పొలవరం ప్రాజెక్టు కాగితాల మీద నుంచి గోదావరి మీదకు రావడానికి ఎంతకాలం పట్టిందో, దాని అంచనాలూ, మార్గదర్శకాలూ ఒక కొలిక్కి రావడానికి కూడా అంతే సమయం పట్టేలా ఉంది. పరస్సర విమర్శలు,  రాజకీయ లబ్ధితో వ్యూహాలు ప్రాజెక్టు పనులను దారుణంగా అడ్డుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు అధికారంలో ఉండగా ఒకమాట, విపక్షంలో ఉన్న మరొక మాట మాట్టాడడం వల్ల కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకమవుతోంది. ఏమైనా ఆంధప్రదేశ్‌ ‌విభజన చట్టంలోని 90వ సెక్షన్‌ను సవరిస్తే తప్ప కదలిక రాదన్న సంగతిని ఎవరు గుర్తించారో అర్థం కాదు. రివర్స్ ‌టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు వ్యయం తగ్గిస్తామని ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. డిజైన్‌ ‌మార్చాం కాబట్టి ప్రాజెక్టు అంచనా మొత్తం వ్యయం రూ. 55 వేల కోట్ల రూపాయలలో ఆ మార్పులకు అయిన వ్యయం రూ. 5,535 కోట్లని ప్రభుత్వం చెబుతున్నది. ఈ పెంపుతో వ్యయం రూ. 7,192 కోట్ల రూపాయలకు చేరింది. ఆ అదనపు వ్యయం రూ. 1,657 కోట్ల రూపాయలని ప్రభుత్వం వాదన. దీని మీదనే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.

రివర్స్ ‌టెండరింగ్‌తో వ్యయం తగ్గుతుందని ఒకసారి ముఖ్యమంత్రి అన్నారు. కానీ తరువాత పెరిగిందని ఎలా చెబుతారని అడుగుతున్నారు ప్రజలు. డిజైన్‌ ‌మార్పుతో పెరిగిన వ్యయం రూ. 1,657 కోట్లు కేంద్రం ఎందుకు చెల్లించదని కొన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రం మెడలు వంచలేక పోయిందనీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును కాస్తా లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుగా మార్చాయనీ ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. అదనపు వ్యయాన్ని రాబట్ట లేకపోవడానికి కారణం- అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంతో చేసుకున్న ఒప్పందమేనని బంతిని విపక్షం కోర్టులోకే విసురుతోంది అధికార పార్టీ. వీటిలో నిజం ఎంత? 2016 నాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంతో లాలూచీ పడి పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్‌ (‌సాగు పారుదల) భాగానికి సాయం చేయడానికే ఒప్పందం చేసుకున్నారని చెప్పడం తప్పు. రూ. 55 వేల కోట్ల డీపీఆర్‌ ఆమోదింపజేశాం కాబట్టి మెత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఒప్పించేశామని నాడు అధికారంలో ఉన్నవారు చెప్పడం కూడా అంతే తప్పు. వాస్తవాలకి ఇంకాస్త దగ్గరగా వెళ్లడానికి ‘ఆంధప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం’ దగ్గరకు వెళ్లాలి. అందులోని సెక్షన్‌ 90‌లో పొందుపరచిన అంశాలు 1) పోలవరం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం 2) ప్రజాహితం కోసం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు భాగాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం చెప్పడం 3) ఈ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు వివరించడం 4) కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, పర్యావరణ, అటవీశాఖ, సహాయ పునరావాస నియమావళి వంటి అనుమతులు రాబడతామని చెప్పడం.

సెక్షన్‌ 90 ‌ప్రకారం ఈ అనుమతుల గురించి ప్రస్తావించారు. కానీ దానికయ్యే వ్యయం కోసం ఆర్థిక వనరుల గురించి అస్పష్టత ఉంది. కాబట్టే, ఫిబ్రవరి 20, 2014న ఆంధప్రదేశ్‌ ఎం‌పీలు, మేధావుల ఒత్తిడి మేరకు నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ‌సింగ్‌ ‌రాజ్యసభలో ఆరు ప్రకటనలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సహాయ, పునరావాసాల కోసమయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా సాధ్యమైనంత త్వరలో చట్టంలో సవరణలు తెస్తామని చెప్పేదే అందులో నాల్గవ అంశం. కానీ పునర్విభజన చట్టం సెక్షన్‌ 90‌కి ఈ సవరణ జరిగిందా? ఈ సవరణ అవసరమని భావించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కోణంలో ఆభ్యర్ధించారా? ఒకవేళ ఈ అంశం ప్రాధాన్యం లేనిదే అయితే, నాడు ఎంపీలు, మేధావుల కోరిక మేరకు నాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఎందుకు ప్రకటన చేసినట్టు? కాగా, ఇప్పుడున్న చట్టాన్ని సవరించకుండా కేంద్ర ప్రభుత్వం సహాయ, పునరావాస వ్యయాన్ని సర్దుబాటు చేయగలదా? ప్రస్తుత పరిస్థితుల్లో చట్ట సవరణ చేయకుండా, పత్రికలలో వచ్చిన విధంగా, రాష్ట్ర ఆర్థికమంత్రికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావించిన పరిధికి మించి నిధులు రావడం కష్టం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రూ. 55 వేల కోట్లకు డీపీఆర్‌ను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆమోదింపచేశాం కాబట్టి ఆ మొత్తం వచ్చే నిధులను నేటి రాష్ట్ర ప్రభుత్వం చెడగొట్టిందనే వాదన సమంజసం కాబోదు. ఎందుకంటే నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత శాతమైనప్పటికీ ప్రాజెక్టు మొత్తానికి (ఇరిగేషన్‌, ‌తాగునీరు, విద్యుత్‌ ‌కలిపి) సంబంధించిన డీపీఅర్‌ని రాష్టప్రభుత్వం ద్వారా కేంద్రానికి సమర్పించి ఆమోదింప చేసుకోవాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగిన తరువాత సెప్టెంబర్‌ 8, 2016‌న ప్రత్యేక ఆర్థిక సహాయం కింద నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ ‌జైట్లీ అనేక అంశాలను ప్రస్తావించారు. అందులోని నాల్గవ అంశం పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి స్పష్టతనిచ్చేదే. ఇరిగేషన్‌ (‌సాగు పారుదల) భాగానికి ఏప్రిల్‌1, 2014 ‌తరువాత అయిన వ్యయాన్ని ఆనాటి ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 100% భరిస్తుందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టటానికి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు ప్రతిపాదించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జరిగిందే. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ ‌వ్యయం కాకుండా, ఇరిగేషన్‌ (‌సాగు పారుదల) భాగం వరకు మాత్రమే నిధుల మంజూరుకు లాలూచీ జరిగిందని కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసేవారు ఆంధప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 90‌ని చదవడం అవసరం. దానిని అర్ధం చేసుకొని మాట్లాడడం ఇంకా అవసరం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు ఏ అంశం గురించి మాట్లాడా లన్నా విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ‌మాత్రమే ఆధారమని గుర్తించాలి. అందులో మార్పులు చేర్పులు కావాలంటే చట్టానికి సవరణతోనే సాధ్యం. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండే విధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణ ఉంది. ఎవరు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా చట్టంలోని నిబంధనల మేరకు, ఆ నిబంధనల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం పరిధిలోనే చేయగలరు.

ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటిస్తున్నది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పూర్తి ఆడిట్‌ అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని తిరిగి చెల్లిస్తున్నది. పోలవరం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తరువాత ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.11,300 కోట్లు. అందులో నాబార్డ్ ‌ద్వారా రూ. 7,664.16 కోట్లు విడుదల చేశారు. మిగతా నిధులు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రాష్ట్రానికి విడుదల చేసింది. నాబార్డ్ ‌ద్వారా విడుదల చేసే నిధులపై కొంతమంది చేసే విమర్శలు కేవలం రాజకీయ నేపధ్యంతో చేస్తున్నవే తప్ప, వాస్తవికమైనవి కావు. నాబార్డ్ ‌ద్వారా విడుదల చేసే నిధుల భారం కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుంది కానీ, రాష్ట్రానికి సంబంధం లేదు. కేంద్రం చట్టపరంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలి. కానీ ఆ నిధులను కేంద్రం ఎలా సమకూర్చు కుంటుందనే విషయం రాష్ట్రానికి అనవసరం. పోలవరం నిధుల విడుదల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ నుండి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించవచ్చు. కానీ సంబంధం లేనివారికి నాబార్డ్ ఆ ‌ఖాతా వివరాలు ఇవ్వదు.

గత ఆరు సంవత్సరాలుగా ఆంధప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు చేసుకొంటున్న రాజకీయ విమర్శల ప్రభావం ఏమిటి? సహాయ పునరావాస వ్యయం గురించి చేసుకుంటున్న విమర్శలతో నేడు పోలవరం ఇరిగేషన్‌ (‌సాగు పారుదల) ప్రాజెక్టుపై దుప్ప్రచారాలకు, అపోహలకు అవకాశం వచ్చింది. గతంలో ప్రతిపక్షాలు పోలవరం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు వ్యయంలో, సహాయ, పునరావాస వ్యయం అంచనాలలో పూర్తి అవినీతి జరిగిందంటూ గతంలో ఆరోపణలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ వారే అధికారంలోకి వచ్చాక, వారు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపలేదు. పైగా గత ప్రభుత్వం తయారు చేసిన అంచనాలనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేత ఆమోదింపచేయడానికి ప్రయత్నించింది. అలాంటప్పుడు రివర్స్ ‌టెండరింగ్‌ అం‌టూ, ప్రాజెక్టు వ్యయం తగ్గించామంటూ ప్రచారం చేసుకున్నా వాస్తవంగా ప్రాజెక్టు వ్యయం ఎందుకు తగ్గలేదన్నదే ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై అనుమానాలు బలపడుతున్నది అందుకే.

2017-18 ధరల ప్రకారం జరగవలసిన రివర్స్ ‌టెండరింగ్‌, ‌సహాయ పునరావాస అదనపు వ్యయం గురించిన ఆరోపణలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్‌ ‌రూ. 55,548.87 కోట్లు. అయితే దీనిలో ఇరిగేషన్‌ (‌సాగుపారుదల) భాగం ఎంతో చెప్పకుండా, మేము మెత్తం సాధించామని ఒకరు చెబుతుంటే, మరొకరు అసలు సెక్షన్‌ 90 ‌మీద అవగాహన లేనట్టు కేవలం ఇరిగేషన్‌ (‌సాగుపారుదల) భాగం మాత్రమే ఒప్పుకొన్నారంటు వాస్తవాలను కప్పిపెడుతున్న వైనం ప్రాజెక్టు పని పూర్తి చేయడం గురించి వీరికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకం చేస్తుంది.

డీపీఆర్‌ ‌రూ. 55,548.87 కోట్లలో హైడల్‌ ‌పవర్‌ ‌కోసం రూ. 4,124.64 కోట్లు, ఇరిగేషన్‌, ‌తాగునీరు కోసం రూ.18,256 కోట్లతో పాటు రూ. 33,168 కోట్లు సహయ, పునరావాస వ్యయం కోసమని తెలుసుకోవాలి. సెక్షన్‌ 90 ‌ప్రకారం హైడల్‌ ‌పవర్‌, ‌తాగునీటికి అయ్యే వ్యయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో ఉండదు. కాబట్టి రాష్టప్రభుత్వం భరించక• తప్పదన్నది అక్షరసత్యం. సహాయ, పునరావాస వ్యయం పెరుగుదల గురించి స్పష్టత లేకపోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. మొదటి కారణం- సహాయ, పునరావాస చట్టం 2013 అమలు చేయవలసి రావడం. రెండవ కారణం- దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం ఏడు మండలాలు కలపడం. ఇరిగేషన్‌ (‌సాగు పారుదల)తోపాటు హైడల్‌ ‌పవర్‌, ‌తాగునీరు అంశాలు కలసి ఉన్నందున గత ప్రభుత్వ అంచనాలపై నాటి ప్రతిపక్షం అవినీతి ఆరోపణలు చేసింది. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల వల్ల, వాస్తవ వ్యయం లెక్కలు తేలాల్సి ఉన్నందున ప్రతిష్టంభన కొనసాగడం మరొక అంశం. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 90‌లో సహాయ పునరావాస వ్యయంపై స్పష్టత లేకపోవడం మరొకటి. ఏమైనప్పటికీ నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ‌రాజ్యసభలో చేసిన ప్రకటనలో నాల్గవ అంశం ప్రకారం సహాయ పునరావాస వ్యయంపై దీర్ఘకాలిక ఇబ్బందులు రాకుండా చట్టంలో సెక్షన్‌ 90‌కి సవరణ అవసరం. ఈ అంశాలన్ని కలసి పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధాలుగా మారి, సమస్య జటిలమయింది.

2010లో పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో తీసుకువచ్చిన పరిమాణాలు (Quantities), అంచనాల మేరకు 2014 ధరలు ప్రకారం కేంద్ర ప్రభుత్వం వ్యయం భరిస్తున్న మాట సత్యం. కాబట్టి డిజైన్‌ ‌మార్పులు వల్ల అయ్యే అదనపు వ్యయం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది.

ఇప్పడు పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మాట్లాడడం కంటే రాజకీయ పార్టీలు పునర్విభజన చట్టంలోని వాస్తవాలను అర్థం చేసుకొవాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సహేతుకంగా సంప్రదింపులు జరిపి అవసరమైన నిధులు రాబట్టాలి. ఆంధప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని పక్షాలు రాజకీయ లాభాలను బేరీజు వేసుకుంటూ ఆరోపణలు చేయడం కాకుండా, వాస్తవికంగా ఆలోచించాలి. అంతేకాని, కొంతమంది చెబుతున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ సరికాదు. అలా రెచ్చగొట్టేవారి ఉచ్చులో పడితే పోలవరం ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు పూర్తి కావడం ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడున్న కర్తవ్యం ఒక్కటే. ఓర్పుగా పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్‌ ‌భాగానికి సంబంధించిన సహాయ పునరావాస వ్యయం నిక్కచ్చిగా అంచనా వేయాలి. ఆపై ఆ సహాయం అందకుంటే ప్రాజెక్టు పూర్తికాక పోగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం ఏ విధంగా నిష్పలమవుతుందో రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం ఒక్కటే మార్గం. దీనికి కుటిల రాజకీయ ఆలోచనలు పనికిరావు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల ప్రాతి పదికగానే పనిచెయ్యాలి. దానికి నిబద్ధతతో కూడిన రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి ఇరిగేషన్‌ ‌భాగంలోనే సహాయ పునరావాసం వ్యయం కలసివున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం. లేదా రెండవది రాజ్య సభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రకటనలో నాల్గవ అంశం ప్రకారం సహయ పునరావాసం వ్యయం సర్దుబాటు కోసం ఆంధప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టంలో అవసరమైన సవరణలు చేయడం. ఈ రెండు అంశాలలో ఏది సాధించాలన్నా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులే మార్గం. విభజన చట్టంలో కనిపించీ కనిపించకుండా ఉండిపోయిన అనేక లోపాల శాపాల పరిహారానికి ఈ మార్గమే ఉత్తమం.

– లంకా దినకర్‌, B.com., F.C.A.

About Author

By editor

Twitter
Instagram