‘ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌కు పునాదులు- మన కర్షకులు, వ్యవసాయరంగం, గ్రామాలే. వారు పటిష్టంగా ఉన్నప్పుడే ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ ‌పునాదులు కూడా పటిష్టంగా ఉంటాయి.’

‘మన్‌కీ బాత్‌’, ‌సెప్టెంబర్‌ 27, 2020


సంక్లిష్ట ప్రపంచ పరిస్థితులలో, దేశకాల పరిస్థితుల మధ్య మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు- ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌. అం‌టే- స్వయం సమృద్ధ భారత నిర్మాణోద్యమం. కొవిడ్‌ 19 ‌మహమ్మారితో విశ్వం యావత్తు గజగజలాడిపోతున్న తరుణంలో, సరిహద్దులలో చైనా విరగబాటును ప్రదర్శిస్తున్న వేళలో- మే 12, 2020న ప్రధాని నోటి నుంచి వెలువడిన ఆ నినాదం భవిష్య భారతం గురించి అద్భుతమైన కలనూ, అదే సమయంలో పెద్ద బాధ్యతనూ ప్రతి భారతీయుని ఎదుట నిలిపింది. దేశీయమైన ఉత్పత్తులను పెంచడమే ఆ పిలుపు, ఆ ఉద్యమం లక్ష్యం. ‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’ యోజనను బలోపేతం చేయడమూ ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ ‌లక్ష్యాలలో ఉన్నది.  ఆధునిక కాలంలో మానవ తప్పిదాలతో లేదా ప్రకృతి వైపరీత్యాలతో, మహమ్మారులతో ప్రపంచం కకావికలయిన తరుణంలోనూ భారత ఆర్థికవ్యవస్థ మాత్రం తట్టుకు నిలబడింది. అందుకు కారణం- మన సేద్యం, మన కర్షకుడు. అంటే ప్రతి పొయ్యి మీది అన్నం కుండకు సాగు పెద్ద భరోసా. ఆర్థికవ్యవస్థకు చెదరని అండ. ఇప్పుడు ఆర్థికవ్యవస్థకు కొత్త రూపు ఇవ్వబోతున్న ఆత్మనిర్భర భారత్‌కు కూడా సాగు కొండంత అండని ప్రభుత్వం విశ్వసిస్తున్నది.

 ప్రపంచ పటంలో కనిపించే ఏకైక కర్మభూమి – భారత్‌. అనేక సంస్కృతులూ, ఆచార వ్యవహారాలూ ఇక్కడ కనిపిస్తాయి. అవెంత ప్రాచీనమో మన వ్యవసాయం కూడా అంతే పురాతనం. అసంఖ్యాకమైన పంటరకాలకు ఈ నేల ఆవాలం. భారత్‌నూ,సేద్యాన్నీ వేరు చేసి చూడడం ఒట్టి అసంబద్ధం. కాలంలో మార్పు అనివార్యం. అయినా పురాతన భారతభూమిలో సేద్యానికి ఉన్న ప్రాధాన్యంలో మార్పును ఊహించలేం. భారత ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు ఇచ్చి, తద్వారా దేశ రూపురేఖలను సమూలంగా మార్చదలిచినప్పుడు సేద్యాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ఉండడం సాధ్యం కాదు. అందుకే ‘ఆత్మనిర్భర కృషి’ నినాదం కూడా ఊపందుకుంటున్నది.  దేశ ఆర్థిక, సామాజిక రంగాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తుంది ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌. ‌రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఆ ఉద్యమం కోసం ఏర్పరిచినట్టు కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌కూ, రైతాంగానికీ ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రధానే స్వయంగా ఒక వాస్తవిక కల్పనను దేశం ముందు ఉంచారు కూడా. ‘మన్‌కీ బాత్‌’ 69‌వ ప్రసంగంలో (సెప్టెంబర్‌ 27,2020), ‘ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌కు పునాదులు- మన కర్షకులు, వ్యవసాయరంగం, గ్రామాలే. వారు పటిష్టంగా ఉన్నప్పుడే ఆత్మనిర్భర భారత్‌ అభియాన్‌ ‌పునాదులు కూడా పట్టిష్టంగా ఉంటాయి.’ అన్నారాయన. గతంలో ఎన్నో పెను తుపానులు ఎదుర్కొన్న మన వ్యవసాయరంగం కొవిడ్‌ 19 ‌కష్టకాలంలో కూడా తన సత్తా చాటుకుందని ప్రధాని చెప్పడం తిరుగులేని సత్యం. సాగులో స్వయం సమృద్ధి సాధించాలని ఈ ఆగస్ట్ 29‌న (ఝాన్సీలోని ఝాన్సీలక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో) కూడా ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామాల సమీపంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల సముదాయాలు నెలకొల్పే యోచన చేసినట్టు ఆ సందర్భంలోనే చెప్పారాయన.

ఆత్మనిర్భర కృషి

సాగులో స్వయం సమృద్ధి లక్ష్యం ఏమిటి? సేద్యం చేసే రైతు, వ్యవసాయోత్పత్తులు చేసేవానిగానే మిగిలిపోకూడదు. అక్కడితో అతడి పాత్ర ముగిసి పోకూడదు. ఆ ఉత్పత్తులతో రైతు తన ఇచ్ఛానుసారం వాణిజ్యం నిర్వహించుకునే వ్యాపారవేత్తగా కూడా అవతరించాలి. జూన్‌ 5, 2020‌న వచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఇందులో భాగమే. ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ అన్న పిలుపు ప్రధాని నరేంద్రమోదీ నోటి నుంచి వచ్చిన వెంటనే ఆత్మనిర్భర సేద్యం (కృషి) గురించి మథనమూ మొదలయింది. భారతదేశంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సేద్యం మీద ఆధారపడి ఉన్నవారు ఇప్పటికీ డెబ్బయ్‌ ‌శాతం ఉన్నారు. సేద్యం ఊసు లేకుండా ఈ దేశ  అభివృద్ధి నమూనాకు ఆస్కారమే లేదని చెప్పడం అందుకే.

అయినా, నిత్యావసరాలైన వివిధ వ్యవసాయో త్పుత్తులకు సంబంధించి భారత్‌ ఇప్పటికీ స్వయం సమృద్ధిని సాధించలేకపోయింది. నిత్యావసరాలైన ఈ వ్యవసాయోత్పుత్తులను కూడా, ఇంకొక మాటలో చెప్పాలంటే కడుపు నింపుకోవడానికి అవసరమయ్యే చాలా వస్తువులను మనం దిగుమతి చేసుకోవలసిన స్థితిలోనే ఉన్నాం. ఉదాహరణకి, వంటనూనెలు. ఏటా 15 మిలియన్‌ (‌కోటీ యాభయ్‌ ‌లక్షలు) టన్నుల వంట నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. 9 మిలియన్‌ ‌టన్నులకు పైగా పామాయిల్‌, ‌దాదాపు 2.5 మిలియన్‌ల సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతి చేసుకోవాలి. ఇండోనేషియా, మలేషియాల నుంచి పామాయిల్‌; అర్జెంటీనా, బ్రెజిల్‌, ఉ‌క్రెయిన్‌, ‌రష్యాల నుంచి సోయా, పొద్దుతిరుగుడు నూనెలను తెచ్చు కుంటున్నాం. వ్యవసాయరంగాన్ని స్వయం సమృద్ధం చేయడం ఎంత అవసరమో ఈ ఉదాహరణతో అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం వంట నూనెల దిగుమతి మీద సుంకాలు ఇతోధికంగా పెంచాలి. అదే సమయంలో మన రైతులు చమురు గింజల ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇంతటి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయమే కాదు, రాజకీయ సంకల్పంతో కూడిన ముందుచూపు కూడా అవసరమవు తుంది. నిజానికి  పొద్దుతిరుగుడు, వేరుసెనగ, ఆవ, పామోలిన్‌ ‌సాగును భారత్‌ ఆరంభించ వచ్చు. పామోలిన్‌ ‌పెంపకానికి అనువైన భూమి మన దేశంలో రెండు మిలియన్‌ ‌హెక్టార్ల వరకు ఉంది.

ఎగుమతులు కొన్నే

వర్తమాన భారత పరిస్థితుల నేపథ్యంలోనే కాకుండా, చైనా దిగుమతుల మీద ఆధారపడడం మంచిది కాదన్న నిశ్చితాభిప్రాయం బలపడుతున్న క్రమంలో భారత వ్యవసాయ ఆర్థిక స్థితిగతులపై విహంగ వీక్షణం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. మొదటిగా ఒక ప్రశ్న. దేశ అవసరాలు తీరిన తరువాత  ఎగుమతులేమైనా చేయగలిగిన స్థితిలో – నెట్‌ ఎక్స్‌పోర్టర్‌గా- భారత్‌ ఇప్పుడు ఉన్నదా? గడచిన పదేళ్ల కాలంలో (2008-09, 2018-19) భారత్‌ ‌వ్యవసాయ ఎగుమతులలో నెట్‌ ఎక్స్‌పోర్టర్‌గానే ఉంది. పైగా, 2022 నాటికి ఆ ఎగుమతులను రెట్టింపు చేయాలన్న ఆలోచనతో మోదీ ప్రభుత్వం ఉంది. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల వల్ల వ్యవసాయ ఎగుమతులు 36 బిలియన్‌ ‌డాలర్లకు పరిమితం కావలసి వచ్చింది. వ్యవసాయ వాణిజ్య మిగులు 11.2 బిలియన్‌ ‌డాలర్ల వద్ద ఆగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయోత్పత్తులను మరో రెండేళ్లలో రెట్టింపు చేయాలన్న ఆశయం నెరవేరడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ ‌చేస్తున్న ఎగుమతులలో సముద్ర ఉత్పత్తులు (6.7 బిలియన్‌ ‌డాలర్ల విలువైనవి), బియ్యం (6.4 బిలియన్‌ ‌డాలర్లు), సుగంధ ద్రవ్యాలు (3.6 బిలియన్‌ ‌డాలర్లు), దున్నపోతు మాంసం (3.2 బిలియన్‌ ‌డాలర్లు), చక్కెర (2 బిలియన్‌ ‌డాలర్లు), టీ-కాఫీ (1.5 బిలియన్‌ ‌డాలర్లు), తాజా పళ్లు, కూరగాయలు (1.4 బిలియన్‌ ‌డాలర్లు), పత్తి (1 బిలియన్‌ ‌డాలర్లు) ఉన్నాయి. బియ్యం, చక్కెర ఎగుమతులకు రాయితీలు కూడా ఇస్తున్నారు. కానీ,ఎగుమతులు చేయడానికి అవకాశం ఉన్న కొన్ని విభాగాలను ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ప్రపంచ మార్కెట్‌లో ఎంతో విలువ, గిరాకీ ఉన్న పళ్లు, కూరగాయలు; సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, పత్తి ఎగుమతులు పెరగడానికి ప్రోత్సాహకాలు కల్పించవచ్చు.

స్వయం సమృద్ధికి అవరోధాలు

 అయినప్పటికీ దేశం స్వయం సమృద్ధితో  సుసంపన్నం కావాలన్న ఆశయం  నెరవేరడానికి ఇంకొన్ని అడుగుల దూరంలోనే ఉండిపోయింది. పెరుగుతున్న జనాభా, విభిన్నతత్త్వాలు కలిగిన నేలలు, శీతోష్ణ పరిస్థితులు, అధికోత్పత్తినివ్వలేని వంగడాలు (పలు పంటల్లో), తగినంత భూసారం పంటలకు అందని స్థితితో పాటు, అరకొర నీటిపారుదల సౌకర్యాలు సాగు రంగంలో దేశం స్వయం సమృద్ధం కాకుండా నిలువరిస్తున్నాయి. తిండిగింజల ఉత్పత్తి, ఉత్పాదకతలు సైతం ఆశించిన మేర లేక ఇతర దేశాలపై ఆధారపడవలసిన అగత్యం నుంచి బయటపడే స్థాయికి దేశం చేరుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భూసారాన్ని పెంపొందించుకొంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ అధికోత్పత్తినిచ్చే వంగడాలను, విత్తనాలను ఉపయోగిస్తూ, సాగు నీటి సౌకర్యాలను పెంపొందించుకొని, పలు పంటల్లో ఉత్పాదకత తద్వారా ఉత్పత్తులను పెంచుకొన్న సంగతినీ ఇక్కడ విస్మరించలేం. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్టు, మన ఆహార అవసరాలకు సరిపోయే విధంగా (ముఖ్యంగా వరి, గోధుమలు, మొక్కజొన్న, కూరగాయలు) ఉత్పాదకతనూ, ఉత్పత్తులనూ గణనీయంగా పెంచి స్వయంసమృద్ధిని సాధించగలిగాం. ఆహార ధాన్యాలతోపాటు, ఉద్యానవన పంటల ఉత్పత్తులలోను, పాలు, మత్స్యసంపద ఉత్పత్తులలోను పురోగతి సాధించిన మాట కూడా వాస్తవమే. పలు దేశాలు వాటి ఆహార అవసరాల కోసం మన దేశ ఎగుమతుల మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే పప్పుధాన్యాలోను, కొంతమేర నూనెగింజల ఉత్పత్తిలోను ప్రగతి సాధించినప్పటికి, జనాభా పెరుగుదలకు అనుగుణంగా స్వయంసమృద్ధిని ఇంకా సాధించవలసి ఉంది. దేశ అవసరాలకు అనుగుణంగా పప్పుధాన్యా దిగుబడిలో ఇంకా వేగం, ప్రగతి సాధించాలి.

చమురు వదిలిస్తున్న వంటనూనెలు

నూనెగింజ దిగుబడిలో దారుణంగా వెనుకబడి లేకున్నా, మన అవసరాల మేరకు విదేశాల మీద ఆధారపడుతున్న వాస్తవాన్ని తోసిపుచ్చలేం. ఇక్కడ వంట నూనెల అవసరాలు తీర్చుకోవడానికి రూ. 60 నుంచి రూ. 70 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని దిగుమతుల కోసం వెచ్చిస్తున్నాం. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికీ, నూనెగింజ ఉత్పాదకతను, ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికీ భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో వ్యవహరించాలి. ఇక్కడే మరొక వాస్తవం తెలియాలి. దేశంలో వంటనూనెల వినియోగం అవసరానికి మించి రెండింతలు జరుగుతున్నదని అంచనా. ఆరోగ్యానికీ, అవసరానికీ తగ్గట్టు శాస్త్రబద్ధంగా నూనెలు వినియోగించడం కాకుండా రెట్టింపు వాడుతూ ఆరోగ్యానికీ, విదేశీ మారకద్రవ్యానికీ నష్టం చేస్తున్నాం. ఈ వలయంలో నుండి బయటపడేందుకు నూనెల అనవసర వినియోగాన్ని కనీసం తల ఒక్కంటికి 10 కేజీలైనా (దాదాపు ముప్పయ్‌ ‌కిలోల నుంచి) తగ్గించుకోవడమే తక్షణ కర్తవ్యం. ఉద్యానవన పంటలు పండ్లు, కూరగాయలలోను, పూల సాగులోను ముందడుగు వేయగలిగాం. ఆ రంగంలో ఇంకా ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం పలు పథకాలను తెచ్చింది. మత్స్యసంపద విషయంలోను పురోగతి ఉన్నా ఎగుమతులను పెంపొందించు కొంటూ మత్స్య ఉత్పత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు కూడా తీసుకుంటున్నది.

బలవర్ధక ఆహారం కోసం

కొవిడ్‌-19 ‌నేర్పిన పాఠాలలో ముఖ్యమైనది- జాతి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి. అందుకు శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను సమతౌల్యంతో అందించాలి. ఈ అవసరాలను తీర్చగలిగే ఆహారం ఇచ్చే పంటల కోసం జాతీయ పోషక సంస్థ మరింత శ్రమించాలి. ఇందుకు భారత ప్రభుత్వం జాతీయ పౌష్టికాహార సంస్థ ద్వారా తగిన పథకాలతో ముందుకు రావడం ముదావహం. వ్యవసాయ ఉత్పత్తును ప్రాసెసింగ్‌ ‌చేసి, విలువ ఆధారిత ఉత్పత్తులతో, తగిన ధరవరలతో స్థానికంగాను, ఇతర ప్రాంతాలు/దేశాలకు ఎగుమతితో వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లభ్యమయ్యే విధంగా సాగును మలచి వారి ఆర్థికప్రగతికి దోహదపడటం హర్షించదగ్గది. ఇందువల్ల విలువ ఆధారిత ఉత్పత్తులకు (ఇతర ప్రాంతాలలోను/విదేశాలలోను) గిరాకీ పెరిగి రైతు ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం అవుతుంది. వ్యవసాయోత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా, దేశ విదేశాల అవసరాల మేరకు, తగిన ప్రణాళికలతో  వృద్ధిచేసి, వాటికి విలువను జోడించి ఉత్పత్తిదారులు గిట్టుబాటు ధరలను పొందేందుకు వీలైన• చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. ఈ దిశలో మార్కెటింగ్‌లో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వ్యవసాయరంగం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు, నేలలు, నీరు, వాతావరణ పరిస్థితి, సహజ వనరులు, కష్టించి పనిచేసే రైతాంగం, శ్రామికులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిత్తశుద్ధితో పనిచేసే దేశాధినేతలు, ప్రభుత్వాలు ఉన్న నేటి పరిస్థితులలో రైతు ఆర్థిక స్వావలంబన కోసం  వేగవంతమైన చర్యలు తీసుకోవాలి.

విత్తనోత్పత్తి రంగం

వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరగడానికి దోహదపడేవి- అధికోత్పత్తినిచ్చే నూతన వంగడాలు, విత్తనాలు. వీటితోపాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మంచి దిగుబడులను సాధించే ‘గ్రీన్‌ ‌రీవల్యూషన్‌’‌కు దోహదం చేయాలి. అధికోత్పత్తినిచ్చే విత్తనాలను రూపొందించి సరఫరా చేసి, ఆయా ప్రాంతాలో అనుకున్న ఫలితాలు సాధించేందుకు వీలయింది. పలు పంటల్లో స్వయంసమృద్ధి దాని ఫలితమే. విత్తనోత్పత్తికి దేశంలో అపార అవకాశా లున్నాయి. ఒక్క హైదరాబాద్‌ ‌ప్రాంతంలోనే 4000లకు పైగా విత్తనోత్పత్తి కంపెనీలున్నాయంటేనే ఈ రంగానికి ఎంతటి అవకాశముందో తెలుస్తుంది.

ఈ కంపెనీలో బహుళజాతి సంస్థలకు చెందినవి కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తిచేసి, దేశీయ అవసరాలకే గాక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ దిగుబడి పెంచేందుకు దోహదపడుతున్నాయి. విశిష్టమైన నూతన వంగడాలను మన పరిశోధనా సంస్థలూ రూపొందించాయి. వాటిని వినియో గించి రైతులు మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఇతర దేశాలలో  మన విత్తనాలకు గిరాకీ ఉన్నందున,  దేశీయ బ్రాండ్లతో సరఫరా చేసి రాబడి పెంచుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని విశేషంగా (వేల కోట్లలో) ఆర్జించవచ్చు.

సేద్యం, ఉద్యానవనం, పశుసంవర్థక విభాగం, మత్స్య సంపద, హోం సైన్సెస్‌ ‌వంటి విభాగాలలో జరుగుతున్న పరిశోధన, విద్యాబోధన, విస్తరణలో నూతన  పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రంగాలలో నిపుణులను తయారు చేసేందుకు కొన్ని దేశాలతో ఒడంబడిక

లున్నాయి. వీటిని పటిష్టపరచి, అటు విద్యాబోధన, పరిశోధనలు, విస్తరణలతో పాటు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా దేశాల అవసరాలకు అనువుగా మలచి అమలుచేసి ఆయా దేశాల అభ్యున్నతికి సాయపడితే మన దేశ గౌరవం ఇనుమడిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన దేశాలకు అందిస్తూ ముందుకు సాగటం మంచి పరిణామం. నీటి యాజమాన్యం, డ్రైనేజీ, జీవసాంకేతిక పరిజ్ఞానం (Bio Technology) , జీవవైవిధ్యం (Bio Technology) వంటి పలు అంశాలపై అవగాహన ఒప్పందాల ద్వారా సాంకేతిక నిపుణుల పంపకాల ద్వారా దేశాల ప్రగతి, పరస్పర మైత్రీ సంబంధాల పటిష్టతకు అవకాశం కలుగుతుంది.

జీవవైవిధ్యం, కలప

అటవీసంపద, అందులో ఉన్న జీవవైవిద్యం అపారం. ఆ సంపదను వృద్ధి చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్‌ ‌చేసుకుని గిరిజనులు లబ్ధి పొందుతున్నారు. జీవవైవిధ్యాన్ని సరైన రీతిలో వినిగించుకుంటూ, దానిని పెంపొందించే క్రమంలో మొక్కల పెంపకాన్ని చేపట్టి ‘గ్రీనరీ’ని పెంపొందిస్తే కాలుష్యరహిత వాతావరణం, వాతావరణ మార్పులను నివారించగలం.

ఇందుకు అటవీ ప్రాంతంలో, బీడుభూములు, బంజరులున్నచోట అనుకూలతలను బట్టి టేకు, చందనం, ఎర్ర చందనం, ఔషధ మొక్కలు, నేరేడు వంటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సాహిస్తే పర్యావరణం దెబ్బతినకుండా, తగిన వర్షాలతో దేశం సుసంపన్నంగా ఉంటుంది. రాబడి పెరిగి ఆయా ప్రాంతాల వారికి ఆర్థిక వెసలుబాటు కలుగుతుంది. అందుకే ప్రభుత్వం అటవీ ప్రాంత అభివృద్ధికి, జీవవైవిధ్యానికి, వాతావరణ అనుకూలతకు, గిరిజనుల వికాసానికి దోహదపడే విధంగా చర్యలు చేపడుతూ, ప్రగతికి దోహదపడుతున్నది.

  • ప్రొ।। పి. రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
Instagram