‘మా స్వాతంత్య్రాన్ని గౌరవించని, మా ప్రజాస్వామ్యాన్ని మన్నించని, మా జీవన విలువలను ఖాతరు చేయని, సెక్యులర్‌ చట్టాల కంటే ఖురాన్‌ ముఖ్యమని విశ్వసించే నెదర్లాండ్స్‌ ముస్లింలందరికి నేనొకటి చెబుతున్నాను. అలాంటి వారు దేశం వదిలివెళ్లండి!’ డచ్‌ లేదా నెదర్లాండ్స్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో ఎక్కువ  స్థానాలు గెలిచిన ఫ్రీడమ్‌ పార్టీ (పీవీవీ) నాయకుడు గ్రీట్‌ వైల్డర్స్‌ ఇచ్చిన సంచలన ప్రకటన ఇది. ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి శషభిషలూ లేకుండా ఇదే చెప్పారు. ఆయననే ప్రజలు స్వాగతించారు. దీనితో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి అటు మళ్లిన మాట నిజం. వాస్తవం చెప్పాలంటే ఆ పరిణామం ఇప్పుడు మిగిలిన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినంతగా ఐరోపా ఖండాన్ని ఆశ్చర్యపరచడం లేదు. ఎందుకంటే అక్కడ పలు దేశాలలో ఇలాంటి పిలుపులే హోరెత్తుతున్నాయి. ఎటొచ్చి కాస్త తీవ్రత తక్కువ. వలసలతో, వలస పేరుతో, ఆశ్రయం పేరుతో వచ్చి స్థిరపడినవారితో ఐరోపా దేశాలు  జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటు ఉండడమే ఇందుకు కారణం. ఉదారవాద ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పక్షాలకు చాలా దేశాలు అధికారం నుంచి ఉద్వాసన పలుకుతున్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌, జర్మనీ, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, హంగెరి, ఇటలీ, నార్వే, పోర్చుగల్‌, స్వీడన్‌, ఇంగ్లండ్‌ ఇదే బాటలో చాలా ముందుకు వచ్చేశాయి కూడా. నెదర్లాండ్స్‌లో మిగిలిన పక్షాలతో కలసి వైల్డర్స్‌ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఒక్క నెదర్లాండ్స్‌ సమస్య కాదు. జాతీయతను గుర్తించడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వాలకు, ప్రజానీకం వీడ్కోలు చెబుతున్నది. ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా ఉన్న ముస్లిం ఉగ్రవాదాన్ని,  ముస్లిం సమస్యను వాస్తవిక దృష్టితో చూడడానికి ఇష్టపడని నేతలను ఇళ్లకు పంపిస్తున్నాయి. తమ మతాన్నీ, విశ్వాసాలనీ, సాంఘిక జీవనాన్నీ బయట నుంచి వచ్చినవారు శాసించే పరిణామాన్ని ఆ దేశాల వారు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అలాంటి ఐరోపావాసుల అంతరంగమే వైల్డర్స్‌ నోటి నుంచి వెలువడిరది. ఆయన ఇంకా ఇలా అన్నారు, ‘అలాంటివారు (సెక్యులర్‌ చట్టాలకు ఖురాన్‌ అతీతమైనదని భావించేవారు) చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్‌ కూంపాన్స్‌ పరిశోధన ప్రకారం ఏడులక్షల మంది. వారికి నేను చెప్పేది ఒక్కటే`ఇస్లామిక్‌ దేశానికి వెళ్లిపొండి. అక్కడైతే మీరు ముస్లిం చట్టాలను అనుభవించవచ్చు. ఆ చట్టాలకు వాళ్లకు సంబంధించినవి, మాకు సంబంధించినవి కాదు’.

ముస్లింలకు వ్యతిరేకమైనదంతా జాతీయత అని భాష్యం చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ముస్లింలలోను జాతీయతావాదులు ఉన్నారు. ఎటొచ్చీ తమదైన సంస్కృతికీ, మతాచారాలకూ, విశ్వాసాలకూ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లినా సర్దుకు పొమ్మని చెప్పే ప్రజాస్వామ్యాన్ని గుర్తించడానికి ఐరోపా దేశాలు అంగీకరించడం లేదు. ఫలితమే జాతీయవాదాన్ని సమర్థించే రాజకీయ పక్షాలు వరస పెట్టి అక్కడ విజయం సాధిస్తున్నాయి. కొన్నిచోట్ల జాతీయవాదులు అధికారంలోకి రావడానికి వీలుగా కొందరు ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారు. ఉదాహరణకి ఇటలీ. అక్కడ లెగా నొర్డో పార్టీకి చెందిన మెటియో సాల్విని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాడు. ఇంటీరియర్స్‌ మంత్రిగా ఉన్న సాల్విని నిర్ణయంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ‘కోటి మంది ఇటాలియన్‌లకు, మరొక కోటి మంది వలసదారులు ఉండడాన్ని నేను జీర్ణించుకో లేను’. 2019లో ఆఫ్రికా నుంచి వెల్లువెత్తిన వలస దారుల గురించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇప్పటి దాకా అధికారంలో ఉన్న ఉదారవాద, ప్రజాస్వామిక పార్టీలు జాతీయవాదాన్ని సమర్ధిస్తూ ఎన్నికలలో నెగ్గిన వారితో కలసి సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ బల్గేరియా. స్వీడన్‌, ఫిన్లాండ్‌, ఎస్తోనియాలలో కూడా ఇదే జరిగింది.

యూరోపియన్‌ దేశాలలో ఇది హఠాత్పరిణా మమే. పైగా ఒక్కసారిగా ఊపందుకున్న ధోరణి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ, ఇటలీలలో మొదలైన సంకుచిత జాతీయవాదాన్నీ, తాజా పరిణామాన్నీ ఒకే గాట కట్టడానికి జరుగు తున్న ప్రయత్నాలను ప్రజలకు ఖాతరు చేయడం లేదు. నిజానికి ఇప్పుడు వస్తున్న జాతీయవాదం ఆయా దేశాల అస్తిత్వ సమర ఫలితం. అందులో దురభిమానాన్ని చూపి వామపక్షాలు మరొకసారి భంగపడడానికి సిద్ధపడుతున్నాయి. అందుకే భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడాన్ని కూడా ఇదే దృష్టితో కొన్ని అంతర్జాతీయ వామపక్ష వేదికలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఏ ఒక్క ప్రచారాన్ని ప్రపంచం విశ్వసించడం లేదు. ఇలాంటి వేదికలు, వామపక్ష విశ్లేషణలు ఏనాడూ ప్రజాభి ప్రాయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు కూడా. ఇప్పుడు ఈ పరిణామం పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేది మాత్రమే.

మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాల నుంచి వచ్చిన పడుతున్న శరణార్థులతో ఆయా దేశాలలో జనాభా సమీకరణలలో దారుణమైన మార్పులు వస్తున్నాయి. గ్రీక్‌ ఎదుర్కొన్న శరణార్థుల సమస్య (2017) ఇలాంటిదే. తరువాత కొవిడ్‌ సమయంలో కూడా వలసలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంతో ‘రివర్స్‌ గ్లోబలైజేషన్‌’ అన్న లోతైన సూత్రీకరణ రూపుదిద్దుకున్నది. ఐరోపా సంశయవాదం పేరుతో ఇదే ఒక రాజకీయ సిద్ధాంతంగా కూడా అవతరించింది. ఉదారవాదానికి, ప్రజాస్వామిక, స్వేచ్ఛా జీవనానికీ ఆలవాలమైన యూరప్‌ దేశాలలో ఇలాంటి పరిణామం ఉవ్వెత్తున ఒక్కసారిగా ఎందుకు మొదలైంది అన్నది ప్రశ్నే.

ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలని కూడా చాలామంది అంటున్నారు. అవి: ఇటీవల హఠాత్తుగా ఉగ్రవాదం, ముఖ్యంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరిగింది? ఉదారవాదులమని చెప్పుకునే ప్రబుద్ధులు దానిని నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఐరోపా దేశాలలో అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న నేరాలలో శరణార్థులు లేదా వలసదారులే ఎందుకు ఉంటున్నారు? ప్రపంచం మొత్తం మీద చాలా దేశాలలో నాయకులు జాతీయ భద్రత విషయంలో రాజీ పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది? విశ్వవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అవినీతి విపరీతంగా పెరిగింది. ఇది ఆయా దేశాలకే ప్రమాదకరంగా పరిణమించింది.  ఎందుకు? అసలు ప్రపంచ మానవాళికే బెడదగా పరిణమించిన కొన్ని అంశాల పట్ల చాలామంది దేశాధినేతలు ఎందుకు మౌనం దాల్చుతున్నారు?

వలసదారులుగా, శరణార్థులుగా వచ్చిన వారు తమ సామాజిక వ్యవస్థకూ, మత విశ్వాసాలకూ బెడదగా పరిణమించడం ఇప్పుడు చాలా ఐరోపా దేశాల వారు గమనిస్తున్నారు. కానీ ఈ అంశాన్ని బాహాటంగా వెల్లడిరచడానికి పరిస్థితులు అనుకూ లించడం లేదు. ఆ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వారికి జాతీయవాద రాజకీయ పార్టీలు, వేదికలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. జాతీయవాదం ఊపందుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌ విధానాలు కూడా కారణమన్న అభిప్రాయం కూడా ఉన్నది. వలసలు, కామన్‌ కరెన్సీ, దేశాల వ్యవహారా లలో మితిమీరిన జోక్యం కూడా కారణాలుగా చెబుతున్నారు. తమ దేశ సార్వభౌమాధికారానికీ, సంస్కృతికీ విఘాతం కలిగించే విధంగా శరణార్థుల సమస్య పరిణమించిందని చెబుతున్నా యూరోపియన్‌ యూనియన్‌ వినిపించుకునే స్థితిలో లేదు. గ్లోబలైజేషన్‌ మిధ్యలా చూస్తున్నారు చాలామంది. వామపక్ష సిద్ధాంతాలకూ అదే గతి పట్టింది. సరిహద్దులు తెరిచి ఉంచాలన్నది వామపక్ష ప్రభుత్వాల సిద్ధాంతమే. ఇదే ఐరోపా దేశాల మీద అసాధారణమైన వత్తిడిని పెంచింది. దాని వాస్తవికత కనిపిస్తున్నా ఇప్పటికీ వామపక్షాలు అదే సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడుతున్నాయి. జనం కాదు, వాటికి సిద్ధాంతమే ముఖ్యమన్న అభిప్రాయానికి ప్రపంచం మరొకసారి రావలసి వచ్చింది. ఉదారవాదంలో, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల గోడు వినిపించుకునే లక్షణం లేదన్న వాదనకు బలం చేకూరింది. వీటిని మేధావులు పరిశీలించడానికి కూడా అంగీకరించరు. ఆ నిర్లిప్తత నుంచి జాతీయ వాదం ఊపందుకుంది. అందుకు ప్రజలు తమకు ఉన్న ఓటు హక్కుతో జాతీయవాదాన్ని అధికారంలోకి తీసుకువస్తున్నారు.

ఇన్ని దేశాలు ఒక్కసారిగా జాతీయవాద ప్రభుత్వాలకు ఓటు వేస్తున్నాయంటే ఇప్పటికీ వాస్తవం దగ్గరకు వెళ్లకపోతే చర్చ అనవసరం. డచ్‌ నాయకుడు వైల్డర్స్‌ హెచ్చరిక (‘ముస్లింలు అవతలికి పోవాలి’) లోని తీవ్రత అర్ధం కాదు. ముస్లింలు ఏ దేశంలో ఉన్నా ‘ఉమ్మా’ (ముస్లిం ప్రపంచం) సిద్ధాంతంతోనే ఉంటారు. దీనిని నిస్సంకోచంగా అమలు చేయ చూస్తున్న వర్గాన్ని కూడా శరణార్థులు, వలసదారుల జాబితాలో చేర్చడానికి చాలా దేశాలు ఇప్పుడు సిద్ధంగా లేవు. వారిలో మతోన్మాదం, ఇతర విశ్వాసాలు కలిగిన వారితో సహజీవనానికి సిద్ధం కాకపోవడం అనే రెండు ప్రధాన సమస్యలు స్థానికులు చూడవలసి వస్తున్నది. ఇవే ఇప్పుడు యూరోపియన్‌ దేశాలకు సవాళ్లుగా మారాయి. ఉదాహరణకు: ఫ్రాన్స్‌లోని చాలా శివారు ప్రాంతాలను ఘెట్టోలుగా పేర్కొంటున్నారు. ఇక్కడ ఫ్రెంచ్‌ చట్టాలను ఖాతరు చేయరు. ఈ విషయాలపై బహిరంగ చర్చను ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిరుత్సాహపరచడమే విచిత్రం. చాలా పాశ్చాత్య దేశాలలో స్థానిక మైనర్‌ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వలస దారులు, శరణార్థులే కారణమని తెలిసినా చర్యలు ఉండడం లేదు. ఇలాంటి అంశాలను జాతీయవాద పార్టీలు అత్యంత ముఖ్యమైన చర్చనీయాంశాలను చేశాయి. అందుకే ఆ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. అయినా ఈ ధోరణికి కొంత వ్యతిరేకత ఇప్పటికీ ఉంది.

ఒక జాతిప్రజలు తమ సంస్కృతి – సంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని భయపడినప్పుడు, వారిలో జాతీయవాదం క్రమంగా పెరుగుతుందనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ప్రజాస్వామ్య దేశాల్లోని సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు జాతీయవాదం బలపడ డానికి కారణమవుతున్నాయి. నిరంకుశ పాలకులు దురహంకారంతో జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు పెచ్చరిల్లే జాతీయవాదం ప్రమాదకరం. ఇందుకు హిట్లర్‌ ఉదాహరణ. కానీ ఒక జాతి తన మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నదని లేదా మరొక సంస్కృతి తన అస్తిత్వానికే భంగకరంగా మారిందని భావించి నప్పుడు ఉద్భవించే జాతీయవాదాలు ప్రజా స్వామ్యంలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తాయి. ఐరోపా దేశాలు ప్రస్తుతం ఈ పోకడలకు గొప్ప ఉదాహరణ. మనదేశంలో జమ్ము-కశ్మీర్‌కు చెందిన నాలుగు లక్షలమంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే కాంది శీకులుగా బతుకులీడవాల్సిన దుస్థితికి ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పాటు, సెక్యులర్‌ పార్టీల పక్షపాత, నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణం.

 జాతీయవాద పార్టీ బీజేపీ బలపడడానికి కనిపించే కారణాలలో సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు కూడా ఒకటి. దాదాపుగా ఇదే పరిస్థితి యూరప్‌ దేశాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడు తుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికారంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ ఉండేది. తర్వాతి కాలంలో స్వీడన్‌లో 12%కు, ఫిన్లాండ్‌లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సామాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతా భావానికి చిహ్నం. 1999లో స్థాపించిన యు.కె. ఇండిపెండెన్స్‌ పార్టీ 2015 సాధారణ ఎన్నికల్లో ఏకంగా 12.6% ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే తర్వాతి ఎన్నికల్లో 2%కు పడిపోవడం అనంతర పరిణామం. ఎప్పుడైతే ప్రజల్లో సాంస్కృతికపరమైన అభద్రత పెరుగుతుందో, జాతీయవాద పార్టీలకు ఓట్లశాతం పెరుగుతుందనే సత్యాన్ని ఈ పోలింగ్‌ సరళి వెల్లడిస్తోంది.

 డచ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీపుల్స్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ కూడా గణనీయమైన పురోగతి సాధించింది. డచ్‌ పార్లమెంటరీ చరిత్రలో ఒక జాతీయవాద పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం ఇదే ప్రథమం. అంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నాలుగు పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాయి. ఈ పార్టీ అధినేత గ్రీట్‌ వైల్డర్స్‌ డచ్‌ సంస్కృతికి ఇస్లాం పెను ప్రమాదమంటూ బహిరంగంగా ప్రకటించారు. ఇటలీలో నార్తరన్‌ లీగ్‌ (ప్రస్తుతం దీని పేరును లీగా నార్డ్‌గా మార్చారు. అంటే ‘లీగా నార్డ్‌ ఫర్‌ ఇండిపెండెంజా డెల్లా పడానియా’), ఫ్రాన్స్‌లో నేషనల్‌ ఫ్రంట్‌, స్విట్జర్లాండ్‌లో డెమోక్రటిక్‌ యూనియన్‌ ఆఫ్‌ సెంటర్‌ ఇటీవలి కాలంలో తమ ఓట్ల శాతాన్ని గణ నీయంగా పెంచుకున్నాయి.

ఇక అతివాద జాతీయవాద పార్టీలు డేనిష్‌ పీపుల్స్‌ పార్టీ, ఫ్రీడం పార్టీ ఆఫ్‌ ఆస్ట్రియాలు 2010కి ముందే ఆయా దేశాల్లో గట్టి పునాదిని ఏర్పరచు కున్నాయి. ఈ రెండు పార్టీల ఓట్లశాతం 2 నుంచి 5%కు పెరిగింది. ఇక జర్మనీలో ఏర్పాటైన అతివాద జాతీయవాద పార్టీ ఏఎఫ్‌పీ, స్పెయిన్‌లో ఓక్స్‌ పార్టీలు కూడా ఆయా దేశాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గణనీయ స్థాయిలో ఓట్లశాతాన్ని పొందడం గమనార్హం

జాతీవాదం పెరగడానికి కారణాలు

గత కొద్ది సంవత్సరాలుగా యూరప్‌ దేశాల్లో జాతీయవాద పార్టీలకు క్రమంగా ప్రజాదరణ పెరగడానికి కారణాలు అనేకం. ముఖ్యంగా సైద్ధాంతిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు వలసలు కూడా జాతీయవాదం పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. విచిత్రమేమంటే ఐరోపా సమాఖ్య దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం ‘వలసలే’ నని ఈ జాతీయ పార్టీలు ముక్త కంఠంతో చెప్పేమాట! ఈ వలసల కారణంగా ఐరోపావాసులు తమ గుర్తింపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటు న్నారన్నది వీరి ప్రధాన వాదన. ఈ అంశాన్నే మౌలికంగా తీసుకొని ఐరోపాదేశాల ఎన్నికల్లో ఇవి పోటీచేస్తున్నాయి. కేవలం వలసలు మాత్రమే ఈ జాతీయవాద పార్టీలు వెలుగులోకి రావడానికి కారణమా అని ప్రశ్నిస్తే, ‘ఆర్థిక’ కారకం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. 2008లో ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నప్పటినుంచి ఈ జాతీయవాద పార్టీలు ఐరోపా దేశాల్లో క్రమంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఈ ఆర్థికమాంద్యం పుణ్యమాని దాదాపు 20 ప్రజాస్వామ్య దేశాల్లో ఈ జాతీయవాద పార్టీల ఓట్లశాతం ఏకంగా 30 పెరిగింది.

ఆయా ప్రభుత్వాల ఆర్థిక విధానాల వైఫల్యం కారణంగా ప్రజలు జాతీయవాద పార్టీలకు తమ మద్దతివ్వడం మొదలుపెట్టారు. జాతీయవాద విస్తరణకు మరో కారణం నిరుద్యోగం. ఐరోపా దేశాల్లో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 20మిలియన్లు. దీన్ని అవకాశంగా తీసుకొని జాతీయవాద పార్టీలు ఇతర దేశాలనుంచి అక్రమంగా వచ్చిన వలసదారులు దేశీయ యువత ఉపాధి అవకాశాలను దెబ్బకొడుతున్నా రంటూ ప్రచారం సాగించాయి. మరో ప్రధానకారణమేంటంటే, ఫ్రాన్స్‌, యూకే, బెల్జియం వంటి దేశాల్లో కొనసాగిన ఉగ్రదాడులు. ఇవి కూడా యూరప్‌ దేశాల్లో, ముస్లింల పట్ల వైముఖ్యం పెంచాయి. 2016లో ‘బ్రెక్సిట్‌’ తర్వాత యూరప్‌ దేశాల్లో క్రమంగా జాతీయవాద పార్టీలకు ప్రజల మద్దతు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ఆస్ట్రియా, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, హంగరీ, బ్రిటన్‌ వంటి దేశాల్లో జాతీయవాద పార్టీలు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశాయి. లా అండ్‌ జస్టిస్‌ పార్టీ (పోలెండ్‌), డేనిష్‌ పీపుల్స్‌ పార్టీ (డెన్మార్క్‌), ఫిడ్జ్‌ అండ్‌ జొబ్బిక్‌ పార్టీలు (హంగరీ), ఫ్రీడమ్‌ పార్టీ (ఆస్ట్రియా), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (స్వీడన్‌), ఫార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ (నెదర్లాండ్స్‌), గోల్డెన్‌ డాన్‌ పార్టీ (గ్రీస్‌), ఇండిపెండెన్స్‌ పార్టీ (యు.కె) ఇందుకు ఉదాహరణలు.

మొత్తం ఐరోపా దేశాల్లో ఈ పార్టీల పురోగతి ఇంకా నిదానంగానే ఉన్న ప్పటికీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రియా వంటి దేశాల అధ్యక్ష ఎన్నికల్లో ఇవి రెండోస్థానానికి ఎదగడం గమనార్హం. ఆస్ట్రియా, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లో ఈ పార్టీల ఓట్లు 20%కు పైగా చేరుకోవడం మరో విశేషం. 2022లో ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మారిన్‌ లీ పెన్‌ నేతృత్వం లోని నేషనల్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఫ్రాన్స్‌ పార్టీ (ఫార్‌`రైట్‌ పార్టీ) ఏకంగా 41.45% ఓట్లు సాధించింది! 2017తో ఈ పార్టీకి వచ్చిన ఓట్లు 37% మాత్రమే. ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జాతీయవాదానికి ఇది ఉదాహరణ. అంతేకాదు ఈ పార్టీ 2022 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా 89 స్థానాల్లో గెలుపు సాధించింది. గడచిన మూడు దశాబ్దాల కాలంతో ఇది అత్యధికం.

ఇటలీలో ‘బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ’ (రైట్‌ వింగ్‌ పార్టీ) పార్టీ నేత, జార్జియా మెలోనీ 2022, సెప్టెంబర్‌ 25న జరిగిన ఇటలీ పార్టమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1945 తర్వాత ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టారు. మొత్తం 400 పార్లమెంట్‌ స్థానాల్లో ఆమె పార్టీ 237 సీట్లను గెలుచుకుంది! అదేవిధంగా 2022 ఏప్రిల్‌లో హంగరీలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విక్టర్‌ ఓర్బాన్‌ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు. ఈయన పార్టీ ‘ఫిడ్జ్‌’ ఏకంగా 53% ఓట్లు సాధించి, మొత్తం 199 పార్లమెంట్‌ స్థానాల్లో 135 కైవసం చేసుకుంది. 2022లోనే స్వీడన్‌లో జరిగిన ఎన్నికల్లో స్వీడన్‌ డెమోక్రాట్స్‌ పార్టీ గణనీయ స్థాయిలో 20.95% ఓట్లు సాధించింది. ఫలితంగా 349 పార్లమెంట్‌ స్థానాల్లో 72 సీట్లు ఆ పార్టీ హస్తగతమయ్యాయి. అదేవిధంగా 2019లో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కూడా జాతీయవాద పార్టీల సీట్లు బాగా పెరగడం గమనార్హం. మొత్తం 105 స్థానాల్లో గెలుపొందిన ఈ పార్టీలు మొత్తం పార్లమెంట్‌ సీట్లలో 1/3 వంతు ఆక్రమించాయంటే వీటి ప్రాబల్యం ఎంతగా పెరిగిపోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఈ పోకడలను పరిశీలిస్తే, రాబోయే కాలంలో జాతీయవాద పార్టీలు యూరప్‌ దేశాల రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకునే అవకాశాలే ఎక్కువ.

అస్థిరతకు దారితీస్తున్న వలసలు

 మొత్తం 28 యూరప్‌ దేశాల్లో విస్తరించి ఉన్న దాదాపు 25 మిలియన్ల ముస్లిం వలసదార్ల సమస్య ప్రస్తుత యూరప్‌ సమాజంలో అస్థిరతకు దారి తీయడమే కాకుండా, ఇందుకు పరిష్కారం లభించక తలలు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి! గతంలో ఎన్నడూ లేని రీతిలో యూరప్‌ సమాజంలో క్రమంగా ముస్లింలు, యూరోపియన్ల మధ్య పరస్పర అనుమానాలు పెరుగుతూ రావడం వర్తమాన చరిత్ర. యూరోపియన్‌ ముస్లింల పట్ల ఆయా సమాజాల్లో తీవ్ర వ్యతిరేతక వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జాతీయ భద్రత, అంతర్గత భద్రత, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్త మవుతున్నాయన్న అభిప్రాయాలు అంతర్గతంగా నిర్వహించిన సర్వేల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదకర పరిస్థితిని గుర్తించిన చాలా యూరప్‌ దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. తీవ్రవాద శక్తులను అణచివేసేందుకు తగిన చట్టాలను అమల్లోకి తీసుకు రావడమే కాకుండా, ముస్లింలు యూరప్‌ సమాజాల్లో కలిసిపోయే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. అయితే ముస్లింలలో పెరుగుతున్న రాడికల్‌ భావాలకు యూరప్‌ సమాజాల్లో వారు మమేకం కాలేకపోవడం కారణం కాదని గుర్తించాలి. ప్రపంచ దేశాలతో ముస్లింలకున్న తార్కిక సంబంధాలే అక్కడి సమాజాల్లో కొనసాగు తున్న సంఘర్షణకు మూలం.

చారిత్రక నేపథ్యం

యూరప్‌ దేశాల్లో ముస్లింలు ఉండటమనేది కేవలం నేడు జరుగుతున్న పరిణామం కాదు. క్రీ.శ.711నుంచే యూరప్‌లో ముస్లింలు కొనసాగు తున్నారు. అప్పట్లోనే ఉత్తర మెడిటరేనియన్‌ ప్రాంతాలను ముస్లింలు జయించి ఖిలాఫత్తును ఏర్పాటుచేశారు. ఇబిరియన్‌ తీరప్రాంతాల్లో వీరి సామ్రాజ్యాలు దాదాపు ఏడు శతాబ్దాలుగా కొనసాగాయి. క్రీ.శ. 1492లో ఎమిరేట్స్‌ ఆఫ్‌ గ్రెనడా పాలన అంతం కావడంతో స్పెయిన్‌లో ముస్లింల రాజకీయ పరిపాలన ముగిసింది. ఒట్టమాన్‌ పాలకులు గ్రీకులను ఓడిరచి వారిని అనటోలియా నుంచి తరిమివేసి, కాన్‌స్టాంటినోపుల్‌ (1493)ను స్వా ధీనం చేసుకున్నారు. ఇది తర్వాత ఇస్తాంబుల్‌గా మారింది. అనంతరం వీరు బాల్కన్‌ ప్రాంతాలను జయించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఒట్టమన్‌ సామ్రాజ్యం పతనం కావడం, బాల్కన్‌ దేశాలు స్వాతంత్య్రం పొందడం తర్వాత జరిగిన వరుస పరిణామాలు. అయినప్పటికీ బోస్నియా, అల్బేనియా, కోసావోల్లో ముస్లింలను ఎవరూ తరిమి వేయకపోవడంతో ప్రస్తుత యూరప్‌ సమాజంలో వీరు స్థానిక ముస్లింలుగానే కొనసాగుతున్నారు. అయితే మారిన ప్రపంచ పరిణామాలు వారిలో కొత్త ధోరణులను ప్రేరేపించాయి.

వలసలు ప్రారంభం

రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌ దేశాలు పునర్‌నిర్మాణ ప్రక్రియలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తమ దేశాల్లో నెలకొన్న శ్రామికుల కొరతను అధిగమించేందుకు ఉత్తర ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా రిఫ్‌ పర్వత ప్రాంతాల నుంచి ప్రజలను ఫ్రాన్స్‌ వంటి దేశాలు తరలించాయి. ఇండొనేసియన్లు, సురినామీలు హాలండ్‌కు, భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు యు.కె.కు వలస వెళ్లారు. తుర్కిష్‌, ఖుర్దిష్‌ వలసదార్లపై ప్రధానంగా జర్మనీ దృష్టిపెట్టింది. అందువల్ల 1950 ప్రాంతాల్లో వలస వచ్చినవారిలో ముస్లింలు అధిక సంఖ్యాకులు కాదు. ముఖ్యంగా ఐరోపా దేశాల కాలనీలనుంచి ఈ వలసలు కొనసాగాయి. ఈ తొలితరం వలసదారుల్లో అత్యధికులు యువకులు. వీరికి యూరప్‌ దేశాల్లో స్థిరపడాలన్న ఉద్దేశం లేదు. కేవలం తమ సంపాదనలో పొదుపు చేసుకున్న మొత్తాన్ని స్వదేశానికి పంపడానికి మాత్రమే వారు ప్రాధాన్యతనిచ్చారు. వీరు దాదాపు 80% సంపాదనను స్వదేశాలకు పంపేవారు. ముఖ్యంగా రైలు, రోడ్ల నిర్మాణం, బొగ్గు గనులు వంటి వాటిల్లో, ముఖ్యంగా యూరోపియన్లు పనిచేయడానికి ఇష్టపడని రంగాల్లో పనిచేశారు. ఆవిధంగా 1970 వరకు వలసల సమస్య లేదా ‘ముస్లిం’ల సమస్య తలెత్తలేదు. ముఖ్యంగా వలస వచ్చినవారు యూరప్‌ దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో లేకపోవడమే ఇందుకు కారణం.

అయితే 1970 తర్వాత యూరప్‌ దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిరది. ముఖ్యంగా 1973లో ఏర్పడిన చమురు సంక్షోభం ఆయా దేశాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఫలితంగా యూరప్‌ దేశాలు వలసలపై ఆంక్షలు అమల్లోకి తీసుకువస్తూనే, అప్పటికే ఆయా దేశాల్లో ఉన్న వలస ప్రజల కుటుంబాలు ఐక్యంగా ఉండేందుకు వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా వలస శ్రామికులు తమ స్వదేశాల్లోని కుటుంబాలను తమవద్దకు తీసుకురావడం మొదలుపెట్టడంతో 1970`80 మధ్యకాలంలో వీరి జనాభా బాగా పెరిగింది.

ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలనుంచి కుటుం బాలు వలస వచ్చిన తర్వాత వారి సాంస్కృతిక పరమైన వైఖరిలో మార్పు రావడం మొదలైంది. క్రమంగా గత దశాబ్దంలో ఈ వలసలకు చెందిన రెండోతరం యువత వివాహ వయసుకు చేరడం మొదలైంది. 1980 నుంచి యూరప్‌ దేశాలు ముస్లిం వలస సమస్యను ఎదుర్కొనడానికి ప్రధాన కారణం, చుట్టుపక్కల దేశాలనుంచి కేవలం రెండు మూడు గంటల ప్రయాణంతో ముస్లింలు ఐరోపా దేశాలను చేరుకునే సదుపాయం ఉండటం! క్రమంగా యూరప్‌లో మసీదుల సంఖ్య పెరగడం, బురఖాలు ధరించిన మహిళలు వీధుల్లో తిరుగుతుండటం వంటి కొత్త మతపరమైన వాతావరణం యూరప్‌లోకి ప్రవేశించింది. ఈ కొత్త మతాచారాలు సార్వభౌమాధి కారాన్ని ఖాతరు చేయని విధంగా రూపొందుతూ ఉండడంతో స్థానికులలో ఆలోచన మొదలయింది. అందుకు సమాధానంగా జాతీయవాద పార్టీలు బలోపేతమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ యూరప్‌ దేశాలపై ఈ వలసల ప్రభావం తీవ్రంగా ఉంది. మొదట్లో స్పెయిన్‌, ఇటలీ, గ్రీస్‌, మాల్టా వంటి దేశాలు మిగిలిన యూరప్‌ దేశాల్లోకి వలస ప్రవాహాలకు ముఖద్వారాలుగా కొనసాగాయి. కానీ 1990 నాటికి ఇవి అక్రమ వలసదారుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అయితే స్పెయిన్‌, ఇటలీలు వీరిని ‘రెగ్యులరైజ్‌’ చేశాయి. తర్వాత ఆయా దేశాలు వలసల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకున్నా అవి అప్రతిహతంగా కొనసాగాయి. ఫలితంగా ఇప్పుడు స్పెయిన్‌లో ఒక మిలియన్‌, ఇటలీలో అంతే సంఖ్యలో ముస్లింలు ఉన్నారంటే కారణం ఇదే. ఇటీవలి కాలంలో తీవ్ర విధ్వంసానికి గురైన దేశాల నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు వస్తుండటం యూరప్‌ దేశాలకు తలనొప్పిగా మారింది.

ఆరు కేటగిరీల ముస్లింలు

యూరప్‌లో ప్రస్తుతం ఆరు కేటగిరీల ముస్లింలు కనిపిస్తారు. కొన్ని శతాబ్దాలుగా యూరప్‌లో నివసిస్తున్న స్థానిక ముస్లింలు మొదటిరకం. ముస్లిం దేశాలనుంచి వచ్చిన విద్యార్థులు, వ్యాపారులు రెండో రకం. మొదట్లో ఏవి ధమైన ఆంక్షలు లేనప్పుడు వలస వచ్చిన ముస్లింలు మూడోరకం. వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన రెండో తరం ముస్లింలు నాలుగోరకం. 1950`60 మధ్య ప్రాంతంలో పశ్చిమ యూరప్‌నుంచి వలసవచ్చిన శ్రామిక ముస్లింలు ఐదోరకం. గడచిన ఐదేళ్ల కాలంలో శరణార్థులుగా వచ్చి ఆశ్రయం కోరుతున్న వారు ఆరోరకం. ఈవిధంగా యూరప్‌ సమాజంలో పెరుగుతున్న ముస్లిం జనాభా స్థానిక సంస్కృతీ సంప్రదాయాలతో మమేకం కాలేకపోవడం, తమ మతాచారాలు, ఇతర ప్రత్యేకతలను యథాతథంగా కొనసాగించాలన్న బలీయమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో యూరప్‌ సమాజం తమ సంస్కృతి విషయంలో అభద్రతా భావానికి గురికావడం కూడా ఈ జాతీయవాద పార్టీల ఆవిర్భావానికి కారణం.

హింసకు దారితీసిన ఆర్థిక మాంద్యం

1970 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం కారణంగా బ్రిటన్‌లో పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీలు, గనులు మూతపడినప్పుడు, వీధినపడ్డ కార్మికులు హింసకు పాల్ప డ్డారు. వీరిలో అధిక సంఖ్యాకులు ముస్లింలే. ఎందుకంటే ఎక్కువమంది వలస కార్మికులు వీరే. కాగా యూరప్‌ సమాజం తీవ్ర అలజడులకు లోనుకావడానికి 2004లో మాడ్రిడ్‌లో, 2005లో లండన్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ఒక కారణం. 1997లో ఫ్రాన్స్‌ సరిగ్గా ఇటువంటి ఉగ్రదాడులనే ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో యు.కె, హాలండ్‌ వంటి దేశాల్లో బహుళ సంస్కృతుల విధానాన్ని ప్రశ్నించడం మొదలైంది. ఫలితంగా చాలా దేశాలు బహుళ సంస్కృతి విధానానికి స్వస్తి పలికాయి. అయితే జర్మనీ టుర్కిష్‌, ఖుర్దులకు తమ జాతీయ పౌరులుగా అంగీకరించగా, ఫ్రాన్స్‌ సెక్యులర్‌ దేశంగా కొనసాగింది. వాస్తవానికి ముస్లింలు యూరప్‌ సమాజంలో విలీనం కావడానికి విముఖులు. ఇస్లాంను, యూరోపియన్‌ సంస్కృతితో మమేకం కాని ఒక ప్రత్యేక సంస్కృతిగా వారు పరిగణిస్తున్నారు. అందువల్ల యూరప్‌ దేశాలు ముస్లింలను తమ సమాజంలో విలీనం చేయడం కోసం అమలు పరచిన కార్యక్రమాలన్నీ విఫల మయ్యాయి.

యూరోపియన్‌ యూనియన్‌ దేశాల సామాజిక` ఆర్థిక సంస్కృతులతో వారు మమేకం కాకపోవడం సహజంగానే సామాజిక సంఘర్షణలకు దారితీస్తోంది. అయితే యూరోపియన్‌ సమాజంతో మమేకమై విజయాలు సాధించిన ముస్లింలు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య తక్కువ. ప్రస్తుతం యూరప్‌లో హింసకు, విధ్వంసానికి పాల్పడుతున్న వారు గుప్పెడు మంది మాత్రమే! మెజారిటీ ముస్లిం సమాజం ఇటువంటి విధ్వంస చర్యలకు చాలా దూరంగా ఉంటోంది. మరి ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్నదెవరు? రాడికల్‌ మసీదులు, జైళ్లు. 2004లో మాడ్రిడ్‌లో జరిగిన బాంబు పేలుడులో 192 మంది మరణిం చారు. ఈ దారుణానికి పాల్పడిరది ఉత్తర ఆఫ్రికా దేశాలకు చెందిన మొరాకో వర్గాలు. ఈ గ్రూపుకు అల్‌`ఖైదాతో సంబంధాలున్నాయని చెబుతారు. 2005లో లండన్‌లో జరిగిన బాంబు దాడులకు పాల్పడిరది రెండోతరం బ్రిటిష్‌`ముస్లింలు. అంటే పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లింల సంతానం. అల్జీరియా నుంచి వలస వచ్చిన ముస్లింల రెండోతరం ఫ్రెంచ్‌ ముస్లింలు, కార్టూనిస్ట్‌ ఛార్లెస్‌ హెబ్డో, యూదు వ్యాపారుల హత్యకు ప్రధాన కారణం. సిరియా, ఇరాక్‌లకు చెందిన ముస్లిం యువకులు ఎంతోమంది ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.లో చేరారు. వీరంతా యూరప్‌ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించినవారే. వీరిలో ముస్లింలుగా మతం మార్చుకున్న యూరోపియన్లు కూడా ఉన్నారు!

ముస్లిం సైద్ధాంతిక కర్తల్లో కొందరు జిహాదిజం, ఉగ్రవాదాలను ప్రోత్సహించడం వల్ల తీవ్రవాదం జడలు విప్పుతోంది. అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌, బోకోహరాం, సోమాలి అల్‌ షబాబ్‌ వంటి గ్రూపులు ఇట్లా ఏర్పడినవే! కొందరు యువకులు అకస్మాత్తుగా మతఛాందస వాదులుగా, టెర్రరిస్టులుగా తమకు తామే మారడం కనిపిస్తుంది. వీరికి తమ స్నేహితులు, కుటుంబాలతో ఏవిధమైన సంబంధాలుండవు. ఈ పరిణామాన్నే ఒలివర్‌ రాయ్‌ ‘‘జనరేషన్‌ రప్చర్‌’’ (ఛిద్రమైన తరం) అని వ్యవహరించారు. కాల్పనిక జగత్తులో ఉండే యువకులు తాము ‘‘జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి’’ ఎదిగి గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో దగ్గరి దారిగా ఈ ఉగ్రవాదాన్ని ఎంచు కుంటారు.

2015 జనవరిలో కార్టూనిస్ట్‌ చార్లెస్‌ హెబ్డోను హతమార్చిన తర్వాత ‘ప్రతీకారం తీర్చుకున్నాం’ అంటూ ఉగ్రవాదులు చేసిన నినాదాలే ఇందుకు ఉదాహరణ. ప్రముఖ సినీ నిర్మాత థియో వాన్‌ గోప్‌ాను హత్య చేసిన మహమ్మద్‌ బయోనీ కూడా ఈకోవకు చెందినవాడే. ఇతను హంగరీ దేశస్తుడు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యకు పాల్పడి తిరిగి పాక్‌కు వెళ్లిన వారిని అక్కడ హీరోలుగా పరిగణించడం కూడా ఈ కోవకే వస్తుంది.

ఎన్ని సంఘటనలను ఉదహరించినా, ఎన్ని సామాజిక కారణాలను చూపి నా, ప్రపంచం నేడు మత ఛాందస ఉగ్రవాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నదనేది తిరుగులేని సత్యం. ఇందుకు రుజువే ప్రస్తుత యూరప్‌ పరిణామాలు.

———————————————

నూపుర్‌కు సంఫీుభావం ప్రకటించినవాడు…

డచ్‌లో పార్లమెంట్‌కు నవంబర్‌ 22న జరిగిన ఎన్నికలలో వైల్డర్స్‌ రాజకీయ పార్టీ పీవీవీకి 37 స్థానాలు వచ్చాయి. అవి గత ఎన్నికలలో సాధించిన వాటి కంటే రెట్టింపు. వైల్డర్స్‌ను మరొక విధంగా కూడా గుర్తు చేసుకోవాలి. సంవత్సరం క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చినప్పుడు వైల్డర్స్‌ ఆమెకు తన సంఫీుభావం తెలియచేశారు. అసలు యావద్భారత దేశం ఆమె వెనుక నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడు కూడా ఆయన చాలా తీవ్రపదజాలంతో, ‘ఉగ్రవాదుల ముందు ఎప్పుడూ తలవంచవద్దు’ అన్నాడు. వైల్డర్స్‌ ముస్లిం వ్యతిరేకత, శరణార్థుల  పేరిట వచ్చే వారి పట్ల వైమనస్యం  కొత్తవేమీ కాదు. ఆయన నినాదమే నెదర్లాండ్స్‌ ఫస్ట్‌. ఇందులో చాలామంది హిట్లర్‌ వాదాన్నో, ముసోలినీ సిద్ధాంతాన్నో చూడవచ్చు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిక తెస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే అక్కడ ప్రజలు ఆయనను ప్రధానిగా కోరుకుంటూ   ఎక్కువ స్థానాలు కట్టబెట్టారు. ఇతర దేశాల వారికి ఆశ్రయం ఇచ్చే విధానం వెంటనే ఆపాలని ఆయన అంటున్నారు. అలాగే మదర్సాలను కూడా మూసివేయాలని మొదటి నుంచి ఉద్యమించారు. ఇలాంటి వైఖరి కారణంగా ఆయనకు ఇంగ్లండ్‌ ప్రవేశం నిరాకరించింది. ఇందుకు విస్తుగొలిపే కారణం ఉంది. ముస్లింల పవిత్ర గ్రంథం అనుచరులను హింసకు ప్రేరేపిస్తుందన్న ఇతివృత్తంతో నిర్మించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘ఫిత్నా’ రచయిత వైల్డర్స్‌. 2008లో ఈ చిత్రం వచ్చింది. దీని ప్రదర్శన లండన్‌లో ఏర్పాటు చేశారు. అయితే వైల్డర్స్‌ రావడానికి అనుమతి ఇవ్వలేదు. ఇస్లాం మీద వైల్డర్స్‌ తీవ్ర ఆరోపణలే చేశారు. ఉగ్రవాదాన్ని, మహిళలపై హింసను, అదే క్రమంలో నెదర్లాండ్స్‌లో ఇస్లాం ప్రభావం గురించి ఆ చిన్న చిత్రంలోనే వైల్డర్స్‌ తెలియచేశారు.

  • జమలాపురపు విఠల్‌రావు
    సీనియర్‌ జర్నలిస్ట్‌ 

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram