‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

-‌ పుట్టగంటి గోపీకృష్ణ

శరీరానికి గుచ్చాల్సిన సూదులన్నీ గుచ్చి, వాటికి అమర్చాల్సిన ట్యూబులన్నీ అమర్చి, విసుగ్గా రాజన్న వైపు చూసిన నర్సు, ‘‘తెలుసుగా! దాదాపు నాలుగు గంటలు పడుతుంది. ఏదన్నా అవసర మయితే పిలువు…’’ అని అక్కడ నుండి వెళ్లి పోయింది. ఆమె మాటల్లో వినిపిస్తున్న నిర్లక్ష్యాన్ని గమనించినా ఏం చేయలేక మౌనంగా ఉండిపో యాడు రాజన్న.

రాజన్న ఒకప్పుడు నక్సలైటు. దళంలో పనిచేశాడు. వయసు వి•రటంతో అనారోగ్య సమస్యలు పెరిగాయి. అడవిలో ఉండలేని పరిస్థితి. పైగా నక్సలిజం బలహీన పడింది. ఒకరి తరువాత ఒకరుగా సహచరులు చనిపోవటమో, లొంగిపోవటమో జరిగిపోయింది. ఇక అతనికి కూడా బయటి ప్రపంచంలోకి రాక తప్పలేదు. లొంగిపోయిన తరువాత కొన్ని రోజులు వార్తల్లో నిలిచాడు. అతనితో ప్రమాదం లేదని నిర్ధారించుకున్న పోలీసులు, రోజు విడిచి రోజు పోలీస్‌ ‌స్టేషన్లో సంతకం పెట్టమని కండిషన్‌ ‌పెట్టి అతన్ని వదిలేశారు. తరువాత అతన్ని పట్టించుకునే వారే లేకపోయారు.

అతని రెండు కిడ్నీలు పాడయిపోయాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్‌ ‌చేయటానికి స్నేహితులు, బంధువులు ఎవరయినా దానం ఇవ్వాలన్నారు. అతనికి అలాంటి వారు ఎవరూ లేరు. ఇక మిగిలింది డయాలిసిస్‌ ‌చేయించుకుంటూ తాత్కాలికంగా చావును వాయిదా వేస్తూ ఉండటం. వారానికి మూడుసార్లు డయాలిసిస్‌ ‌చేయించుకోవాలి. ఈ పక్రియ పూర్తి కావటానికి గంటల సమయం పడుతుంది. అలా వారంలో ప్రతి రోజు అతను అయితే పోలీస్‌ ‌స్టేషన్లో లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజులు గడపక తప్పటం లేదు.

ఆసుపత్రి నాలుగవ అంతస్తు కిటికీ నుండి బయటకు చూశాడు రాజన్న. బయటి ప్రపంచం ఎప్పటిలానే హడావిడిగా ఉంది. అయితే కిటికీకి ఉన్న అద్దాలు బయటి శబ్దాలను అడ్డుకోవటంతో, బయటి లోకం మూకీ సినిమాలో దృశ్యంలా కనిపిస్తోంది.

డయాలిసిస్‌ ‌యూనిట్‌ ‌నుండి వస్తున్న సన్నటి శబ్దం ఒకొకసారి విసుగు, మరొకసారి సాంత్వన కలిగిస్తోంది.

ఆసుపత్రి పక్కన ఒక పెద్ద మైదానం ఉంది. మూడు రోజుల క్రితం వచ్చినపుడు ఆ మైదానంలోకి ఒకదాని వెంట ఒకటిగా అనేక ట్రక్కులు వస్తూ కనిపించాయి. వాటిలో నుండి దిగుతున్న సామాను చూసి, ‘మరలా ఏదో ఎగ్జిబిషన్‌ ‌పెడుతున్నా రనుకుంటా…’ అనుకున్నాడతను. ఇప్పుడు చూస్తే అక్కడ అనేక టెంట్లు కనిపిస్తున్నాయి. ఎరుపు, నీలి రంగుల చారలతో మధ్యలో పెద్దగా ఉన్న టెంటు ప్రదర్శన ఇవ్వటానికని అర్థ్ధమవుతోంది. దాని చుట్టూ చిన్న చిన్న టెంట్లు ఉన్నాయి.

అయితే అతన్ని ప్రత్యేకంగా ఆకర్షించింది ఆ సర్కస్‌ ‌పేరు. ‘రాయల్‌ ‌సర్కస్‌’ అన్న పేరు చూడగానే, ఆ పేరుతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు అతన్ని ముసురుకున్నాయి.

                                                                                               *      *     *

దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం…

రాజన్న అప్పటికి కేవలం రాజు మాత్రమే. అతని స్నేహితుడు సాగర్‌. ‌రాజు డిగ్రీ పూర్తి చేశాడు. సాగర్‌కు చదువు అబ్బలేదు. ఇద్దరివీ ఆర్థికంగా బలహీన కుటుంబాలే. ఇద్దరికీ ఎంత ప్రయత్నించినా పని దొరకటం లేదు.

‘ఒక వ్యక్తికి యవ్వనంలో కమ్యూనిస్టు భావాలు లేవన్నా, వయసు మళ్లాక క్యాపిటలిస్టు భావాలు రాలేదన్నా అతనిలో ఏదో లోపం ఉందని అనుకోవాలి…’ అన్నాడు ఒక పెద్ద మనిషి. రాజు కూడా చదుకునే రోజుల నుండే అన్నల ప్రభావంలో పడ్డాడు. కానీ వారి పిలుపు అందుకుని అడవుల్లోకి వెళ్లే ధైర్యం చేయలేక పోయాడు.

ఆ రోజు సమయం సాయంత్రం అయిదవు తోంది. స్నేహితులు ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

‘‘అందరు మన కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటారు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే కదరా రిజర్వేషన్‌ అమలయ్యేది. ప్రైవేటు ఉద్యోగాలకెళ్తే ముందు అడిగే మాట నీ కులం ఏమిటని. మన కులం పేరు చెప్పగానే ఖాళీలు లేవంటారు. ఇక ఉద్యోగం వచ్చేది ఎక్కడ?’’ ఆక్రోశంగా అన్నాడు రాజు.

‘‘కులం సంగతి పక్కన పెట్టు. మనిషి రంగు కూడా ముఖ్యమే తెలుసా? మొన్న ఒక హోటల్లో పని అడిగితే కుదరదు పొమ్మన్నాడు. ఎందుకంటే… నేను నల్లగా ఉన్నానంట. నా పళ్లు ఎత్తుగా ఉన్నాయంట.’’ నవ్వుతూ చెప్పాడు సాగర్‌.

‘‘‌నీకు నవ్వెట్లా వస్తుందిరా?’’

‘‘ఏడిస్తే ఉపయోగం లేదు కాబట్టి నవ్వుతున్నాను. మొన్న మోతుబరి ఇంట్లో వ్యవసాయ పనులకు వెళ్లాను. అక్కడ అతని ఇంట్లో ఎద్దుల్ని చూశాను. పందాలకు పంపుతాడంట. వాటికి పెట్టే తిండి చూస్తే నాకు నోరు ఊరింది. వాటికి మనుషులు మాలిష్‌ ‌చేస్తున్నారు. ఇంకో వైపు కోడి పుంజులు ఉన్నాయి. సంక్రాంతి పందాలకు తయారు చేస్తున్నాడంట. వాటికి బాదం పప్పు పెట్టి బ్రాందీ తాగిస్తున్నారు. ఆయన ఇంట్లో ఒక కుక్క ఉంది. దానికి ముక్క లేందే ముద్ద దిగదు. మనుషులతో సమానత్వం గురించి మాట్లాడుతున్నావు. కనీసం ఆ జంతువులతో సమం కాగలమా?’’

అతని మాటలు విన్న రాజు అతని భుజం వి•ద చెయ్యేసి, ‘‘ఈ అసమానతలు పోవాలంటే మరో ప్రపంచం రావాలి. అది విప్లవంతోనే వస్తుంది…’’ అన్నాడు.

‘‘నువు చెప్పే అన్నల రాజ్యం వస్తే మనకు పని దొరుకుతుందంటావా?’’

‘‘ఒక్క పని అనేమిటి? ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయి. కులాలు, మతాలు ఉండవు…’’

రాజు చెప్పే మాటలు విని, ‘‘అలాంటి రోజులు నిజంగా వస్తాయో, రావో కానీ… నీ మాటలు వింటుంటే భలేగా ఉందిరా.’’ అన్నాడు సాగర్‌.

‌మాటల మధ్య వారు ఊరి బయటకు వచ్చారు. గత కొన్ని రోజులుగా ఊరి బయట ఉన్న మైదానంలో సర్కస్‌ ‌విడిది చేసి ఉంది. ‘రాయల్‌ ‌సర్కస్‌’ అన్న పేరు రిక్షాలకు కట్టిన మైకుల్లో ఊరంతా ప్రచారం చేస్తున్నారు. అక్కడి హడావిడిని చూస్తూ దూరంగా కూర్చుని ఉన్నారు వారిద్దరు. సర్కస్‌ ‌చూడటానికి అవసరమయిన డబ్బులు వారిద్దరిలో ఎవరి దగ్గరా లేవు. సర్కస్‌కు ఇవాళే ఆఖరి రోజు. రేపు బిచాణా ఎత్తి మరో ఊరు వెళ్ళిపోతున్నారు వారు.

ఇంతలో అటుగా వెళ్తున్న ట్రాక్టర్‌ ‌వారి దగ్గర ఆగింది. ‘‘ఏం బాబూ! ఖాళీగా కూర్చున్నారు. కొద్దిగా సాయానికి వస్తారా?’’ అడిగాడు ట్రాక్టరులోని వ్యక్తి.

‘‘ఏం సాయం చెయ్యాలి?’’

‘‘సర్కస్‌లో ఏనుగులకు మేత కోసుకు రావాలి. వి•రు కూడా తోడుంటే చిటుక్కున పని అయిపోతుంది. ఊరికినే వద్దులే, డబ్బులు లేకుండా సర్కస్‌ ‌చూపిస్తాను…’’ అన్నాడతను.

సర్కస్‌ ‌చూడాలన్న కోరిక వారిద్దరినీ మరో ఆలోచన లేకుండా అతన్ని అనుసరించేటట్లు చేసింది.

పని ముగించుకుని వారు తిరిగి వచ్చేటప్పటికి రాత్రి ఏడు గంటలయింది. చీకటి పడింది. ఇప్పుడు ఆ ఆవరణంతా రంగురంగుల లైట్ల కాంతిలో వెలిగిపోతోంది. ఒక పెద్ద ఫోకస్‌ ‌లైటు ఆకాశంలోకి కాంతిని విరజిమ్ముతూ కొన్ని కిలోవి•టర్ల మేర సర్కస్‌ ఉనికిని తెలియచేస్తోంది. ‘‘రాత్రి రెండో ఆట తొమ్మిదిన్నరకి మొదలవుతుంది. అప్పుడు లోపలకి పంపిస్తాలే. ఈలోపు దీన్ని అన్లోడ్‌ ‌చేద్దాం రండి…’’ అన్నాడు సర్కస్‌ ‌మనిషి.

అతనితో పాటు వారు లోపలకు నడిచారు.

అక్కడ ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, పులులు, సింహాలు, అనేకం ఉన్నాయి. మధ్యమధ్యలో వాటిని టెంటులోకి తీసుకువెళ్లి వాటి చేత ప్రదర్శన ఇప్పించి తీసుకువస్తున్నారు. పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకున్న అమ్మాయిలు పరుగులు తీస్తూ లోపలకు బయటకు తిరుగుతున్నారు. రంగురంగుల బట్టలు వేసుకుని, ముక్కుకు ఎర్రటి బంతి లాంటిది పెట్టుకున్న జోకర్లను చూసిన ప్రేక్షకుల నవ్వులు బయటకు వినిపిస్తున్నాయి.

అదంతా ఎప్పుడూ చూడని ఒక కొత్త లోకంలా ఉంది. ఎప్పుడెప్పుడు లోపలకి వెళ్ళి సర్కస్‌ ‌చూస్తామా అన్న ఆత్రుతను వారు ఆపుకోలేకపోతున్నారు. ఎట్టకేలకు తొమ్మిదిన్నర షోకి వారిని లోపలకు పంపాడతను.

ఆ తరువాత రెండున్నర గంటలు ఎలా గడిచి పోయాయో తెలియదు. ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం… అన్ని రసాలు ఒకదాని తరువాత ఒకటిగా వారిని ఆవహించాయి. అందమయిన డ్రస్సులు వేసుకున్న అమ్మాయిలు ఒంట్లో ఎముకలు లేనట్లు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఒక్క చక్రం ఉన్న సైకిల్‌ ‌తొక్కుతున్నారు. గుర్రం వి•ద నిలబడి పల్టీలు కొడుతున్నారు. తీగ వి•ద నడుస్తున్నారు. ఇంద్రజాలికుడు వచ్చి మాయలు చేస్తున్నాడు. బావిలో బైకులు నడుపుతున్నారు. ఎక్కడో ఆకాశంలో ఉయ్యాల ఊగుతూ గాలిలో ఎగిరి ఒకరినొకరు అందుకుంటున్నారు. పులులు, సింహాలు రింగ్మాస్టర్‌ ‌చెప్పినట్లు ఆడుతున్నాయి. ఏనుగులు దేవుడికి పూజ చేస్తున్నాయి. ఇక బఫూన్లయితే ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నారు.

సర్కస్‌ ‌పూర్తయి బయటకు వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది.

ఇద్దరు ఊరి వైపు నడవటం మొదలు పెట్టారు. కొద్ది దూరం వచ్చాక, ‘‘ఒక్క నిమిషం ఆగరా! ఇక్కడ కూర్చో. నీతో మాట్లాడాలి…’’ అన్నాడు సాగర్‌. ఇం‌త అర్ధరాత్రి మాట్లాడే అంత ముఖ్య విషయం ఏమిటా అని ఆశ్చర్యపోతూనే రోడ్డు పక్క ఉన్న మైలు రాయి వి•ద కూర్చున్నాడు రాజు.

‘‘నేను ఒక నిర్ణయానికి వచ్చానురా…’’ అన్నాడు సాగర్‌.

ఏమిటన్నట్లు చూశాడు రాజు.

‘‘నేను సర్కస్లో చేరిపోతాను.’’

‘‘నీకేం పిచ్చా? వాళ్లు నెలకొక ఊరు తిరుగుతారు. వాళ్ల జీవితాలకు స్థిరత్వం ఉండదు. పైగా ఎప్పుడు ఏ ప్రమాదం నెత్తి వి•ద పడుతుందో తెలియదు. నీకెందుకురా ఆ జీవితం?’’

 ‘‘ఆ అమ్మాయి కోసం…’’ అన్నాడు సాగర్‌.

‘‘ఏ అమ్మాయి?’’ ఏవి• అర్ధం కాక అయోమయంగా అడిగాడు రాజు.

‘‘నడుస్తున్న గుర్రం వి•ద ఎక్కి ఏడు కప్పులు, సాసర్లు ఒక దాని వి•ద ఒకటి నెత్తి వి•ద పెట్టుకుని  బ్యాలెన్స్ ‌చేసింది చూడు ఆ అమ్మాయి…’’

‘‘అసలు ఆ అమ్మాయిది ఏ భాషో? ఇప్పటికే పెళ్లయిందేమో? అవన్నీ కుదిరినా, నీతో పెళ్ళికి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో… ఇవన్నీ తెలియకుండా సర్కస్‌లో చేరి ఏం చేస్తావ్‌?’’

‘‘అం‌త ఆలోచించి చెయ్యటానికి ఇదేమన్నా యుద్ధమా? తెల్లవారితే వాళ్లు వేరే ఊరు వెళ్లిపోతారు. ఆ అమ్మాయి తిరిగి నాకు కనిపించకపోవచ్చు…’’ అంటూ వెను తిరిగి సర్కస్‌ ‌డేరాల వైపు నడవటం మొదలు పెట్టాడు.

చూస్తుండగానే కనుమరుగయిపోయిన సాగర్‌ ‌నుండి దృష్టి మరల్చి, ఒక్కడే నడవటం మొదలు పెట్టాడు రాజు. తెల్లారేటప్పటికి సర్కస్‌ ‌వాళ్ల చేత ఛీ కొట్టిచ్చుకుని వాడు ఇంటికి రావటం గ్యారంటీ అని కూడా అనుకున్నాడు.

ఇంకొద్ది దూరం నడిచాడో లేదో రోడ్డు దిగువన పొలాల్లో అలజడి వినిపించింది. కుతూహలం కొద్దీ ఆగాడు అతను. ఏదో గొడవ జరుగుతోంది. హఠాత్తుగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది.

భయపడి ముందుకు నడవబోతుంటే, ‘‘ఎవర్రా అది?’’ అన్న మాట వినిపించింది. తనను పలుకరించేది ఎవరా అని చూస్తే కాలేజీలో సీనియర్‌ ఉన్నాడు అక్కడ.

‘‘సర్కస్‌కు వచ్చి ఇంటికి వెళ్తున్నాను. ఈ సమయంలో నువ్వేంటి ఇక్కడ?’’ అడిగాడు రాజు.

‘‘అన్నలు ఏదో పంచాయితీ చేస్తున్నారు. ఇటు ఎవరూ రాకుండా నన్ను కాపలా పెట్టారు…’’ చెప్పాడు సీనియర్‌.

‘‘‌నువ్వు అన్నల్లో చేరావా? ఎలా ఉంది అక్కడ జీవితం?’’ ఈసారి కుతూహలం, ఆశ్చర్యం కలగలిపి అడిగాడు రాజు.

‘‘జీవితం ఇప్పుడు ఎలా ఉన్నదన్నది ముఖ్యం కాదు. మనం అనుకున్న సమసమాజం వచ్చాక ఎలా ఉంటుందన్నది ఊహించుకో…’’

అతని మాటలు పూర్తికాకముందే పొలాల్లో నుండి అన్నలు వచ్చారు. ‘‘ఎవర్రా వీడు?’’ అన్నారు రాజును చూసి.

‘‘మనోడే అన్నా! కాలేజీలో నా జూనియర్‌…’’ ‌పరిచయం చేశాడు సీనియర్‌.

‘‘ఏరా! మాతో వస్తావా?’’ అడిగాడు వాళ్ల లీడర్‌.

ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం ఎందుకు తీసుకుంటారో తీసుకున్న వారికి కూడా తెలియదు. అలానే తల నిలువుగా ఊపాడు రాజు.

                                                                                              *      *     *

గదిలోకి నర్సు వచ్చింది. పెట్టినంత వేగంగా ట్యూబులు తీసేసి, శరీరం నుండి సూదులు బయటకు తీసింది. ‘‘ఇక నువు వెళ్లొచ్చు…’’ అంది.

లేచి నిలబడ్డాడు రాజు. కొద్దిగా కళ్లు తిరుగుతున్నాయి. అలానే ఆసుపత్రి నుండి బయటకు వచ్చాడు. గత మూడున్నర దశాబ్దాలలో సాగర్‌ ఎన్నోసార్లు గుర్తుకు వచ్చాడు. వాడు సర్కస్‌లో చేరిపోయి ఉంటాడా? కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడా? తనకు దొరకని అందమయిన జీవితాన్ని వాడయినా సాధించి ఉంటాడా? అన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అజ్ఞాతం వీడి బయటకు వచ్చాక ఈ ట్రీట్మెంట్‌ ‌కారణంగా స్వంత ఊరు వెళ్లలేదు. వెళ్లినా అక్కడ ఎవరన్నా గుర్తుపడతారా? అన్నది కూడా అనుమానమే. ఇప్పుడు మరోసారి రాయల్‌ ‌సర్కస్‌ అన్న పేరు చూడగానే నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి.

తడబడే అడుగులతో ఎదురుగా ఉన్న మైదానం వైపు అడుగులు వేశాడు రాజు.

సర్కస్‌ ‌డేరాలు నిలబెట్టటం పూర్తయింది. పూర్తి షోలు వేయటానికి అంతా తయారుగా ఉంది. పరిసరాలు గమనిస్తూ ఇంకొద్దిగా లోపలకు నడిచాడు.

మైదానం మధ్య ఎత్తుగా, పెద్దగా ఉన్న టెంటు ఎదురుగా ఒక టేబుల్‌ ‌వేసుకుని కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. ఎత్తుగా, లావుగా ఉన్నాడు. అందరి వి•ద అజమాయిషీ చేస్తున్నాడు.

వెళ్లి అతని ఎదురుగా నిలబడ్డాడు రాజు.

అతను తలెత్తి చూసి, ‘‘ఎవరండీ వి•రు? ఏం కావాలి?’’ అన్నాడు.

‘‘ఒక చిన్న వివరం కావాలి…’’ అన్నాడు రాజు.

కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు అతను. తరువాత, ‘‘ఇప్పుడు చెప్పండి. ఏం కావాలి?’’ అన్నాడు.

‘‘దాదాపు ముప్ఫయి అయిదేళ్ల క్రితం నా స్నేహితుడు సాగర్‌ ఈ ‌సర్కస్‌లో చేరతానని వెళ్లాడు. తరువాత ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఆ పేరుతో ఎవరన్నా ఉన్నారా?’’ అడిగాడు రాజు.

అతని మాటలు పూర్తికాక ముందే రాజును నిశితంగా చూశాడు ఆ వ్యక్తి. లేచి నిలబడి, ‘‘ఉరేయ్‌ ‌రాజూ…’’ అంటూ రాజును గట్టిగా కౌగలించు కున్నాడు.

అయోమయంగా చూస్తున్న రాజుతో, ‘‘నేనేరా నీ సాగర్ని…’’ అన్నాడు అతను.

వారిద్దరు చాలాసేపు ఒకరినొకరు పట్టుకుని ఉండిపోయారు.

‘‘నేను ఒకటి రెండు సార్లు మన ఊరు వచ్చాను. నీకోసం అడిగాను. కానీ నువ్వు అజ్ఞాతంలో ఉన్నావని చెప్పారు…’’ అన్నాడు సాగర్‌.

‘‘అవును. అలవిమాలిన ఆదర్శాల పేరుతో ఒక జీవిత కాలం వృథా చేసుకున్నాను…’’

‘‘భార్యా, పిల్లలు…’’

‘‘ఎవరూ లేరు.’’ అని ఒక్క క్షణం ఆగి, ‘‘నీ సంగతి ఏమిటి? నువు ఒక అమ్మాయిని ఇష్టపడి వెళ్లావుగా! తరువాత ఏం జరిగింది?’’

‘‘సర్కస్‌లో చేరటం పెద్దగా కష్టం కాలేదు. కానీ నాలాంటి అనాకారికి ఆ అమ్మాయిని ఒప్పించటం కష్టం అయింది. కానీ అది కూడా జరిగింది. మాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు.’’

‘‘తను ఇక్కడే ఉంటుందా?’’

‘‘లేదు. కరోనా వచ్చి చనిపోయింది.’’

‘‘అయ్యో! అయామ్‌ ‌సారీ…’’

‘‘పర్లేదు…’’ అంటూనే ఎవరినో పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. ‘‘నువు భోజనం కూడా ఇక్కడే చెయ్యాలి…’’ అన్నాడు.

‘‘నీ పిల్లలు ఏం చేస్తున్నారు?’’

‘‘ఈ సర్కస్‌ ఎం‌తకాలం సాగుతుందో ఎవరికీ తెలియదు. ఇంతకు ముందులా ఎవరూ తమ పిల్లల్ని ఇక్కడే ఉంచెయ్యాలనుకోవటం లేదు. నేను కూడా నా పిల్లలను బోర్డింగ్‌ ‌స్కూల్లో పెట్టి బాగా చదివించాను. ఇప్పుడు వాళ్లు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.’’ చెప్పాడు సాగర్‌.

‌సాగర్‌ ‌కోరుకున్నట్లే రాజు ఆరోజు అక్కడే ఉన్నాడు. వారు ఇన్ని సంవత్సరాల ఎడబాటు కారణంగా చెప్పుకోని ఎన్నో మాటలు చెప్పుకున్నారు.

‘‘మతమనీ, కులమనీ మనుషుల మధ్య అడ్డు గోడలు లేని సమాజం కావాలని ఇన్నేళ్లు పోరాడావు. లోకంలో ఏమన్నా మార్పు కనిపించిందా?’’ అడిగాడు సాగర్‌ ‌రాత్రి భోజనాలయ్యాక.

తల వంచుకున్న రాజు అడ్డుగా తల ఊపాడు. ‘‘నిజం చెప్పాలంటే ఈ అడ్డుగోడలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయేమో…’’

‘‘కానీ నువు కోరుకున్న సమాజం నీ ముందే ఉంది. నువు గుర్తించటం లేదంతే…’’ అన్నాడు సాగర్‌.

అర్థం కానట్లు చూశాడు రాజు.

‘‘మనిద్దరం ఒకే రోజు సమాజం నుండి విడివడి, రెండు ప్రపంచాలను ఎంచుకున్నాం. నీవు ఎంచుకున్న అడవి జీవితం సంగతి నాకు తెలియదు. కానీ, ఈ సర్కస్‌ ఎవరికీ అర్థం కాని మరో ప్రపంచం. ఇక్కడ నువ్వు నువ్వుగా స్వీకరించబడతావు. నీది ఏ మతం, ఏ కులం అని ఎవరూ అడగరు. నువు తెలుపా, నలుపా అని చూడరు. భాషతో అవసరం లేకుండా భావం ఒకరి నుండి ఒకరికి చేరుతుంది. అవసరంలో ఒకరి కోసం ఒకరు పాకులాడతారు. ఆపదలో ఒక తాటి వి•ద నిలబడతారు. వయసు ఇచ్చే అనుభవానికి గౌరవం, యవ్వనం ఇచ్చే ఉత్సాహానికి ప్రోత్సాహం దొరుకుతాయి. మనిషితో పాటు జంతువులకు కూడా సమాన గౌరవం దొరుకుతుంది…’’ అన్నాడు సాగర్‌.

ఒకసారి ఆలోచించి చూస్తే అది నిజమే అనిపించింది రాజుకి కూడా.

‘‘ఇలాంటి ప్రపంచం నీకు మరెక్కడా దొరకదు. నువు కూడా మా సర్కస్‌లో చేరిపో రాజూ. నీ కోరిక కూడా తీరుతుంది…’’ అన్నాడు సాగర్‌.

‘‘ఈ ‌వయసులో నన్ను చేర్చుకునే మూర్ఖుడు ఎవరు?’’

‘‘నేనే!’’ అన్నాడు సాగర్‌ ‌నవ్వుతూ. ‘‘ఈ సర్కస్‌ ‌కంపెనీ ఓనర్ని నేనే. ఒకప్పుడు సర్కస్‌ అనేది లాభసాటి వ్యాపారం. జంతువులతో ప్రదర్శన నిషేధించి ప్రభుత్వం పెద్ద దెబ్బే కొట్టింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వచ్చి అంతకంటే పెద్ద దెబ్బ కొట్టింది. ఇంతకు ముందు ఉన్న ఓనర్‌ ‌నడపలేక వెళ్లిపోతుంటే నేను తీసుకున్నాను. మా పిల్లలు అప్పు చేసి మరీ నాకు సహకరించారు. నేను ఇది చేసింది లాభాల కోసం కాదు. దీని వి•ద ఆధారపడి ఉన్న వారి జీవనోపాధి పోకుండా…’’

‘‘అయినా నా అనారోగ్యంతో…’’

అతని మాటల్ని మధ్యలో అడ్డుకుంటూ, ‘‘రేపే ఆసుపత్రికి వెళ్దాం. నీకు నా కిడ్నీ ఇస్తాను. త్వరగా మామూలు మనిషివి అవుతావు…’’ చాలా సింపుల్గా చెప్పాడు సాగర్‌.

‌నీటితో కళ్లు నిండి పోతుంటే ఏం మాట్లాడాలో తెలియక నిలబడి పోయాడు రాజు.

‘‘ఈ ప్రపంచంలో నువు కోరుకున్న సిద్ధాంతాలు నువు బ్రతికి ఉండగా ఆచరణలోకి వస్తాయన్న ఆశ లేదు. కానీ నా సర్కస్‌లో మాత్రం నువు కోరుకున్న ప్రతిదీ ఉంది. ఛాయిస్‌ ‌నీదే…’’ అన్నాడు సాగర్‌.

‘‘‌నేను ఏ పని చేయగలను?’’ తన అంగీకారాన్ని పరోక్షంగా చెప్తూ అన్నాడు రాజు.

‘‘బయటి ప్రపంచంలో మనల్ని బఫూను అంటే అవమానంగా ఫీల్‌ అవుతాం. కానీ ఇక్కడ అది కూడా గౌరవప్రదమే. నేను అదే పని చేస్తున్నాను. నువ్వూ అదే చేద్దువు. నిజం చెప్పాలంటే మనలాంటి వారికి అదే తగిన పని…’’ అన్నాడు సాగర్‌.

వచ్చేవారం కథ..

– జీవగడియారం – సరసి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram