాణాన్ని ప్రారంభించడంతో గయానాతో దాదాపు 185 ఏళ్ల నాటి సంబంధాలకు ప్రాణం పోసినట్టయింది. మదురో ఒత్తిడిని పెంచడంతో గయానా తన రక్షణ సహకార పరిధిని భారత్‌కు విస్తరింపచేయవచ్చు. ప్రస్తుతం భారత్‌ ‌సైనికులకు, తీర భద్రతాదళాలకు సైనిక శిక్షణను ఇచ్చేందుకు మాత్రమే పరిమితమై ఉంది.

ఐసీజే తీర్పును ధిక్కరించి, విలీన ప్రయత్నాలను మదురో వేగవంతం చేస్తున్నాడు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గయానా రక్షణ దళాలతో ఉమ్మడి విన్యాసాలను యుఎస్‌ ‌ప్రకటించింది. తన సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుండడంతో గయానా అత్యవసర ఐరాస భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. వివిధ వేదికలపై జరుగుతున్న భౌగోళిక రాజకీయ యుద్ధాలతో సతమతమవుతున్న అంతర్జాతీయ సమాజం ఇప్పుడు దక్షిణ అమెరికాలో చమురు కోసం యుద్ధం జరిగే అవకాశాలు ఉండడంతో బెదిరిపోతోంది.

–  డా. రామహరిత

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram