– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘ఇంతకీ నేను చెప్పేదేమంటే, రుజువులూ సాక్ష్యాలూ ఏమీ లేవు. మనమెవ్వరం చేసేదేమీ లేదు. చెన్నడిని దోషిగా నిర్ణయించేదీ లేదు. ఆడగుంటను సరిగ్గా పెంచవలసింది తల్లిదండ్రులే. మరీ ముఖ్యంగా దాని వ్యవహారాలన్నింటికీ తండ్రే బాధ్యత వహించాలి. కడకులపు బారడు వాడి కూతురు గరికను సక్రమంగా పెంచుకురాలేదనే మేం భావిస్తున్నాం. పెద్దకులం చెన్నడితో అది చెలిమి చేసేందుకు తెగించినా తెలుసుకోలేక పోవడం బారడి తప్పే. అందుకే వాడికి శిక్ష.’’ గబగబా చెప్పవలసింది చెప్పేసి నోరు మూసేసుకున్నాడు గుణరాజు.

పీనె మీద పెద్దలందరికీ ముఠాదారు మాటలు సంతోషాన్నిచ్చాయి, కోలగాళ్లకు తప్ప. కోలన్న, రేకమ్మా కళ్లు తుడుచుకున్నారు. గరిక, బారడు, చిన్నమ్మ భోరుమన్నారు. గంగ ఏదోలా అయిపోయింది. ఒళ్లంతా పెను ఊష్ణం వచ్చినప్పుడు ఎంతగా కాలి పోతుందో అంతగా వేడెక్కిపోయింది.

‘పిల్ల తండ్రి బారడికేనా శిక్ష. పిల్లడి అబ్బ గిల్లడికి ఏ శిక్షా ఉండదా?’ మనసులో మాట పైకి తేవాలనే అనుకుంది. కూతురి మనోగతం ఎరిగిన రేఖ ఠక్కున దాని నోరు మూసేసింది. ఈ లోపున,

‘‘శిక్ష ఏమి•న్నది సెలవిచ్చారు కాదు.’’ పెద్ద తలపాగా సింగడు గుణయ్య వైపు చూసి కిలకిల మన్నాడు. ‘తొందరపడకండి..’ మాదిరిగా తలపాగా కేసి ముఠాదారులవారు క్రీగంట చూసి నింపాదిగా రంగంలోకి దిగారు.

‘‘పెద్ద శిక్ష ఏదీ వెయ్యదలుచుకోలేదు. నిజం చెప్పవలసివస్తే చేసిన తప్పుకుగాను పిల్ల కుటుంబాన్ని ఊరినుంచి వెలివేయాలి. సాంఘిక బహిష్కరణ శిక్ష విధించాలి. అప్పుడు ఎక్కడికిపోయినా కనీసం పొయ్యిలోకి అగ్గికూడా వాళ్లకి దొరకదు. ఆ పాపం మాకెందుకు! మరంచేతనే చోటా కులశిక్ష ఖరారు చేస్తున్నాం. గ్రామకచేరీ ప్రతినిధులు పదిమందికి బంతిపెడితే సరిపోతుంది. అంతేకాదు. ప్రతీ ఒక్కరి విస్తరి కిందా దక్షిణగా పదేసి కుంచాల కొర్రలూ దాపుచేయాలి.’’ గుణరాజు నోటి నుంచీ ఈ శిక్ష వెల్లడయిన వెంటనే గుండెల్లో రాయి పడిపోయి నట్టయింది బారడికి. చిన్నమ్మ గతీ అదే.

‘భోజనాలు సరే. వంద కుంచాల కొర్రలు తమ పేదముండా జన్మకి ఎక్కడినుంచీ తేగలం.’ మనసు లోనే మూలిగినట్టయిపోయారు. మరోసారి గుణయ్య గొంతుకే మోగింది.

‘‘ఇక పిల్లాడి తండ్రికి శిక్ష ఉండదా అని మీలో ఎవ్వరికయినా అనిపించవచ్చు. అదీ మాకు తట్టింది. అయితే పిల్లాడు మగపక్షం. పెద్దకులం పక్షం. కాబట్టి తొలి తప్పుగా హెచ్చరించి వదిలిపెడుతున్నాం. కూటికి దాటినా కులానికి ఎవ్వడూ దాటిపోలేడని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరోసారి ఇలాంటి వివాదంలో చెన్నడు పాత్రధారి అయితే మటుకు ఒకమెట్టు కింది కులానికి పోవలసి ఉంటుంది.’’ గబగబా చెప్పేసి ఇంట్లోకి పరుగుల మీద వెళ్లబోయాడు. అప్పుడే,

‘‘అయ్యా ముఠాదారూ! ఒక్కమాట.’’ అన్నాడు బారడు.

పీనె వదిలిపెట్టి వెళుతున్న గుణరాజు ఆగాడు. వాడి పెళ్లాం బారడివైపు కొకారిగా చూసింది. తీర్పు అయిపోయిందనుకుని కదలబోతున్న జనమూ అగారు.

‘‘ఏమిటో చెప్పు.’’ బారణ్ణి తొందరపెట్టారు గ్రామపెద్దలు.

‘‘మహారాజా. సకల అన్నాల అస్రకూడు అయితే ఫరవాలేదు గానీ, కుంచాలకొద్దీ గింజలంటే నేనెక్కడ తేగలను. నాకున్న తోపుల చివటలెన్ని చెప్పండి. చారెడునేల దున్నుకుంటూ బతుకుతున్నానే. మసితిండి మసడాలు తింటున్నానే. మరీ ఇంత భారమా.’’ గుండెలవిసిపోతూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలకు గ్రామస్తులంతా బేల అయినట్టయ్యారు. వాడు చెబుతున్నది నిజమే అన్నట్టుగానూ అయ్యారు. చెన్నడు, వాడి కన్నవారు ఈ గోలతో తమకేమీ సంబంధం లేనట్టు కదిలారు.

బారడి మాటలకు గుణరాజు స్పందించలేదు. వాడి పెళ్లాం మాత్రం గరగరమనిపోయింది.

‘‘పెద్ద శిక్షే వేసి ఉండాల్సిందిరా ముఠాదారు. మంచికిపోతే చెడు ఎదురవుతోంది. మీవంటి వాళ్లని జాలిపడి ఊళ్లో ఉంచాం చూడూ, అదే మా తప్పు. అప్పు చెయ్యి. లేకపోతే బారెడు నేల ఉందన్నావుగా. అది అమ్ముకో. అప్పుకట్టుకో. నోరు మూసుకుని ఇంటికి పో!’’ అనేసి విసవిసా కొంపలోకి దూరిపోయింది. అయినా బారడు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే అప్పు చెల్లించవలసింది అతగాడే కాబట్టి.

‘‘గుణయ్య బాబూ! నా భూమి ఎంత బాబూ? దాన్నెవరు కొంటారు బాబూ. అడవికి పోతే మసి.. ఇంటికివస్తే పసి.. అన్నట్టుంది నా బతుకు.’’ దేబిరించి నట్టుగా రెండుచేతులూ పిసుక్కుంటూ ముఠాదారు కాళ్లమీద పడి ఘొల్లుమన్నాడు. అప్పుడు గుణరాజు తనకు లేని దయ ఏదో తెచ్చిపెట్టుకుని తాజాగా మా•లు దొర్లిస్తూ,

‘‘ఎవ్వరూ కొనకపోతే నేను కొంటాను లేరా. నీ అప్పు నీ తరపు నేను కడతాను. సరేనా. రేపటినుంచీ పంట మా ఇంటికి చేర్చు. ఆ కళ్లంలోనే నువ్వు కూలి చేసుకో. ఊరిపెద్దగా మీలాంటి వాళ్లను ఆదుకోవడం నావంటి వాళ్లకు తప్పదు కదా.’’ తెలివిగా అనేశాడు. మరోమాట ఏదీ వినిపించు కోకూడదన్నట్టుగా వెళ్లిపోయాడు. గ్రామపెద్దలూ అతగాడిని అనుసరించి పోయారు. అప్పటికే జనమంతా దాదాపుగా వెళ్లిపోయారు. బారడి కుటుంబంతో పాటుగా కోలన్న, రేఖమ్మ, గంగు మాత్రమే మిగిలారు.

కోలడు గొంతు పెగిల్చాడు.

‘‘బాధపడకురా తమ్ముడా. భూమిపోయినా ఊరుపోలేదు కదా. వెలిపడలేదు కదా. కావలిస్తే కాసింతగా నా నేల దున్నుకో. నొచ్చుకోకు.’’ కన్నీరు పెడుతూ బారణ్ణి కౌగలించుకుంటూ చెప్పేశాడు. కోలన్నను పట్టుకుని గరిక, చిన్నమ్మ, బారడు బావురుమన్నారు. కచేరీ ముగిసి, తలారిగా విధి నిర్వహణ పూర్తయింది గనక తను కూడా మనస్ఫూర్తిగా ఏడవ వీలుందని తలచి కోలన్న గగ్గోలుపడ్డాడు. భర్త విలపిస్తుంటే రేకమ్మా రాగాలు పెట్టింది. గంగుకు మాత్రం అప్పుడు ఏడుపు రాలేదు. ముఠాదారు మీద అసహ్యం వేసింది. వేదన కలగలేదు. ముఠాదారు తీర్పు మీద వెగటు రగిలింది. రోదన ఎదురవ్వలేదు. వెలపరింత పుట్టుకొచ్చింది.

‘తప్పు చేసిన చెన్నడు పెద్దకులం పక్షమా? వాడు మగజాతి పక్షమా? వాడికి పడిన శిక్ష హెచ్చరిక మాత్రమేనా? గరిక గరికంత కూడా చెయ్యదా? దానిది చిన్నకులమా? అది ఆడజాతికి చెందినదా? కలిగినవాడికో నిబంధనా? లేనివాడికో నియమమా? పెద్దజాతికి హారతులా. చిన్నజాతికి అగౌరవమా. ఛీ. ఛీ. ముష్కర ముఠాదారా. నువ్వో దుర్గ నాయకుడివి. నీకో రాళ్లదుర్గం. అది మళ్లీ మేం కట్టడం.’ ఈ విధంగా మనసు రగిలించుకుంటూనే ముఠాదారు దుర్గంగా అంతకుముందే కోలగాళ్లందరూ కలిసి అక్కడ నిలిపిన రాళ్ల గోడమీద పడేలా కాండ్రించి తుపుక్కున ఉమ్మేసింది. రాళ్లమీద పడిన ఆ కాండ్రింత ఉమ్ములా లేదు. కులభేదాల దుర్గాలన్నింటినీ సమూలంగా కూల్చిపారేసే అమ్ములా ఉంది.

ఆ బాణాన్ని ఊసిన గంగు వెనక్కి తిరిగి చూడకుండా తల్లిదండ్రులను సైతం వదిలిపెట్టేసి విసవిసా నడుచుకుంటూ తిన్నగా ఇంటికి పోయింది.

   *      *      *

మత్స్యరాజ్యం మంచి ఊపు మీద ఉంది. దసరారోజులు కాబట్టి మరీ హుషారెత్తిపోతోంది. అందునా రాజు లేని రాజ్యం. ‘ఇల్లాలు లేని ఇల్లు ఇండిగెల వనం.. పురుషుడు లేని ఇల్లు పులి ఉన్న కోనం..’ అన్నట్టుగా ఉంది. పాలన పూర్తిగా అస్తవ్యస్థం అయిందని కాదు. ప్రణవశర్మ అంత తెలివితక్కువ మంత్రీ కాదు. ఎక్కడవారిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతున్నాడు. రాజ్యాధికారం ఎలా సాగాలో అలానే సాగిస్తున్నాడు. అయినప్పటికీ సింహాసనం ఖాళీగా ఉందన్న యోచన చాలు. ప్రజాళికి మరికొంత స్వేచ్ఛ. అది విజయదశమి రోజులు కాబట్టి జనం సంబరానికి అడ్డు లేనేలేదు.

మత్స్యరాజ్యమే ఇలా ఉంటే రాజధాని వడ్డాది సంగతి మరి చెప్పనక్కరలేదు. మరీ సందడిగా కానవస్తోంది. రాచమహలంతా రంగులతో పొంగులు వారుతోంది. ఊరుఊరంతా కళకట్టేసింది. ప్రజలందరూ పండగ హడావుడిలో పడి ఉన్నారు. కోడిపందా బారులు గీసుకున్నాయి. గొర్రెపందాల గడులు తెగతేరి ఉన్నాయి. వేటమాంసాల ఉడుకులతోనూ, పూర్ణంబూరెల బుసబుసలతోనూ అన్ని ఇళ్లూ ఆకళ్లు తీర్చే అన్నపూర్ణలే అయ్యాయి. దారులన్నీ జయతోరణాల ద్వారాలతో అలరారుతున్నాయి. అన్ని వీధులూ రంగవల్లులతో అలంకృతమై ఉన్నాయి. ఎటు చూసినా విందులూ విలాసాలే.

అన్ని వీధులకంటే మరింత తళతళలాడుతోంది సానివీధి. మేళాల కోసం వచ్చిపోయేవారితోనూ, సానులతో సరససల్లాపాలాడే విలాస పురుషుల తోనూ గగ్గోలుగా ఉంది. ప్రతీ సాని ఇల్లూ సుఖాలపుట్టే అన్నట్టుగా సరసులకు అనిపిస్తోంది. సౌఖ్యాల తట్టు అనేటట్టుగా కళావల్లభులకు కనిపిస్తోంది.

భోగంవారి ఇళ్లముందు బుక్కారంగులు జల్లి ఉన్నాయి. అరుగుల మీద లత్తుక సీసాలు లబ్జుగా దర్శనమిస్తున్నాయి. మిఠాయి కిళ్లీల మరదళ్లు వసారాల్లో వరసైన బావలను ఆటపట్టిస్తున్నారు. మరువం, ధవనం, జాజి, సంపెంగ రసాలన్నీ కస్తూరితో కలిసి బావయ్యలను కిర్రెక్కిస్తున్నాయి. జాజికాయ, జాపత్రి, ఏలకులు పొడిపొడిగా అయిపోయి పునుగులో కలగలిసి పెరపెర లాడుతున్నాయి. అందరికంటే భోగపు మహారాణీగా అప్పటికే పేరు పడ్డ పద్దెనిమిదేళ్ల కులతిలక నివాసమయితే స్వర్గానికి మరోరూపులా తయారై ఉంది. పరిచారకులతోనూ, చెలికత్తెలతోనూ, సేవకా జనంతోనూ ఇంటికి వచ్చేపోయే రాచప్రతినిధులతోనూ చెప్పలేనంత రద్దీగా ఉంది.

కులతిలక పేరుకు తగ్గట్టే సానుల కులానికి తిలకమే. ఆమె వదనం మళ్లీ మళ్లీ చూడాలని పించేటంత! ఆమె లావణ్యం మరీ మరీ తిలకించా లన్నంత! ఆమె రూపు ఇంకా ఇంకా దర్శించా లన్నంత! ఆమె చందం చెప్పలేనంత! ఆమె అందం అలవిగానంత! ఆటలోనూ పాటలోనూ ఆమె ఘనాపాఠి. పార్థసారథి కోవెల్లో జన్మాష్టమినాడు గళమెత్తి గీతాలాపన చేసినా, రాజమహల్లో కాలు కదిపి నర్తించినా, మేళాల్లో శాస్త్రీయంగా నృత్యం చేసినా ఆమెకు ఆమే సాటి. ఆమెకు ఆమే మేటి.

ఆమె తల్లి సువర్ణ తిలకకు ఇదంతా మహదా నందమే. అయితే, పిల్లకు కన్నెరికం కాకపోవడమూ, దరిచేరాలని వస్తున్న సంపన్న కుటుంబాల నవయవ్వ నులెవరినీ కులతిలక దగ్గరకు చేర్చుకోకపోవడమూ కొంతలో కొంత బాధ. ఆ బాధకు తోడు ఈ రోజు మరో దురవస్థా పట్టుకుంది.

ఆ రోజు మహాష్టమి. మేళం కోసం మినుము లూరు దేశం నుంచి కుర్రజట్టు రావడం, స్వయంగా కులతిలకే మేళానికి వస్తానని వాళ్లకి మాట ఇవ్వడం, వంటల మామిడి చావిట్లో మేళం ఏర్పాటుకు రంగం సిద్ధంకావడం క్షణాల్లోనే జరిగిపోయింది.

అయితే మున్నెన్నడూ లేనివిధంగా ఎగువ రాజ్యం మీద మేళం పెట్టడం సువర్ణతిలకకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మినుములూరు యువబృందం ఇంటినుంచి వెనుదిరిగింది మొదలూ జేవురించిన ముఖంతోనే ఉంది. తల్లి పడుతున్న ఇబ్బంది కూతురు కులతిలకకు అవగతం కాకపోలేదు. కానీ ఆ పిల్ల ఆశ ఆ పిల్లది. పాతకాలం నాటి పద్ధతులు పట్టుకుని తల్లిలాగానే వేళ్లాడితే బతుకుసాగేదెలా అనే యోచన ఆ పిల్లది. అందుకే అమ్మకు అంగీకారం కాదని తెలిసినా మినుములూరు మేళానికి ఒప్పుకుంది. అవసరమైతే అమ్మకు గట్టిగానే చెప్పాలనీ నిర్ణయించుకుంది.

ప•గలంతా తల్లీబిడ్డలిద్ద్దరూ రకరకాల పనుల్లో పడిపోవడంవల్ల ఇరువురి నడుమా ఈ విషయాలేవీ ప్రస్తావనకు రాలేదు.

మలిసంధ్యవేళ పూలు గుచ్చుకుంటున్నప్పుడు కాస్తంత ఖాళీ దొరికింది. అతిథులు కూడా వెళ్లిపోవడంతో ఇంటి పైఅంతస్తులో ఇద్దరూ నేలమీదనే చాపలు పరుచుకుని కూర్చున్నారు. పూలమాలలు కట్టుకుంటున్నారు.

సువర్ణతిలక, కులతిలక అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు. తల్లీకూతుళ్లకి మాట్లాడు కోవాలనే ఉంది. ఎవరు ముందుగా మొదలుపెట్టాలో అనేదే సమస్య. కాలం గడిచిపోతోంది. సంధ్యాదీపం చంద్రునికి నీరాజనం పడుతున్నవేళ అయింది. ఇక సువర్ణ ఆగలేకపోయింది. అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ ఆ తావున లేరని నిర్ధారించుకుని అప్పుడు మొదలెట్టింది.

‘‘నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. నాకయితే అస్సలు నచ్చలేదు.’’ పుల్లవిరుపుగా అనేసింది.

‘‘నాకు తెలుసమ్మా. నీ ఇష్టాలేంటో అయిష్టా లేంటో.’’ చేయవలసిన ప్రస్తావనలే అమ్మ చేస్తోందని నిబ్బరపడుతూనే అంది కులతిలక.

‘‘నా ఇష్టాలగురించి కాదు నేను మాట్లాడేది. నువ్వు చేసిన పని మటుకు మహాఘోరం.’’ కడుతున్న మాలల్ని చాపమీద పారేసినట్టుగా పడేసింది సువర్ణ. కులతిలక అలా చెయ్యలేదు. చేతినున్న పూలహారపు పనులను మానకుండానే,

‘‘సానిపిల్ల మేళం కడతానంటే తప్పేంటి?’’ తెలివిగా దీర్ఘాలు తీసింది.

‘‘మేళమా పాడా! ఇంకా ఆ కొండవాళ్లను దోచుకోవలసింది ఏముంది గనక. పల్లం వాళ్లం అన్నింటా వాళ్లను ఇప్పటికే పట్టి పల్లార్చాం.’’ రెపరెపగా స్వరం పెంచింది సువర్ణ.

‘‘అదే అంటున్నాను. వాళ్లను దోచుకోవాల్సింది ఏమీ లేదు కదా! కాబట్టే వెళుతున్నాను.’’ కులతిలక కిలకిలమంది. సువర్ణకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే ఆమె పిల్లయినా తల్లయినా చూడదు. కేవలం న్యాయాన్యాయాలే చూస్తుంది. అందుకే కూతుర్ని పట్టుకుని ఝణఝణలాడించేసింది.

‘‘కులా! అతితెలివిగా మాట్లాడకు. కొండదేశాన్ని వడ్డాది రాజ్యం దారుణంగా కబళించింది. దిగువ రాజ్యంగా ఉండకుండా మనవాళ్లు ఎగువకు వెళ్లి కానిచ్చిన దురంతాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల సంస్కృతిని చట్టుబండలు చేశాం. వాళ్ల ఆట, వాళ్ల పాట సర్వనాశనం అయిపోయేలా చేశాం. వాళ్ల సంపద హరించేశాం. ఇదొక్క విషయంలోనే వాళ్లు కట్టుగా ఉన్నారు. తప్పు చెయ్యకు. వాళ్ల చేత చేయించకు.’’ ఒంటికాలి మీద లేచిన నాగసర్పమే అయింది. బిత్తరపోయింది కులతిలక. అమ్మ కోపానికి కారణం ఆమెకు పూర్తిగా తెలియకపోలేదు. కాలం మారుతుంటే మనం మాత్రం ఎందుకు మారకూడ దనేదే ఆ పిల్ల పట్టు. అందుకే,

‘‘నువ్వు అనేది ఏంటమ్మా! పైవాళ్లను పాడు చేసినవాళ్లందర్నీ వదిలిపెట్టేసి, ఆటపాటలను నమ్ముకున్న నన్ను నిలేస్తావా.’’ ఎదురుతిరిగినట్టుగా మాట్లాడింది. సువర్ణకు పాలుపోలేదు.

‘ఏం మాట్లాడుతోంది ఈ అమ్మాయి? ఇంత కన్నా దీనికి ఎలా చెప్పాలి? అలా అని ఊరుకుంటే కుదరదే. తన ప్రయత్నం తను చెయ్యవలసిందే. ఆనక ఆ పరమాత్ముని దయ.’ మనసులోనే అను కుంటూ, గొంతుపెళుసు తగ్గించుకుంటూ, కులతిల కకు దగ్గరగా జరిగి ఆమె నుదురు ముద్దాడింది.

‘‘కులా! మన వృత్తి ఏమంత మంచిది కాదు. ఇప్పటికే ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాం. పడుపుగత్తెలుగా ముద్రపడిపోయాం. వేశ్యావృత్తి కేవలం పల్లంలోనే ఉంది. గిరుల్లో లేదు. ఇప్పటి వరకూ కొండలమీదికి ఎక్కనే లేదు. అక్కడి ప్రజల సంసారబంధాలు అంత గొప్పవి. పడుపు కూడు తినే దేశం కాదది. అన్ని విషయాల్లోనూ ఎగువను ధ్వంసం చేసేసింది మన దిగువవారే. ఈ వేశ్యా వృత్తిని, మేళాలను అక్కడి జనానికి రుచి చూపించ• వద్దు. ఈ అంటును వనాల్లో పెట్టవద్దు. కోనల్ని కుళ్లబెట్టవద్దు. కనీసం ఆ దుర్మార్గాన్ని మనం చెయ్యకుండా ఉందాం. ఇంతకంటే నేనేం చెప్పలేనే తల్లీ.’’ కన్నీటితెర కమ్ముకురాగా చెప్పుకొచ్చింది.

అయోమయంలో పడ్డట్టయింది కులతిలక. తల్లి మనసు ఇప్పటికీ పాతవాసనలతోనే ఉందనేది ఆమె యాతన. కాబట్టే తప్తగా మారిన తల్లికి తన భావాలను వివరించాలన్నట్టుగా,

‘‘సానివృత్తి మనతో పుట్టిందీ కాదు. మనతో పోయేదీ కాదు. మనవల్ల ఎవరికి చెరుపు జరిగినా ముమ్మాటికీ నేరమే. అది కిందనున్న వడ్డ్దాది వాళ్ల విషయంలో మనం చేసినా నేరమే. మెట్టలమీది నందరాజ్యంలో చేసినా నేరమే. అమ్మా! ఒక్కమాట గుర్తుపెట్టుకో.

మనల్ని తయారుచేసిందే ఈ సమాజం. మన మంతా సమాజం చేసిన ప్రతిమలం. అంతకు మించి ఆలోచించవద్దు. నాకు కన్నెరికం కాలేదని నిత్యమూ వేదన చెందుతున్నావే. ఏమో మిట్టల మీదనే అదంతా జరుగుతుందేమో.’’ ఆశగా పలికింది. అయినప్పటికీ సువర్ణకు అదంతా నచ్చుబాటు కాలేదు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram