డా।।పి.వి. సుబ్బారావు: రిటైర్ట్ ‌ప్రొఫెసర్‌, 9849177594

‌నాటక రచయితగా, అధిక్షేపాత్మక ‘సాక్షి’ వ్యాసాల కర్తగా ప్రముఖ నటులుగా, ఆధునిక సాహిత్య చరిత్రలో పానుగంటి లక్ష్మీనరసింహారావు చిరస్మరణీయులు. సంస్కరణా దృక్పథాన్ని సాహిత్యానికి అద్దిన తొలితరం తెలుగు సాహిత్యవేత్తలలో అగ్రగణ్యులు పానుగంటి. పాదుకా పట్టాభిషేకం, కంఠాభరణం వంటి ఎన్నో గొప్ప రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కలం వారిది. సంప్రదాయ సాహిత్యంతో పాటు, వర్తమాన కాలాంశాలే ఇతివృత్తంగా రచనలు రావలసిన అవసరం గురించి నాటి రచయితలన• హెచ్చరించిన ద్రష్ట పానుగంటి.

పానుగంటి (ఫిబ్రవరి11,1865-జనవరి 1, 1940) రాజమండ్రి తాలూకా, సీతానగరంలో జన్మించారు. తండ్రి వేంకటరమణయ్య ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. పానుగంటి రాజమండ్రి కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. బీఏ ఇంగ్లీషు సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకమైన మెట్కాఫ్‌ ‌స్వర్ణపతకాన్ని పొందిన ప్రతిభావంతులు. విద్యార్థి దశలోనే షేక్‌స్పియర్‌ ‌నాటకాల్లో పాత్రలు ధరించి ప్రేక్షకుల మెప్పుపొందారు. వీరేశలింగంగారి ‘శకుంతల’ అనువాద నాటక ప్రదర్శన బాధ్యత చేపట్టి ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు.

ప్రసిద్ధనటులు, నాటకరంగ దర్శకులు కూచి నరసింహం దగ్గర నటనా, దర్శకత్వ నైపుణ్యాలను గ్రహించి కొన్ని నా•కాలకు దర్శకత్వం వహించి మెప్పు పొందారు. ఆయన కొంతకాలం పెద్దాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి నిర్వ హించారు. కొంతకాలం కొత్తపల్లి జగ్గారాయనింగారి పిల్లలకు పాఠాలు చెప్పారు. తర్వాత లక్ష్మీనరసాపురం ఎస్టేట్‌ ‌జమీందారిణి చెల్లయ్యమ్మారావు దగ్గర ‘దివాను’ ఉద్యోగంలో చేరారు. 1905లో రావు కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్‌ ‌పిఠాపురం వచ్చినప్పటి నుండి ఆయన దగ్గరే ఉన్నారు.

పానుగంటి వారు 1902లో చెల్లయ్యమ్మారావు ఎస్టేట్‌లో దివానుగా ఉన్నప్పుడు రాసిన ‘నర్మదా పురుకుత్సీయం’ నాటకాన్ని అప్పుడే ప్రదర్శించారు. సూర్యారావు బహద్దూర్‌ ‌వివాహ మహోత్సవ సమయంలో ‘కోకిల’ అనే నాటకాన్ని రాసి ప్రదర్శించారు. ‘విజయరాఘవం’ నాటకాన్ని ఆయన పట్టాభిషేక సమయంలో రాసి ప్రదర్శించారు. పానుగంటి దాదాపు 30 నాటకాలు రాసినా, వాటిలో 26 మాత్రమే ప్రచురణకు నోచుకున్నాయి. పానుగంటి వారి నాటకాలను పరిశీలిద్దాం.

ఆయన తొలినాటకం ‘నర్మదా పురుకుత్సీయం’. 1902లో రాసి పానుగంటి తాను దివానుగా వ్యవహరిస్తున్న జమీందారిణి చెల్లయ్యమ్మారావుకి అంకిత మిచ్చాడు. ఈ నాటకంలో ఆయన పద్య శైలిని గూర్చి చెప్పుకున్నారు.

‘‘ఒక్కచో తేనెలొలికించు నొక్క చక్క

చక్కెర ముక్కలనుంచు నొక్క ప్రక్క

నాణిమగు సుధల జిలికించు, నవ్య భవ్య

కావ్య రచనలనీ మహాకవివరుండు’’

తన రచనలు తేనె చక్కెరలు కలసిన మాధురీ భరితమైన అమృతాలని చెప్పుకున్నాడు. ‘నర్మదా పురుకుత్సీయం’లో ఇతివృత్తం స్వర్గ, మర్త్య, పాతాళాల మధ్య జరిగినట్లు రచయిత చిత్రించారు. ఈ నాటకం సన్నివేశ చిత్రణలో పానుగంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భవిష్యత్తులో ఆయన రాసిన నాటకాలన్నింటికీ ఈ నాటకమే మార్గదర్శకత్వం వహించిందని విమర్శకుల అభిప్రాయం.

రాజరాజనరేంద్రుని జీవిత ఘట్టంగా చెప్పుకునే ఒక ఇతివృత్తంతో పానుగంటి 1904లో ‘సారంగధర’ నాటకాన్ని రాశారు. ఈ నాటకాన్ని కూడా జమీందారిణి చెల్లయ్యమ్మరావుకే అంకితమిచ్చారు. ఇందులో రాజరాజనరేంద్రుడు, సారంగధరుడు ముఖ్య పాత్రలు. రాజరాజనరేంద్రుని భార్య చిత్రాంగి. యౌవనవతి. ఆమె మేడపై సారంగధరుని పావురం వాలింది. స్నేహితుడు సుబుద్ధి అక్కడకు వెళ్లొద్దని సారంగధరుని వారించినా, అతడు చిత్రాంగి మేడపైకి వెళ్లాడు. చిత్రాంగి సారంగధరునిపై వలపును ప్రకటించగా, అతడు తిరస్కరించాడు. చిత్రాంగి కోపంతో సారంగధరుడు తనను బలాత్కరించాడని చెప్పిన మాటలు విని రాజు సారంగధరుడికి మరణశిక్ష విధించాడు. చివరలో రాజు పశ్చాతప్త చిత్తుడై, రాజ్యాన్ని వీడి అరణ్యాలకు వెళ్లాడు. కానీ, మీననాథుడి ఔషధ ప్రభావంతో కుమారుడు పునర్జీవితుడైన విషయం తెలిసి రాజు తన కుమారుడు సారంగధరుని కలుసుకుంటాడు. చిత్రాంగిని క్షమించటంతో నాటకం సుఖాంతమవు తుంది. పానుగంటివారు ఇందులో అంతర్నాటకాన్ని ప్రవేశపెట్టడం ఔచిత్యంగా ఉంది. ఈ నాటకం బహుళ ప్రజాదరణ పొందినందున ఆయన నాటకాలన్నింటిలో అంతర్నాటకం పక్రియను  ప్రవేశపెట్టారు.

పానుగంటివారు 1909లో రాసి ప్రచురించిన మూడోనాటకం ‘ప్రచండ చాణక్యం.’ చంద్రగుప్త మౌర్యుడు, అతడి గురువు చాణక్యుని ఘట్టాలతో నిండి ఉండే ఈ నాటకం కూడా విశేష ప్రజాదరణ పొందింది. ఈ నాటకంపై కూడా విమర్శలు విరివిగా వచ్చాయి. ఇది విశాఖదత్తుడు రాసిన ‘ముద్రారాక్షసం’ నాటకానికి పూర్వగాథ. ఔచిత్యం దృష్టితో పానుగంటివారు ఈ నాటకంలో చాలా మార్పులు చేశారు. మార్పులు చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ, ‘‘ఇందులో కొన్ని అమానుష కృత్యాలు న్నందున వర్తమాన కాలానికి రుచించవని భావించి కొత్త మార్గంగా ఈ నాటిక కథను కల్పించవలసి వచ్చిందని’’ చెప్పారు. ఇందులో చారిత్రక ప్రసిధ్దమైన చాణక్య పాత్ర రాక్షసమంత్రి పాత్రల లక్షణాలలో కొంత మార్పు చేశారు.

పానుగంటి వారు 1909లో రాసిన నాటకం ‘రాధాకృష్ణ’. ఈ నాటకం ఆయన నాటకాలన్నింటిలోకి ఉత్తమ మైనదిగా విశేష ఖ్యాతి పొందింది. ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఈ నాటకంలో మధుర భక్తి, రచనా శిల్పం ముఖ్యమైనవి. ఇందులో రాధ పాత్రను చిత్రించటంలో పానుగంటివారు చూపిన సంయమనం, నిక్షేపించిన ఆధ్యాత్మికత, అంతరంగపు లోతులు ప్రేక్షకులకు అనుభవానికి వస్తాయి.

‘‘నేనే రాధను, పూర్వజన్మముల రాధను, వర్తమానమున రాధను, భవిష్యజ్జన్మలో రాధను, పునః సృష్టిలో రాధను, నా పతి. శ్రీకృష్ణుడు’’ అంటూ పారవశ్యంలో ఉన్న రాధను పానుగంటివారు ప్రేక్షకులకు చూపి వారిని ధన్యులను చేశారు. పానుగంటివారు వాల్మీకి రామాయణ గాథల ఆధారంగా నాలుగు నాటకాలు రాశారు. అవి-

  1. పట్టభంగ రాఘవం 2. విజయ రాఘవం
  2. వనవాస రాఘవం 4. కల్యాణ రాఘవం

ఇవి ఆయన రామభక్తికి నిదర్శనాలుగా నిలిచిన రచనలు. తెలుగు పౌరాణిక నాటకరంగంలో ఇదొక అరుదైన విశేషం. ఈ నాటకాల్లో సంభాషణా చాతుర్యం, పాత్ర పోషణ, నాటకీయత ఒకదానితో ఒకటి పోటీ పడి నాటకాలను రక్తి కట్టించాయి. ఈ నాలుగు నా•కాల్లో మూడింటిని 1809లో రచించారాయన. నాలుగో నాటకాన్ని 1915లో రాశారు. ఈ నాటకాల మధ్యకాలంలో 1909 నుండి 1915 మధ్య ‘కోకిల’, ‘విప్రనారాయణ’, ‘బుద్ధ బోధసుధ’ వంటి నాటకాలు రచించారు.

పానుగంటివారి నాటకాల్లో ‘కంఠాభరణం’ హస్యరసస్ఫోరకమైన ప్రసిద్ధ నాటకం. పిఠాపురాస్థాన ప్రభువైన శ్రీ రాజా వేంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దూర్‌ ‘‌మిగుల నవ్వువచ్చు నాటకమేదైనా రచింపుమని’ కోరడంతో ‘కంఠా భరణం ’నాటకాన్ని ఐదు వారాల్లో (03-04-1917 లో ప్రారంభించి 10-05-1917వరకు) రచించినట్లు పానుగంటి పీఠికలో చెప్పారు. ఈ నాటకం పలు ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించి పానుగంటివారికి విశేషమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. పానుగంటివారు సంస్కరణా దృక్పథంతో ‘విచిత్రవివాహం’ అనే హస్య రూపకంలో బాల్య వివాహాలను అధిక్షేపించారు.

ఆయన నాటకాల్లో చారిత్రక, పౌరాణిక, సాంఘిక ఇతివృత్త వైవిధ్యాలున్నాయి. వీటిలో భక్తి, వీర, అద్భుత, హస్యరస ప్రధానాలున్నాయి. ఆయన నాటకాలపై పాశ్చాత్య నాటిక ప్రభావం ప్రగాఢంగా ఉంది.

 పానుగంటివారి దృష్టి కథారచనపై కంటే నాటకాలపైన, వ్యాసాలపైనే అధికం. అప్పట్లో రచయితలు పద్య కావ్యాలు రచించినంత శ్రద్ధగా గద్యం కావ్యాలు రచించటంలేదని ఆయన బాధ పడేవారు. రచయితలకు గద్య రచనలపై గౌరవం లేదని అదిక్షేపించారు కూడా. నాగరిక దేశా లన్నింటిలో వచన ప్రబంధాలు లక్షోపలక్షలుగా వెలువడుతుంటే మన దేశంలో అవి రాకపోవటం శోచనీయమని ఆనాడే పానుగంటి వాపోయారు.

పాత తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం సంస్థానంలోనే 1922లో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ ‌సభలు జరిగాయి. వాటికి పానుగంటివారు అధ్యక్షత వహించారు. అప్పుడు ఇచ్చిన అధ్యక్షోపన్యాసం చిరస్మరణీయమైంది. ఆయన 1911 నుండి 1914 వరకు సువర్ణలే• పత్రికలోనే సాక్షి వ్యాసాలు, వచన ప్రహసనాలు, చిన్నకథలు వంటి వాటిని ప్రచురిం చారు. వాటిలో సాక్షి వ్యాసాలు హాస్య అధిక్షేపాత్మ కాలు. వాటిని రెండు సంపుటాలుగా ప్రచురించారు. వాటిపై ఆంగ్ల రచయితలు ఎడిసన్‌, ‌స్పెక్టేటర్‌ ‌వంటి వారి ప్రభావం ఉంది. ‘సువర్ణలేఖ’లో, ‘భారతి’లో వచ్చిన చాలా కథలను ‘కథావల్లరి’ పేరుతో కథా సంపుటిగా ప్రచురించారు.

పానుగంటి అంటేనే సాక్షి వ్యాసాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సాహిత్యంలో వీటికి ఉన్న ఖ్యాతి, స్థానం కూడా ఉత్తమోత్తమమైనదే. సాక్షి మొదటి సంపుటిలో 31 వ్యాసాలున్నాయి. రెండో సంపుటిలో 29 వ్యాసాలున్నాయి. సాక్షి సంఘంలో ఐదుగురు సభ్యులున్నారు. వారు సాక్షి, జంఘాల శాస్త్రి, కాలాచార్యుడు, వాణీదాసుడు, బొఱ్ఱయ్యశెట్టి. సత్యపురం తపాలా కచేరీకి ఎదురుగా ఉన్న అద్దె ఇంట్లో ప్రతి రాత్రి సమావేశం కావాలని వారి నిర్ణయం. వారు రాగానే అందరూ చక్రవర్తిగారికీ, వారి కుటుంబానికీ, ఆయురారోగ్య ఐశ్వర్యాలిమ్మని భగవంతుని ప్రార్థించాలి. రాజకీయ విషయాలు చర్చించ కూడదు. తప్పులనుగాని, ఆ తప్పులకులోనైన వ్యక్తుల గురించిగాని నిందించకూడదు. వాదాలతో కలహాలు రాకూడదు అనే నియమాలను సాక్షి సంఘం ఏర్పాటు చేసుకుంది.

సాక్షి వ్యాసాలు ఆనాటి సాంఘిక స్థితికి అద్దం పట్టాయి. వక్రతలను తీవ్ర స్థాయిలో ఆక్షేపించాయి. సంఘంలో స్త్రీల స్థానం, వారి హక్కులు, వారి విద్యా సాంస్కృతికాభివృద్ధి మొదలైన అంశాలతోపాటు స్త్రీల పాశ్చాత్య వ్యామోహాన్ని నిశితంగా విమర్శించారు. పానుగంటివారి ••క్రీర్ణోపన్యాసాల్లో ‘గ్రామ్యవాద ఖండనకొక విన్నపం’ వంటివేకాక, ‘స్వప్నకావ్యం’ అనే ఏకాశ్వాస కావ్యం కూడా ఉంది. విమర్శాదర్శ, విమర్శాధర్మం వంటి చిన్న పుస్తకాలు ప్రచురించారు. ప్రకీర్ణోపన్యాసాల్లో సాహిత్య ధోరణులపై విమర్శ ఉంది. పానుగంటివారి సాక్షి ఉపన్యాసాలు విన్న వారికి తమరే మాట్లాడుతున్నట్లనిపించే విశిష్టత ఉంది. జంఘాలశాస్త్రి ఉపన్యాసాలు ఆవేశపూరితంగా సాగుతాయి. చమత్కార స్ఫోరకాలుగా శ్రోతలను ఆకర్షిస్తాయి. తెలుగు భాషకు పట్టిన దుర్గతి, వినాయక చవితి నిమజ్జనాలలో జరిగే అనవసరపు తంతు, ఇంకా అనేక సంఘ సంస్కరణకు సంబంధించి తీవ్రమైన వ్యంగ్యపూరిత అక్షర దాడి సాక్షి వ్యాసాలలో కనిపిస్తుంది.

పానుగంటివారిపై పాశ్చాత్యరచయితలైన ‘చార్లెస్‌ ‌డికెన్స్’ ఎడిసన్‌, ‌స్విప్ట్ ‌వంటి వారి ప్రభావం ప్రగాఢంగా ఉంది. వారి ప్రభావంతో హస్య రచనలు చేసి ఆధునిక సాహిత్యచరిత్రలో హస్యవాఙ్మయ నిర్మాతగా ప్రసిద్ధికెక్కారు. నాటక రచయితగా, వ్యాస కర్తగా పానుగంటివారు చిరస్మరణీయులు.

About Author

By editor

Twitter
Instagram