అన్ని సర్వేలను తల్లక్రిందులు చేస్తూ రాజస్తాన్‌లో భారతీయ జనతాపార్టీ భారీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో 115 స్థానాల్లో అప్రతిహత విజయాన్ని సాధించగా, కాంగ్రెస్‌ 69 స్థానాలతో సరిపెట్టుకుంది. భారత్‌ ఆదివాసీ పార్టీ 3 సీట్లు, బీఎస్‌పీ రెండు, ఇతరులు 12 స్థానాల్లో గెలుపొందారు.

1993 నుంచి అసెంబ్లీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఏ పార్టీకి ఓటర్లు వరుసగా రెండోసారి పట్టం కట్టిన దాఖలాలు కనిపించవు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒకదాని తర్వాత మరొకటి అధికారాన్ని అప్పగించడం రివాజు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాంత్రికుల కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ చేసిన సంక్షేమ ‘మ్యాజిక్‌’ అవినీతి సునామీలో కొట్టుకుపోయింది. రాజస్తాన్‌లో ఐదేళ్లకోమారు ప్రభుత్వం మారడానికి ఒకే కారణం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పలేం.

కర్ణుడి చావుకు…

తనను ఓడిరచే పనిని సాధారణంగా కాంగ్రెస్‌ విపక్షాలకు ఇవ్వదు. తన పతనాన్ని తానే తెచ్చి పెట్టుకుంటుంది. అవినీతి, కుమ్ములాటలు లేని కాంగ్రెస్‌ను ఊహించలేం. రాజస్తాన్‌లో ఇదే జరిగింది. ఇటీవలి సంవత్సరాల్లో పలు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల ప్రశ్నపత్రాలు వరుసగా లీక్‌ కావడంతో ప్రభుత్వంపై యువకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా 22 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదైనవారు, ప్రభుత్వం పట్ల తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపారని భావించాలి. ఈ పేపర్‌ లీక్‌ బాగోతాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మలచుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామంది అవినీతిపరులుగా ముద్ర పడటంతో, అశోక్‌ గెహ్లోత్‌ సంక్షేమ మంత్రం పని చేయలేదు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు, టైలర్‌ కన్నయ్యలాల్‌ హత్య, అనంతరం జరిగిన అల్లర్లను బీజేపీ బలమైన ప్రచార అస్త్రాలుగా వాడుకొని, అశోక్‌ గెహ్లోత్‌ గెలుపు విశ్వాసాన్ని వమ్ము చేసింది. ఈ ఎన్నికలు అశోక్‌ గెహ్లోత్‌కు అగ్నిపరీక్ష వంటివే. ఈ పరీక్షలో ఆయన నెగ్గలేకపోయారు. ముఖ్యమంత్రి పదవిని వీడి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని చేసిన సూచనను తిరస్కరించి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఎన్నికలు తన రాజకీయ జీవితాన్ని శాసిస్తాయని బాగా తెలిసిన ఆయన, ఏకంగా కారుచౌకకే గ్యాస్‌ సిలిండర్‌, రూ.25లక్షల వరకు ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలను గత ఏడాది కాలంగా ప్రకటిస్తూ వచ్చారు. కానీ అవేవీ ప్రజల మనోగతాన్ని మార్చలేకపోయాయి.

 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77% ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 39.30% వచ్చాయి. ఆ ఎన్నికల్లో వసుంధరా రాజే సింధియా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్‌ ఓడిరచి అధికార పగ్గాలు చేపట్టింది. అశోక్‌ గెహ్లోత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ మరో ముఖ్య నేత సచిన్‌ పైలట్‌, గెహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఎట్టకేలకు 2020లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దింది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ను గద్దెదించి, బీజేపీకి ఓటర్లు పట్టం కట్టడానికి ప్రధాన కారణాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న రాజకీయ జగడం కూడా ఒకటి. సచిన్‌ పైలట్‌ గుజ్జర్‌ వర్గానికి చెందినవారు. ఆయనకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్న భావన ఆ వర్గంలో బలంగా నాటుకు పోయింది. దాదాపు 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వీరిదే ప్రాబల్యం. అవకాశం కోసం చూస్తున్న గుజ్జర్లు ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకున్నారు. పైలట్‌ను పక్కనపెట్టడం ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్‌కు ఈ దెబ్బతో బాగా తెలిసొచ్చుంటుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రభావం ఇక్కడ కనిపించ లేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ జాతీయ నాయకులు రాజస్తాన్‌లో గట్టిగానే ప్రచారం చేశారు.

నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో దేశంలోనే అత్యధిక అత్యాచార కేసులు రాజస్తాన్‌లో నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య 2020తో పోలిస్తే 2021లో 17శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలపై అత్యాచారాలు బీజేపీకి ప్రధానాస్త్రంగా మారింది. బీజేపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను కూడా ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి కాంగ్రెస్‌ వైఫల్యాలను ర్యాలీలు, బహిరంగ సభల్లో ఎండగట్టారు. మ్యానిఫెస్టోలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ కూడా ఇదే హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు దాన్ని విశ్వసించలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

తప్పిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు

నిజానికి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు చాలా వరకు బీజేపీకే అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. పీపుల్స్‌ పల్స్‌ సర్వే, న్యూస్‌`18, జన్‌కీ బాత్‌, టీవీ9 భారత్‌ వర్ష్‌, టైమ్స్‌ నౌ సర్వే ఫలితాలు ఇంచుమించు నిజం కాగా, న్యూస్‌ నేషన్‌, రిపబ్లిక్‌ టీవీ, ఇండియా టుడే సర్వే అంచనాలు తప్పాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌`బీజేపీల మధ్యనే కీలకపోటీ ఉంటుందని, ప్రాంతీయ పార్టీలు కింగ్‌మేకర్లుగా మారే అవకాశ ముందన్న ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు కూడా తప్పాయి. ఈ అంచనాల నేపథ్యంలో హంగ్‌ అసెంబ్లీ వస్తుదేమోనన్న భయంతో కాంగ్రెస్‌, బీజేపీలు ఒకదశలో రెబెల్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డాయి కూడా! టికెట్‌ నిరాకరించడంతో బీజేపే, కాంగ్రెస్‌ల నుంచి 40 మంది రెబెల్స్‌ పోటీచేశారు.

ఎన్నికల సరళి

200 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్‌పీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌), ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) కూడా రంగంలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం పెద్దగా లేదు. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, శ్రీగంగానగర్‌కు చెందిన కరానాపూర్‌ సీటుకు ఎన్నిక వాయిదా పడిరది. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గుర్‌మీత్‌ సింగ్‌ కన్నార్‌ మృతితో ఇక్కడ ఎన్నిక నిలిచిపోయింది. బీజేపీ అన్నిస్థానాల్లో పోటీచేయగా, కాంగ్రెస్‌ 199 స్థానాల్లో తలపడి, భరత్‌పూర్‌ స్థానాన్ని తన మిత్ర పార్టీ అయిన రాష్ట్రీయ లోక్‌దళ్‌కు వదిలేసింది. 2018లో కూడా కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని ఆర్‌ఎల్‌డీకి వదిలేయడం గమనార్హం. రాష్ట్రం మొత్తం మీద 75.45% ఓటింగ్‌ నమోదు కాగా ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా అధికం. అప్పట్లో 74.71% పోలింగ్‌ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 సీట్లు సాధించి మెజారిటీకి ఒక్క స్థానం తక్కువ కావడంతో బీఎస్‌పీ సహకారంతో అధికారపగ్గాలు చేపట్టింది. అశోక్‌ గెహ్లోత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2013 ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు సాధించింది. అదే బీజేపీ 2018లో కేవలం 73 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2013లో కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. పరిశీలిస్తే 1993 నుంచి రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల జాతకాలను మారుస్తున్నవి 48 అసెంబ్లీ స్థానాలు! 2008 నుంచి ఇదే పోకడ కనిపిస్తోంది. మరో విషయమేమంటే 25 లేదా 12.5% అసెంబ్లీ స్థానాలు 2008, 2013లో బీజేపీ ఖాతాలో ఉండగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేసాయి. ఉదాహరణకు జైపూర్‌ నగరంలోని ఆదర్శ్‌నగర్‌, విరాట్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలను 2008, 2013లో బీజేపీ గెలుచుకోగా, 2018లో ఇవి రెండూ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అదేవిధంగా జాట్‌, మెవాట్‌ ప్రాంతాల్లో బీజేపీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అయితే ఈసారి ఈ స్థానాల్లో బీజేపీ పుంజుకున్నది.

వైవిధ్య భౌగోళిక – రాజకీయాలు

రాజస్తాన్‌లో వైవిధ్యభరితమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు కనిపిస్తాయి. మొత్తం ఆరు జిల్ల్లా ప్రాంతాలుగా విభజితమైన రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒక ప్రత్యేకతను కలిగివుంది. మేవార్‌ ప్రాంతంలో ఉదయ్‌పూర్‌, రాజసమండ్‌, చిత్తోర్‌గఢ్‌, దుర్గాపూర్‌, బాన్స్‌వారాల్లో గిరిజన జనాభా అధికం. చారిత్రకంగా రాజకీయాధిపత్యం వీరిదే. షేఖ్‌వతి ప్రాంతంలో ఛురు, రaుంరaువును, సికార్‌లు సంక్లిష్ట రాజకీయ స్థితిని ప్రదర్శిస్తాయి. బికనా ప్రాంతంతో బికనీర్‌, గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌లు ఉండగా, జైపూర్‌, దౌసాలు దుంధర్‌ ప్రాంతం కిందికి వస్తాయి. బ్రిజ్‌ ప్రాంతంలో భరత్‌పూర్‌, ధోల్‌పూర్‌, కరోలీ, మార్వార్‌ ప్రాంతాల్లో జోధ్‌పూర్‌, పాలి, శిరోహి, రaలాడ్‌, బాల్మర్‌, జైసల్మేర్‌లుంటాయి. రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు వంటి అగ్రకులాల ఓట్లు 20`22% వరకు ఉంది. యాదవ్‌లు, జాట్‌లు, గుజ్జార్‌లు, సంఫీుల ఓట్లు 40`45% వరకు ఉన్నాయి. షెడ్యూల్డు కులాలవారి ఓట్టు 16`17%, షెడ్యూల్ట్‌ ట్రైబ్స్‌ 13%, ముస్లింలు 9% ఉన్నారు. అగ్రవర్ణాల్లో 60% మంది ఓటర్లు బీజేపీ మద్దతుదార్లు. వీరిలో కాంగ్రెస్‌కు కేవలం 20% మంది మాత్రమే మద్దతివ్వడం గమనార్హం. చిన్నా చితకా పార్టీలకు 15% ఓటర్ల మద్దతుంటుంది.

ఓబీసీ కేటగిరీలో బీజేపీ`కాంగ్రెస్‌లకు గణనీయంగా ఓటర్ల మద్దతు కొనసాగుతోంది. ఒక్కొక్క పార్టీ 35`40% ఓట్లు ఈ కేటగిరీ నుంచి పొందగలవు. ఇతర చిన్నాచితకా పార్టీలు 15% వరకు ఓట్లు సాధిస్తాయి. ఎస్సీ/ఎస్టీల్లో బీజేపీ కాంగ్రెస్‌లకు సమాన బలం ఉంది. మిగిలిన ఓట్లు భారతీయ ట్రైబల్‌ పార్టీ వంటి చిన్న పార్టీల ఖాతాల్లోకి వెళతాయి. ఇక ముస్లింలు దాదాపు పూర్తిగా కాంగ్రెస్‌ వైపే ఉంటారు. 3/4వంతు ఓట్లు కాంగ్రెస్‌కే వెళతాయి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ముస్లిం ఓటర్ల మనోగతంలో ఎటువంటి మార్పు రాలేదన్నది స్పష్టమవుతుంది.

కాంగ్రెస్‌ ఓట్లకు చిల్లు

ఒక అంచనా ప్రకారం 2008 నుంచి పరిశీలిస్తే, రాజస్తాన్‌లో బీజేపీ ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్‌ ఓట్ల తేడాను తగ్గించుకుంటూ వస్తోంది. అంటే తన ఓటుశాతం పెంచుకుంటున్నదని అర్థం. ఉదాహరణకు 2008లో బీజేపీ 78 స్థానాలు, కాంగ్రెస్‌ 96 స్థానాల్లో గెలుపు సాధించాయి. కానీ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 2.5% మాత్రమే. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 21 స్థానాల్లోనే గెలుపొందింది. అప్పుడు రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 12%. అదేవిధంగా 2018లో బీజేపీకి 73 స్థానాలు లభించగా కాంగ్రెస్‌ 100 సీట్లను గెలుచుకుంది. విచిత్రంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 0.5% మాత్రమే కావడం గమనార్హం. ఈ పోకడను పరిశీలిస్తే బీజేపీ తన ఓటు బ్యాంకును సుస్థిరంగా పెంచుకుంటూ వస్తోందని అర్థమవుతుంది.

కొత్తతరానికే అవకాశం?

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారాన్ని అన్నీ తానై నిర్వహించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించకుండా జాగ్రత్త వహించడం గమనార్హం. ప్రచారం సందర్భంగా మోదీ ఇమేజ్‌ ద్వారానే ఓట్లు సాధించాలన్న పార్టీ లక్ష్యం స్పష్టమైంది. ముఖ్యంగా వసుంధరా రాజే సింధియాను పక్కనపెట్టే వ్యూహాన్ని పార్టీ ఇక్కడ అనుసరించింది. రాజస్తాన్‌లో కొత్తతరం నాయకులకు పగ్గాలు అప్పగించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందనడానికి ఇది సూచన. వసుంధరా రాజే సింధియా (70) గతంలో రెండుసార్లు (2003`08, 2013-18) ముఖ్య మంత్రిగా పనిచేశారు. అంతకుముందు అటల్‌బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలన్నది అక్షరసత్యం. కానీ ఆమె ఆధిపత్యధోరణి, మాట దురుసుతనం, ఎవ్వరికీ అందుబాటులో ఉండకపోవడం వంటి ప్రతికూలతలు ఆమె పట్ల కేంద్ర నాయకత్వం వైముఖ్యానికి ప్రధాన కారణం. కొన్ని సందర్భాల్లో ఆమె వైఖరి పార్టీ వృద్ధనేతలను ఇరుకున పడేసిన సందర్భాలున్నాయి. అంతేకాదు తాను అవసరమనుకున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలను కూడా పక్కన బెట్టి స్వేచ్ఛగా వ్యవహరించే మనస్తత్వం. సచిన్‌ పైలెట్‌ తిరుగుబాటు చేసినప్పుడు తన ప్రభుత్వాన్ని వసుంధరా రాజే సింధియా కాపాడారని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లూట్‌ స్వయంగా ఒకదశలో పేర్కొనడం ఇందుకు గొప్ప ఉదాహరణ. అయితే ఈ ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండిరచడం తర్వాతి పరిణామం. అదీకాకుండా ఈసారి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఆమె అనుయాయులకు టిక్కెట్లు దక్కకపోవడం, అధిష్టానం నుంచి ఆమెకు గట్టి హెచ్చరికగా పరిగణించాలి. సింధియా అనుయాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తర్వాతి జాబితాల్లో వారి పేర్లను చేర్చి పరిస్థితిని పార్టీ చక్కదిద్దింది. ఇంత జరిగినా, తాము పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడి ఉన్నామన్న సత్యాన్ని సింధియా, బీజేపీ విస్మరించక పోవడం గమనించాలి. పార్టీ నుంచి బయటకు వస్తే తనకు పెద్దగా రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆమెకు తెలుసు. అదేవిధంగా రాజే సింధియాను బీజేపీ పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యంకాదు.

నవంబర్‌ 25వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్‌ సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105 కాగా 1862 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఓటర్లలో 18`30 మధ్య వయస్కులైన ఓటర్ల సంఖ్య 1,70,99,334 కాగా వీరిలో 22,61,008 ఓటర్లు కొత్తవారు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram