– జమలాపురపు విఠల్‌రావు

‘‌సప్తర్షి’ పేరుతో ఏడు ప్రాధాన్యాంశాలతో భారత్‌ను హరిత నమూనా దేశంగా ‘అమృత్‌కాల్‌’‌లోకి ప్రవేశింపజేసే లక్ష్యంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఫిబ్రవరి 1న 2023-24 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే మొట్టమొదటి ‘అమృత్‌కాల్‌’ ‌బడ్జెట్‌గా పేర్కొన్నారు. అమృత్‌కాల్‌ అం‌టే సాధికార, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం చోదకశక్తిగా ప్రతిభ ఆధారిత, బలీయమైన ఆర్థికరంగమని చెప్పాలి. ఇందుకోసం ‘సప్తర్షి’ పేరుతో ఏడు అంశాలకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం. అవి వరుసగా.. 1. సమ్మిళిత అభివృద్ధి, 2. చిట్టచివరి వారికి కూడా ప్రయోజనాలు అందేలా చూడటం, యువజన శక్తి, 4. ఆర్థిక రంగం, 5. హరిత అభివృద్ధి, 6. సంభావ్యతలను వెలికి తీయడం, 7. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. వీటితో పాటు భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఈ బడ్జెట్‌ ‌నాలుగు పరిణామాత్మక అవకాశాలను గుర్తించింది. మొదటిది స్వయంసహాయక గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ)ల ద్వారా మహిళల్లో ఆర్థిక సాధికారత సాధన. రెండవది ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ (‌పీఎం వికాస్‌), ‌మూడవది పర్యాటకాన్ని మిషన్‌మోడ్‌లో చేపట్టడం, నాల్గవది హరిత అభివృద్ధి.

2023-24 కేంద్ర బడ్జెట్‌ ‌ప్రధానంగా ‘సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌’ ‌పేరుతో సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసేవిధంగా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల నల్లా కనెక్షన్లు అందించడం, పీఎం కిసాన్‌ ‌కింద 11.4 కోట్ల మంది రైతులకు రూ. 2.2 లక్షల కోట్ల నగదు బదిలీ, పీఎంఎస్‌బీవై& పీఎంజేజేవై కింద రూ. 44.6 కోట్ల మేర బీమా సదుపాయం. రూ.47.8 కోట్ల పీఎం జన్‌ధన్‌ ‌బ్యాంకు ఖాతాలు, 102 కోట్ల మందికి 220 కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ల అందజేత, ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, ఎస్‌బీఎం కింద 11.7 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి.. ఇవన్నీ విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇదే సమయంలో రైతులు, మహిళలు, యువత, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ బడ్జెట్‌ ‌విశిష్టత.

వీటితో పాటు జమ్ముకశ్మీర్‌, ‌లద్ధాఖ్‌, ఈశాన్య ప్రాంతాలకు ఈ బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం లభించింది. మరో ముఖ్య విశేషమేంటంటే 2019లో తొలిసారిగా అమల్లోకి తెచ్చిన రెండు మార్గాల అభివృద్ధి వ్యూహానికి ఇందులో ప్రాధాన్యమివ్వడం. మొదటిది ప్రైవేటు రంగానికి తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం. రెండవది ‘ప్రభుత్వ తక్కువ ప్రమేయంతో అధిక పాలన’కు దోహదం చెయ్యడం. అంటే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, మౌలిక సదుపాయాలకు అత్యధిక కేటాయింపులు జరపడం పెట్టుబడులను ఆకర్షించా లన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. దీంతోపాటు వ్యవసాయం, విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, రైల్వేలకు ఈ బడ్జెట్‌ ఎం‌తో ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వానికి ఇంతటి దూరదృష్టి ఉండటం వల్లనే జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక ప్రగతి 6 నుంచి 6.8% ఉండగలదని అంచనా వేసింది.

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో కోటి మంది రైతులతో ఈ తరహా వ్యవసాయాన్ని నిర్వహింపచేయాలన్న లక్ష్యంలో భాగంగా పది వేల ‘భారతీయ ప్రాకృతిక్‌ ‌ఖేతీ బయో ఇన్‌పుట్‌’ ‌కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం ‘అగ్రికల్చరల్‌ ‌యాక్సిలరేటరీ ఫండ్‌’‌ను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ యువ ఔత్సాహికులు ‘అగ్రి-స్టార్టప్‌’‌లను నెలకొల్పేలా వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ‘శ్రీఅన్న’ కార్యక్రమానికి భారత్‌ను గ్లోబల్‌ ‌హబ్‌ను చేయాలన్న లక్ష్యంతో హైదరా బాద్‌లోని ‘భారత చిరుధాన్య పరిశోధనా సంస్థ’ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మిల్లెట్‌ ‌రీసెర్చ్)‌ను శ్రేష్ఠతా కేంద్రంగా మలిచేందుకు కేంద్రం తగిన చేయూతను ఇస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, చిరుధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని ఉత్తమ విధానాలను అనుసరించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయడానికి కేంద్రం తోడ్పాటునిస్తుంది. సమ్మిళిత రైతు ప్రాధాన్య పరిష్కారాలను సాధించడంతో పాటు వ్యవసాయ-సాంకేతిక పరిశ్రమ, స్టార్టప్‌లకు మరింత దన్నునివ్వడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయానికి డిజిటల్‌ ‌మౌలిక సదుపాయాలను ఓపెన్‌ ‌సోర్స్‌లు, నిజ ప్రమాణాలతో కల్పిస్తుంది. పశువుల పెంపకం, పాడిపరిశ్రమ రంగాలకు వ్యవసాయ రుణాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు సంబంధించి రూ.6 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో ఒక ఉప-పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నది. ముఖ్యంగా మత్స్యకారులు, చేపల అమ్మకందార్లు, సూక్ష్మ,చిన్న సంస్థల కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం కల్పించడం ద్వారా విలువల సామర్థ్యాలతో పాటు మార్కెట్‌ను మరింత విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేశంలోని 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరించేందుకు రూ.2,516 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ‘సహకార్‌ ‌సే సమృద్ధి’ విజన్‌ ‌కింద రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వికేంద్రీకణ పద్ధతిలో వచ్చే ఐదేళ్ల కాలంలో కోల్డ్ ‌స్టోరేజీలను నిర్మిస్తారు. ముఖ్యంగా సహకార సంఘాలు లేని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే చాలాకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ‌పెట్టే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమర్‌ ‌స్పష్టం చేయడం గమనార్హం.

సముద్ర తీర ప్రాంతాల్లో అడవు విస్తీర్ణాన్ని పెంచే పక్రియలో భాగంగా, మడ అడవుల వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ‘కాంపా’ నిధులను ఇందుకోసం వినియోగించడం ద్వారా ఆయా ప్రాంతాల వాసులకు జీవనోపాధి కల్పిస్తారు. తేమ నేలల పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ‘అమృత్‌ ‌ధరోహర్‌’ ‌పథకం కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా సూక్ష్మ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల తయారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

ఈసారి బడ్జెట్‌లో విశేషమేంటంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం రూ. 10 ట్రిలియన్లు ఖర్చు చేయనుండటం. నిజంగా ఇది తలలు పండిన ఆర్థికవేత్తలను కూడా ఆశ్చర్యపరచిన అంశం. ముఖ్యంగా ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధం నేపథ్యంలో మారిన ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, చైనాలో కొవిడ్‌ ‌విలయం, జీరో కొవిడ్‌ ‌పాలసీ వల్ల కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో.. భారత్‌ ‌తన విశిష్ట విదేశాంగ విధానంతో ప్రపంచ రాజకీయ క్షేత్రంలో ఎంతో కీలక స్థానానికి ఎదిగింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనే విదేశీ పెట్టుబడులకు రాచబాట వేస్తాయన్న దృఢనిశ్చయానికి ప్రభుత్వం రావడమే ఈ రంగానికి అత్యధిక నిధులను కేటాయించడానికి ప్రధాన కారణం. ఇప్పటికే ప్రైవేటు రంగ దిగ్గజాల నుంచి ఈ నిర్ణయానికి సానుకూలత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లార్సెన్‌&‌టుబ్రో, సీమెన్స్, ‌థర్మాక్స్, ‌హెచ్‌సీసీ, టాటా సంస్థలు తమకు ఆర్డర్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో మూలధన పెట్టు బడులను ఒక్కసారిగా పెంచడం వల్ల ఊపందుకునే డిమాండ్‌కు అనుగుణంగా ప్రైవేటు సంస్థలు తమ సామర్థ్యాలను పెంచుకోక తప్పదు. ఇప్పటికే ఆయా సంస్థల సామర్థ్య వినియోగ స్థాయి 75 శాతానికి చేరుకుంటుండగా, ప్రభుత్వ నిర్ణయం కారణంగా రైల్వేలు, మౌలిక సదుపాయాల రంగాల నుంచి డిమాండ్లు ఒక్కసారిగా పెరిగిపోతాయని ఆయా దిగ్గజ కంపెనీల నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్య వినియోగ స్థాయిని ప్రైవేటు రంగ సంస్థలు మరింత పెంచుకుంటేనే డిమాండ్‌ను తట్టుకోగలవు. సిమెంట్‌, ‌స్టీలు, రైల్వే వ్యాగన్లు, ట్రక్కులు, ట్రాక్టర్ల డిమాండ్‌ ‌పెరుగుతుందని అంచనా.

గత ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు రూ. 7.5 ట్రిలియన్లు కేటాయించగా ఈసారి 30శాతం పెంచి రూ. 10 ట్రిలియన్లను ప్రభుత్వం ఈ రంగానికి కేటాయించడం అందరినీ ఆశ్చర్య పరచింది. గత ఏడాది ఈ రంగానికి కేటాయించిన రూ. 7.5 ట్రిలియన్లు అంతకుముందు ఏడాది కంటే 35% అధికం. ఈ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం మౌలిక వసతులకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నదీ అర్థమవుతుంది. అంతేకాదు ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) పెరుగుదల గణనీయంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల కోసం తమ బడ్జెట్‌లో 20-25 శాతం కేటాయిస్తున్న వివిధ రాష్ట్రాల అభివృద్ధికి, కేంద్రం ఈసారి 30 శాతం అధిక నిధుల కేటాయింపు మరింత ఊతమివ్వగలదు.

విద్యారంగానికి..

విద్యారంగానికి 2023-24వ బడ్జెట్‌లో రూ. 1,12,899.47 కోట్లు కేటాయించారు. డిజిటల్‌ అభ్యసనానికి ప్రభుత్వం ఒక్కసారిగా ప్రాధాన్యం ఇవ్వడంతో వచ్చే ఏడాది ఈ దిశగా డిజిటల్‌ ‌మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ది చేయాల్సి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. సమగ్ర శిక్షా అభియాన్‌, ‌మధ్యాహ్న భోజన పథకానికి నిధులను పెంచారు. ప్రధానమంత్రి కౌశల్‌ ‌వికాస్‌ ‌యోజన 4.0ను నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటిస్తూ ఈ పథకం కింద రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలోని లక్షలాది యువతకు ఆధునిక కృత్రిమ మేధస్సు రంగంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాభి వృద్ధిపై, ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కోడింగ్‌, ‌కృత్రిమ మేధ, రోబోటిక్స్, ‌మెకట్రానిక్స్, ఐఓటీ, 3డి ప్రింటింగ్‌, ‌డ్రోన్స్, ‌సాఫ్ట్ ‌స్కిల్స్ ‌వంటి అంశాల్లో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించేలా చేయాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్‌ ఇం‌డియా ఇంటర్నేషనల్‌ ‌సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు ప్రముఖ విద్యాసంస్థల్లో కృత్రిమ మేధకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

రక్షణ, శాస్త్ర-సాంకేతిక రంగాలకు..

2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ. 5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత కేటాయింపులు (రూ.5.25 లక్షల కోట్లు) కంటే 13% అధికం. 2021-22తో పోలిస్తే 2023-24లో రెవెన్యూ వ్యయం కింద ప్రభుత్వం దాదాపు రెట్టింపు మొత్తం కేటాయింపులు జరపడం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరింత ఊపందుకోగలదు. ఈ ఏడాది ఇందుకోసం కేటాయించింది రూ. 2,39,000 కోట్లు. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన సేలా సొరంగం, నిఛిపు సొరంగం, సెలా-ఛబ్రెల్లా టన్నెల్‌ ‌వంటి నిర్మాణాలకు మరింత ప్రోత్సాహం లభించగలదు. పాకిస్తాన్‌, ‌చైనాల నుంచి పొంచి ఉన్న ప్రమాదం నేపథ్యంలో రక్షణ రంగంలో చేపట్టే పెట్టుబడి వ్యయం స్వావ లంబన సాధనకు అత్యంత కీలకం. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించి, దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2015-16లో రక్షణ రంగ పరికరాల ఎగుమతులు కేవలం రూ. 1521 కోట్లు కాగా, 2021-22 నాటికి ఏకంగా రూ. 12,815 కోట్లకు పెరిగాయి. ఇదిలా ఉండగా డ్రోన్‌లు, వాటికి సంబంధించిన పరికరాల్లో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో 2022 సెప్టెంబర్‌లో కేంద్రం పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు)ను ప్రకటించింది.

ఈ బడ్జెట్‌లో శాస్త్ర-సాంకేతిక రంగాలకు రూ. 16, 361 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌ ‌కంటే ఈసారి రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. గత ఏడాది ఈ మంత్రిత్వశాఖకు అందిన నిధులు రూ.14,217.16 కోట్లు. కృత్రిమ మేధకు సంబం ధించి కొత్త కేంద్రాల ఏర్పాటుతో పాటు పలు పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్న లక్ష్యం కారణంగా ఈ కేటాయింపులు పెరిగాయి.

రైల్వేల ఆధునీకరణ కోసం..

2023-24 బడ్జెట్‌ ‌భారత రైల్వేల ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రైల్వేలకు ఈ ఏడాది కేటాయించిన మొత్తం రూ.2,41,267.21 కోట్లు. 2013-14 నాటి కేటాయింపుతో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు అధికం. ఈ మొత్తంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త లైన్ల నిర్మాణం, నేరోగేజ్‌ ‌లైన్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం, కొత్త వంతెనలు, టన్నెల్స్ ‌నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో అమృత్‌ ‌భారత్‌ ‌పథకం కింద దేశంలోని 1275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ విజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ మరిన్ని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌లను ఉత్పత్తి చేయడానికి ముందడుగు వేస్తోంది. హర్యానాలోని సోనేపట్‌, ‌మహారాష్ట్రలోని లాతూర్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేల్లిలో వీటి ఉత్పత్తిని చేపడతారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీలో మాత్రమే వీటి ఉత్పత్తి జరుగుతోంది. 2023 డిసెంబర్‌ ‌నాటికి దేశంలో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. వీటి డిజైన్‌, ఉత్పత్తి పూర్తిగా దేశీయంగా చేపడతారు. మొట్టమొదటి హైడ్రోజన్‌ ‌రైలు కల్కా-సిమ్లా హెరిటేజ్‌ ‌మార్గంలో పరుగులు పెట్టనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం పూర్తిగా విద్యుత్‌పై ఆధార పడటాన్ని తగ్గించే పక్రియలో భాగంగా ‘ఆల్ట్రా మెగా సోలార్‌ ‌ప్లాంట్లను’ నిర్మించనుంది. ఇదిలా ఉండగా దేశంలో 85 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పూర్తికావడం గమనార్హం. ముంబయి-అహమ్మదాబాద్‌ ‌మధ్య బుల్లెట్‌ ‌రైలు పనులు మరింత వేగం పుంజు కోనున్నాయి. ఇదే సమయంలో కేంద్రం ఆర్థిక, సామాజిక కారిడార్‌లను అనుసంధానించే పక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పర్వత, గిరిజన ప్రాంతాలను కలిపే విధంగా ‘జనజాతి గౌరవ్‌’ ‌కారిడార్‌, అదేవిధంగా సిమెంట్‌, ‌పోర్టుల కోసం ఎనర్జీ కారిడార్‌, ‌సాగరమాల కారిడార్‌లను నిర్మించనుంది. పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌ ‌గౌరవ్‌ ‌కింద మరిన్ని సర్క్యూట్‌ ‌రైళ్లను ప్రవేశపెడతారు. ఇక దక్షిణ రైల్వేకు కేటా యించిన నిధుల్లో సింహభాగం తమిళనాడుకే దక్కడం గమనార్హం. కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్‌లో కొంతభాగం ఈ రైల్వే విభాగం కిందికి వస్తాయి.


మీకు తెలుసా?

రాజ్యాంగంలోని 112వ అధికరణ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. భారత్‌కు సంబంధించిన తొలి బడ్జెట్‌ను 1860, ఫిబ్రవరి 18న స్కాటిష్‌ ఆర్థికవేత్త జేమ్స్ ‌విల్సన్‌ ‌ప్రవేశపెట్టాడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ను 1947, నవంబర్‌ 26‌న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. 1950లో బడ్జెట్‌ ‌లీక్‌ ‌కావడంతో దీని ప్రింటింగ్‌ను రాష్ట్రపతి భవన్‌ ‌నుంచి మింటో రోడ్‌లోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి నార్త్ ‌బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రెస్‌లో ప్రచురిస్తున్నారు. 1955-56 నుంచి బడ్జెట్‌ ‌ప్రతులను ఇంగ్లిష్‌, ‌హిందీ భాషల్లో ప్రచురించడం మొదలైంది. అప్పటివరకు ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రచురితమయ్యేది.

–          బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు.

–          బడ్జెట్‌కు ఫ్రెంచ్‌ ‌భాషకు చెందిన ‘బౌగెట్టి’ ((bougette)) అనేది మూలపదం. బౌగెట్టి అంటే ‘చిన్న సంచి’ అని అర్థం. బ్రిటన్‌ ఆర్థికమంత్రి బడ్జెట్‌ ‌పేపర్లను ఈ చిన్న సంచిలోనే తీసుకొస్తారు.

–          కేంద్ర బడ్జెట్‌ ‌ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది. 1. యాన్యువల్‌ ‌ఫైనాన్సియల్‌ ‌స్టేట్‌మెంట్‌ (‌వార్షిక ఆర్థిక నివేదిక), 2. డిమాండ్‌ ‌ఫర్‌ ‌గ్రాంట్స్. ‌రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై ఇచ్చే స్థూల వివరణే వార్షిక ఆర్థిక నివేదిక. ఇక డిమాండ్‌ ‌ఫర్‌ ‌గ్రాంట్స్… ‌దీన్ని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ‌రూపంలో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అపాప్రియేషన్‌ ‌బిల్లు ఆమోదం పొందే వరకు ప్రభుత్వం సంచిత నిధి నుంచి నగదును విత్‌‌డ్రా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

–          ఆర్థికమంత్రి బడ్జెట్‌ ‌ప్రసంగం చేసిన తర్వాత, దీనిపై లోక్‌సభలో చర్చ, ఓటింగ్‌ ‌జరుగుతాయి.

–         కేంద్ర బడ్జెట్‌లో ‘మధ్య సంవత్సర సమీక్ష’ కూడా భాగంగా ఉంటుంది. అర్ధవార్షిక నివేదిక రూపంలో దీనిని ప్రవేశపెడతారు. ప్రభుత్వ ఆర్థిక పనితీరు ఎలా ఉన్నదనేది ఇది వెల్లడిస్తుంది.

–          కేంద్ర బడ్జెట్‌లో ‘ఆర్థిక సర్వే’ కూడా భాగం. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు రూపొందిస్తారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థూల రూపాన్ని తెలియజేస్తుంది.

–          ఆర్థిక బిల్లు కూడా కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఉంటుంది. బడ్జెట్‌ అమలుకు శాసనపరమైన ప్రతిపాదనలు ఇందులో ఉంటాయి.

–          ఇప్పటివరకు సుదీర్ఘ బడ్జెట్‌ ‌ప్రసంగం చేసిన ఘనత ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కుతుంది. ఆమె రెండు గంటల 42 నిమిషాల పాటు ఏకబిగిన ప్రసంగించారు.

–          2019లో నిర్మలా సీతారామన్‌ అప్పటివరకు బడ్జెట్‌ ‌పేపర్లను తీసుకు వచ్చే బ్రీఫ్‌కేస్‌ల స్థానంలో ‘బాహి ఖాతా’ (క్లాత్‌ ‌లెడ్జర్‌)‌ను ఉపయో గించడం మొదలుపెట్టారు. దీనిపై భారత చిహ్నం ఉంటుంది. బ్రిటిష్‌వారి కాలంలో అప్పటి ఆర్థిక మంత్రులు ‘గ్లాడ్‌స్టోన్‌ ‌బాక్స్’‌ను ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో దీని స్థానాన్ని బ్రీఫ్‌కేస్‌ ఆ‌క్రమించింది.

–          బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ ‌గుర్తింపు పొందారు. అలాగే పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్‌.

–          1970-71 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరాగాంధీ.

–  సాధారణంగా బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. కానీ 1958-59లో తొలిసారి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ  ప్రవేశ పెట్టారు. తర్వాతి కాలంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధాని హోదాలో బడ్జెట్‌ను ప్రవేశప్టెడం గమనార్హం.

–          మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా పది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తర్వాతి స్థానాల్లో వరుసగా చిదంబరం (9 సార్లు), ప్రణబ్‌ ‌ముఖర్జీ (8 సార్లు), యశ్వంత్‌ ‌సిన్హా (8 సార్లు), మన్మోహన్‌ ‌సింగ్‌ (6 ‌సార్లు) ఉన్నారు.

– 1973-74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత రావ్‌ ‌బి. చవాన్‌ ఏకంగా రూ.550 కోట్ల లోటుతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో దానికి ‘బ్లాక్‌ ‌బడ్జెట్‌’ అనే పేరు స్థిరపడిపోయింది.

–          2017 నుంచి రైల్వే బడ్జెట్‌ను, ఆర్థిక బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టడం మొదలైంది. అదేవిధంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం కూడా అదే ఏడాది నుంచి ప్రారంభం కావడం గమనార్హం. వీటన్నింటికి కారకుడు అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ ‌జైట్లీ.


తెలుగు రాష్ట్రాలకు…

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో రూ.12,824 కోట్లు కేటాయించగా ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించారు. తెలంగాణకు కేటాయింపు గత ఏడాదితో పోలిస్తే 45% అధికం. భూసేకరణ, ఇతర విషయాల్లో ఆంధప్రదేశ్‌ ‌నుంచి మంచి సహకారం లభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ‌వివరించారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ ‌కార్యాలయ భవనం డిజైన్‌ ‌పూర్తిచేసి త్వరలోనే పనులు ప్రారం భించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాజీపేటకు ఓవర్‌హాలింగ్‌, ‌మరమ్మతుల ఫ్యాక్టరీ మంజూరైంది. ఓవర్‌హాలింగ్‌, ‌వేగన్‌ల తయారీకి పెద్ద తేడా లేనందువల్ల ఇక్కడ వేగన్ల తయారీ ఫ్యాక్టరీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎంఎంటీఎస్‌ ‌రెండో దశ ప్రాజెక్టుకు రూ.600 కోట్లు కేటాయించడం హైదరాబాద్‌ ‌వాసులకు ఊరట కలిగించే అంశం. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.185 కోట్లు కేటాయించిన మనోహరాబాద్‌-‌కొత్తపల్లి 151 కిలో మీటర్ల రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి మూడోవంతు ఖర్చు భరిస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.1160 కోట్లు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం మనోహరాబాద్‌-‌కొడగండ్ల మధ్య 44 కి.మీ. దూరం రైల్వేలైన్‌ ‌పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్‌- ‌మునీరాబాద్‌ ‌మధ్య 244 కి.మీ. రైల్వే మార్గానికి రూ. 345 కోట్లు కేటాయించారు. ఈ మార్గం తెలంగాణలో 68 కి.మీ., మహారాష్ట్రలో 178 కి.మీ. ఉన్నది. ప్రస్తుతం 54 కి.మీ. దూరం పూర్తి కావడంతో మహబూబ్‌నగర్‌ ‌నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రైళ్లు నడిచేందుకు మార్గం సుగమం అయింది.

భద్రాచలం-కొవ్వూరు 151 కి.మీ. మార్గానికి రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ.2,154.83 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని విమర్శలు వినిపిస్తున్నాయి. మణుగూరు- రామగుండం మధ్య 200 కి. మీ. మార్గానికి అంచనా వ్యయం రూ. 1,112 కోట్ల నుంచి ఏకంగా రూ. 2,911 కోట్లకు పెరిగింది. మరి ఈ ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రూ.10 కోట్లు! అదే విధంగా విజయవాడ-కాజీపేట, కాజీపేట-బలార్షా, మూడోలైను పనులకు రూ. 337.52 కోట్లు, రూ. 450.86 కోట్లు నిధులు కేటాయించారు. ఇక బీబీనగర్‌-‌గుంటూరు మధ్య డబ్లింగ్‌ ‌పనులకు రూ.60 కోట్లు కేటాయించారు.


బడ్జెట్‌ ఆమోదానికి  పార్లమెంట్‌లో ఆరు దశలు!

– బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం.

– బడ్జెట్‌పై సాధారణ చర్చ

– డిపార్ట్‌మెంటల్‌ ‌కమిటీల స్కూృటినీ

– డిమాండ్‌ ‌ఫర్‌ ‌గ్రాంట్స్‌పై ఓటింగ్‌

– అ‌పాప్రియేషన్‌ ‌బిల్లు (వినియోగాధికారమిచ్చే చిత్తు చట్టం) ఆమోదం.

– ఫైనాన్స్ ‌బిల్లుకు ఆమోదం తెలపడం.

ఆర్థిక మంత్రిత్వశాఖ కింద పనిచేసే, డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ అఫైర్స్‌కు చెందిన బడ్జెట్‌ ‌డివిజన్‌.. ‌బడ్జెట్‌ ‌తయారీకి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.


పెరగనున్న భారతీయ కంపెనీల పెట్టుబడులు

రానున్న కాలంలో భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. టాటా కంపెనీలు రాబోయే ఐదేళ్ల కాలంలో సెమీ కండక్టర్లు, మొబైల్‌ ‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ‌రంగాల్లో 90 బిలియన్‌ ‌డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నాయి. అదేవిధంగా ఆదానీ గ్రూపు 2023 నాటికి 107 బిలియన్‌ ‌డాలర్లు, రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ 76 ‌బిలియన్‌ ‌డాలర్లు క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు చేసిన కేటాయింపులు ఆయా కంపెనీలకు ప్రయోజనకరం కాగలవు. ఆదిత్య బిర్లా గ్రూపు కూడా క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల వైపు దృష్టిపెడు తోంది. దీనికి తోడు రైల్వేలకు రూ. 2.4 ట్రిలియన్‌ల కేటాయింపు ద్వారా రైల్వే వ్యవస్థలో మరిన్ని ఆధునిక, మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాగలదు. దీంతో రైల్వే వ్యవస్థ కూడా గణనీయమైన మార్పులకు లోనుకావడం తథ్యం.

హరిత ఇంధనాలకు ప్రోత్సాహం

రాబోయే కాలంలో కార్బన్‌ ‌రహిత, హరిత ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా దేశంలో పరిణామాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఈ బడ్జెట్‌లో ప్రధానాంశం. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 35వేల కోట్లు కేటాయించడమే కాదు, 5 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ విధంగా దేశంలో వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ‘పంచామృతం’ పేరుతో ప్రకటించిన పర్యావరణహిత చర్యలు చేపట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాల న్నది బడ్జెట్‌లోని మరో ముఖ్య విషయం. ముఖ్యంగా 2070 నాటికి దేశం ‘కర్బన ఉద్గార రహితం’గా మారడానికి అనువైన పర్యావరణ హిత జీవనశైలిని ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ లక్ష్యం. తీర ప్రాంత షిప్పింగ్‌లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడంపై కూడా ఈ బడ్జెట్‌ ‌దృష్టి పెట్టింది. అంతేకాదు హరిత సాధనలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తొలగించేందుకు ‘వెహికిల్‌ ‌స్క్రాపింగ్‌ ‌పాలసీ’ని కూడా ఈ బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు ‘జాతీయ హరిత హైడ్రోజన్‌ ‌మిషన్‌’ ఒక ఉత్ప్రేరకంగా పని చేయ గలదు. ఈ రంగంలో భారత్‌ను మార్కెట్‌ ‌లీడర్‌గా నిలిపే లక్ష్యంతో ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.19, 700 కోట్లు (2.4 బిలియన్‌ ‌డాలర్లు) కేటా యించింది. ఇంధన మార్పును దృష్టిలో ఉంచుకొని దేశంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం విశేషం. ఇందుకోసం దేశవ్యాప్తంగా పట్టణాల్లో సంస్కరణల అమలు ప్రణాళికను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుంది. ముఖ్యంగా భూవనరుల సమర్థ వినియోగం, పట్టణ ప్రాంతాల్లో స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది.

ఇంధన నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి

ఇంధన రంగంలో మరింత సుస్థిరత సాధించా లంటే ఇంధన నిల్వ సామర్థ్యం గల బ్యాటరీల ఉత్పత్తి అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా 4 వేల మెగావాట్‌ ‌పవర్‌ ‌బ్యాటరీ ఇంధన నిల్వను సాధించే పక్రియకు మద్దతుగా ప్రభుత్వం తగిన నిధులను కేటాయించింది. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్‌ అలవాట్లలో మార్పు, ‘గ్రీన్‌ ‌క్రెడిట్‌ ‌పోగ్రామ్‌’ ‌వంటివి ప్రస్తుత పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద నోటిఫై చేస్తారు. తద్వారా బాధ్యతాయుతమైన రీతిలో పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టే కంపెనీలు, వ్యక్తులు, స్థానిక సంస్థలకు తగిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. ‘పీఎం ప్రణామ్‌’ (‌పీఎం పోగ్రామ్‌ ‌ఫర్‌ ‌రిస్టోరేషన్‌, అవేర్‌నెస్‌, ‌నరిష్‌మెంట్‌ అం‌డ్‌ ఎమిలియోరేషన్‌ ఆఫ్‌ ‌మదర్‌ ఎర్త్) ‌పథకం ద్వారా ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని , రసాయన ఎరువుల సమతుల్య వాడకాన్ని ప్రోత్సహిం చడం ప్రభుత్వం లక్ష్యం. ‘గోబర్థన్‌’ ‌పథకం కింద సర్క్యులర్‌ ఎకానమీ నమూనా సాధన కోసం దేశంలో 500 సరికొత్త ‘వేస్ట్ ‌టు వెల్త్’ ‌ప్లాంట్లను నెలకొల్పు తారు. వీటిల్లో పట్టణ ప్రాంతాల్లో 75 కంప్రెస్డ్ ‌బయోగ్యాస్‌ ‌ప్లాంట్లతో కలుపుకొని మొత్తం 200 ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మరో 300 ప్లాంట్లను క్లస్టర్ల వారీగా నెలకొల్పుతారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దీనివల్ల వ్యర్థాలు లూప్‌లో చాలాకాలం కొనసాగ డంతో వ్యర్థాల ఉత్పత్తి తగ్గిపోయి, పర్యావరణ మార్పులను కనిష్ఠస్థాయికి కుదించవచ్చు.

తాలిబన్‌ ‌హర్షం

బడ్జెట్‌లో మరో విశేషమేమంటే, ఆఫ్ఘానిస్తాన్‌కు 25 మిలియన్‌ ‌యూఎస్‌ ‌డాలర్ల సహాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించడం. ఆఫ్ఘానిస్తాన్‌ అభివృద్ధికి రూ.200 కోట్లు అభివృద్ధి సహాయం అందించేందుకు భారత్‌ ‌నిర్ణయించింది. తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టిన తర్వాత భారత్‌ ఆ ‌దేశానికి ఆర్థిక సహాయం అందించడం ఇది రెండోసారి. భారత్‌ అం‌దిస్తున్న ఈ సహాయాన్ని తాలిబన్‌ ‌స్వాగతించడం సహజ పరిణామమే. భారత్‌ అం‌దిస్తున్న ఈ మద్దతు వల్ల రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత బలోపేతం కాగలవని తాలిబన్‌ ‌సంప్రదింపుల ప్రతినిధి బృందం మాజీ సభ్యుడు సుహైల్‌ ‌షాహీన్‌ ‌పేర్కొన్నాడు. ఆఫ్ఘానిస్తాన్‌లో భారత్‌ ‌చేపట్టిన వివిధ ప్రాజెక్టులు ప్రస్తుతం ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో, వాటి పనులను తిరిగి చేపట్టాలంటూ తాలిబన్లు భారత్‌ను కోరుతున్నారు.

ఉపసంహారం

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నప్పటికీ, ఏ విధమైన జనాకర్షక పథకాల జోలికి పోకుండా కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తూ కొనసాగిన బడ్జెట్‌ ఇది. ముఖ్యంగా మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల క్రమంలో పెట్టుబడు లను ఆకర్షించేందుకు తీసుకునే తక్షణ చర్యల్లో భాగంగా మౌలిక సదుపాయాలకు అత్యధిక కేటాయిం పులు జరపడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. అయితే మైనారిటీలకు కేటాయింపులు తగ్గాయంటూ కొన్ని రాజకీయ పార్టీలు రగడ చేయడంలో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజ నాలు అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా వీటిని అడ్డంపెట్టుకొని పబ్బం గడుపు కుంటున్న దళారీలకు దెబ్బతగిలింది. దీన్ని గమనించకుండా ఏదోవిధంగా ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమంలో భాగమే ఈ విమర్శలని గుర్తించాలి. రైల్వేలు, విద్య, రక్షణ, శాస్త్ర సాంకేతిక, తయారీ, సేవల రంగాల్లో భారత్‌ ‌మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ఈ బడ్జెట్‌ ‌దోహదం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

– వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్


చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు ‘శ్రీఅన్న’

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 45.03 ‌లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ను స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌స్వాగతిస్తోంది. ఇది భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, సమ్మిళిత అభివృద్ధిని సూచించే విధంగా ఉంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ భారత్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.8% వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక సర్వేలో పేర్కొనడం భారతదేశ దృఢమైన ఆర్థిక నిర్మాణానికి చిహ్నం. ఈ బడ్జెట్‌ను భారతదేశం వచ్చే 25 సంవత్సరాలలో పయనించే అమృతకాల మార్గానికి పునాదిగా భావించవచ్చు. సమ్మిళిత, ఆర్థిక అభివృద్ధితో భారతీయుల జీవన విధాన నాణ్యతను మెరుగుపరచడం ఈ ‘అమృత కాలం’ లక్ష్యం. ఈ బడ్జెట్‌తో అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరువవుతాయి.

అంతేకాదు, ఈ బడ్జెట్‌ ‌సమతుల్యంగా, నిర్మాణాత్మకంగా భారతదేశ భవిష్యత్‌కు ఆశాజనకంగా ఉందని స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ అభిప్రాయ పడుతోంది. యువత సామర్థ్యాన్ని వెలికితీయడం, బలమైన, స్థిరమైన స్థూల-ఆర్థిక మూలాలను కలిగి ఉండడం ద్వారా ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి దోహద పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో చివరి వ్యక్తినీ చేరుకోవడానికి ఏడు ప్రాధాన్యతల (సప్తరుషి)తో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి విశ్వకర్మను ఉటంకిస్తూ జ్ఞానసమాజాన్ని తయారు చేసేందుకు, కులవృత్తులను ప్రోత్సహించడానికి ‘యువశక్తి’ని లక్ష్యంగా చేసుకుని నూతన పథకాలను ప్రవేశ పెట్టనున్నామని చెప్పడం ప్రశంసనీయం. కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడానికి, పర్యావరణ అనుకూల ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడానికి గ్రీన్‌ ‌గ్రోత్‌పై ఇది దృష్టి సారించింది.

బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా విస్తరించిన సంచార జాతులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావడానికి తొలిసారిగా ప్రిమిటివ్‌ ‌వల్నరబుల్‌ ‌ట్రైబల్‌ ‌గ్రూప్స్ (PMTGs) కోసం రూ. 15,000 కోట్లు కేటాయించారు. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ (‌చిరుధాన్యాలు) సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘శ్రీఅన్న’ పథకం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తిని మరింత ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే భారతదేశం చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉండటం తెలిసిందే. నూతన పథకంతో దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు పండిస్తున్న రైతులందరూ లబ్ధి పొందనున్నారు. అలాగే ప్రజలకు అత్యంత పోషకాహారం లభించనున్నది.

దేశంలోని MSMEలకు ఉపశమనం కలిగించే వివాద్‌ ‌సే విశ్వాస్‌-1, ‌వివాద్‌ ‌సే విశ్వాస్‌-2‌ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ బడ్జెట్‌ ‌MSMEల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. స్టార్టప్‌లపైనా దృష్టి సారించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడాన్ని కూడా స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌స్వాగతిస్తోంది. ఇది దేశంలోని నిమ్న-మధ్య ఆదాయ వర్గాలకు, వేతనజీవులకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం ఆయా వర్గాల జీవననాణ్యత, జీవనశైలి మెరుగుదలకు దోహద పడుతుంది. మూలధన వ్యయాన్ని రూ. 13.7 లక్షల కోట్ల వరకు పెంచడాన్ని కూడా స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ అభినందిస్తోంది. ఇది సమీప భవిష్యత్తులో రెట్టింపు ప్రభావాన్ని చూపుతుంది. మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు మొదలైన వాటి విస్తరణ వల్ల యువతరం ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని చెప్పడంలో సందేహం లేదు.

– డాక్టర్‌ ‌సత్తులింగమూర్తి, స్వదేశీజాగరణ్‌ ‌మంచ్‌, ‌దక్షిణ మధ్య క్షేత్ర సహ సంయోజక్‌

About Author

By editor

Twitter
Instagram