– రాజనాల బాలకృష్ణ

ఏటా భీష్మ ఏకాదశికి ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ప్రశాంతంగా ఉండే చిన్న తీర గ్రామం అంతర్వేది. అలాంటి  ఊరు సెప్టెంబర్‌ ఆరో తేదీ నుంచి కొన్ని రోజుల పాటు అగ్నిగుండంగా మారిందంటే అతిశయోక్తి కాదు. కారణం ఒక్కటే- తాము ఎంతగానో ఆరాధించే శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యరథం ‘దుండగుల చేతిలో’  కాలి బూడిదైంది.

అంతర్వేది పరిసరాలలో దేవతలు యజ్ఞం చేశారనీ, అప్పుడు దీక్షావస్త్రాలు ఇక్కడ ఆరేయడం వల్లనే, దీనికి అంతర్వేది అని పేరొచ్చిందని స్థల పురాణం.  ఇప్పుడు అంతర్వేదే అగ్నిగుండమైంది. అక్కడ బొగ్గుల రాశిగా మారినది కేవలం ఓ చెక్కరథం కాదు. అక్కడ అగ్నికీలల పాలపడింది- మెజారిటీ ప్రజల మనోభావం. ఏ హిందూ సంస్థ ఆధిపత్యమూ లేదక్కడ. ఎప్పుడో 1922లో రథం మీద పెట్టిన గాంధీజీ బొమ్మ తీసివేయమన్నందుకు ప్రజలు ఆగ్రహించిన సందర్భం తప్ప రాజకీయాలు దాదాపు లేవు. ఇప్పుడు ఒక్కసారిగా హిందువులు తమంతట తామే ఉగ్ర నరసింహులైపోయారు. హిందూ దేవాలయాలే లక్ష్యంగా రాష్ట్రంలో జరిగిన దాదాపు ఇరవై దాడుల తరువాత పరిణామమిది. ఇందులో ప్రధానంగా చెప్పుకునే మూడు దుర్ఘటనలకు పిచ్చివాళ్లను కారకులుగా చూపడమంటే  హిందువులను పిచ్చివారిగా జమ కట్టడం కాదా? దీనిని రాజకీయాలతో ముడి పెట్టవద్దని  వైసీపీ నేతలు నీతులు చెబుతున్నారు. ఎక్కడో మైనారిటీల మీద ఏదో దాడి జరిగితే బీజేపీని, హిందువులను దుమ్మెత్తి పోసే వీరంతా ఇప్పుడు మాత్రం నోటికొచ్చినన్ని సెక్యులర్‌ ‌నీతులు వల్లిస్తున్నారు.

 ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్య మంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి హిందువుల మనో భావాలతో ఆటలాడ దలుచుకున్నారా? అన్న భావన బలపడుతున్న కాలంలో, ఇలాంటి అనుమానాలకు తావిచ్చే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో జరిగినదే అంతర్వేది రథం దగ్ధకాండ. అసలు ఆంధప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న వినిపించడం ఇదే తొలిసారి కాదు. చివరిసారి కూడా కాకపోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అనేక సందర్భాలలో ఈ ప్రశ్న వినవస్తూనే ఉంది. ఇప్పుడు, అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి పవిత్రరథాన్ని ‘దుండగులు’ తగలబెట్టిన దుర్ఘటనతో మరో మారు అదే ప్రశ్న ఇంకాస్త ఉగ్రంగా వినిపిస్తోంది. హిందూ సమాజాన్ని ఆందోళనకూ, ఆగ్రహానికీ గురిచేస్తోంది.

జరిగింది చిన్నాచితకా ఘటన కాదు. ఒకవేళ ఏలినవారు అదే  అనుకున్నా, అంతర్వేది వెళ్లిన రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆయన వెంట వెళ్లిన జిల్లా మంత్రి విశ్వరూప్‌, ‌వేణుగోపాల కృష్ణలకు ఎదురైన చేదు అనుభవం తర్వాత అయినా, ముఖ్యమంత్రీ, మంత్రీ మేలుకోవలసినది. కానీ, దుర్ఘటన జరిగి పదిరోజుల పైనే అయినా, ముఖ్య మంత్రి నోటి నుంచి ఒక్క మాట ఊడిపడలేదు. ముఖ్యమంత్రి చూపుతున్న ఈ నిర్లక్ష్య ధోరణి పుండు మీద కారం చల్లిన చందంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా స్పందించి ఉండవలసిందని అధికార పార్టీలో విజ్ఞత కలిగిన నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది.  ఇలాంటి సంఘటనే మరో మతం విషయంలో జరిగితే ముఖ్యమంత్రి ఇలాగే మౌనంగా ఉండగలరా అని, సామాన్యజనం కూడా మౌనంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభువులవారికి జనఘోష ఇప్పుడు వినిపించక పోవచ్చును గానీ, వినిపించే రోజు వస్తుంది. చంద్రబాబునాయుడు కూడా ఇలాగే హిందువులను చులకన చేశారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా, ‘హిందూ గాళ్లు, బొందూ గాళ్లు’ అని హిందువులను తూలనాడారు. అయన ఎక్కడైతే మాట జారారో అక్కడే, అదే కరీంనగర్‌లో హిందువులు సత్తా చూపించారు.

రథం దగ్ధం వార్త దావానలంగా వ్యాపించి నప్పటికీ, నిరసన జ్వాల ఉవ్వెత్తున  లేచినప్పటికీ పాత బాణీనే ఏలినవారు వినిపించే యత్నం చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి రథం తగలబడిన సమయంలో,  పిఠాపురం తదితర చోట్ల దేవాలయాలపై దాడులు జరిగిన సందర్భాలలో ప్రదర్శించిన మేధో విన్యాసాలనే తిరిగి చేశారు. అంతర్వేది రథం దగ్ధం పని ముందు గుర్తు తెలియని పిచ్చివారి పనన్నారు, అతడు బెంగాలీ పిచ్చోడని చిరునామా ఇచ్చారు. ఆ తర్వాత తేనేతుట్టెను పట్టుకొచ్చారు. 40 అడుగుల ఎత్తైన టేకు రథం తేనేపట్టుకు పెట్టిన పొగతో మంటకు కాలి బూడిదైపోయిందని కట్టుకథను వినిపించారు. ఇప్పటికే ఇలాంటి కథలు విని ఉన్న జనం, మంత్రులను ఘెరావ్‌ ‌చేశారు. మంత్రులు దొడ్డిదారిన పారి పోయారు. వివిధరూపాల్లో ప్రజాగ్రహం, ధర్మాగ్రహం వ్యక్తమయ్యాయి. అయినా ప్రభుత్వం తీరు మారలేదు. మారే సూచనలూ లేవు. కనీసం దేవాదాయ శాఖ అయినా జరిగిన అపరాధం పట్ల ఎంతో కొంత విచారం వ్యక్తం చేస్తుందని అనుకుంటే, అదీలేదు. ప్రతిపక్షాల మీద ముఖ్యంగా, బీజేపీ, సంఘ్‌పరివార్‌ ‌సంస్థల ప్రతినిధుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గత 16 నెలలుగా ఇంచు మించుగా ఇరవై వరకు దైవదూషణ దుర్మార్గ సంఘటనలు జరిగినా, హిందువుల మనోభావాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం కాకమ్మ కథలు చెప్పినా, పెదవి విప్పే సాహసం చేయని దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌ ఇప్పుడు బీజేపీ, సంఘ్‌ ‌పరివార్‌ ‌సంస్థలు మత ఉద్రిక్తలు ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన కంటే ఘనుడు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహ రిస్తున్నప్పటికీ కొందరు కావాలనే బురదజల్లే కార్యక్రమాన్ని అదేపనిగా సాగిస్తున్నారని అంటున్నారు. అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐకి ఆదేశించిం చడం, రథం నిర్మాణానికి నిధులు కేటాయించడం, ‘క్రైస్తవ’ ముఖ్యమంత్రి విశాల హృదయానికి నిదర్శనంగా కీర్తించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం, మతమార్పిడుల గురించి ఒక్కమాట మాట్లాడే ధైర్యం లేని అమాత్యులు, మతాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని సుద్దులు వల్లిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి చెప్పగలిగింది ఒక్కటే .. వినాశకాలే విపరీత బుద్ధి:

వీహెచ్‌పీ, బజరంగ్‌దల్‌ ‌కార్యకర్తల ఆందోళన

ఇది కేవలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి పవిత్ర రథ దహనం పట్ల వ్యక్తమవుతున్న ధర్మాగ్రహం మాత్రమే కాదు. అలా అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. నిజమే, శ్రీలక్ష్మీనరసింహస్వామిని హిందువులు మహావిష్ణువు మహోగ్రరూపంగా ఆరాధిస్తారు. సర్వాంతరయామిగా, సర్వశక్తి సంపనునిగా ఆరాధిస్తారు. దర్శనమాత్రంగా జీవనముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే స్వామివారి పవిత్ర రథం కాలిబూడిదై పోతే హిందువులు మనోవేదనకు గురికావడం, ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం.

అంతర్వేది దుర్ఘటనపై హైందవ సమాజం మున్నెన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో భగ్గుమనడానికి అనేక కారణాలు. అందుకే, అంతర్వేది దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించినా ధర్మాగ్రహం చల్లారలేదు. బీజేపీ, జనసేన కూటమి, విశ్వహిందూ పరిషత్‌ ‌తదితర, హిందూ ధార్మిక సంస్థలు, సంఘ్‌ ‌పరివార్‌ ‌సంస్థలు జగన్మోహన్‌ ‌రెడ్డి 16 నెలల ‘పవిత్ర’ పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులు, దుర్మార్గచేష్టలు, క్రైస్తవీకరణ కుట్రలు, కుతంత్రాలన్నిటిపైనా సమగ్ర విచారణ జరగాలని పట్టు పడుతున్నాయి. నిజంగా జరగవలసింది అదే. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం తెలివిగా సీబీఐ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుందామనుకుంటే అది కుదిరే పనికాదు. సీబీఐ విచారణ జరుగుతుంది. అయితే,అది మాత్రమే సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేదితో పాటుగా తమ ప్రభుత్వ హయంలోనే కాదు, గత ప్రభుత్వ హయంలో హిందూ మనోరథం పై జరిగిన దాడులు అన్నిటిపైన విచారణ జరిపించాలని, సీబీఐని కోరాలి, అప్పుడే కనీసం కొంతవరకైనా నిజాలు వెలుగుచూస్తాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పత్రికా ముఖంగా కోరారు.

హిందువులు ఎంత నష్టపోయినా, వారి తరఫున కాకుండా రాజకీయం వైపు మొగ్గే విద్య నేతలలో చూస్తున్నాం. అట్నుంచి నరుక్కు రావడం అందులో భాగమే. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయా? రథ దహనాలు ఇప్పుడే మొదల య్యాయా? అంతకు ముందు ఇలాంటి దుశ్చర్యలు జరగలేదా అన్న ఆ ప్రశ్నలు అందుకు సంబంధిం చినవే. నిజమే, ఈ పాపం ఈ ఒక్క ప్రభుత్వానికే అంటగట్టడం సరి కాదు. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు పాలనలో, వైఎస్‌ ‌హయాంలో, అంతకు ముందు ఎన్టీఅర్‌ ‌పాలనలో ఇంకా రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌హయాములలో హిందూ దేవాలయాల మీద దాడులు, హిందూ మనో భావాలను కలచివేసే సంఘటనలు అనేకం జరిగాయి. రాష్ట్రాన్ని పాలించిన అప్పటి కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం, ఇప్పటి వైసీపీలు హిందూ సమాజన్ని కుల రాజకీయాల మత్తులో ముంచి, సెక్యులరిజం ముసులో అన్యమతాల ఓటు బ్యాంకును దన్నుగా చేసుకుని సాగించిన రాజకీయాల చరిత్ర దాచేస్తే దాగని సత్యం. ఇవాళ జరిగింది వాటికి కొనసాగింపు.

ఇది ఇప్పుడే బయటపడిన రహస్యం కూడా కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ, ‘సెక్యులరిజం’ పేరున హిందూ దేవీదేవతల పట్ల, హిందూ దేవాలయాల పట్ల, మొత్తంగా హిందూ సమాజం పట్ల అనేక రూపాల్లో వివక్ష రాజ్యమేలింది. పవిత్ర పుష్కరాలను అపవిత్రం చేయడం మొదలు, కనకదుర్గమ్మ దేవాలయంలో క్షుద్రపూజల వరకు, దేవాలయాల కూల్చివేతలు, తిరుమల సహా అనేక ప్రసిద్ధ దేవాలయాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో చేర్చి దేవాలయాల ఆస్తులను దోచి, భక్తులు పవిత్రంగా స్వామి వారికి సమర్పించుకున్న కానుకలను అన్య మతస్తులకు దోచి పెట్టడం వరకు, గత తెలుగుదేశం ప్రభుత్వం  వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం తీసుపోదు. అధికారాంతంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. నిజానికి చంద్రబాబు చరిత్రను తిరగేస్తే, వేయికాళ్ల మండపాన్ని కూల్చిన

‘పుణ్యాత్ముడు’ ఆయనే. పింక్‌ ‌డైమండ్‌ ‌సహా స్వామి వారి ఆభరణాల అపహరణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నదీ ఇంకా అనేక విధాలుగా హిందువుల మనోభావలను దెబ్బతీసింది, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వం.

తగుదునమ్మా అంటూ వైసీపీ సోషల్‌ ‌మీడియా దండు ఇప్పుడు గతాన్ని తవ్విపోస్తోంది.  2017లో చంద్రబాబు పాలనా కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో, శ్రీగోపాలస్వామి ఆలయంలో చరిత్రాత్మక దివ్యరథం  దగ్ధమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాదన్నది ఎవరు? అంతర్వేది దుర్ఘటనను వ్యతిరేకించడం అంటే, పెంటపాడు దుర్ఘటనను సమర్ధించడం అని ఎవరు చెప్పారు? జగన్‌ ‌పవిత్ర పాలనలలో జరిగిన, జరుగతున్న దుశ్చర్యలను ఖండించడం అంటే, చంద్రబాబు పాపాలను సహిం చడం కాదు. ఆ ఇద్దరూ హిందూ ధర్మ కంటకులే. అవినీతి విషయంలో ఏ విధంగా అయితే ఒకరితో ఒకరు పోటీ పడి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారో అదే విధంగా, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజన్ని కులాల వారీగా, మతాల వారీగా చీల్చి ఈ స్థితికి చేర్చారు. నిజానికి, బీజేపీ, జనసేన కూటమికి గానీ, మరే ఇతర హిందూ సంఘటనకు గానీ, సామాన్య హిందువులకు గానీ మరో అభిప్రాయం లేదు. అందుకే కదా, హిందూ సంస్థలు సీబీఐ విచారణ కేవలం అంతర్వేది దుర్ఘటనకు పరిమితం కాకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన దుర్మార్గ, దుశ్చర్యలన్నిటి పైనా జరగాలని కోరుతున్నాయి. అంతేకాదు హిందూధర్మం, హిందూ దేవాలయాలపై జరిగిన దురాగతాలతో పాటుగా, చంద్రబాబు, జగన్‌ ‌ప్రభుత్వాల హయాంలో జరిగిన సింహాచలం భూముల కుంభకోణం వ్యవహారం మొదలు, ఇతరేతర సంఘటనలపై కూడా సమగ్ర విచారణ జరగాలని  కోరుకుంటున్నారు. ఈ సత్యాన్ని బాబుల బంట్లు అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇలా కోరడం బీజేపీ వరకు టీడీపీతో గతంలో జత కట్టిన పాపానికి లెంపలు వేసుకోవడం కూడా.


పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం గుర్తు లేదా?

పాదగయ, అష్టాదశ పీఠాలలో ఒకటి, పురుహూతికాంబ సమేత కుక్కుటేశ్వరుడు కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో 21.01.2019వ తేదీ ఉదయం కనిపించిన దృశ్యాలు హిందువుల మనోభావాలను ఘోరంగా గాయపరిచాయి. అగ్రహారంలో ఉన్న ఉమాశంకర దేవాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి, గణపతి, సాయిబాబా, అయ్యప్పస్వామి విగ్రహాలు ముక్కు, చెవులు, ముఖాలు ఛిద్రమైపోయి కనిపించాయి. దుండగులు రాత్రి వాటికి అంతటి అపచారం తలపెట్టారు. అదే రోడ్డు చివర సాక్షాత్తు న్యాయస్థానం సమీపంలో ఉన్న అమ్మవారి గుడిలోని విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఆరోజునే కొంతమంది భక్తులు, బాధ్యత కలిగిన హిందువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌ ‌టీమ్‌ ‌వచ్చి పరిశీలించింది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు, హిందూ సంస్థల సభ్యులు వచ్చి రోడ్డుమీద ధర్ణా చేశారు. ఆ మరుసటి రోజు నిరసన మరింత తీవ్రమైంది. హిందూ ధార్మిక సంస్థలు, విశ్వహిందూ పరిషత్‌, ‌ధర్మవీర్‌, ‌శివశక్తి, హిందూసేన, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బ్రాహ్మణ పురోహితుల సంఘ నాయకులు, బిజేపీ నాయకులతో కలిసి రామాలయంలో భవిష్యత్‌ ‌కార్యాచరణకు యోజన చేశారు. ఆపై స్థానిక పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కేసును సిఐడికి అప్పగిస్తామని చెప్పి తాత్కాలికంగా పోలీసులు ఉద్యమాన్ని ఆపు చేశారు. వారం గడువు కోరారు. కానీ పోలీసు శాఖ నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడంతో సాధుసంతులు, పీఠాధిపతులు వచ్చి, సాక్షాత్తూ శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశంలో ఇది జరగడం దుశ్చర్య అని వెంటనే దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.

30.01.2019వ తేదీన పిఠాధిపతులు, పరిపూర్ణానంద స్వామి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, హిందూ చైతన్య సంఘనాయకులు గురవయ్య, విజయవాడ నుంచి ప్రముఖులు వచ్చి పోలీసు వారిని హెచ్చరించారు. వారం రోజులలో ఈ విషయాన్ని తేల్చకపోతే ‘ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన’ని పరిపూర్ణనందస్వామి హెచ్చరించారు. సరిగ్గా వారానికి పరిపూర్ణానంద వచ్చారు. పశువుల సంత స్థలంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. హిందువుల డిమాండ్లు నెరవేర్చవలసిందేనని మరొకసారి హెచ్చరించారు. వారం తర్వాత పోలీసులు ఎవరినో తీసుకువచ్చి దోషిగా నిలిపారు. అతడు పిచ్చివాడట. అతడినే చూపించి అరెస్టు చేసామని చెప్పి, కేసును సిఐడికి అప్పగించామని చెప్పారు.

– రామచంద్రరావు, పిఠాపురం


చంద్రబాబు నడిచిన హిందూ వ్యతిరేక ధోరణకీ,  వైసీపీ ప్రభుత్వం చర్యలకీ పెద్ద తేడా లేదు. అందుకే హిందువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్‌బాబు ప్రభుత్వం మరింత వేగంగా, ఇంకా చాలా వికృతంగా ఓట్ల రాజకీయంలో వడివడిగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు, టీడీపీ కేవలం ఓట్ల కోసం మైనారిటీల బుజ్జగింపులు సాగిస్తే, జగన్మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఒక విధంగా హిందూ ధర్మంపై యుద్ధాన్ని ప్రకటించారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు, క్రైస్తవ సమాజం మొత్తం అలాంటి అభిప్రాయం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ ‌పాలనలో క్రైస్తవ మత ప్రచారం ముందెన్నడూ లేని విధంగా సాగుతోంది. మత మార్పిడులు భయంకరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని, ఎవరో కాదు, అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణమరాజు జాతీయ మీడియా సాక్షిగా ప్రపంచానికి తెలియచేశారు. కృష్ణమరాజు విషయమనే కాదు, జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు పాపాల చిట్టా పెంచుకుంటూ పోతోంది. టీటీడీ, శ్రీశైలం ఇతర ప్రముఖ దేవాలయాలలో కొలువు తీరిన అన్య మతస్థులను ఏరి వేసేందుకు ప్రయత్నించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాత్రికి రాత్రి బదిలీ చేసిన సంఘటన మొదలు అనేక విషయాల్లో జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఒక మతం పట్ల తన అనుకూలతను బయట పెట్టుకుందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగా ఉంటున్నాయి.

అం‌తర్వేదిలో వైసీసీ మంత్రులు

పాస్టర్లకు, ఇమాంలకు జీవనభృతి ఇస్తామని చంద్రబాబు వాగ్ధానం చేశారు, జగన్‌ ‌ప్రభుత్వం ఆ వాగ్ధానాన్ని అమలు చేసింది. నెలకు ఐదు వేల రూపాయల వంతున ప్రభుత్వ ఖజానా నుంచి అన్య మత ప్రచారకులకు ఇస్తోంది. రాష్ట్రంలో మత ప్రచారాన్ని, మత మార్పిడులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహిస్తోంది.  అదేమి లౌకిక న్యాయమో  గానీ, దేవాలయ భూముల తెగనమ్మడానికి తలుపులు తీసిన సెక్యులర్‌ ‌ప్రభుత్వాలు చర్చిల నిర్మాణాలకు, బాగోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తున్నాయి. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైస్సార్‌ ‌ప్రభుత్వ హయాంలోనే చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించడం వివాదం అయింది. ఈ విషయంలో ప్రజ్ఞాభారతి తరపున త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు కూడా. అయినా ఈ ధోరణి ఆగలేదు.హిందూ దేవాలయాలు, హిందూధర్మం, హిందూ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగతున్న దాడులను, అలాంటి అకృత్యాల పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అనుమానాలకు ఆస్కారం కలిపిస్తోంది.  ప్రమాణ స్వీకారం రోజునే తమ పవిత్రాత్మను బయట పెట్టుకున్న వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి 16 నెలల పాలనలో ఒకటొకటిగా వెలుగు చూసిన, ‘దేవాలయ దుర్ఘటనలు’ దుర్మార్గ చేష్టలు, క్రైస్తవీకరణ కుట్రల పర్యవసానంగానే ఈరోజు హిందూ మనోరథం భగ్గుమంటోంది. గతంలోనూ మతం మార్చుకున్న వారు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే, ఎవరూ  ఇలా ఎముకలు మెళ్లో వేసుకోలేదు.


బిట్రగుంట స్వామి రథానికి అపచారం

అం‌తర్వేది రథం దగ్ధం ఘటనకు ఆరు మాసాల ముందు జరిగిందే నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి రథం దగ్ధం ఉందంతం. బ్రహోత్సవాల్లో వినియోగించే ఆ భారీ రథాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 అర్థరాత్రి ‘ఎవరో’ దహనం చేశారు. బ్రహోత్సవాలకు 20 రోజుల ముందు జరిగిన ఈ ఘటన కూడా భక్తుల మనోభావాలను గాయపరిచింది. హిందూ సంఘాలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ దిగువకే మెట్ల మార్గం వద్ద రథాన్ని నిలిపి ఉంచారు. ఎండావానల నుంచి రక్షణగా తాటాకులు కప్పిన రథానికి నిప్పుపెట్టారు. సమీపంలోనే ధాన్యం ఆరబోసుకుని కాపలాగా నిద్రిస్తున్న రైతులు మంటలను గుర్తించారు. కావలి అగ్నిమాపక శాఖ 2 గంటలు శ్రమించి తెల్లవారు జామున 4.30 గంటలకు మంటలను అదుపు చేయగలిగారు. అప్పటికే రథం బొగ్గుల కుప్పగా మారింది. ఘటనకు కారణంగా అనుమానిస్తున్న స్థానిక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతి స్థిమితం సరిగా లేక తరచూ ఉన్మాద చర్యలకు పాల్పడే యువకుడే నిప్పు అంటించి ఉంటాడనే అనుమానంతో స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. భక్తులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉత్సవాలకు కనీసం నెలరోజుల ముందే రథాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు చేపట్టేవారు. ఈసారి మాత్రం బాహ్య స్వరూపాన్ని పరిశీలించేందుకు కూడా పైన ఉన్న తాటాకుల కప్పు కూడా తొలగించలేదు. ఉత్సవాలంటే హుండీలు నింపుకోవడం అనే ఆలోచన తప్ప ఆలయ అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదని భక్తులు దుమ్మెత్తి పోశారు. వాచ్‌మన్‌ ‌లేడు. కొండపైన తరచూ ఖాళీ మద్యం సీసాలు కనిపిస్తున్నాయని పదే పదే భక్తులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని దహనం చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ ‌రెడ్డి దేవదాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులకు అప్పుడు సూచించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, తదితర అంశాలపై టీటీడీ వేదపండితులతో సంప్రదింపులు జరిపామని ఆనాడే ఆయన చెప్పారు. స్వామివారికి నూతన రథాన్ని సిద్ధం చేయించడంతోపాటు రథాన్ని భద్రపరిచేందుకు శాశ్వత కట్టడాన్ని కూడా నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కూడా చెప్పారు. ఎలాంటి చర్యలు జరిగాయో ఇప్పటి వరకు తెలియదు.


అందుకే, అకృత్యాలను చూసి చూసి, విసుగెత్తిన హిందువులు వాస్తవాలను గ్రహిస్తున్నారు. రథం దగ్ధం తరువాత వెల్లువెత్తిన ఆగ్రహంలో కొందరు అక్కడి ఒక చర్చి మీద రాళ్లు వేసినట్టు తెలుస్తోంది. ఇది జరిగి ఉండవలసింది కాదు. కానీ రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు, అంటే హిందూ సంఘాలు పూర్తి చైతన్యం పొందే వరకు అంతర్వేది ఉత్సవం సహా, ఆ ప్రాంతంలో జరిగే అన్ని హిందూ ఉత్సవాలలోను క్రైస్తవ మత ప్రచారకులు యథేచ్ఛగా చొరబడేవారు. బాకాలతో ఊదరగొట్టేవారు. అంతర్వేది చుట్టూ ఉన్న కేశవదాసుపాలెం, అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లి, మూడుతూములు ప్రాంతం, టేకిశెట్టిపాలెం, మోరిలలో క్రైస్తవం విస్తృతంగా పెరిగిన మాట ఎవరూ కాదనలేరు. ఒకప్పుడు బంగాళాపెంకులతో కూలిపోతున్నట్టు ఉండే చర్చిలు ఇప్పుడు రమ్యహర్మ్యాల రూపుదాల్చాయి. రథం ఆందోళన సందర్భంగా రాళ్లు పడిన చర్చి నిర్వాహకులు యాభయ్‌ ‌లక్షలు నష్టపరిహారం అడుగుతున్నారని వార్త. అవి అంత ఖరీదైన కట్టడాలు. క్రైస్తవ ప్రచారకులు ఎంత బరితెగించి మాట్లాడుతున్నారో టీవీ చానెళ్ల చర్చలు చూసినా తెలుస్తుంది.ఇక్కడి గ్రామాలలో సభలు పెట్టి హిందూ దేవుళ్లను, సంస్కృతిని దూషించడం కూడా సర్వసాధారణం. తిరుమలలో అన్యమత ప్రచారం, శ్రీశైలంలో,భద్రాచలంలోను అదే. మత స్వేచ్ఛ అంటే ఇదేనా? జగన్‌ ‌కాస్త నోరు తెరిచి చెప్పాలి.

 అంతర్వేది రథం దహనంతో  వైసీపీ నిజరూపం బయట పడింది. హిందువులు సహజంగా ఇంకొకరి జోలికి వెళ్లరు. ఇతరులు చేసింది తప్పని తెలిసినా, అపచారమని గ్రహించినా వారి పాపానా వారే పోతారని దైవం మీద భారం వేసి అందరి మంచిని కోరుకుంటారు. అయితే, అంతర్వేది, అంతకు ముందు పిఠాపురం, అంతకంటే ముందు వెనకా నెల్లూరు, గుంటూరు, ఇంకా అనేక చోట్ల జరిగిన దేవాలయాల కూల్చి వేటలు, విధ్వంసాలు,  దహనాలు చూసి చూసి హిందువుల సహనం నశించింది. ఒక విధంగా, అన్యమతాలు, అన్యమత సమర్ధకులు, సర్కారీ స్వాములు హిందూ జాగృతిని మేలుకొలిపారు. అందుకు వారికి హిందూ సమాజం కొంత రుణపడి ఉంటుంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram