మే 7 అల్లూరి వర్ధంతి

ఆగస్ట్ 22, 1922‌న చింతపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడితో అల్లూరి శ్రీరామరాజు యుద్ధం ఆరంభించాడు. ఆ తరువాత కృష్ణ దేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, చోడవరం, రామవరంవంటి చోట్ల పోలీస్‌ ‌స్టేషన్ల మీద కొండ దళం దాడుల జరిపినప్పుడు కూడా ఆంగ్లేయుల బలగాలు వెనుకంజలోనే ఉన్నాయి. సెప్టెంబర్‌ 24, 1922‌న జరిగిన దామనపల్లి ఘటన నిజానికి ఆంగ్లేయుల మనోస్థయిర్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. స్కాట్‌ ‌కవర్ట్, ‌నెవెల్లి హైటర్‌ అనే పోలీసు ఉన్నతాధికారులు ఆ దాడిలోనే చనిపోయారు. ఆ తరువాత చెప్పుకోతగ్గ పెద్ద ఘట్టం పెద్దగడ్డపాలెం, లింగాపురం దాడి. అప్పటికి బ్రిటిష్‌ ‌బలగాలకి లూయీ ఫిరంగులు వచ్చాయి. ఆ రెండు చోట్ల జరిగిన కాల్పులలో రామరాజు అనుచరులు మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాళ్ల భౌతిక కాయాలను మన్యంలో ఉరేగిస్తూ తీసుకువెళ్లారు. ఇది డిసెంబర్‌ 6, 1922‌న జరిగింది. అంటే మూడు మాసాల పాటు రాజు దళాన్ని ప్రతిఘటించేందుకు ఆంగ్లేయులు పెద్ద ప్రయత్నం చేయలేదు. పెద్దగడ్డ పాలెం, లింగాపురం యుద్ధం తరువాత ఉద్యమకారు లను పట్టించి ఇస్తే నగదు బహుమానాలు ప్రకటిం చారు. డిసెంబర్‌ 23, 1922‌న మన్యంలో వినిపించిన బహుమానాల ప్రకటన ప్రకారం రామరాజును పట్టిస్తే రూ.1500 పారితోషికం లభిస్తుంది. మిగిలిన ఉద్యమకారులకి కూడా కొంత కొంత నగదును ఎరగా వేశారు. కారణాలు పూర్తిగా తెలియదు కాని, ఆ తరువాత విశాఖ మన్యంలో అల్లూరి, ఆయన దళం కదలికలు దాదాపు లేవు. ఇక ఉద్యమం అణగారి పోయిందని ఆంగ్లేయులు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఏప్రిల్‌ 17, 1923‌న రామ రాజు హఠాత్తుగా తన దళంతో మైదాన ప్రాంతం లోని అన్నవరం పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యక్షమై మద్రాస్‌ ‌ప్రభుత్వాన్ని కంగు తినిపించాడు. ఆయన అన్నవరం యాత్ర రెండు రకాలుగా ప్రసిద్ధి. ఒకటి రాజు తన దృష్టిని మన్యం నుంచి మైదానాల వైపు సారించాడా? అన్న అనుమానం అధికారులలో కలిగింది. దీనితో పాటు తన ఉద్యమం ఆశయం ఏమిటో అక్కడే రామరాజు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఆంధ్రపత్రికలో అచ్చయింది. తన ఉద్యమ లక్ష్యం, అందుకు ఎంచుకున్న మార్గం, గాంధీజీ చెబుతున్న అహింస మీద అపనమ్మకాన్ని ప్రకటించడం అన్నీ ఆ ఇంటర్వ్యూలో కనిపిస్తాయి.

 రామరాజు అనుకోకుండానే చెరుకూరి నరసింహమూర్తి అనే వ్యక్తికి ఏప్రిల్‌ ఆ ‌రోజే ఇంటర్వ్యూ ఇచ్చారు. మూర్తి విలేకరి కాదు. రామరాజు పర్యటన వేళ ఆయన అక్కడ ఉండడం యాదృచ్ఛికం. మూర్తి అసలు ఊరు తూర్పుగోదావరి జిల్లాలోనే రామచంద్రపురం దగ్గర దంగేరు అనే గ్రామం. ఆయన అన్నవరం వారి అల్లుడు. అత్తవారింటికి ఏదో పని వచ్చాడు. ఇంటర్వ్యూ తీసుకున్న మరునాడు, అంటే ఏప్రిల్‌ 18‌న ఒక ప్యాసింజర్‌ ‌రైలులో కాకినాడ వెళ్లి, ఈ ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక విలేకరికి అందిం చాడు. అదే అచ్చయింది. ఆనాటి పత్రికలు గ్రాంథికం ఉపయోగించాయి కాబట్టి ఈ రూపంలో ఉంది.

—————————–

ఆంధ్రపత్రిక

24-4-1923 శనివారం

‘‘రాజుగారికి అద్భుతశక్తులు కలవను వదంతులధికముగా నుండుటచే ఆ వదంతులను విని ప్రజలు విస్తారముగా నచటికి వచ్చి ఆయనకు దండుములు పెట్టుచుండిరి. సత్యనారాయణమూర్తి వారికి మ్రొక్కులు చెల్లించుటకు, వ్రతము చేయుటకు యితర గ్రామముల నుంచి వచ్చిన యాత్రపరులు గూడా రాజుగారికి నమస్కరించుటకు వచ్చిరి. పిమ్మట నాకును రాజుగారికిని ఇట్లు సంభాషణ జరిగింది.

న: మీరిచటనెంతసేపు వుండెదరు?

రా: రెండు గంటల సేపుండెదను. 10 గంటలగు సరికి బయలుదేరి వెళ్లెదము. పోలీసు యినస్పెక్టరు నర్సీపట్నమునకును కాకినాడకును తంతివార్తలు నంపుటకొక అరగంట ఆలస్యము కాకమానదు. పిమ్మట అట నుంచి పోలీసువారు మోటారు బండ్లలో బయలుదేరి వచ్చెదరు. వారుగూడా పదిగంటల ప్రాంతముననే యీ గ్రామము చేరగలుగుదురు.

న: మీరెక్కడకు వెళ్లదలిచితిరి?

రా: నేనట్లు ముందు మకాములను నిర్ణయించు కొనలేదు.

న: ఇక్కడకు మీరేల వచ్చితిరి?

రా: నా అనుచరులు నా ఉత్తరువులను సరిగా గ్రహింపజాలక దారిలో తుపాకులు కాల్చిరి. గాన నా జాడ తెలిసిపోవునేమోయని నేను నా ప్రయాణమును మార్చి తటాలున నిచటికి వచ్చితిని.

న: మీరే సంకల్పముతో యీ ఫితూరీని నడుపుతున్నారు?

రా: ప్రజలకు స్వాతంత్య్రము లభించుటకే?

న:  ఏ సాధనమువలన?

రా: దౌర్జన్యము వలననే! యుద్ధము చేసినగాని మనకు స్వరాజ్యము రాదు.

న: స్వాతంత్య్రము బడయుగలుగుదునను నమ్మకము నీకు గలదా?

రా: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.

న: రెండేండ్లలో స్వరాజ్యము ఎట్లు లభించును? మీరవలంబించుచున్న పద్ధతివలనే స్వరాజ్యం వచ్చునా?

రా: వచ్చును. తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమి యును లేదు. కాని తుపాకులును మందుగుండ్లును కావలెను. వాని కొరకే సంచారము చేయుచున్నాను.

న: దౌర్జన్యముతో కూడిన యుద్ధముల వలనను జన నష్టముల వలనను ప్రపంచమున విసుగు చెందియున్నది. దౌర్జన్యము కూడదను సిద్ధాంతమునే యిపుడు ప్రపంచములోని అన్ని దేశములవారు ఆదరించుచున్నారు. జర్మనీవారు కూడా సాత్విక విరోధమునే ప్రారంభించిరి. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్య రాహిత్య శాంతి సాధనములందు మాత్రమే మాకు నమ్మకము కలదు. బోధించుటకు దేవదూత గాంధి మహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచము వారందరును నమ్ముచున్నారు.

రా: నాకు దౌర్జన్య రాహిత్యము నందు నమ్మకము లేదు. దౌర్జన్యము వలననే స్వరాజ్యమును బడయ గలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.

న: దౌర్జన్యము వలన ప్రాణ నష్టమును వినాశన మును కలుగును. శాంతి సాధనముల వలననే స్వరాజ్యము లభించును. ఇంతకుపూర్వము మీకును, పోలీసువారికిని జరిగిన యుద్ధములందు మీ స్థితి ఎట్లుండెను?

రా: మొదటి 5 యుద్ధములలోను నేను సులభముగానే జయమును బడసితినిగాని, ఆరవ యుద్ధమునను, కడపటి యుద్ధమునను మేము నిద్రపోవు చుండగా పోలీసువారు హఠాత్తుగా తలపడిరి. వారు దూరముగా నుంచి మర తుపాకు లను కాల్చసాగిరి.

అరగంట సేపటుల విడవకుండా వారు కాల్చిన పిమ్మట మా జట్టులోని వారికి మెలకువ వచ్చినది. మరి రెండు నిమిషములకు నాకును మెలకువ వచ్చెను. నేను లేచి చూచుసరికి పోలీసుల సంఖ్య విస్తారముగా నుండెను. మావారి సంఖ్య తక్కువగా నుండెను. తుపాకి రవ్వలు తగిలి నా పరవవంతయు చిల్లులు పడియుండెనుగాని నాకొక్కటియును తగులలేదు. నేనంతట మా వారితో గూడ తప్పించుకొనిపోతిని.

న: ఈ నాలుగు నెలలును మీరేమి చేయు చుంటిరి?

రా: నేను తపము చేయుచుంటివి.

న: గయలో జరిగిన కాంగ్రెస్‌ ‌సభకు మీరు వెళ్లినారని ప్రజలు విస్తారముగా చెప్పుకొను చుందురు. అది నిజమేనా?

రా: నా స్థూల శరీరము గయకు పోలేదు. కాని నాయాత్మ అచటికి పోయినది.

న: అచట జరిగిన విషయములన్నియు తెలియునన్న మాటేనా?

రా: నేనంతయు స్వయముగా చూడగలిగితిని. రెండు కక్ష్య లేర్పడెను. కొందరు  శాసనసభలను బహిష్కరించవలెననగా, మరికొందరు సభలకు వెళ్లవలెననిరి. వెళ్లవలెననువారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పము. ఉప్పు పన్నును హెచ్చించినందులకును, ధర్మాదాయ చట్టము నామోదించి నందులకు భారత శాసనసంఘ సభ్యులలోను చెన్నవురి రాష్ట్రీయ శాసనసంఘ సభ్యులలోను ఎవరైనా రాజీనామాలిచ్చారా?

న: ఎవరును రాజీనామాలనీయలేదు; గాని మీకీ రాజకీయ విషయము లన్నియు నెటుల తెలియు చున్నవి?

రా: నేనందులకు తగిన ఏర్పాట్లు చేసితిని.

ఈ రీతిగా మాకిరువురకును సంభాషణ జరిగిన పిమ్మట రాజుగారు లేచి వెళ్లి స్నానము చేసిరి. రాజుగారు ఇంగ్లీషు భాషలో చకచక మాటలాడిరి. తెలుగులో కూడా కొన్నిటికి జవాబు చెప్పిరి. సత్రము నూతి వద్ద అరగంట చన్నీళ్ల స్నానము చేసిరి. తరువాత నొక పావుగంట సేపు పక్కనేనున్న వసారాలో జపము చేసిరి. అంతట నేను గూడా ఇంటికిపోయి స్నానము చేసి మరల సత్రము వద్దకు వెళ్లితిని. అప్పటికప్పుడే రాజుగారును, అనుచరులును సత్రము నుంచి బయలుదేరి అచటికి 5 మైళ్ల దూరముననున్న శంఖవరము వంకకు వెళ్లిరని తెలిసినది.

——————————

రామరాజు శంఖవరంలో ఆవంత్స వెంకటరావు అనే కాంగ్రెస్‌ ‌వాది ఇంటికి. నిజానికి నరసింహమూర్తి చూడని కొన్ని సంగతులు కూడా జరిగాయి.   సబ్‌ ఇన్స్‌పెక్టర్‌, ‌పోస్టుమాస్టరు, డిప్యూటి తహశీల్దారు రాజును తమ ఇళ్లకు ఆహ్వానించారు. వారింట స్త్రీలు ఆయన పాదాలు కడిగి గౌరవించారు. తరువాత రాజు తన అనుచర బృందంతో స్వామివారి దర్శనం చేసుకున్నాడు. అంతేగాక, ఈ బృందంలో కొందరు అనుచరులతో పాటు గాం మల్లు దొర కూడా ఉన్నాడు. ఇదంతా రెండు గంటల్లో జరిగిపోయింది. ప్రజలు రాజుకు బట్టలు పెట్టారు. పళ్లూ, ఫలాలు ఇచ్చారు. కొంత పైకం కూడా అందజేశారు. కానీ అన్నవరం స్టేషన్‌లో ఆయుధాలు దొరకలేదు. అప్పటికే స్టేషన్ల నుంచి ట్రెజరీలకు ఆయుధాలను తరలించే పని మొదలయింది.

పదిగంటలు సమయం అవుతుండగా, ఆ వేళకు వచ్చే రైలులో పోలీసు బలగాలు దిగవచ్చునన్న అనుమానంతోనే రాజు అన్న్వరం నుంచి శంఖవరం వెళ్లాడు. రామరాజు శంఖవరం చేరడం, రైలులో బేకన్‌ ‌తదితరులు అన్నవరం రావడం దాదాపు ఏకకాలంలో జరిగాయి.  రాజుకు జరిగిన సత్కారం విషయం తప్ప ఇంకే సమాచారం అందలేదు. ఉక్రోషంతో అన్నవరం, శంఖవరాల మీద నాలుగు వేల రూపాయల శిక్షా సుంకం వడ్డించేశాడు. తాను అడ్డతీగెల పోలీసు స్టేషన్‌కు వెళ్లినపుడు కలెక్టర్‌ ‌బేకన్‌ను తనతో మాట్లాడడానికి రావలసిందని రామరాజు కబురు చేశారు. అలాంటి అవకాశం బేకన్‌కు రామరాజు అన్నవరంలో ఉన్నప్పుడు కూడా వచ్చింది. కలెక్టర్‌ ‌బేకన్‌ ‌రాజును కలుసుకునే సాహసం చేయలేకపోయాడు. రాజుకు వున్న ప్రజాకర్షణ ఎక్కడికి పోలేదని అన్నవరం సంఘటన రుజువు చేసింది.

రామరాజు ఉద్యమం గురించి పెద్దాపురం విలేకరి ఆగస్ట్ 9, 1922‌న  ఒక వార్తా కథనం ఇచ్చారు. రాజు పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడం తప్ప సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగనీయలేదని ఆయన రాశారు. రాజు మరణ వార్తను కూడా ఆంధ్రపత్రిక ప్రచురించింది. అయితే అది చూస్తే విలేకరి కొంచెం గందరగోళంతో పంపాడని అనిపిస్తుంది. ఇదే కాకుండా, రాజు జయంతిని గౌతమీ సత్యాగ్రహాశ్రమం (సీతానగరం) ఆధ్వర్యంలో జూలై 4, 1927న సాహసోపేతంగా  నిర్వహించారు. దీనినే ఆంధ్రపత్రిక వార్తగా వెలువరించింది. జూలై 5, రాజమండ్రి డేట్‌లైన్‌తో ఆ వార్త వచ్చింది. రామరాజు ఛాయాచిత్రంతో ప్రజలు ఊరేగింపు జరిపారు. సాయంత్రం పురమందిరంలో జరిగిన సభకు రామదాసు పంతులు అధ్యక్షత వహించారు. ఈ కార్య క్రమాన్ని రామరాజు బాల్య స్నేహితుడు, ఆశ్రమం నుంచి వెలువడే ‘కాంగ్రెసు’ పత్రిక సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య నిర్వహించారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram