– సంబరాజు లీల (లట్టుపల్లి)

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


‘పృథ్వీ ప్రతిసృష్టి’ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఎవరయినా ‘అండం’ డొనేట్‌ చేస్తే, కొడుకు వీర్యకణంతో ఐ.వి.ఎఫ్‌ పద్ధతిలో బైట ల్యాబ్‌లోనే ఫలదీకరణ చెందిన పిండం, అది కూడా మగ సంతానమైతే, కుంతల కనేటట్టు చేయాలన్న ఆలోచన.

అందుకే కుంతల అత్తగారు అక్కడికి రాగానే డాక్టర్‌ వరదకు చెప్పింది.

‘‘డాక్టర్‌ గారూ! మాకు మనవడే కావాలి. వాడు మా ఇంటివాడై ఉండాలి. మా వారసుడే కావాలి. అంటే, మా అబ్బాయి జీన్స్‌తో జన్మించాలి. మాకు అమ్మాయిలవసరం లేదు. మూడు తరాలల్లో మా వాడు ఒక్కడే మగ సంతానం. ఇంతటితో మా వంశం ఆగిపోకూడదు.

‘‘ఒకవేళ మేము వేచిచూద్దామన్నా అబ్బాయి పుడతాడన్న నమ్మకం లేదు. కాబట్టి, మా నిర్ణయాన్ని మాత్రమే అమలు చేయండి. డబ్బుకేమీ ఇబ్బంది లేదు. ఆ సంపదని అనుభవించే తరం రావాలన్నదే మా ఆలోచన. అర్థం చేసుకుంటారు కదూ!’’ ఎంతో నమ్రతతోనే, ఎలాంటి దర్పం కనిపించకుండా చెప్పింది.

అయితే, ఆ గొంతులో, ఆ చెప్పటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలకు మా ఇంట స్థానం లేదన్న శాసనమే ఉంది. యోగ‘మాయ’లా బలవంతంగా కడుపున పడ్డా, బతకనిచ్చేది లేదని చెప్పకనే చెప్పింది.

డాక్టర్‌ వరద అంతా విన్నది.

ఆపై, ‘‘విజ్ఞానం ఎంతో పెరిగి, గొడ్రాళ్లుగా మిగిలిన ఆడవాళ్లకీ, సంతానానికి అనర్హులయిన పురుషులకి కూడ సంతానాన్ని కలిగించాం’’ అన్నదామె.

ఇంకా ఇలా అన్నది, ‘‘అంతవరకూ మా ప్రయత్నంలో విజయం సాధించాం. కానీ, ప్రత్యేకించి ఆడపిల్ల కావాలి, మగపిల్లవాడు కావాలి అంటే మాత్రం అసలుకే సాధ్యం కాకపోవచ్చు. అదే కావాలి అంటే, ఆ వైపుగా ప్రయోగాలు జరగాలి. అందుకు సంబంధించి మీకు కొన్ని విషయాలు తెలియాలి.

‘‘ప్రతివ్యక్తిలో జననానికి అవసరమైన ఎక్స్‌, వై క్రోమోజోములుంటాయి. స్త్రీలోని ఎక్స్‌ క్రోమోజోము, మగవారిలోని ‘వై’ క్రోమోజోము కలిస్తే అబ్బాయి. ఎక్స్‌, ఎక్స్‌ కలిస్తే ఆడపిల్ల. అలాంటిది అంత నిర్ధారణగా అబ్బాయే పుట్టేలా చెయ్యటానికి వీలు పడదేమో…!’’ అంది, కంప్యూటర్‌లో గూగూల్‌కు, లాగినవుతూ…

‘‘అందుకే మీ దగ్గరికొచ్చాం. మాకు మనవడే కావాలి! అందుకు ఎన్నిసార్లయినా గర్భస్రావం చేయించటానికి వెనుకాడం…’’ నిష్కర్షగా చెప్పింది ఛాయాదేవి.

కుంతల భయంతో భీతహరిణిలా చూసింది. గర్భం మూడు నెల్లదే కావచ్చు. కానీ, ఆ నొప్పి, రక్తస్రావం, ముఖ్యంగా, అప్పుడప్పుడేె ప్రాణం పోసుకుని, చిన్న చిన్న కదలికలతో తన ఉనికిని తెలియజేస్తున్న చిన్నప్రాణాన్ని కర్కశంగా చిదిమి వేయటం… ఆ ఊహ తట్టుకోలేకపోయింది.

అందుకే ఆలోచనగా తలెత్తి చూస్తూ, ‘‘డాక్టర్‌ గారూ! నాకు అబ్బాయిని కనేె శక్తి లేదేమో! కనీసం ఈ రూపకంగానయినా మరో డోనర్‌ ‘అండం’తో ఎక్స్‌, వై క్రోమోజోములతో కలిపి అబ్బాయి పిండాన్ని మాత్రమే నాలో ప్రవేశపెట్టండి. తల్లిగా మళ్లీ మళ్లీ ఆ పసిప్రాణాల్ని తియ్యలేను!’’ గట్టిగా ఏడ్చేసింది అమ్మాయి. డాక్టర్‌ వరదకు జాలేసింది.

భార్యంటే ఎంతో ఇష్టమున్న కల్యాణ్‌ బేలగా ఏడుస్తున్న భార్యను చూశాడు. ‘‘పోనిలేమ్మా! ఎవరయితేనేం? నీవూ, అక్కలూ అంతా ఆడవాళ్లేగా!’’ అని మాత్రం అనలేదు. ఆ ఆక్రందన అంతా విని ఊరుకున్నాడు.

‘ట్రింగ్‌’ మంటూ డాక్టర్‌ వరద సెల్‌కు ‘మెసేజ్‌’ వచ్చింది.

‘నలుగురం, అమ్మాయిల హాస్టల్‌ నుంచి! కలుసుకోవటానికొచ్చాం’ అన్నదే దాని సారాంశం.

వరద లేస్తూ, ‘‘మీరు ఒక్క గంట వెయిటింగ్‌ రూమ్‌లో రిలాక్సవండి. నేను మరొకర్ని కలవాలి. మీకన్ని విషయాలు అప్పుడే చెప్తాను’’ అంది, స్టెత్‌ వేసుకుని.

జవాబుకోసం ఎదురు చూడకుండానే కదిలిపోయింది.

 * * * *

అమెరికాలోని ‘నాసా’ అంతరిక్ష కేంద్రంలో డాక్టర్‌ వ్యాస్‌ కంప్యూటర్‌కు లాగినయి, ప్రొటీన్‌ పౌడర్‌ కలుపుకుని తాగుతూ, తాము తయారుచేసి ‘కుజగ్రహం’ పైకి పంపిన పి. యస్‌. ఎల్‌.వి. సి. 25 నౌక గురించిన సమాచారం చూస్తున్నాడు. చంద్రయాన్‌ నౌక తన సముదాయాన్ని మోసుకుని, ఒక్కో సంకెలగా రాకెట్స్‌ను విడుదల చేస్తూ భూగ్రహానికి అంతరంగీకుడైన చందమామలోనిదే నెలవంక అంచులు తాకి ప్రయాణిస్తూ, చంద్రలోకం చేరుకుంది.

అప్పటి నుండి సరిగ్గా ఆరునెలల తరువాత కుజగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. మరో నాల్గు రోజుల్లో కుజగ్రహం పైన దిగుతుంది. అక్కడి వాతావరణం జీవరాశికి అనుకూలంగా ఉందా? నీటి పొరలున్నాయా? ఆక్సిజన్‌ శాతం లాంటి విషయాల్లో పరిశోధన కోసమే దానిని అక్కడికి పంపించారు.

చంద్రయాన్‌ పేరున్న ఆ శాటిలైట్‌ ఇప్పుడు కుజగ్రహం మీద ల్యాండయింది. అక్కడి నుంచి అనుకూల, ప్రతికూల సమాచారంÑ చిత్రాలు పంపుతుంది.

ఆ చోదకనౌక విజయం వెనుక ఉన్న మొదటి వ్యక్తి డాక్టర్‌ వ్యాస్‌.

దానికి అమెరికా అధ్యక్షుడు అభినందిస్తూ.. ఆ నౌక ప్రయోగానికి మూలకారకుడైన వ్యాస్‌ను ‘భారతమాత’ కన్న ముద్దుబిడ్డగా అభివర్ణించాడు. ‘మిస్టర్‌ వ్యాస్‌! నీలాంటి శాస్త్రజ్ఞుడిని కన్న నీ దేశం ధన్యమయింది. ఐతే, ఒకే ఒక విషయం. అదేమి టంటే`నీ తదనంతరం, నీ పరిశీలనాత్మక దృక్ప థంతో శాస్త్రీయ ఫలాల్ని మరొకతరానికి అందించే అవకాశం లేకపోవడం!’ అంటూ హర్షాన్నీ, విచారాన్నీ ఏకకాలంలో ప్రకటించాడు.

దానికి వ్యాస్‌ నవ్వేశాడు.

అతడు వదలకుండా, ‘‘మీ దేశంలో ముఖ్య మయింది, గృహస్థ జీవనాన్ని ఆశించి చేసుకునే వివాహం. ఇటు ధర్మబద్ధంగా జీవిస్తూ వంశాభివృద్ధి చేయటానికి ‘పెళ్లి’ అనే నిబంధన పూర్వకమైన స్వేచ్చ, అటు సోషల్‌ కష్టమ్స్‌ అక్కడ ఉన్నాయి. మీ భారతీయులు చాలా తెలివైనవాళ్లు. ప్రపం చంలో ఏ మూలన ఉన్నా నేటికీ ఉనికిని నిలుపుకు న్నారు. అందుకు మరోసారి అభినందిస్తు న్నాను. కానీ, మీరు మీ తెలివైన జీన్స్‌ మరో తరంలోకి వెళ్లకుండా దీక్షగా బ్రహ్మచర్యం అవలంభిస్తున్నారు. అది మీ భారతదేశానికి నష్టమే కదా!’’ అడిగాడు.

‘‘నేను పెళ్లి అనే సంప్రదాయ వలయంలో చిక్కుకుంటే ఇవాళింత గొప్ప పరిశోధనల్ని చేయలేక పోయేవాడినేమో! భారత్‌ నా దేశమని ఎంత గర్విస్తానో, అక్కడి సంప్రదాయాలకు, ఆచారాలకు అంతగా కట్టుబడి ఉంటాను. కారణం, భారత దేశంలో వ్యక్తికి సమాజం పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యత ఉంటుంది. అఫ్‌కోర్స్‌! ఇది పూర్వకాలంలో! కానీ నేను ప్రాచీనతనీ ఆధునికతనీ కలుపుతున్న వారధిపై నిలిచిన వాడిని.

‘‘అందుకే, రెండిరటికి న్యాయం చేయలేనని ఇలా వంటరిగా ఉండిపోయాను. అఫ్‌కోర్స్‌! నేను చేసే పరిశోధనల కోసం దేశాలు, ప్రపంచమే నా చుట్టు నిలిచి ఉందనుకోండి.

‘‘కానీ, నేను నా కోసం ఓ చిన్ని సంసారాన్ని సృష్టించుకుంటే, దానికి న్యాయం చేయాలిగా! ఇలాంటి సందర్భాల్లో అమెరికన్‌ ప్రెసిడెంట్‌గా మీరయితే ఏం చేస్తారు?’’ వినయంగానే ప్రశ్నించాడు వ్యాస్‌.

‘‘మీలాంటి మేధావుల జీన్స్‌తో మరి కొంతమంది తెలివైనవాళ్లని మా దేశం కోసం సృష్టించుకునే వాళ్లం!’’ చెప్పాడు.

అంత పెద్ద పేరున్న రాకెట్లతో అవలీలగా ప్రపంచాన్ని చుట్టి రాగలిగిన ఆ మేధావి వ్యాస్‌ ఆశ్చర్య పోతూ ప్రశ్నించాడు, ‘‘ఎలా..?’’

ఆ వెంటనే అర్థమయినట్లుగా చెప్పబోతుంటే, అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అందుకుని, ‘‘క్లోనింగ్‌ లాంటి ప్రయోగాలున్నాయి. అవి విజయవంతమయినవే గదా?’’ చెప్పాడు.

ఎందుకో ఈసారి వ్యాస్‌ నోరు విప్పలేదు.

కానీ, ఓ పెద్ద దేశానికి మొదటి పౌరుడైనప్పటికీ అతడు మాత్రం ఆగలేదు. పక్కనే ఉన్న కార్యదర్శి వైపు చూశాడు. అతడు అన్నాడు.

‘‘పోనీ, మీ సెమన్‌ డొనేట్‌ చెయ్యండి! ప్రపంచ పౌరులుగా, ప్రతి దేశం, తమ దేశంలో మీలాంటి శాస్త్రజ్ఞులు జన్మించేలా, మీసెల్స్‌ను వాడుకుంటుంది.

‘‘నేడు టెస్టుట్యూబ్‌ బేబీలు పుట్టడం సర్వసాధారణ మయింది. మీరంగీకరిస్తే, మీ శుక్రకణాలతో మా అమెరికా తల్లికి, మరో గొప్ప వారసుణ్ణి ప్రసాదించేలా చేసుకుంటాం. అయితే, దానిపై ‘పేటెంట్‌’ హక్కులు మాత్రం మావేె! కావాలంటే భారత ప్రభుత్వానికి మా ప్రభుత్వం నుంచి మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి రాయల్టీ ఇప్పిస్తాం!’’ అన్నాడతడు.

వ్యాస్‌ ఒక్కసారిగా ఆ దేశపు ఆంతర్యాన్ని గ్రహించినట్లు చూశాడు.

ఆ క్షణంలో అతడికి విచారంగా అనిపించింది.

ఎన్ని వేల సంవత్సరాలు, దండయాత్రల ఫలితమనుభవించిన భారత్‌లో ఎలాంటి అవకాశాలు లేని భూమిలో, ఓ చిన్న పేద కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, శాస్త్రజ్ఞుడై ఓ గొప్ప పరిశోధనా కేంద్రంలో ఉన్నత స్థానానికి ఎదిగి, కీలక పదవిని నిర్వహిస్తున్న ఈ యువకుడు భారత్‌తో పాటు, ప్రపంచ దేశాల నుంచి ఎన్నో అవార్డులు పొందిన యువకుడు, తన తెలివిని, మేధస్సును మరో తరానికి అందించకుండా, ఆ జ్ఞానధారకు అక్కడితో ముగింపు ఇస్తున్నాడని ఆ దేశాధ్యక్షుడు చెబుతున్నాడు.

అందుకే సరోగేట్‌ మదర్‌ అతన్ని సరోగెట్‌ ఫాదర్‌లా ఉపయోగపడమని ప్రోత్సహిస్తున్నది.అది నిజమే! అలాంటి ఉన్నతాదర్శాలతో, గౌరవ పురస్కారాలతో, ప్రపంచంలోనే అత్యున్నతమైన వ్యక్తిగా, ప్రభుత్వ ప్రోత్సాహకాలందుకున్న వ్యక్తి, ఖగోళ శాస్త్రవేత్తగా నిలిచి, భారతదేశానికి వన్నెతెచ్చిన వ్యక్తి, రెండోతరం లేకుండా ఉండటం ప్రపంచ ప్రభుత్వాలకే నచ్చలేదు.

మెడికల్‌ కౌన్సిల్‌ ద్వారా అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ప్రతిపాదనకి భారత ప్రభుత్వం కూడా స్పందించింది. మొదటిసారిగా భారత సంప్రదాయాలను కాదని, వ్యక్తిగా అతనికి అభ్యంతరం లేకుంటే భారత ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలియజేసింది. అయితే, వ్యాస్‌ ద్వారా కలిగే ప్రథమ సంతానం- భారత పౌరుడు కావాలని షరతు విధించింది.

అందుకు అమెరికా ముందు అభ్యంతరం చెప్పింది. భారతదేశానికి ప్రపంచ ప్రభుత్వాలన్నీ మద్దతు పలకటంతో అమెరికా తన అంగీకారాన్ని తెలియజేయక తప్పలేదు.

అందుకు సంబంధించిన ఒప్పందాల్ని, ‘ఐక్యరాజ్యసమితి’ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔుూ) రూపొందించింది.

 * * * *

హాస్టల్‌ నుంచి వచ్చిన నలుగురమ్మాయిలకి కాఫీ బిస్కట్లు ఆఫర్‌ చేసి, ‘‘తీసుకోండి’’ చిరునవ్వుతో చెప్పింది.

ఆ చిరునవ్వే ఆమె ఆయుధం. ఆమె చేతుల నైపుణ్యం ఆమెకు కస్టమర్స్‌ని వెతికి పెడితే, క్రొత్త పోకడలతో, సైన్సు విజ్ఞానఫలాల్ని అందుకుంటూ చొచ్చుకు పోయే విధానం ఆమెది.

అదేె ఆమె వ్యాపారాన్ని పెంచింది.

ఆ వైద్యశాస్త్ర విధానాన్ని వ్యాపారమనే అనాలా? ఆమెను, కలవటానికి వచ్చేవారిని పేషెంట్స్‌ అని కాక కస్టమర్స్‌ అనాలా? అంతేనేమో! అది వైద్యసేవ కాదు. అవసరం ఉన్న వ్యక్తులతో, మానవ సంబంధాలతో చేస్తున్న వ్యాపారమే.

ఆ వ్యాపారం అత్యధికంగా లక్షల్లో ఫీజు పేరిట ఆదాయాన్నిస్తుంది. పృథ్వీ ప్రతిసృష్టి కేంద్రం మెటర్నటి కూడా ఉండటంతో ఎవరికీ ప్రకృతి సహజమైన ప్రసవం జరగదు. వాళ్లకెక్కడ పురిటినొప్పు లొస్తాయోనన్న శంకతో, ముందే సిజేరియన్‌ తేదీ నిర్ణయించేస్తారు. ఆ తేదీల మేరకే శిశోదయాలు జరుగుతాయక్కడ.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE