కాశీ విశ్వనాథుని ఆలయంలో నంది ఎదురుచూపులు ఫలించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా కనిపించే మసీదునే చూస్తూ ముస్లింల ప్రార్థనలను వింటున్న నందికి విశ్వేశ్వరుని పూజలను నిత్యం తిలకించే మహద్భాగ్యం మళ్లీ దక్కింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని పురావస్తుశాఖ సర్వేలో వెల్లడికావటం, దీని ప్రకారం జిల్లా కోర్టు సూచనలు ఇవ్వటంతో  పరిస్థితులన్నీ సానుకూలంగా మారాయి. అయోధ్యలో రామలల్లా తన స్వస్థలానికి చేరిన రెండు రోజుల్లోనే ఈ శుభపరిణామం చోటుచేసుకోవటం విశేషంగా హిందూ పక్షం భావిస్తోంది.‘‘జ్ఞాన్‌వాపిలో నంది ఉద్భవించాడు. త్వరలో  శంకరుడు కూడా ఉద్భవించి తీరతాడు’’ అన్నారు హిందూ ఆధ్యాత్మిక గురువు, భాగేశ్వర్‌ ‌ధామ్‌ ‌బాబా ధీరేంద్ర శాస్త్రి.

జ్ఞాన్‌వాపిమసీదులో దక్షిణం వైపున ఉన్న సెల్లార్‌ ‌తెరిచి హిందువులు పూజలు ప్రారంభించు కోవచ్చని వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ సెల్లార్‌ను వేదవ్యాస్‌ ‌పీఠ్‌ అని పిలుస్తారు. 1992 వరకూ వ్యాస వంశీకులు ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు తీర్పుపైన జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహిస్తున్న అంజుమన్‌ ఇం‌తెజామియా మసీదు కమిటీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ముందు పిటీషన్‌ ‌వేయాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పటంతో కొద్ది గంటల వ్యవధిలోనే అలహాబాద్‌ ‌హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ ఉత్తర్వులపై ‘స్టే’ ఇవ్వటానికి జస్టిస్‌ ‌రోహిత్‌ ‌రంజన్‌ అగర్వాల్‌ ‌నిరాకరించారు. మసీదు కమిటీ తరపున న్యాయవాది ఎస్‌.ఎఫ్‌. ఎ.‌నఖ్వీ తన వాదనలు వినిపించారు. ‘‘జిల్లా కోర్టు హడావుడిగా నిర్ణయాన్ని వెలువరించింది. వారణాసి జిల్లా జడ్జిగా ఉన్న అజయకృష్ణ విశ్వేష తన పదవీ విరమణ చేసే రోజున హడావుడిగా ఈ తీర్పును ప్రకటించారు. మేం సమర్పించిన ఆయా పత్రాలను సరిగా పరిశీ లించలేదు’’ అని ఆయన తన వాదనలో పేర్కొన్నారు.

 హిందూపక్షం తరపున విష్ణుశంకర్‌ ‌జైన్‌ ‌వాదించారు. నిజానికి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవ టానికి జిల్లా కలెక్టర్‌ను రిసీవర్‌గా నియమిస్తూ జనవరి 17 నే జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు జనవరి 24న దానిని స్వాధీనం చేసుకు న్నారని తెలిపారు. 17వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు కొనసాగింపుగానే తప్ప ఇది కొత్తగా ఇచ్చిన ఉత్తర్వు కానే కాదని వాదించారు. ప్రస్తుతం చేసిన అప్పీలుకు విచారణ అర్హత లేదని పేర్కొన్నారు.

వారణాసి జిల్లా కోర్టు తీర్పుపైన రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవా లని ఆల్‌ ఇం‌డియా ముస్లిం లా బోర్డు కోరింది. ‘‘మసీదు బేస్‌ ‌మెంటులో ఎప్పుడూ పూజలు జరిగిన దాఖలాలు లేవు. అసంబద్ధమైన, నిరాధారమైన క్లెయింలను ఆధారంగా చేసుకుని జిల్లా జడ్జి తీర్పు ఇవ్వటం ప్రశ్నార్థకం’’ అని అభిప్రాయపడింది.

హిందూ ఆలయాన్ని కూలగొట్టారు

వారణాసి జ్ఞాన్‌వాపిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణప్రాంతంలో అంతకు ముందు ఒక భారీ హిందూ దేవాలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి శిధిలాల మీద మసీదు నిర్మించారని ఆర్కియాలజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా (ఏఎస్‌ఐ) ‌స్పష్టం చేసింది. 2023 జులైలో జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ ఆగస్టు4న కట్టుదిట్టమైన భద్రత నడుమ సర్వే ప్రారంభించింది. నాలుగు నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఈ నివేదికను వెలువరించింది. గత నిర్మాణపు ప్రధాన ద్వారం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెంట్రల్‌ ‌ఛాంబర్‌, ‌పశ్చిమాన ఉన్న గదులు, పునాదిలో ఉన్న కళాకృతుల శిధిలాలు, రికవరీ చేసిన దిమ్మలలో సర్వే చేసింది. అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదనటానికి అనేక సాక్ష్యాలను పురావస్తు శాఖ వెల్లడించింది. గోడలపై వాస్తు శిల్పాల అవశేషాలు, గోడల మీద అలంకరించిన అచ్చులు, కేంద్రీయ స్థానంలో ఉన్న కర్ణరథం, ప్రతిరథం, పడమర వైపు గోడలపై ఉన్న తోరణంతో పాటు పెద్ద ప్రవేశ ద్వారం, ముందు వైపు చిత్రంతో కూడిన చిన్న ద్వారం, పక్షులు, జంతువుల శిల్పాలు, లోపలా, బయట అలం కరణలు,పశ్చిమగోడ హిందూదేవాలయ అవశేషాలని సూచిస్తున్నాయని పేర్కొంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయ గోడలను యథాతథంగా కలిపేశారని పేర్కొంది. పలు ఆధారాలతో 839 పేజీల నివేదికను వెలువరించింది. ఈ కేసులో రెండు పక్షాలకు చెందిన 11మందికి నివేదిక ప్రతులను అందచేసింది.

పురావస్తుశాఖకు సర్వేలో మసీదు లోపల 34 శాసనాలు లభ్యమయ్యాయి. అందులో 32 శాసనాల డ్రాఫ్ట్‌ను నివేదికలో పొందుపరిచారు. ఔరంగజేబు తన 20వ ఏట మసీదు నిర్మించినట్టు అరబిక్‌ ‌పర్షియన్‌ ‌భాషలో ఒక శాసనాన్ని కనుగొన్నారు. ఔరంగజేబు ఆలయ ధ్వంసానికి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయని, దానిని చెరిపివేయటానికి ప్రయత్నం సాగినట్టు చెబుతున్నారు. కమలం గుర్తులను తొలగించినట్టు గుర్తించారు. దేవనాగర లిపితో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అవి ఉన్నాయి. జనార్దనుడు, రుద్రుడు, ఉమేశ్వరుడు అన్న పేర్లు కనిపించాయి.

పురావస్తు తవ్వకాల్లో బయటపడిన తెలుగు లిపితో ఉండే ఒక శాసనాన్ని తిరుపతికి చెందిన ఎఎస్‌ఐ ‌డైరక్టర్‌ ‌మునిరత్నం రెడ్డి డీకోడ్‌ ‌చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. శిలాశాసనంపై నారాయణ భట్టు, మల్లన్నభట్టుపేర్లు ఉన్నాయి. వీరు తెలుగు బ్రాహ్మణులు. మొగల్‌ ‌సామ్రాజ్య చక్రవర్తి అక్బర్‌ ‌పాదుషా ఆదేశాలతో ఆయన నవరత్నాల్లో ఒకరయిన రాజా తోడర్‌ ‌మల్లు 1585లో కాశీవిశ్వ నాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ సమయంలో కాశీవిశ్వనాధుని ఆలయ నిర్మాణ పనులను నారాయణ భట్టు పర్యవేక్షించారు. వారి కుమారుడే మల్లన్నభట్టు. దక్షిణ భారత దేశంలో ఆలయ నిర్మాణంలో నిపుణులు కావటంతో వారిద్దరికీ ఈ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా భావిస్తున్నారు.17వ శతాబ్దంలో అక్బర్‌ ‌మునిమనవడయిన ఔరంగజేబు కాశీవిశ్వనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించినట్టు ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

‘వజూఖానా’లో సీల్‌ ‌చేసిన వాటర్‌ ‌ట్యాంకులో ఏఎస్‌ఐ ‌సర్వే చేయలేదు. ఇక్కడ ఒక శివలింగం కనిపించిందని హిందువుల తరపున ప్రతినిధులు, జిల్లా అధికారులు చెబితే, అది ఫౌంటైన్‌ అని ముస్లింలు అభిప్రాయపడ్డారు. తర్వాత ఆ ప్రాంతాన్ని సీజ్‌ ‌చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు మసీదు మేనేజ్‌మెంటు కమిటీ అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక కోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాక రించింది. ‘‘ఈ విషయం లో యథాతథస్థితిని కొనసా గించాలని, శివలింగం కనిపించినట్టుగా చెబుతున్న ప్రాంతాన్ని సీల్‌ ‌చేసి ఉంచాలి. మసీదులో మిగతా ప్రాంతాల్లో ప్రార్థనలు చేసుకోవచ్చు’’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు వజూఖానాలో కూడా పురావస్తుశాఖ సర్వే చేసి, వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచాలని హిందూ పక్షం కోరుతుంది.

‘‘ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టలేదు. అక్బర్‌ ‌కాలంలోనే ఆ మసీదును కూడా నిర్మించారు. అక్బర్‌ ‌తన కొత్తమతం దీన్‌-ఎ-ఇలాహి ప్రారంభించినప్పుడే ఈ మసీదు నిర్మించారు. ఇక్కడ ఉండే కొలనులో శివలింగం ఉందని చెప్పటం సరికాదు. 2010లో మేం మొత్తం మసీదును శుభ్రం చేశాం. అక్కడ మాకు ఎలాంటి శివలింగం కనిపించ లేదు’’ అని జ్ఞాన్‌వాపి మసీదును పర్యవేక్షించే అంజు మాన్‌ ఇం‌తేజామియా కమిటీ జాయింట్‌ ‌సెక్రటరీ సయ్యద్‌ ‌మొహమ్మద్‌ ‌యాసీన్‌ అభిప్రాయపడ్డారు.

‘‘జ్ఞాన్‌వాపిలో పురావస్తుశాఖ గానీ మరే సర్వే గానీ అవసరం లేదు. కంటి చూపుతోనే అది హిందూ దేవాలయం అని సులువుగా అర్థం అవుతుందని అభిప్రాయపడ్డారు చరిత్రకారుడు రచయిత డాక్టర్‌ ‌విక్రమ్‌ ‌సంపత్‌. ఆలయ శిధిలాలపైన మూడు డోమ్‌లు నిర్మించారు తప్ప అక్కడ మసీదుకు సంబంధించిన ఆనవాళ్లేమీ ఉండవని తేల్చి చెప్పారు. పైగా గోడలపై త్రిశూలం, ఢమరుకం, కమలం వంటివి కనిపిస్తాయి అని పేర్కొన్నారు ‘‘వెయిటింగ్‌ ‌ఫర్‌ ‌శివ, అన్‌ ఎర్తింగ్‌ ‌ట్రూత్‌ ఆఫ్‌ ‌కాశీస్‌ ‌జ్ఞాన్‌వాపి’’ పేరుతో ఆయన రాసిన పరిశోధన గ్రంధం ఈ నెలాఖరులో విడుదలవుతోంది.

నేపథ్యం ఇదీ..

స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఇక్కడ మసీదు-మందిరంపై వివాదం ఉంది. ఇక్కడ 1809లో మత ఘర్షణలు కూడా చెలరేగాయి. అయోధ్య మినహా (అప్పటికే కోర్టులో వ్యాజ్యం నడుస్తూండటం వల్ల) దేశంలో మిగిలిన అన్ని మసీదు-మందిరం వివాదాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టాలని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు భావించారు. అందుకోసం ప్రార్థనాస్థలాల చట్టం (ప్లేసెస్‌ ఆఫ్‌ ‌వర్షిప్‌) ‌తెచ్చారు. 1991 సెప్టెంబరు 18న ఆమోదితమైన ఈ చట్టం ప్రకారం, 15 ఆగస్టు 1947కి ముందు సదరు ప్రార్థనా స్థలాలు ఏ మతాన్ని అనుసరిస్తున్నాయో ఆ తర్వాత కూడా అదే మతాన్ని పాటించాలి. జ్ఞాన్‌వాపి కూడా ప్రార్థనాస్థలాల చట్టం వర్తిస్తుందని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. ‘వ్యాస్‌ ‌కా తిఖానా’ ప్రాంతంలో హిందువుల ప్రార్థనలకు అనుమతి ఇస్తూ వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వటం ప్రార్థనాస్థలాల చట్టాన్ని ఉల్లంఘించటమేనని, దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఎమ్‌ఐఎమ్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.

1991 చట్టం తర్వాత జ్ఞాన్‌వాపిలో మసీదు, దేవాలయం మధ్య ఇనుప చట్రంతో గోడ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో అక్కడ ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. ‘‘1991లో కేవలం మసీదు చుట్టూ ఇనుప చట్రంతో గోడ కట్టారు. అంతకు ముందు ముందు ఎంత విస్తీర్ణంలో మసీదు ఉందో, ఇప్పుడు అంతే ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. కొన్నిసార్లు శుక్రవారం ప్రార్థనలతో శివరాత్రి కూడా కలిసి వస్తుంది. అప్పుడు కూడా శాంతియుతంగానే రెండు వైపులా ప్రార్థనలు జరిగేవి’’అని ఇంతేజామియా కమిటీ జాయింట్‌ ‌సెక్రటరీ సయ్యద్‌ ‌మొహమ్మద్‌ ‌యాసిన్‌ ‌చెప్పారు.

వారణాసి జిల్లా కోర్టు 1991 నుంచి ఈ విషయంలో దాఖలైన పిటిషన్లను విచారించటం మొదలుపెట్టింది. 1991లో సర్వే కోసం కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసిన హరిహర్‌ ‌పాండే మాట్లాడుతూ ‘‘1991లో నేను, సోమనాథ్‌ ‌వ్యాస్‌, ‌రామరంగ్‌ ‌శర్మ కలిసి పిటిషన్‌ ‌వేశాం. అయితే, ఆ ఇద్దరు ప్రాణాలతో లేరు’’అని ఆయన చెప్పారు.

స్థానిక కోర్టుల్లో ఈ పిటిషన్‌ ‌దాఖలైన కొన్ని రోజులకే, దీనికి వ్యతిరేకంగా మసీదు మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ హైకోర్టుకు వెళ్లింది. అయితే, 1993లో యథాస్థితిని కొనసాగించాలని అలహాబాద్‌ ‌హైకోర్టు సూచించింది. మళ్లీ 2019లో వారణాసి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో సర్వేకు అంగీకారం తెలిపారు.

కోర్టు సూచనల మేరకే ముందుకు…

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ముగిసిన రెండు రోజులకే జ్ఞాన్‌వాపికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడినా అధికారపార్టీ దీనిపై పెద్దగా స్పందించ లేదు. ప్రత్యేకంగా ఎలాంటి విజయోత్సవాలు నిర్వ హించలేదు. ప్రతిపక్షాలు మౌనాన్ని ఆశ్రయించాయి. ‘‘1980లో అయోధ్య రామజన్మ భూమి అంశాన్ని సంఘ్‌ ‌చేపట్టినప్పుడు ప్రజల్లో ఇంత చైతన్యం లేదు. ఇప్పుడు ప్రజలంతా సాంస్కృతిక అంశాలపై సామూహికంగా స్పందిస్తున్నారు. వాళ్లే స్వయంగా కేసులు ఫైల్‌ ‌చేస్తున్నారు.

ఆయా అంశాలను బహిరంగంగా చర్చించు కుంటున్నారు’’ అని కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించారు. ‘‘కోర్టు పురావస్తు శాఖను నివేదికను సమర్పించమని కోరింది. వాళ్లు ఆ పని పూర్తి చేశారు. కోర్టులే ఈ అంశాన్ని పరిశీలించి ముందుకు వెళ్లేందుకు అవసరమైన సూచనలు చేస్తాయి. రామజన్మభూమి అంశంలో మాదిరిగా..’’ అని అభిప్రాయ పడ్డారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

-డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram