భారత్‌లో వలస పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, వారి దాస్య శృంఖలాల నుండి ముక్తి పొందటానికి ‘స్వ’ అనే భావనతో జాతీయ సంగ్రామం సాగింది. ‘స్వధర్మం’, ‘స్వరాజ్‌’, ‘‌స్వదేశీ’ అనే మూడు మంత్రాలతో ఈ భావన ప్రకటితమై దేశాన్నంతా కదిలించింది. సాధుసంతుల, మహనీయుల సాన్నిధ్యం నుండి ఆధ్యాత్మిక చేతన అంతస్సూత్రంగా ఈ సంగ్రామంలో నిరంతరం ప్రవహించింది, శక్తిని చేకూర్చింది. యుగ యుగాల నుండి భారత్‌ ఆత్మలో నిద్రాణమై ఉన్న ‘స్వ’ అనే భావన ఒక్కసారిగా జాగృతమై సంపూర్ణశక్తితో ప్రకటితమయింది. దీంతో విదేశీ శక్తులకు అడుగడుగునా వ్యతిరేకత ఎదురయింది. భారత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా వ్యవస్థల్ని ఈ విదేశీశక్తులే నాశనం చేశాయి. గ్రామ స్వావ లంబనాన్ని నష్టపరిచాయి. విదేశీశక్తుల ఆక్రమణని అన్ని వైపుల నుండి భారత్‌ ‌తిప్పికొట్టింది. ఐరోపా శక్తులకు వ్యతిరేకంగా భారతీ యులు జరిపిన సంగ్రామాన్ని, పోరాటాన్ని ప్రపంచ చరిత్రలోనే ఓ అద్భుత ఉదాహరణ. ఇది బహుముఖీనమైన ప్రయత్నం.

ఒకవైపు విదేశీ దురాక్రమణదారులను తరిమి కొట్టేందుకు సాయుధులై నడుం బిగిస్తే, ఇంకోవైపు నుండి సమాజాన్ని శక్తిమంతం చేసేందుకు, పనిలో పనిగా పేరుకుపోయిన చెడుని నిర్మూలించేందుకు సామాజిక పునర్నిర్మాణ / పునఃరచన కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దేశంలోని సంస్థానాధీశులు తమ శక్తి మేర తెల్లదొర లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తమ సాధా రణ, దైనందిన జీవితంలో జోక్యం చేసికుంటున్న, జీవన మూల్యాలపై దాడి చేస్తున్న తెల్లదొరలకు వ్యతిరేకంగా ప్రతీచోటా గిరిజన సమాజం నడుం బిగించి నిలిచింది. తమ సామాజిక విలువల్ని కాపాడుకునేందుకు జాగృతమైన వీరి పట్ల ఇంగ్లిష్‌ ‌వారు క్రూరాతిక్రూరంగా వ్యవహరించారు, నరమేధం సృష్టించారు. అయినా తాము కొనసాగిస్తున్న జాతీయోద్యమం నుంచి వారు ఒక్క అడుగు కూడా వెనుకేయలేదు. దీని పరిణామ స్వరూపమే 1857లో జరిగిన దేశవ్యాప్త స్వాతంత్య్ర సంగ్రామం. లక్షలాది మంది ఈ సంగ్రామంలో ప్రాణాలను అర్పించారు.

భారతీయ విద్యా వ్యవస్థను నష్టపరిచే కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు, అడ్డుకునేందుకు కాశీ హిందూ విశ్వవిద్యాలయం, శాంతినికేతన్‌, ‌గుజరాత్‌ ‌విద్యాపీఠ్‌, ‌తిరునల్వేలిలోని ఎండీటీ హిందూ కాలేజ్‌, ‌కార్వే శిక్షణ సంస్థ, డెక్కన్‌ ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ, కాంగ్దిలోని గురుకుల్‌ ‌లాంటి విద్యాసంస్థలు నడుం బిగించాయి. విద్యార్థుల్లో, యువతలో దేశభక్తి బీజాలు నాటుతూ జాగృత పరచడం మొదలెట్టాయి. ప్రఫుల్ల చంద్రరాయ్‌ , ‌జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌వంటి వైజ్ఞానికులు తమ ప్రతిభని భారతాభివృద్ధి కోసం సమర్పించారు. ఇదే క్రమంలో నందలాల్‌ ‌బోస్‌, అవనీంద్రనాథ్‌ ‌టాగోర్‌, ‌దాదా సాహెబ్‌ ‌ఫాల్కే లాటి కళాకారులు తమ కళల ద్వారా, మాఖన్‌లాల్‌ ‌చతుర్వేది లాటి ఇంకొందరు జాతీయ నేతలు పత్రికా రచన ద్వారా స్వాతంత్య్ర సంగ్రామం వైపు మళ్లే లాగా జనాన్ని ప్రేరేపించారు. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరవింద యోగి లాంటి మహితాత్ముల ఆధ్యాత్మిక ప్రేరణ వీరందరికీ మార్గదర్శకంగా పని చేస్తూ వచ్చింది.

బెంగాల్‌లో రాజ్‌నారాయణ్‌ ‌బోస్‌ ‌నిర్వహించిన హిందూ సమ్మేళనాలు జాతరలు, మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌నిర్వహించిన గణేశ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉత్సవాల వంటి సార్వజనిక కార్యక్రమాలు భారతీయ సాంస్కృతిక పునాదులను పటిష్టం చేస్తూ వచ్చాయి. మరోవిధంగా చెప్పాలంటే భారతీయ సాంస్కృ తిక వృక్షాలు మరింత విశాలంగా వ్యాపించేందుకు ఆ వృక్షాలకు నీరందిస్తూ వాటి వేళ్లని అవి బలోపేతం చేశాయి. ఇదే సమయంలో జ్యోతిబా ఫులే, సావిత్రీబాయ్‌ ‌ఫులే లాంటి సంస్కర్తలు మహిళా విద్యని, నిమ్నవర్గాలను శక్తిమంతులుగా మార్చేందుకు సామాజిక ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదే క్రమంలో డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌సమాజాన్ని సంఘటితం చేసేందుకు, సాంఘిక సమానత్వాన్ని సాధించేందుకు ఎలా సంఘర్షించాలో మార్గదర్శనం చేశారు. భారతీయ సామాజిక జీవనంలోని ఏ క్షేత్రం కూడా మహాత్మా గాంధీ ప్రభావం నుంచి తప్పించుకో లేదు. విదేశాల్లో ఉంటూనే భారత స్వాతంత్య్ర సంగ్రా మానికి మరింతగా పదును పెడుతూ, సంపూర్ణమైన మద్దతిచ్చారు శ్యామ్‌జీ కృష్ణవర్మ, లాలా హర్‌దయాళ్‌, ‌మేడం కామా లాంటివారు. భారత్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర సంగ్రామ కార్యకలాపాలకు లండన్‌లోని ఇండియా హౌస్‌ ‌కేంద్రమైంది. క్రాంతి వీర్‌సావర్కర్‌ ‌రాసిన 1857 నాటి జాతీయ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర భారతీయ విప్లవవీరులను ఎంతగానో ఆకట్టుకున్నది. విప్లవ యోధుడు భగత్‌సింగ్‌ ‌స్వయంగా ఈ పుస్తకాన్ని ప్రచురించి వందలాలది ప్రతులను పంచిపెట్టారు.

దేశంలో క్రియాశీలంగా ఉన్న నాలుగువందల పైచిలుకు అజ్ఞాత పోరాట సంస్థలలో/రహస్య సంస్థలలో పనిచేస్తున్న విప్లవవీరులెందరో తమ ప్రాణాలను లెక్క చేయకుండా భారతమాతను తెల్లదొరల దాస్య శృంఖలాల నుండి విడిపించే ఉద్యమంలో పాల్గొన్నారు. బెంగాల్‌లో పనిచేసే విప్లవ సంస్థ ‘అనుశీలన్‌ ‌సమితి’లో చురుకుగా పాల్గొన్న డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌లోకమాన్య తిలక్‌ ‌ప్రేరణతో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. సెంట్రల్‌ ‌ప్రావిన్స్ ‌కార్యదర్శి అయ్యారు. 1920లో నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సమ్మేళన నిర్వాహక కమిటికి ఆయన ఉప నాయకుడు. ఈ సమ్మేళనంలోనే ఆయన ‘సంపూర్ణ స్వరాజ్యం’ తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు శతథా ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ‌నాయకత్వం అందుకు సుముఖంగా వ్యవహరించలేదు. చివరికి ఎనిమిదేళ్ల తర్వాత లాహోర్‌లో జరిగిన సభలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. రెండవ ప్రపపంచ యుద్ధ సమయం లోనే నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు నాయకత్వం వహించారు. ఆయన నాయ కత్వంలోనే స్వతంత్ర భారతానికి తొలి ప్రభుత్వం ఏర్పాటయింది, అంతేకాదు ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలను స్వతంత్రం చేయటంలో కూడా సఫలమైంది. ఎర్రకోటలో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు చెందిన అధికారులపై కొనసాగిన కేసు విచారణ సమస్త భారతావనిలో ఆగ్రహావేశాల్ని రగిల్చింది. ఇదే సమయంలో బ్రిటిష్‌ ‌నావికా దళాధి కారులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు భారత్‌ ‌వదిలి వెళ్లేవిధంగా తెల్లదొరలకు విధి లేని పరిస్థితిని కల్పించింది.


మహిళ వేషంలో పరారయిన హ్యూమ్‌

కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుడు ఐలన్‌ ఆ‌క్ట్రోవియన్‌ ‌హ్యూమ్‌ 2 ‌జూన్‌ 1829‌లో జన్మించారు. ఆయన తండ్రి జోసెఫ్‌ ‌హ్యూమ్‌ ‌బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యుడిగా వుండేవాడు.

1857 నాటి విప్లవానికి సుమారు రెండేళ్ళ ముందు హ్యూమ్‌ ఇటావా జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా నియమించబడ్డాడు. మీరట్‌లో ప్రారంభమయిన విప్లవానికి సంబంధించిన సమాచారం ఆయనకి రెండు రోజుల తర్వాతే అందింది. ఇటావాలో జరిగిన సంఘర్షణలో ఆయన పలువురు విప్లవకారులు చంపించాడు, కొందరిని నిర్బంధించాడు. 18-19 మే నెలలో వత్తిడి తెచ్చినప్పటికీ కొందరు విప్లవకారులు లొంగి పోయేందుకు నిరాకరించారు, ఒక మందిరంలో వారంతా దాక్కున్నారు. ఆ తర్వాత హ్యూమ్‌ ‌తన సహాయకుడైన డేనియల్‌ ‌సహా కొందరు సైనికులతో అక్కడికి చేరుకున్నాడు. దాంతో విప్లవకారులంతా వారిపై విరుచుక పడ్డారు. భయపడిపోయిన హ్యూమ్‌ ‌ముస్లిం మహిళ వేషంలో అక్కడి నుంచి ఆగ్రాకు పారి పోయాడు. ఆ సమయలో అతను తనని ఎవరూ గుర్తు పట్టకుండా వుండేందుకు తన శరీరంపై నల్లరంగుని పులుముకున్నాడనీ, నల్ల టోపీ పెట్టుకొని, నల్ల గౌను తొడుక్కొని పారిపోయాడని చెప్పుకుంటారు.

(సందర్భం: విలియం వేడర్బర్న్, ఏ.ఓ. ‌హ్యూమ్‌, ‌ఫాదర్‌ ఆఫ్‌ ‌ద ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌, ‌ప్రథమ సంస్కరణ, 1913, కొత్తఢిల్లీ, 1974. పుట 7)


స్వాతంత్య్ర సూర్యుడు ఉదయించాడు.కానీ విభజన గ్రహణం పక్కనే పొంచి ఉంది. ఆ కఠిన పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లే ఉత్సాహం ఇనుమడించింది. ఈ కీర్తి ప్రతి భారతీయుడిది. తమ జాతీయ ఆకాంక్షని నెరవేర్చుకునేందుకు, దేశాన్ని దాస్యశృంఖలాల నుండి విడిపించుకుందుకు వారు తమ రక్తాన్ని, చెమటని ధారపోశారు, ప్రాణాలని బలిదానం చేశారు. ‘భారత్‌ ‌జాగృతమవాలి.. తన కోసం కాదు, సమస్త విశ్వం కోసం, మానవత కోసం జాగృతమవాలి’ అని అరవింద యోగి ఒక సందర్భంలో చెప్పారు. అరవిందుడి వాక్కులు నిజమయ్యాయి. భారతదేశం సాధించిన స్వాతంత్య్రం ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణ ఇచ్చింది. ఒక దాని తర్వాత మరొకటి చిన్నా పెద్ద దేశాలన్నీ స్వతంత్రమయ్యాయి. ఎన్నడూ మబ్బుల చాటుకు వెళ్లని బ్రిటన్‌ ‌సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. పోర్చుగీస్‌, ‌డచ్‌, ‌ఫ్రెంచ్‌ ఆ ‌తర్వాత చాలా కాలానికి బ్రిటిష్‌ ‌వాళ్లు భారత్‌కు వచ్చారు. వీళ్లంతా వ్యాపారం నెపంతో వచ్చారు. వ్యాపారంతో పాటుగా భారతీయ సంస్కృతికి నష్టం కలిగించడమే గాక మతమార్పిడులు చేసేందుకు ప్రయత్నించారు. 1498లో ఐరోపా యాత్రికుడు వాస్కోడిగామా భారతభూమిపై కాలుమోపిన నాడే వలస పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా మనవాళ్లు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ట్రావన్కోర్‌ ‌మహారాజు మార్తాండ వర్మ చేతుల్లో పరాజితులై డచ్‌ ‌వాళ్లు భారత్‌ ‌వదిలి పారిపోయారు. పోర్చుగీసు వారు గోవాకు మాత్రమే పరిమితమై, అక్కడే ముడుచుకొని ఉండి పోయారు. బ్రిటిష్‌వారు మాత్రం తమ కుటిల యత్నాలతో భారత్‌లో సగానికన్నా అధిక ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నా మిగతా ప్రాంతమంతా భారతీయ పాలకుల ఆధిపత్యంలోనే ఉండేది. వారితో బ్రిటిష్‌ ‌వాళ్లు సంధి చేసుకున్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఈ పాలకుల రాజ్యాలన్నీ గణతంత్ర భారత్‌లో విలీనమయ్యాయి.

భారత్‌ ‌ప్రజాస్వామిక మార్గాన్ని ఎంచుకుంది. ఇవాళ ప్రపంచం మొత్తమ్మీద భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేకాదు సఫల ప్రజాస్వామ్య దేశం కూడా. ఎవరయితే భారత్‌లోని సాంస్కృతిక విలువల్ని, మూల్యాలని కాపాడేందుకు, స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించారో వారే భారత రాజ్యాంగ రచన కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. ఈ కారణంవల్లే రాజ్యాంగానికి సంబంధించిన తొలిప్రతిలో చిత్రాల ద్వారా రామరాజ్య కల్పనని, వ్యాసుడు, బుద్ధుడు, మహావీరుడు లాంటి భారతీయ వ్యాఖ్యాతలను చూపుతూ భారత పరిపూర్ణ సాంస్కృతిక ప్రవాహవ్యవస్థని ఉటంకించారు.

ఆ క్రాంతివీరుల పట్ల, దేశభక్తుల పట్ల ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవ’ సందర్భంగా కృతజ్ఞతను వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందరో అజ్ఞాత వీరుల, వెలుగులోకి రాకుండానే ఉండి పోయిన పలు చారిత్రిక ఘటనల, సంస్థల, ప్రాంతాల స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని పునరావలోకనం, మూల్యాంకనం చేసుకుంటూనే వాటితో ముడిపడ్డ, జనం నోళ్లలో నానిన స్వాతంత్య్ర సంగ్రామ ఘటనల స్మృతుల్ని ప్రోది చేసుకుంటూ, జాతీయ జీవన స్రవంతికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాబోవు తరాల వారికి ఇవన్నీ తెలియ జెప్పాల్సిన కర్తవ్యం మనందరిదీను.

అనువాదం : విద్యారణ్య కామ్లేకర్‌

About Author

By editor

Twitter
Instagram