సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్‌లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్‌ ‌పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ ‌దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం. ఇది 58వ పురస్కారం.

ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత ప్రయాణం. మనను మనం తెలుసుకునేందుకు చేసే ఈ ప్రయాణంలో అవయవాలతో పనిలేదు. భౌతిక ప్రపంచంలోని మోహాలను, ప్రలోభాలను అధిగమించి తనను తాను తెలుసుకున్న వ్యక్తిని మించిన శక్తిమంతుడు మరొకరు ఉండరు. వారు చేయలేని పనేదీ ఉండదంటే అతిశయోక్తి కాదు. అటువంటి వారిని కారణజన్ములని అంటుంటాం. ఆ కోవలోకి వస్తారు జగద్గురు రామభద్రాచార్యాజీ. దివ్యాంగులు. రామానంద సంప్రదాయానికి చెందిన నలుగురు  జగద్గురు రామానందాచార్యులలో ఒకరు. తన రచనల ద్వారా సంస్కృత భాషకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఇటీవల ఆయనకు 58వ జ్ఞాన్‌పీఠ అవార్డును ప్రకటించారు.

ఆయన నాలుకపై వాగ్దేవి నివాసముంటుందం టారు. సుమారు 22 భాషలు మాట్లాడుతూ, సంస్కృతం, హిందీ, అవధి, మైథిలీ సహా పలు భారతీయ భాషలలో రచనలు చేసిన బహు భాషాకోవిదుడు ఆయన. నేటివరకూ ఆయన నాలుగు పురాణాలు (రెండు సంస్కృతం, రెండు హిందీ) సహా 240 రచనలు చేశారు. రామచరిత మానస్‌పై హిందీలో భాష్యం, అష్టాధ్యాయి, ప్రస్థానత్రయి (బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ప్రధాన ఉపనిషత్తులు)పై సంస్కృతంలో భాష్యం రచించారు. తులసీదాసుపై విస్తృతమైన అధ్యయనం చేసిన నిపుణుడిగా ఆయన పేరొందారు. అత్యంత ప్రామాణికమైన రామచరిత మానస్‌కు ఆయన సంపాదకత్వం వహించి, కూర్చారని ప్రతీతి. భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

ఎవరీ రామభద్రాచార్యాజీ?

కోర్టులో రామజన్మభూమి అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో సాహితీపరమైన ఆధారాలను చూపి, న్యాయమూర్తులు కాదనలేని పరిస్థితిని కల్పించిన సందర్భంలో జగద్గురు రామభద్రాచార్య యావద్భారతానికీ తెలిశారు. నాటివరకూ ఆయన దక్షిణ భారత దేశంలో పెద్దగా తెలిసినవారు కాదు. నిజం చెప్పాలంటే, ఆయన సాక్ష్యం చెప్పకపోతే ఆ కేసులో హిందువులు గెలుపు సాధించేవారు కాదనేది అనేకమంది అభిప్రాయం.

 జౌన్‌పూర్‌లోని శాండిల్యఖైర్‌ ‌గ్రామంలో జనవరి 14, 1950న జన్మించిన రామభద్రాచార్యులు పుట్టిన రెండవ నెలలోనే చూపును కోల్పోయారు. అయినప్పటికీ ఆయన జ్ఞాన సముపార్జనకు, వితరణకు అది అడ్డంకి కాకపోవడం విశేషం. బ్రెయిలీ లిపి నేర్చుకోకుండానే ఆయన శాస్త్రాలను అవపోశన పట్టారంటే అంతకు మించిన అద్భుతం ఏముంటుంది! ఐదేళ్లు వచ్చేసరికి ఆయన భగవద్గీత మొత్తం క్షుణ్ణంగా నేర్చుకోవడమే కాదు, ఏడేళ్లు వచ్చేసరికి రామచరిత మానస్‌ను కూడా కంఠస్థం చేశారట. ఆయన జగద్గురువు కాకముందు పేరు డా।। గిరిధర్‌లాల్‌ ‌మిశ్రా. మొదటి తరగతి నుంచి మాస్టర్స్ ‌పూర్తి చేసేవరకూ తరగతిలో ప్రథమునిగా నిలవడమే కాదు, కాశీలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రి, ఆచార్య అధ్యయనంలో స్వర్ణపతకాన్ని పొందారు.

తన పరిశోధనను పూర్తి చేసుకున్న తర్వాత ధర్మసమ్రాట్‌ ‌స్వామి కరపత్రీజీ మహారాజ్‌ ఆయనకు రామానంద సంప్రదాయ దీక్షను ఇచ్చారు. తర్వాత ఏకగ్రీవంగా జగద్గురు రామభద్రాచార్యగా నియుక్తులయ్యారు. ఇద్దరు ప్రముఖ ప్రధానమంత్రులు – అటల్‌బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఆయన పుస్తకాలను విడుదల చేశారంటే వారి సాహితీ మేధస్సును అవగతం చేసుకోవచ్చు.

చిత్రకూటంలోని ప్రముఖ ధార్మిక, సామాజిక సేవా సంస్థ తులసీపీఠ్‌ ‌స్థాపకులు జగద్గురు రామభద్రాచార్యులు. ఆయన 1987లో దానిని ఏర్పాటు చేశారు. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రముఖ సాహితీ ప్రచురణకర్తలలో తులసీపీఠం కూడా ఒకటి. నేటివరకూ రామభద్రాచార్యాజీ 1275కి పైగా కథలను శ్రీ రామచరిత మానస్‌పైన, 1115 కథలను శ్రీమద్భాగవతంపైన వెలువరించారు. ఆయన కథలను ప్రపంచవ్యాప్తంగా చదువుతారు. ఆయన దాదాపు ఒకటిన్నర లక్షలపేజీలకు పైగా భారతీయ కవిత్వాన్ని రచించారు. మరొక లక్షన్నర శ్లోకాలు ఆయన మనసులో సిద్ధంగా ఉన్నాయట!

తత్వశాస్త్రం, కవిత్వం, రచనల్లో ఆయన వేగాన్ని అందుకోవడం సాధారణ వ్యక్తులకు అత్యంత కష్టం. సత్వర సమస్యలను పరిష్కరించడం కోసం ఆయన సంస్కృతం, హిందీ తదితర భాషలలో శ్లోకాలు రాస్తుంటారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో జరిగిన చారిత్రిక ప్రపంచ శాంతి సదస్సులో పదహారు నిమిషాల ఉపన్యసించిన ఘనత ఆయనది.

అలహాబాదు హైకోర్టులో సాక్ష్యం

రామజన్మ భూమి కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ బాబరే రామమందిరాన్ని విధ్వంసం చేసి ఉంటే తులసీదాసు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదంటూ ముస్లిం పక్షం తర్కాన్ని లేవనెత్తినప్పుడు, హిందూపక్షం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకున్నట్టుగా భావించింది. అయితే, ఈ చిక్కుకు శ్రీ రామభద్రాచార్య సమాధాన మయ్యారు. ఆయన జులై 15, 2003న కోర్టులో సాక్ష్యమిస్తూ, తులసీదాస్‌ ‘‌దోహశతక్‌’‌లో బాబర్‌ ‌సైన్యాధ్యక్షుడు మీర్‌ ‌బకీ ఆలయాన్ని కూల్చివేశాడన్న ప్రస్తావన ఉన్న పద్యాలను న్యాయమూర్తికి వినిపించారు. అంతేకాదు, అయోధ్యలోని రాముడి ఆలయ ఉనికికి సంబంధించిన 437 ఆధారాలను కోర్టుకు ఇచ్చినట్టు స్వామి రామభద్రాచార్య అనంతరం తెలిపారు. ప్రాచీన గ్రంథాలను ప్రస్తావిస్తూ, వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని ఎనిమిదవ శ్లోకం, అలాగే స్కంద పురాణంలోని ప్రస్తావనలు, అథర్వణవేదంలోని దశమ కాండలోనూ ఈ ప్రస్తావనలు ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌మంది దివ్యాంగులు ఉంటే, అందులో మూడు కోట్లమంది భారతదేశంలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 2, 2015‌న చేసిన ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌ప్రసంగంలో వికలాంగ పదానికి బదులుగా ‘దివ్యాంగుల’నే పదాన్ని ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయానికి కారణాన్ని వివరించారు. పాశ్చాత్య దేశాలలోని దివ్యాంగులలో నోబెల్‌ ‌బహుమతిని పొందినవారు సహా విశేషమైన ప్రజ్ఞను ప్రదర్శించిన అనేకమంది ప్రముఖులు ఉన్నారని, భారతదేశం విషయం తీసుకుంటే, ఆదర్శమూర్తి స్వామి రామభద్రాచార్యులవారి పేరు గుర్తువస్తుందన్నారు. అటువంటివారిని దివ్యాంగులని సంబోధించడమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన రామభద్రాచార్యుల నుంచి అనేకమంది ప్రేరణ పొందుతారని మోదీ వ్యాఖ్యానిం చడం ద్వారా ఆయన గొప్పతనాన్ని ప్రజకు పరిచయం చేశారు. తనను ఎవరైనా అంధుడు అని అంటే తనకు నచ్చదని స్వామి రామభద్రాచార్య నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అంతేనా, బాలరాముని తన నేత్రాలతో ప్రత్యక్షంగా చూశానంటారు. తాను ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నా ఆ శ్రీరాముడే బాలుని రూపంలో వచ్చి తనకు తోడ్పడతాడని ఆయన చెబుతారు. తమను ప్రేమతో ఆరాధించే భక్తులకు వశులు కదా మన దేవుళ్లు.

తులసీపీఠం ద్వారా సేవలు

తులసీపీఠం కేవలం ఒక ధార్మిక కేంద్రమే కాదు సేవాకేంద్రం కూడా. నవంబర్‌ 19, 1992‌లో మధ్యప్రదేశ్‌లోని చిత్రకూటంలో శ్రీ తులసీ ప్రజ్ఞాచక్షు దివ్యాంగ్‌ ఉన్నత మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. అనంతరం, 2001లో జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీని ఆయన స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయానికి ఆయనే జీవితకాలపు ఛాన్సలర్‌. ‌ప్రపంచ స్థాయిలో కేవలం దివ్యాంగులకు ఉద్దేశించిన తొలి విశ్వవిద్యాలయమిది. అక్కడినుంచి నేటివరకూ ఐదువేలకుమంది విద్యార్ధులు చదువు పూర్తి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో నియమితులయ్యారు. వీటితో పాటుగా ఆయన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శ్రీ గీతాజ్ఞాన్‌ ‌మందిర్‌కు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వశిష్ఠ ఆయనం ఏర్పాటు చేశారు.

డి. అరుణ

About Author

By editor

Twitter
Instagram