తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలలో కొమరవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. కుమారస్వామి కొంత కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల కుమారవెల్లి అని పేరు వచ్చి, కాలక్రమంలో ‘కొమరవెల్లి’గా, వాడుకలో ‘కొమ్రెల్లి’గా మారిందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని అపర శ్రీశైలంగా భావిస్తారు. అక్కడికి వెళ్లలేని వారు ఈ మల్లన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారంనాడు కల్యాణోత్సవంతో మొదలయ్యే వార్షిక జాతర ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) వరకు కొనసాగుతుంది. జాతర ప్రారంభం నాడే మల్లన్న కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు నెలల తరువాత ‘అగ్నిగుండాలు’ అనే కార్యక్రమంతో ముగుస్తాయి.
జానపద సంప్రదాయాలకు కాణాచిగా పేర్కొనే తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలకు కొమరవెల్లి మల్లికార్జునస్వామి జాతర మచ్చుతునక. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే ఆనవాయితీ ప్రకారం, సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రం కొమరవెల్లిలో 11వ శతాబ్దంలో ఇంద్ర కీలాద్రి అనే కొండపై పరమశివుడు మల్లికార్జున స్వామిగా వెలసినట్లు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. మల్లన్న మామూలుగా సంప్రదాయబద్ధంగా కనిపించే లింగాకారంలో కాకుండా శిరస్సున పడగవిప్పిన నాగేంద్రుడు ఛత్రంగా, కోరమీసాలతో గంభీర రూపుడిగా, కోరమీసాలతో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. మణి-మల్ల అనే రాక్షసులను సంహరించేందుకు ••రమేశ్వరుడు మల్హాసురుగా అవతరించినట్లు బ్రహ్మాండ పురాణగాథ చెబు తుండగా, ఆయన శివుని కుమారుడని, ఎల్లమ్మకు సోదరుడని మల్లన్న జానపద• కథలో వస్తుంది.
వీరశైవమతారాధకులు మాదిరాజు, మాదమ్మ దంపతులకు పుత్రుడిగా జన్మించిన పరమేశ్వరుడు తన మహిమలతో భక్తులను కాపాడాడని, కాపాడుతున్నాడని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. శివాంశసంభూతుడు శిరస్సున నాగేంద్రుడు పడగ విప్పి కనిపిస్తాడు. మల్లన్న పరమేశ్వరుడి అవతారమైన మార్తాండ భైరవుడు అని చెబుతారు. ఆయనను మహరాష్ట్రీయులు ఖండోబా అనే పేరిట పూజిస్తారు. ఆ రాష్ట్రంలోని నాందేడ్‌ ‌జిల్లా మాలెగావ్‌ ‌ప్రాంతంలో ఖండోబా (మల్లికార్జున స్వామి) ఆలయపూజారికి స్వామి కలలో కనిపించి ‘కొమరవెల్లి కొండ గుహలలో వెలసినట్లు’ చెప్పడంతో ఆ పూజారి ఇక్కడి వచ్చి, అక్కడ శివలింగం ఉండడంతో పూజాదికాలు మొదలు పెట్టారట. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పెరిగిన పుట్ట మట్టితోనే మాలెగావ్‌లోని స్వామి విగ్రహం తరహాలో ఇక్కడ మూర్తిని తయారు చేశారని తమ పూర్వికులు చెప్పినట్లు ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. వందల ఏళ్లనాటి మృత్తికా విగ్రహం నాటి నుంచి పూజలందుకుంటున్నప్పటికీ చెక్కు చెదరకపోవడాన్ని విశేషంగా పేర్కొంటారు. మల్లన్న ఆలయాలు గ్రామ పొలిమేరల్లోనో, అడవుల్లోనో ఉంటాయి. కొత్తగా చేపట్టే ఆలయాలను ఊరి చివరే కట్టడం ఆనవాయితీ వస్తోంది. తమను అన్ని విధాల ఆదుకునే మల్లన్నను జానపదులు ‘గ్రామరక్షకుడు’గా పరిగణిస్తారని పెద్దలు చెబుతారు. ‘కోరిన వరాలు ఇచ్చే కొండలలో వెలసిన కొండంత దేవుడు. నమ్మిన కొలిచిన వారిని నిరంతరం వెన్నంటి ఉంటూ సదా రక్షిస్తూ ఉంటాడు’ భక్తుల విశ్వాసం.
రెండు విధాల పూజలు
మల్లన్న దేవుడు యాదవ, లింగబలిజ సామాజిక వర్గాలకు చెందిన కేతమ్మ, మేడాలమ్మలను పెళ్లాడాడని కథనం. ఆ బాంధవ్యంతోనే ఆయా సామాజిక వర్గాల వారే ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక్కడ రెండు రకాలు పూజా విధానాలు ఉన్నాయి. ఒకటి వీరశైవ ఆగమ శాస్త్ర విధానం కాగా, మరొకటి ఒగ్గు పూజారులు పూజా విధానం. మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు ఆలయం తోటబావి ప్రాంగణంలో జరిగే మల్లన్న కేతమ్మ మేడాలమ్మ కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. కల్యాణోత్సవాన్ని వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. రెండు వంశాల వారు అంటే… పగిడన్న వంశీయులు స్వామి వారి తరపున, మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపున పెళ్లి తంతు నిర్వహిస్తారు.ఈ వార్షిక సంబరాలు స్వామి వారి కల్యాణోత్సవంతో మొదలై అగ్నిగుండాలనే కార్యక్రమంతో ముగుస్తాయి.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు
మకర సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాలలో మల్లన్న జాతర జరుగుతుంది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బోనం, ‘పట్నం’ అనే విశేష కార్యక్రమాలలో మొక్కుబడులు సమర్పించు కుంటారు. సంక్రాంతి తరువాతి ఆదివారాన్ని ‘పట్నం’ వారంగా, రెండవ ఆదివారాన్ని బోనాలను లష్కర్‌ ‌వారం అంటారు. ఆ రెండు రోజులు జంటనగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా, తమ ఆడబిడ్డ మేడలాదేవిని మల్లన్న వివాహమాడినందున ఈ వారాన్ని యాదవులు అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. అలంకరించిన కొత్త కుండలో అన్నం వండి స్వామివారికి నివేదించడాన్ని బోనం అంటారు. పురుషులు ఎల్లమ్మ అవతారంలో చీర, గవ్వల పట్టీలు ధరించి బోనాలు సమర్పిస్తారు.
ఆయన సోదరిగా భావించే రేణుకాదేవికి బోనాల సమర్పణకు పసుపు కుంకాలతో అలంకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టుకుని భక్తులు బారులు తీరుతారు. కొందరు గజ్జెల లాగులు ధరించి వీర భద్రుడి వేషంలో వస్తారు. మరి కొందరు శివసత్తుల లాగా వస్తారు. వారి పాదతాడ నంతో పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. బోనం కుండలను శుభ్రపరచి పాలు పితకడం లాంటి నిత్యావసరాలకు ఉపయో గిస్తారు. అలా చేయడం వల్ల సంపద, ఆరోగ్యం, పశుగణాభివృద్ధి కలుగుతుందని విశ్వాపం.
జాతర చివరిలో అంటే కామదహనం (హోళీ) పండుగకు ముందు ‘పెద్ద పట్నం’ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రకృతి సిద్ధమైన అయిదు రంగులతో వేసే ముగ్గులను ‘పట్నం’అని, అదే పరిమాణంలో భారీగా ఉంటే ‘పెద్ద పట్నం’ అంటారు. విశాలమైన ముగ్గు మధ్యకి స్వామిని ఆవాహన చేసి సామూ హికంగా ఒగ్గులు వాయిస్తూ స్వామిని కీర్తిస్తారు (‘పట్నం’లో వాడిన ముగ్గును జాతర తరువాత సేకరించి పంటపొలాల్లో చల్లుతారు).
మహాశివరాత్రిని లింగోద్భవ వారంగా వ్యవహరిస్తారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఒగ్గు పూజారులు 49 వరుసలతో పెద్ద ‘పట్నం’ (ముగ్గు) వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మల్లన్నస్వామి ఆలయానికి కొంత చేరువలో కొండపై కొలువుదీరిన రేణుకాదేవిని ఆయన సోదరిగా భావించి భక్తులు బోనాలు సమర్పిస్తారు, జాతర నిర్వహిస్తారు.
స్వామి వారి ఎడమ చేతి గిన్నెలోని భండారు (పసుపు పొడి)ను పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఆలయాన్ని సందర్శించే వారంతా తప్పనిసరిగా ‘భండారు ప్రసాదం’ స్వీకరిస్తారు.
ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు స్వామి వారి ప్రతిష్ఠ నాడే అంకుర రూపం దాల్చిందని చెబుతారు. స్వామిని దర్శించుకునే ముందు ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. మొక్కుబడిగా కొబ్బరికాయను వస్త్రంలో చుట్టి దానికి కడతారు. రావిచెట్టుకు, అక్కడి ‘వరాల బండ’కు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆలయం ఎదురుగా రథం ఆకారంలో గల కట్టడాన్ని మల్లన్న రథంగా భావించి పూజిస్తారు.
ఉగాది ముందు ఆదివారం నిర్వహించే అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది. ఆ రోజు రాత్రి భారీ పరిమాణంలో సమిధలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేసి కణకణలాడే నిప్పుల మీదుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మూడుసార్లు దాటిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వారిని అనుసరించి, మల్లన్న దర్శనం చేసుకుంటారు.
గతంలో ఇక్కడ ఈ మూడునెలలో ఏడు వారాల పాటే జాతర (సత్తేటి వారాల జాతర) జరిగేదట. భక్తుల రద్దీ కూడా అంతంత మాత్రమే కావడంతో ఆలయం ఈ మాసాల్లోనే ఆలయం తెరిచి ఉండేది. రానురాను జాతర సమయంతో పాటు ఇతర సమయాల్లోనూ భక్తుల రద్దీ పెరగడంలో నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నీటి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మల్లన్న సాగ’ అని పేరు పెట్టింది.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్‌ ‌నుంచి సుమారు 85 కి.మీ., వరంగల్‌ ‌నుంచి 110 కి.మీ., సిద్ధిపేట నుంచి 24 కి.మీ. దూరంలోని ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్‌ ‌వాహనాలు అందుబాటులో ఉంటాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలోని ఆకర్షించే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొండ పోచమ్మ ఆలయానికి జాతర సమయలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మల్లన్న ఆలయానికి సుమారు 28 కి.మీ. దూరంలోని కోటి లింగేశ్వర స్వామి, సుమారు 45 కి.మీ. దూరంలోని వర్గల్‌లోని శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం ఉంది. తెలంగాణలో బాసర తరువాత విశేష ప్రాచుర్యం పొందిన జ్ఞాన దేవత ఆలయం ఇది.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram