పుట్టిన గడ్డను, మూలాలను మరచిపోవడమంటే వ్యక్తి తన అస్తిత్వాన్ని విస్మరించడమే. ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తున్న ఈ అవలక్షణంతోనే దేశంలోని గ్రామాలు నిర్లక్ష్యానికి, దారిద్య్రానికి లోనవుతున్నాయి. తమ సమస్యల గురించి అడిగే నాథుడు లేక, తమను ఆ దుస్థితి నుంచి బయటకు తెచ్చేవారు కానరాక తల్లడిల్లుతున్న అలాంటి వారికి తోడ్పడేందుకు, అభివృద్ధిపథంలో నడిపించేందుకు ముందుకు వచ్చిన నేత పైడి రాకేశ్‌రెడ్డి. సమాజసేవ, ధార్మికతలను సమానంగా చూడగలుగుతున్న అరుదైన రాజకీయ నాయకుడు. సగం జీవితం కుటుంబానికి ఇచ్చాక, మిగిలిన సగం సమాజ సేవలో గడిపేందుకు వచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆర్మూరు నుంచి బీజేపీ అభ్యర్ధిగా  ఘనవిజయం సాధించిన ఆయన తన నియోజకవర్గాన్ని సుసంపన్నం చేయాలనే తపనతో ఉన్నారు. రాజకీయాలలోకి తాను రావడానికి ఉన్న నేపథ్యం, భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన ‘జాగృతి’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ …..

చిన్నప్పుడు కష్టాలు చూశారు. తర్వాత పారిశ్రామికవేత్తగా నిలబడ్డారు. అట్లాంటిది మిమ్మల్ని రాజకీయాల వైపుగా నడిపించిన శక్తి ఏది?

కనిపిస్తున్న పరిస్థితులు, పరిణామాలే. దేశమంటే మనుషులోయ్‌ అన్నాడొక కవి. కానీ దేశమంటే మనీ అనే రీతిలో ఉంది పరిస్థితి. సగం జీవితాన్ని నా కోసం, నా కుటుంబం కోసం వెచ్చించాను. మిగిలిన సగాన్ని సమాజ సేవకోసం వెచ్చించాలని నిర్ణయించు కున్నాను.

అనేక పార్టీలు ఉన్నాయి. కానీ మీరు బీజేపీని ఎంచుకోవడానికి కారణం?

ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలే ఉన్నాయి. ఇంకా ఉన్నా అవి కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌, టీిఆర్‌ఎస్‌` రెండూ ఒకటే. తనకు మంత్రి పదవి రానందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టుకున్న పార్టీ అది. సమాజం పట్ల ఎటువంటి ప్రేమ లేకున్నా, ఇక్కడ రగులుతున్న ఒక సమస్యను తీసుకుని ప్రాంతీయ పార్టీ పెట్టారాయన. నేను వేరే సందర్భంలో కూడా చెప్పాను, అది ఒక కుటుంబం కోసమే పెట్టిన పార్టీ.

ఇక కాంగ్రెస్‌ పార్టీ. దేశ విచ్ఛిన్నమంతా దానితోనే కదా! అన్ని అవలక్షణాలూ ఉన్న వ్యక్తిని తొలి భారత ప్రధానమంత్రిని చేసింది. అది జరిగిన మరురోజే దేశ విభజన వల్ల లక్షలాది హిందువుల మీద నరమేధం, అత్యాచారాలు జరిగాయి. నేను పుట్టకముందే అవన్నీ జరిగినా, అవి చదివినప్పుడు నా మనసుకు తగిలిన గాయాలింకా ఉన్నాయి. ఖలిస్తాన్‌ సమస్య మరొకటి. భింద్రన్‌వాలేని పెంచి పోషించడం కావచ్చు, కశ్మీరీ పండిట్ల నరమేధం కూడా నన్ను కలచివేశాయి. ఈ వాస్తవాలే నన్ను ఆ పార్టీ వైపు పోకుండా నిలువరించాయి.

మూడవది బీజేపీ. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెగ్డెవార్‌ పూర్వికులది మా జిల్లా (నిజామా బాద్‌)యే. కందకుర్తి గ్రామం. అలాంటి మహాత్ముడు పుట్టిన గడ్డ మీదే పుట్టాను నేను. ఆ నేలపై పుట్టడమే అదృష్టం. విద్యార్థిదశలో కొంతకాలం స్వయం సేవకుడిగా ఉన్నాను. నిరంతరం ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించే సంస్థ ఆరెస్సెస్‌. దానితో పాటు జనసంఫ్‌ు. తర్వాతి పరిణామాలు, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఇవన్నీ తెలిసిందే. భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ` దేశం కోసం పుట్టిన పార్టీ. దేశ రక్షణ కోసం తపించే పార్టీ. ఎన్ని మతాలు, జాతులున్నా, ఇబ్బందులున్నా దేశాన్ని కాపాడు కోవాలని చెప్పే ఏకైక పార్టీ. దేశంతో పాటు ధర్మం, న్యాయం, విలువల పరిరక్షణ ఆశయంతో పుట్టిన పార్టీ. ప్రపంచానికి ఈ మూడే కావాలి. దేశానికి భద్రత ఉండాలి. నియమాలతో బతకడానికి ధర్మం ఉండాలి. ధర్మం సంస్కారాన్ని నేర్పుతుంది. అవన్నీ బీజేపీలో ఉన్నాయి. కానీ మిగిలిన పార్టీలలో ఒకటి కుటుంబ కేంద్రితం, ఇంకోటి వ్యక్తి కేంద్రితం. కాబట్టి సిద్ధాంతాన్ని బట్టి భారతదేశం ఉన్నంతవరకూ అఖండ జ్యోతిలా వెలుగుతుందనే నమ్మకంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను.

మీ ఎన్నికల విజయాన్ని ఎలా అంచనా వేస్తారు? ఎవరికి అంకితం చేస్తారు? మీ సిద్ధాంతం గెలిపించిందా? సేవా కార్యక్రమాలా? మోదీ కీర్తిప్రతిష్ఠలా?

దేశవ్యాప్తంగా మోదీగారి కీర్తికి ఎక్కడా లోటులేదు. ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, నా గెలుపునకు కారణమైన ఆర్మూరు నియోజకవర్గంలోని 87 గ్రామాల ప్రజలకు ఈ విజయాన్ని అంకితం చేస్తాను. నేను రాజకీయాలలోకి వచ్చి నాలుగు నెలలైంది. నేను ఎక్కడ పుట్టానో, ఎవరో తెలియదు. కానీ మాజీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు, అహంకారం, అవినీతి కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న వారంతా నన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. నా మాటలను విశ్వసించి నాకు ఓటు వేశారు. వారే నా కుటుంబం. నా గెలుపు కోసం ఎందరో అజ్ఞాతంగా పని చేశారు.

ఈ ఎన్నికల సమయంలోనూ హిందూధర్మాన్ని పార్టీలు అవమానించాయి. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడేమో, మైనార్టీలు అడక్కపోయినా హిందూ ఆలయాల భూములు అమ్మి సంక్షేమం చేపడతానని చెప్పాడు. ఇంకొకరు కాంగ్రెస్‌ అంటేనే ముస్లింల పార్టీ అంటూ విజ్ఞతను మరచి మెజారిటీలను అవమానించారు. ఇవన్నీ నేను భరించలేకపోయాను. ధర్మమే లేకపోతే ఎటుపోతారు, ఎక్కడ బతుకుతారు అని నా ప్రజలకు చెప్పాను. ఈ ప్రపంచం మొత్తంలో హిందువులకు ఉన్నది ఒకటే ఇల్లు (భారత్‌). దీనిని కూడా తగులబెట్టుకుంటే, ధ్వంసం చేసుకుంటే భవిష్యత్‌ తరాలకు కష్టం అని చెప్పగలిగాను. అలాగే, దేశమే లేకపోతే తెలంగాణ ఎక్కడ ఉంటుంది? తెలంగాణ లేకపోతే ఆర్మూరు ఎక్కడుంటుంది? వారు దానిని స్వీకరించారు. నన్ను ఎన్నికల్లో ఓడిరచాలని ఎందరో భావించినా నేను నమ్ముకున్నది ఒకటే` ధర్మం, దైవం. దైవమాశీర్వదించాడు, ధర్మం గెలిచింది. అదే నా గెలుపు!

మీ మాటలను బట్టి ఇంకో ప్రశ్న, భారత రాజకీయాలలో ధర్మం పాత్ర ఎలా ఉంది? ఎలా ఉండాలనుకుంటున్నారు?

వాస్తవానికి ధర్మం దెబ్బతిన్నది, అగాథపు అంచుల్లో ఉంది. దానిని కాపాడుకోవలసిన బాధ్యత మనది. మనం కళ్లు తెరిచి ధర్మాన్నీ, దేశాన్నీ, న్యాయాన్నీ కాపాడుకుంటామా లేదా అన్నదే ప్రశ్న. కేవలం 15 శాతం మంది అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరనివ్వమంటూ సవాలు చేశారు సరే, అయినా 85 శాతం మంది మౌనంగా ఎందుకున్నారు? మీ హక్కుల గురించి, ధర్మం గురించి అడగరా? ప్రజలలో జాగృతిని, చైతన్యాన్ని తీసుకువచ్చేందుకే నేను రాజకీయాలలోకి వచ్చాను.

బీజేపీ అంటే అటు ప్రగతి, సేవనూ ఇటు ధర్మాన్నీ కాపాడడమన్న విధానం కనిపిస్తోంది. ఇది మీ భవిష్యత్‌ ప్రణాళికలో ఎలా ఉండబోతోంది?

ప్రధాని చక్కటి దిశా నిర్దేశం చేశారు దేశానికి. ఒక జాతికి మణులు, మాణిక్యాల కన్నా ప్రధానమైంది ఆత్మగౌరవం. దానిని ఆయన నిలబెట్టారు. రెండవది దేశం దీర్ఘకాలిక సమస్యలతో కొట్టుమిట్టాడకూడదు. 370 లాంటి ఆర్టికల్‌ అలాంటిదే. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. దుర్మార్గమైన కాంగ్రెస్‌ పార్టీ హిందువులను, దేశాన్ని తిరిగి ముక్కలు ముక్కలు చేయాలని ఒక దురాలోచనతో పెట్టిన ఆర్టికల్‌ అది. మోదీగారు ఆ అధికరణాన్ని రద్దు చేశారు. మూడవది, ఐదు వందల సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య అయోధ్య. మర్యాదా పురుషోత్తముడు పుట్టిన చోటు కోసం ఐదు వందల ఏళ్లు పోరాటం చేయవలసి వచ్చిందంటే, హిందువుల పరిస్థితి ఏమిటో ఆలో చించుకోవాలి. ఆ సమస్యను భారత న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించగలిగారు మోదీ.

అలాగే, అభివృద్ధి. నేడు భారతదేశమంటేనే అభివృద్ధి. ఒకప్పుడు ఆత్మనిర్భరత లేదు. అది వాక్సిన్స్‌ కావచ్చు, ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టినప్పుడు దేశంలోని మేధావులందరినీ ఒక చోట కూర్చోబెట్టి, మనుషులే పోతే దేశమెందుకన్నాడు. అంత స్వల్పకాలంలో వాక్సిన్‌ రావడం అన్నది ప్రపంచ రికార్డు. వాక్సిన్‌ తేవడమే కాదు 140 కోట్లమంది ప్రజలను కాపాడుకున్నాడు. ప్రపంచాన్ని కూడా బతికించాలని ఇరుగు పొరుగుకు ఉచితంగా పంపిన ధీరోదత్తుడు. అందువల్ల మేము, అద్వానీ, వాజ్‌పేయి అడుగుజాడల్లో వారెలా నడుస్తున్నారో, రేపటితరం మోదీ ఆశయాలను పుణికి పుచ్చుకొని, బంగారు భారతదేశం నిర్మించాలని కలలు కంటున్నాను.

తెలంగాణలో బీజేపీ సిద్ధాంతం పట్టు సాధించే అవకాశం ఉంది. దాని గురించి మీ అభిప్రాయ మేమిటి?

దేశంలో అందరికంటే ముందు అధికారంలోకి రావల్సింది తెలంగాణలోనే. బీజేపీ ఎదుర్కొన్న మొదటి సార్వత్రిక ఎన్నికలలో రెండే రెండు సీట్లు వచ్చాయి. అందులో హనుమకొండ ఒకటి. బీజేపీ హిందూత్వ భావాలు, దేశాన్ని ప్రేమించే తత్వాన్ని స్వాగతించే మనుషులు ఇక్కడ ఉన్నారు. ఆ సిద్ధాంతాన్ని గుండెలకు హత్తుకునే గడ్డ తెలంగాణ. రానున్న ఐదు సంవత్సరాలలో ప్రజల మద్దతుతో, అబిమానంతో అఖండ మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది. రామరాజ్యం స్థాపిస్తాం.

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ తెలంగాణకు నిజంగా చేసిందేమిటి?

ఏమీలేదు. నిజం చెప్పాలంటే 50 ఏళ్లు వెనక్కి నెట్టింది. 1948 సెప్టెంబర్‌లో ఎంత వెనకబడి ఉన్నామో ఇప్పుడూ అంతే. ఏడు లక్షల కోట్ల అప్పులు, 20 లక్షల కోట్లు అవినీతి. ఎకరా వరి పండిరచడానికి ఖర్చు 13 లక్షలు. ఆదాయం పదివేలు. ఇంజినీరింగ్‌ నిపుణుల సలహా లేకుండా చేసిన నిర్మాణం. దాని పరిణామంగానే ఇప్పుడున్న మంత్రిగారు మేడిగడ్డ, కాళేశ్వరం కూలిపోతుంటే మిగిలిన సగం ఎట్లా అంటూ ఎల్‌అండ్‌టి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రపంచస్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలి. అమాయక తెలంగాణ ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టిన డబ్బును రికవర్‌ చేయాలి. ధ్వంసమైన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి.

వారం కిందట కాంగ్రెస్‌ పాలన మొదలైంది. రేపెలా ఉంటుంది తెలంగాణ?

ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ‘బీఫాం’ (కాంగ్రెస్‌) ఉంటేనే నిధులు వస్తాయని అన్నాడు. ముఖ్యమంత్రిగారూ ఒకసారి గమనించండి! మీరూ మా లాగానే ఎమ్మెల్యే. మీకెలాంటి హక్కులుంటాయో, మాకూ అంతే. మీకెన్ని నిధులు కావాలో, మా నియోజకవర్గాలకు అన్నే నిధులు కావాలి. లేకపోతే భారత న్యాయవ్యవస్థ తలుపు తడతాం. రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, రాజధర్మం ప్రకారం నడవాలి. అలాంటి ప్రసంగాలు చేయకూడదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.

చరిత్ర నుంచి మీరు గొప్ప స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం అయింది?

నిరంతరం నేర్చుకోవాలనే తపన. ఇంత గొప్ప జాతి నేడు తన వైభవాన్ని కోల్పోయి ఎందుకు అవమానాలకు గురవుతోందన్న ప్రశ్నకు సమాధానాల కోసం వెతుకులాట. వెతుకుతూ పోతుంటే, అనేక సంఘటనలు కనిపిస్తాయి. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం చూడండి! వందలాది మందిని అక్కడ చంపిన జనరల్‌ డయ్యర్‌ని లండన్‌లో కాల్చివేసే వరకూ నిద్రపోలేదు ఉద్దమ్‌సింగ్‌. ఈ గడ్డలో పౌరుషముంది. ఇప్పుడు మత్తులోకి జారుకుంది. ఇవాళ ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ అంటున్నారు. రాణి రుద్రమదేవి వందల సంవత్సరాల కిందట ఏకధాటిగా 18 సంవత్సరాలు పాలించింది. ఇందోర్‌ విమానాశ్రయానికి అహల్యాబాయి హోల్కర్‌ పేరు పెట్టారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని రాణి రుద్రమదేవి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలి. నేడు మేం అసెంబ్లీలో కూడా డిమాండ్‌ చేస్తున్నాం రాణి రుద్రమ స్ఫూర్తి కేంద్రాన్ని తయారు చేయాలి. ఈ రోజువరకూ కాలువలు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయంటే, రాణి రుద్రమ దేవే కారణం. మన జాతే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాణి రుద్రమ.

మొత్తంగా రాజకీయ వ్యవస్థ ఆశాజనకంగా లేదు. బీజేపీ లాంటి గొప్ప సిద్ధాంతం ఉంటే తప్ప, మీ లాంటి గొప్ప ఆశాజనకమైన భావనగల వారు ఉంటే తప్ప. ఈ వ్యవస్థను మార్చడం గురించి మీ సొంత అభిప్రాయం ఏమిటి?

ప్రయత్నం ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి. నిరాశ జాతికి, అసలు ఏ వ్యవస్థకీ మంచిది కాదు. నాకైతే గాఢమైన విశ్వాసం ఉంది. భారతజాతి చాణక్యుడు, అశోకుడు వంటి వారి కలలు కన్న అఖండ భారతంగా వెలుగొందుతుంది. ఆ దేవుడి దీవెనలు ఈ కర్మభూమి మీద ఉంటాయి. కనుక నిరాశ అవసరం లేదు. అవినీతి, అరాచకాలు లేని భారతదేశం తయారవుతుందనే నేను గట్టిగా భావిస్తున్నాను.

నిజమే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న గొప్ప ఆశ ఇటీవలి వరకు ఉంది. పరిస్థితులు మారాయన్నది వేరే విషయం.  ప్రతి బీజేపీ అభ్యర్థి గెలుపు చరిత్రాత్మకమైనదే. దీని ప్రభావం ఆంధ్ర మీద ఎట్లా ఉంది?

ఆంధ్ర అనే కాదు, ఈ దక్షిణ భారతదేశం మొత్తం ఏదో ఒక రోజు బీజేపీ పాలనలోకి వస్తుంది. అంటే భారతదేశం మొత్తం పరిపాలిస్తాం. అతి త్వరలోనే. మాలాంటి కొత్తగా వచ్చినవారి ఆలోచనల తోడ్పాటుతో. ఎందుకంటే, మేం ప్రపంచమంతా తిరిగాం. అంగ్‌కోర్‌వాట్‌, విజయవర్మ వంటివారిని ఆదర్శంగా తీసుకున్నాం. బాలిలో హిందూ సామ్రా జ్యాన్ని స్థాపించి, విష్ణు ఆలయాన్ని నిర్మించాడాయన. వారు నడిచిన భూమి ఇది, ఇక్కడ పుట్టడం మన అదృష్టం. మన ధార్మిక విజయయాత్ర మరుగున పడిరది. దాన్ని వెలికితీయాలి. యువతలో స్ఫూర్తి నింపాలి. మన వీరుల గురించి తెలియచేయాలి. ఇవేవీ చెప్పకుండా మతమార్పిడులు చేస్తున్నారు. హిందూధర్మం నాలుగు చెరుగులా వ్యాప్తి కావాలి. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయికి తగ్గట్టు వారి స్థాయిలో దోహదం చేద్దాం. రాజ్యాంగ పరిధిలో పని చేస్తూ భారతదేశాన్ని పునర్నిర్మించుకుందాం.

మీ నియోజకవర్గానికి మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి?

నా నియోజకవర్గం ఆదిమానవుల కాలంలో ఉన్నట్టు ఉందిప్పుడు. మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అనేక హత్యలు, అరాచకాలు చేసి ఒక ఆఫ్ఘానిస్తాన్‌ను తయారు చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు దాన్ని మొత్తం సరిచేసి, కిరాతకాలను తగ్గించాలి. పేదలకు చిన్న చిన్న కోరికలు రెండు గదుల ఇళ్లు, పెన్షన్లు. వారికి అవసరమైన కూడు, గుడ్డ, నీడ, వైద్యం, విద్య, ఉపాధి అందించాలి. ఒకప్పుడు విద్య, వైద్య రంగాల్లో వ్యత్యాసాలు ఎక్కువ ఉండేవి కావు. ఇప్పుడు పెరిగిపోయాయి. వాటిని తగ్గించాలి. అందుకోసం ప్రభుత్వం నా నిధుల వాటాను నాకివ్వాలి.

ఇక మీదట సెప్టెంబర్‌ 17 ఎలా జరుగు తుందనుకోవచ్చు?

అది విమోచన దినంగానే జరగాలి. పాతం నిజాం భాగాలు (కర్ణాటక, మహారాష్ట్ర) విమోచన దినం జరుపుతున్నాయి. ఇక్కడ ఎందుకు చేయరు? ఇద్దరికి భయపడతారా?

కాళేశ్వరం ప్రాజెక్టు కింద కప్పెట్టిన సత్యాల మాటేమిటి?

ఆరువందల సంవత్సరాల కిందట రాణి రుద్రమ గొలుసు కట్టు విధానంతో చెరువుల నిర్మించింది. వ్యవసాయానికి సమస్య లేకుండా చేసింది. కాళేశ్వరం ప్రపంచ జలవనరుల మేధావుల సాంకేతిక పద్ధతు లకు వ్యతిరేకంగా కట్టారు. నిపుణులు, ఇంజినీర్లు వ్యతిరేకించారు. ఇప్పటికే సగం కూలింది. దీనివల్ల ఏం వచ్చింది?  ఐదేళ్లలో రూ.17 కోట్ల కరెంటు బిల్లు. 262లో 152 క్యూసెక్కులు రివర్స్‌ పంపింగ్‌ చేశారు. రిజర్వాయర్లు 25 లక్షల క్యూసెక్కులతో ఆరువేల ఎకరాలు పండిరది. 13లక్షల పైన వ్యయం అయింది. ఈ వడ్లు తింటే ప్రపంచంలో ఏ రోగమైనా తగ్గుతుందని మార్కెటింగ్‌ చేయాలనుకున్నాడు కేసీఆర్‌. పక్క రాష్ట్రంలోలా ఈ మాజీ ముఖ్యమంత్రి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE