వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

చారి (రాఘవయ్యరాజు బాల్య మిత్రుడు )

‘‘ఒరేయ్‌ రాజూ..! ఆ లోపల కనిపించేవన్నీ అవేరా… జ్ఞాపకాలతో ఒళ్లంతా ఛిద్రం అయిపోయి చావు కోసం ఎదురు చూపులే… కొడుకో, కూతురో ఎవరైతేనేం ఏదో రోజు రాకపోతారా అనే పురి విడిపోతున్న కొసలు పట్టుకొని ఓ పలకరింపు కోసం. నా అనుకునే ఒక స్పర్శ కోసం… ఆశకు చిక్కుకొని వేలాడుతూ మంచానికొక్క భీష్ముడో, దశరథుడో…’’

ఆవేశంగా అన్న నామాటలు విన్నాడో లేదో రాఘవయ్యరాజు మెట్ల మీద కూర్చున్న తన వంక చూసాడు.

‘‘అయితే అన్నయ్యా. రామం వస్తున్నాడన్న మాట..!’’ నా మాటలు ఏమాత్రం పట్టించుకోనట్లు అంది శ్రీవల్లి…

‘‘కన్నతల్లి ఆఖరి చూపులకి కూడా ఖాళీ లేకపోయింది… ఇప్పుడు వస్తాడులే..! ఆస్తులు అమ్మకం పెట్టి మరీ రప్పిస్తున్నావుగా… డాక్టరు కోడలు కూడా వస్తోందా అని..? నాకయితే నమ్మకం లేదు… మందుల్నే ఎక్స్‌పైరీ డేట్‌కి పారేసే అలవాటు కదా… మనం ఎక్స్‌పైర్‌ అయితే అవ్వలేదు కానీ మన ఎక్స్‌పైరీ డేట్‌కి ఎప్పుడో దాటిపోయిందిరా రాజూ… ఓ అంపశయ్యని వెదుక్కొని రాబోయే దానికోసం నిరీక్షణే..!’’ గిల్లితే వచ్చే ఆనందాన్ని పొందుతూ అన్నాను నేను.

‘‘ఈయన మాటలు కాస్త కటువుగా ఉన్నా నిజాలే అన్నయ్యా… కూతురుకే అడ్డయిపోయాం, ఇక కోడళ్లకి ఏం కావాలీ..? మనవడు పుట్టి రెండేళ్లు దాటిందేమో కదా… చూడాలని ఎంత కలవ రించిదో… ఎత్తుకోకుండానే వెళ్లిపోయింది వదిన..! కరోనా రాకాసి మనుషుల్ని ఎంతదూరం చేసేసింది..! అది సరే… పొలం ఇల్లూ అమ్మేస్తే మరి నువ్వెక్కడుంటావన్నయ్యా?’’ శ్రీవల్లి అనీ అననట్లుగా నేను అంటోన్నదే అనేసింది.

‘ఇంకెక్కడా… పుష్పక విమానంలాంటి మన ‘ఆనందవనం’ ఉందిగా. కన్నబిడ్డల్ని దూరం చేసుకొని కుంగిపోయే మరో దశరథుడు. రాజూ..! మీ నాన్న ఆలోచించే పెట్టాడా నీ పేరు… రాఘవ. అయ్య. రాజు అంటే దశరథుడే..! వచ్చేయ్‌ తెలుగు భాషా ప్రవీణా త్వరగా ఇక్కడికి..! అజంతం, హలంతం అంటూ అచ్చతెనుగుతో మాకు పిచ్చెక్కించేద్దువు గాని… ఆ తర్వాత ఏవన్నా అయితే ఎలానూ ఉందిగా నీ మూలికా వైద్యం…’’ గట్టిగా నవ్వేసాను.

‘‘ఈయన మాటలు పట్టించుకోకు అన్నయ్యా..! అన్నీ తలతిక్క మాటలు… అయినా కులం, గోత్రం ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారని..? రక్త సంబంధం తెంచుకుంటే తెగేదా..? మనం అనాథలమా అన్నయ్యా… అలా అనుకుంటున్నాం అంతే… అంతెందుకూ… ఈయన ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో నువ్వే చూద్దువుగాని… వయస్సు గుర్తింపుని కోరుకుంటుంది. అంతకు మించి మరేం లేదు… మనలాంటి వాళ్లు అది తగ్గించుకుంటే సగం వృద్ధాశ్రమాలు ఖాళీ అయిపోతాయి…’’

ఏవిటో అంటుంది మా ఆవిడ… ఎనాలిసిస్సు చేసి చెప్పేస్తుంది మహా మేధావినిలా… రాజుగాడి గురించి నాకు తెలియదా..! ఒళ్లు మండినట్లుంది. లేచి వెళ్లిపోయాడు కోపంగా… రెండు రోజులు పోతే వాడే వస్తాడు. తోచుపాటు కావద్దూ…

లోకనాథం (ఆనందవనం ఇంఛార్జి)

…ఇక్కడ ఉన్న వాళ్లందరూ జీవితంలో కొడుకులు, కూతుళ్లకు దూరంగా బ్రతుకుతున్న వాళ్లే. అందుకే ఎప్పుడూ అశాంతినే వెళ్లగక్కుతుంటారు. ఒకసారి చూస్తాను అన్నారు ఆయన ‘ఆనందవనం’లో చేరదామని వచ్చి. ఒక్కొక్క చోట ఒక్కో గొంతు..! అడిగి మరీ తెలుసుకుంటున్నారు అనుభవాల్ని… ఈ ప్రాసెస్సు అవసరమా అని. ఇదంతా పూర్తయ్యాక చేప జారిపోవడం ఖాయం..! రాజుగారు ఆర్థికంగా సమర్థులు… దానికి తోడు పెన్షనరు..!

‘‘…..నా పుట్టిన రోజుకి ఈ ఆశ్రమంలో అందరికీ పళ్లు పంచిపెడతాను అంటే తీసుకు వచ్చి ఇప్పుడే వస్తాను అని వెళ్లాడు నా కొడుకు… వారం రోజులైంది..! ఎలా ఉన్నాడో ఏంటో..?’’ అంది మోకాళ్ల చుట్టూ చేతులేసి ముడుచుకు కూర్చున్న సావిత్రమ్మ…

‘‘…నా గురించి బాధ పడకని చెప్పండి వాడికి… ఈ శిక్ష నాకు పడకపోతే ఎలా..? వాడిని కనడానికి ముందు ఇద్దరు ఆడపిల్లల్ని పుట్టకుండా చంపేసాను కదా..!’’ ఏటో చూస్తూ వెర్రిదానిలా అంటోంది సుశీలమ్మ…

‘‘….ఒక స్కూలు యాజమాన్యం విద్యార్థులను వేరే ఊర్లో ఒక వృద్ధాశ్రమానికి తీసుకు వెళ్లింది. అక్కడ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించిందట..! ఆమె నానమ్మ గురించి ఇంట్లో అడిగినప్పుడల్లా, ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో చెప్పేవారట..!’’ ఒక పేపర్లో నానమ్మని పట్టుకొని ఏడుస్తున్న ఒక పన్నెండేళ్ల అమ్మాయిని చూపిస్తూ నవ్వాడు కాంతారావు…

‘‘జోక్‌ చెప్పనా… నలభై ఏళ్ల ఓ కొడుక్కి వృద్ధాశ్రమం నుంచి ఫోన్‌ వచ్చిందట..! కుక్క కనబడడం లేదని పేపరులో ప్రకటన ఇచ్చారు కదా..! ఇక్కడ మీ నాన్న గారితో ఆడుకుంటోంది… వచ్చి కుక్కను తీసుకెళ్లండి అని..! ‘‘ నవ్వుతూ వెళ్లిపోయాడు ఒకాయన…నా టేబుల్‌ ముందున్న కుర్చీలో దిగాలుగా కూర్చున్న రాజుగారిని చూస్తే ఆశ్రమంలో చేరతారనే నమ్మకం పోయింది…

‘‘ఇవన్నీ విని మనసు పాడుచేసుకోకండి రాజుగారూ… తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన కథలే వైరల్‌ అవుతున్నాయి… అయినా ఇక్కడ ఏం తక్కువని..? మీ గురించి సాంబయ్య చెప్పాడు. నేటివ్‌ వైద్యం చేస్తారటగా! మీలాంటి వాళ్లు మా ఆశ్రమంలో చేరితే చాలా బావుంటుంది. మీ అబ్బాయి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్‌ అయి పోయాడని తెలిసింది.. ఇప్పుడు కులం, గోత్రం ఉన్న ఇంటి కోడళ్లకే మనం నచ్చడం లేదు. దానికి తోడు మీవాళ్లకా ఆర్థికపరమైన అవసరం ఎలానూ లేదు మీతో… అన్నిటికీ అడ్డనిపించడంలో తప్పేముంది… నేను ఇక్కడ ఉండి ఎన్ని చూడలేదని..! మీ చిన్ననాటి స్నేహితుడు చారి కూడా ఇక్కడే ఉన్నాడు కూడా..! ఒంటరి, అనాథ అనే ఆలోచనే రాకుండా అందరినీ చూసుకుంటుంది మన ‘ఆనందవనం…’’ అన్నాను రాజుగారి వెళ్లే సమయంలో ఆయన అదంతా వదిలేసి ఇలా అడుగుతారనుకోలేదు…

‘‘కూతురూ, అల్లుడూ ఊళ్లో ఉండి కూడా మా చారి అనాథ అంటారా..?

సాంబయ్య (ఆనందవనం హెల్పరు)

డబ్బులు తీసుకోకుండా వైద్దం చేసే డాట్టరారు రాజుగోరు. అసలాయన తెలుగు మేట్టారు. నాకేటొచ్చినా దానిక్కారనం సారా తాగడవే అని ఏదో రకంగా దాన్ని మానిపించేద్దామని పరమేస్పరుడి ఆలోసెన… నాలానే ఆయన కూడా పెల్లాం పోయిన ఒంటరోడు. ఆయన కొడుకు అమెరికా పోతే నాకొడుకు కొయిటా పోయి ఉంటన్నాడు..! మరి నేను ఉసారుగా ఉంటే ఆయన దిగాలుగా ఉంటాడు. ఈ డిపరెన్సు పోవాలంటే ఆయన మందు కాదు నా మందు వాడాలని తెలీని ఎర్రి పరమేస్పరుడు….

ఈ మద్దెనే మా ఆనందవనంలో సేరదావని ఒచ్చి సూసెల్లిపోయారంట. పైసలున్న పేయింగ్‌ గెస్టు కదా ఓసారి మాటాడిరమ్మని లోకనాదం సారు అంపితే ఒచ్చిన…

‘‘ఒయసు మల్లిన అమ్మాఅయ్యలని అంతగా బరించలేక పోతన్నారా పిల్లలు..? పిలిత్తే పలక రించడానికి, పూటకో పిడికెడు ముద్ద పంచడానికి పెంచుకునే కుక్కపాటి సెయ్యలేకపోతున్నారా కనిపెంచి పెద్దసేసినోల్లు..?’’ అంటూ గుడ్ల నీరు కక్కుకుంటున్న పరమేస్పరుని సూత్తుంటే బాదనిపించింది…

‘‘కొడుకుల్ని దూరాలకి తోలేసింది మనవేగా..! ఆల్ల గొడవేదో ఆల్లు పడతుంటే మనవేడో మారుమూల కూసొని నన్ను సూడ్డానికి రారా అంటే ఈలవద్దా..? రోజులికీ, ముసిలితనానికీ లొంగకపోతే ఎట్టా రాజుగోరూ..? అవినా ఈ నరకం మొగుడు పెల్లాల్లో మొగుడు మాత్రవే బతికుంటేనే ఈ గోల… పంచుకునే తోడునేక..!’’

‘‘అంటే నువ్వూ కూడా అంతేనా..?

‘‘పరమేస్పరా..! నన్ను కలపమాకండి..! నానూ ఆనందవనంలోనే ఉంటాన్నా… రాజుగోరూ… ఏవన్నా అనుకోండి..! రాత్రయితే పెల్లాం కంటే ఎచ్చగా ఉంటాది నా సారా సీసా… నాకు తోడు లేకపోవడం ఏంది..? ‘‘ కిసిక్కున నవ్వొచ్చింది నాకు.

‘‘ఏడిసావ్‌..! ముందా సారాజపం వదిలేయి. నేనిచ్చిన మందు మూడు పూట్లా వేసుకుంటు న్నావా..? మటను తగ్గించు. మెంతిపొడి మానెయ్యమాకు. సారా మానేసి రోజూ గలాసుడు కాకరకాయ రసం తాగు – ముళ్లకంపల్లో తిరగమాకు. గుచ్చుకుంటే పుండు పడి తగ్గదు సరికదా కాలు తీసెయ్యాల్సి వస్తుంది!’’ అంటూ లేచినిలబడ్డారు రాజుగారు.

‘‘మరి లోకనాదంగోరికి ఏటి సెప్పమంటా రండీ..?’’

‘‘అబ్బాయి వత్తున్నాడు’’ వాడొచ్చి ఎల్లాక సేరిపోతానని సెప్పు…’’

‘‘ఆయ్‌’’ అనొచ్చేసిన… రాజుగోరి అబ్బాయి ఒత్తన్నాడా..! దిగులుగా అనిపించింది.

మాపిటేల కొయిటా పోను సెయ్యాల… ఆడెట్టా ఉన్నారో కొడుకూ, కోడలూ…

సీతారామం (రాఘవయ్యరాజుగారి కొడుకు)

డాడీ హైస్కూల్‌ తెలుగు మాస్టారు. నేను ఎన్‌ ఐ టి లో కంప్యూటర్స్‌ చేసి అమెరికా ఇల్లినాయిస్‌ వచ్చేసాను… మంచి ఉద్యోగం దొరికింది. డాక్టర్‌ మార్గరెట్‌ పరిచయం ప్రేమగా మారింది. మా పెళ్లి అమెరికాలోనే జరిగిపోయింది… రఘు పుట్టాడు… చాలా కాలం ఆగి ఉండలేక వాట్సప్‌లో వీడియో పంపించాను. ఆగాగి అమ్మ ఒకరోజు వీడియోకాల్‌ చేసింది. మార్గరెట్‌ తెలుగులో మాట్లాడ గలగడం చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. రఘుని చూసి తెగ మురిసిపోయింది. డాడీయే ముభావంగా ఉన్నారు… అమ్మ మాట మీద రఘుని తీసుకొని వెళ్తాం అని రెడీ అవుతుండగానే మహమ్మారి ఎంటర్‌ అయిపోయింది..!

అమ్మ చనిపోవడం ఎలాంటి కొడుక్కెనా తట్టుకోలేని విషాదమే..! ప్రేమని, బంధాన్ని నమ్మే నేను అమ్మ చావుని తేలిగ్గా ఎలా తీసుకుంటాను..? కరోనా సెకండ్‌ వేవ్‌ ఊపిరి ఆడనివ్వలేదు. చిన్న బిడ్డతో వెళ్లగలిగే అవకాశమే రాలేదు. ఈలోగా మార్గరెట్‌కు డ్యూటీలో కరోనా సోకింది..! డాడీని కన్విన్స్‌ చేయలేక పోయాను.మళ్లీ ఇంత కాలానికి డాడీ దగ్గం నుంచి పిలుపు..! అమ్మ సంవత్సరీకం నాకు గుర్తుంది. ఆస్తులు అమ్మేస్తారట..! ఎలా అయితేనేం డాడీ రమ్మన్నారు… ఆలస్యం చేయకుండా వచ్చేసాం..!

వచ్చి వారం రోజులైనా ఆయన నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. మార్గరెట్‌ తో అయితే అసలు పలకరింపే లేదు. శ్రీవల్లీ ఆంటీయే మాకు కావలసినవి అన్నీ చూస్తుండేవారు. ఒక్క రఘుయే ఆయనకి బాగా దగ్గరయ్యింది. ఇద్దరూ కలిసి రకరకాల స్వీట్లు తినేసే వారు. డాడీకి స్వీట్లు అంటే మరీ ఇంత ఇష్టమని తెలియదు… రఘు తెలుగుని సరిదిద్దడంలో ఆయనకు రోజంతా గడిచిపోతోంది..! ఒకరోజు డాడీ దగ్గరకు వెళ్లి నా తిరుగు ప్రయాణం గురించి అడిగేసాను…

‘‘రిజిస్ట్రేషన్‌ పని పూర్తి కాలేదుకదా… అది అవ్వనీ ముందు.’’ చిరాకుగా అన్నారు డాడీ మాట్లాడడమే ఇష్టం లేదన్నట్లు.

‘‘రిజిస్ట్రేషన్‌కు నా అవసరం ఏవుంటుంది డాడీ..? నేనిక్కడ మీతో మాట్లాడు తుంటే మీరెటో చూస్తూ నిలబడతారేం..? అయినా ఇవన్నీ అమ్మేస్తే మీరెక్కడ ఉందామని..? ఆ ఆనందవనంలోనా..?’’ కాస్త వెటకారంగా అన్నాను. గొడవపడైనా ఈ అలక మానిపించాలి. ఆయన నాతో మాట్లాడాలి అంతే..! ఆయన విసురుగా వెనక్కి తిరిగారు…

అవున్రా… అక్కడే ఉందామని..! స్వార్థానికి నమూనా లాంటి కొడుకులు కన్నతండ్రికిచ్చే జీవన సాఫల్య పురస్కారం ఒక మడతమంచం..! గంటలూ, రోజులూ చావు కోసం లెక్క పెట్టుకుంటూ పడిఉండమని ఓ అంపశయ్య..! అదిగో ఆ మూల సిద్ధంగా ఉంచుకున్నాను… పట్టుకుపోతా. ఇప్పుడే తర్పణం వదిలేస్తావా..?’’ అరిచారు డాడీ. అరుపుకి అందరూ పరుగెత్తుకు వచ్చేసారు…

‘‘డాడీ..!’’ హడిలిపోయి అన్నాను ఆయన మాటలకి లోపల ఎక్కడి నుంచో దుఃఖం తన్నుకుంటూ వచ్చేస్తోంది.

‘‘ డాడీ… హు… కన్నకొడుకు చేత ‘నాన్నా’ అని పిలిపించుకోలేని అమెరికా పౌరసత్వపు అనుబంధం..!’’

డా… నాన్నా..! ‘‘ తెల్లబోయి చూసాను… ఇదా నాతప్పు..! రఘు భయంతో మార్గరెట్‌ చేతిని పట్టుకున్నాడు.

‘‘ముప్ఫై ఏళ్ల కొడుకు చేత నాన్నా అని అడిగి పిలిపించుకోవాలి..! తలకొరివి పెట్టరా అని అడిగి పెట్టించుకోవాలి..! అంతవరకూ స్వార్థాన్ని వాయిదా వేయి బాబూ అని బ్రతిమాలుకోవాలి…’’ నా వంక తిరిగి చేతులు జోడిరచి ఇంకా అన్నారు నాన్న…

‘‘వీలైనంత త్వరగా వెళ్లిపోతాను. ఆ తలకొరివి ఏదో పెట్టాననిపించు రామం… అనాథగా చావాలని లేదు.’’

తట్టుకోవడం నావల్ల కాలేదు… ‘‘నాన్నా…’’ అని ఏడుస్తూ గబుక్కున కౌగలించుకున్నాను… నాతో పాటూ వాళ్లిద్దరూ..!

మార్గరెట్‌ (రాఘవయ్యరాజుగారి కోడలు)

సీతారామం ఒంట్లో బాగోలేదంటూ నా జీవితంలోకి ప్రవేశించాడు… వారంలో అడిగేసాడు పెళ్లి చేసుకుందామని… వాళ్ల అమ్మానాన్నలని కన్విన్స్‌ చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేసాడు కానీ వాళ్లకి నేనంటే ఇష్టం లేదు. అయితే సీతారామం వదిలేయ లేదు…నన్ను కుదురుగా ఉండనీయలేదు… అనుకున్న సమయానికే అమెరికాలో మా పెళ్లి రిజిస్టర్‌ అయిపోయింది… అతని కోరిక ప్రకారం ఇంట్లో తెలుగే మాట్లాడాలని కష్టపడి తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. సంవత్సరం తిరగకుండానే రఘు పుట్టేసాడు కరోనా సమయంలో..! సెకండ్‌ వేవ్‌ లో వృత్తిరీత్యా నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అయ్యింది. అదే సమయంలో సీతారామం అమ్మగారు ఇండియాలో కరోనాతో చనిపోయారు. సంవత్సరం నిండని పిల్లాడితో వెళ్లడానికి కుదరలేదు… సీతారామం చాలా ఫీలయ్యాడు. అప్పటి నుంచీ వాళ్ల నాన్నగారు పూర్తిగా కాంటాక్ట్‌ కట్‌ చేసేసారు… చాలాకాలం సీతారామం నరకం అనుభవించాడు.

ఇప్పుడు ఇండియా నుంచి పిలుపు వచ్చింది. ప్రాపర్టీ అమ్మేస్తున్నారట ఆయన..! ఓల్డ్‌ ఏజ్‌ హోంలో ఉంటారట. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి… ఇండియాలో ఓల్డ్‌ ఏజ్‌ హోంలు ఆర్గనైజ్డ్‌గా ఉండవు. అక్కడ ఓల్డ్‌ అంటే ఒక ఉదాసీనత. కాదంటే ఎవరిదో చారిటీ లేదా ఇంకెవరికో వ్యాపారం. దానికి వృద్ధులు అక్కడ టార్గెటెడ్‌ గ్రూప్‌..!

అమెరికాలో వృద్ధుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది..! ముందే ఆదాయం నుంచి కొంత సొమ్ము తీసుకొని వృద్ధాప్యంలో ఓల్డ్‌ ఏజ్‌ హోంలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వీరి సమస్యలపై అవగాహన కల ‘జిరియాట్రిషియన్స్‌’ సూపర్విజన్‌ లో ఇవి పని చేస్తాయి. మంచి వాతావరణం, నర్సింగ్‌ సిబ్బంది, అంబులెన్స్‌, డిస్పెన్సరీ – కోవిడ్‌ టైంలో వీటి ఇంపార్టెన్స్‌ బాగా తెలిసివచ్చింది…

ఇంటికి వచ్చాక ఎవరూ నన్ను పలకరించనే లేదు. మావయ్య గారయితే తలెత్తి చూడనే లేదు..! నమస్తే తాతయ్యగారూ…’’ అన్న రఘుని చూసినపుడు ఆయన కళ్లలో క్షణం కనిపించిన మెరుపు నాకిప్పటికీ గుర్తే..! మా ఇంట్లో తెలుగే మాట్లాడుతూ ఉండడంతో రఘుకి కూడా తెలుగు వచ్చేసింది..! సంవత్సరీకాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసారు…!

మావయ్యగారిని కాళ్లకు నమస్కారం చేసే సమయంలో గమనించాను… ఆయన కాలు డయాబెటిక్‌ ఫూట్‌..! ఆయన నేటివ్‌ డాక్టరని, వైద్యం కూడా చేస్తుంటారు అని అన్నాడు సీతారామం..! మరి రఘుతో కలిసి స్వీట్లు తినేస్తున్నారు… డ్రిరక్స్‌ తాగేస్తున్నారు..! వైట్‌ రైస్‌, పెరుగులో అరటిపళ్లూ, రసగుల్లాలు..! అర్థం కాలేదు నాకు. ఆయన కాలు మీద గాంగ్రిన్‌ చూసాక అనిపించింది ఆయన లోపల అంతా సక్రమంగానే ఉందా అని… నాకు తెలిసి ఆయనది ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన స్టేజ్‌..! కొడుకు చేతుల్లో పోవాలని ప్రయత్నం చేస్తున్నారా..? ఎప్పటినుంచి ఇలా..? ఈయన్ని ఒంటరిగా వదిలేయడం సరికాదు… అర్థంకాక చూస్తున్న రఘుని చూపి ఇంకోతరాన్ని అతనికి పరిచయం చెయ్యాలని చెప్పాను సీతారామంతో… ఎమోషన్‌తో నన్ను కౌగిలించుకున్నాడు తను. మేం ముగ్గురం మావయ్యగారిని పట్టుకొని రోదించినపుడే అనుకున్నది సాధించ గలిగాం. అయితే క్రెడిట్‌ మాత్రం పూర్తిగా రఘూదే..!

‘‘రండి తాతయ్యా..! అక్కడ తెలుగువాళ్లకి తెలుగు సరిగా రాదు… మర్డర్‌ చేసేస్తున్నారు… మీరొచ్చి బతికించండి…’’ మూడేళ్లు కూడా నిండని రఘు ఆయన్ని పట్టుకొని అలా అంటుంటే కాసేపటికి పెద్దాయన ఒప్పేసుకున్నారు…

వెళ్లాక రఘుని ఏక్టింగ్‌ స్కూల్‌ కి పంపించాలి… బిస్కట్‌ వేయడంలో తండ్రిని మించిపోయాడు..!

– కెవివి సత్యనారాయణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram