– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఇటీవల ఇరాన్‌-అఫ్ఘానిస్తాన్‌ ‌దళాల మధ్య సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, వీరిలో ఇద్దరు ఇరాన్‌కు, ఒకరు అఫ్ఘానిస్తాన్‌కు చెందిన వారని వార్తలు వచ్చాయి. అయితే రెండు దేశాల మధ్య ఇదే తొలి కాల్పుల సంఘటన కాదు. గతంలో చాలా జరిగాయి. కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా కొనసాగుతుండటానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి నీటి సమస్య, కాగా రెండవది జాతుల సమస్య. హిర్మండ్‌ (‌హిల్మండ్‌) ‌నదీ జలాలు ఇరు దేశాలకు జీవనాధారం. వీటి పంపకంపై ఒప్పందం కుదిరినా సమస్య కొనసాగుతూనే ఉండటం మొదటి కారణం. ఇరాన్‌ ‌షియా దేశం. అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్‌ ‌ప్రభుత్వం ప్రధానంగా సున్నీ తెగల ఆధిపత్యంతో కూడినది. ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న షియా హజారా తెగ ప్రజలపై జరుగుతున్న హింసాకాండ, తీవ్ర వివక్షపై ఇరాన్‌ ‌రగిలిపోవడం రెండో కారణం. దీనికితోడు రెండు దేశాల మధ్య 900 కిలోమీటర్ల (559 మైళ్ల) మేర తుర్కుమెనిస్తాన్‌ ‌నుంచి దక్షిణాన పాకిస్తాన్‌ ‌వరకు విస్తరించి ఉన్న సరిహద్దు పటిష్టంగా లేదు. ఇది కూడా ఘర్షణలు తేలిగ్గా చోటుచేసుకోవడానికి కారణం.

ఇరాన్‌ ఆగ్నేయ సరిహద్దులోని సిస్తాన్‌- ‌బెలూచిస్తాన్‌ ‌ప్రావెన్స్‌కు చెందిన ససులి సరిహద్దు వద్ద జరిగిన ఈ కాల్పుల సంఘటనకు తక్షణ హేతువు ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ, ఎంతోకాలంగా రగులుతున్న నీటి వివాదమే కారణంగా చెబుతున్నారు. తమ దేశానికి చెందిన నిమ్రోజ్‌ ‌ప్రావెన్స్‌వద్ద ఇరాన్‌ ‌సైనికులు కాల్పులు జరపడంతో ప్రతిగా వారు కాల్పులకు దిగారని అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రతినిధి అబ్దుల్‌ ‌నఫీ తకర్‌ ‌చెబుతు న్నారు. ఇరాన్‌ అధికారులు దీనిని ఖండించారు. కాల్పులకు కారణం నీవంటే నీవంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపించుకున్నాయి. కాల్పుల సంఘటన జరిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన మిలాక్‌-‌జరంజ్‌ ‌పోస్ట్‌ను ఇరాన్‌ ‌తమ వైపు మూసివేసింది.

గతంలోనూ..

గత మార్చిలో సిస్తాన్‌-‌బెలూచిస్తాన్‌ ‌ప్రావెన్స్‌లో ఇరాన్‌ ‌సెక్యూరిటీ గార్డులు-తాలిబన్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాలు దీనికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన మరునాడే అఫ్ఘానిస్తాన్‌ ‌విదేశీ మంత్రిత్వశాఖ ఏడుగురు దౌత్యవేత్తలను టెహ్రాన్‌లోని తమ రాయబార కార్యాలయానికి పంపడం ఇందుకు ఉదాహరణ. ఇదే ప్రాంతంలో గత ఏడాది జులైలో కూడా ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక తాలిబన్‌ ‌మరణించినట్టు అఫ్ఘానిస్తాన్‌ ‌మీడియాలో వార్తలు వచ్చాయి. అఫ్ఘన్‌ ‌పాలకులు దీనిపై అప్పట్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయనప్పటికీ, తమ భూభాగంలో తాలిబన్లు జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించడమే ఇందుకు కారణమని ఇరాన్‌ ‌పేర్కొంది. ఇదిలా ఉండగా హింసాత్మక సంఘటనల నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌ ‌నుంచి రెండు దేశాల మధ్య ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాలను ఇరాన్‌ ‌మూసివేసింది. అఫ్ఘానిస్తాన్‌లోని హిరాత్‌ ‌ప్రావెన్స్‌కు చెందిన సరిహద్దు జిల్లా ఇస్లాం ఖలాలో తాలిబన్లు రోడ్డు వేయడానికి చేస్తున్న యత్నాలను ఇరాన్‌ ‌గార్డులు అడ్డగించడం అప్పట్లో హింసాత్మక సంఘ టనలకు దారితీసింది. అయితే 2021 డిసెంబర్‌లో ఈశాన్య ఇరాన్‌ ‌సరిహద్దు ప్రాంతంలో తీవ్రస్థాయి సంఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో షగలాక్‌ ‌ప్రాంతంలో గోడ నిర్మాణానికి ఇరాన్‌ ఉపక్ర మించింది.

నీటి వివాదం

నీటి వివాదంపై గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడూ ఘర్షణలు చోటుచేసు కుంటున్నప్పటికీ, నీటి వాడకం విషయంలో యధాతథ స్థితిని కొనసాగిస్తున్నారు.ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలంటూ ఇటీవలి వారాల్లో అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వంపై ఇరాన్‌ అధికారుల ఒత్తిడి పెరిగింది. కాబూల్‌ ‌సమీపంలోని హిందూకుష్‌ ‌పర్వతాల్లో పుట్టిన హిర్మండ్‌ ‌నది ఇరాన్‌లోకి సిస్తాన్‌-‌బెలూచిస్తాన్‌ ‌ప్రావెన్స్‌కు చెందిన హమన్‌ ‌సరస్సు (ఇది మంచినీటి సరస్సు)లోకి చేరుతుంది. ఇరాన్‌లోకి ప్రవేశించడానికి ముందు అఫ్ఘానిస్తాన్‌లో ఈ నది 700 మైళ్లదూరం ప్రవహి స్తుంది. హిల్మండ్‌ ‌పరీవాహక ప్రాంతంలో ప్రపంచం లోనే అతివిస్తారమైన ప్రదేశంలో భూములు సాగవుతు న్నాయి. ముఖ్యంగా ఈ భూములు 4 వేల చదరపు కిలోమీటర్ల మేర ఇరాన్‌-అఫ్ఘానిస్తాన్‌ ‌దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నదిపై డ్యామ్‌లను నిర్మిం చడం ద్వారా తమ భూభాగంలోకి నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారంటూ ఇరాన్‌ ఎప్పటి నుంచో అఫ్ఘాని స్తాన్‌ ‌ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. సహజంగానే అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వాలు ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చాయి. 1973లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం. అఫ్ఘానిస్తాన్‌ ఏటా సగటున 820 మిలియన్‌ ‌క్యూబిక్‌ ‌మీటర్ల నీటిని ఇరాన్‌లోకి వదలాల్సి ఉంటుంది.

ఇరాన్‌ అధ్యక్షుడి ప్రత్యేక దూత హస్సన్‌ ‌ఖాజ్మీ ఖోమీ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, గత ఏడాది కేవలం 27 మిలియన్‌ ‌క్యూబిక్‌ ‌మీటర్ల నీరు మాత్రమే ఇరాన్‌లోకి ప్రవేశించిందని ఆరోపించారు. ఈ విధంగా క్రమంగా నీటిభ్యత తగ్గిపోతే ఇరాన్‌ ఆగ్నేయ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన హమన్‌ ‌సరస్సు ప్రమాదంలో పడిపోతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అదీకాకుండా గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఇరాన్‌లో హమన్‌ ‌సరస్సు పరీవాహక ప్రాంతంలో నీటికొరత కారణంగా 25% నుంచి 30% మంది ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు ఇరాన్‌ ‌పార్లమెంట్‌ ‌వెల్లడించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వం ఉల్లంఘిస్తూ డ్యామ్‌లను విపరీతంగా నిర్మించడమే ఈ దుస్థితికి కారణమని ఇరాన్‌ ఆరోపిస్తోంది. ఒప్పందం ప్రకారం తమ నీటి హక్కును కాపాడాలని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల తాలిబన్లను కోరారు. తన మాటలను తాలిబన్లు పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటా యని ఇటీవల సుస్తాన్‌-‌బెలూచిస్తాన్‌ ‌ప్రావెన్స్‌లో పర్యటించినప్పుడు ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో అఫ్ఘన్‌ ‌ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కూడా ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే తాము ఒప్పందాన్ని ఎన్నడూ ఉల్లంఘించలేదని తాలిబన్లు చెబుతున్నారు.

అఫ్ఘానిస్తాన్‌ ఇం‌ధన, నీటిపారుదల మంత్రి మతుల్లా అబిద్‌ ‌మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారమే, గత ఏడాది ఇరాన్‌కు తాము నీటిని వదిలామని, అక్కడి కరవు పరిస్థితుల నేపథ్యంలో నీటి సమస్యను మరింత ఎక్కువచేసి చూపిస్తున్నదని ఆరోపించారు. ఈ రెండు దేశాల దౌత్య వ్యవహారాల్లో ఈ నీటి సమస్యే ప్రధానంగా ఉంటోంది. ఇటీవల ఉజ్బెకి స్తాన్‌లో ఇరాన్‌, అఫ్ఘానిస్తాన్‌• ‌విదేశాంగ మంత్రులు అమీర్‌-అబ్దుల్లా హైన్‌, అమీర్‌ఖాన్‌ ‌ముత్తాఖి మధ్య ఈ విషయంపై చర్చలు జరిగాయి కూడా. ప్రస్తుతం ఇరు దేశాలు నీటి సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నప్పటికీ, సంబంధాలు మాత్రం ‘అస్థిరంగా’నే ఉన్నాయని చెప్పక తప్పదు. నిజానికి గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల్లో నెలకొన్న కరవు పరిస్థితులు రెండు దేశాల సంబంధాలను సంక్లిష్టం చేస్తున్నాయి. తాలిబన్లతో నీటి విషయంలో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు తాలిబన్‌ ‌ప్రభుత్వాన్ని అధికారికంగా ఇరాన్‌ ‌గుర్తించకపోవడం గమనార్హం. ఇరాన్‌కు ఇష్టమున్నా లేకపోయినా హమన్‌ ‌సరస్సు భద్రతారీత్యా అఫ్ఘానిస్తాన్‌తో సత్సం బంధాలు నెరపక తప్పదు. ఇప్పటికీ ఇరాన్‌ ‌తన రాయబార కార్యాలయాన్ని అఫ్ఘానిస్తాన్‌లో కొనసాగించడానికి ఇదో కారణం.

జాతుల మధ్య వివాదం

ఇరాన్‌ ‌ప్రధానంగా షియా దేశం కాగా, తాలిబన్లలో సున్నీ ఛాందసవాదులు అధికం. చారిత్రకంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉండటానికి ఇది మరో కారణమని ముందే చెపుకున్నాం కదా.. అఫ్ఘానిస్తాన్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఇరాన్‌ ‌కోరుతోంది. ముఖ్యంగా అఫ్ఘానిస్తాన్‌లో తీవ్ర వివక్షకు, హింసకు గురవుతున్న షియా హజారా మైనారిటీ తెగల భద్రత విషయంలో ఇరాన్‌ ఆం‌దోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ ‌చాలా సంవత్సరాలుగా అస్థిరత రాజ్యమేలుతున్న అఫ్ఘానిస్తాన్‌ ‌తాలిబన్లలో ఒక వర్గానికి, అటు అఫ్ఘన్‌ ‌ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా తనకు సమస్య రాకూడదన్నదే ఇక్కడ ఇరాన్‌ అనుసరించిన ద్విముఖ వ్యూహం.

2001లో యూఎస్‌ అఫ్ఘానిస్తాన్‌లోకి ప్రవేశించి నప్పుడు.. ఇరాన్‌ ‌యూఎస్‌ ‌దళాలకు సహకరించింది. అంతేకాదు హిరాత్‌ ‌ప్రావెన్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో నార్తన్‌ అలయెన్స్ ‌దళాలకు పూర్తి మద్దతునిచ్చింది. 2001-2021 మధ్యకాలంలో ఇరాన్‌-‌తాలిబన్లకు మధ్య సంబంధాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వం.. ఇరాన్‌ ‌తాలిబన్లకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి అవసరమైన సహాయం అందిస్తోందని ఆరోపించింది. 2010లో ఇరాన్‌కు చెందిన కుడ్స్ ‌ఫోర్స్ అధికారిని నాటో దళాలు అఫ్ఘానిస్తాన్‌లో అరెస్ట్ ‌చేశాయి. తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడన్నది ఈయనపై మోపిన ఆరోపణ. హిరాట్‌ ‌డ్యామ్‌ను ధ్వంసం చేయడానికి ఇరాన్‌ ‌ప్రయత్నించిందని కూడా 2017లో నాటి అఫ్ఘన్‌ ‌ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. చివరకు అమెరికా తన సైనిక దళాలను ఉపసంహరించుకోవడంతో 2021 వేసవి కాలంలో తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్తాన్‌• ‌పగ్గాలు చేపట్టారు.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కానీ నెట్‌వర్క్‌కు కీలక శాఖలు అప్పగించడం ఇరాన్‌కు కొరుకుడు పడని అంశం. ఎందుకంటే గతంలో హక్కానీ గ్రూపుతో పోరాడిన చరిత్ర ఇరాన్‌ది. ఇక హక్కానీ వర్గానికి పూర్తి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌తో ఇరాన్‌కు సంబంధాలు సరిగ్గా లేవు. పాకిస్తాన్‌లో షియాలపై జరుగుతున్న దాడులు ఇరాన్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇదే సమయంలో రెండు దేశాల సరిహద్దుల్లో సంఘర్షణలు సర్వ సాధారణమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్‌లో పాక్‌ ‌ప్రాబల్యం పెరగడం ఇరాన్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. పాక్‌ ‌ప్రాబల్యాన్ని భారత్‌ ‌కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారత్‌-ఇరాన్‌ల మధ్య సంబంధాలకు యూఎస్‌ ఆం‌క్షలు అడ్డుగోడగా నిలిచాయి. ఇక ఖతార్‌, ‌టర్కీలతో ఇరాన్‌కు సత్సం బంధాలున్నా, అవి పాక్‌కు అనుకూలం కావడం ఇబ్బందికరంగా మారింది. ఇరాన్‌ ఇటువంటి సంక్లిష్ట సంబంధాల చిక్కుముడిలో చిక్కుకొని సతమత మవుతున్న నేపథ్యంలో షియా హజారా తెగకు చెందిన మౌలావీ మహదీని ఒక జిల్లా షాడో గవర్నర్‌గా నియమించడం ద్వారా తాలిబన్లు ఇరాన్‌ను సంతృప్తిపరచడానికి చేసిన యత్నం పెద్దగా సత్ఫలితాలనివ్వదనేది అర్థం కావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

ఎన్ని విభేదాలున్నప్పటికీ 2021లో అధికారం లోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రపంచంలో ఏకాకులుగా ఉన్న తాలిబన్లకు ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అదీకాకుండా గత 40 ఏళ్ల కాలంలో జరిగిన నిరంతర యుద్ధాల కారణంగా అఫ్ఘానిస్తాన్‌ ‌దయనీయ పరిస్థితికి చేరుకుంది. 40 లక్షల మంది ఆ దేశ ప్రజలు ప్రస్తుతం ఇరాన్‌లో తలదాచు కుంటున్నారు. ‘పొరుగు దేశాలతో’ సంఘర్షణ తమకు ఎంతమాత్రం ఇష్టంలేదని తాలిబన్లు పదే పదే ప్రకటించడానికి నేపథ్యం ఇదే. సమస్యలున్నా సంబంధాల విషయంలో ఇప్పటివరకు రెండు దేశాలు విజ్ఞతతో వ్యవహ రిస్తుండడం కొంత సానుకూల పరిణామం. పరిస్థితి చేయిదాటక ముందే ఒక అంగీకారానికి రావడం శ్రేయస్కరం.

– వీఆర్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram