(కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృతోత్సవ్‌ ‌పిలుపు మేరకు ప్రచురిస్తున్న 7వ వ్యాసం.)

మానవ జీవితం ఎప్పుడూ సంగ్రామ రంగమే! పీడకులు, పీడితుల నడుమ నిరంతరం పోరాటమే. నరుడికి నారి తోడై ముందు నిలిస్తే, శంఖం పూరించి ఆయుధం ధరించి, కదన సీమలో కాలుమోపితే ఘన విజయం తథ్యం. అధికార అహంకార మదోన్మత్తుడై చెలరేగిన నరకుణ్ణి అనంత విక్రమధీర నారీమణి సాత్రాజితి నేలకూల్చింది. విస్తరించిన అంధకారంలో ప్రకాశించే వెలుగుదీపంలా మారి సర్వస్వతంత్ర జ్యోతిగా వెలిగింది. అంటే కర్తవ్య నిర్వహణలోని ఇంతి కటిక చీకటిపాలిట పెనుమంట. నవభారత మహోదయంలో అతివల పాత్ర ఎంత సమున్నతమో అవలోకిస్తే, సర్వ సహజంగానే నారీ భేరీ నాదం ఇప్పటికీ మన వీనులకు విందు చేస్తుంది. విముక్తి సాధనకు ‘లెమ్మిక మేలుకొమ్ము, కదలింపు క్రాంతి రథమ్ము శాంతి మార్గమున్‌, ‌కాంతి పుంజముల ఖండములై నవజీవన ప్రభాతములు నింప….’ అంటూ మహిళామణులు నాడు సకల జనచేతనను రగిలించారు. సాగర ఘోషణను తలపిస్తూ పరపాలకుల ఎదుట రణాంగణ గర్జన చేశారు. సువిశాల దేశ విమోచన పోరు సీమలోకి సుడిగాలిలా చొరబడిన ఝాన్సీలక్ష్మీ బాయి పేరు వింటేనే ఈనాటికీ ప్రతి భారతీయుడి హృదయమూ పులకరిస్తుంది. గెలుపు కోసం నిర్విరామంగా పోరాడటంలోనే బలిమీ తెగువా ఉన్నాయని నిరూపించిందామె. మన స్వాతంత్య్ర మహోద్యమాన రణచరితలెందరో! సత్యం, ధర్మం, శాంతి అనే మూడింటినీ ఏకోన్ముఖం చేసి ఆంగ్లేయుల గుండెలదరగొట్టిన సమరధీరులను ఈ శుభ తరుణంలో పేరు పేరునా తలచుకుందాం. సబలగా ప్రబలగా మున్ముందుకు దూకిన నారీమతల్లులకు ఘన అభివందనాన్ని అందరం సమర్పిద్దాం.

అది స్వాతంత్య్ర సమర సమయం. భారత విప్లవ సందర్భం. పతికి హితవు పలికి యుద్ధభూమికి పంపిన మగువ అందరి మదిలోనూ మెదులుతోంది. ‘ధాత్రి చిత్ర పవిత్ర చరిత్ర లగుచు/వీర విస్ఫూర్తి సద్యశోద్ధారులగుచు/ఒప్పిరొకనాడు మా మహనీయ’ లన్న దీప్తిమంతత అంతటా వెల్లివిరుస్తోంది. ధైర్య సాహసాలకు తరతరాల చిరునామాగా రూపొందిన ఝాన్సీరాణి మొట్టమొదటి స్వతంత్ర సాధన పోరులో నిర్వర్తించిన నాయక పాత్ర ఆదర్శప్రాయమైంది. అంతకుముందు వీరాంగన రుద్రమదేవి ఎంతెంత ప్రళయకాల మహోగ్ర భానుకిరణంగా చెలరేగిందో ప్రతి ఒక్కరి స్మృతి పథానా నిలిచే ఉంది. ఈ అన్నింటి మేళవింపుగానే కాక, అలనాటి స్వయంపాలన సాధనోద్యమ వనితారత్నంగా అనీబిసెంట్‌ ‌పేరు ప్రస్తావించి తీరాలి. ఇండియన్‌ ‌హోమ్‌రూల్‌ ‌లీగ్‌ ‌సంస్థాపకురాలై 1906 నుంచే పోరుబాటలో సాగారు. హక్కులకు ఉద్యమించిన ఆ నేత 1933లో అస్తమించినా, ఆమె రగిలించిన పోరాట అగ్ని మటుకు అటు తర్వాత కొనసాగింది. పోలీసుల దమనకాండకు నిరసనగా చేపట్టిన ఐక్యకార్యాచరణ తదుపరి సంవత్సరాల్లోనూ ఆదర్శవంతమైంది. మరో శూర లలన భికాజీరుస్తుం కామా. తాను 1906లోనే విదేశమైన జర్మనీలో అంతర్జాతీయ సోషలిస్టు సమావేశ వేదికపైన భారత పతాక చిత్రణ రూపాన్ని ఆవిష్కరించింది. బ్రిటిష్‌ ‌పాలకుల నిర్బంధాలకు గురైనా వెరవక, సభల్లో ప్రసంగిస్తూ పత్రికల్లో రాస్తూ, ఉద్యమాన్ని సాగిస్తూనే వచ్చింది. అనంతర స్థితిలో భారతదేశానికి తిరిగి వచ్చి ఈ నేలపైనే శాశ్వతంగా నిద్రించింది. ఆమె అస్తమయం 1936లో సంభవించింది. దేశభక్తికి పర్యాయపదంగా వెలుగులీనిన కారణంగానే, స్వాతంత్య్రానంతరం 1962లో భారత ప్రభుత్వం తన పేరిట ప్రత్యేక తపాలా బిళ్లను వెలువరించి గౌరవ ప్రపత్తి చాటుకుంది.

సంకల్పమే మహాబలం

అందరికన్నా ప్రత్యేకం కస్తూరిబా గాంధీ. అప్పట్లో దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయుల్లో ఒకరిగా పోరు మార్గాన్నే ఎంచుకుంది. అటు తర్వాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ భర్త ఉత్సాహ ప్రోత్సాహా లతో కలిసి సాగింది. సాధనకు మూడేళ్లముందు 1944లో తుదిశ్వాస విడిచేవరకూ ఆమెది ఆగని పోరాటమే! ఎప్పుడో 1913లోనే మరికొందరు స్త్రీలతోపాటు సత్యాగ్రహ దీక్ష పాటించిన ఘన చరితు రాలు. విదేశంలో కారాగార వాసం చేసిన సాహస ముదిత. స్వదేశానికి తిరిగి వచ్చాకా ఆరేడు మార్లు నిర్బంధకాండను ఎదుర్కొంది. క్విట్‌ఇం‌డియా ఉద్యమ కాలంలోనూ నిర్బంధం పాలైంది. అన్ని అంతరాలూ మరిచి, అవాంతరాలను ఎదిరించి స్త్రీ శక్తి విజృంభించాలని పిలుపునిచ్చింది. ‘నవభారత యువ భారత నరనారీ ప్రియ పతాక; జైహిందని జేకొట్టుడు, స్వాతంత్య్ర నిలబెట్టుడు’ అన్నదే ఆ ధీర హృదయ మనోగతం. ‘ధగధగమని నిగనిగమని ఎగురుచుండె గగన మందు; మువ్వన్నెల సొంపులతో ముద్దులొలుకు వంపులతో’ అన్నదీ తన భావి సంకల్ప స్వప్నం.

అందరితోనూ మంచి అనిపించుకోవాలనే తపనతో చెడును ఏ దశలోనూ సమర్థించకూడదు. దాన్ని ఎదిరించి చెడ్డ అనిపించుకున్నా మంచిదే అనేది దుర్గాబాయి దేశముఖ్‌ అభిమతం. రాజమహేంద్ర వరంలో 1909లో ఆమె జననం. దరిదాపు 72 ఏళ్ల జీవితకాలం. అలుపెరుగని సమరయోధ, విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమానికి తన ప్రాంత నేతగా నిలిచింది. ఆ వస్త్రాల ఇంటినీ కుప్పగా పోసి, తోటి మిత్రులతో కలిసి, దహనం చేసింది. బిగ్గరగా జయభారత నినాదాలిచ్చి అందరి లోపలా ఉత్తేజం పెంపొందించింది. అప్పటికి తన వయసు పట్టుమని పదేళ్లయినా లేదు! పోరాట పర్యటనలో భాగంగా వచ్చిన బాపూజీకి-తాను సమీకరించిన చందాల నందించి ‘పిట్ట కొంచెం-కూతఘనం’ గుర్తుకు తెచ్చింది. కాలానుగత పరిణామాల్లో వనితా సాధికారతకు ఎనలేని కృషి సాగించిన ధీరోదాత్త.

ఎదురులేని ధిక్కార స్వరం

స్వచ్ఛంద జాతి మనది అని ఎలుగెత్తి చాటిన అతివలెందరో! ‘మన జాతీయత మంట కల్పుకొని నిర్మర్యాద నీచప్రవ/ర్తనకున్‌ ‌లోబడి, పారతంత్య్ర మనకున్‌ ‌దాసుండవై, నీవురా/తన విజ్ఞాన విశేషశేముషి నసత్యంబంచు శంకింపగా/జనునే? నీప్రియ భారతావని ప్రపంచ ఖ్యాతి నార్జింపదే’ అంటూ ముందస్తు హెచ్చరికలూ చేసిన సందర్భాలవి. పరపాలకులారా, మా దేశాన్ని వీడి వెళ్లండని ధీరగంభీర స్వరంలో నినదించిన వేరొక మహిళానేత సరోజినీ నాయుడు. దేశమంతటా సమరోత్సాహం నిండేలా రచనలు చేసిన, ఉపన్యాసాల జోరు పెంచిన భారతకోకిల. స్వతంత్ర దేశానికి తొట్టతొలి వనితా గవర్నర్‌ (ఉత్తరప్రదేశ్‌). ‌హైదరాబాద్‌లో పుట్టిన ఆ వీరనాయిక తదుపరి కాలంలో అఖిల భారత జాతీయ మహాసభలకు మొట్టమొదటి అధ్యక్షురాలు. దేశభక్తి నరనరాన నిండిన ఆమె.. స్వాతంత్య్రోద్యమ గ్రంథాల్ని ఎవరూ విక్రయించరాదన్న తెల్లదొరల ఆదేశాన్ని ధిక్కరించింది. అంతేగాక వీధి వీధినా వాటిని అమ్మి శాసనోల్లంఘన పర్వంలోనే చరిత్ర సృష్టించింది. ‘ఇది మీ దేశమా? ఇక్కడ మీ పెత్తనమా? మా హక్కుల్ని తొక్కి పారేస్తారా, మమ్మల్ని దాసులుగా మారుస్తారా, పైగా నిలువరించిన మా ప్రజల ప్రాణాల్ని హరిస్తారా’ అంటూ ప్రశ్నల అస్త్రాలను ఆగకుండా ప్రయో గించింది. మిమ్మల్ని క్షమించం, మీ దారుణాల్ని సహించం, తిరుగులేని రీతిలో గుణపాఠం చెప్పి తీరతామని గర్జించింది. అనంతరం 1949లో కన్నుమూసిన యోధురాలు గుర్తుగా భారత ప్రభుత్వం తపాలాబిళ్లను ముద్రించి విడుదల చేసింది. నారీభేరీ మోగించిన అరుణ అసఫ్‌అలీ ఆ రోజుల్లో గాంధీజీ నిర్బంధానికి గురైనప్పుడు ‘మా దేశాన్ని విడిచి వెళ్లండి’ ఉద్యమ పక్రియకు నేతృత్వం వహించారు. అంతటితో ఆగకుండా ముంబయి ప్రాంతంలో బహిరంగంగా భారత జాతీయపతాక ఆవిష్కరణ జరిపారు. ఉపాధ్యాయురాలిగా జాతీయవాద భావనలకు విస్తార ప్రాచుర్యం కలిగించారు. ఉప్పు సత్యాగ్రహ ప్రదర్శన లకు నాయకురాలయ్యారు. కారాగారాల్లో రాజకీయ ఖైదీల పరంగా పాలన ధోరణిని తూర్పారపడుతూ; తోటివారితో కలిసి నిరసన కొనసాగించారు. స్వతంత్ర అనంతర రోజులకు సంబంధించి, ఢిల్లీ నగరానికి ఆమే ప్రథమ మేయర్‌. ‌మరణానంతరం పరమోన్నత ‘భారతరత్న’ పురస్కృతురాలు.

ఒక్కొక్కరూ మహాసేన

స్వతంత్ర భారతంలో ఉత్తరప్రదేశ్‌కు మొదటి వనితా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ. జాతీయోద్యమంలో ప్రథమం నుంచీ ఆమెది అత్యంత క్రియాశీలక పాత్ర. ఉద్యమ వ్యూహరచనలో దిట్ట. ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందే ఉండేవారు. పలు సలహా సంప్రదింపులందించిన ఆలోచనాశీలి. స్వాతంత్య్ర దినోత్సవాన రాజ్యాంగ సభలో వందే మాతర గీతాలాపన చేశారు. మహిళా నాయకుల్లో విలక్షణ వ్యక్తి లక్ష్మీ సెహగల్‌. ‌నేతాజీ ప్రసంగధాటి ఫలితంగా ఆజాద్‌ ‌హింద్‌ ‌పౌజ్‌ ‌మహిళా దళంలోకి చేరి నేతగా ఎదిగిన సుధీర. ‘నడిపించినావు సైన్యములు వేలకు వేలు స్వాతంత్య్ర భారత సమరమునకు/ జడిపించినావు చంచచ్చంద్ర హాసంబు తెల్లవారల గుండె తల్లడిల్ల/విడిపించినావు జీవితమ్ముల బలిచేసి భరతపుత్రుల దాస్య బంధనములు/తుడిపించినావు జీవితమ్ముల బలిచేసి భరతపుత్రుల దాస్య బంధనములు/తుడిపించినావు నీ ఉడుకు నెత్తురు తోడ పారతంత్య్ర కళంక పంకరేఖ’ భావస్ఫూర్తి ఈమెకీ వర్తిస్తుంది. బాల్యంలోనే మద్య నిషేధం, తదితర ఉద్యమాలకు నాయకురాలయ్యారు. ఝాన్సీ పేరున ఉన్న నేతాజీ దళానికి ప్రాతినిధ్యం వహించడం జీవిత విశేషం. ఇలా ఎందరెందరో. ఆ మహిళామ తల్లులందరికీ స్వాతంత్య్ర మహా ఉత్సవ అక్షరాభిషేకం.

-జంధ్యాల శరత్‌బాబు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram