– సుజాత గోపగోని

రూ. 2 లక్షల 90వేల 396 కోట్లతో 2023-24 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఫిబ్రవరి 6న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 11 వేల 685 కోట్ల రూపాయలు కాగా, పెట్టుబడి వ్యయం రూ. 37,524 కోట్లు, ద్రవ్యలోటు రూ. 38,234 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,881 కోట్లుగా పేర్కొన్నారు. హరీశ్‌ ‌తన బడ్జెట్‌ ‌ప్రసంగంలో దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కానీ కేటాయింపులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

కొత్త పథకాల ఊసు లేదు.. గిరిజనబంధు, బీసీ బంధు జాడ లేదు.. కనిపించని నిరుద్యోగ భృతి.. మన ఊరు-మన బడి కార్యక్రమానికి కేటాయింపులే లేవు.. ఇక రైతు రుణమాఫీ, దళితబంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు, మహిళా వర్సిటీ, కేసీఆర్‌ ‌కిట్‌, ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, ఆర్టీసీ, ఆయిల్‌ ‌ఫామ్‌, ‌హైదరా బాద్‌ ‌మెట్రో, వడ్డీలేని రుణాలు, హరితహారం వంటి పథకాలకు గతేడాది ఎన్ని నిధులు కేటాయించారో ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించడం గమనార్హం.

ఎన్నికల బడ్జెట్‌ అయినా కొత్త పథకాలను ప్రకటించలేదు. సరికదా, పాత పథకాల్లో కొన్నిటి ప్రస్తావన కూడా లేదు. గిరిజనులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో గిరిజనబంధు పథకాన్ని ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ పథకానికి బడ్జెట్‌లో తప్పకుండా నిధులు కేటాయిస్తారని గిరిజనులు ఆశించారు. కానీ దాని ప్రస్తావనే లేదు. ఇక గతంలో బడ్జెట్‌లలో కనిపించిన నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా ఈ బడ్జెట్‌లో లేదు. 2018 ఎన్నికల సందర్భంగా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ. 3,016 చొప్పున భృతిని అందజేస్తామని సర్కారు ప్రకటించింది. ఎనిమిది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ పథకం అమలు ఊసు లేదు. ఈ బడ్జెట్‌లో దానికి అసలు చోటు లేదు. నాలుగేళ్లుగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతుల్ని ఊరిస్తున్న సర్కారు.. ఐదో వార్షిక బడ్జెట్‌లోనూ అన్నదాతకు నిరాశే మిగిల్చింది. రుణమాఫీకి  రూ. 6,385 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన నేపథ్యంలో, ఈసారి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ ఈ బడ్జెట్‌లో దాని ప్రస్తావన కూడా లేదు.

ఇక కేసీఆర్‌ ‌మానస పుత్రిక ‘మన ఊరు-మన బడి’. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పథకం బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఇందుకు మూడు దశల్లో రూ. 7,289 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. గత బడ్జెట్‌లో మొదటి దశ కింద రూ. 3,497 కోట్లను కేటాయించింది. ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించింది కూడా. కానీ తాజా బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నీటి పారుదల శాఖ ప్రతిపాదనలకు, ప్రభుత్వ కేటా యింపులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, రుణాల చెల్లింపులకు రూ. 37 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. కానీ సర్కారు 26,868 కోట్లు కేటా యించింది. అంతేకాదు, ఎంఎంటీఎస్‌కు కూడా ఈ బడ్జెట్‌లో మొక్కుబడిగానే నిధులు కేటాయించింది. తన వాటా కింద చెల్లించాల్సిన దాంట్లో కేవలం రూ. 50 కోట్లు ఇచ్చింది. ఎన్నికల ఏడాది కారణంగా ఈసారి సమాచార, పౌర సంబంధాల శాఖకు భారీగా నిధులను కేటాయించింది. ఏకంగా రూ. 1000 కోట్లను కేటాయించింది. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును 61 నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో అదనంగా 8 లక్షల మంది అర్హత సాధించనున్నారు. వీరికి గత ఏడాది నిధులు కేటాయించలేదు. ఈసారి అదనంగా రూ. 271 కోట్లను కేటాయించినందున కొత్తగా ఎంతమందికి ‘ఆసరా’ లభిస్తుందో వేచి చూడాల్సిందే.

తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ఇది. అంటే, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను పక్కన బెట్టి.. జాతీయ స్థాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌ ఇది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న యోచనలో ఉన్న కేసీఆర్‌.. ‘‌జాతీయ ప్రయోజనాలు’ అంటూ కొత్తరాగం అందుకోవడం అనివార్యమైంది. ఫలితంగా ఈ బడ్జెట్‌లో కూడా ఆ మార్క్ ‌కనిపించిం దని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

బడ్జెట్‌ ‌ప్రసంగమా, రాజకీయ ప్రసంగమా?

బడ్జెట్‌ ‌ప్రసంగం కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా కొనసాగిందంటున్నారు విశ్లేషకులు. గత సంస్కృతిని పక్కనబెట్టి బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వ్యాఖ్యానంగా కనిపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి బడ్జెట్‌ ‌ప్రసంగం కేవలం రాష్ట్ర ప్రయో జనాలు, లెక్కా పద్దులు, ప్రభుత్వం గత అంచనాలను ఏమేరకు అందుకుంది. కొత్త అంచనాలను ఎలా అందుకోబోతుందన్న అంశాలపైనే సాగుతుంది. కానీ, ఈసారి హరీష్‌ ‌సాగించిన బడ్జెట్‌ ‌ప్రసంగం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రసంగం కాస్తా రాజకీయ ప్రసంగంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్న వ్యాఖ్యానాలతో హరీష్‌రావు బడ్జెట్‌ ‌ప్రసంగం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అంతేకాదు, కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందన్నారు. ఏదో బడ్జెట్‌ ‌లెక్కా పద్దులు చెబుతున్న క్రమంలో కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న అంతరాలు, గతేడాది ఎదురైన అనుభవా లను గురించి ప్రస్తావించడం కాస్త ఆమోదయోగ్యమే అయినా.. ఈసారి బడ్జెట్‌ ‌ప్రసంగం మొదలుపెట్టడమే కేంద్రాన్ని విమర్శిస్తూ మొదలుపెట్టారు. ఫలితంగా ప్రజల్లో ఒకరకమైన భావనను ముందుగానే చొప్పించేలా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.

మరో ముఖ్య విషయం.. అసలు ఈ యేడాది తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశాలే వివాదాస్పదంగా మొదలయ్యాయి. అసలు సమావేశాలు ఉంటాయా? ఉండవా? బడ్జెట్‌ ఆమోదం పొందుతుందా? లేదా? అలా అయితే, ప్రభుత్వ పాలన ఎలా సాగించాలన్న సందిగ్ధం ప్రభుత్వాన్ని వెంటాడింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అయోమయానికి, ఒకరకమైన భయాందోళనకు గురైందని చెప్పాలి. ఎందుకంటే గవర్నర్‌ ‌రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏకంగా న్యాయస్థానం మెట్లు ఎక్కింది ప్రభుత్వం.

చివరకు గవర్నర్‌ను స్వయంగా కలిసి బడ్జెట్‌కు ఆమోదం వేయించుకొని అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగం ఉండేలా చూసుకున్నారు. ఇక, గవర్నర్‌ ‌ప్రసంగంలో కేంద్రానికి ఏమాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు, బడ్జెట్‌ అం‌చనాలను నెరవేర్చుకుంటున్న తీరును మాత్రమే చేర్చింది. దీంతో, గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌కూడా ప్రభుత్వ బడ్జెట్‌ ‌ప్రసంగ ప్రతిని ఉన్నది ఉన్నట్లు సభలో చదివి వినిపించారు. కానీ, బీఆర్‌ఎస్‌ ‌కోణం, ఆ పార్టీ ఆలోచన అంతా ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రసంగంలో ప్రస్ఫుటించింది.

—————————–

ఏ రంగానికి ఎంత?

ఇక, బడ్జెట్‌ ‌కేటాయింపులు చూస్తే.. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించారు. కీలకమైన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు, డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లకు రూ.12వేల కోట్ల కేటాయింపులు జరిపారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్‌ ‌నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని బడ్జెట్‌ ‌ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.

–              విద్యుత్‌ ‌రంగం రూ.12,727 కోట్లు

–              ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు

–              ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు

–              గిరిజన సంక్షేమం, షెడ్యూల్‌ ‌తెగల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,233 కోట్లు

–              బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

–              కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ‌రూ.3,210 కోట్లు

–              మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు

–              మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు

–              హరితహారానికి రూ.1,471 కోట్లు

–              విద్యారంగానికి రూ.19,093 కోట్లు

–              వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు

–              పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ ‌శాఖకు రూ.31,426 కోట్లు

–              పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు

–              రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు

–              పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు

–              హోం శాఖకు రూ.9,599 కోట్లు

–              కేసీఆర్‌ ‌కిట్‌ ‌కోసం రూ.200 కోట్లు

–              కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE