హిందూ చేతన ఇప్పుడు నిద్రాణ స్థితిని వీడి జాగృతమైన నేపథ్యంలో సనాతన ధర్మాన్ని, ఆలయాలను నిర్మూలించడం అంత తేలికకాదనే విషయం మరొక్కసారి రుజు వైంది. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యేక ప్రసారాలపై నిషేధం నుంచి మతాంతరీకరణకు పరోక్ష ప్రోత్సాహం వరకూ  ప్రభుత్వ మద్దతుతో యధేచ్చగా సాగిపోతున్న తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి మద్రాసు హైకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు చెప్తూ బ్రేకులు వేసింది. హిందువులకు కూడా తమ ధర్మాన్ని స్వేచ్ఛగా అనుసరించే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టంగా చెప్పింది.

ద్రవిడ, ఆర్య సిద్ధాంతం తప్పని జన్యు పరీక్షలలో శాస్త్రీయంగా తేలినప్పటికీ, పెరియార్‌ ‌రామస్వామి వంటి హిందూ వ్యతిరేక వ్యక్తులను, శక్తులను అనుసరించే ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) లాంటి రాజకీయ పార్టీలకు మద్రాసు హైకోర్టులోని మధురై బెంచి న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ శ్రీ‌మతి కీలెరిగి వాతపెట్టారు. పళనికి చెందిన సెంథిల్‌ ‌కుమార్‌, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 30వ తేదీన తీర్పు ఇస్తూ, సామాజిక సమరసత, శాంతి కోసం హిందూ ఆలయాలలోకి హిందూవేతరులను ధ్వజస్తంభం దాటి వెళ్లనివ్వ రాదని, ఆ మేరకు ఆలయాలలో పలుచోట్ల బోర్డులు ఏర్పాట్లు చేయాలని తమిళనాడు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖకు ఉత్తర్వులు జారీచేసింది. ఎవరు పడితే వారు తమ కార్యకలాపాల కోసం వెళ్లడానికి అవి పిక్నిక్‌స్పాట్లు కాదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పళనిలోని ఒక ఆలయం విషయంపై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు అనుకూ లంగా తీర్పునిస్తూ, కేవలం ఆ ఆలయానికే కాక రాష్ట్రంలోని అన్ని ఆలయాలకూ ఈ తీర్పు వర్తిస్తుందని కూడా స్పష్టంగా చెప్పింది. ఈ ఆంక్షలే భిన్న మతాల మధ్య మతసామరస్యానికి హామీ ఇచ్చి, సమాజంలో శాంతిని కొనసాగేందుకు తోడ్పడతాయని కూడా కోర్టు అభిప్రాయపడింది.

పెరియార్‌వాదులకు చెంపపెట్టు

ఈ క్రమంలోనే, ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను, ఆగమాలను కచ్చితంగా నిర్వహించేలా చూడాలని నొక్కి చెప్పింది. ప్రతివాదులు ఈ తీర్పును ఒక్క ఆలయానికే వర్తింప చేయాలని కోరినప్పటికీ, న్యాయస్థానం మాత్రం పిటిషనర్లు  లేవనెత్తినది విస్తృతమైన సమస్య అని, కనుక ఇది అన్ని ఆలయాలకూ వర్తింపచేయాల్సిందే నంటూ కటువుగానే చెప్పింది. దీనితోపాటుగా హిందూవేతరులు ఆలయాలలోకి మతేతర ప్రయోజ నాల కోసం ప్రవేశించడం అన్నది హిందువుల ‘ప్రాథమిక హక్కుల’లో జోక్యం చేసుకోవడమేనంటూ స్పష్టం చేసింది. హిందువులు తమ ధర్మాన్ని స్వేచ్ఛగా అనుసరించే రాజ్యాంగపరమైన హక్కును నిలబెడుతూ, ఆలయాలను పరిరక్షించవలసిన బాధ్యత ధర్మాదాయ శాఖదేనంటూ స్పష్టంగా చెప్పింది. ఎవరైనా హిందువేతరులు ఆలయంలోని నిర్దిష్ట దేవతను దర్శించదలచుకుంటే, వారు తమకు హిందూధర్మంపట్ల విశ్వాసం ఉందని ధృవీకరించేం దుకు వాగ్దానం చేస్తూ, ఆలయ ఆచారవ్యవహారాలకు కట్టుబడి ఉండేందుకు  అంగీకారాన్ని తెలపాలని, ఆ పక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే హిందువేతరులను ఆలయంలోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ‘‘బృహదీశ్వరాలయంలోకి ఇతర మతస్తులు ప్రవేశించి, మాంసాహారాన్ని ఆలయ ఆవరణలో తిన్న విషయాన్ని, అలాగే అన్యమతానికి చెందిన కొందరు వ్యక్తుల బృందం మధురైలోని మీనాక్షీ సుందరేశ్వర ఆలయంలోకి ప్రవేశించి, తమ ‘పవిత్ర గ్రంథం’తో గర్భగుడి వద్ద ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయడం’’ గురించీ  11 జనవరి 2024న పత్రికలలో వచ్చిన వార్తలను న్యాయమూర్తి పట్టి చూపారు. ఈ ఘటనలు రాజ్యాంగం హిందువులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులతో జోక్యం చేసు కుంటున్న విషయాన్ని చూపుతున్నాయని న్యాయ మూర్తి పేర్కొన్నారు.

పెరియార్‌ ‌పై నెహ్రూ మండిపాటు 

కొన్ని దశాబ్దాలుగా మద్రాసు రాష్ట్రంలో పెరియ వార్‌ ‌వాదం పేరుతో హిందూ వ్యతిరేక పార్టీ అయిన డిఎంకె రాజకీయ పేలాలు వేయిస్తూ, లబ్ధి పొందు తోంది. అగ్రవర్ణాలను అవమానించడం, ఆలయా లకు వచ్చే నిధులను స్వాహా చేయడం, ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, మతాంతరీకరణ సహా అనేక అనైతిక కార్యకలాపా లకు నిస్పంకోచంగా పాల్పడుతున్న విషయం తెలిసిందే. వీరి దాడులను తట్టుకోలేకే అగ్రవర్ణ హిందువులు అనేకులు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన చరిత్ర తమిళనాడుది. అగ్రవర్ణాలపై దాడులు చేయాలని, వారిని  హననం  చేయాలంటూ పెరియార్‌ 1957‌లోనే చేసిన ప్రకటనపై నాటి ప్రధాని జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ మండిపడుతూ, ముఖ్యమంత్రి కామరాజ్‌ ‌నాడార్‌కు లేఖ రాశారు.

‘‘పెరియార్‌ ‌బ్రాహ్మణ వ్యతిరేక వ్యాఖ్యలనే కాక, వారిని హననం చేయాలని ప్రజలను పదే పదే  రెచ్చగొడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది, ‘ఇది నేరపూరిత మనస్తత్వం లేదా ఉన్మాదం’, ఇలాంటి మాటలు సమాజంపైనే కాక యావత్‌ ‌దేశంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి’’ అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు సంఘవ్యతిరేక, నేరపూరిత శక్తులు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ వచ్చు, ప్రవర్తించవచ్చని భావిస్తుంటాయని, కనుక సమాజంలో దుర్ఘటనలు చోటు చేసుకోక ముందే పెరియార్‌ ‌వంటి ఉన్మాదులను  పిచ్చాసుపత్రిలో వేసి, అక్కడ వారి వక్రబుద్ధికి చికిత్స చేయించాలంటూ’’  ఆయన ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క లేఖ చాలు పెరియార్‌ ‌రామస్వామి ఎటువంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి. అయినప్పటికీ, అతడు ఆగలేదు. 1971లో రాముల వారి చిత్రపటాలకు చెప్పుల దండవేసి ఊరేగించడమే కాదు, దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ ప్రోత్సహించిన ఉన్మాది, అసురప్రవృత్తి కలిగినవాడు. వెనుకబడిన తరగతులకు చెందిన వారు అధికంగా ఉన్న రాష్ట్రంలో పెరియార్‌ ‌తన నీచ ప్రచారాలతో కులాల మధ్య చీలిక తీసుకువచ్చాడు. అంతే అప్పటి నుంచి ద్రవిడ రాజకీయాలకు తిరుగులేకుండా పోయింది.

ఆ వారసత్వంతోనే ఇటీవల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోలుస్తూ, కుల వ్యవస్థను ప్రోత్సహించే దానిని నిర్మూలించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు దేశంలోనే కాదు తమ రాష్ట్రంలో కూడా పరిస్థితులలో మార్పు వచ్చిందనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోవడంతో, ప్రజలు దానిని ఒకప్పటిలా స్వీకరించలేదు. వారు వెంటనే, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా ఎలా కొనసాగుతాడంటూ మద్రాసు హైకోర్టులో కేసువేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, ఏ ఆధారంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు ప్రశ్నించింది. ఏ సాహిత్యంలో ఈ విషయాలు ఉన్నాయి, ఏ గ్రంథాల పరిశోధన ఆధారంగా ఈ ప్రకటనలు చేస్తున్నావంటూ ఉదయనిధిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించి, మండిపడ్డప్పటికీ, ఉదయనిధి మాత్రం తానేమీ తప్పు మాట్లాడలేదని సమర్ధించుకోవడాన్ని చూశాం.

హిందూ వ్యతిరేక, మతాంతరీకరణ విత్తులు చల్లిన డచ్‌, ‌బ్రిటిష్‌ ‌పాలకులు

ఒకనాడు చోళుల కాలంలో ఒక ధార్మిక ప్రాంతంగా విలసిల్లిన తమిళనాట ఉన్నన్ని గొప్ప ఆలయాలు దేశంలో మరెక్కడా కనిపించవు. అంతటి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిన తమిళనాడులో బ్రిటిష్‌ ‌వారు అడుగుపెట్టడమే దాని పతనానికి తొలిమెట్టు అని భావించవచ్చు. ఈస్ట్ ఇం‌డియా కంపెనీ అధికారి ఫ్రాన్సిస్‌ ‌డే 1636లో బంగాళాఖాతం బీచ్‌ ‌పక్కగా మూడు చదరపు కిలోమీటర్ల భూమిని పొందేందుకు నాయ• •వంశ రాజుతో ఒప్పందంపై సంతకం చేసినప్పుడే ‘మద్రాసు’ పుట్టిందని చరిత్ర చెబుతోంది. వారికి ముందే వచ్చిన బుడతకీచులు మైలాపూర్‌ ‌సముద్ర తీరంలో 6•వ శతాబ్దంలో నిర్మించిన కపిలేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి శాంథోమ్‌ ‌కేథలిక్‌ ‌చర్చిని నిర్మించారు.  సెయింట్‌ ‌థామస్‌ ‌క్రీ.శ.73లో భారత్‌కు వచ్చి ఇక్కడే మరణించడంవల్లే ఆ చర్చిని నిర్మిస్తున్నామంటూ మతాంతరీకరణ కోసం అబద్ధపు ప్రచారాన్ని చేశారు. కాగా, సెయింట్‌ ‌థామస్‌ ‌దక్షిణ భారతాన్నే సందర్శించలేదని 2006లో పోప్‌ ‌బెనడిక్ట్ -16 ‌స్పష్టం చేసినప్పటికీ, ఏ ఒక్క ప్రభుత్వమూ దీనిపై చర్చివారిని ప్రశ్నించే సాహసం చేయలేదు. ఇక బ్రిటిష్‌వారు కూడా తమ పాలనాకాలంలో తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పెరియార్‌ ‌వంటివారిని ప్రోత్సహించడమే నేటి దుస్థితికి కారణమైంది.

ప్రభుత్వ గుప్పిట నుంచి ఆలయాలను విడిపించేందుకు పోరాటం

భారతదేశంలో మైనార్టీ మతానికి సంబంధించిన ప్రదేశాలు తమ ఆదాయాన్ని ప్రభుత్వానికి లెక్క చెప్పడం కానీ, వాటి నిర్వహణను ప్రభుత్వం చేతికివ్వడం కానీ కనిపించదు. కానీ హైందవ ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ప్రతి రాష్ట్రంలోనూ మనకు కనిపిస్తుంది. వామపక్షవాదుల నుంచి పెరియార్‌వాదుల వరకూ, భగవంతుడిపై విశ్వాసం లేదని చెప్పే పార్టీల గుప్పిట్లో హిందువుల ఆలయాలు ఉండటం, అక్కడి అర్చకుల దుస్థితి, మన కళ్లెదుట కనిపించే సత్యం.

తమిళనాడులో కొన్ని జైనమందిరాలు, పలు మఠాలు సహా దాదాపు 44,121 ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం కింద నిర్వహిస్తోంది. ఈ హిందూఆలయాలు, మఠాలలో హిందువులు పవిత్రంగా భావించి, పోటెత్తే ఆలయాలు, మఠాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయాలకు వచ్చే వందల,వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు మింగివేయడమే కాకుండా, ఆ ఆలయాలకు ఉన్న ఆస్తులను కొంతమేరకు అమ్మే శారు. కొన్నింటిలో ప్రతిఘటన ఎదురవుతున్నది. అందుకే ఆలయాల నిర్వహణను ప్రభుత్వ గుప్పిట్లోంచి బయిటపడేయా లని పలువురు ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్‌ ‌వంటివారు చేస్తున్న ప్రచారం ఈ కోవలోకి వచ్చేదే.

చిదంబరం రగడ

తమిళనాడు రాష్ట్రం, చిదంబరం పట్టణంలోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటైన తిల్లై నటరాజ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. అప్పటి నుంచి ఆలయానికి ధర్మ కర్తలుగా పోడు దీక్షితార్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. బ్రాహ్మణులలో ఒక వర్గమైన దీక్షితార్లకు ఈ ఆలయపగ్గాలను నాటి రాజులు, తర్వాత బ్రిటిష్‌ ‌వారు ఇచ్చారు. ఈ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుంచి శివభక్తులు వస్తుంటారు. అయితే, 1982లో తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణ కోసం ఒక కార్యనిర్వాహణాధికారిని నియమించేందుకు ప్రయత్నించగా, అందుకు అభ్యంతర పెడుతూ దీక్షితార్లు కోర్టుకు వెళ్లారు. దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం సుప్రీం కోర్టు దీక్షితార్లకు అనుకూలంగా 2014లో తీర్పు ఇచ్చింది. ఆ ఆలయాన్ని సంప్రదాయకమైన, శాఖాపరమైన ఆలయంగా ప్రకటించి, దానికి నిర్వాహకులుగా దీక్షితార్లు ఉండవచ్చని తీర్పు చెప్పింది. అయి నప్పటికీ, రాష్ట్రప్రభుత్వం మాత్రం ఆ ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకురావాలన్న పట్టు దలతో రకరకాల నిందలు దీక్షితార్లపై వేస్తూ వేధిస్తోంది.

యునెస్కో నివేదిక

ఇది ప్రముఖ, భారీ ఆలయాల పరిస్థితి అయితే, ఒక మాదిరి నుంచి చిన్న స్థాయి వరకు అనేక ఆలయాలు సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురై విస్మరణకు గురవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకా రం, దాదాపు 11,999 ఆలయాలు కనీసం ఒక్క పూజ కూడా జరగక మూతపడు తున్నాయి. 34వేల ఆలయాలు ఏడాదికి వచ్చే రూ.10వేల ఆదాయంతో కొట్టు మిట్టాడుతున్నాయి. 37వేల ఆలయాల్లో పూజ, నిర్వహణ, భద్రత తదితరాల కోసం ఒకే వ్యక్తి ఉంటున్నాడుట. తగిన సమయానికి ధూపదీప, నైవేద్యాలు జరక్కపోవడం, ఆలయానికి తగిన భద్రత లేకపోవడంతో జాడపట్టలేని విధంగా విగ్రహాలు, నగలు, ఆస్తుల చోరీ కొనసాగుతున్నాయి. ఆలయ ఆస్తుల దుర్వినియోగం, లూటీ యధేచ్ఛగా సాగిపోతున్నాయి. రాజకీయ అండదండలతో లెక్క లేనన్ని భూకబ్జాలు జరుగుతున్నాయి.అర్చకులకు డబ్బే కాదు గౌరవం లేకుండాపోవడంతో ఆలయ నిర్వహణ సరిగా లేక భక్తులు నిరాశకు లోనవు తుంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిక్కెట్టు కొని దర్శనం చేసుకునే విధానం కూడా ఒక రకంగా భక్తుల మధ్య వివక్ష చూపడమే. అందరూ కొనగలవారు ఉండరు కదా? వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని యునెస్కో నివేదిక 2017లోనే పేర్కొంది. ఈ ప్రాచీన ఆలయాలను సరిగా నిర్వహించకపోవడం, సరైన మరమత్తులు చేయించకపోవడంతో అక్కడి విగ్రహాలు, శిల్పాలు చోరీకి గురవుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటీవలే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆలయ పునరుద్ధరణలో తొలి అడుగుగా భావించవచ్చు.

డి. అరుణ

About Author

By editor

Twitter
Instagram