– సుజాత గోపగోని

భారత రాష్ట్ర సమితి. నిన్నామొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగించి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు జాతీయ పార్టీ. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఒకరకంగా బలప్రదర్శన కోసం రూపకల్పన చేసిన బహిరంగసభ. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సవాల్‌ ‌విసరడమే ధ్యేయంగా సాగిన సభ.

వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం నుంచి ఖమ్మం జిల్లాలో విభజన ఆకాంక్షలు మిగతా ప్రాంతంతో పోలిస్తే చాలా తక్కువ. ఖమ్మం జిల్లా.. ఆంధప్రదేశ్‌ ‌సరిహద్దుల్లో ఉంటుంది. అంతేకాదు.. ఏపీ కోస్తా ప్రాంత ప్రజలతో ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధాలు ఎక్కువ. ఏపీ కేంద్రమైన విజయవాడ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌కన్నా దగ్గర. అక్కడి ప్రజలకు సరిహద్దుగా ఆంధప్రదేశ్‌ ‌జిల్లాలే ఉండటం, సంబంధాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష విషయంలోనూ సెంటిమెంట్‌ ‌బలంగా కనిపించలేదు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతటా టీఆర్‌ఎస్‌ ‌మెజార్టీ సాధించగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఇతర పార్టీలు గెలిచాయి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌వైపు ఆపరేషన్‌ ఆకర్ష్ ‌విజయవంతంగా చేశారు. సొంతంగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలుపు మిగతా పార్టీలతో నువ్వా? నేనా? అన్న స్థాయిలోనే ఉంటుంది.

టీఆర్‌ఎస్‌ ‌బ్యానర్‌ ‌మీద తెలంగాణలో ఎక్కడ సభ నిర్వహించినా.. భారీ స్పందన వస్తుంది. ప్రత్యేక తెలంగాణ భావన ప్రస్ఫుటిస్తుంది. కానీ, భారత రాష్ట్ర సమితి బ్యానర్‌ ‌మీద అదే తెలంగాణలో ఖమ్మం మినహా ఎక్కడ సభ నిర్వహించినా అంతర్గతంగా తెలంగాణ ఫ్లేవర్‌ ఉం‌టుంది. అందుకే బీఆర్‌ఎస్‌ ‌బ్యానర్‌పై కేసీఆర్‌ ‌నిర్వహించిన బహిరంగ సభకు ఖమ్మం వేదికయింది. జన సమీకరణలో విజయం సాధించారు.

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థుల అంచనాకు అందవనేది మొదటినుంచీ ఉన్న వాదన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన మాటల్లో, చేతల్లో, వ్యవహారశైలిలో పోలిక లేకపోయినా.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనకున్న ఇమేజ్‌ను పదిల పర్చుకోవ డానికి కారణం ఆయన రాజకీయ వ్యూహాలే. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరుతో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడానికి వెనుకంజ వేసిన కేసీఆర్‌.. ‌జాతీయ రాజకీయాల నినాదంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఖమ్మం వేదికగా మొదటి బహిరంగ సభకు ప్రణాళిక వేశారు. వేర్పాటువాదాన్ని పక్కన పెట్టినట్లు సంకేతాలు ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్ట మొదటి సభ ఇది. భారతీయ జనతాపార్టీకి జాతీయ స్థాయిలో ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని ప్రకటించిన కేసీఆర్‌ ఆ ‌దిశగా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. జాతీయస్థాయిలో పలువురు నేతలను ఖమ్మం తీసుకువచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఆ నేతలను భాగం చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో శెభాష్‌ ‌సీఎం కేసీఆర్‌ అని బహిరంగసభలో ప్రశంసలు దక్కించుకున్నారు.

కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ అధినేతగా ఇన్నాళ్ల పాటు చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు, తోటి తెలుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌తో పెట్టుకున్న విభేదాలను, అప్పుడు చేసిన విమర్శలను ఖమ్మం జిల్లా బహిరంగసభలో పక్కనపడేశారు. తన ప్రసంగం శైలిని పూర్తిగా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయం కాకుండా సభ నిర్వహించిన కారణంగా ఒక్క ఖమ్మం జిల్లాకే వరాల జల్లు కురిపించారు. ఆ తర్వాత జాతీయ స్థాయి అంశాలను ప్రస్తావించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన ద్వారా ఆంధప్రదేశ్‌తో నెలకొన్న సమస్యలను గురించి ప్రస్తావన చేయలేదు. వాటి గురించిన ప్రసంగానికి స్థానం కల్పించలేదు. అంతేకాదు.. అత్యంత వ్యూహాత్మకంగా అలాంటి అంశాల గురించి జనంలో ఆలోచన రాకుండా.. జాతీయ స్థాయి నేతలతో జాతీయస్థాయి ప్రసంగాలు చేయించారు.

ఖమ్మం సభ మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ సభ ద్వారా కేసీఆర్‌ ఆశించిన లక్ష్యం ఏ మేరకు సాధించారో తెలీదు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా టాక్‌ ఆఫ్‌ ‌ద టౌన్‌ ‌గా నిలపగలిగారు. వారం రోజుల ముందు నుంచీ ప్రచారాన్ని మోతెక్కించటం ద్వారా ఆశించిన స్థాయిలో ఉత్కంఠ సృష్టించగలిగారు. సభ ను సూపర్‌ ‌హిట్‌ ‌చేసుకొన్నామంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు సంబరాలు చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభకు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ సభలో పాల్గొన్నారు. వాళ్ల రాకతో బీఆర్‌ఎస్‌తో ఇతర రాష్ట్రాల పార్టీలతో మైత్రి ఉందన్న సంకేతాలు జనంలోకి వెళ్లేలా కేసీఆర్‌ ‌జాగ్రత్తపడ్డారు. కానీ, ఇక్కడే మరో అంశం ఉంది. కేసీఆర్‌ ‌మొదటినుంచీ తమ మిత్రులుగా చెబుతున్న.. ప్రత్యేక కూటమి పెడితే తమతో కలిసి వస్తారని చెప్పుకున్న ఆయా ముఖ్యపార్టీల నేతలు మాత్రం ఈ సభకు హాజరు కాలేదు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ముఖ్యమైన నాయకులు గైర్హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ‌బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌రానే రాలేదు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్‌కు పిలుపే లేదని చెప్పారు. మొదటి నుంచి ఆప్త మిత్రుడుగా ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ బహిరంగ సభకు దూరంగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు కేసీఆర్‌. 14ఏళ్ల పాటు ఉద్యమాలు నిర్వహించిన కేసీఆర్‌ ‌తెలంగాణ సాధించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చి కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగేళ్ల పాలన తర్వాత హఠాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ నాలుగేళ్ల పాలన తర్వాత మొన్న విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇకపై జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీని ప్రకటించినపుడు ఆ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి వచ్చారు. కేసీఆర్‌ ‌ప్రత్యేకంగా కుమార స్వామిని తెలంగాణకు ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ రూపొందించిన ప్రతిపాదన పత్రంపై కేసీఆర్‌ ‌సంతకం చేసి ఎన్నికల సంఘానికి పంపే రోజున కుమార స్వామితో తన అనుబంధం గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము జేడీఎస్‌తో కలిసి పని చేస్తామన్న కేసీఆర్‌ ‌కుమారస్వామిని ముఖ్య మంత్రిని చేయడమే తన లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌ ‌మొదట అడుగు పెట్టబోయేది కన్నడ గడ్డపైనే అని ప్రచారం కూడా చేశారు. అయినా కుమారస్వామి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆవిర్భావ సభకు రాలేదు. ఇతరత్రా సమస్యలు ఉన్నా కనీసం జేడీఎస్‌ ‌నుండి వేరే ప్రతినిధులనైనా పంపేవారు. కానీ ఎవ్వరూ రాలేదంటే అర్ధం ఏంటని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌-‌జేడీఎస్‌ల స్నేహబంధం కొద్ది రోజులకే వాడి పోయిందా? అని నిలదీస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ‌పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నికల సంఘం దానికి అనుమతిని ఇచ్చిన తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్‌. ఆ ‌కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ‌రాలేదు. ఖమ్మం సభకు మాత్రం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌సింగ్‌ ‌మాన్‌, ‌కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ‌వచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కూడా వచ్చారు. అయితే ఈ కొత్త మిత్రులతో బీఆర్‌ఎస్‌ అనుబంధం ఎంతకాలం ఉంటుంది? అన్నది ప్రశ్న. బలమైన ముఖ్యమంత్రులుగా పేరున్న మమతా బెనర్జీ, నితీశ్‌ ‌కుమార్‌, ‌స్టాలిన్‌ ‌వంటి వారు ఇటువైపు తొంగిచూడలేదు. అలాగే తనకు సన్నిహితంగా ఉంటున్న శరద్‌పవార్‌, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ ‌వంటివారు హాజరు కాకపోవడం కేసీఆర్‌కు కాస్త ఆశాభంగమే. కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు డీఎంకే, శివసేన, జార్కండ్‌ ‌ముక్తి మోర్చా పక్షాల నేతల రాకను ఎవరూ ఊహించలేదు. కానీ, బీఆర్‌ఎస్‌ ‌మిత్ర పక్షం ఎంఐఎం అధినేత ఒవైసీని ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్న వస్తోంది. ఆయన హాజరైతే కొన్ని పార్టీలకు ఇబ్బందిగా ఉంటుందని భావించారేమో తెలియదు. ఇటువంటి పార్టీల మద్దతు లేకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేయటం ఎంత వరకు సాధ్యం అన్నది ప్రశ్న.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఖమ్మం సభలో ప్రధాన వక్తలు ధీమాగానే చెప్పారు. ఉపన్యాసాలు ఘాటుగా ఉన్నా, వీళ్లు మాత్రమే జమ అయితే బీజేపీని ఓడించగలరా? అన్న సందేహ ముంది. వచ్చే ఎన్నికలలో మీరు (బీజేపీ) ఇంటికి, మేము ఢిల్లీకి అంటూ కేసీఆర్‌ ‌మాట్లాడినా.. అది ఎలాగో వివరించలేదు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశం అంతటా విస్తరిస్తామని మాత్రం ప్రకటించారు.

దళితబంధు పది లక్షల రూపాయల స్కీమ్‌ను ఏటా 25 లక్షల మందికి అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేశారు. లేకుంటే తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే వర్తింప చేస్తామని చెప్పారు. అంటే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున పాతిక లక్షల మందికి బడ్జెట్‌ ‌కేటాయించడం అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుందన్నమాట.

అలాగే రైతు బంధును దేశవ్యాప్తం చేస్తామని చెప్పారు. ఎకరాకు పదివేల రూపాయల చొప్పున కోట్ల ఎకరాలకు నిధులు ఇవ్వవలసి వస్తుంది. దీనికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో లెక్కలు వేయవలసి ఉంది. దేశం అంతటా తాగు, సాగు నీరు ఇస్తామని కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు. మీది ప్రైవేటైజేషన్‌ అయితే మాది నేషనలైజేషన్‌ అన్నారు. వేటిని ఆయన జాతీయం చేస్తారన్నదానిపై స్పష్టత రావాలి. అగ్నివీర్‌ ‌పథకాన్ని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ ఎజెండాను సభలో పాల్గొన్న వామపక్ష నేతలు, సమాజ్‌ ‌వాది పార్టీ, ఆమ్‌ ఆద్మి పార్టీ నేతలు ఎంతవరకు ఆమోదించారో తెలియదు. ఎందుకంటే ఎవరికి వారికి సొంత ఎజెండా ఉంది. వీరంతా కూటమిగా ఏర్పడలేదు. కాకపోతే కేసీఆర్‌ ‌పథకాలను ప్రశంసించారు. గతంలో పాదయాత్రలు చేసి, నిరసన యాత్రలు చేసి కేసీఆర్‌ను విమర్శించిన వామపక్షాలు ఇప్పుడు సమర్ధిస్తున్నాయి. దీనికి కారణం బీజేపీని ఆయన బహిరంగంగా వ్యతిరేకించడమే. ఈ వెలుగునీడలు ఎలా ఉన్నా తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఖమ్మం సభ ఒక రిహార్సల్‌గా ఉపయోగపడవచ్చు. అంతకుమించి ఈ సభ ద్వారా అయితే మొత్తం జాతీయ స్థాయి వచ్చేసిందని చెప్ప జాలం. ముగ్గురు సీఎంలు వచ్చి కేసీఆర్‌కు పరువు దక్కించారంటున్నారు విశ్లేషకులు.

అసలు కొత్త మిత్రులతో జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్‌ ‌పోషించబోయే పాత్ర ఏంటో అర్ధం కాదంటున్నారు విశ్లేషకులు. ఈ మిత్రులలో కొందరు ఒక కన్ను కాంగ్రెస్‌ ‌మీదే ఉంచారన్నది నిజం. బీఆర్‌ఎస్‌ ‌రంగు రుచి వాసన ఏవో తెలియా లంటే అది ఇంకొన్ని అడుగులు వేశాకే చెప్పగలం.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram