రామస్వామి అయ్యర్‌, ‌గుండె పోటుతో గిలగిలలాడుతూ మరణయాతన పడుతున్నాడు. ఈ సంగతి వినగానే పద్మాసనంలో ఉన్న రమణ భగవాన్‌ ‌కట్టెలా బిగుసుకొనిపోయినారు. అక్కడ రామస్వామి అయ్యర్‌ ‌బాధంతా మాయమై లేచి కూర్చున్నారు. ఇక్కడ రమణులకు శ్వాస ఆడుతుందో లేదో కూడా తెలయటంలేదు. ఆయన గుండెల మీద, తలమీద నూనె పోసి రుద్దటం ప్రారంభించారు. కొంతసేపటికి మామూలు మపిషి అయినారు. రామస్వామి అయ్యర్‌ ‌తన సన్నిధికి వచ్చినప్పుడు పునర్జన్మ ఎత్తారా? అని భగవాన్‌ ‌పరామర్శ చేశారు. ‘భగవాన్‌ అం‌డగా ఉండగా నేను దేనికి భయపడాలి?’ అన్నారు రామస్వామి అయ్యర్‌ ‌వినయంగా.

ఒక విజయదశమి రోజున రమణ భగవాన్‌ ‌చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మీ అమ్మాళ్‌ ఆయన ముందు కొబ్బరికాయ కొట్టటానికి దాని పీచు తీయటానికి ప్రయత్నం చేస్తున్నది. అది చూసి రమణ భగవాన్‌ ఆమెను ‘ఏం చేస్తున్నావు?’ అని ప్రశ్నించగా, ‘ఈ రోజు విజయ దశమి పండుగ. రమణభగవాన్‌ ‌ముందు కొబ్బరికాయ కొడితే పుణ్యం వస్తుంది’ అని బదులిచ్చింది. ఆయన ఆమె నుంచి కొబ్బరి కాయను తీసుకొని శుభ్రంగా పీచుతీసి, తన ముందు దానిని పగల కొట్టారు. ఆమె హృద యంతరాళాల్లో ఆనందం ఉప్పొంగిపోయింది. ఇందులో ఎంతో చమత్కారం ఉందని వేరే చెప్పటం ఎందుకూ?

ఒకరు వచ్చి శ్రీ రమణ భగవాన్‌ ఎదుట ఒకగంట సేపు ఉపన్యాసం చెప్పారు. తన ప్రసంగం పూర్తి అయిన తరువాత ‘నేను ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు పలకకపోవడం న్యాయమా?’ అని ఆ ప్రాసంగికుడు భగవాన్‌ను అడిగాడు. అప్పుడు భగవాన్‌ ‘ఏమిటీ మీరు మాట్లాడారా!’ అంటూ ‘నా భాష మౌనం, నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అర్థం చేసుకోలేక పోతే నేనేం చేసేది’ అన్నారు. ఇంకొకసారి మహాత్ముల మాటలను రికార్డింగ్‌ ‌చేయటానికి ఒక అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. వారు రికార్డింగ్‌కు తమ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. రెండు గంటలు గడచిపొయినాయి. భోజనానికి గంట కొట్టారు. ‘భోజనం చేద్దాము పదండి’ అన్నారు భగవాన్‌. అప్పుడు ఆ కంపెనీ వారు ‘ఏదీ మీరు ఒక్క మాటా మాట్లాడలేదు కదా’ అన్నారు. భగవాన్‌ ‘‌సరిపోయింది, ఇందాకటి నుంచే నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా’ అన్నారు అ సమాధానం విని వారు నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు.

 – అక్కిరాజు రమాపతిరావు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram