‘ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ ఆగస్ట్‌ 5,2019న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను సుసంపన్నం చేసేదే గాని విచ్ఛిన్నం చేసేది కాదు. అంతేకాదు, ఆ ఆర్టికల్‌ తాత్కాలికమైనదేనని కేంద్రం సరిగానే గుర్తించింది కూడా.’ డిసెంబర్‌ 12, 2023న భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఇదే కీలకం. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆ ఆర్టికల్‌ను రద్దు చేయడం చెల్లదని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు కీలకమైన ఈ తీర్పును వెల్లడిరచింది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. పండిత్‌ల హత్యాకాండ గురించి దర్యాప్తు చేయించాలంటూ గత కొద్దికాలంగా ఆ వర్గం చేస్తున్న న్యాయపోరాటం కూడా ఈ తీర్పుతో ఒక కొలిక్కి వచ్చినట్టయింది. 1989 నాటి ఆ హత్యాకాండపై దర్యాప్తు సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానమే గతంలో పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇప్పుడు దర్యాప్తు బృందాన్ని నియమించక తప్పదు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఎన్నికల ద్వారా దేశ ప్రజానీకం ఇచ్చిన తీర్పు దేనినీ అంగీకరించడానికి కాంగ్రెస్‌ సహా ఏ విపక్షమూ దేశంలో సిద్ధంగా లేదు. ఆ తీర్పుల మీద తమ అంతరంగాలను వెల్లడిరచడం వేరు. వ్యతిరేకంగా ‘పోరాటం’ చేయడం వేరు. 370, 35 (ఎ) అధికరణా లను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులకు ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఎందరో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తను తీర్పును ఏకగ్రీవంగానే వెల్లడిరచింది. ఏడుగురు సభ్యులు ఉన్న ఉన్నత ధర్మాసనానికి కేసును పంపడానికి సుప్రీం కోర్టు మార్చి 2,2020న నిరాకరించిన విషయం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం తాము ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుతో ఏకీభవిస్తూనే విడిగా తీర్పులు ఇచ్చారు. అందులో జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ ఇచ్చిన తీర్పు పండిత్‌లు, కశ్మీర్‌ ఉగ్రవాద బాధితులకు వరప్రసాదమే. ఈ కేసులో ఆగస్ట్‌ 2,2023 నుంచి రోజువారి విచారణ ఆరంభమైంది.

తమ వాదనలకు అరవై గంటల సమయం అవసరమవుతుందని పిటిషనర్‌ల తరుఫున ఒక విన్నతి ధర్మాసనానికి చేరింది. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌ (ట్రిపుల్‌ తలాక్‌ నిషేధానికి వ్యతిరేకంగాను, హిజాబ్‌కు అనుకూలం గాను కేసులలో వాదించినది కూడా ఈయనే), గోపాల్‌ సుబ్రమణియం, రాజీవ్‌ ధావన్‌, దుష్యంత్‌ దవే, శేఖర్‌ నఫాడే, దినేశ్‌ ద్వివేది, జఫార్‌ షా, సీయూ సింగ్‌, ప్రశాంత్‌చంద్ర సేన్‌, సంజయ్‌ పారిఖ్‌, గోపాల్‌ సుబ్రమణియన్‌, మేనకా గురుస్వామి, నిత్యా రామకృష్ణన్‌, పీవీ సురేంద్రనాథ్‌ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైనాయి. రాజకీయ పక్షాలు, ప్రైవేటు వ్యక్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. 370 రద్దు తరువాత అక్కడ కొత్తగా అమలవుతున్న రిజర్వేషన్లు, సాధించిన పురోగతి, మెరుగుపడిన శాంతిభద్రతలు, సుస్థిరత వంటి అంశాలతో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి ఒక అఫిడవిట్‌ కూడా సమర్పిం చింది. జమ్ముకశ్మీర్‌ శాసనసభా స్థానాల పునర్‌ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల అంశం మీద ఇటీవల రాజ్యసభలో చర్చ జరిగిన సమయంలో కేంద్ర హోంమంత్రి వెల్లడిరచిన అంశాలు ఆ వాస్తవాన్ని నిర్ధారిస్తున్నాయి. లోయలో వీధివీధినా సాగిన అల్లర్లు, రాళ్లు విసిరే సంఘటనలు తగ్గుముఖం పట్టాయని, ఇవన్నీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు చేయించినవేనని ఆయన చెప్పారు. ఇప్పుడు అదంతా గతమని కూడా అన్నారు. రాళ్లు విసిరే సంఘటనలు 2018లో 1767 నమోదు కాగా, 2023 నాటికి ఒక్కటి కూడా జరగలేదని ఆయన చెప్పారు.

పిటిషనర్ల అన్ని వాదనలను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాల మీద ఒక విహంగ వీక్షణం చేయాలి. 370, 35(ఎ) అధికరణా లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమే. ఆ అధికరణాలను కాలగర్భంలో కలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడమూ చెల్లుబాటు అవుతుంది.

అలాగే, 370 అధికరణాన్ని రద్దు చేస్తూ 370(3) కింద ప్రకటన వెలువరించే అధికారం భారత రాష్ట్రపతికి ఉందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అనుమతి తీసుకోవలసిన అవసరం కూడా లేదని ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్‌ విలీనం తాత్కాలికమే వంటి వాదనలతో ఏకీభవించడం లేదని కూడా ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఇదంతా కేంద్ర ప్రభుత్వ విజయంగానో, వేరే వారి పరాజయంగానో భావించడం కంటే, దేశ సమగ్రతకు లభించిన విజయంగా పేర్కొనడం సబబు. దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కుహనా మేధావులు, బుజ్జగింపు ధోరణులు చేస్తున్న వాదాలకు మాత్రం చెంపపెట్టు. జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగ పరిషత్‌ ఉనికిలో లేదు కాబట్టి 370 అధికరణం రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పడం వింతేననిపిస్తుంది. అలా అయితే భారత రాజ్యాంగ పరిషత్‌ లేదు కాబట్టి రాజ్యాంగంలో రద్దు చేసిన అంశాలు, సవరణలు చెల్లవని చెప్పడం సాధ్యమా? దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు జమ్ముకశ్మీర్‌ భిన్నమైనది కాదని కూడా ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంటే దానికి ప్రత్యేక సార్వభౌమత్వం అంటూ ఏమీ లేదు. అసలు కశ్మీర్‌ సంస్థానాధీశుడు హరిసింగ్‌ కశ్మీర్‌ను విలీనం చేసినప్పుడు సార్వభౌమత్వం కొనసాగుతుందన్న షరతులేమీ పెట్టలేదని కూడా ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేశారు. అసలు నవంబర్‌ 25, 1949న జమ్ముకశ్మీర్‌ విడుదల చేసిన ప్రకటనలో భారత రాజ్యాంగమే తమకు సర్వోన్నతమనే పేర్కొన్నది. అది భారత్‌లో ఒక రాష్ట్రమని ఆర్టికల్‌ 1 కూడా తెలియచేసింది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌కు అక్కడ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

తీర్పును దాదాపు బీజేపీ వైరి పక్షాలన్నీ వ్యతిరేకించడం విశేషం. ఇటీవలనే బీజేపీకి దగ్గరయ్యారని అంతా భావించిన గులాం నబీ అజాద్‌ కూడా తీర్పు విచారకరమే అయినా, అంగీకరిస్తామని స్పష్టం చేశారు. యథాప్రకారం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తీర్పు పట్ల అసహనమే ప్రకటించారు. తీర్పు దారి తీర్పుదే. మన పోరాటం మనదే అన్నట్టే మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వి ఈ తీర్పును తాము ఆమోదించడం లేదనే ప్రకటించారు. డీఎంకే అయితే తాము అధికారంలోకి వస్తే  (బహుశా ఇండియా కూటమి) 370ని పునరుద్ధరిస్తామని ఉచిత హామీ ఒకటి పడేసింది. ఈ అంశం మీద కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగానికి వంకలు పెట్టేందుకు రాహుల్‌ గాంధీ ప్రయత్నించడం పెద్ద వికృతి. చరిత్రను తిరగ రాయవద్దని ఆయన వ్యాఖ్య. కానీ ‘370 అధికరణం సంధికాలపు ఏర్పాట్లలో ఒకటి మాత్రమే. ఆ సంగతిని ఈ సభ గుర్తుంచుకోవాలి’ అని నవంబర్‌ 27,1963న లోక్‌సభ చర్చలో ప్రకటించిన సంగతి కూడా చరిత్రలోనే ఉంది. ఆ సంగతి రాహుల్‌ తెలుసుకోవాలి.

ప్రధాని మోదీ వ్యాఖ్య దేశ సమగ్రత పునాదిగానే ఉంది. ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ స్ఫూర్తికి సుప్రీం కోర్టు తీర్పు మద్దతునిచ్చిందని మోదీ శ్లాఘించారు. మోదీ వ్యాఖ్య ఆయన గాఢంగా విశ్వసిస్తున్న రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిబింబించేది మాత్రమే కాదు. నాటి రాజ్యాంగ సభ పరమోద్దేశం కూడా. భారతీయ జనసంఫ్‌ు మొదటి నుంచి జమ్ముకశ్మీర్‌ సంపూర్ణం విలీనం పేరుతో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసింది. జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు కూడా. జనసంఫ్‌ు కావచ్చు, తరువాత దాని పునాదులపై ఏర్పడిన బీజేపీ కావచ్చు. కశ్మీర్‌ను కేవలం పాలనా విధానంలో భాగంగానో, రాజకీయ ప్రయోజనంగానో పరిగణించలేదు. అదొక ఉద్విగ్న అంశంగానే, సమగ్ర భారత నిర్మాణంలో భాగంగానే పరిగణించాయి. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, అటల్‌ బిహారీ వాజపేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ కశ్మీర్‌ అంశం గురించి ఒక అవిశ్రాంత పోరాటమే చేశారు. బీజేపీ ఏం చేసినా దానిని బుజ్జగింపు రాజకీయాల చట్రం నుంచి చూసే విపక్షాలు కశ్మీర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ బీజేపీకి ఉన్న సిద్ధాంత పటిమ, సిద్ధాంతానికి కట్టుబడి ఉండే తత్త్వం మూలంగా ఇప్పుడు భారత్‌ పరిధి వరకు జమ్ముకశ్మీర్‌ భారత్‌లో పూర్తి స్థాయిలో అంతర్భాగమైంది. నిజానికి భారత పార్లమెంట్‌ నిర్ణయంతో అది 2019లోనే జరిగినా, భారత అత్యున్నత న్యాయస్థానం తాజా తీర్పుతో ఆ నిర్ణయం తిరుగులేనిదిగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది.

ఇదంతా ఒక ఎత్తయితే, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వేరుగా ఇచ్చిన తీర్పునకు ఉన్న విశేషమైన ప్రాధాన్యం మరొక ఎత్తు. లోయలో జరిగిన పండిత్‌ల హత్యాకాండ, అక్కడ నుంచి వారు వేలాదిగా తరలిపోవడం గురించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో జస్టిస్‌ కౌల్‌ తీర్పు వారికి సాంత్వన కలిగించేదే. సెప్టెంబర్‌ 1990లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతులో హతమైన టికాలాల్‌ టప్లూ కుమారుడు అశుతోష్‌ టప్లూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనినే జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇలాంటి మరొక పిటిషన్‌ను అప్పటికి ఒక వారం ముందే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తన వ్యాజ్యాన్ని స్వీకరించకపోవడంతో అశుతోష్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 1989`2003 మధ్య జరిగిన హిందువులు, సిక్కుల ఊచకోతలపై ప్రత్యేక దర్యాప్తు నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించ వలసిందని ఈ పిటిషన్‌లో అశుతోష్‌ కోరారు. మూడు దశాబ్దాల కాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సాధ్యం కాదని, సాక్ష్యాలు సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడిరది. నిజానికి జూలై, 2017లో కూడా కశ్మీరీలు ఇలాంటి ప్రయత్నం ఇంకొటి కూడా చేశారు. రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌ అనే సంస్థ పండిత్‌ల హత్యలపై సిట్‌ను నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. చాలా చిత్రం 27 సంవత్సరాల తరువాత ఇలాంటి దర్యాప్తు జరపడం గురించి కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పైన పేర్కొన్న టికాలాల్‌ టప్లూను జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ శ్రీనగర్‌లోని ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసింది. వృత్తికి న్యాయవాది అయిన టప్లూ అప్పుడు బీజేపీ సభ్యుడు కూడా. అదే సంవత్సరం (1989) నవంబర్‌ 4న మక్బూల్‌ భట్‌కు మరణశిక్ష విధించిన జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి నీలకంఠ గంజూను ఆ కోర్టు ప్రాంగణం దగ్గరే చంపారు. జనవరి 4, 1990న శ్రీనగర్‌ కేంద్రంగా వెలువడే దినపత్రిక ఆఫ్తాబ్‌ ఒక దారుణమైన ప్రకటన వెలువరించింది. హిజ్బుల్‌ ముజాహుదీన్‌  హిందువు లంతా లోయను వీడి పోవాలంటూ ఇచ్చిన ప్రకటన అది. ఏప్రిల్‌ 14,1990న అల్‌ సఫా అనే మరొక పత్రిక కూడా ఇదే విధమైన ప్రకటన జారీ చేసింది. ఇలాంటి హత్యలు, బెదిరింపుల మూలంగా 90,000 నుంచి 1,00,000 మంది పండిత్‌లు లోయ వీడి పోయారు. మొత్తం పండిత్‌ల జనాభా 1,20,000 నుంచి 1,40,000. మూడు దశాబ్దాలలో 1764 మంది హిందువులను వేటాడి ఉగ్రవాదులు చంపారు. వారిలో 90 మంది వరకు పండిత్‌లు. అయితే ఈ లెక్క ఒకే విధంగా లేదు. లోయను వీడిని పండిత్‌లు మూడు లక్షలని కూడా చెబుతారు. అలాగే మరణాలు కూడా ప్రభుత్వం చెబుతున్నదాని కంటే ఎక్కువే.

తాజాగా జస్టిస్‌ కౌల్‌ ఇచ్చిన తీర్పునకు పూర్తి స్థాయి మానవ హక్కుల హననం కోణం ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సాగించిన మానవ హక్కుల హననం మీద ప్రత్యేక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని 121 పేజీల తన తీర్పులో జస్టిస్‌ కౌల్‌ రాశారు: 1980 దశకంలో కశ్మీర్‌ లోయలో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఉండేవి. అందువల్ల చాలామంది సొంత ఇళ్లను వదిలి వలసపోవలసి వచ్చింది. పండిత్‌ల వలస వల్ల కశ్మీర్‌లో సాంస్కృతిక వాతావరణం మారిపోయింది. నాటి పరిస్థితుల తీవ్రత వల్ల ఒక దశలో భారత సార్వభౌమాధికారం కూడా సందిగ్ధంలో పడిపోయింది. సమైక్యత ప్రశ్నార్థకమైంది. సైన్యాన్ని రంగంలోకి దింపవలసి వచ్చింది. ఆ రాష్ట్రంలోని చిన్నారులు, స్త్రీలు, పురుషులు అంతా చాలా నష్టపోయారు. ఈ గాయాలను మానిపించవలసిన సమయం వచ్చింది.

విచారణ సంఘం ఏర్పాటు చేయడం వల్ల, బాధితులు తమ దుఃఖం గురించి చెప్పుకునే అవకాశం వస్తుంది. దానితో దోషులు తమ తప్పును తెలుసుకునే అవకాశం ఉంటుందని జస్టిస్‌ కౌల్‌ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో ఇలాంటి ట్రూత్‌ రికన్సియలేషన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. జస్టిస్‌ కౌల్‌ తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఉంది. కశ్మీరీల హృదయం గెలుచుకోవా లని పదే పదే చెప్పే ఉదారవాదులు ఏనాడూ పండిత్‌ల దుస్థితి గురించి మాట్లాడలేదు.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram