భారతదేశ తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర. వ్యవసాయం వాతావరణ మార్పులపై ఆధారపడి సాగుతుందని అందరికీ తెలిసిన విషయమే. పంటలు పండాలంటే సమయానికి వర్షాలు కురవడం ఎంత ముఖ్యమో  సూర్యరశ్మి, గాలిలో ఉండే తేమ కూడా అంతే ముఖ్యం. భూమిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది. గాలిలో ఉండే ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువు కూడా పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అయితే మారుతున్న మనిషి జీవన విధానం వాతావరణ మార్పులపై తీవప్రభావం చూపుతున్నది. ఫలితంగా రైతు నష్టపోతున్నాడు. వాతావరణ మార్పులు అన్నదాత పాలిట శాపంగా మారుతున్నాయని చెప్పవచ్చు.


ముఖ్యంగా మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు రైతును నష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తున్నాయి. అడవుల నరికివేత, పరిశ్రమల నుంచి వెలువడే వివిధ రకాల కాలుష్యాలు, సాగులో మితిమీరిన క్రిమిసంహారకాల వాడకం, ఇంధనాల నుంచి వెలువడే కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌, ‌మీధేన్‌, ‌నైట్రిక్‌ ఆక్సైడ్‌ ‌వంటివి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. రుతుపవనాల రాకపోకల్లో అసాధారణ మార్పులు, వరదలు, కరవు, అకాల వర్షాలు మానవుని నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లనే సంభవిస్తున్నాయి. అంతేకాదు, వాతావరణ మార్పుల వల్ల సముద్రమట్టం ప్రతి సంవత్సరానికి 3 మిల్లి మీటర్లు పెరగుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

–              నేలను కాంక్రీట్‌గా మార్చరాదు. అవసరమైనంత వరకే ఉయోగించుకోవాలి.

–              చెట్ల పెంపకం, నేలకోతను అరికట్టడం.

–              వాతావరణానుకూలంగా దిగుబడినిచ్చే పంటలు సాగుచెయ్యడం.

–              నేలలో తేమ నిల్వ ఉండే విధంగా దున్నటం.

–              పచ్చిరొట్ట ఎరువులు, వర్మికంపోస్టు వాడాలి.

–              నేలసారాన్ని కాపాడే సేంద్రియ ఎరువుల వాడకం.

–              శ్రీ వరిసాగు. నీటి వృథాను అరికట్టడం. అంతర పంట సాగు.

–              సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పంట పోషకాల వినియోగం.

–              సుస్థిర వ్యవసాయ పద్ధతులు ఉపయోగించడం.

మరికొన్ని మార్గాలు..

రైతు సేవలో ‘భవిష్య వాతావరణ

సూచన’ పథకాలు:

భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో రైతు ప్రయోజనం కోసం ఈ పథకం పనిచేస్తున్నది. వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తూ రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. ఈ పక్రియ ముఖాముఖీ చర్చలు, ఇతర పద్ధతుల ద్వారా సాగుతున్నది.

స్వల్పకాలిక భవిష్య వాతావరణ సూచన

ఈ పథకంలో రాగల 24 గంటల నుంచి 48 గంటల వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తారు. అల్పపీడనాల ప్రభావం వల్ల కురిసే వర్షాల సమయంలో ప్రతి గంటకొకసారి రైతులకు సూచనలనిస్తారు. వరదల వల్ల, వడగండ్ల వల్ల, ఉధృతంగా వీచే గాలుల వల్ల కలిగే నష్టాలను ఈ సూచనలతో రైతులు అధిగమించవచ్చు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల సహాయాన్ని ఎలా తీసుకోవాలో కూడా సలహాలు ఇస్తారు.

మధ్యకాలిక భవిష్య వాతావరణ సూచన

రాగల 3 నుండి 10 రోజుల వాతావరణ పరిస్థితులను రైతులకు ముందుగా తెలియజేస్తారు. ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని పంటకు నీరుకట్టడం, కలుపు తీయడం, సమర్థవంతంగా పంట మార్పిడి పనులు చేయటం, పండిన పంటలను నిల్వచేయటం వంటి వాటిని ఎంతో లాభసాటిగా నిర్వహించవచ్చు.

దీర్ఘకాలిక భవిష్య వాతావరణ సూచన

రాగల ఖరీఫ్‌, ‌రబీ కాలాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షాలు పడే అవకాశం, నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాలు వంటి విషయాలు ముందుగానే రైతులకు తెలియజేస్తారు. ఈ సూచనలను ఆచరిస్తే పంటల ఎన్నిక, ఖర్చు నిమిత్తం ధన సేకరణ, పంట మార్పిడి విధానం వంటివి రైతులు ముందుగానే నిర్ణయించుకోవచ్చు.

దినసరి వాతావరణాధార వ్యవసాయం

ఈ పద్ధతిని ఈ వ్యాస రచయిత డా।। రాధాకృష్ణ మూర్తి అనుభవంతో సూచిస్తున్నారు. ఇది ఆయన పరిశోధించి, ప్రయత్నించిన విధానం. దీనిని అనేక దేశాల్లో అనుసరిస్తున్నారు కూడా. నిత్యం దినపత్రికల్లో వచ్చే వాతావరణ వివరాలను సేకరించి వరుసగా ఒక కాగితంపై అతికించాలి. దీనివల్ల వాతా వరణంలో క్రమంగా వచ్చే మార్పులను గమనించ వచ్చు. అలాగే సాగుచేసే పంట స్థితిగతులను ప్రతిరోజు నిశితంగా గమనించాలి. వాతావరణంలో మార్పులువస్తే ఆ ప్రభావం తన పంటమీద ఎలా ఉందో గమనించాలి. అనుకూల మార్పులు మంచివే. ప్రతికూల మార్పులైతే నూతన శాస్త్రీయ పద్ధతులను పాటించి అధిగమించవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే 25 శాతం పెట్టుబడి ఖర్చు తగ్గి 10 శాతం అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ పద్ధతి గురించిన మరింత అవగాహన కోసం రైతు మిత్ర లేదా స్వయం సహాయక బృంద సభ్యులను కాని, వ్యవసాయ శాస్త్రవేత్త లేదా అధికారిని గాని కలిసి సహాయం పొందవచ్చు. అన్నదాతల పెట్టుబడి ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా వాతావరణ మార్పుల గురించి రైతుకు సమాచారం అందించడం, ఆ పరిజ్ఞానాన్ని వారికి చేరవేయడం చాలా ముఖ్యం.

– డా. వి. రాధాకృష్ణమూర్తి

– పి. నాగార్జున

– ఎస్‌. ‌కిరణ్‌కుమార్‌

By editor

Twitter
Instagram