– కళారత్న డా।। జి.వి. పూర్ణచందు, 9440172642

సాక్షి తాంబూలం

ఆరె కులం వారి వివాహ పద్ధతులు వివరిస్తూ డా।। బిట్టు వెంకటేశ్వర్లు ‘‘తోలు బొమ్మలాటల ప్రదర్శనం’’ అనే గ్రంథంలో సాక్షి తాంబూలం గురించి కొన్ని వివరాలు రాశారు: ‘‘ఏ తెగవారు ఆ తెగలోనే పెండిండ్లు చేసుకుంటారు. నిశ్చయమైన సమయానికి వరుడు లేకపోతే పిల్లవాడి వస్తువేదయినా పెండ్లిపీటల మీద పెట్టి తలంబ్రాలు పోస్తారు. ముఖ్యంగా కత్తికి పోస్తారు. శివాజీకి వారసులం అని, అందువల్ల అట్టా పోయడం ఆచారం అని చెప్పుకుంటారు. ముందుగా సాక్షి(నిశ్చయ) తాంబూలం పెట్టుకుంటారు. కులం వారందరిని పిలిచి భోజనం పెట్టి కంచు పళ్లెం మీద గాని, గంటమీద గాని మోగిస్తే ఫలానా వాళ్ల పిల్లను, ఫలానా వాళ్ల పిల్లవాడు చేసుకుంటున్నాడని అర్థం. ఒక పీటమీద దుప్పటి పరచి, దాన్ని ఆ ప్రదేశం మధ్యలో పెట్టి దానిమీద తాంబూలం పెట్టి, దాని చుట్టూ అంతా కూర్చున్న తర్వాత ఇట్లా కొడతారు, దానికి ఆంతా అంగీకారం తెలుపవలసి ఉంటుంది. అంతేకాదు, మేనరికం వారున్నట్లైతే అభ్యంతరం అప్పుడే చెప్పాలి.. తర్వాత తాంబూలం అందరికీ పంచుతారు’’. ఇక్కడ తాంబూలాన్ని ఈ వివాహ ఒప్పందానికి సాక్షిగా పరిగణిస్తారు.

వరంగల్లు దగ్గర కొందపర్తి అనే ఊళ్లో చెరువు దగ్గర ఒక శాసనం దొరికింది. అందులో ‘‘తాంబుల స్రవంబు చేసిన’’ అనే పదం ఉంది. ఒక పనికి ఇరుపక్షాల వారు తాంబూలం తీసుకొని ఒప్పుకొని ఒక కట్టడి చేసుకోవడం అని దీనికి అర్థం. తాంబూల స్రవం చేయడం అంటే నోరంతా తాంబూల రసం నిండేలా తాంబూలాన్ని నమలడమే! తాంబూలాన్ని సాక్షిగా పెట్టుకోవటం అంటే ఆషామాషీ కాదు. అగ్నిసాక్షి ఎంత బలమైనదో తాంబూల సాక్ష్యమూ అంతే.

వీర తాంబూలం

ఆరుద్ర రాసిన కాటమరాజు నాటకంలో ఒక సన్నివేశం ఉంది. మనుమసిద్ధితో రణతిక్కన తనకు వీరతాంబూలం ఇప్పిస్తే కాటమరాజును బంధించి పుల్లరితో సహా తెస్తానన్నప్పుడు కన్నమనీడు ‘‘కరణాలదేవూరు-కయ్యమేవూరు. మీలాంటి వాళ్లకి చదవడం, వ్రాయడం సంప్రదించడం లెక్కించడం సరైన కార్యాలు, కదనమన్న ఊసే మదిలోనికి రానీయకండి’’ అని ఈసడిస్తాడు. అప్పుడు రణ తిక్కన తండ్రి సిద్ధన్నమంత్రి గతంలో తమ విజయాలను ఏకరవుపెట్టి, ‘‘…అంతటి సేవణ దండయాత్రనే అరచేత నాపిన వంశం మాది, ఈ కాటమరా జొకలెక్కా! తబుకుతో తాంబూలమిప్పించండి’’ అని, తన కొడుకుని యుద్ధానికి పంపి తనకు గల రాజభక్తి ప్రదర్శిస్తాడాయన.

దానికి స్పందించిన మనుమసిద్ధి ‘‘వీర తాంబూలం స్వీకరించండి. జగజంపు గొడుగుల నీడలో వెల్ల చామరాలు విసిరించుకుంటూ వెళ్లండి. చాగలకొండ- అదే మనకు అండదండ’’ అంటూ వీరతాంబూలం ఇస్తాడు. వీరతాంబూలం అంటే బాధ్యతను అప్పగించటం. వీరతాంబూలం పుచ్చుకోవటం అంటే బాధ్యతను నెరవేర్చుకొస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

నాన్‌ ‌వెజ్‌ ‌తాంబూలం

తాంబూలం శుద్ధ శాకాహార ద్రవ్యాలతో కూడినదని మనం నమ్ముతాం. కానీ మనకు తెలీకుండానే మాంసాహారానికి సంబంధించిన ఒక ద్రవ్యం తాంబూలంలో చేరిపోతోంది. దాని గురించి ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో రాశారు ‘‘బెంగాలీయులంతా తాంబూలంలోకి గుల్లసున్నం వేసుకొంటారు. యీ విషయాన్ని గురించి ఒక దినము బంగాళీవాడు మీ దేశములో బ్రాహ్మణులు మత్స్య భక్షణ చేయడము లేదంటిరే, గుల్లసున్నము తాంబూల చర్వణముతో తిన డములేదా’’ అని అడిగాడు. గుల్లసున్నం అంటే నత్తగుల్లలను పుటం బెట్టి చేసిన భస్మం. నత్తగుల్లలు నత్తల శరీర భాగమే కదా! ఇన్నాళ్లూ తాను గుల్ల సున్నం వేసుకోవటం ద్వారా పరోక్షంగా మాంసాహార భక్షణం చేసినట్టే అయ్యింది కదా…అని వ్యాకుల పడ్దారాయన!

రాత్రి తాంబూలం

‘‘తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం

శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం’’

ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే రేయిలో ‘‘శ్రీరామ చంద్రుడు’’ ఉదయిస్తున్నాడట. సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన గొప్ప గేయం ఇది. తాంబూలంలో ప్రేమామృతం రంగరించి ఇస్తే ప్రతి స్త్రీకీ పతి శృంగార రూపం రామచంద్రుడిలా గోచరిస్తుందనేది అంతరార్థం. ఆమె హృదయంలో అతను, అతని హృదయంలో ఆమె రూపాలను ఉదయింప చేయటమే రాత్రి తాంబూల లక్ష్యం. ‘‘శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధం’’ అనేవి ఆయన అమృతవాక్కులు.

సుమతీ శతకకారుడు తాంబూలం ఇచ్చే సమర్థత గురించి ఒక పద్యం చెప్పాడు:

‘‘పలుదోమి సేయు విడియము/తలగడిగిననాటి నిద్ర తరుణులయెడలం

బొలయలుక నాఁటి కూటమి/వెలయింతత్ని చెప్పరాదు వినురా సుమతీ’’ పళ్లు తోముకుని వేసుకున్న తాంబూలం,

తలంటుకున్న రోజున పగటినిద్ర, ప్రణయకోపం వచ్చిన నాటి సంభోగం చాలా సుఖంగా ఉంటాయి.

ఆడ తాంబూలం-మగ తాంబూలం

ప్రవరుణ్ణి వరూధినినీ కలిపింది తాంబూలమే! దారితప్పి పోతున్న ప్రవరుడికి ఓ సువాసన సొకింది. దాన్ని బట్టి దూరంగా ఎక్కడో ఒక స్త్రీ ఉన్నదని గ్రహించాడతను. ఆడమనిషి పొలువు తెలిపే గాలి అతనికి సోకిందట. ఆ పరిమళం ఎక్కడిదో వెదుకుతూ వెడితే వరూధిని అతని కంటపడింది. ఆ తరువాత అతన్ని ఆమె వలచి వెంటపడటం, అతను తప్పించుకోవటం , ఓ గంథర్వుడు డూప్లికేట్‌ ‌ప్రవరుడిగా రావటం ఈ కథంతా అందరికీ తెలిసిందే! వరూధిని పరిమళభరిత తాంబూలం వేసుకోకపోతే హిమాలయాల్లో దారి తెలీక దిక్కుతోచక తిరిగే ప్రవరుడికి వరూధిని ఎక్కడుందో తెలిసేది కాదు. తాంబూలం ఆ ఇద్దరి కథనీ మలుపు తిప్పింది.

‘‘మృగమద సౌరభ విభవ/ద్విగుభిత ఘనసార సాంద్ర వీటీ గంధ/స్థగితేతర పరిమళమై/మగువ పాలుపు దెలుప నొక్క మారుత మొలసెన్‌’’ ‘‌స్త్రీవీటి’ అంటే స్త్రీలు వేసుకునే తాంబూలంలో ‘‘మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసారం’’ ఉంటుంది. అంటే, కస్తూరి రెండు పాళ్లయితే పచ్చకర్పూరం ఒక పాలన్న మాట. మగవాళ్ళు వేసుకొనే తాంబూలంలో కస్తూరి ఒక పాలు కర్పూరం రెండుపాళ్లు ఉంటాయి. కస్తూరి లైంగికవాంఛని రెచ్చగొట్టేదిగాను, కర్పూరం పునస్సమాగమానికి పురికొల్పేదిగాను ఉంటాయి. అందుకని స్త్రీలు కస్తూరి ఎక్కువగా, పురుషులు పచ్చకర్పూరం ఎక్కువగా ఉండేలా తాంబూల సేవన చేస్తారు. అంతేకాదు ఎక్కువ కస్తూరితో తాంబూలం వేసుకుంటే పురుషుల్లో శీఘ్ర స్ఖలనం ఏర్పడుతుందనే నమ్మకం కూడా ఉంది. అది స్త్రీలకు వర్తించదు. అందుకని స్త్రీ తాంబూలం కస్తూరి సువాసన వెదజల్లేదిగా ఉంటుంది. దాన్ని నమిలేది ఆడదో మగాడో చెప్పగలిగాడంటే ఆడతాంబూలం, మగతాంబూలం పరిమళాలు వేర్వేరని, ఆడ తాంబూలం వాసన భిన్నంగా ఉంటుందనీ, ఈ భేదం ఆ కాలంనాటి రసికులకు మాత్రమే తెలుసు! ప్రవరుడు ఏకపత్నీవ్రతుడే గానీ అరసికుడని పెద్దనగారు చెప్పలేదు. ప్రవరుడి భార్య గుంగెడు అన్నాన్ని వొంటి చేత్తో వండి వార్చగల దిట్టే అయినా భర్తను మురిపించగల నాయికే! ప్రవరుడు ఏకపత్నీవ్రతుడు కాగలగటమే అందుకు సాక్ష్యం.

‘‘అతడావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్‌ ‌జనా

న్విత మిచ్చోటని చేరఉబోయి కనియెన్‌ ‌విద్యుల్లతా విగ్రహన్‌

‌శతపత్రేక్షణఉజంకరీకచికురన్‌ ‌జంద్రాస్యఉ జక్రస్తనిన్‌

‌నతనాభిన్‌ ‌నవలా నొకనొక మరున్నారీ శిరోరత్నమున్‌.’’

అతడు చల్లటి పిల్లతెమ్మెరల మీదుగా అలలు అలలుగా వస్తూన్న ఆ తాంబూల పరిమళాన్ని బట్టి వెదుకుతూ ముందుకు కదలగా, ఎదురుగా ‘మెఱుపుతీగ లాంటి యువతి, విరబూసిన పువ్వుల్లాంటి కళ్లతో, తుమ్మెదలు దండు తీరాయా అన్నట్టున్న పొడవైన నల్లటి కురులతో, అందంగా వెలిగిపోతున్న మోముతో, గర్వంగా వంపుదిరిగిన వక్షోజాలతో వళులు తిరిగిన లోతైన నాభి కలిగి మరోలోకం నుంచి దిగివచ్చిందా అనిపించే ఆ వనితామణి వరూధినిని చూశాడు. అలా తాంబూలం ప్రవరుణ్ణి, వరూధిని కలిపింది.

యయాతి కథలో కూడా శర్మిష్ఠ తన భర్తకు తాంబూలం చేసి ఇమ్మని దేవయానిని ఆదేశిస్తుంది. ఆమె చేసిచ్చిన తాంబూలం యయాతికి బాగా నచ్చింది. తాంబూలం చుట్టిన వారి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని తినేవారి నోరు అంత ఎర్రగా పండుతుందంటాడు యయాతి. శర్మిష్ఠ చేతి తాంబూలం కోసం యయాతి మహరాజు వెంపర్లాడి పోతాడు. ఇలా తాంబూలం ఆ ఇద్దరినీ దగ్గర చేసింది.

సఖీతాంబూలం

తాంబూలాన్ని ‘సఖి’ అన్నవాడు వరాహ మిహిరుడు. బృహత్సంహితలో ‘‘తాంబూలస్య సఖే త్రయోదశగుణా స్స్వర్గేపి తే దుర్లభాః’’ అంటే తాంబూల సఖికి 13 గుణాలున్నాయని, స్వర్గంలో కూడా అది దొరకదనీ తాంబూల ప్రశస్తిని వివరిస్తాడు.

ఏ రుతువుకా తాంబూలం

చలికాలం: శీతకాలంలో చలిని తట్టుకోవటానికి శొంఠి తాంబూలం, అగరు ధూపము, గొంగళ్ళు, మందపాటి దొడ్డుబట్టలు వాడేవారని వేంకటనాథుని పంచతంత్రం చెప్తోంది. అరికకూడు, పుచ్చవరుగు, ఆవులవెన్న, మజ్జిగసద్ది తిని పొలాలు దున్నటానికి పోయేవారట!

వేసవితాంబూలం: రుతుసంహారం (5-5) కాళిదాస మహాకవి ఏసీలు తెలీని ఆ కాలంలో గ్రీష్మ రుతువులో స్త్రీలు తాపాన్ని తట్టుకోవటానికి ఏం చేశారో ఇలా వర్ణిస్తున్నాడు: ‘‘గృహీత తాంబూల విలేపన ప్రజః సుఖాసవామోదిత వక్త్రపంజాః ప్రకామకాలాగురు ధూపవాసితం విశ న్తి శయ్యాగృ హముత్యుకాః స్రీయః’’: కర్పూర తాంబూలం వేసుకుని గంధ మాల్యాదులతో లేపనం చేసుకుని వొంటికి పూసుకుని, పుష్పమాలలు ధరించి, ఆసవం అంటే కల్లు లేదా ద్రాక్షసారాయి (వైన్‌ ‌లేదా బీరు) తాగితే తాంబూల పరిమళంతో ఈ ఆసవం వాసన కూడా మిళితం అయి, కాలాగురు ధూపం వేసిన శయ్యా గృహం (పడగ్గది)లోకి తొందర తొందరగా ప్రవేశిస్తున్నారట. వేసవి తాపం తట్టుకోవటానికి స్త్రీలు వేసవి తాంబూలం సేవించారంటాడు కాళిదాసు.

సార్వకాలిక తాంబూలం: వీటికా సేవనం అంటే తాంబూలం వేసుకోవటం అనేది శ్రీనాథ యుగం లోనూ రాయల యుగంలోనూ చాలా గౌరవప్రదమైన అలవాటు. ప్రవరుడంతటి నిష్ఠాగరిష్ఠుడు కూడా ‘‘మృగమదసౌరభవిభవ ద్విగుణిత ఘనసార సాంద్రవీటీ’’ ఏ రకం

తాంబూలానికి ఏ రకమైన పరిమళం ఉంటుందో. ఏ ద్రవ్యాన్ని ఏ తాంబూలంలో ఎంత వేస్తే ఎలాంటి పరిమళం వస్తుందో బాగా తెలిసినవాడే!

మహాశివభక్తులైన ‘‘జంగములు’’ సార్వకాలిక తాంబూలాన్ని సేవించేవారట. ‘‘సార్వకాలిక తాంబూల చర్వణార్ద్రరాగ సౌభాగ్యమున పద్మ రామణుల దృణముగా జూచు దంతపంక్తులతో పారాడుతున్నట్టు కవి ప్రయోగాలున్నాయి. సార్వకాలిక తాంబూలం అనేది ఎలాంటి పరిమళ ద్రవ్యాలు చేరకుండా ఆకు, వక్క, సున్నం కలిసిన సాదా తాంబూలం కావచ్చు. దేవుడికి సమర్పించే పండు తాంబూలం లాంటిదే ఇది. దేవుడికి కప్పురవిడెములు నివేదన పెట్టరు కదా! సార్వకాలీన తాంబూలం ఆర్ద్రరాగసౌభాగ్యప్రదం. సర్వకాల సర్వావస్థల్లోనూ అందరూ వేసుకోదగినది.

ఉత్తరాదివారు పితృకార్యాలప్పుడు కూడా తాంబూల సేవన చేస్తారని ఏనుగుల వీరాస్వామిగారు తన కాశీయాత్ర చరిత్రలో ఆక్షేపించారు. కానీ, అది సార్వకాలీన తాంబూలం అయితే ఉత్తరాదివారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. మనకు తాంబూలం భోంచేశాక మాత్రమే వేసుకునే అలవాటు. తాంబూలం వేసుకున్నారంటే భోంచేసేశారని అర్థం. ఉత్తరాదివారికి సార్వకాలీన తాంబూలం విషయంలో అలాంటి పట్టింపు లేదేమో!

 (సమాప్తం)

About Author

By editor

Twitter
Instagram