-గత సంచిక తరువాయి

– ‌డాక్టర్‌ ‌చిత్తర్వు మధు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతికి ఎంపికైనది

హిరోషిమా నాగసాకి నగరాల మీద అణు బాంబులు జరిగినప్పుడు వారం రోజుల్లోనే పునః నిర్మాణచర్యలు చేపట్టారు ప్రస్తుతం అవి అభివృద్ధి చెందిన నగరాలు!
ఢిల్లీ, ఇతర నగరాల మీద అణు బాంబుల దాడి జరిగినప్పుడు తిరుగుబాటు చేద్దామనుకున్నా విరమించుకుని, బంకర్లలో దాక్కుని ప్రభుత్వాన్ని చేతుల్లోకి తెచ్చుకోగలిగాడు జనరల్‌ ‌సమర్‌ ‌సింగ్‌. ‌త్రివిధ దళాల్లోని ముఖ్య అధికారులు ఆయనతో ఉన్నారు. అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు సాయం చేయడం మొదలుపెట్టారు. వారంతా అండర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌ ‌లలో నివాసం ఉంటున్నారు. ‘‘ఒక పెద్ద కొత్త నగరం మళ్లీ నిర్మిస్తాను. అంతవరకు బంకర్ల నుంచే మనం కార్యకలాపాలు నిర్వహించాలి.’’ ఈ రకంగా తన అనుచరులకి కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాడు సమర్‌ ‌సింగ్‌. అనుకున్నట్లుగానే ఆరు నెలల్లో కొత్త నగరం నిర్మితమైంది. సైనికులు రోజు ఊరిలోని స్లమ్‌ ఏరియాలోకి పోయి అక్కడ బీదవారిని ట్రక్కులలో ఎక్కించుకొని కొత్త నగరం నిర్మాణానికి బలవంతంగా తీసుకొని వచ్చి పని చేయించేవారు. కూలీలు చాలీ చాలని కూలి డబ్బులతో భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. తిండికీ నీటికి మందులకు, ఆఖరికి పసిపిల్లల పాలడబ్బాలకి కూడా రేషన్‌! ఎదురు తిరిగిన వాళ్లని చంపేయమని ఆర్డర్స్ ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా దేశ ఇతర ప్రాంతాల్లో గూండాల గుంపులు మాఫియా ముఠాలు విచ్చల విడిగా తిరుగుతున్నాయి. మానవ హక్కులు ప్రజాస్వామ్యం ఆశించే వారు కొంతమంది విప్లవ సమూహాలుగా రెసిస్టెన్స్ ‌గ్రూప్స్ ‌కింద ఏర్పడి పేదవారికి ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఆరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల ప్రతినిధులు జనరల్‌ ‌సమ్మర్‌ ‌సింగ్‌తో సమావేశం అయ్యారు.
‘‘అసలు ఈ దాడి ఇండియా నుంచి ప్రారంభమైందని మా అనుమానం. ఆ తర్వాత పాకిస్తాన్‌, ‌రష్యా, అమెరికా మొదలైన దేశాల నుంచి గొలుసుకట్టు దాడులు జరిగాయి. ఇప్పటికైనా ఈ దాడి గురించి తెలిసిందా? అన్ని దేశాలు కృత్రిమమేధ రక్షణ వ్యవస్థలో ఆటోమేటిక్‌ ఎదురుదాడికి ఏర్పరచుకున్నాయి. పొరపాటున అణుబాంబుల దాడి మీ దేశం నుంచి జరిగి ఉండటానికి అవకాశం ఉందా?’’ ఇలా ప్రశ్నించారు విదేశీ అధికారులు.
‘‘ఒకవేళ పొరపాటున మీ దేశంలో పంట పొలాల్లో గడ్డి మొక్కలని తగలబెట్టిన మంటలను చూసి మిస్సైల్స్ అణుబాంబులు తీసుకొచ్చి దాడి చేసి ఉండొచ్చా?’’
‘‘ఎవరైనా మిలటరీలోని వారే, కావాలని ఇండియా పాకిస్తాన్‌ల మధ్య వైరం సృష్టించాలని ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌తో ఇది చేశారా? లేక టెక్నాలజీలోనే ఏదైనా పొరపాటు ఉన్నదా’’
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడగసాగారు. దేశాలకి అణుయుద్ధ టెక్నాలజీ వద్దని ఎప్పటినుంచో చెప్తున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా నాశనమైంది. మీ వల్ల మా దేశాలు మా నాగరికత కూడా అంధకారంలోకి వెళ్లాయి. దీనికి మీరు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది.’’అన్నారు అమెరికన్‌ ‌రక్షణ శాఖ సెక్రెటరీ. ఇదే భావాలు మిగతా మిగిలిన దేశాలు కూడా తెలియజేశాయి.
ఇది ఎవరి పొరపాటు కాదు కానీ భారతదేశం అణు యుద్ధం చేయకూడదనే సిద్ధాంతంతోనే ఉన్నది. అత్యవసర పరిస్థితుల్లో పాకిస్తాన్‌, ‌చైనాల నుంచి మిస్సైల్స్ ‌పొరపాటున సరిహద్దు దాటి వస్తే కృత్రిమ మేధతో ఆటోమెటిగ్గా శత్రుదేశ స్థావరాల మీద లాంచ్‌ ‌చేసే పక్రియ ఉన్నది. దీనిని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని అత్యున్న స్థాయి అధికారులు ఇద్దరు పర్యవేక్షిస్తారు. వారికి పాస్వర్డ్లు అయా మెసేజ్‌ ‌లాంచింగ్‌ ‌సైట్స్, ‌వాటి వివరాలూ అన్నీ తెలుసు. దీనికి కారణం పారిపోయిన ప్రధానమంత్రి విక్రమ్‌ ‌రావే నేను అనుకుంటున్నాను. ఆయనని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. కొత్త నగరాన్ని నిర్మించాం. ఉక్కుపాదంతో రెసిస్టెన్స్‌ని అదుపు చేసి దేశాన్ని అంతా నా అధీనంలోకి తెచ్చుకుంటాను. మీరు మాకు సాయం చేస్తే చాలు.’’
‘‘మా దేశాలే అధోగతిలో ఉన్నాయి. మేము మా పునర్నిర్మాణ పక్రియలో ఉన్నాం. సాయం చేసేదే లేదు. ఇది ఒక ‘‘ఎపో కాలిప్స్.’’ ఎవరి దేశాన్ని వారే నిర్మించుకోవాలి మళ్లీ. మీరు త్వరగా విక్రమ్‌ ‌రావుని బంధించి ఏం జరిగిందో తెలుసుకోండి. మళ్లీ ఇలాంటి ఉత్పాతాలు జరగకూడదు.
విదేశీ అధికారులంతా వెళ్లిపోయారు.వారిలో వారు అనుకుంటూ… ‘‘అర్ధరాత్రి అవకముందే ఈ దేశం బయటపడాలి, రోడ్లమీద ఆయుధాలతో రౌడీ మూకలు వార్‌ ‌లార్డస్ ‌వాళ్ల మధ్య వారు ఆహారం కోసం నీళ్ల కోసం చేసుకునే యుద్ధాలతో నిండి పోయింది.’’
సమావేశం ముగిసింది.
ఏమైనా సరే…! విక్రమ్‌ ‌రావునీ, అతని కూతురు ప్రియారావునీ పట్టుకోవాలి. వారి దగ్గరే ఇంకా మన ఆయుధ సామాగ్రి, బంగారం, ఫారన్‌ ‌కరెన్సీ వివరాలు బిలియన్స్ ‌డాలర్ల విలువగల వివరాలు ఉంటాయి. కొత్తనగరంలో అంత సంపద, వనరులు, సైన్యాలు మళ్లీ సమకూర్చుకుని, రెసిస్టెన్స్ ‌ఫోర్సుల్ని గెలుచుకుంటూ విక్రమ్‌ ‌రావు దాగి ఉన్న దక్షిణాది లోని ఏదో ఒక నగరంలో అతన్ని పట్టుకోవాలి’’ అన్నాడు సమర్‌ ‌సింగ్‌. ‌ప్రభుత్వం అతని చేతిలోకి వచ్చినా చాలా అణ్వాయుధాల వివరాలు కొన్ని కొన్ని బ్యాంకులు, ఇంకా రిజర్వు బ్యాంకు లాకర్లలో దాచిన ధనం, బంగారు నాణేలు లాంటి వాటి వివరాలు తెలియటం లేదు. కొత్త దేశం నిర్మించడానికి ఇవన్నీ చాలా అవసరం. ఏమైనా సరే ఒక వారంలో ప్రియారావును పట్టుకోవాలి. ఆమె బాయ్‌ ‌ఫ్రెండ్‌తో జిమ్‌ ‌కార్బెట్‌ ‌పార్కులో విహారానికి వెళ్లి అప్పటినుంచి రాలేదు. ఆ పరిసరాల్లోనే రహస్యంగా తిరుగుతుందని సమాచారం.
ఆమె చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే విక్రమ్‌ ‌రావు ప్రభుత్వంలో ఆమె రహస్యంగా పనిచేస్తున్న టెక్నాలజీ మంత్రి. ఆమెకు అన్ని వివరాలు తెలుస్తాయి.ఆమెను బంధించి ఆ విషయం బయటకు ప్రకటిస్తే, పరారీలో ఉన్న పారిపోయిన ప్రధానమంత్రి, కూతురు కోసం తప్పనిసరిగా వస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒక్కటే మార్గం.
‘‘ఓకే… ఇక మన పార్టీ చేసుకుందాం సమర్‌ ‌సింగ్‌’’ ఇతర ఆఫీసర్‌లు అన్నారు.
*       *       *
అడవిలో నడచుకుంటూ దట్టమైన చెట్ల మధ్యగా వెళ్తున్నారు రాజ్‌, ‌ప్రియ. బాగా చీకటి పడింది. ఈ ఆరేడు నెలల నుంచి కొన్ని రాత్రులు ఖాళీగా ఉన్నఇళ్లల్లోనూ, కొన్ని రాత్రులు చెట్ల కింద గడిపేవారు. అప్పుడప్పుడు పార్కులోని గెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చేవారు. ‘‘ఈరోజు గెస్ట్ ‌హౌస్‌లో తల దాచుకుందాం’’ అనుకున్నారు.
వెనకాల గుర్రుమని చప్పుడయింది.
‘‘జాగ్రత్త! రాజ్‌! ఏదో జంతువు!’’ అని ప్రియ హెచ్చరిస్తుండగానే ఒక జంతువు చీకట్లో నుంచి అతని మీద దూకింది.తోడేలు. దాని కళ్లు చీకట్లో నిప్పుల్లా మెరుస్తున్నాయి.కనుపాపలు వెండిలా తళుక్కుమని మెరిశాయి. అది రాజ్‌ ‌మెడను పట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తోంది. ప్రియా సంచిలోని గన్‌ ‌తీసుకుని క్షణాల్లో దానిమీద పేల్చింది. అది పెద్దగా ఊళ పెడుతూ పారిపోయింది.
‘‘మై గాడ్‌! ఇది ఒక పీడ కలలా ఉంది.’’ చేతులు తలపై పెట్టుకున్నాడు రాజ్‌.
‘‘‌సిగరెట్‌ ‌లైటర్‌ ఉం‌టే ఎండు గడ్డితో నిప్పు రాజేద్దాం, మంట ఉంటే క్రూర జంతువులు మన వెంట పడవు.’’
కాసేపటికి ఎర్రటి మంట చుట్టూ కూర్చున్నారు రాజ్‌, ‌ప్రియ.
రాజ్‌ అన్నాడు. ‘‘ఏది, నీ పరికరం తీసి చూపించు.’’
ప్రియ మారు మాట్లాడకుండా సంచిలో వెతికి ఒక వృత్తాకారంగా ఉన్న డివైస్‌ ‌తీసి ఇచ్చింది.
‘‘ఇప్పుడే వస్తాను’’ అని కాల కృత్యాలు తీర్చుకోవటానికి చెట్ల చాటుకు వెళ్లింది. రాజ్‌ ఆ ‌పరికరాన్ని రకాలుగా పరిశీలించ సాగాడు. హఠాత్తుగా అతని కళ్ల ఎదుట ఒక హోలోగ్రామ్‌ ‌ప్రత్యక్షమై మాట్లాడ సాగింది.
అది ప్రధాని విక్రమ్‌ ‌రావు బొమ్మ.
‘‘…ప్రియా! నా సందేశం నీకు అందేసరికి నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. ఎన్నో రోజులుగా నీకు చెప్పాలనుకున్నా చెప్పలేక ఆగాను. నామీద మిలటరీ జనరల్‌ ‌సమర్‌ ‌విప్లవానికి ప్రయత్నిస్తు న్నాడు. ఏ క్షణమైనా విప్లవం జరగొచ్చు. ఆ వెంటనే చేపట్టవలసిన పథకం వేసుకున్నాను. కృత్రిమమైన అణుదాడిని సృష్టించి భయపెట్టి అతన్ని పారిపోయే టట్లు చేద్దామని నా పథకం. ఆ సమయంలో నేను అధికారాన్ని దక్కించుకుంటాను. లేదా ఎక్కడికైనా అజ్ఞాతవాసానికి వెళ్లిపోతాను. నువ్వు విడిది చేస్తున్న అతిథిగృహం కిందనే అండర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌ ఉం‌ది. దాని పాస్వర్డ్ ‌నీకు చెప్పాను. అక్కడ కనీసం 6 నెలలకి సరిపడ ఆహార పదార్థాలు, నీరు ఉన్నాయి. నువ్వు, నీ బాయ్‌ ‌ఫ్రెండ్‌ అక్కడ తలదాచుకోవచ్చు. ఆ తరువాత బయటకు వచ్చి నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. లేదా సమర్‌ ‌సింగ్‌ ‌మీద తిరుగుబాటు చేయబోయే శక్తులతో కలిసి పోరాడవచ్చు.
ఎంతో దూరం ఆలోచించి ఈ సందేశం పెడుతున్నాను. ఇలా జరగకూడదు అని ఆశిస్తున్నాను. కానీ జరిగితే నువ్వే నా వారసురాలివై ఈ దేశాన్ని రక్షించాలి. బీద ప్రజలకి అభ్యుదయ మార్గంలో కొత్త ప్రభుత్వం ఏర్పరచాలి.’’ కళ్ల ముందు మెరిసిన హోలోగ్రామ్‌లో కో ఆర్డినేట్స్ ‌కనిపిస్తున్నాయి. అదే సమయంలో పొదల చాటు నుంచి ప్రియ వచ్చింది.
ఆఖరిగా సురక్షణ టు జీరో ఫోర్‌ ‌వన్‌ అనే మాటలు చూపించి ఆ దృశ్యం అదృశ్యం అయి పోయింది.
అట్లాగే నిలబడిపోయింది ప్రియా. ఇన్ని రోజులు చేతిలో ఆధారం పెట్టుకుని కూడా ఎన్నో కష్టాలు పడ్డాం. రాజ్‌ ‌నువ్వు ఉండబట్టి ఈ విషయం తెలిసింది.
రాజ్‌ ‌లేచి నిలబడ్డాడు ‘‘పద ప్రియా. తొందరగా ఇదేంటో చూద్దాం.’’ ఇంతవరకు నివసించిన అతిథి గృహంలోకి వెళ్లారు. అన్ని గదులు వెతికారు. భూగర్భం గురించి ఆలోచించాడు రాజ్‌. ఒకచోట నేల మీద డొల్లగా ఉన్నది. చేత్తో కొట్టిన శబ్దం బట్టి కనిపెట్టగలిగాడు. రెండు చెక్క ముక్కలు పైకి తీస్తే ఒక వృత్తాకారపు ఎలక్ట్రానిక్‌ ‌ఫలకం కనిపించింది. దాని మధ్య పాస్వర్డ్ ‌పాస్వర్డ్ అని అక్షరాలు మెరుస్తున్నాయి.
వెంటనే సురక్షణా టు జీరో ఫోర్‌ ‌వన్‌ అని కీబోర్డ్ ‌మీద రాశారు. కొన్ని మరలు కదిలిన శబ్దమై తలుపు తెరుచుకుంది. కిందికి మెట్లు కనిపించాయి. మెట్ల మీదుగా దిగి ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో చుట్టూ చూశారు.
పెద్ద హాలు, కారిడార్‌, ‌పక్కన రెండు గదులు, గోడలు అల్మయిరాలు కబోర్డ్‌లు వాటిలో ఆహార పదార్థాల డబ్బాలు, దుస్తులు, అణు ధార్మికశక్తి నుంచి రక్షణనిచ్చే సూట్లు, అత్యవసర మందులు కనిపించాయి.
చాలా రోజుల తర్వాత కడుపునిండా భోజనం చేశారు. నిద్ర ముంచుకు వచ్చింది.
‘‘ప్రియా ఒక రూమ్‌లో, రాజ్‌ ‌మరొక రూంలో మెత్తటి పరుపుల మీద పడుకున్నారు. ఎన్ని గంటలు నిద్రపోయారో వాళ్లకే తెలియదు.
*       *       *
మత్తుగా కళ్లు తెరిచింది ప్రియా. ‘‘గుడ్‌ ‌మార్నింగ్‌! ‌ప్రియా!’’
‘‘ఎవరు?’’ అన్నది ప్రియా. ‘‘నేను ఎక్కడ ఉన్నాను?’’
తర్వాత క్రమంగా గుర్తు వచ్చింది జరిగినదంతా.
అస్పష్టతలోంచి స్పష్టతలోకి వచ్చి ఎదురుగా ఒక పొడవైన యువతి బంగారు జుట్టు నీలి కళ్లు ఎర్రటి • షర్ట్ ‌లో చాలా అందంగా ఉంది. ఆమె కళ్లు వెండి వెలుగుతో మెరుస్తున్నాయి.
‘‘ఎవరు మీరు?’’ అన్నది ప్రియా ఆశ్చర్యంతో.
‘‘నా పేరు ఆశ. మీకు సహాయం చేయడం కోసం మీ తండ్రి విక్రమ్‌ ‌రావు నన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు!’’
అప్పుడే గదిలోకి వస్తున్న రాజ్‌ ఆశ్చర్యంతో అరిచాడు. హ్యూమనోయిడ్‌ ‌రోబోట్‌… ‌కృత్రిమ మేధతో తయారయింది. ఇప్పుడు ఆక్టివేట్‌ అయింది.
ఆశ వెనక్కి తిరిగి ‘‘హలో! రాజ్‌ !ఎలా ఉన్నారు? బాగా నిద్ర పట్టిందా?’’ అంది. ‘‘మీకు బ్రేక్‌ ‌ఫాస్ట్ ఇక్కడికి కావాలా? లేక డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద తింటారా? ఏమైనా మందులు కావాలా?’’
ఈ రకమైన కుశల ప్రశ్నలు వేసింది
చాలా నెలల తర్వాత ప్రియా రాజ్‌ ఒక్కసారి ఉద్వేగానికి సంతోషానికి లోనయ్యారు.
‘‘మేము బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌తింటాము. ఆ తర్వాత ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం’’ అన్నది ప్రియా.
ఆశ నడిచి వెళుతున్నప్పుడు ఆమె వంక చూస్తూనే అన్నాడు రాజ్‌. ‘‘ఈమె ఒక కంప్యూటర్‌ ‌మాత్రమే కాక చాలా తెలివికల మనిషి కంటే ఎక్కువ సహాయం చేస్తుంది మనకి.’’
ఇద్దరూ డైనింగ్‌ ‌హాల్లోకి నడిచారు బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌టేబుల్‌ ‌దగ్గర బ్రెడ్‌ ‌రోల్స్ ‌వేడి కాఫీ ఫ్రూట్‌ ‌జ్యూస్‌ అమర్చి ఉన్నాయి.
‘‘ఇదంతా ఎలా?’’ఆశ్చర్యంగా అన్నది ప్రియా.
ఇది అన్ని విధాల సదుపాయాలు ఉన్న అండర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌. ఇక్కడ జనరేటర్‌తో విద్యుత్‌ ‌వస్తుంది. ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ ఉన్నది. పరిశుభ్రమైన నీరు ఆరు నెలలకు సరిపడా ఉంది. ఆ తర్వాత రీసైక్లింగ్‌ ‌చేసుకోవాల్సిందే.
ఈ లోపల మీరు రాజధాని చేరుకోవడానికి పథకాలు వేసుకోవాలి.’’
కడుపునిండా బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌చేసిన తర్వాత ప్రియా రాజ్‌ ‌హాల్లో కూర్చున్నారు.
‘‘ఆశా… మాకు ఇప్పుడు పరిస్థితి గురించిన సమాచారం కావాలి ఎలా?’’
‘‘మీకు ఇచ్చిన పాస్‌ ‌వర్డ్ ఎలక్ట్రానిక్‌ ‌పరికరంతో నా తల వెనక భాగంలో పెట్టండి. సమాచారం అంతా వస్తుంది’’ అన్నది ఆశ.
వెంటనే ఎలక్ట్రానిక్‌ ‌డివైస్‌ ఆమె తల వెనుక భాగంలోని స్లాట్‌లో అమర్చారు.
ఒక క్షణం రీబూట్‌ అయినాక ఆశా చెప్పడం మొదలు పెట్టింది.
‘‘నా తలలోని సమాచారం అంతా ఎదురు గుండా స్క్రీన్‌లో వస్తుంది చూడండి. ఈ ఆరు నెలల్లో చాలా మార్పులు జరిగినాయి. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌లోపం, పొరపాటు వల్ల అణుదాడులు జరిగినాయి. ప్రపంచమంతా నాశనమైంది. అరాచకం రాజ్యమేలుతోంది. ఢిల్లీలో బాంబు దాడి వల్ల రేడియేషన్‌ ‌వల్ల లక్షల మంది మరణించారు. జనరల్‌ ‌సమర్‌ ‌సింగ్‌ అధికారంలోకి వచ్చాడు. క్రూరమైన నియంతృత్వ ప్రభుత్వం ఏర్పరిచాడు. కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాడు. అరాచకంతో దేశం మధ్యయుగంలోకి వెళ్లిపోయింది. బీదవారిని, వెనుకబడిన కులాల వారిని నిర్బంధించి సరైన జీతాలు, ఆహారం ఇవ్వకుండా నగరాన్ని నిర్మింప చేస్తున్నాడు సమర్‌ ‌సింగ్‌.
అతని దగ్గర ఇంకా ఆయుధాలు, అణ్వాయు ధాల సామాగ్రి పరికరాలు అంతులేని సంపద ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉపయోగించుకోవడానికి తగిన కంప్యూటర్‌ ‌సమాచారం ఆయన దగ్గర లేదు. ఆ సమాచారం అంతా నా దగ్గర ఉన్నది. నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వమని మీ తండ్రి ఆజ్ఞ. అయితే దానికి సరైన పాస్‌ ‌వర్డ్, ‌నీ ఫింగర్‌ ‌ప్రింట్‌ ‌కావాలి. ఆ తరువాత మనం రెసిస్టెన్స్ ‌ఫోర్సులతో కలిసి ఢిల్లీ మీద దాడి గాని లేక రహస్యంగా సమర్‌ ‌సింగ్‌ ఆయుధ సామాగ్రిని, సంపదని దోచుకోవటం గాని చేసి అతని ఓడించాలి. నిర్మూలించాలి ఇవే నా ఆర్డర్స్, ‌పోగ్రాం అలా చేశారు.
ఎదురుగా తెరమీద వివిధ రకాల వార్తల దృశ్యాలు కనపడసాగాయి. మండిపోతున్న భవనాలు, నల్లగా ఆకాశం అప్పుడప్పుడు కురిసే యాసిడ్‌ ‌రైన్‌, ‌శవాల గుట్టలు నగరం బయట సమాధి చేస్తున్న దృశ్యాలు. సమర్‌ ‌సింగ్‌ ‌టెలివిజన్లో ఉపన్యాసం చేయటం. రోడ్లపక్కగా దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్న బీదాబిక్కీ జనం.
రేడియేషన్‌ ‌వల్ల వచ్చిన జ్వరంతో శరీరమంతా నల్లబడి బొబ్బలు ఎక్కి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ చనిపోతున్న ప్రజలు. ఇవన్నీచూశారు. జిమ్‌ ‌కార్బెట్‌ ‌నేషనల్‌ ‌పార్క్‌లోని అతిథిగృహం నుంచి ప్రియా రాజ్‌ ఆశ హ్యూమనాయిడ్‌ ‌రోబోట్‌ ‌బయటపడ్డారు.
‘‘మేమిద్దరం మనుషులం. మాకు ఆహారం ఉంటే సరిపోతుంది. మరి నీకెలా?’’ అని అడిగింది ప్రియా.
‘‘నేను ఒకసారి చార్జీచేసుకుంటే 48 గంటలు శక్తి వస్తుంది. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న పవర్‌ ‌కేబుల్స్ ‌కానీ డీసెల్‌ ‌జనరేటర్లకు గాని నా స్లాట్‌లో బిగిస్తే నాకు శక్తి వస్తుంది. దానికి ఆరు గంటలు పడుతుంది.’’
విజ్ఞాన శాస్త్రం ఎన్ని ఆవిష్కరణలు చేసినా కొన్ని సమస్యలు మాత్రం మిగిలే ఉంటాయి. రోబోట్‌ ‌ప్రాణమంతా దాని ఛార్జింగ్‌లో ఉంటుంది. ఈ రెండు రోజుల లోపల ఢిల్లీకి చేరుకుని సమర్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చి వేయడం ఎలా?. ‘‘ఆగండి’’ అని ఆశ తన మేధస్సుతో చుట్టుపక్కల పరికిస్తున్నట్లు చూసింది. ‘‘ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో, హైవే పక్కన ఒక జీప్‌ ఉం‌ది. దానిలో ప్రయాణికులు దూరం నుంచి వస్తూ హఠాత్తుగా యాసిడ్‌ ‌రైన్‌ ‌వల్ల మరణించారు. ఆ శవాలు జీప్‌లోనే ఉన్నాయి. దానిని మనం వాడుకుని ఢిల్లీ దాకా వెళ్లిపోవచ్చు.’’
నిజంగానే రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ల్యాండ్‌ ‌రోవర్‌ ‌దొరికింది. ఇప్పుడు ప్రతిదానికి భయపడే అలవాటు పోయింది ప్రియాకు రాజుకు. ఎలాంటి భయంకరమైన దృశ్యాల్ని కూడా చూడగలిగే శక్తి వచ్చింది. ఇద్ద్దరూ రేడియేషన్‌ ‌నుంచి రక్షించే సూట్లు వేసుకున్నారు. భుజానికి తగిలించిన బ్యాగుల్లో నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, నీటి బాటిల్స్ ‌దాచుకున్నారు. జీపులోని శవాలని పక్కకు తోసివేసి దానిని స్టార్ట్ ‌చేశారు. ట్యాంకులో ఇంకా సగం ఇంధనం ఉంది, ఆశ రోబట్‌ ‌వెనక సీట్లో కూర్చుంది. రాజ్‌ ‌రెండు వైర్లు కలిపి ఎలాగో ఇంజిన్‌ ‌స్టార్ట్ ‌చేశాడు.
ల్యాండ్‌ ‌రోవర్‌ ‌వేగంగా కదిలింది.రెండుమూడు గంటలలో ఢిల్లీకి చేరుకోవాలి. రోబోట్‌ ‌ఛార్జ్ అయిపోయేలోగా సమర్‌ ‌సింగ్‌ ఆయుధ వ్యవస్థని బ్యాంకు వ్యవస్థని హ్యాకింగ్‌ ‌చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలి.
*       *       *
నగరంలోకి ప్రవేశిస్తూనే ఒక పీడకలలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది వారిద్దరికీ. జీప్‌ ‌డీసెల్‌ అయిపోయేలోగా ఢిల్లీ చేరుకున్నారు.
నగరమంతా ఒక రకమైన దుర్గంధం వ్యాపించి ఉంది. అక్కడక్కడ రోడ్డు పక్క శవాలు కూడా పడి ఉన్నాయి. నల్లగా మాడిపోయిన భవనాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
పూర్వం ప్రభుత్వ కార్యాలయం ఉన్న ప్రాంతం సెంట్రల్‌ ‌విస్టా కింద కొత్త నగరం నిర్మితమవుతోంది. అక్కడి నుంచే సెక్యూరిటీ గార్డులు రేడియేషన్‌ ‌సూట్లు ధరించి మిషన్‌ ‌గన్స్ ‌ధరించి ప్రతి ఆరు కిలోమీటర్లకి నిలబడి ఉన్నారు.
వారిని దాటుకుని ఎలా వెళ్లాలి?
‘‘నా ఛార్జింగ్‌ ‌మరొక 24 గంటల పది నిమిషాల్లో అయిపోతుంది’’ ప్రకటించింది ఆశ.
ఊర్లో ఎలక్ట్రిసిటీ లేదు. రోజుకి మూడు గంటలే ఒకే ఒక్క ధర్మల్‌ ‌ప్లాంట్‌ ‌నుంచి కరెంటు ఇస్తున్నారు.
మనం పాడుపడిన వీధుల్లోని ఒక రెస్టారెంట్‌ ‌కి వెళదాం. అక్కడ కరెంటు దొరకవచ్చు.
నేను ఇచ్చిన ఆధారాల ప్రకారం సమర్‌ ‌సింగ్‌ ‌రక్షణ వ్యవస్థలోకి హ్యాకింగ్‌ ‌చేయొచ్చు.
లాండ్‌ ‌రోవర్‌ ‌పాతపట్నం సందుల్లోకి గల్లీలోకి తిరిగి ఒక రెస్టారెంట్‌ ‌ముందు ఆగింది. ముగ్గురు దిగి లోపలికి వెళ్లారు. అంతా నిర్మానుష్యంగా ఉంది.
సంచిలోని ఆహార పదార్థాలతో కడుపు నింపుకుని నీళ్లు తాగారు.
‘‘ఇక మొదలు పెట్టండి’’ అన్నది ఆశ.
ప్రియా కంప్యూటర్లో డిఫెన్స్ ‌సిస్టమ్స్ అన్న వెబ్సైట్‌ ‌తెరిచి పని చేయసాగాడు.
రక్షణ వ్యవస్థ దాటి సైనికులను దాటి సమర్‌ ‌సింగ్‌ను ఎదిరించటం అసాధ్యం కానీ అతని రక్షణ వ్యవస్థని ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సాయంతో ‘‘హ్యాక్‌’’ ‌చేయడం కుదురుతుంది. దీనికి రహస్యమైన సీక్రెట్‌ ‌కోడ్‌ ‌వివరాలు ఉన్న ఆశా రోబోట్‌ ‌సహాయపడింది.
మర్నాడు తెల్లవారే టైమ్‌కు రాజ్‌ ‌ప్రియా సమర్‌ ‌సింగ్‌ ‌న్యూక్లియర్‌ ‌రక్షణ వ్యవస్థని హ్యాకింగ్‌ ‌చేయగలిగారు.
‘‘ఈ సిస్టంలో ఈ కోడ్‌ ‌ముద్రించండి. దానితో సమర్‌ ‌సింగ్‌ ‌వద్ద ఉన్న అణ్వాయుధాలన్నీ సెల్ఫ్ ‌డిస్ట్రక్ట్ (‌తనను తానే నిర్మూలించేందుకు ఆజ్ఞ ఇవ్వడం) అనే పద్ధతిలోకి వెళ్తాయి. ఆ తరువాత పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. సమర్‌ ‌సింగ్‌ ‌కార్యాలయం, అధికారులు, సైన్యం నాశనం అవుతాయి. ఆ తరువాత కోడ్‌తో ట్రెజరీలని తెరవచ్చు. సమర్‌ ‌సింగ్‌ ‌సింగ్‌ ‌సైన్యాలు నాశనం అయిపోయినాక… రెసిస్టెన్స్ ‌దళాలకి దక్షిణాపథంలో నా నగరంలో దాక్కున్న ప్రధానమంత్రి విక్రం రావుకి సందేశం వెళుతుంది. వారంతా తిరిగి ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం స్థాపిస్తారు’’ చెప్పింది ఆశ.
‘‘మళ్లీ అణువిస్ఫోటనమా… మనకు రక్షణ ఎలా? ఇదే కాకుండా ఇంకా ఎంతో మంది అమాయక సైనికులు ప్రజలు అధికారులు ప్రాణాలు కోల్పోతారు కదా!’’ అన్నది ప్రియా.
‘‘ఇది డు ఆర్‌ ‌డై సిట్యుయేషన్‌. ‌చావు లేదా చంపు! మనమన్నా పోవాలి, నియంత అన్నా పోవాలి. ఇదే సూత్రంతో మీ తండ్రి నన్ను పోగ్రాం చేశారు. ఇలా చేయవలసిందే. వేరే మార్గం లేదు.’’
కంప్యూటర్లో ఒక గంట, ఆశకు 16 గంటల ఛార్జి ఉంది.ఆలోచించే సమయం లేదు.ఎట్టకేలకు సెల్ఫ్ ‌డిస్టర్బ్ ‌సీక్వెన్స్ ‌స్టార్టెడ్‌ (ఆత్మ వినాశన పద్ధతి) అని ఎర్రటి అక్షరాలతో సందేశం రాసాగింది. దాని పక్కనే రెండు గంటల 36 నిమిషాల 30 సెకండ్స్ అని టైమర్‌ ‌కూడా మొదలైంది
‘‘హుర్రే !హుర్రే!’’అన్నారు ముగ్గురూ.
నియంత సమర్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వానికి అంతం మొదలైంది. మనం అర్జెంట్‌గా దగ్గర్లో ఉన్న అండర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌కు వెళ్లాలి. ఆశా రోబోట్‌ ‌కళ్ల ఎదురుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని అండర్‌ ‌గ్రౌండ్‌ ‌స్థావరాలు ఉన్న స్థలాలన్నీ కనిపించసాగాయి. చాందిని చౌక్‌ 33 ‌పనివాళ్ల చోటు. అది మనకు అనుకూలం. అక్కడ ఒక పాస్వర్డ్, ‌ప్రియా చేతితో బంకరులోకి ప్రవేశించవచ్చు.’’ అని చెప్పింది. ఆశ అలా చెప్తూ ఉండగానే ఆమె గొంతు బలహీనమైంది.
‘‘ఇది అనుకోని అవాంతరం. నా పవర్‌ అయిపోతోంది. ఒక గంటలో. అర్జెంటుగా మీరు బంకర్‌ ‌చేరుకోండి. ఆ బంకర్‌లోని జనరేటర్‌ ‌సాయంతో నన్ను ఛార్జ్ ‌చేయవచ్చు నేను ఇప్పుడు స్లీప్‌ ‌మోడ్‌ ‌లోకి వెళ్లిపోతున్నాను..’’ ఆశా నిశ్శబ్దంగా అయిపోయింది. ప్రియా, రాజ్‌లకు టెన్షన్‌ ‌పెరిగిపోయింది. చివరి క్షణం దాకా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. పవర్‌ ఆఫ్‌ అయిన ఆశా రోబోట్‌ ‌ను మోసుకుంటూ కంప్యూటర్‌ ‌లోని మ్యాప్‌ ‌సాయంతో వీధుల్లో తిరిగి ఒక గంటలో చాందినీ చౌక్‌ 33 అం‌డర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌ ‌చేరుకోగలి గారు. అదృష్టవశాత్తు ఇక్కడ సైనికులు లేరు. గోడపైన ఒక అరచేతి బొమ్మ ఉంది. దాని పక్కన పాస్వర్డ్ అని ఉంది. ఒక కీ బోర్డు ఉంది. అరచేతి బొమ్మ అప్పుడప్పుడు మెరుస్తుంది. దూరంగా ఒక మిలిటరీ జీప్‌ ‌రాసాగింది. మెగా ఫోన్‌లో ‘‘హాల్ట్! ‌హాల్ట్!’’ అని హెచ్చరికలు రాసాగాయి. మిషన్‌ ‌గన్స్‌తో ఉన్న సైనికులు పరిగెత్తి రాసాగారు. ప్రియా గబగబా పాస్వర్డ్ ‌టైప్‌ ‌చేసింది. 5 సెకండ్లలో ఉరుమురినట్లు చప్పుడుతో తలుపు తెరుచుకుంది. ‘‘పద.త్వరగా లోపలికి వేగంగా మరి.’’ అరిచింది ప్రియా.
సైనికులు నాలుగు గజాల దూరంలో ఉండగానే ప్రియా రాజ్‌ ఆశా రోబోట్‌తో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌బంకర్‌లోకి వెళ్లిపోయారు
ఉరుములాంటి చప్పుడుతో బంకర్‌ ‌మూసు కుంది. మెట్లు దిగి లోపలికి వెళ్లగానే విశాలమైన హాల్లో డజన్ల కొద్ది నీరసించిన, చిక్కిపోయిన మురికి పేటల వాసులు నేల మీద పడి అచేతనంగా ఉండటం కనిపించింది. వారిలో ఎందరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు. శక్తి లేక నిర్జీవంగా ఉన్న ఆశా రోబోట్‌ని పక్కనే పడుకోబెట్టుకుని అచేతనంగా వాళ్ల మధ్య నిర్జీవంగా ఉన్నట్లుగా పడుకున్నారు రాజ్‌, ‌ప్రియా. ఏ క్షణమైనా సైనికులు లోపలికి వస్తారు. తాము చనిపోయినట్లు భావించి వెళ్లిపోతే చాలు.
అయితే బయట నుండి సైనికులు లోపలికి రావడానికి అరగంట పైనే పట్టింది నలుగురు సైనికులు లోపలికి వచ్చి ఫ్లాష్‌ ‌లైట్‌లతో అందరిని పరీక్షిస్తున్నారు.
‘‘ఆగు!ఆ చివర ఉన్న ఆమె ప్రియారావ్‌ ‌ముఖ కవళికలతో ఉన్నది. ఆమే మనకు కావలసిన వ్యక్తి. ఒక సైనికుడు అరిచాడు, తన దగ్గర ఉన్న ఫొటోతో కంపేర్‌ ‌చేస్తూ.
వాళ్లు దగ్గరికి రాసాగారు.
ప్రియా గట్టిగా కళ్లు మూసుకుంది ఇవి తమ ఆఖరి క్షణాలు కావచ్చు.
అంతలో తెరిచి ఉన్న బంకర్‌ ‌తలుపుల నుంచి వినపడసాగాయి సైరన్‌ ‌మోతలు. నక్కలు ఊళపెట్టినట్లు గుడ్లగూబ అరిచినట్లు.
‘‘వార్నింగ్‌! ‌వార్నింగ్‌! అణుదాడి! 10 నిమిషాల్లో అందరూ హెడ్‌ ‌క్వార్టర్స్‌కి చేరుకోవాలి!’’ ‘అణుబాంబుల దాడి మళ్లీ జరిగిపోతోంది. ఎక్కడి నుంచో తెలియదు’’ అని ఒకడు బయట నుంచి నుంచి అరిచాడు.
సైనికులు ఒక క్షణం ఆలోచించి వెనక్కి తిరిగి మెట్ల మీదుగా పారిపోసాగారు.
సైరన్లు మోగుతున్నాయి.
సమర్‌ ‌సింగ్‌ ఆయుధాగారంలోని అణుబాంబు లన్నీ ఒక్కసారి ‘‘సెల్ఫ్ ‌డిస్ట్రక్ట్ ‌సీక్వెన్స్’’ (ఆత్మ వినాశన పద్ధతి)లో పేలిపోయాయి. చెవులు చిల్లులు పడే పడే శబ్దం నగరమంతటా వినిపించింది.
బయటికి వెళ్లి సైనికులు ఆ శబ్దానికి భయపడి నేల మీద పడిపోయారు. దట్టమైన నల్లటి పొగ నగరం అంతా వ్యాపించింది.
ప్రియ పరిగెత్తుకొని వెళ్లి బంకర్‌ ‌తలుపు పక్కనున్న స్విచ్‌ ‌నొక్కింది. అరచేతితో ముద్ర వేసింది స్లాట్‌లో.
కీచుమనే చప్పుడుతో న్యూక్లియర్‌ ‌బంకర్‌ ‌తలుపులు మూసుకున్నాయి.
అప్పటినుంచి మూడు రోజులు ఆ బంకర్లోనే తల దాచుకున్నారు.
తమ సంచిలోని నీళ్లూ, ఆహారమే ఆధారం.
అయితే లోపల ఉన్న ఒక జనరేటర్‌ ‌దగ్గర కేబుల్‌ ‌కనెక్ట్ ‌చేసి రోబోట్‌ని ఛార్జి చేయగలిగారు.
ప్రతి ఆరు గంటలకి వివరాలు చెప్పింది ఆశ. 72 గంటల తర్వాత ఇక మనం బయటకు పోవచ్చు. బంకర్‌లో ఉన్న కొద్దిమంది ప్రాణాలతో ఉన్నారు. సహకారం చేస్తున్నారు.
‘‘ఇక భయం లేదు.బయటికి పోదాం పదండి!’’ అన్నది ప్రియా.
ఎప్పుడో తన తండ్రి తనకోసం ముందుచూపుతో ఏర్పరిచిన ఏర్పాటు వల్ల అరచేతి ముద్రవేసి ప్రియా బంకర్‌ ‌తలుపు తెరిచి రాజుతో పాటు ఇతర బీదాబిక్కీ జనంతో పాటు వెలుతురులోకి నడిచింది.
‘‘నువ్వు ఎవరో దేవతలాగా వచ్చావ్‌! అమ్మా! మమ్మల్ని రక్షించావు.’’ అన్నారు ప్రజలు.
దూరంగా ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. సమర్‌ ‌సింగ్‌ ఆఖరినగరం పూర్తిగా విధ్వంసం అయింది.
ఇప్పుడు కరెంటు వచ్చి ఛార్జిలోకి వచ్చిన ఆశ అంది.
‘‘ప్రధానమంత్రి విక్రమ్‌ ‌రావు ఫ్రీక్వెన్సీకి తెలియజేస్తున్నాను. విజయం మనదే!
ఇంకా ఇతర రెసిస్టెన్స్ ‌ఫోర్స్‌లు అందరికీ కూడా సందేశం పంపించాను. విజయం మనదే!
అతి త్వరలో మళ్లీ ప్రజా ప్రభుత్వం వస్తుంది.’’
‘‘జైహింద్‌!’’ అన్నది ఆశ.
‘‘జైహింద్‌!’’ అన్నాడు రాజ్‌.
‘‘‌జైహింద్‌!’’ అన్నారు ముక్తకంఠంతో వారి వెనుక ఉన్న ప్రజలు.

వచ్చేవారం కథ..
జంగిడి జీవితం – రంజిత్‌ ‌గన్నోజు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram