– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

సృష్టి స్థితిలయ కారకులలో శివుడు లయానికి అధిపతి. పునః సృష్టి జరగాలంటే లయం అనివార్యం. జీవికైనా, వస్తువుకైనా ఇది అనివార్యం. ఆయా జన్మల బాధల నుంచి జీవులను విముక్తులను చేయడమే రుద్రుడి ప్రథమ కర్తవ్యం. అందుకే  శైవక్షేత్రాలను మోక్ష ప్రదాయికాలుగా చెబుతారు. ఆయన ‘ఆదిభిక్షువు’వే అయినా అమిత దయాళువు, ఐశ్వర్యప్రదాత. అందుకే ‘దారిద్య్ర దహన స్తుతి’లో వశిష్ఠ మహర్షి ‘దారిద్య్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ’ అని శ్లాఘించారు. ఆయన అనుకుంటే భక్తులకు ఏమైనా చేస్తాడు, ఏదైనా అనుగ్రహిస్తాడు. శివనామం సర్వోత్కృష్టం, మహిమోపేత మైనది. దీనికి సర్వశ్రేయస్సు, మంగళం, భద్రం తదితర అర్థాలు ఉన్నాయి. మహామహులైన కవులు శివస్తుతితోనే కావ్యరచనకు శ్రీకారం చుట్టారు, భక్తులకు మోక్ష మార్గాన్ని సులభతరం, సుగమం చేశారు. అష్టాదశ పురాణాలలో శివపురాణం నాలుగవది. పద్దెనిమిది పురాణాలకు గాను పదింటిలో శివతత్త్వం, శివమహిమల ప్రస్తావన కనిపిస్తుంది. సాక్షాత్తు మహే శ్వరుడే లక్ష శ్లోకాలతో, పన్నెండు సంహితలుగా దీనిని బ్రహ్మకు చెప్పగా అది బ్రహ్మ నుంచి నారదునికి, ఆయన నుంచి సనత్కుమారునికి, అక్కడి నుంచి వ్యాస భగవానుడికి చేరిందని, ఆయన ఆ పురాణ సారాంశాన్ని 24 వేల శ్లోకాలకు కుదించారని ప్రతీతి.

శివుడు దిగంబరుడు. దిక్కులనే వస్త్రంగా ధరించాడు. ఆకాశం జటాజూటంగా (హ్యోమకేశుడు), దిక్కులే వస్త్రాలై (దిక్‌+అం‌బరుడు) దిగంబరుడుగా, చంద్రుడు సిగపూవుగా, స్థిరమైన ఆనందమే స్వరూపంగా ఉంటావు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్వాన్ని కీర్తించారు. ‘నేను చెబుతున్నది సత్యం. ఇది కేవలం స్తోత్రం కాదు. మన హృదయపుష్పాలను శివార్పణ చేస్తే చాలు. ముక్తి కరతలామలకం అవుతుంది’ అని తమ నూరు శ్లోకాల ‘శివానందలహరి’ లో ఘంటాపథంగా చెబుతారు.

శివతత్త్వంలో రుద్ర, శివ, ఈశ్వర అనే పేర్లు ప్రధానమైనవి. ‘రుద్ర’ అనే శబ్దానికి (రుద్‌=‌రోదనం/దుఃఖం) ద్రవింపచేయగలవాడు అని అర్థం. శివ అంటే మంగళకరుడని, ఈశ్వర అంటే సర్వనియామక ప్రభువు అని భావం. ఆయనకు గల అనేక పేర్లలో చాలా వాటిని సందర్భానుగుణంగా ప్రయోగించినా, భక్తులకు అత్యంత ప్రియమైనది, వారి నాల్కల మీద నర్తించేది ‘శివ’ నామమే. ఇది సంసారమనే రుగ్మత నివారణకు దివ్యౌషధం

‘శం నిత్యం సుఖమానందమికారః పురుషః స్మృతః

వకారః శక్తిరమృతం మేలనం శివ ఉచ్చతే’

శివుడు శకరా, ఇకార, వకారాల కలయిక. ‘శ’అంటే నిత్యం, ఆనందం, సుఖం. ఇకారం అంటే పరమ పురుషుడు. వకారం అంటే అమృతపరమైన శక్తి అని అర్థం. అంటే.. అమృతసమానమైన పరమానంద దివ్యశక్తిని నిత్యం ప్రసాదించు పరమ పురుషుడని భావం

‘శివ’ అంటే పరమేశ్వరుడు. ‘శివా’ అంటే పార్వతి. స్త్రీని శక్తి స్వరూపిణిగా పరిగణించాడు. ఆమె ప్రాధాన్యాన్ని లోకానికి చాటాడు. ఆయన స్త్రీవాది, మహిళా పక్షపాతి. మహిళ ‘ఆకాశంలో సగం’ అనే నేటి మాటను మహా యుగాలకు పూర్వమే ఆచరించి చూపి, భార్యకు శరీరంలో సగభాగం కల్పించి అర్ధనారీశ్వరుడిగా ‘అర్ధాంగి’ పదాన్ని అర్థవంతం చేశాడు. అందుకే పార్వతీపరమేశ్వరులు ‘ఆదిదంపతులు’ అయ్యారు.

శివారాధన చేయ(లే)కపోయినా ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం జపించినా పుణ్యమేనని పురాణాలు చెబుతున్నాయి.

‘మూడు మూర్తులకును మూడు లోకములకు

మూడు కాలములకు మూలమగుచు

భేదమగుచు తుదికభేదమై యొప్పారు

బ్రహ్మమనగ నీవె ఫాలయన’.. త్రిమూర్తులకు, ముల్లోకాలకు భూతవర్తమాన భవిష్యత్‌ ‌కాలాలకు ఆధారమవుతూ, వాటిలో లీనమవుతూ, చివరికి నీలోనే ఐక్యం చేసుకునే ఏకైక అణుస్వరూపుడవు ఫాలలోచనుడా/ శివుడు’ అని కీర్తించాడు పోతనామాత్యుడు.

పంచాక్షరీ మంత్రం ‘నమః శివాయ’లోని బీజాక్షరాలు పంచ భూతాలకు ప్రతీకలు (న=భూమి, మః=జలం, శి=వాయువు, వా=అగ్ని, యః= ఆకాశం). విశ్వం పంచభూతాత్మకమయమని, శివుడు విశ్వమంతటా వ్యాపించాడనేందుకు పృథ్వి లింగం (కంచి), జల లింగం(జంబుకేశ్వరం), వాయు లింగం (శ్రీకాళహిస్తి), అగ్ని లింగం (అరుణాచలం), ఆకాశ లింగం (చిదంబరం) నిదర్శనంగా చెబుతారు. ప్రకృతే శివుడు.. శివమే ప్రకృతి అని దీని అంతరార్థంగా చెబుతారు. సకల బ్రహ్మాండ భాండమే శివమయమని రుద్రాధ్యాయం చెబుతోంది. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే పంచ రూపాలతో శివుడు సృష్టిని పాలిస్తాడు. వీరిలో వరుసగా ఈశానుడు ముక్కు, చెవి, శబ్దం,ఆకాశానికి అధిష్ఠాన దైవం. తత్పురుషుడు చర్మం, చేతులు, స్పర్శ, వాయువుకు; అఘోరుడు కళ్లు, కాళ్లు, రూపం, అగ్ని మున్నగు వాటికి; వామదేవుడు అహంకారానికి; సద్యోజాతుడు మనసు, ముక్కు, జననేంద్రియాలకు అధిష్ఠానంగా ఉంటూ వాటిని అదుపు చేస్తూ ఉంటాడు.

భక్త సులభుడు

మహేశ్వరుడు మహా మృదుస్వభావి. భక్త సులభుడు, భక్త పక్షపాతి. భక్తులు ఎలాంటి కోరికలు కోరినా తీరుస్తాడు. వరాలు గుప్పించడంలో సురాసుర పక్షపాత రహితుడు. భక్తవశంకరుడు. వాళ్లేం చేసినా సహిస్తాడు. పూజాదికాలలో నిబంధనలు, అభ్యంతరాలు ఉండవు. చెంబుడు నీరు, గుక్కెడు నీరు ఏ రాతిమీద దిమ్మరించినా సంతోషి స్తాడు. భక్త విధేయుడు. భక్తుడు పడుకుని కీర్తిస్తే కూర్చుని వింటాడట. కూర్చుని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనందతాండవం చేస్తాడట.

అభిషేకప్రియ శివ!

‘అలంకారేషు ప్రియో విష్ణుః/అభిషేకేన ప్రియం శివః/నమస్కారేషు ప్రియో భానుః’ అన్నారు. విష్ణువు అలంకారప్రియడు, భాస్కరుడు నమస్కార ప్రియుడు కాగా శివుడు అభిషేకప్రియుడు. పరమాత్మ బోధించిన జ్ఞానామృత బిందువులతో ఆత్మను ప్రక్షాళనం చేయడమే అభిషేకమని విజ్ఞులు చెబుతారు. అభిషేకం అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసానుదాసుడనని తనను తాను అంకితం చేసుకోవడం, శరణగతి కోరడం, భగవంతుడు సృష్టించిన దానిని ఆయనకే పునరంకితం చేస్తున్నామనే భావన కలిగి ఉండడం అభిషేకమని చెబుతారు. ఈ విషయంలో పరమేశ్వరుడు పండిత పామరులను సమదృష్టితో కరుణిస్తాడంటారు. మహన్యాసపూర్వక నమకచమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతా భిషేకాలు చేసే వారినీ, ‘హరహర మహాదేవ’ అంటూ చెంబెడు నీళ్లు పోసి, సర్వదేవతామయం అనే మారేడు పత్రం సమర్పించిన వారినీ సమాన దృష్టితో అనుగ్రహిస్తాడు. అందుకు నిదర్శనంగా అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

శివార్చన, శివానుగ్రహానికి శుద్ధజలం, పవిత్ర మనసు ప్రధానం. ‘చిత్తం శివుని మీద భక్తి….’ అనే సామెతకు దూరంగా ఉండాలి

ఆపద్బాంధవుడు

ఆపద సయయంలో ఆదుకునేవాడే ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు. ఆయనే పరమశివుడు. ‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు…’ అని శతకర్త మానవ నైజాన్ని వివరించినట్లు, క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన హాలాహలం స్వీకరణకు ఎవరు ముందుకు రాకపోయినా భువన రక్షణకు పార్వతీపతి చొరవ చూపాడు. పతి శక్తిసామర్థ్యాలు, లోకరక్షణ తత్పరత ఎరిగిన జగన్మాత ఆయన సంకల్పాన్ని బలపరిచింది. సేవించిన గరళాన్ని కంఠానికే పరిమిత చేసి ‘గరళ కంఠుడు’ అయి, జగతిని అమృతోపమానం చేశాడు. అది ధీరత్వానికి ప్రతీక. లోకాన్ని భస్మం చేయగల హాలాహలాన్ని గ్రహించి, దానిని కంఠంలోనే నియంత్రించడం వెనుక ‘ఎలాంటి దుర్భర పరిస్థితి లోనైనా, ఎంతటి ప్రళయాన్నయినా ఎదుర్కొని, నిలబడగలగాలనే ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి, ఆత్మ స్థయిర్యం, జీవితాన్ని విజయ సోపానంగా మార్చు కోవాల’న్న హితవు దాగి ఉందంటారు.

గంగమ్మను సతీదేవికి సవతిగా చేశాడని, ‘తిరపెమునకు ఇద్దరాండ్ర’ అనే నిందాస్తుతులు, వ్యంగ్యోక్తులు ఎన్ని ఉన్నా, దివిజ గంగ భువికి దిగేవేళ ఆమె వేగఉధృతిని నియత్రించగలిగిన ధీరుడుగా శివుడే కనిపించాడు, కనికరించాడు. ఆమెను ధరించగలిగాడు.

శివరాత్రి వైభవం

‘మాఘకృష్ణ చతుర్దాశ్యామాదిదేవో మహానిశి

శివలింగ త్వయోద్భూతః కోటిసూర్య సమప్రభః

తత్కాలవ్యాపినీ గ్రాహ్యా శివరాతివ్రతేతిథిః’. మాఘ మాస కృష్ణ పక్ష చతర్దశి నాటి నిశిరాత్రి శివుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో లింగ స్వరూపంతో ఆవిర్భవించాడు. ఆయన గరళాన్ని గళంలో దాచిన రోజు కూడా అదే కావడంతో దానికి ఎంతో విశిష్టత కలిగి ‘మహాశివరాత్రి’ పర్వదినంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు ఎంతో విశిష్టమైనది కనుకనే ‘జన్మానికో శివరాత్రి’ అనే నానుడి పుట్టింది. ఆ ఒక్క రోజు చేసుకున్న పుణ్యమే విశేష ఫలితాలను ఇస్తుందని భావం. ఇతర రోజులలో మాటెలా ఉన్నా ఆనాడు నిరాహారులై శివయ్యను అర్చించిన వారు మోక్షార్హులవుతారు. అందుకు గుణనిథి, కన్నప్ప (తిన్నడు) , వేటగాడు, నత్కీరుడు, బెజ్జమదేవి లాంటి పాత్రలు ఎన్నో ఉదాహరణలుగా ఉన్నాయి.

‘శివంచ పూజయిత్యాయో జాగర్తి చ చతుర్థశాం

మాతుః వయోధర రసంన పబిత్సక దాచన’

శివరాత్రి నాడు జాగరణ చేసిన వాడు ఎన్నటికీ తల్లి స్తన్యం చవిచూడడు (అంటే పునర్జన్మ ఉండదు) అని అర్థం.

ఉపవాసం/జాగరణ

‘ఉపవాసం’ (ఉప+వసము) అంటే పస్తు ఉండడం అని లౌకిక అర్థంలో స్థిరపడి పోయింది. కానీ ‘ఉప’ అంటే సమీపం, ‘వస’ అంటే ఉండడం (సమీపాన ఉండడం) అని నిఘంటు అర్థం. ఏ పర్వదినం నాడైనా, ప్రత్యేకించి శివరాత్రి నాడు సంకల్పాలకు అతీతంగా, పరమాత్ముని పావన స్మృతి/సన్నిధిలో ఉండడం, బుద్ధిని ప్రాపంచిక విషయాల నుంచి భగవంతుని సన్నిధివైపు మరల్చడమే ‘ఉపవాసం’.

మంగళకరమైన శివనామస్మరణతో మనసును ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే జాగరణ. ఇప్పటివరకు జీవితం ఎలా సాగింది? జీవితంలో ఎదురైన కష్టసుఖాలు, అనుభవాలు, చవిచూసిన అనుభూతులు, వెంటాడిన భయాలు ఏమిటి? తెలుసుకున్నది ఎంత? నడక, నడత ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? లాంటి అంశాలను జ్ఞానచక్షువులతో దర్శించి ఆత్మవిమర్శ చేసుకుని మహాశివుడి మన్నింపును కోరడమే జాగరణ అంతరార్థమని పెద్దలు చెబుతారు.

క్షీరసాగర మథన సమయంలో (మాఘ బహుళ చతుర్దశి) హాలాహలం స్వీకరించిన శివుడు స్పృహకోల్పోయాడని, ఆయన శిరస్సును ఒడిలో చేర్చుకున్న పార్వతీ, దేవదానవులు శోక సంద్రంలో మునిగిపోయి ఆయనకు తిరిగి స్పృహలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారని కథనం. నాటి నుంచి నీలకంఠుని భక్తిశ్రద్ధలతో అర్చించి, జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి.

స్కాంద పురాణం శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది. జ్ఞానులు ఆయనను సత్యం (సత్య స్వరూపుడు), మంగళకారుడు (శివం), సుందర రూపుడు (సుందరం) అని వర్ణించారు. సత్యం శివం సుందరాత్మకమైన జ్ఞానం ఒక ఆకారం దాల్చితే అది శివాకృతి అవుతుంది. సమస్త దుఃఖాలను హరించి శాశ్వతానందం కలిగించే జ్ఞానం కోసమే సామాన్యుల నుంచి యోగులు, మునులు నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు. శివారాధకులు జ్ఞానప్రాప్తిని, కైవల్యాన్ని పొందగలుగుతారట. ‘అశాశ్వతమైన ఐహిక భోగాల కోసం మనిషి కర్మలను ఆచరిస్తున్నాడు. స•ర్వం దుఃఖమయమైన ఈ భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందం కలిగిస్తుంది. శివాశ్రయంతో అది సులభతరం / అవుతుంది’ అని పెద్దలు చెబుతారు.

‘శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే

కోటి జన్మార్జితం పాపం తస్యనశ్యతి నిశ్చితమ్‌!!’ (‌శివ అనే మంగళకర నామాన్ని ఉచ్ఛరించేవారి కోటి జన్మాల పాపాలు నశించి తీరతాయి) అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram