– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కాంగ్రెస్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రారంభించడం, జాతీయ అధ్యక్షుడిని మార్చడం, బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తరుణంలో కేసీఆర్‌ ‌భారత రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఢిల్లీ మద్యం వివాదంలో తన కుమార్తె పేరు కూడా ఉందన్న వార్తలు వెల్లువెత్తుతున్న తరుణంలో  దీనినో ఎత్తుగడగా చూస్తున్నవారు కూడా ఉన్నారు. ఎన్ని వాదోపవాదాలు వినిపించినా, ఖమ్మంలో ఏర్పాటైన దాదాపు తొలి బీఆర్‌ఎస్‌ ‌తేవలసినంత చర్చను తెచ్చిందా? ఇక్కడ మాట్లాడిన వారి మాటలలో కొత్తదనం ఎంత? ఖమ్మం వేదిక మీద కనిపించిన నేతలతోనే బీఆర్‌ఎస్‌ ‌బీజేపీకి ప్రత్యామ్నాయం అనిపించుకుంటుందని జనం నమ్మగలరా? వంటి ప్రశ్నలను ముందుకు తెచ్చింది.  ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలను, రైతులు, మహిళలను నమ్ముకునే ఆయన ఈ సాహసం చేస్తున్నారు. ఇదే సమయంలో తనను తాను ముస్లిం అనుకూల నేతగా ప్రచారం పొందాలన్నది కూడా ఆయన వ్యూహం. రాష్ట్రంలో ఇప్పటికే ఎంఐఎం తనకు మిత్రుడి పాత్ర పోషిస్తున్నందున, దేశంలోని 14% ముస్లిం ఓటర్లను ఆకర్షించవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం ముస్లింల ఓట్లను చీల్చడం బీజేపీకి అనుకూలంగా మారుతున్నదన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం.  ప్రస్తుతం కేసీఆర్‌ ‌జాతీయ స్థాయి నేతగా కంటే, రాష్ట్రంలోకి బీజేపీ చొచ్చుకువచ్చే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పడం సముచితంగా ఉంటుంది. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీపై ఘనవిజయం సాధిస్తే జాతీయ రాజకీయాలపై మరింతగా దృష్టిపెట్టవచ్చు. కానీ ఇదంత తేలికైన విషయం కాదన్న సంగతి కేసీఆర్‌కు తెలియదనుకోవడం అమాయకత్వమే. అందుకున్న బలమైన కారణాలను విస్మరించలేం.


కేసీఆర్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ ‌రెండూ సమాన శత్రువులే. కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ను చీల్చి చెండాడారు. ఆ పార్టీ అస్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో బీజేపీ ఏకు మేకై కూర్చుంది. బహుశా ఇది ఊహించ లేదేమో! ఇప్పుడు కేసీఆర్‌కు కాంగ్రెస్‌, ‌బీజేపీయేతర కూటమి అవసరం. కానీ మిగిలిన విపక్షాలలో కాంగ్రెస్‌ ‌పట్ల సానుకూలత ఉన్నదనేది ఇక్కడ కీలకం. తమకు తగినంత గుర్తింపు లేనందువల్ల జాతీయ స్థాయి వేదికకు కాంగ్రెస్‌ ‌చాలా అవసరమని ఆ పక్షాలు భావించడం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. గతంలో ఆయన విపక్షాలతో ఒక కూటమి కోసం యత్నించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక రకంగా అది నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు జాతీయపార్టీ పెట్టిన నేపథ్యంలో ఆయన తనను తాను జాతీయస్థాయిలో బలమైన నాయకుడిగా రుజువు చేసుకోక తప్పని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయంలేని తరుణంలో ఇప్పటికిప్పుడు ఇది సాధ్యంకాదు. పొత్తులతో ముందుకు సాగాలంటే సహచర ప్రాంతీయ పార్టీలే అడ్డంకిగా మారకూడదనేం లేదు. అందువల్లనే ఆయన వ్యూహాలు ఫలించడంలో సాధ్యాసాధ్యాలను కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే గతంలో టీడీపీ, ఎంఐఎంలు జాతీయస్థాయిలో ప్రయత్నాలు చేసి నప్పటికీ పెద్దగా సాధించిందేమీ లేదు.

ఖమ్మం సభ ప్రభావమెంత?

ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ‌సమా వేశానికి జనం బాగానే వచ్చారు. ఓటేసేవారు ఎంత మంది? ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి రావడం పైకి బాగానే అనిపించినా, జాతీయస్థాయిలో ఎదగాలనుకుంటున్న కేసీఆర్‌కు ఇదెంతవరకు ఉపకరిస్తుందనేది ప్రధాన ప్రశ్న. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌, ‌కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ‌పాల్గొన్నారు. ఇంతమంది నాయకులను పిలిపించడం అంత తేలికైన విషయం కాదనుకునే వారు చాలామందే ఉండవచ్చు. ఇతర ప్రాంతీయ పార్టీల్లో గూడుకట్టుకొని ఉన్న స్వార్థం, ఆధిపత్య ధోరణి, గొంతెమ్మ కోర్కెలు వంటివి కేసీఆర్‌ను అడుగు ముందుకేయనీయవు. ఇది ఆయనకు ప్రతిబంధకం కాగలదు.

జాతీయ స్థాయికి ఆప్‌, ‌తృణమూల్‌ ‌పార్టీలు

ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ‌దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉంది. ఇందులో భాగంగానే ఆప్‌ ‌గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేసింది. అక్కడ 13% ఓట్లు సాధించి 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. గోవాలో ప్రాంతీయ పార్టీగా పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. గుజరాత్‌లో ప్రాంతీయపార్టీగా పోటీచేసి జాతీయపార్టీ గుర్తింపు నకు అర్హత పొందింది (ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా అర్హత పొందాలంటే మూడు నిబంధనలు న్నాయి. మొదటిది లోక్‌సభ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో 2% సీట్లు గెలవాలి. రెండవది లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లను కనీసం నాలుగు రాష్ట్రాల్లో పొందాలి. దీనికి అదనంగా నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలవాలి. నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీగా గుర్తింపు పొందాలి). ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరణకు ఆయనకుండే ప్రణాళికలు ఆయనకుంటాయి. అందులో ఆంధ్ర, తెలంగాణ ఉండి తీరతాయి. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి దీదీ కూడా విపక్షాల ప్రధానమంత్రి పోటీదారుల్లో ఒకరు. ఆమె పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ 2016‌లోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆమె కూడా తన పార్టీ విస్తరణకు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాని పదవికి నేనంటే నేనంటూ కేజ్రీవాల్‌, ‌దీదీ పోటీ పడుతున్న పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితిని ఆర్భాటంగా ప్రారంభించినా, ఈ పల్లకీని ఇతర రాష్ట్రాల్లో మోసేదెవరు? బీఆర్‌ఎస్‌కు గుర్తింపు రావడానికి ఎంతకాలం పట్టేను? జాతీయ స్థాయి రాజకీయాల్లో పల్లకీలో కూర్చోవడానికి తప్ప పల్లకీ మోయడానికి ఇష్టపడని వివిధ పార్టీల నాయకులతో పాటు తానూ పోటీదారుగా మారితే కలిగే ప్రయోజనం మాట అలా ఉంచి మొదటికే మోసం రావచ్చు. ఈ రాజకీయ భేతాళ పంచవింశతిలో విపక్ష రాజకీయ కాలుష్య వైతరిణిని దాటేందుకు పొత్తులే కేసీఆర్‌కు దిక్కు. ఉదాహరణకు కర్ణాటకలో పోటీ చేస్తామని కేసీఆర్‌ ‌ముందుగా చెప్పినప్పటికీ, జేడీఎస్‌ ‌నాయకుడు కుమారస్వామి మాత్రం, రాష్ట్రంలో తమ పార్టీకి ఎవరితో పొత్తుండదని చెప్పి గులాబీ నేత ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో కర్ణాటకలో జేడీఎస్‌ ‌గెలుపు కోసం మాత్రమే బీఆర్‌ఎస్‌ ‌పనిచేయాల్సిన పరిస్థితి! ఇక బిహార్‌ ‌ముఖ్యమంత్రి జనతాదళ్‌ ‌యునైటెడ్‌ అధినేత నితీశ్‌ ‌కుమార్‌ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, గత ఆగస్టులో ఎన్‌డీఏకు గుడ్‌బై చెప్పి ‘మహా ఘట్‌బంధన్‌’‌కు తెరతీశారు. తన రాజకీయ వారసుడు తేజస్వీ యాదవ్‌గా పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇదెంతవరకు ముందుకెళుతుందో తెలియదు. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ఖమ్మం సభకు హాజరైనప్పటికీ, ఆయన పైకి ఎన్నిమాటలు చెప్పినా కేసీఆర్‌కు మద్దతిచ్చే మాట కల్ల. కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించాలనిపించి వచ్చానని చెప్పి ఆయన ఒక సంకేతం ఇచ్చారు. అది ఆశను చిగురింపచేసేది మాత్రం కాదు. లిక్కర్‌ ‌స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఆయన్ను బహుశా ఖమ్మం సభకు వచ్చేలా చేసి ఉండవచ్చు.

ప్రస్తుతానికి కేసీఆర్‌ ‌రెండు రాష్ట్రాలకు అధ్యక్షు లను నియమించారు. ఆంధప్రదేశ్‌కు తోట చంద్ర శేఖర్‌ ‌కాగా ఒరిస్సాకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ ‌గమాంగ్‌. 2009‌లో ఓటమిపాలైన దగ్గరి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న గమాంగ్‌, 2015‌లో బీజేపీలో చేరారు. 79 ఏళ్ల ఈ వృద్ధ నాయకుడు ఇప్పుడు తన కుమారుడి కోసం తాపత్రయపడుతున్నారు. 1999లో అప్పటి వాజపేయి ప్రభుత్వం కేవలం ఈయన వేసిన వ్యతిరేక ఓటు కారణంగా ఒకే ఒక ఓటు తేడాతో కుప్పకూలి పోయింది. ఇంతటి వృద్ధాప్య దశలో, రాజకీయాల్లో చురుగ్గా లేని ఆయన బీఆర్‌ఎస్‌కే భారంగా మారకూడదనేం లేదు. ఇక ఆంధప్రదేశ్‌ ‌పార్టీ శాఖ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్‌ ఉత్సాహంగా ఖమ్మం సభకు జనాల్ని తరలించారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఎంపిక వెనుక పెద్ద భూస్కాం ఉందంటూ బీజేపీ నేత రఘు నందన్‌రావు చేసిన ఆరోపణలు కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేదే. ఎందుకంటే న్యాయవాది అయిన రఘునందన్‌రావు అంత తేలిగ్గా ఆరోపణలు చేస్తారని అనుకోలేం. ఇదిలా ఉండగా కుల రాజకీయాల కుంపట్లతో కాగుతున్న ఆంధప్రదేశ్‌కు ఇప్పుడు తోట చంద్రశేఖర్‌ ‌తోడయ్యారని అనుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్‌ ‌కల్యాణ్‌కు తోడు తోట చంద్రశేఖర్‌ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పటికే ఆంధ్రలో మరొక రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో కేసీఆర్‌ ‌పాచిక ఎంతమేర పారుతుందన్నది ప్రశ్నార్థకమే.ముందు చెప్పుకున్న సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి ఈ రెండు వర్గాలు నానా తంటాలు పడుతున్నాయి.

ఒకప్పుడు దుమ్మెత్తిపోసి…

తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రావాళ్లకు వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ ఏ ‌ముఖం పెట్టుకొని అక్కడకు వెళతారని కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సహేతుకమైనదే. అయితే ఆంధ్రావారిని దుమ్మెత్తి పోసిన కేసీఆర్‌, ఇప్పుడు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నానని చెప్పగలరు. తన మాటల మంత్రదండంతో తిమ్మిని బ్రహ్మిని చేయగలరు. దయ్యమని తిట్టిన వారినే దేవుడు/దేవత అని పొగడగలిగే సామర్థ్యం ఆయన సొంతం. అందువల్ల ఆయనకు ఆంధ్రలో అడుగు పెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కేసీఆర్‌ ‌కొంత మంచి చేశారన్న అభిప్రాయం ఆంధ్రుల్లో ఉంది. అందువల్ల కుల రాజకీయాలతో విసిగిపోయిన ఆంధ్రులు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయరని కచ్చితంగా చెప్పలేం. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అయిన కొన్ని వర్గాలకు కేసీఆర్‌ ‌చల్లనిచూపు కావాలి. హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఆంధ్రకు చెందిన బలీయమైన ఆర్థికశక్తులు, తమ వ్యాపారాలు, పరిశ్రమలను కాపాడుకోవడం ప్రధానం కాబట్టి కేసీఆర్‌కు మద్దతు తెలపొచ్చు. అయితే ఆంధప్రదేశ్‌ ‌కంటే మూడు, నాలుగు నెలల ముందు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నందున, ఇక్కడ బీజేపీను నిలువ రించి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటే కేసీఆర్‌కు ఆంధ్రలో సానుకూల పవనాలు వీచే అవకాశా లుంటాయి. కానీ బీజేపీ గట్టిపోటీ ఇచ్చి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినా లేదా టీఆర్‌ఎస్‌ను ఓడించినా భారాస ఆంధ్రలో అడుగు పెట్టడం కష్టమే.

మన దేశంలో రాజకీయాలు సైద్ధాంతిక ప్రాతిపదికను వదిలేసి చాలా ఏళ్లయింది. రాజకీయా లను ఒక కెరీర్‌గా ఎంచుకునేవారు, అందులో పెట్టు బడులు (ఎన్నికల ఖర్చు రూపంలో) పెట్టి, అధికారంలోకి రాగానే రెట్టింపు సంపాదించాలన్న కాంక్ష పెరిగిపోవడంతో, ప్రజాస్వామ్యం నిర్వచనం మారిపోయింది. పార్టీ కాదు, కెరీర్‌ ‌ముఖ్యమై పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీలో టిక్కెట్లు దక్కవని నిర్ధారించుకున్నవారు, పడిపోయిన టీడీపీ ఇక లేవడం కష్టమని గట్టిగా నమ్మినవారికి బీఆర్‌ఎస్‌ ‌తమ రాజకీయ కెరీర్‌కు ఒక అవకాశంగా కనిపించ వచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే.. తెలంగాణలో ఆంధ్రావారి ఓట్లున్నాయి కానీ ఆంధ్రలో తెలంగాణ ఓట్లు లేవు. దశాబ్దాలుగా ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు ఇప్పుడు చతికిలబడిన నేపథ్యంలో ఈ ఖాళీని ఎంతవరకు బీఆర్‌ఎస్‌ ‌పూరించగలదనేని ప్రశ్న.

ఎంఐఎంతో దోస్తీ అవసరం

ఖమ్మం సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రాకపోవడం వెనుక వ్యూహాత్మక రాజకీయం ఉన్నదా? అన్న అనుమానాన్ని పక్కన పెడితే ఎంఐఎం కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ. బీఆర్‌ఎస్‌-ఎంఐఎం ‌మైత్రిని తెలంగాణలోని కమలనాథులు తమకు అనుకూ లంగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా భైంసా అల్లర్ల వ్యవహారంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహ రించలేదన్న ఆరోపణలను ఎదుర్కొంది. దీన్ని బీజేపీ తన ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో 12.7% ముస్లిం ఓటర్లున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో, కనీసం 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నందున, ఎంఐఎంను కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. అట్లాగని మిగిలిన వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదు కదా. అదీకాకుండా హైదరాబాద్‌ ‌పాతబస్తీలో ఎంఐఎందే ఆధిపత్యం. ఇక్కడి ఏడు అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి కంచుకోట. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముస్లింలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్గొండ, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌ల్లో వీరి ప్రాబల్యం అధికం. తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక- 2017 ప్రకారం 1.73 మిలియన్ల మంది ముస్లింలు కేవలం హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. అంటే మొత్తం రాష్ట్రంలోని ముస్లిం జనాభాలో ఇక్కడ 43.5%. మరి జంటనగరాల్లో 24 అసెంబ్లీ స్థానా లుండగా వీటిల్లో పదింటిని ముస్లింఓటర్లు కచ్చితంగా ప్రభావితం చేయగలరు. రాష్ట్రంలో షాదీముబారక్‌, ‌ముస్లింల కోసం ఇంగ్లిష్‌ ‌మీడియం స్కూళ్లను ప్రారం భించడం, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ముస్లింను చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ‌పట్ల ముస్లింలలో సానుకూలత వ్యక్తమైనా, కేంద్రంలోని బీజేపీతో సాన్నిహిత్యం వీరికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఇదే సమయంలో కేసీఆర్‌ ‌మీద ముస్లింలలోని కొన్ని వర్గాల్లో అనుమానాలు కూడా లేకపోలేదు. ముస్లింల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధుల్లో పూర్తిగా వినియోగం కావడంలేదన్నది వారి ఆరోపణ. 2017 బడ్జెట్‌లో ముస్లింలకు కేటాయించిన నిధుల్లో 41.7% మాత్రమే ఖర్చుచేశారని, అంతకుముందు ఏడాది మరింత దారుణంగా 27.89% నిధులు మాత్రమే ఖర్చు చేశారని, అంతకు పూర్వం మూడేళ్ల కాలంలో పరిశీ లిస్తే ముస్లింలకు కేటాయించిన బడ్జెట్‌లో 60%కు మించి నిధులు ఖర్చుచేయలేదన్నది కూడా ఆరోపణ. రాష్ట్రంలోని ముస్లింలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించిఉన్నారు. గ్రామాల్లోని ముస్లింలు కాంగ్రెస్‌కు అనుకూలం కాగా, పట్టణం ప్రధానంగా హైదరాబాద్‌ ‌ముస్లింలు ఎంఐఎంకు అనుకూలంగా ఉంటారు. అయితే డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి తర్వాత విశ్వ సించదగ్గ నేతగా కేసీఆర్‌ను ముస్లింలు పరిగణిస్తారు. 2018 ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 10శాతం వరకు ఉంది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌దాదాపు క్లీన్‌స్వీప్‌ ‌చేసింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్‌, ‌నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా పార్టీ అడుగుపెట్టగలిగిందంటే కారణం ముస్లిం ఓట్లే.

ఖమ్మంలోనే ఎందుకు?

ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ముఖ్యనేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కొత్త సంవత్సరం మొదటిరోజున తమ అనుయాయు లతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారే సంకేతాలిచ్చినప్పటికీ, తుమ్మల గుంభనంగానే ఉండిపోయారు. నిజానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచారు. తర్వాత జగన్‌ ఆం‌ధ్ర రాజకీయాలకు పరిమితం కావడంతో గులాబీ పార్టీలో చేరిన తర్వాత లూప్‌లైన్‌లో పెట్టడంతో ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. సహజంగానే బీజేపీ వీరిద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆత్మ మాత్రం తెలుగు దేశమే! కానీ ఆ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేకపోవ డంతో, బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీలో చేరి తన అదృష్టం పరీక్షించుకుంటారా అన్నది ఆయన బయట పెట్టడంలేదు. ఇటీవల చంద్రబాబు ‘ఘర్‌వాపసీ’ అంటూ తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడంతో అటువైపు మొగ్గుచూపుతారా? చూడాల్సి ఉంది. ఇన్నేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఒక్కసారిగా వచ్చి మద్దతు ఇవ్వండని కోరే చంద్రబాబును విశ్వసించడం కష్టం. కాగా ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే బలంగా ఉన్నామని నిరూపించుకోవడానికే కేసీఆర్‌ ‌ఖమ్మంను వేదికగా చేసుకున్నారని భావించాలి.

పోటీ ఎక్కడి నుంచి!

2023లో మేఘాలయ (60), నాగాలాండ్‌ (60), ‌త్రిపుర (60), కర్ణాటక (224), ఛత్తీస్‌గఢ్‌ (90),‌మధ్యప్రదేశ్‌ (230),‌మిజోరం(40), రాజస్తాన్‌ (200),‌తెలంగాణ(119) రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్ట్రాల్లో ఎన్నికల పక్రియ ప్రారంభమైంది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్‌, ‌మేఘాలయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు, వీటిని ప్రీఫైనల్‌గా పరిగణిస్తు న్నారు. త్రిపురలో బీజేపీ- ఐపీఎఫ్‌టీ కూటమి, నాగాలాండ్‌, ‌మేఘాలయల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో బీజేపీ జూనియర్‌ ‌భాగస్వామిగా జట్టుకట్టి అధికారంలో కొనసాగుతోంది. దక్షిణ భారతదేశం లోని కర్ణాటకలో మేలో జరిగే ఎన్నికల్లో ప్రధానంగా తలపడేవి బీజేపీ, కాంగ్రెస్‌, ‌జనతాదళ్‌ (ఎస్‌). ‌తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌లు తలపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది నవంబర్‌-‌డిసెంబర్‌ ‌మధ్యకాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ-కాంగ్రెస్‌ ‌పార్టీలు. ఇక ఛత్తీస్‌గఢ్‌, ‌రాజస్తాన్‌ ‌లలో అధికారంలోఉన్న కాంగ్రెస్‌ ‌తన పట్టును నిలుపు కోవాలని పోరాడుతోంది. ఈ రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. ఇక తెలంగాణలో కేసీఆర్‌ 2024 ‌లోక్‌సభ ఎన్నికల్లో తలపడాలన్న ఆలోచనతో తెరాస పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే తెలం గాణలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్‌ఎస్‌ ‌పోటీ చేసే పరిస్థితి లేదు.

పేరు మార్పుతో భయం!

తెలంగాణ రాష్ట్ర సమితిలోని ‘తెలంగాణ’ స్థానంలో ‘భారత’ అనే పదం చేరడం గులాబీ నేతలను భయపెడుతోంది. ఈ మార్పు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుందేమోనన్నది వీరి భయం. అదే నిజమైతే తమ కొంప కొల్లేరేనన్న ఆలోచన వారికి నిద్రపట్టనివ్వడంలేదు. గతంలో మాదిరి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ ‌కూడా లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు ప్రజల్లోకి దూసుకెళ్లే వజ్రాయుధం లాంటి మరో ‘నినాదం లేదా సెంటి మెంట్‌’ ‌తక్షణావసరం.

ప్రతిపక్షాల వ్యూహాలు

2022లో ఉత్తరాఖండ్‌, ‌మణిపూర్‌, ‌గోవా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాలు, ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. కమలం పార్టీ ఐదు రాష్ట్రాల్లో అంటే గోవా, ఉత్తరాఖండ్‌, ‌మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోగా కాంగ్రెస్‌ ‌కేవలం హిమాచల్‌‌ప్రదేశ్‌తో సరిపెట్టు కుంది. ఇక్కడ విపక్షాలు మూడు రకాల వ్యూహాలను అనుసరించాయని చెప్పాలి. మొదటిది- ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌రాజకీయాల్లో కొత్త పంథా అనుసరించారు. దేశంలో ‘సంప్రదాయ వాదాన్ని’ ఎదుర్కొనడానికి ‘మధ్యేమార్గ- సంప్రదాయ మార్గాన్ని’ ఎన్నుకొని ఆ దిశగా రాజకీయాలు నడిపారు. అంటే ‘హిందూత్వం పట్ల మెతక వైఖరి’ అనుసరిస్తూ ముందుకు సాగడం. కొన్ని సమయాల్లో మైనారిటీల పట్ల మౌనంగా ఉండటం. ఈ మార్గం కొంతమేర ఫలితాలనిచ్చినట్టు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ విధానంలో బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో హిందూత్వను దూకుడుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంచేశారు. ఇది పంజాబ్‌లో ఫలించి పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఢిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌, 15 ‌సంవత్సరాల బీజేపీ ఆధిపత్యానికి చరమగీతం పాడ గలిగినప్పటికీ, ఇక్కడ కమలం పార్టీ స్వయం కృతాప రాధాలను కూడా విస్మరించలేం. అయితే దీనివల్ల ఒక ప్రతికూలత కూడా ఉంది. బీజేపీకి హిందువులు బలీయమైన ఓటుబ్యాంకుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ‘సిద్ధాంతం’ పని చేయదు. పైగా కాంగ్రెస్‌ ‌నుంచి వేరుపడినందుకు ముస్లింలు నమ్మబోరు. ఇది కొన్ని రాష్ట్రాల్లోనే పనిచేస్తుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం లోకి రావడంలో ఈ విధానం ఉపయోగపడింది. రెండవది-రాహుల్‌ ‌గాంధీ ‘తాను అనుసరించేదే సరైంది’ అనే దృక్పథంతో ముందుకెళ్లారు. ఇందు కోసం ఆయన ఎన్నికల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే విధానాన్ని పక్కనబెట్టడమో లేక నిరవధికంగా వాయిదా వేయడమో చేస్తూ ముందుకు సాగి పోయారు. కాంగ్రెస్‌ ‌బేస్‌ ‌వేగంగా కుంచించుకు పోతున్నా, ముఖ్యమైన నేతలు పార్టీని వీడుతున్నా పట్టించుకోని వైఖరి అవలంబించారు. ఈ వైఖరి పార్టీ కార్యకర్తలతో సంబంధాన్ని కోల్పోయేలా చేసి కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా తయారైంది. మూడో విపక్ష విధానం ఆయా రాష్ట్రాల పరిస్థితులనుబట్టి అనుసరించేది. బలీయమైన ప్రాంతీయతత్వాన్ని కలిగిన గట్టి ప్రాంతీయ నాయకుడు ఉండటం. బీజేపీకి ఇప్పుడు ఇటువంటి నాయకుల కొరత బాగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్‌, ‌తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు, ఒడిశాలో నవీన్‌ ‌పట్నాయక్‌, ఆం‌ధప్రదేశ్‌లో వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి, ఢిల్లీలో కేజ్రీవాల్‌ ఈ ‌కోవకు చెందిన విపక్ష నేతలు. ఎక్కడికక్కడే ప్రాంతీయ సమస్యల అడ్డంకు లున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా వీరి వ్యూహాలు కొనసాగాయి. వీరిలో నవీన్‌ ‌పట్నాయక్‌, ‌స్టాలిన్‌లకు జాతీయస్థాయికి ఎదగాలన్న ఆలోచనలు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జాతీయ రాజ కీయాల్లో ముఖ్యపాత్ర వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన వ్యూహంపై పూర్తి స్పష్టత లేదు.

బీజేపీ వ్యూహం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రానికి అనుగుణంగా అక్కడి పరిస్థితులను బట్టి తన వ్యూహాలను పన్నుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో విస్తరించాలన్న లక్ష్యంతో ఒక్కొక్క చోట ప్రత్యేకవ్యూహంతో ముందుకు వెళుతోంది. తెలంగాణలో ప్రభుత్వ అవినీతి, హిందూ వ్యతిరేక పాలన అన్న అంశాలపై ముందుకు సాగుతోంది. అదేవిధంగా తమిళనాడులో బలీయంగా ఉన్న ద్రవిడ వాదాన్ని ఎదుర్కొనడానికి ప్రధాని మోదీ తలపెట్టిన ‘తమిళ-కాశీ సంగమం’ కార్యక్రమం గడచిన నవంబర్‌ 27 ‌నుంచి డిసెంబర్‌ 16 ‌వరకు సాగింది. ‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠతా భారత్‌’ ‌స్ఫూర్తితో తమిళ భాషా సంస్కృతులకు మరింత ప్రాచుర్యం కలిగించడం ప్రధాన లక్ష్యం. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌లో భాగంగా నవంబర్‌ 19‌న మోదీ ప్రారంభించారు. రెండు ప్రాంతాలకు చెందిన మేధావులు, విద్యార్థులు, తత్వవేత్తలు, కళాకారులు, వర్తకులు పరస్పరం తమ తమ సంస్కృతులపై పరస్పరం అవగాహన పెంచు కునే కార్యక్రమం ఇది. తమిళ చారిత్రక గ్రంథాలైన శిలప్పదికారం, మణిమేఘలైలలో తమిళనాడు- వారణాసిల మధ్య వెయ్యేళ్ల అనుబంధాన్ని వివరించిన విషయానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తూ ద్రవిడ వాదాన్ని దెబ్బకొట్టా లన్నది వ్యూహం. అన్నాడీఎంకే బలహీనపడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీచేసే వ్యూహాన్ని ఇక్కడ అనుసరిస్తోంది. కశ్మీర్‌లో పహారీ ముస్లింలకు ఎస్టీ హోదా ఇవ్వడం, 2024 లోకసభ ఎన్నికల్లో కేరళలో, తిరువనంతపురం, అట్టింగళ్‌, ‌పంథనంతిట్ట, త్రిస్సూర్‌, ‌పాలక్కాడ్‌, ‌కాసర్‌గాడ్‌ ‌లోక్‌సభ స్థానాలపై దృష్టిపెట్టడం వంటివి బీజేపీ వ్యూహాలు.

దేశంలోని అధికార, ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ‌మరింత దృఢమైన వ్యూహాన్ని అనుసరించక తప్పదు. అన్నింటికంటే ముందు జాతీయ నాయకుడిగా గుర్తింపురావాలి. బీఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగేవి కావు. పూర్తి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక్కోసారి ఫలితాల నివ్వవు. మతాలు, కులాలు, వర్గాల వారీ లెక్కలు కూడా అన్నివేళలా పనిచేయవు. ఎందుకంటే అసంతృప్తులు అన్ని వర్గాల్లో ఉంటారు. అలయన్స్ ‌రాజకీయాలు మనదేశంలో కొంతకాలం నడిచినా అవి ఉత్తమ పాలనను అందించలేకపోయాయి. ఇప్పుడు కేసీఆర్‌ ‌కూడా కూటమి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తే, జాతీయ స్థాయిలో కుమ్ములాటల్లో తాను కూడా భాగస్వామి కావాల్సివస్తుంది. ఒంటరిగా పోరాడాలంటే బీఆర్‌ఎస్‌ ఇం‌కా శైశవావస్థలోనే ఉంది. ఇరవై ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌రాజకీయం అంతా ఉమ్మడి ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణకే పరిమితమైందన్న సంగతిని విస్మరించలేం. మంచి వ్యూహకర్తే అయినా కారుమేఘాల వంటి బీజేపీ వ్యూహాలను ఎలా ఎదు ర్కొంటారో కాలమే నిర్ణయించాలి. ఈ ఉదంతానికి సంబంధించిన విశ్లేషణలకి కొసమెరుపు కేసీఆర్‌ ‌వెంట ఉంటాం అంటున్న వామపక్షాలు బీఆర్‌ఎస్‌ ‌చేసే మేలు ఎంతో  పట్టించుకోవడానికి ఎవరూ ఆసక్తిగా లేరు.

About Author

By editor

Twitter
Instagram