మీడియా సమావేశంలో డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌వైద్య

అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రతిఏటా జరుగుతుందనీ, సంవత్సరమంతా జరిగిన సంఘ కార్యకలాపాలను ఈ సమావేశాలోనే సింహావలోకనం చేసుకుంటామనీ, అదే సమయంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన సంఘ కార్య ప్రణాళిక రూపకల్పనకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుందని సహ సర్‌ ‌కార్యవాహ డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌వైద్య మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బెంగళూరులో అఖిల భారతీయ ప్రతినిధి సభ మొదలవటానికి ఒకరోజు ముందు, అంటే మార్చి 18న ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి నుండి జూన్‌ ‌దాకా కరోనా కారణంగా సంఘ కార్యం పూర్తిగా నిలిచిపోయిందనీ, దైనందిన శాఖలు ఆగిపోయాయనీ, కాగా జులై నుండి శాఖలు మెలమెల్లగా ప్రారంభమవుతూ వచ్చాయని ఆయన వివరించారు. కరోనా కారణంగా దైనందిన శాఖలు మూతపడినప్పటికీ స్వయంసేవకులంతా క్రియాశీలురై ఉన్నారనీ, మహమ్మారికి గురయిన వారిని ఆదుకోవటంలో, సమాజానికి చేయూత నివ్వటంలో దేశవ్యాప్తంగా స్వయంసేవకులు క్రియాశీలురై ఉన్నారని డాక్టర్‌ ‌వైద్య చెప్పారు. ఇతర దేశాల్లో కరోనా లాంటి మహమ్మారి, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు, ఉత్పాతాలు సంభవిస్తే అక్కడ కేవలం ప్రభుత్వ యంత్రాంగాలే క్రియాత్మకంగా వ్యవహరిస్తాయని, అయితే భారత్‌కున్న ప్రత్యేకత ఏమంటే ఇలాంటి సంక్షోభాలు- ఉత్పాతాలు సంభవిస్తే ప్రభుత్వ యంత్రాంగాలతో పాటు సమాజం కూడా సహాయ కార్యకలాపాలలో పాలు పంచుకుంటుందని గుర్తు చేశారు. కరోనా సమయంలో మాత్రం ప్రభుత్వంతో పాటు స్వయంసేవకులందించిన సేవా కార్యక్రమాలు అద్వితీయమని చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సాగిన అయోధ్య మందిర నిర్మాణం ఎంత ఘనమైనదో కూడా డాక్టర్‌ ‌వైద్య వెల్లడించారు.

‘‘శ్రీరామ మందిరం కేవలం మందిరం కాదు. శ్రీరాముడు అంటే భారతీయ సంస్కృతికి ప్రతీక. సోమనాథ్‌ ‌మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటూ ‘మందిరాలు మన సాంస్కృతిక జాగరణ కేంద్రాలు. ఏ రోజయితే భారత్‌లో సాంస్కృతిక విలువలు ఉచ్చస్థితికి చేరుకుంటాయో, ఆనాటికి మందిర నిర్మాణ కార్యం పూర్తవుతుంది’ అని 1951లో నాటి రాష్ట్రపతి డాక్టర్‌ ‌రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. భారత్‌ని ఒక్క త్రాటిపై కలిపి ఉంచే భావాత్మక శక్తి శ్రీరాముడు. భగవంతుడని నమ్మండి. నమ్మకపోండి, అయితే ఒక్క మాట నిజం. సాంస్కృతిక విలువలకి ప్రతీకగా శ్రీరాముడిని జనం విశ్వసిస్తారు. నిధి సమర్పణ అభియాన్‌లో భాగంగా పెద్ద మొత్తంలో విరాళాలని సేకరించే ఉద్దేశం స్వయంసేవకులది కాదు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు, కుటుంబాలని కలవటమే ఆ కార్యక్రమ లక్ష్యం’’ అని డాక్టర్‌ ‌వైద్య తెలిపారు. ఇంతకు మునుపు ఇంత పెద్ద ఎత్తున జన సంపర్క్ అభియాన్‌ ‌జరగలేదనీ, ఈ అభియాన్‌లో భాగంగా స్వయంసేవకులు 5,45,737 స్థలాలు పర్యటించారనీ, సుమారు 20 లక్షల మంది కార్యకర్తలు పాల్గొని 1,24,721,000 కుటుంబాలని కలుసుకున్నారని, దేశవ్యాప్తంగా వారికి భావనాత్మకమైన ఏకాత్మత అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. కరోనా సమయంలోను, శ్రీరామ మందిర జన సంపర్క అభియాన్‌లోను సంఘాన్ని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో బాగా పెరిగింది. అందువలన దేశంలోని అనేక స్థలాల్లో సంఘ పరిచయ వర్గలు నిర్వహించేటట్లు యోజన చేస్తాం. సంఘంతో కలవాలనే వారి సంఖ్య కూడా పెరిగింది. సమాజ పరివర్తన కార్యంలో సంఘంతో కలిపి పనిచేయాలనే ఉత్సాహవంతులు లభిస్తున్నారు. వారందరినీ కలుపుకొని సమాజ పరివర్తన దిశలో అధికారికంగా పనిచేయాలనే అంశంతో బాటు రాబోయే 3 సంవత్సరాలలో సంఘ కార్యవిస్తరణ, కార్యకర్తల వికాసం మొదలగు విషయాలపై ప్రతినిధి సభలో చర్చ జరుగుతుందని వైద్య అన్నారు.

About Author

By editor

Twitter
Instagram