సెస్టెంబర్‌ 25, ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి

దేశంలోని వివిధ వ్యవస్థలను రాష్ట్రీయకరణం (జాతీయకరణం) చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలనే ఆకాంక్షను ఇప్పుడు ఏ అర్థంలో వ్యక్తీకరిస్తున్నప్పటికి దానిని కళ్లు మూసికొని సమర్థించటం కుదరదు. ఒక పెద్దమనిషి నన్ను ప్రశ్నించారు – మీరు దేశం కోసం సర్వం సమర్పించాలన్న సంకల్పం కలిగినవారుగదా, మరి రాష్ట్రీయకరణానికి పరిమితులండాలని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్న ఎంత సరళంగా ఉందో, దాని సమాధానం అంత గంభీరమైనదనటంలో సందేహం లేదు.  దేశసేవను వ్రతంగా స్వీకరించిన ప్రతి ఒక్క వ్యక్తీ దేశానికీ, రాజ్యానికీ గల తేడాను సుప్పష్టంగా తెలుసుకోవాలి.

నలుదిక్కులా రాజకీయాల రణగొణ ధ్వనులు నిండిన నేటి  వాతావరణంలో దేశానికీ, రాజ్యానికీ మౌలికంగా ఉన్న తేడాను గ్రహించటం నానాటికీ కఠినతర మౌతున్నది కూడా. ఈ కారణంగా దేశ ఐక్యత, దేశ ప్రగతి, దేశ లక్ష్యం మొదలైన అనేక ప్రాధాన్యం గల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను వెదికిపట్టుకోవటంలో మనం విఫలమౌతున్నాం. ఈ వైఫల్యం ఎంతవరకు పోతున్నదంటే, మన దేశ జీవన  విశుద్ధ సాంస్కృతిక ప్రవాహానికి సంబంధించిన అంశాలలో కూడా చిత్తం చలించిన వారమౌతున్నాం.

వాస్తవానికి దేశం, రాజ్యం రెండు వేర్వేరు శక్తులు. ఈ అంతరాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. వారు ఈ రెండూ ఒకటే అనుకొంటున్నారు. అలాగే ఆ శబ్దాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా ప్రయోగిస్తున్నారు. దేశం కోసం రాజ్యం ఏర్పడిందా? లేక రాజ్యం కోసం దేశం నెలకొని ఉన్నదా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పొందాలంటే, ఈ రెండింటి వాస్తవమైన పరిధిని గ్రహించవలసి ఉంది.

దేశమనేది ప్రాణమున్న, జీవచైతన్యంతో కూడిన ఒక శక్తి. శతాబ్దాల తరబడి,  సుదీర్ఘకాలంలో ఇది వికసిస్తుంది. ఒకానొక నిశ్చితమైన భూభాగంలో నివసిస్తున్న మానవ సముదాయం ఆ భూమితో మమేకత్వ భావన గల్గి, ఆ జాతీయ జీవనంలోని విశిష్ట గుణాలను ఆచరిస్తూ ఉండే పరంపరను, మహత్వాకాంక్షలను సొంతం చేసుకుంటూ, సుఖదుఃఖాలను గురించి, శత్రుమిత్రులను గురించి సమాన అనుభూతులు కలిగివుండి, పరస్పర సాన్ని హిత్యంతో ఉటుంది. సంఘటితులై మసలుతూ, శ్రేష్ఠమైన జీవన విలువల స్థాపన కోసం క్రియాశీలురై ఉండటమే కాక, ఈ పరంపరను నిలిపి ఉంచడానికి, దానిని మరింత తేజో వంతంగా చేయడానికి గొప్ప త్యాగం, తపస్సు, పరిశ్రమ చేసే మహాపురుషుల గొలుసు కట్టు నిర్మాణమై, భూమిమీద ఉన్న ఇతర మానవ సముదాయాలకు భిన్నమైన సాంస్కృతిక జీవనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇటువంటి భావాత్మక స్వరూపం ఉన్నపుడే ‘దేశం’ అవుతుంది. ఈ దేశం (మేము ఒకజాతిగా జీవిస్తున్నాం) అనే భావన నిలిచి ఉన్నంతకాలం ఆ దేశం జీవించి, మనుగడ సాగిస్తుంది. ఆ భావన గనుక బలహన పడితే, దేశమూ బలహీనపడుతుంది. ఆ భావన తొలగి పోయినట్లయితే అది నశించి పోతుంది.

ఈ విధంగా దేశమనేది ఒక స్థిరమైన సత్యం. దేశ అవసరాలను తీర్చేందుకు రాజ్యం ఏర్పాటవుతుంది. రాజ్యం ఏర్పడడానికి రెండు కారణాలు చెబుతారు. మరో విధంగా చెప్పాలంటే రెండు రకాల పరిస్థితులలో రాజ్యం ఏర్పడుతుంది. మొదటిది- దేశానికి చెందిన ప్రజలలో ఏదో ఒక వికృతి సంభవించినపుడు. ఆ సమయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి రాజ్యం చోటు సంపాదించుకొంటుంది. ఉదాహరణకు మన నగరంలో ఒక వీధి లేదా బస్తీ ఉందనుకోండి. ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా ఉన్నంత వరకు అక్కడ పోలీసులు ఎప్పుడూ కనబడరు. కాని ఎప్పుడైతే ఒక గలాటా జరిగి హింస హెచ్చరిల్లుతుందో అప్పుడు వెంటనే పోలీసులను పిలిపిస్తారు. రాజ్యం అవసరమయ్యే రెండవ సందర్భం – సమాజంలో ఏదైన ఒక క్లిష్ట సమస్య ఏర్పడినపుడు – ప్రజాజీవనంలో ప్రత్యేకంగా కొన్ని వ్యవస్థలను ఏర్పరచవలసి వస్తుంది. సమాజంలో ఉన్న బలహీనతలను, దారిద్య్రాన్ని, నిస్సహాయతనూ అవకాశంగా తీసికొని భుజబలం ఉన్నవారో, ధనవంతులో, అంగబలం ఉన్నవారో అన్యాయంగా లాభపడడానికి యత్నిస్తూ ఉంటే, వారిని న్యాయమైన హద్దులలో నిలువరించి ఉంచడానికీ రాజ్యం అవసరమౌ తుంది. వాస్తవానికి ఈ రెండు రకాల కారణాలతోనే రాజ్యం ఏర్పడుతుంది. సమాజంలో చోటు చేసుకొంటున్న వితులను అదుపు చేయడానికి వికృత స్వభావం గలవారిని దండించడానికి, తద్వారా శాంతిని స్థాపించడానికి – అదేవిధంగా సమాజంలో జటిలమైన పరిస్థితులు ఏర్పడినపుడు వాటిని పరిష్కరించి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయమైన, గౌరవప్రదమైన జీవితం అందుబాటులో ఉండేవిధంగా చూడడానికి-మంచి వ్యవస్థను నెలకొల్పడమే రాజ్యం పని. ఈ రెండు పనులతోపాటు రాజ్యం నిర్వహించే మూడోపని కూడా ఉంది? అది పై రెండు పనులను సమర్థంగా చేయటంలో భాగమే అయినా, ప్రత్యేకంగా కనబడుతుంది. అది ప్రపంచంలోని అన్య దేశాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం. ఇతర దేశాల నుండి ఆక్రమణలకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకోవటం కూడా రాజ్యం చేసే పనుల్లో ఒకటి.

ఈ పనులను నెరవేర్చటంలో రాజ్యం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. మనం ఐక్య రాజ్యసమితి – (United Nations) అని దేనిని అంటున్నామో అది వాస్తవానికి దేశాల సంఘం కాదు. అది కేవలం రాజ్యాల సంఘం. తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యాలే అందులో చేరాయి.

రాజ్యం పనిచేసే తీరులో వికృతి ఏర్పడినా, లేక అది తన కార్యనిర్వహణలో, బాధ్యతల నిర్వహణలో విఫలమైనా, అలాంటి రాజ్యాలను ఆ దేశాలు మార్చివేస్తాయి. దేశం తన రాజ్యాన్ని మార్చివేస్తుంది. దీనిని మనం మామూలు మాటలలో అక్కడి ప్రభుత్వం మారిపోయిందని చెప్పుకొంటాం. మనం ప్రజాతంత్రమనీ, ప్రజాస్వామ్యమనీ చెప్పుకొనేది- తమ రాజ్యం తమకు ఉపయోగకరంగా ఉండేట్లు, అవసరం వస్తే – తమ రాజ్యాన్ని (ప్రభుత్వాన్ని) మార్చుకొనేటట్లుగా నడిపించే పక్రియను గల పేరు అని మనం గ్రహించాలి. అవసరాన్ని బట్టి, సందర్భానుసారం రాజ్యాలు మారుతూ ఉంటాయి. కాని ఏ ప్రజాతంత్రంలో నైనా సరే దేశం మారదు. దేశ మనుగడ బహుజనాభి ప్రాయం, లేక అల్పసంఖ్యాకుల అభిప్రాయం – అనే వాటిపై మారుతూ ఉండదు. దేశమనేది ఒక స్వయంభు శక్తి. అది స్వతసిద్ధంగా రూపుదాల్చుతుంది. తన అవసరాలను పూర్తిచేసుకొనడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొంటుంది. అలా ఏర్పాటు చేసుకొనే వివిధ వ్యవస్థలలో రాజ్యం ఒకటి. ఈ వ్యవస్థలన్నీ పరస్పరం అనుకూలంగా తమ కార్యకలాపాలను సాగిస్తూ దేశాన్ని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ పని నిరంతరం కొనసాగడానికి దేశం ఎల్లవేళలా జాగృతమై ఉండాలి.

దేశం నిద్రావస్థలోకి జారుకున్నపుడు అన్ని రకాల చెడులూ గూడుకడతాయి. దేశం నిద్రించడానికి ఉపక్రమించటమే ఆలస్యం, అప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యం, పంచాయితీ, కుటుంబం మొదలైన వ్యవస్థలన్నీ నియంత్రణకు లోబడనివై విశృంఖలమై పెచ్చరిల్లుతాయి. రాజ్యం భ్రష్టం కావచ్చు. ‘ప్రభుతాపాయ్‌ ‌కాహీమద నాహీ’ (ప్రభుత్వం హస్తగతమైనపుడు మదం ఎక్కకుండా ఎలా ఉంటుంది?) అనే మాట వాస్తవమౌ తుంది. కాగా దేశం జాగరూకతతో దక్షత కల్గి వ్యవహరిస్తున్నప్పుడు ప్రభుత (అధికారపీఠం) తన హద్దుల్లో ఉంటుంది. రాజ్యం దేశం తరఫున మాట్లాడే వకీలు. వకీలు చాలా సందర్భాలలో తన కక్షిదారుని తరఫున వాదం వినిపిస్తూ, తానే పార్టీ (పిటిషనర్‌) అయినట్లుగా మాట్లాడుతాడు. అలా చేయటం అవసరమౌతుంది కూడా. వకాలత్‌నామా లిఖిత పూర్వకంగా ఉంటుంది. న్యాయవాది తన తరఫున సరిగా పనిచేయటం లేదని అనిపిస్తే, వకాలత్‌నామాను రద్దుచేయటం జరుగుతుంటుంది. రాజ్యం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. రాజ్యానికి ఉండే అధికారాలన్నీ దేశం ధారాదత్తం చేయగా లభించినవే. దేశం గనుక జాగరూకతతో ఉండకపోతే రాజ్యం వంటివి దుర్వినియోగమయ్యే ప్రమాదమేర్పడుతుంది. రాజ్యం అదుపు తప్పి దేశానికి ఉన్న హక్కులన్నింటినీ అపహరించినట్లయితే నియంతృత్వం నెలకొంటుంది. దేశం కుంటిదైపోతుంది.

1967‌లో భారతీయ జనసంఘ్‌ ‌జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంలో కాలికట్‌ ‌రైల్వేస్టేషన్‌లో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన స్వాగతం; పక్కన వాజపేయి

ఇలా అంటున్నామంటే రాజ్యం తక్కువదని అనుకోకూడదు. రాజ్యానికి ఉన్న  గొప్పదనం వివాదాతీతమైనది. దేశాన్ని అభివృద్ధిపరచటం, సంరక్షించటం, వైభవశాలిగా చేయడం, దేశ అవసరాలను గుర్తించి యోగ్యమైన నిర్ణయాలు తీసికొని ప్రపంచ వ్యవహారాలలో అడుగుముందుకు వేయటం – ఈ పనులన్నీ రాజ్యానివే. ఇదంతా నిజమే అయినా రాజ్యం సుస్థిరమైనది కాదు. శాశ్వతంగా ఉండి పోయేదీ కాదు. ఒక్కక్కసారి రాజ్యం లేకుండాపోయి, దేశం కొనసాగుతూ ఉండే స్థితి తల ఎత్తవచ్చు. సత్యయుగం (కృతయుగం) సంబంధించి అటువంటి వర్ణన మనకు కనబడుతుంది. ‘న రాజ్యం, న రాజా-సీత్‌ ‌న దండ్యో, నచ దాండికః’ అంటే రాజ్యం లేదు, రాజూ లేడు. దండింప దగినవాడు లేడు. దండించే వాడూ లేడు. అయినా అటువంటి స్థితిలో కూడా దేశం ఉంది. సామ్యవాద సిద్ధాంతకర్త కార్ల్ ‌మార్కస్ ‌కూడా విదరింగ్‌ అవే ఆఫ్‌ ‌ది స్టేట్‌ (‌రాజ్యం లోపించి పోవటం) అనే భావనను మాటలలో వ్యక్తీకరించాడు. ప్రగతి సాధించిన తుదిదశలో రాజ్యం అవసరం ఉండదని ఆయన ఊహించాడు. అంటే, అప్పుడేం ఉంటుంది? అందరికీ ఆమోదయోగ్యమైన సిద్ధాంతాలననుసరించి నడుస్తూ దేశం ఉంటుంది. 19వ శతాబ్దంలో తన సిద్ధాంతాన్ని ప్రకటించే సమయంలో మార్కస్ ‌దేశానికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. గుర్తింపునే ఇవ్వలేదు. అయితే గత 50 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమౌతుంది. దేశం అనే ప్రేరణదాయకమైన భావన పెట్టుబడిదారీ విధానంలో మొలకెత్తి వర్థిల్లినది కాదు, కమ్యూనిస్టు వ్యవస్థలో కూడా అది జీవితానికి ఎంతో ప్రేరణ నిచ్చే శక్తిగా తేటతెల్లమౌతుంది.

ఇంత మాత్రమేకాదు, ఎప్పుడైనా ఒక దేశం దాస్యానికి గురియైనా, లేక దేశానికి చెందిన కొంత భూభాగం పరాయిపాలనలో పడినా, అప్పుడు కూడా దేశం ఉండకుండా పోదు; ఉంటుంది. ఇది ఎలాగంటే, ఆంగ్లేయులు ఇక్కడికి వచ్చి, వారి పాలన నెలకొల్పినారు. దేశం దాస్యంలో చిక్కుకుంది. మనపై అధికారాన్ని చలాయించే ప్రభుత్వాన్ని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అనేవారు. ఆ సమయంలో భారతీయ రాజ్యం లేదు. మరో విధంగా చెప్పినా, భారతీయలైన రాజులు తమ తమ సంకుచితమైన సరిహద్దులకు పరిమితమైపోయి, పరాయి దేశీయుల రాజ్యాన్ని ఆశ్రయించి నడుచుకున్నారు. అయినా భారతీయత దేశం లేకుండాపోయిందని ఓవరైనా అనగల్గినారా? ఒకవేళ భారత దేశ జీవనం లేకుండా పోయి నట్లయితే, స్వాతంత్య్రం సాధించుకోవాలన్న ప్రయత్నాలే జరిగి ఉండేవి కావు. రాజ్యం లేకపోయినా, దేశం ఉన్నదన్నమాట. కాబట్టే దేశ (రాష్ట్రీయ) జాగరణకు శంఖాన్ని పూరించారు. చైతన్యం మేలుకొన్నది. దేశం తనకు తాను వ్యక్తీకరించుకోవటం కోసం ‘స్వరాజ్యం’ కావాలని గర్జించనారంభించింది. రాజ్యం లేకపోయినప్పటికీ స్వరాజ్య ప్రాప్తి కోసం ఉరితాళ్లను ముద్దుపెట్టుకొనడానికి, ద్వీపాంతరవాస శిక్షలను అనుభవించడానికి వెరువక, ముందుకు ఉరకడానికి ఆనందంతో, విశ్వాసంతో హృదయం ఊయలలు ఊగేటట్లు చేసినది ఎవరు? ఆ సమయంలో కూడా దేశం కొనసాగుతూ ఉండటమే కారణం. సాహిత్యం, కళలు, దర్శనశాస్త్రం, వాణిజ్యాలతో సహ వివిధ రంగాలలో దేశ ప్రతిబింబం ద్యోతకమవుతూనే ఉండింది. వందే మాతరం నినాదంతో ఎంతోమందిని బలిదానాలకు సంసిద్ధ పరిచినదెవరు? కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మనమంతా ఒక్కటే అనే భావాన్ని ప్రతిధ్వనింప జేసినది ఎవరు? అది దేశమే, రాజ్యం కాదని నిశ్చయంగా చెప్పవచ్చు.

దేశం పరిపూర్ణంగా వికసించినపుడు దానిలో అంతర్భాగాలుగా అనేక రాజ్యాలు ఉండవచ్చు. భారతదేశ చరిత్రలో మనం అనేక రాజవంశాల వర్ణనలను చూశాం. ఈ రాజ్యాలు వేర్వేరు పద్ధతులలో పాలన సాగించేవిగా కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల రాజరికం, కొన్ని చోట్ల గణతంత్రం, కొన్నిచోట్ల సంఘ రాజ్యం, కొన్నిచోట్ల వైరాజ్యం కూడా ఉన్నాయి. వాటి ఆకారాలు (•ఱఓవ•) కూడా ఎంతో వైవిధ్యంతో కనిపిస్తాయి. ఉదా।। సిక్కిం. రాజ్యాలను ఏలే కొత్త శక్తులుపైకి తోసుకొని వచ్చినవి, విలీనమైపోయినవి కూడా. రాజ్యాలు శాశ్వతంగా ఉండేవి కావు. ఏ విధంగా శారీరక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పైన దుస్తులను మార్చుకొంటామో, అదేవిధంగా దేశ అవసరాల కనుగుణంగా రాజ్యాలలో అవసరమైన మార్పులు తెచ్చుకోవటం జరిగింది. వాటిలో అవసరాలకు తగినట్లు వైవిధ్యమూ ఉన్నది.

పైన చర్చించిన విషయాలను బట్టి దేశం కోసం రాజ్యం ఏర్పడుతుందేగాని, రాజ్యం కోసం దేశం లేదని మనకు స్పష్టమౌతుంది. అదేవిధంగా రాజకీయాల కోసం జాతీయతత్వాన్ని జపించటం కాక, జాతీయతత్త్వ పోషణ కోసం రాజనీతిని పెంపొందించుకోవాలి. దేశాన్ని కుంచింపజేసే, క్షీణింపజేసే రాజకీయాలు అవాంఛనీయమైనవి. సురాజ్యం – స్వరాజ్యాల మధ్య కూడా ఇటువంటి వివేకంతోనే వ్యవహరించాలి. పరాయివారు నిర్వహించే సురాజ్యం కంటే, కష్టాలతో కూడుకొన్నదే అయిన స్వరాజ్యం మేలు. అదే కోరుకోదగినది. స్వరాజ్యం గురించి చెప్పుకొనేటప్పుడు మూడు విషయాలు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తాయి. దేశంలో అవయవ స్వరూపులుగా ఉన్నవారి ద్వారానే రాజ్య నిర్వహణ జరగాలనేది మొదటిది. దేశం కోసమే రాజ్యం పని చేస్తుండాలి. అంటే దేశానికి మేలు చేకూర్చే విధానాలనే రాజ్యం అనుసరిస్తూ ఉండాలనేది రెండవది. దేశానికి మేలు చేకూర్చే సాధనలో భాగంగా తనదైన వనరుల మీద, సామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి నడుస్తూ ఉండాలి అనేది మూడవది. దీనిని మరో మాటలో చెప్పాలంటే – స్వావలంబన లేకుండా స్వరాజ్యం నిలబడాలని కోరుకోవటం తగదు. దేశంలో అంతర్భాగమైన వారే రాజ్యాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, వారు ఆర్థిక విధానాలలో, విదేశీ విధానాలలో మరో దేశం వారికి కీలుబొమ్మలుగా, తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లయితే, వారి ఒత్తిడులకు లోబడిపోయినట్లయితే వారి ఆ స్వరాజ్యము నిరర్థకమే అవుతుంది. రాజ్య రక్షణ సంబంధమైన విషయాలలో రాజ్యం ఆత్మనిర్భరం (స్వావలంబన శక్తి కల్గినది) కాకపోతే, విధానాలను రూపొందించుకోవటంలో స్వతంత్రంగా వ్యవహ రించుకోలేకపోతే, ఆర్థిక యోజనలను అమలు చేసుకోవటంలో  స్వతఃసిద్ధం కాకపోయినట్లయితే, ఆ రాజ్యం తన దేశానికి క్షేమకరం కాని పనులు చేసే దిశలో సాగుతుంది. అలా పరాయితనంతో రాజ్యం వినాశకారకమవుతుంది.

దీనినిబట్టి మనం గ్రహించవలసింది – స్వదేశం అవసరాలను పూర్తి చేయడానికే స్వరాజ్యం, ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నంత వరకే అది  ప్రయోజన కరమైనది అవుతుంది, సార్థకమవుతుంది. దేశీయ సమాజం రాజ్యాన్ని మించి దేశాన్ని ఆరాధించటం జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నిజమైన సామర్థ్యం ఉండేది దేశంలోనే. రాజ్యంలో కాదు. అందుచేతనే దేశ భక్తులు, దేశప్రేమికులు రాజనీతిని (రాజకీయాలను) గాక దేశీయ భావనను (జాతీయభావనను) ఆరాధిస్తారు. దేశమే ఏకైక సత్యం. ఈ సత్యాన్ని ఉపాసించటం, సాంస్కృతిక కార్యక్ర మంగా పేర్కొంటారు. ప్రఖర దేశీయవాదంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమంలోని శక్తి వాటి వెనుక నిరంతరం కనిపిస్తూ ఉన్నపుడే, రాజకీయ కార్య కలాపాలు సఫలం కాగలవు.

(‘రాష్ట్ర జీవన్‌ ‌కీ దిశా’ పుస్తకం నుండి)

About Author

By editor

Twitter
Instagram