దేశ విభజన రక్తపాత దృశ్యాలూ, నాటి కన్నీటి ప్రయాణాలూ, వెండితెర గీతాల జలపాతాల సమ్మేళనమే గుల్జార్‌. ‌సంపూరణ్‌ ‌సింగ్‌ ‌కాల్రా లేదా గుల్జార్‌. ‌హిందీ చలనచిత్రాల కోసం చిరస్మరణీయమైన గేయాలు అందించారు. బల్‌రాజ్‌ ‌సహానీ నటించిన కాబూలీవాలా సినిమాతో ఆయన వెండితెర ప్రయాణం ప్రారంభమైంది. పాటలతో పాటు, పలు చిత్రాలకు ఆయన సంభాషణలు కూడా కూర్చారు. దర్శకత్వం చేపట్టారు. మాచిస్‌, ఆం‌ధీ, మౌసమ్‌, ‌ఖుష్బూ, పరిచయ్‌, ‌కోషిష్‌ ‌వంటి చిత్రాలకు ఆయన అందించిన గేయాలు ఎంతో ఖ్యాతి గాంచాయి. నిజానికి గుల్జార్‌ను చలనచిత్ర గేయ రచయితగా మాత్రమే పరిగణించలేం. ఆయనకు ఉర్దూ, హిందీ సాహిత్య ప్రపంచాలలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరు దశాబ్దాలుగా ఆయన హిందీ చలనచిత్రాలకు పాటలు అందిస్తున్నారు. ఇంతకు ముందు సాహిత్య అకాడెమి పురస్కారం కూడా అందుకున్నారాయన. స్లమ్‌డాగ్‌ ‌మిలియనీర్‌కు ఆస్కార్‌ ‌పురస్కారం కూడా లభించింది. దేశ విభజన విషాదం  జాడ కాలం మీద ఎంత దీర్ఘంగా ఉందో చెప్పడానికి గొప్ప ఉదాహరణ గుల్జార్‌ ‌రచనలే.

కళ్లకు వీసాలతో పనిలేదు/ స్వప్నాలు సరిహద్దులెరుగవు

నేను మూసిన కళ్లతో నిత్యం/ సరిహద్దులు దాటతాను

మెహిదీ హసన్‌ను కలుసుకోవడానికి!

దేశ విభజన ప్రభావానికి గురైన పంజాబీ గుల్జార్‌. ఆ ‌పెను విషాదం మీద ఆయన ఎన్నో రచనలు చేశారు. పై పంక్తులు కూడా విభజన నాటి అనుభవాన్ని ఆవిష్కరించేదే. అవన్నీ ‘ఫుట్‌‌ప్రింట్స్ ఆన్‌ ‌జీరో లైన్‌: ‌రైటింగ్‌ ఆన్‌ ‌ది పార్టిషన్‌’ ‌పేరుతో సంకలనంగా వెలువరించారు. ఆయన పుట్టిన గడ్డ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనే (జీలమ్‌ ‌జిల్లా, దీనా గ్రామం/ఆగస్ట్ 18, 1934) ఉం‌ది. దేశ విభజనతో వారి కటుంబ జీవనం చెల్లాచెదురైంది. అక్కడ నుంచి బొంబాయి (నేటి ముంబై) చేరుకున్నారు వారు. అంతకు ముందు వారి కుటుంబం అమృత్‌సర్‌, ‌ఢిల్లీలలోని శరణార్థి శిబిరాలలో తలదాచుకున్నారు. ఢిల్లీలో ఒక కూరల మార్కెట్‌ ‌దగ్గర వారు ఉండేవారు. తండ్రి కుమారుడిని చదవించలేకపోయాడు. దీనితో గుల్జార్‌ ఒక పెట్రోల్‌ ‌బంకులో పనిచేశారు. ఆ తరువాతే తన భవిష్యత్తును భవ్యంగా తీర్చిన బొంబాయి చేరుకున్నారు. అక్కడే ఆయనకు సాహిత్యవేత్తలతో పరిచయం కలిగింది. తానూ కలం పట్టాలన్న తృష్ణ అంకురించింది. సాహిత్య సభలలోనే ఒకసారి నాటి ప్రఖ్యాత చలనచిత్ర గాయకుడు శైలేంద్రతో పరిచయం ఏర్పడింది. బిమల్‌రాయ్‌ ‌చిత్రాలకు పని చేసే అవకాశం వచ్చింది. గుల్జార్‌ ‌జీవితంలో గొప్ప లక్షణం, చలనచిత్ర పరిశ్రమకు ఎంత సన్నిహితమైనా ప్రధాన స్రవంతి సాహిత్యరంగానికి ఆయన దూరం కాకపోవడం.

 గుల్జార్‌కు దేశ విభజన దుఃఖంతో పాటు, వ్యక్తిగత జీవితంలోని ఎడబాటు కూడా ఒకటి ఉంది. ఆయన పసితనంలోనే తల్లి కన్నుమూశారు. మారుటితల్లి సరిగా చూసేది కాదు. దీనితో తండ్రి మఖన్‌సింగ్‌ ‌నడిపే చిన్న దుకాణంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. పాఠ్య పుస్తకాలంటే ఆసక్తి ఉండేది కాదు. కానీ రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌శరత్‌చంద్ర సాహిత్యం ఆయనను బాగా ప్రభావితం చేసింది. మొదట్లో ఆయన ఉర్దూ, పంజాబీ భాషలలో కవిత్వం రాసేవారు. కవిగానే కాకుండా, వచన రచయితగా ఆయనకు ఖ్యాతి ఉంది. ‘రెండు’ ఆయన నవల. ఇందులో ఇతివృత్తం దేశ విభజన నాటి విషాదమే. భారత్‌-‌పాక్‌ ‌విభజన ఒక అసహజ పక్రియ. ఫలితం- ఉమ్మడి వారసత్వం కలిగిన ఒక జాతి జీవనానికి సరిహద్దులు వచ్చాయి. ఆనాటి చాలామంది సాహిత్యవేత్తలు, ఈ కృతక సరిహద్దులు నిర్మించడాన్ని సహించలేకపోయారు. ఆ కవితలో గుల్జార్‌ ‌ప్రస్తావించిన మెహిదీ హసన్‌ ‌రాజస్థాన్‌ ‌వాసి. గొప్ప గజల్‌ ‌గాయకుడు. ఆయన 1947లో పాకిస్తాన్‌ ‌వలస వెళ్లిపోయారు. పాకిస్తాన్‌ ‌నుంచి గుల్జార్‌ ‌భారత్‌కు వలస వచ్చారు. ఇదొక వైచిత్రి. తరువాత తాను భారత్‌కు వెళతానంటే పాకిస్తాన్‌ ‌వీసా నిరాకరించిందని హసన్‌ ‌వాపోయారు. పైగా ఒకనాడు కరాచీ, బొంబాయి నగరాలను అక్కచెల్లెళ్ల వంటివని పిలిచేవారు. ఎందుకంటే రెండూ సాగరతీరాలే. ఎన్నో పోలికలు వాటి మధ్య. అలాగే భారత్‌, ‌పాక్‌ ‌విభజనలో నాయకులు మరచిపోయిన ఉమ్మడి వారసత్వం గురించి గుల్జార్‌ ‌తీవ్ర వ్యథ చెందేవారు. ఒక కవితలో గుల్జార్‌ ఇదే భావాన్ని ఎంతో గొప్పగా చిత్రించారు. ‘మీ నగరంలో పడి ఉన్న శవాల మీద గద్దలు ఎగురుతున్నాయి, ఇక్కడ మా నగరంలోని కూడళ్లలోనూ (అంటే ముంబై) అదే  దృశ్యం’ అన్నారాయన.

విభజన విషాదం మీద గుల్జార్‌ ‌కొన్ని గొప్ప కథలు కూడా రాశారు. అందులో ‘రావి పార్‌’ (‌రావినది ఒడ్డు), కావూఫ్‌ (‌భయం) చాలా ఖ్యాతి గాంచాయి. పాకిస్తాన్‌ ‌నుంచి ప్రాణాలరచేత పట్టుకుని, కట్టుగుడ్డలతో భారతదేశం వచ్చిన హిందువులు లక్షలలో ఉన్నారు. ఆ దృశ్యాలను అక్షరాలలో బంధించడమే సంఘర్షణతో కూడుకున్న పని. పంజాబ్‌ ‌రెండుగా విడిపోయి ఒక భాగం భారత్‌లోను, మిగిలిన భాగం పాకిస్తాన్‌లోను మిగిలాయి. ఈ రెండు భాగాలకు నరం వంటిదే రావీ నది. కానీ విభజనతో దీని గతి మారిపోయింది. దేశ విభజనతో ఉమ్మడి వారసత్వం ఏం కోల్పోయిందో ఇందులో చెప్పారు గుల్జార్‌. ‌వలస వస్తున్నవారిలో ఒక యువ జంట  ఉంటుంది. అక్కడ నుంచి బయలుదేరిన రైలులో ఆ కుటుంబం ఉంది. ఆ జంటకు కవల సంతానం. ఆ కవలలో ఒకరికి తీవ్ర అస్వస్థత. అయినా పరిస్థితులను బట్టి ప్రాణాలరచేత పట్టుకుని బయలుదేరారు. ఆ యువకుడు, అతని భార్య తమ పిల్లలను మార్చి మార్చి ఎత్తుకుంటూ ఉంటారు. ఒక దశలో కవలల్లో ఒకరు చనిపోయిన సంగతి అర్ధమవుతుంది. అయినా గందరగోళం మధ్య, బిడ్డ మీద మమకారం చేత ఆ శవాన్ని అలాగే ఎత్తుకుని తీసుకుని వస్తూ ఉంటారు. చనిపోయిందని ఎవరు అనుమానించినా విసిరేయమని మిగిలిన వారు అంటారేమోనని బిడ్డ మరణవార్తను కప్పి ఉంచుతారు. మార్చి మార్చి ఎత్తుకుంటూనే ఉన్నారు, అనుమానం రాకుండా. రైలు రావి వంతెన మీదకు వచ్చింది. భారత్‌లోని పంజాబ్‌ ‌తీరం కనిపిస్తూ ఉంటుంది. అతడు తన చేతిలోని బిడ్డను రైలు నుంచి నదిలోకి వదిలేస్తాడు. రైలు మన పంజాబ్‌లోకి వచ్చింది. అంతా హిందుస్తాన్‌ ‌జిందాబాద్‌ అని నినాదాలు చేస్తున్నారు ఆనందంగా. తీరా భారత్‌లోకి ప్రవేశించిన తరువాత చూస్తే వారు విసిరినది శవాన్ని కాదు, బతికి ఉన్న బిడ్డను. కూడా తెచ్చుకున్నది శవాన్ని.

కావూఫ్‌ ‌కథ కూడా ఇలాంటిదే. విభజన సమయంలో భయం సాటి మనిషిని ఎంత దారుణంగా అనుమానించేటట్టు చేసిందో వివరిస్తారు గుల్జార్‌. అం‌దరినీ అనుమానించడం అలాంటి సమయంలో సాధారణమే. యాసిన్‌ అనే ముస్లిం యువకుడు రైలులో ప్రయాణిస్తుంటాడు. మనసంతా భయం. ఎవరిని చూసినా  శత్రువులాగే కనిపిస్తున్నారు. దారిలో ఒక వ్యక్తి రైలు ఎక్కడం చూశాడు యాసిన్‌. ‌యాసిన్‌కు అనుమానం వస్తుంది. అతడు హిందువే అయి ఉంటాడు. తనను చంపడమే అతని లక్ష్యం కావచ్చు. ఈ భయానికీ, ఆందోళనకీ హేతువు ఏమీ లేదు. కేవలం అనుమానం. అంతకంటే శంక. అతడు తనని చంపడానికి ముందే తాను అతడిని చంపాలని పథకం వేస్తాడు. అదను చూసి రైలులో నుంచి నెట్టివేస్తాడు. పెద్ద చావు కేక వినిపిస్తుంది- ‘యా అల్లా!’.

పాకిస్తాన్‌, ‌భారత్‌ల మధ్య విభజన, దాని నేపథ్యం, దారి తీసిన పరిస్థితులు గుల్జార్‌ ‌గొప్పగా గమనించారు. వాస్తవికంగా, తార్కికంగా చూశారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఒక కవితలో అంటారు, ‘అది ఇప్పటికీ నా జన్మభూమే. కానీ నా దేశం ఎప్పటికీ కాదు/ అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాలకీ చెందిన అనేక కార్యాలయాల చుట్టూ నేను ప్రదక్షిణలు చేయాలి/ నా కలలకు రుజువులు చూపించడానికి ఈ ముఖానికో ముద్ర వేయించుకోవాలి’ అని.

గుల్జార్‌ అం‌టే తోటమాలి అని అర్ధం. అది ఆయన కలం పేరు. దానికి తగ్గట్టే ఎన్నో వన్నెలతో, లావణ్యంతో ఆయన రచనలు సాగాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram