రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో పట్టభద్రులైన వారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయకపోవడం, ప్రైవేటు ఉద్యోగాలు కూడా రాకపోవడం వీరిని కుంగదీస్తోంది. చిన్నచితకా ఉద్యోగాలతో కొందరు బతుకు వెళ్లదీస్తుంటే, మరికొందరు పక్కనున్న హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైలకు ఉపాధి కోసం వలస పోతున్నారు. ఎక్కడకూ వెళ్లలేని వారిని పోషించలేక తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒక్కో ఇంటిలో కనీసం ఒకరిద్దరు డిగ్రీ చదివినవారు ఖాళీగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యథ•కు గురవుతున్నారు. తమ పార్టీ అధికారంలో వస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్‌ ‌రెడ్డి మాట తప్పారని నిరుద్యోగులు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. జాబ్‌ ‌క్యాలెండర్ల జాడ లేదు…డీఎస్సీ మాటే లేదు… పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ఎప్పుడో తెలీదు. గ్రూప్‌-1, 2 ‌కొలువుల భర్తీకి ఎన్నికలు అడ్డువచ్చే పరిస్థితి. సాఫ్ట్‌వేర్‌ ‌రంగంలోకి తీసుకోకపోవడం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.

గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో ఆంధప్రదేశ్‌ ‌దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే రాష్ట్రంలో 11 శాతం అధికంగా ఉంది. వెనుకబడిన బిహార్‌ ‌రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్‌ ‌లేబర్‌ ‌ఫోర్స్ ‌సర్వే నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది. జులై 2022-జూన్‌ 2023 ‌మధ్య కాలంలో నిర్వహించిన సర్వే వివరాలు తాజాగా విడుదల య్యాయి. డిగ్రీ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24 శాతం ఉండగా, జాతీయ సరాసరి 13.4 శాతం. తెలంగాణ 9వ స్థానంలో, తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా 9.4 శాతమే నిరుద్యోగిత ఉంది. గ్రాడ్యుయేషన్‌ ‌చేసిన మహిళల్లో 34.6 శాతం నిరుద్యోగిత ఉండగా.. పురుషుల్లో 20.3 శాతం. మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 20.6 శాతం కంటే ఏపీలో 14 శాతం అధికంగా ఉంది. పురుషుల్లో జాతీయ సగటు 11.2 శాతం కాగా.. రాష్ట్రంలో నిరుద్యోగిత 9 శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు ప్రతి సర్వే బహిర్గతం చేస్తోంది. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకనామీ (సీఎంఐఈ) గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలోనూ బహిర్గతమైంది. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 3.03 శాతంగా ఉంటే పట్టభద్రుల్లో 35.14 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.

నైపుణ్యాలేవి?

యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ నాలుగున్నరేళ్ల పాటు మాటలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్‌ ‌వారికి విశాఖలో హైఎండ్‌ ‌వర్సిటీని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానినీ అటకెక్కించారు. సీమెన్స్ ‌లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు. శిక్షణ, పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగిత పెరుగుతోంది. ఏటా 2.30 లక్షల మంది డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతరత్రా కోర్సులు పూర్తి చేస్తున్నా, వారికి తగినంతగా నైపుణ్య శిక్షణ దొరకడంలేదు. వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు శిక్షణ కోసం రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఇక్కడ ఉద్యోగం, ఉపాధి అంటే పొరుగుసేవల ఉద్యోగం, లేదంటే చిన్నచిన్న పనులే. రాష్ట్రంలో పేరుకే నగరాలు. సాఫ్ట్వేర్‌ ‌కంపెనీలు, పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా లేవు. ఫలితంగా చాలామంది వలస వెళుతున్నారు. బీటెక్‌, ‌సాధారణ డిగ్రీ చదివిన వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్లైన్‌ ‌కోర్సులు, అదనపు అర్హతలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు.

ఐటీకి నిరుత్యాహం

ప్రస్తుతం ఇంజినీరింగ్‌ ‌చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు సాఫ్ట్వేర్‌ ‌కంపెనీలు రావడం లేదు. ఈసారి బీటెక్‌ ‌వారికి లభించే ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. కొత్తవి రాకపోగా.. ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. దీనికి కారణం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం లేకపోవడమే. విశాఖ పట్నంలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఐబీఎం, హెచ్‌ఎస్బీసీ లాంటి సంస్థలు వెళ్లిపోయాయి. సిరిపురంలోని హెచ్‌ఎస్బీసీ కార్యాలయం, కాల్‌ ‌సెంటర్లలో ఒకప్పుడు 3,500 మంది పనిచేయగా.. ఆ సంస్థ ఖాళీ చేసి వెళ్లిపోయింది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఇచ్చేవారు. ఇంటర్నెట్‌, ‌విద్యుత్తు సదుపాయం కల్పించేవారు. ఈ ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో చాలా సంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో ఐటీ అభివృద్ధికి అవకాశం ఉన్న విశాఖ పరిస్థితే అధ్వానంగా తయారైంది. దీంతో యువత ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో హెచ్సీఎల్‌, ‌టెక్‌ ‌మహీంద్ర లాంటి సంస్థలున్నా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టట్లేదు. విశాఖ, విజయవాడ సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇచ్చే సంస్థల్లేవు. పెద్ద ప్యాకేజీలు వచ్చేవారు వేరే రాష్ట్రాలకు వెళ్లడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందిన వారు తమ ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత వలస వెళ్లడంతో చాలా గ్రామాల్లో వృద్ధులే మిగులుతున్నారు. ఇలాగైతే రాబోయే రోజుల్లో ఊళ్లన్నీ వృద్ధులతోనే నిండి పోతాయని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.

ఉత్తుత్తి ఉద్యోగ నోటిఫికేషన్లు !

ఐదేళ్ల కాలంలో ఒక్క జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేయలేదు. విడుదల చేసిన ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా హడావిడిగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్ ‌నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ ప్రకారం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ‌పెడతారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ‌వస్తుంది. ఇక పక్రియ ఎలా కొనసాగుతుంది? ఏపీపీఎస్సీని మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌ ‌నడుపుతున్నారు. ఆయన ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తారు తప్ప, నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచన చేయడం లేదు. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్స్ ‌పరీక్షల విషయంలో జరిగిన అవకతవకలు కోర్టు సాక్షిగా బయటపడ్డాయి. ఇప్పుడు జరగని నియామకాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని నాటి ప్రతిపక్షనేత, నేటి సిఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఐదేళ్లలో కొన్ని వేల మంది టీచర్లు రిటైరయ్యారు కానీ, ఒక్కటంటే ఒక ఖాళీని కూడా భర్తీ చేయలేదు. ఒక్క డీఎస్సీ వేయలేదు. కానీ నియామకాలు జరిగే చాన్స్ ‌లేని డీఎస్సీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు యువతను మోసం చేయడానికి ఈ నోటిఫికేషన్లు ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.

టీచర్‌ ‌పోస్టుల భర్తీకి నిరుద్యోగుల ర్యాలీ, ధర్ణా

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీని ఇప్పటికైనా అమలు చేయాలని కోరుతూ విజయవాడ, గుంటూరు, అవనిగడ్డ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు, అనంతపురం, కడపలలోని డీఎస్సీ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు ఇటీవల భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ వేలమంది భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క డీఎస్సీని నిర్వహించలేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తున్న డబ్బుతో శిక్షణ తీసుకుంటున్నామని, వైసీపీ మాట నమ్మినందుకు తమ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ రెవిన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

టీచర్లు లేకుండా కొత్త భాషా బోధన ఎలా?

ఉపాధ్యాయ నియామకాలు లేకుండా బడి పిల్లలకు జపనీస్‌, ‌జర్మన్‌ ‌భాషలు ఎలా నేర్పుతారని డిఎస్‌సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాతృభాషను చిన్నచూపు చూస్తూ, ఇంగ్లీషు భాషపై అసాధారణ ప్రేమను ఒలకబోసే వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు జపనీస్‌, ‌జర్మన్‌ ‌భాషలపై అనురాగం కలిగింది. త్వరలో ప్రభుత్వ బడుల్లో ఆ భాషలు నేర్పుతామని ప్రకటించింది. ఆషామాషీగా ప్రభుత్వం ఈ విషయాన్ని చెప్పదని గత పరిణామా లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికీ తెలియని ఐబీ కరికులం తెస్తామని ఇలా సమీక్షల్లో చెప్పి.. రెండు నెలల్లో ఒప్పందం చేసుకున్నారు. అసలు ఈ ఐబీ ఏమిటీ? మనకు పనికొస్తుందా? అన్నది పట్టించు కోలేదు. దీని వెనుక పెద్ద స్కాం ఉందని పార్టీలు ఆరోపిస్తున్నాయి. టోఫెల్‌ ‌విషయంలోనూ అంతే. అసలు టోఫెల్‌ ఎం‌త మందికి అవసరం అన్నది చెప్పలేదు. టోఫెల్‌ అం‌టే ఇంగ్లిష్‌ ‌పరీక్ష మాత్రమే అన్నట్లుగా ఒప్పందం చేసుకుని సింగపూర్‌ ‌సంస్థకు రూ. వందల కోట్లు చెల్లిస్తున్నారు. ఇక బైజూస్‌ ‌ట్యాబ్స్ ‌సీబీఎస్‌ఈ ‌గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జపనీస్‌, ‌జర్మన్‌ ‌కూడా నేర్పేందుకు ఏదో ఓ కంపెనీతో మాట్లాడుకునే ఉంటారని అన్ని లెక్కలు పూర్తయినందునే ఇప్పుడు సమీక్షలో వైసీపీ పెద్దలు ఆ మాట అన్నారని.. త్వరలో ఒప్పందాలు జరిగిపోవడం. డబ్బులు చెల్లించేయడం వంటివి కూడా ఉంటాయని అనుమానిస్తున్నారు.

-టిఎన్‌. ‌భూషణ్‌

About Author

By editor

Twitter
Instagram