– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఘంటికలు మోగుతున్నాయి. గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాచరణ వేగవంతమవు తోంది. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతు న్నాయి. పైగా.. ఇదే సమయంలో వచ్చిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ‘ఎవరికి వారే.. యమునా తీరే’ అన్న రీతిలో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం 21 రోజుల కార్యాచరణను ప్రకటించి అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా అధికార పార్టీ ఆ క్రెడిట్‌ ‌తనకు దక్కేలా చూసు కుంటోంది. ఇటు-బీజేపీ కూడా ‘రివర్స్ ‌గేర్‌’ ‌పేరుతో ప్రభుత్వం రూపొందించిన రోజువారీ ఉత్సవాల కార్యాచరణకు కౌంటర్‌ ఇస్తోంది.

రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక్కరోజు ఒక్కో శాఖ తరఫున వేడుకలు నిర్వహించాలని కార్యాచరణ రూపొం దించిన అధికార బీఆర్‌ఎస్‌కు.. బీజేపీ తన నిరసన లతో షాకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొడుతున్నామని ప్రకటిస్తోంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్‌ ‌పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతో పాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలుపుతోంది కమలదళం. ప్రభుత్వం విజయోత్సవం పేరుతో ఆయా శాఖల వారీగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలను డమ్మీ చేసే ఉద్దేశంతో ఆయా శాఖల వైఫల్యాలను ఎండగడుతోంది.

సీఈసీ కార్యాచరణ

తెలంగాణలో 2018 డిసెంబర్‌ 7‌న ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జనవరి16 నాటికి అసెంబ్లీకి గడువు ముగిసిపోతుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల పక్రియలను మొదలు పెట్టేసింది. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను అప్రమత్తం చేసింది. ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన కార్యకలాపాలు మొదలెట్టేయాలని ఆదేశాలు జారీచేసింది. మిజోరాం అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబర్‌ 17‌వ తేదీన ముగియనుండగా, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ గడవు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జనవరి 6వ తేదీన, రాజస్తాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14వ తేదీన ముగియనుంది. వీటితో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 2‌వ తేదీన ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు పక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2023 అక్టోబర్‌ 1‌వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు బూత్‌ ‌లెవల్‌ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలి. జూన్‌ 24‌వ తేదీ నుంచి జూలై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్‌ ‌కేంద్రాల బౌండరీల నిర్ధారణ చేయనున్నారు. జూలై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొం దిస్తారు. ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యా దులను సెప్టెంబర్‌ 22‌వ తేదీ వరకు పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్‌ 29‌వ తేదీ వరకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ అనుమతి తీసుకుం టారు. కమిషన్‌ అనుమతి లభించగానే అక్టోబర్‌ 4‌వ తేదీన ఓటర్ల తుదిజాబితా విడుదలవుతుంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. జూన్‌ 5‌వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈసీ మాస్టర్‌ ‌ట్రైనర్స్ ‌శిక్షణ ఇచ్చారు. ఓటర్ల నమోదు మొదలుకొని పోలింగ్‌, ఓట్ల లెక్కింపువరకూ ఎన్నికల ప్రాసెస్‌పై శిక్షణ కొనసాగింది. ఇక మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

బాంబు పేల్చిన కేటీఆర్‌

ఎన్నికల కమిషన్‌ ‌పోలింగ్‌ ‌సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల గోదాలోకి దూకేశాయి. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తనయుడు, మంత్రి తారకరామారావు ఓ బాంబు పేల్చారు. రెండు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగ నున్నాయని ప్రకటించారు. అంతేకాదు..ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని యేడాది క్రితం నుంచే ప్రచారం జరిగింది. దాదాపు ఆరు నెలల ముందుగానే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని నిన్నా మొన్నటి దాకా ప్రచారం జరిగింది. గతంలో తెలంగాణ తొలి అసెంబ్లీని ఏడు నెలల ముందుగానే కేసీఆర్‌ ‌రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రతిపక్షాలు కనీసం ఎన్నికలకు సమాయత్తం కూడా కాకముందే.. కేసీఆర్‌ అత్యంత వ్యూహాత్మ కంగా ఈ ఆలోచనను అమలు చేశారు. ఈ పరిణా మంతో ప్రతిపక్షాలు ఓ రకంగా బిత్తరపోయాయి. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. ఈ పరిస్థితులను ఒడిసి పట్టుకున్న కేసీఆర్‌.. ‌ముందస్తు ఎన్నికల బాంబు పేల్చి విజయ వంతమయ్యారు.

ముందుస్తు ఎన్నికలు లేనట్టే!

వాస్తు, జాతకాలను పూర్తిస్థాయిలో నమ్మే కేసీఆర్‌.. ‌ముందస్తు సెంటిమెంట్‌ను కూడా బాగా నమ్ముతారు. అంతేకాదు, అధికారంలో ఉన్న కారణంగా ప్రతిపక్షాలు కుదురుకునే లోపు ఎన్నికలు నిర్వహించి తన వ్యూహాలు అమలు చేసి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉండేలా పరిస్థితులను మలచుకోవడం సాధ్యమవుతుందన్నది కేసీఆర్‌ ఆలోచన. అందుకే మొదటిసారి అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసి రెండోసారి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, ఈసారి కూడా అలాగే చేయాలని కేసీఆర్‌ ‌కొంతకాలంగా సమయం కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు. కానీ, 2018 నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా ఉంది. ఈసారి బీజేపీగానీ, కాంగ్రెస్‌పార్టీ గానీ గతంలో అనుభవం నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాయి. రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని, బలగాన్ని పరీక్షించుకుంటున్నాయి. అంతే కాదు, ప్రభుత్వంపైనా ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోస్తూ.. సర్కారు నిర్ణయాల్లోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. అయినా ముందస్తుకు వెళితే విజయం తమదే అన్న ధ్యాసలో కేసీఆర్‌ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అయితే, అంతకుమించి ఈసారి రాజ్‌భవన్‌తో ప్రభుత్వం వైరం మరింత పెంచుకుంది. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీతోనూ సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రెండోసారి అధికారం లోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణ గవర్నర్‌తో సంబంధాల విషయంలో వైరం నెలకొంది. అయినా, గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌చాలారోజుల పాటు పెద్దగా బయటపడలేదు. తనదైన శైలిలో, తన కార్యకలాపాలు తాను నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్‌కు పార్టీతో లింకు పెట్టడం, రాజ్‌భవన్‌ ‌గౌరవాన్ని తగ్గించేలా విమర్శలు చేయడం వంటివి బీఆర్‌ఎస్‌ ‌నేతలు చేశారు. ప్రభుత్వ పెద్దలు..పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఆ నిప్పుకు మరింత ఆజ్యం పోశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే గవర్నర్‌ ‌సిఫారసుతో రాష్ట్రపతి పాలన అమలు చేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గ్రహించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు కాకుండా.. అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత మరో ఐదు నెలల అనంతరం జరిగే అవకాశముంది. అదే జరిగితే ఇప్పుడు ఉన్న బీఆర్‌ఎస్‌ ‌ప్రాబల్యం దాదాపు సగానికి పైగా తగ్గే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు.. అధికార పార్టీతో సమానంగా కార్యా చరణ రూపొందించుకోవడానికి, కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న కారణంగా ప్రతిపక్షాల సభలపై గానీ, ప్రచార ర్యాలీలపై గానీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసే వెసులుబాటు ఉండటం దీనికి కారణం. అందుకే కేసీఆర్‌ ‌ముందస్తుకు వెళ్లే సాహసం చేయలేదంటున్నారు.

అయితే, ముందస్తు సెంటిమెంట్‌ను బలంగా నమ్మే కేసీఆర్‌.. ‌రాష్ట్రపతి పాలన దిశగా అవకాశం లేని విధంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ దిశగానే.. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సమాలోచనలు సాగిస్తు న్నారని, కొంతకాలంగా ఇదే అంశంపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను ఇందులో భాగంగానే అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. కేటీఆర్‌ ‌వ్యాఖ్యల నేపథ్యంలో రెండు నెలల్లో ఎన్నికలు అనేది హాట్‌ ‌టాపిక్‌ అయినా టెక్నికల్‌గా చూస్తే.. జూలైలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉం‌డదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహించే దిశగా ఆ స్థాయిలో వేగంగా ప్రయత్నాలు ప్రారంభించలేదు. పోనీ.. ఆగస్టులో ఉండొచ్చా? అనుకుంటే, అలాంటి వాతావరణం కూడా కనిపించడం లేదు. కాబట్టి కేటీఆర్‌ ‌కావాలనే ప్రతిపక్షాలు ఉలిక్కిపడేలా చేశారనే చర్చ జరుగుతోంది. ఇదివరకే ముందస్తు ఎన్నికల అంశంపై మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చూచాయగా చెప్పారు. అంటే కేసీఆర్‌ ‌చెప్పినట్లు ఇంకా 5 నెలల సమయం ఉంది. అందువల్ల ప్రతిపక్షాలు కూడా ఎన్నికల ప్రచారానికి, పొత్తులు, ఎత్తుల కోసం నెమ్మదిగా వ్యూహాలు వేసుకుంటున్నాయి. అక్టోబర్‌-‌డిసెంబర్‌ ‌మధ్య ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నాయి. అభ్యర్థుల ఖరారు, ప్రచారానికి ఇప్పటికే కసరత్తు ప్రారంభిం చాయి.

మరి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంపై ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి ఆలోచనలు బెడసి కొడతాయో వేచి చూడాల్సిందే!

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram