జనాంతిక సంభాషణలు, అక్షరచిత్రాల మధ్య తారాడే జ్ఞాపకాల దొంతర్లు, లయాత్మక శైలితో మిళితమై ఉంటాయి ఈ ఏటి సాహిత్య నోబెల్‌ ‌బహుమతి గ్రహీత జోన్‌ ‌ఫాసె రచనలు. మనకాలపు ముఖ్య రచయితలలో ఒకరిగా ఖ్యాతి గాంచిన ఫాసె 1959లో పుట్టారు. నాలుగు దశాబ్దాలుగా రచనా రంగంలో ఉన్నారు. సాహిత్యంలోని అన్ని పక్రియలు ఆయన స్వీకరించారు. నవలలు, నాటకాలు, కవిత్వం, కథలు, వ్యాసాలు, బాల సాహిత్యం- అన్ని పక్రియలలోను ప్రతిభ చూపించారు. ప్రపంచంలోని దాదాపు యాభై భాషలలోకి ఆయన రచనలు అనువదితమయ్యాయి. ఆయన నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వేదికల మీద దాదాపు వేయి సార్లు ప్రదర్శనకు నోచుకున్నాయి.

జోన్‌ ఒలావ్‌ ‌ఫాసె నార్వే దేశస్థుడు. హార్డాంగర్‌ ‌ప్రాంతంలోని స్ట్రాండె బార్మ్‌లో జన్మించారు. ఆయన బెర్గెన్‌ ‌విశ్వ విద్యాలయంలో సాహిత్యం అభ్యసించారు. తులనాత్మక సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకున్నారు. సృజనాత్మక రచనలే ప్రధాన జీవికగా చేసుకున్నా, కొద్దికాలం ‘గ్యూలా టైడెండ్‌’ అనే పత్రికలో పనిచేశారు. హోర్డాల్యాండ్‌ అనే చోట అకాడమి ఆఫ్‌ ‌రైటింగ్‌ ‌సంస్థలో కొద్దికాలం అధ్యాపకత్వం కూడా నెరపారు. అనువాదాలకు సంబంధించి కొన్ని సంస్థలకు సలహాదారు. ప్రస్తుతం ఆయన ఓస్లోలో నివాసం ఉన్నారు. 12 , 13వ ఏటనే ఆయన కొన్ని గేయాలు రాశారు. ఫాసెలోని నాటక కర్త, నవలాకారుడు ఇద్దరూ పాశ్చాత్య సాహితీ లోకంలో ప్రసిద్ధులే. సరికొత్త ధోరణిలో రాసిన ఆయన నాటకాలు, వచనం, అవ్యక్తమైన వాటికి గొంతునిచ్చాయి అని రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడమి అభివర్ణించింది. ఆధ్యాత్మిక పరిమళం ఉన్న భాషతో ఆయన రచనలు ఉంటాయని విమర్శ కులు శ్లాఘిస్తారు. కథనాన్ని కళాత్మకమైన, ప్రయోగాత్మకమైన నడకతో సాగిస్తారని అంటారు.

‘రౌడ్‌, ‌స్వర్ట్’ (ఎరుపు, నలుపు) ఫాసె తొలి నవల. ఇది 1983లో వెలువడింది.  ఆత్మహత్య ఇతివృత్తంగా ఈ నవల రాశారాయన. కానీ అంతకు రెండేళ్ల ముందు విద్యార్థుల వార్తాపత్రిక ఒకటి ఆయన ‘హాన్‌’ ‌పేరుతో రాసిన కథను ప్రచురించింది. అదే తన తొలి రచనగా ఫాసె చెప్పుకుంటారు. తన తొలి కవితా సంకలనం -‘ఏంజెల్‌ ‌మెడ్‌ ‌వత్న్ ఇ ఆగెన్‌’ (‌చెమ్మగిల్లిన నయనాలతో దేవత) 1986లో వెలువడింది. 1980 దశకంలో ఆయన అక్షరయానం ప్రారంభమైనప్పటికీ మంచి గుర్తింపు తెచ్చిన రచన మాత్రం ‘నాయూస్‌టెట్‌’ ‌పేరుతో రాసిన నవల. అంటే బోట్‌హౌస్‌. ‌స్వదేశంలో ఆయనకు గుర్తింపు తెచ్చిన రచన ఇదే. నవలాకారునిగా, కథకునిగా, కవిగా ప్రసిద్ధుడైన తరువాత నాటకకర్తగా అవతరించారు ఫాసె. ఆయన తొలి నాటకం ‘నొకొన్‌ ‌కెమ్‌ ‌తిల్‌  ఆ ‌కొమె’ (ఎవరైనా రావడానికే వెళుతున్నారు). ఈ నాటకం తన రచనా జీవితంలోనే గొప్ప వ్యక్తీకరణగా ఫాసె ప్రకటించుకున్నారు.  కానీ ప్రదర్శనకు నోచుకున్న ఆయన తొలి నాటకం ‘ఓగ్‌ అల్‌‌డ్రీ స్కాల్‌ ‌బి స్కిల్‌జాస్త్’ (‌మనం ఎప్పటికి భాగస్థులం కాకూడదు’). దీనిని 1994లో బెర్గెన్‌లోని నేషనల్‌ ‌థియేటర్‌లో ప్రదర్శించారు. చిత్రంగా, రంగస్థలం పట్ల ఫాసె చిరకాలం సంశయవాదిగానే ఉంటూనే, జీవితకాలంలో ఎక్కువ భాగం నాటక రచనను అప్రతిహతంగా, అవిశ్రాంతంగా సాగించారు. అంతేకాదు, తొలినాళ్లలో నాటకాలు రాయడానికే నిరాకరించిన చరిత్ర కూడా ఉంది. నార్వేలోని అన్ని ప్రముఖ నాటకశాలలోను ఆయన నాటకాలను ప్రదర్శించారు. కొద్దికాలం తరువాత ఫాసె నాటకాలను ప్రపంచ దేశాలలో కూడా ప్రదర్శించారు. కొంచెం ఆలస్యం అయినా ఫ్రెంచ్‌ ‌రంగస్థల దర్శకుడు క్లాడ్‌ ‌రీగీ  ‘నొకొన్‌ ‌కెమ్‌ ‌తిల్‌ ఆ ‌కొమె’ పారిస్‌కు బయట ప్రదర్శనలు ఇచ్చిన తరువాత అంతర్జాతీయంగా ఫాసెకు గుర్తింపు వచ్చింది. అంటే ఈ నాటకం మొదటి రచనే అయినా, తరువాత నాటకీయంగా విదేశీ గడ్డ మీద పేరు తెచ్చిపెట్టింది. అది 1999లో జరిగింది.  మరుసటి సంవత్సరం బెర్లిన్‌లోని ప్రతిష్టాత్మక నాటకశాల షౌబునేలో షాల్జ్‌బర్గ్ ఉత్సవాల సందర్భంగా ఫాసె రచించిన ‘నామ్‌నెత్‌’ (ఆ ‌పేరు) నాటకం ప్రదర్శించారు. పారిస్‌కు బయట జరిగిన ప్రదర్శనలు, బెర్లిన్‌లో ఏర్పాటైన ప్రదర్శనతో నాటక రచయితగా ఫాసె కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలలో ఆయన నాటకాలను ప్రదర్శిస్తున్నారు.

 ఫాసె నలభయ్‌ ‌వరకు నాటకాలు రాశారు. పైన పేర్కొన్న వాటితో పాటు, ‘వింటర్‌’, ‘ఐన్‌ ‌సొమ్మర్స్  ‌దాగ్‌’ (‌వేసంకాలపు రోజు), ‘డ్రౌమ్‌ ఉమ్‌ ‌హాస్టిన్‌ (‌వసంతం కన్న కల), ‘డాడ్స్ ‌వారియాసో జొనార్‌ (‌చావు వైరుధ్యాలు), ‘స్వెవెన్‌’ (‌నిద్ర), ‘ఇగ్‌ ఎర్‌ ‌విండెన్‌’  (‌నేనే ఆ పవనాన్ని) నాటకాలు కూడా ఫాసె అందించారు. వీటితోనే ఆయన ప్రపంచ స్థాయి నాటకకర్తగా పేర్గాంచారు.

ఫాసెకు సాహిత్యలోకంలో ప్రధానంగా నాటకకర్తగానే గుర్తించేటంత ఖ్యాతి వచ్చినా, ఆయన ఇతర సాహితీ పక్రియలను కూడా కొనసాగించారు. అవి కూడా అత్యున్నత సాహిత్య విలువలు కలిగినవిగా పేరు తెచ్చుకున్నాయి. ఉదాహరణకి- మెలాంకలి-1, మెలాంకలి-2 నవలలు. తప్పని ఒక విచారగ్రస్థ స్థితిని మెలాంకలి అంటారు. ఆ రెండు నవలలు నార్వేజియన్‌ ‌చిత్రకారుడు లార్స్ ‌హెర్టెర్విగ్‌ ‌జీవితం ఆధారంగా రాసినవి. ‘ఉదయం- సాయంత్రం’ పేరుతో మరొక నవల రాశారు. ఒక శిశువు జననం, కొన్ని దశబ్దాల తరువాత అతని మరణం ఈ నవలలో చిత్రించారు ఫాసె. వాయులీన కళాకారుడు అస్లే నాయకుడిగా ఫాసె రాసిన  •య్రాలజీ (ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు రచనలు) మనసును విచలితం చేస్తుంది. అస్లే, అతని స్నేహితురాలు ప్రధాన పాత్రలుగా సాగే ఈ రచనలకే ఫాసెకు నోర్డిక్‌ ‌కౌన్సిల్‌ ‌సాహిత్య పురస్కారం (2015) లభించింది. ఫాసె సాహిత్య సమీక్షకునిగా కూడా ఖ్యాతి గడించారు. చాలా పుస్తకాలను నార్వే భాషలోకి అనువదించారు కూడా.

ఇంతవరకు ఫాసె రచనలలో సుదీర్ఘమైనదిగా ‘సెప్టాలజీ’ని చెబుతారు. నాటక రచనకు విరామం ఇచ్చిన సమయంలో (2019-21) ఇది రాశారు. మరొక అంశం- చిరకాలం నాస్తికునిగా ఉన్న ఫాసె 2013లో కేథలిక్‌ ‌క్రైస్తవం స్వీకరించిన తరువాత ఈ రచనను ఆరంభించడాన్ని కూడా విమర్శకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. తన రచనా శైలిని ఫాసె సెప్టాలజీగా (మందగమన వచనం) చెబుతారు. స్థాయీ భేదాలు, దృశ్యాలు, ప్రతిబింబాలు ఇందులో ప్రత్యేకత. ఈ శైలి సరిగ్గా వేగవంతంగా నడిచే నాటక పక్రియకు పూర్తి భిన్నమైనది. సెప్టాలజీ మూడు భాగాలుగా వెలువడింది. మరొక పేరు, మరొక నేను, కొత్త పేరు అని వాటికి పేర్లు పెట్టారు ఫాసె. కాలగతిలో మద్యపానం అలవాటు, స్నేహం, ప్రేమ వంటి అంశాల గురించి దేవుడు, కళ ఏం చెప్పాయో సంకేతాత్మకంగా ఆవిష్కరించిన రచన. దానిని 20 భాషలలోకి అనువదించుకున్నారు. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచింది. బార్జె పురస్కారం, క్రిటిక్స్ ‌పురస్కారం కూడా దీనికి వచ్చాయి.

 బుకర్‌ ఎం‌పిక జాబితాలోకి, అమెరికన్‌ ‌నేషనల్‌ ‌బుక్‌ ‌పురస్కారం కోసం దీనిని పరిగణనలోనికి తీసుకున్నారు. సెప్టాలజీ కోసం ఆపేసిన నాటక రచనను తరువాత ఫాసె తిరిగి ప్రారంభించారు. ఆయన రచనా వ్యాసంగం నిరంతరం కొనసాగుతూనే ఉంది. 2020 నుంచి ఆయన ఇప్పటివరకు మూడు నాటకాలు రాశారు. ‘క్విట్లెక్‌’ (ఒక వెలుగు) పేరుతో రాసిన నవల కూడా ఆయన కీర్తిని మరింత పెంచింది. ఈ నవల 2023లోనే విడుదలయింది. ఇది కూడా జనన మరణాల మధ్య సరిహద్దులను వివరిస్తుంది.

– జాగృతి డెస్క్  

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram