గంగ మానవ రూపంలో శాంతనుని భార్యగా ఉండినా ఆమెకు దేవతా స్మృతి పోలేదు. ఆమెది పరాధీనజన్మకాదు. ‘స్మృతి’ ఉన్నంత వరకూ ‘మృతి’ లేదు. ‘స్మృతి’ పోవడమే మృతి.

భీష్ముడు 36 ఏళ్లవాడై  తిరిగి వచ్చేవరకూ, మళ్లీ నాలుగేళ్లు జరిగే వరకూ శాంతనుడు మళ్లీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్ష వహిస్తాడు. ఆ తర్వాత ఒక రోజు శాంతనుడు దాశరాజు కూతురు సత్యవతి (మత్స్యకారిణి)ని చూస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. దాశరాజు మత్స్యకారుడు. ఒక చేప కడుపులో ఉన్న పాపను పెంచుకుంటాడు. ఆమె సత్యవతి. ఈయన కుమార్తెకు జన్మించిన పుత్రుడిని శాంతనుడు తన తర్వాత రాజుగా ప్రకటించినట్లయితేనే ఆమెను శాంతనునికిచ్చి పెళ్లి  చేయగలవని దాశరాజు స్పష్టం చేస్తాడు. గంగ పుత్రుడు తన తర్వాత రాజు అవుతాడని, అందువల్ల సత్యవతి కుమారునికి రాజ్యం కట్టబెట్టి అధర్మానికి ఒడిగట్టబోనని శాంతనుడు స్పష్టం చేస్తాడు. కామం కంటే ధర్మం ముఖ్యమని ఆయన స్పష్టం చేస్తాడు.

ఈ సంగతి తెలుసుకున్న దేవవ్రతుడు తండ్రికి పెళ్లి చేయడానికి పెళ్లి సన్నద్ధ్దమవుతాడు. తనకు రాజ్యాధికారం అక్కడ లేదని సత్యవతికి జన్మించే పుత్రుడే రాజు కాగలడని దాశరాజుకు హామీ ఇస్తాడు. తన అనంతరం తన వారసులు రాజ్యం కోరే భయం లేకుండా తాను ఆజీవన బ్రహ్మచర్య దీక్ష వహిస్తానని, పుత్రుడు లేకపోయినా తనకు అక్షయమైన దివ్యలోకాలు ప్రాప్తం కాగలవని దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడు. దాశరాజుకు హామీ ఇస్తాడు.

‘‘అద్య ప్రభృతిమే దాశ బ్రహ్మ చర్యం భవిష్యతి,

అపుత్రప్యాపిమే లోకా: భవిష్యంతి అక్షయా దివి’’

ఇది కుటుంబం కోసం వ్యక్తి చేసిన తీవ్రమైన (భీష్మమైన) త్యాగం, ప్రతిజ్ఞ అందువల్ల దేవవ్రతుడు భీష్ముడుగా గణనకెక్కాడు.

దాశరాజు ఇంటి నుండి సత్యవతిని తోడుకొని వచ్చి తండ్రికిచ్చి వివాహం చేస్తాడు భీష్ముడు. సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అన్న ఇద్దరు కుమారులు. వీళ్ళిద్దరకి యుక్త వయసు రాక పూర్వమే శాంతనుడు మరణిస్తాడు. అందువల్ల శాంతనవుడే తమ్ముళ్లకు సంరక్షకుడౌతాడు. చిత్రాంగదుడు ఒక గంధర్వునితో యుద్ధం చేసి అకాల మరణం పాలవుతాడు.

భీష్ముడు విచిత్ర వీర్యుని రాజును చేసి, అతనికి కాశీరాజు కూతుళ్లు అంబిక, అంబాలికలను తెచ్చి పెళ్లి చేస్తాడు. కేవలం ‘‘నేను, నా సుఖం’’ అని కాక ‘‘మేము మా హితం’’ అన్న భావన భారతీయ జీవనవిధానంలో భాగం. మహాభారతకథలు ఈ సత్యాన్ని పదే పదే ప్రతిష్ఠించాయి. పరమ మంత్రమైన గాయత్రీ మంత్రంలో ఈ సమష్ఠి హిత చింతనే ఉంది.

‘‘మా బుద్ధులను ప్రవర్తింప చేసే దేవుడైన సవిత  తేజస్సును ధ్యానం చేస్తున్నాము’’ అన్న గాయత్రీ మంత్రాన్ని ఏ వ్యక్తి జపించినా ‘‘మా’’ అన్న సమష్టి హితం కోసమే. నః(మా) ధీమహి (ధ్యానం చేస్తున్నాము) అన్న సమష్టి తత్వం భారతీయ ధర్మమార్గం. కొన్ని విదేశీయ మతాలలో వలె ‘‘ఎవడిది వాడికీ’’ అన్న సంకుచిత అతార్కిక పద్ధతికి భారతీయ మతాలలో చోటు లేదు. వైదిక రుషులు ప్రతి పాదించిన ప్రార్థనలు, పూజలు, యజ్ఞ యాగాలు సమాజ సమష్టికి మేలు చేసేవే కానీ కేవలం ఒక వ్యక్తికి కాదు..

మహాభారత కాలంలో అంతకు పూర్వమూ కూడా భారతీయులకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల గురించి తెలసు•. పాండురాజు భార్య మాద్రి మద్రదేశపు రాజు శల్యుని చెల్లెలు.  మద్రదేశం నేటి ఈజిప్టు. పిరమిడ్‌ ‌పరమీఢ శబ్దం నుంచి వచ్చినది. పిరమిడ్‌ ‌మేరు శ్రీచక్రానికి ప్రతీక.

ప్రపంచంలోని అన్ని సంస్కృతులూ వైదిక సంస్కృతి రూపాంతరాలే. జంబూద్వీపం అంటే మొత్తం భూగోళం., మిగిలిన ఆరు ద్వీపాలు అంతరిక్షంలో ఉన్న ఇతర గ్రహాలు. వేదం అంతరిక్షాన్ని మహాసముద్రంగా అభి వర్ణించింది. అంతరిక్ష సముద్రంలోనే భూగోళం (జంబూద్వీపం) ఇతర ద్వీపాలు ఉన్నాయి.  ‘అష్మిన్‌ ‌మహాతీ అర్ణవే అంతరిక్షే బవా అదిః’

స్థావర (చెట్లు) జంగమ(జంతువులు) ప్రాంతా లన్నింటికీ సూర్యుడు ఆత్మ అన్న వైజ్ఞానిక సత్యాన్ని తొలిసారిగా భారతీయులే అవిష్కరించారు.‘‘సూర్య అహ్మ జగతః తష్ణువు చ’’ అని వేదం ఉద్గోషించింది.

– తెలకపల్లె విశ్వనాథశర్మ

‘జాగృతి’ 07.01.2002’ సంచిక నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram