అది పాపుల విముక్తి కోసం సిలువెక్కిన ‘దయామయుడి’ అనుచరగణం నడిపే పాఠశాల. పేరు సెయింట్‌ ‌జేవియర్‌ ‌స్కూల్‌. అక్కడ హిందూ మత చిహ్నాలు కనిపించినా క్రైస్తవం మొత్తం మైల పడుతుందన్న గుడ్డి నమ్మకం. ఇప్పటిదాకా హిందూ ధర్మం నుంచి బాలబాలికలను దూరం చేసే ప్రయత్నం జరిగింది. తాజాగా విద్యార్థులలో హిందూ మత చిహ్నాలు కనిపిస్తే ప్రాణాలు తీసుకునే పద్ధతులు నేర్పుతున్నది. అందుకే బొట్టుతో ఉదయం ప్రార్థనలో పాల్గొన్న ఓ బాలికకు ఆ పాఠశాల మరణ శాసనం రాయడమే ఇందుకు మంచి ఉదాహరణ. బొట్టుతో ప్రార్థనలో పాల్గొన్నందుకు ఆ చిన్నారి జీవితాన్ని సిలువెక్కించింది. బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లిందా బాలిక. ఇంటికొచ్చి శవమైపోయింది. బొట్టుతో కనిపించినందుకు ఓ ఉపాధ్యాయురాలు ఆ బాలికను నలుగురు ముందు దుర్భాషలాడింది. ఆ తరువాత చేయి చేసుకుంది. ఇది భరించలేకే, ఈ వాస్తవాలతో ఒక లేఖ రాసి ఉరి వేసుకుంది. ‘నన్ను నలుగురు ముందు ఆమె కొట్టింది. నేను స్కూలు ప్రాంగణం వదలిరాక తప్పని పరిస్థితి తెచ్చింది’ – ఇదీ ఆ నోట్‌ ‌సారాంశం.

ఇది జార్ఖండ్‌ ‌రాష్ట్రంలోని, ధన్‌బాద్‌లో జూలై 10న జరిగింది. ఉషా కుమారి అనే 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థినికి అక్కడి సెయింట్‌ ‌జేవియర్‌ ‌పాఠశాల ఇలాంటి చావును ఇచ్చింది. ఈ విషయం తెతుల్‌మరి పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఆ ఉపాధ్యాయినిని అరెస్టు చేసినట్టు ధన్‌బాద్‌ ‌శిశు సంక్షేమ కమిటి చైర్‌పర్సన్‌ ఉత్తమ్‌ ‌ముఖర్జీ కూడా చెప్పారు. ఉపాధ్యాయ వృత్తికే, అసలు మానవజాతికే కళంకం వంటి ఆ ఉపాధ్యాయిని ఉషాకుమారి మీద చేయి చేసుకోవడం, ఆ బాలిక వెంటనే హనుమాన్‌ ‌గఢి కాలనీలోని తన ఇంటికి వెళ్లి ఉరి వేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. నా చావుకు ఆ ప్రిన్సిపాల్‌, ఆ ఉపాధ్యాయిని కారణమని సుస్పష్టంగా రాసింది. ఆ లేఖ ఆమె యూనిఫారమ్‌ ‌జేబులోనే దొరికింది. దీనితో ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌నీ, ఆ ఉపాధ్యాయినినీ కూడా అరెస్ట్ ‌చేసి ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌ప్రియాంక కానుంగో కూడా ఇదే విషయం చెప్పారు. ఆ విద్యార్థిని బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లినందుకే కొట్టారు. మనస్తాపంతో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. బాలిక తల్లి, గ్రామస్థులు, బంధువులు కలసి తెతుల్‌మరి-నయా మోర్‌ ‌రోడ్డు మీద, సెయింట్‌ ‌జేవియర్‌ ‌పాఠశాల ఎదురుగా, బాలిక భౌతికకాయంతో ధర్నాకు దిగారు. మొదట పోలీసులు కూడా ఏమీ పట్టించుకోక పోయినా, అప్పుడు, అంటే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న 24 గంటల తరువాత ఇక తప్పక రంగంలోకి దిగారు.

ఇక్కడ ఆ బాలిక తల్లి వైఖరి జాలి గొలిపేదిగా, అదే సమయంలో అవాంఛనీయంగాను కనిపిస్తుంది. ఉపాధ్యాయినిని చూడగానే తన బిడ్డ బొట్టును తీసేసిందనీ, అయినా ప్రార్థన వేళ బొట్టు ఎందుకు ఉందని ఆ ఉపాధ్యాయిని తిట్టి, కొట్టిందనీ ఆమె చెబు తున్నారు. ఒక సంవత్సరం క్రితమే ఆమె భర్త పోయారు. అవమానభారంతో ఇంటికి చేరిన కుమార్తె నోటి నుంచి అంతా విన్న ఆ తల్లి ప్రిన్సి పాల్‌ను కలుసుకోవాలని ప్రయ త్నిస్తే ఆ మహానుభావుడు అసలు పట్టించుకోలేదు. ఇంత చేసిన ఆ ఉపాధ్యాయినిని కలుసు కుని క్షమించమని కోరడానికి కూడా ఆ తల్లి ప్రయత్నించింది. విఫల మైంది. అరగంట తరువాత ఇంటికి వెళ్లాక చూస్తే కూతురు ఏదో రాయడం గమనించారామె. ఏమిటీ అంటే స్కూల్‌ ‌వర్క్ అని మాత్రమే చెప్పింది. నిజానికి అది సూయిసైడ్‌ ‌నోట్‌.

ఇదే మరేదైనా పాఠశాలలో, ముఖ్యంగా హిందూ సంస్థలు నడిపే విద్యా సంస్థలో జరిగితే, ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో మతం బాలిక ఏదో కారణంగా చనిపోయినా వర్షంలో డ్రైనేజీ పొంగినట్టు జాలి కవిత్వం చాలామంది పాత్రికేయుల కలాల నుంచి జాలువారేది. మహిళా సంఘాల పేరుతో చెలామణి అవుతున్న హిందూ వ్యతిరేక ముఠాలు తెగ మొరిగేవి. మేధావులు కొంగ్రొత్త పైత్యంతో సిద్ధాంతాల కత్తులు దూసేవారు. ఇది క్రైస్తవానికే సిగ్గుచేటు. మిషనరీ పాఠశాలలన్నీ సిగ్గుతో తల దించుకోవాలి. అదే సమయంలో వాటి వెంటపడే హిందువులు కూడా ఆ పని చేస్తే కొంతైనా పాప పరిహారమవుతుందేమో!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram