– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

‘‘ఇండియాలో పరిస్థితి చాలా ప్రమాద భరితంగా ఉంది. ఐసిఎస్‌లో, పోలీసు శాఖలో ఉన్న బ్రిటిషువారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సర్వీసుల్లోని ఇండియన్‌ ఆఫీసర్లు రాజకీయంగా, సామాజికంగా ఒత్తిళ్లతో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. దేశానికి భావి పాలకులకు శత్రువులు కావటానికి సబార్డినేట్‌ ఉద్యోగులు భయపడుతున్నారు. అలజడిని సమూలంగా అణచివేయటానికి మనం సిద్ధపడాలి. దీనికి బ్రిటిష్‌ ‌సేనల బలాన్ని గట్టిగా ప్రయోగించ వలసి వస్తుంది. దేశంలో పలు చోట్ల మార్షల్‌ ‌లా విధించాలేమో. పెద్ద సంఖ్యలో అరెస్టులు తప్పవు. కాంగ్రెస్‌ ‌పార్టీని నిరవధికంగా నిషేధించవలసి రావచ్చు. దీని విషయంలో నాకు ఏలినవారి సపోర్టు, గైడెన్సు కావాలి.’’

ఎర్రకోటలో ఐఎన్‌ఎ ‌విచారణ మొదలైన మరునాడు (1945 నవంబర్‌ 6‌న) లండన్‌కు పంపిన రిపోర్టులో వైస్రాయ్‌ ‌లార్డ్ ‌వేవెల్‌ ‌పలుకులివి. బ్రిటిష్‌ ‌సర్కారుపై దేశంలో సెగలు కక్కుతున్న ఉద్రిక్తతను వైస్రాయ్‌ ‌సరిగానే అంచనా వేశాడు. విచారణ మొదలై వారం తిరిగేసరికి ఐఎన్‌ఎ ‌ఖైదీల డిఫెన్సు యావద్భారత ప్రజలనూ ఒక్క తాటి మీదికి తెచ్చింది. సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌జాతి జనులందరికీ ఆరాధ్య నాయకుడయ్యాడు. ఐఎన్‌ఎ ‌బందీల సత్వర విడుదలను కాంక్షిస్తూ అన్ని మతాలవారూ సామూహిక ప్రార్థనలు చేశారు. దేశం అష్టదిక్కులా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ఆగ్రహోదగ్రులైన ఉద్యమకారులు ఎర్రకోటను పలుమార్లు చుట్టు ముట్టారు. పోలీసు కాల్పుల్లో చాలా ప్రాణాలు పోయాయి. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఐఎన్‌ఎ ‌ఖైదీలను తక్షణం విడిచి పెట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ వీర్‌ ‌సావర్కర్‌ ‌బ్రిటిష్‌ ‌ప్రధాని అట్లీకి టెలిగ్రాం పంపాడు. అందులో తన పేరు రాయవలసిన చోట ‘1857’ అని అంకెలు వేశాడు!

ఇంటలిజెన్స్ ‌బ్యూరో డైరెక్టర్‌ ‌సర్‌ ‌నార్మన్‌ ‌స్మిత్‌ ‌నవంబర్‌ 20‌న హోమ్‌ ‌డిపార్టుమెంట్‌కి పంపిన రహస్య నివేదికలో ఏమన్నాడో చూడండి:

‘‘భారత ప్రజల్లో ఇంతగా ఆసక్తిని, సానుభూతిని రేకెత్తించిన అంశం మరొకటి లేదు. ఐఎన్‌ఎపై అభియోగాలను ఎత్తివేయాలని కోరుతూ అక్టోబరు ద్వితీయార్థంలో ఒక్క సెంట్రల్‌ ‌ప్రావిన్సులోనే 160 రాజకీయ సభలు జరిగాయి. మిగతా రాష్ట్రాలలోనూ ఇలాంటి సభల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పట్టణాల్లోనే కాదు. మారుమూల గ్రామాలలోనూ ‘ఐఎన్‌ఎ ‌దినం’, ‘ఐఎన్‌ఎ ‌వారం’లకు జనం స్పందన బాగా ఉంది. బ్రిటిష్‌ ‌వ్యతిరేకత ప్రజల్లో ప్రబలింది. మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకులు కానివారిలో కూడా ఐఎన్‌ఎ ‌మీద సానుభూతి పెరిగింది. హైకోర్టు మాజీ జడ్జీలు, ప్రభుత్వం నుంచి బిరుదులు పొందిన ఘరానా వ్యక్తులు కూడా ఐఎన్‌ఎ ‌మద్దతు కార్యక్రమాలలో బాహాటంగా పాల్గొంటున్నారు. పరిస్థితి ప్రమాద భరితంగా ఉంది. ఆర్మీ భద్రత మీద దీని దుష్ప్రభావాన్ని జాగ్రత్తగా గమనించాలి.’’

[The Transfer of Power 1942-7, vol. 6, p.512]

22న కోలకతాలో ‘ఐఎన్‌ఎ ‌డే’ జరిపి కాంగ్రెస్‌, ‌ముస్లిం లీగ్‌ ‌జండాలను కట్టిన లారీలలో హిందువులు, ముస్లిములు అపూర్వ మత సఖ్యత ప్రదర్శిస్తూ నగరమంతటా తిరిగారు. ‘ మార్షల్‌ ‌బోస్‌ ‌జిందాబాద్‌’, ‘‌దిల్లీ చలో’, ‘జైహింద్‌’ అని నినదిస్తూ వేలాది విద్యార్థులు తీసిన ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. రెచ్చిపోయిన ఆందోళన కారులు నగరాన్ని తగలబెట్టి, జన జీవితం స్తంభింపజేసి, అమెరికన్‌, ‌బ్రిటిష్‌ ‌మిలిటరీ స్థావరాలమీద దాడి చేశారు. 49 మిలిటరీ వాహనాలను, 97 పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. 200 మంది మిలిటరీ సిబ్బందిని గాయపరచారు, హిందువులు, ముస్లిములు కలిసి భద్రతా దళాలను రాళ్ళతో కొట్టారు. నాలుగు రోజుల అల్లర్లలో 32 ప్రాణాలు పోయాయి. కల్లోలం క్రమంగా పట్నాకీ, అలహాబాద్‌, ‌బెనారస్‌లకూ, అటునుంచి కరాచీ, ముంబయిల వరకూ పాకింది. విద్యార్థులకూ, పోలీసులకూ లెక్కలేనన్ని వీధి పోరాటాలు జరిగాయి. యావ ద్దేశానికీ ‘జైహింద్‌’ ‌రణన్నినాదం అయింది.

ఇవన్నీ బ్రిటిషు సర్కారు ముందుగా ఊహించినవే. ఇంతకంటే తీవ్రంగా అంతర్గత కల్లోలం విషమించినా ధైర్యంగా ఎదుర్కొని అలజడిని నిర్దాక్షిణ్యంగా అణచివేయటానికి తెల్లదొరతనం సర్వసన్నద్ధమైంది. ఆ విషయం బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి వైస్రాయ్‌ ‌నివేదికలో పైన ఉటంకించిన వాక్యాలను బట్టే అర్థమవుతుంది. చుట్టూ దేశమంతటా ప్రజల ఆగ్రహజ్వాలలు వ్యాపించి, శాంతి భద్రతల పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్నా ఎర్రకోటలో మిలిటరీ కోర్టు విచారణ నిరాఘాటంగా కొనసాగింది. ముగ్గురు నిందితులకూ పరాభవ పూర్వక బర్తరఫ్‌, ఆపైన యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధింపబడింది. దానికి రెచ్చిపోయి జనాలు ఎంతటి విధ్వంసానికీ, హింసకూ పాల్పడినా అవసరమైతే మార్షల్‌ ‌లా పెట్టి అసమ్మతిని కాలరాచివేయటానికి సర్కారు కాచుకుని ఉన్నది. కానీ మహాతెలివిగల తెల్లవాళ్ళు వేసుకున్న లెక్క ఊహించని రీతిలో తప్పింది.

ఎర్రకోట విచారణ మొదలయ్యే నాటికి ఇండియాలో ఉన్న బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఆర్మీ సైనికుల సంఖ్య 2,40,613 కాగా ఆఫీసర్ల సంఖ్య 15 వేలు. వారిలో 7,604 మంది అంటే సగానికంటే ఎక్కువ మంది భారతీయులు. యుద్ధం ముగిసేసరికి వారిలో చాలామందిలో రాజకీయ చైతన్యం పెరిగింది. స్వాతంత్య్రం కోసం సాగుతున్న పోరాటం మీద సానుభూతి ఉప్పొంగింది. రణరంగంలో, ఆ దరిమిలానూ ఐఎన్‌ఎతో వారికి సన్నిహిత సంపర్కం తటస్థించింది. సుప్రీం కమాండర్‌ ‌నేతాజీ ఉత్తేజకర ప్రసంగాల ప్రతులు ఆర్మీ శిబిరాల్లో రహస్యంగా సర్క్యులేట్‌ అయ్యేవి. ఐఎన్‌ఎ ‌సైనికుల, ఆఫీసర్ల సోదరులు, బంధుమిత్రులు ఎంతోమంది ఇండియన్‌ ఆర్మీలో ఉండేవారు. దేశం కోసం ఐఎన్‌ఎ ‌పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, వారిని ఆత్మార్పణకు పురికొల్పిన నేతాజీ నాయకత్వస్ఫూర్తి తెలుసుకున్నాక బ్రిటిష్‌ ‌సైన్యం వైఖరిలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. తమ పూర్వ సహచరులు కోర్ట్ ‌మార్షల్‌ ‌విచారణ నుంచి క్షేమంగా బయటపడాలని సాయుధ దళాలలోని భారతీయులు మనస్పూర్తిగా కోరుకున్నారు. సామాన్య ప్రజలే కాదు సివిల్‌ ‌సర్వీసుల అధికారులు, సైనికులు కూడా ఐఎన్‌ఎ ‌వీరులకు మద్దతుగా గళమెత్తి తెల్ల దొరతనానికి చెమటలు పట్టించసాగారు. ఉత్తర, దక్షిణ భారతాలలో ఐఎన్‌ఎకు బాసటగా మిలిటరీ పెరేడ్లు చాలా జరిగాయి. కోల్‌కతాలోని రాయల్‌ ఇం‌డియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌సిబ్బంది, ఆఫీసర్లు దేశ విమోచన కోసం ఐఎన్‌ఎ ‌సాగించిన సాయుధ పోరాటాన్ని శ్లాఘిస్తూ, ఆ జాతిరత్నాలను శిక్షించబూనిన కోర్ట్ ‌మార్షల్‌ ‌విచారణను ఖండిస్తూ బెంగాల్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీకి సంఘీభావ సందేశం పంపారు. కల్నల్‌ ‌కె.ఎస్‌. ‌హిమ్మత్‌ ‌సింగ్‌ అనే ఆర్మీ కల్నల్‌ ‌దిల్లీలో భూలాభాయి దేశాయిని కలిసి ఐఎన్‌ఎ ‌విషయం చర్చించాడు. ఖైదీలలో ఎవరికి మరణ శిక్ష వేసినా సాయుధ విప్లవం తప్పేట్టు లేదని ఆ తరవాత సైన్యాధిపతి సర్‌ ‌క్లాడ్‌ ఆచిన్‌ ‌లెక్‌కు అతడు లేఖ రాశాడు.

అలాగే, సీనియర్‌ ‌మోస్ట్ ఆఫీసరు, అండమాన్స్లో  బ్రిటిష్‌ ‌బెటాలియన్‌ ‌కమాండరు అయిన లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌నాథూసింగ్‌ ‌సేనాపతి ఆచిన్‌ ‌లెక్‌కు ఐఎన్‌ఎ ‌కోర్ట్ ‌మార్షల్‌ను నిరసిస్తూ ఎనిమిది పేజీల ఘాటైన ఉత్తరం రాశాడు. ‘ఇప్పటి క్లిష్ట సమయంలో దూరదృష్టితో వ్యవహరించాలి. జపాన్‌కు యుద్ధ ఖైదీలుగా పట్టుబడటానికి పూర్వం బ్రిటిష్‌ ‌సర్కారుకు వారు చేసిన సేవల దృష్ట్యా ఐఎన్‌ఎ ‌ఖైదీల నేరాలను క్షమించటమే విజ్ఞత’ అని అతడి సలహా. బ్రిటిష్‌ ‌జాతీయుడైన సైన్యాధికారి మేజర్‌ ‌చార్లెస్‌ ‌ముండీ కోకెన్‌ ‌మరొక అడుగు ముందుకు వేసి ‘ఈ విచారణ కక్ష పూరితం. బ్రిటిష్‌ ‌ప్రభువుకు విధేయతా ప్రమాణాన్ని దేశభక్తి కారణంగా ఐఎన్‌ఎ ‌సైనికులు అతిక్రమించటం నేరం కాదు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని బ్రిటిష్‌ ఆఫీసర్లు విచారించటం తప్పు. ఇండియన్‌ ‌ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఈ విచారణ పక్కన పెట్టాలి.’ అని కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌కు ఉత్తరం రాశాడు. ఐఎన్‌ఎ ‌విచారణలపై ఆగ్రహం బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఆర్మీ మొత్తం వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని ఈస్టర్న్ ‌కమాండ్‌ ‌జనరల్‌ ఆఫీసరు జనరల్‌ ‌ఫ్రాన్సిస్‌ ఇవాన్స్ ‌సిమ్స్ ‌టకర్‌ ఆం‌దోళన వ్యక్తపరచాడు. ఐఎన్‌ఎ ఆఫీసర్లను శిక్షిస్తే ఆర్మీలో తిరుగుబాటు వస్తుందని పంజాబ్‌ ‌గవర్నర్‌ ‌సర్‌ ‌బెర్ట్రాండ్‌ ‌గ్లాన్సీ కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ను హెచ్చరించాడు.

ఇలా తన సైన్యంలోనే అన్ని వైపుల నుంచీ ప్రతికూలత ఎదురయ్యేసరికి కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సర్‌ ‌క్లాడ్‌ ఆచిన్‌ ‌లెక్‌ ‌డైలమాలో పడ్డాడు. యుద్ధం ముగిసిన కొత్తలో ఐఎన్‌ఎ ‌విద్రోహుల అంతు చూడాలని మహా కసిగా కస్సుబుస్సులాడిన సేనాపతికి ముందుగతి ఏమిటన్న గుబులు పట్టుకుంది. ఎర్రకోట విచారణ ఒకవైపు నడుస్తూండగానే వైస్రాయ్‌ ‌వేవెల్‌కు ఉన్నవిషయం అతడు ఇలా విన్నవించాడు:

‘‘ఇండియన్‌ ‌సోల్జర్‌ ‌మనోభావాలను సరిగ్గా కనిపెట్టటం ఎంత గొప్ప బ్రిటిషు ఆఫీసరుకూ చేతకాదని నా సుదీర్ఘ అనుభవంలో గ్రహించాను. వివిధ వర్గాల నుంచి నాకు అందిన సమాచారాన్ని బట్టి మన సైనిక శ్రేణుల్లో ఐఎన్‌ఎ ‌పట్ల గాఢమైన సానుభూతి ఉంది. వారు చేసిన ఘాతుకాలను, సర్కారుకు చేసిన ద్రోహాన్ని కూడా పట్టించుకోరాదన్న ధోరణి సైన్యంలో వ్యక్తమవుతున్నది. మన సాధారణ నైతిక ప్రమాణాలను ఈ విషయంలో వర్తింప జేయటం కుదరదని నాకు అనిపిస్తున్నది.’’

[Quoted in The Lost Hero, Mihir Bose p. 459 ]

జనాగ్రహ ప్రకంపనల ధాటికి తమ కాళ్ల కింద నేల కదులుతున్న సంగతి అప్పటికే గ్రహించి ఉన్న వైస్రాయ్‌ ఐఎన్‌ఎ ‌ఖైదీలకు మిలిటరీ న్యాయస్థానం విధించే ఏ శిక్షనైనా కమ్యూట్‌ ‌చేసే అధికారాన్ని విచారణ ముగియడానికి వారం రోజుల ముందే కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌కు ఇచ్చాడు. కొంపలంటు కున్నాయని అసలే కంగారు పడుతున్న సైన్యాధిపతి సమయం వృధా చేయలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముగ్గురు ఐఎన్‌ఎ ఆఫీసర్లకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తన ప్రత్యేకాధికారంతో రద్దు చేశాడు. జీతం బకాయిలు ఇవ్వకుండా సర్వీసు నుంచి బర్తరఫ్‌ ‌శిక్షను మాత్రమే ధ్రువీకరించాడు. 1946 జనవరి 3న ఆ మేరకు గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. ఆ సాయంత్రమే ఎర్రకోటలోని సలీంగడ్‌ ‌ఫోర్టు బారక్స్ ‌చెరలోని షానవాజ్‌ ‌ఖాన్‌, ‌సెహగల్‌, ‌ధిల్లాన్‌లను సగౌరవంగా విడిచిపెట్టారు.

రాజావారిపై యుద్ధానికి దిగిన అభియోగం మీద ఐఎన్‌ఎలో ఇంకెవరి మీదా విచారణ జరపకూడదని దిమ్మతిరిగిన సైన్యాధిపతి నిర్ణయించాడు. ప్రపంచ యుద్ధంలో ఘనంగా గెలిచిన బ్రిటిషు మహా సామ్రాజ్యం నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌చేతిలో కడకు చిత్తుగా ఓడింది. నేతాజీ యుద్ధంలో ఓడి శత్రువును గెలిచాడు. ఇండియాలో బ్రిటిష్‌ ‌రాజ్‌ అం‌తానికి ఐఎన్‌ఎ ‌విచారణ ఆరంభమయింది. ‘ఈ నశ్వరమైన జగత్తులో ప్రతిదీ నశిస్తుంది.. కాని ఆశయాలకు, ఆదర్శాలకు నాశనం ఉండదు.’ అని 1940లో సుభాస్‌ ‌చంద్రబోస్‌ అన్న మాట నిజమైంది. 1944 లో ఐఎన్‌ఎను ఉద్డేశించిన తొలి ప్రసంగంలోనే నేతాజీ అభివర్ణించినట్టు బ్రిటిషు సామ్రాజ్యానికి ఎర్రకోటే సమాధి స్థలమైంది

ఐఎన్‌ఎ ‌వీరులను విడుదల చేయాలని బ్రిటిషు సర్కారు నిర్ణయించింది ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్న మంచి బుద్ధితో కాదు. ప్రజాగ్రహ తీవ్రతకు తాళలేక! బ్రిటిషు పరిపాలనకు వెన్నెముక అయిన సైన్యమే నేతాజీ స్ఫూర్తితో తిరగబడే గత్తర ముంచుకొచ్చినందువల్ల!

పట్టుబడిన, లేక లొంగిపోయిన ఐఎన్‌ఎ ‌ఖైదీలలో 17,500 మందిని అవిధేయత, విద్రోహ నేరాలకు శిక్షించదగిన ‘Blacks’గా మొదట నిర్ధారించారు. ప్రజాగ్రహం సెగలు కక్కేసరికి దూకుడు తగ్గించారు. కనీసం 600 మందిని కోర్ట్ ‌మార్షల్‌ ‌చేయాలని, 125 మందివరకూ వార్‌ ‌క్రిమినల్స్ ‌గా నిర్ధారించి, వారిలో 20 మందికైనా మరణశిక్ష వేయించగలమని మలి అంచనా వేశారు. ఆ సంగతి లండన్‌లోని విదేశాంగ మంత్రికి కూడా తెలియ పరచారు. కాని మొదటి విడతలో ముగ్గురికి పట్టుబట్టి శిక్ష వేయించి కూడా దానిని అమలుపరచేందుకు ధైర్యం చాలక తెల్ల తోలు దురహంకారాన్ని దిగమింగి, ఊహించని రీతిలో తోక ముడిచారు. దీనికి దారితీసిన కారణాలు, ప్రభావాలు ఏమిటా అని బుర్ర బద్దలు కొట్టుకోనవసరం లేదు. సైన్యాధిపతి సర్‌ ఆచిన్‌ ‌లెక్‌ 1945 ‌నవంబర్‌ 24‌న వైస్రాయి లార్డ్ ‌వేవెల్‌కు, 1946 ఫిబ్రవరి 12 న అన్ని డివిజన్ల కమాండర్లకు, సీనియర్‌ ఆఫీసర్లకు రాసిన అతి రహస్య లేఖలలోని ఈ కింది విషయాలను గమనిస్తే చాలు.

TOP SECRET AND PERSONAL .. NOT TO BE PASSED THROUGH ANY OFFICE
The representatives of Provincial governments expressed uneasiness about the political situation which might result from a continuance of the present agitation. They felt that a decision to execute any of the accused in the present trials might result in unrest on a scale more serious than in 1921 and 1942. The Punjab, the Province most deeply affected suggested that there should be no further trials and any sentences of death should be commuted…. The agitation in the country is likely to increase if there are further trials .
With the existing Armed Forces recruited from all parts and all classes of India and modern means of communication and the growth of nationalist feeling in the country, it is quite impossible to isolate the Armed Forces from the rest of the country. There is no general resentment in the Indian Army against the INA… The general opinion in the Army is in favour of leniency .
There would further be the danger that if imprisoned, they would be released on a new Governmentcoming into power and there might then be a temptation to reinstate them in the Army. If they are released now, this would be most unlikely.
Every Indian worthy of the name is today a “Nationalist’’, though this does not mean that he is necessarily “anti- British” .Where India and her independence are concerned, there are no “pro- British” Indians.Every Indian Commissioned Officer is a nationalist and hopes to attain independence for India by constitutional means. Indian officers of the Indian Army are all sure that any attempt to enforce the sentence would have led to chaos in the country and probably to mutiny and dissension in the Army culminating inits dissolution.. The great majority of rank and file of the Army are pleased that leniency has been shown. Many of them have relations and friends from the same villages in the INA.
To have confirmed the sentence of imprisonment would have had disastrous results, in that it would have precipitated a violent outbreak throughout the country, and have created active and widespread disaffection in the Army…
C.J.AUCHINLECK, GENERAL ”
[Wavell Papers, Official Correspondence, January – December 1945, pp. 374-378
Wavell Papers, Official Correspondence, January 1946 – March 1947, pp. 60-67]

(టాప్‌ ‌సీక్రెట్‌.. ‌పర్సనల్‌.. ఏ ఆఫీసుకూ తెలియనివ్వకూడదు

‘‘ప్రస్తుత ఆందోళన ఇలాగే కొనసాగితే రాజకీయ పరిస్థితి మీద పడే ప్రభావం గురించి రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిథులు కలవరం వెలిబుచ్చారు. ప్రస్తుత విచారణ నిందితుల్లో ఎవరికైనా మరణ శిక్ష అమలు జరిపితే 1921, 1942 నాటి కంటే తీవ్రమైన స్థాయిలో అల్లకల్లోలం ఏర్పడుతుందని వారు అభిప్రాయ పడ్డారు. అలజడి ప్రభావానికి మిగతా రాష్ట్రాలకంటే దారుణంగా లోనైన పంజాబ్‌ ‌ప్రభుత్వం ఇకపై కొత్త విచారణలు ఏవీ జరపరాదని, ఒక వేళ ఎవరికైనా మరణ శిక్ష విధిస్తే దానిని రద్దుపరచాలని కోరింది. ఇకమీద కొత్త విచారణలు నిర్వహిస్తే దేశంలో ఆందోళన ఉద్ధృతమయేట్టుంది.

‘‘భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, అన్ని తరగతులనుంచి సైనిక దళాలకు నియామకాలు జరుగుతున్నాయి. వీటికి తోడు ఆధునిక కమ్యూనికేషన్‌ ‌సదుపాయాలు. ఆ పైన జాతీయవాద భావాల వ్యాప్తి. పర్యవసానంగా మిగతా దేశం నుంచి సైనిక దళాలను వేరు చేసి దూరంగా ఉంచటం అసాధ్యం. ఐఎన్‌ఎ ‌పట్ల ఇండియన్‌ ఆర్మీలో ఏమంత వ్యతిరేకత లేదు. దానిపట్ల ఉదారంగా వ్యవహ రించాలనే ఆర్మీలో సాధారణ అభిప్రాయం.

‘‘ఇంకో ప్రమాదం ఉంది. వీరిని కనుక ఖైదులో ఉంచితే రేపో కొత్త ప్రభుత్వం వచ్చి వారిని విడిచి పెట్టవచ్చు. వారిని మళ్ళీ ఆర్మీ సర్వీసులో తిరిగి నియమించాలనీ ఉబలాట పడవచ్చు. ఇప్పుడే సర్వీసునుంచి తొలగించి వారిని విడుదల చేస్తే అలాంటి పరిణామానికి ఆస్కారం ఉండదు.

‘‘భారతీయుడని చెప్పదగ్గ ప్రతివాడూ ఇవాళ జాతీయవాదిగా మారాడు. అనగా బ్రిటిష్‌ ‌వ్యతిరేకి అని అర్థం కాదనుకోండి. ఇండియా, దాని స్వాతంత్య్రం విషయం వచ్చేసరికి బ్రిటిష్‌ అనుకూల భారతీయులు ఎవరూ ఉండరు. ఇండియన్‌ ‌కమిషన్డ్ ఆఫీసర్లలో ప్రతి ఒక్కడూ రాజ్యాంగ పద్దతుల్లో తన దేశానికి స్వాతంత్య్రం కోరుకుంటున్నాడు. కోర్టు విధించిన శిక్షను అమలు పరచాలని ప్రయత్నిస్తే దేశం అల్లకల్లోలమై సైనిక దళాలలో అసమ్మతి ప్రబలి, తిరుగుబాటు లేచి సైనిక వ్యవస్థ విచ్ఛిన్న మయ్యేదని ఆర్మీలోని (కింగ్స్ ‌కమిషన్డ్) ఇం‌డియన్‌ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇక దిగువ శ్రేణుల సామాన్య సైనికులు అపరాధుల పట్ల ఔదార్యం కనపరచి నందుకు సంతోషిస్తున్నారు. వారిలో చాలా మందికి సొంత ఊళ్ల బంధుమిత్రులు ఐఎన్‌ఎలో ఉన్నారు. కారాగార శిక్షను ధ్రువీకరించి ఉంటే దాని పర్యవసానంగా ఉపద్రవం వచ్చేది. దేశమంతటా హింస చెలరేగేది. సైన్యంలో విస్తృతమైన అసమ్మతి, అవిధేయత ప్రబలేవి.’’)

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram