పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘మహా అయితే ఓ ఏభై కోట్లు… పోనీ వందకోట్లు అనుకుందాం. నా టార్గె ట్‌ అది కాదు. అందులో రసజ్ఞకి కూడా వాటా వుంటుంది. ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తుంది పిన్ని… మేం సంపాదించుకోగలం. ఎవరో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే కార్పొరేట్‌ ‌ఫండ్‌ ‌కింద మంచి పనుల కోసం పదిమందికి మేం డొనేట్‌ ‌చేస్తాం’’ అంది సరయూ.

‘‘నువ్వు చాలా ఎదిగిపోయావు?’’

‘‘ఎదగటానికి నేనూ, రాహుల్‌ ‌ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనుషులకి మోడ్రన్‌ ‌థాట్‌ ‌కావాలి. సినిమాలు, సీరియల్స్‌లోలా ఎత్తుకు పైఎత్తులు కావు. తాత నెంబర్‌ ఇవ్వు’’.

‘‘నా దగ్గర లేదు’’.

‘‘నో ప్రాబ్లమ్‌’’ అం‌ది సరయూ ఫోన్‌ ‌కట్‌ ‌చేస్తూ.

——–

స్వప్న-శ్రీనివాస్‌లు ఇంటికి వచ్చారు. అక్కడ శ్వేత లేదని తెలిసింది.

‘‘నేను ఊరు వెళ్తున్నాను. ఎప్పుడు వచ్చేది తెలియదు. అవసరం అనుకుంటే అమ్మా వాళ్లని ఫోన్‌ ‌చెయ్యమని చెప్పండి’’ అని పనివారికి చెప్పి వెళ్లిందని తెలిసింది.

‘‘ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందంటారు?’’ అంది స్వప్న.

‘‘నాకెలా తెలుస్తుంది?’’

‘‘అమ్మ మాట్లాడాలంది కదా?’’

‘‘ఆ విషయాలు నాతో మాట్లాడకు. ఈ తతంగం అంతా చూస్తుంటే నాకు చిరాకుగా వుంది. మీ అమ్మ ఆలోచనలో పడింది. ఆమె విడాకుల నోటీస్‌ ఇస్తుందని నేను అనుకోను’’.

‘‘అది కాదు శ్రీనివాస్‌…’’ అని ఏదో చెప్పబోయింది.

‘‘ప్లీజ్‌ ‌స్వప్నా… ఇట్స్ ‌నాట్‌ ‌మై ప్రాబ్లమ్‌. ఇప్పటికే నేను ఎక్కువగా మాట్లాడాను. శ్వేతతో నువ్వు మాట్లాడాలనుకుంటే ఫోన్‌ ‌చెయ్యి’’ అని గదికి వెళ్లిపోయాడు.

స్వప్న ఇంకేం అనలేక శ్వేతకు ఫోన్‌ ‌చేసింది.

‘‘ఎక్కడున్నావు?’’

‘‘నేను ఎక్కడో చోట వున్నాను. చెప్పమ్మా’’.

‘‘అమ్మమ్మ వచ్చింది. నీతోనూ, ఆద్యతోనూ మాట్లాడాలి అంది’’.

‘‘చెన్నైలో వుందా?’’

‘‘హైదరాబాద్‌లో వుంది’’.

‘‘మంచిది. నేను అమ్మమ్మతో మాట్లాడతాను’’ అంది కట్‌ ‌చేస్తూ.

‘‘దీనికి ఇంత అహంకారం వుందని నేను అనుకోలేదు’’ అనుకుంది.

———–

హుస్సేన్‌ ‌సాగర్‌…

‌రాజేశ్వరి బుద్ధుడు విగ్రహాన్ని చూస్తోంది. పక్కన ఇద్దరు మనవరాళ్లు వున్నారు. అందరూ ఆ నీటి తళతళల్ని చూస్తున్నారు.

‘‘నాకూ మీ తాతకి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరు అడిగారంట కదా!’’

‘‘అవును’’.

‘‘అందుకు ఇంట్లో వారితో తగాదా పడనవసరం లేదు. నన్ను అడిగితే చెప్పేదాన్ని’’ అందామె.

‘‘నీ ఒక్కదానితోనే తాత తగాదా లేదు అమ్మమ్మా… ఇంకో నలుగురితో వుంది. మేం నీ గురించి అడిగాం. తగాదా మాది కాదు. మా గురించి రకరకాలుగా వూహించుకున్నారు. వాళ్లు శాంతంగా జరిగింది మాకు చెప్పి వుండాల్సింది’’.

‘‘సరే… నాకూ మీ తాతకి మధ్య చాలా జరి గాయి. నా మనసు విరిగిపోయింది. నన్ను అనకూడని మాటలు అన్నారు. అవన్నీ మీకు చెప్పుకోలేను’’.

‘‘కాదనటం లేదు అమ్మమ్మా… నువ్వు గాయ పడ్డావని మా ఇద్దరికీ తెలుసు అలాంటి మాటలు తాత అని వుండకూడదు. ఆయనకు ఎంత కోపం అయినా రావచ్చు. అయితే దాన్ని ప్రోవోక్‌ ‌చేసింది ఎవరు?’’

‘‘అంటే…’’

‘‘అంతగా ఆయన్ని ఎవరు రెచ్చగొట్టారు. అన్ని సంవత్సరాలు మీరు కలిసి బతికారు. చాలాసార్లు తగాదా పడి వుంటారు. మళ్లీ కలిసిపోయారు. తాతకి డ్రింక్‌ ‌చేసే అలవాటు వుంది కదూ’’.

‘‘మీకు తెలియదా?’’

‘‘ఆ సమయంలో మెదడు సవ్యంగా పని చేయదు. మొదటి రోజున నువ్వు తాతని ఎందుకు గట్టిగా అడగలేదు’’.

‘‘అడగలేదని, గట్టిగా అడగలేదని ఎందుకు అనుకున్నారు?’’

‘‘అప్పుడే బయటకు వస్తే తాత మానేసి వుండే వాడు. మా నాన్న, బాబాయి కూడా అకేషనల్‌గా డ్రింక్‌ ‌చేస్తారు’’.

రాజేశ్వరి మాట్లాడలేదు.

‘‘అప్పుడు మీరు స్ట్రగుల్‌ అవుతున్నారు. అందుకని నీకు తాగుడుకంటే ఆ పోరాటం ముఖ్యం. చిన్న చిన్న బలహీనతలని పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది డ్రింక్‌ ‌చేస్తున్నారు. ఆ మత్తులో కొట్టేవారు, చంపేసేవారున్నారు. తాత ఎప్పుడన్నా నిన్ను కొట్టారా?’’

‘‘లేదు’’.

‘‘నాకు అర్థం అవుతున్నదొకటే… మీ ఇద్దరికీ సమయం లేదు. నువ్వు అమ్మా వాళ్ల గురించి చూసుకున్నావు. తాత పత్రికను చూసుకున్నాడు. అప్పుడంతా బాగుంది. ఎప్పుడయితే మీరు సెటిల్‌ అయ్యారో అప్పుడు సమస్యలు మొదలయ్యాయి’’.

రాజేశ్వరి మాట్లాడలేదు.

‘‘నేను సూటిగా అడుగుతున్నాను. తాతని నువ్వు చిన్న మాట కూడా అనలేదా తప్పంతా ఆయనదేనా?’’ అంది ఆద్య.

‘‘నిన్ను ఎప్పుడన్నా డబ్బుల లెక్క అడిగారా? నీకు కావలసిన వారందరికీ ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడిగారా? నీ పేరున ఆస్తులు తీసుకుంటు న్నప్పుడు-పిల్లల పేర్లతో తీసుకుంటున్నప్పుడు మాకు చాలు. వద్దు అన్నావా?’’

‘‘నేను కూడా కోపంలో ఆయన్ని గాయపరిచాను’’ ఒప్పుకుంది రాజేశ్వరి.

‘‘ఇప్పుడు చెబుతున్నాం. మేం తాతని కలిసాం. ఎందుకిలా జరిగింది అని అడిగాం. తాత మీ ఎవ్వరి మీదా ఒక్క ఆరోపణ చెయ్యలేదు. అన్ని తప్పులూ నావే అన్నాడు. తన తప్పులు తెలుసుకోవటాన్ని మించిన మనిషితనం వుంటుందా అమ్మమ్మా…’’ అంది ఆద్య.

‘‘నాన్న నన్ను కొట్టేంత పని చేసారు. అప్పటి కోపం అది. ఆద్యతో పిన్ని మాట్లాడలేదు. అందుకని బంధం తెంచుకుంటామా!’’ అంది శ్వేత.

‘‘ఇప్పుడు పరిష్కారం ఏమిటి చెప్పు అమ్మమ్మా’’.

‘‘మీ అమ్మా వాళ్లు నన్ను విడాకులు ఇవ్వమంటున్నారు’’.

ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడలేదు.

‘‘మంచిదే. కలిసి బతకలేనప్పుడు విడిపోవటానికి చట్టం యిచ్చిన హక్కు అది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు’’ అంది శ్వేత.

‘‘మాకు తాత కావాలి. నువ్వు కావాలి. ఇప్పటి వరకు మాకు సంబంధం లేని విషయంలో మానసిక వేదనను మేం అనుభవించాం. ఇక నుంచి తాతని కలిసినా, మాట్లాడినా మమ్మల్ని మీరు శత్రువులుగా చూడనవసరం లేదు. మీకు ఇష్టం లేకపోతే మా ఇద్దరితోనూ సంబంధాలు తెంచుకోవచ్చు’’ అంది ఆద్య.

ఇద్దరినీ చూసిందామె.

‘‘నేను విడాకుల పేపర్స్ ‌మీద సంతకం చేయటం లేదు’’.

ఇద్దరూ చెరో పక్క నుండి అమ్మమ్మను హత్తుకున్నారు.

‘‘నేనేం చేయాలో నన్ను ఆలోచించుకోనీయండి. మేం చేసిన తప్పులు మీరు చేయకూడదు’’ అంది రాజేశ్వరి.

——–

ఆఫీస్‌లో ఫోన్‌ ‌మోగింది.

రిసెప్షనిస్ట్ ‘‘‌సర్‌ ‌లేరు. మీ పేరు చెప్పండి. నేను వారు రాగానే చెబుతాను’’ అంది.

‘‘నేను వెంటనే గోవింద్‌తో ఎలా అయినా మాట్లాడి తీరాలి. ముంబై ఆంటీనని చెప్పండి. పేరు గోవింద్‌కి తెలుస్తుంది’’ అంది గంభీరంగా. రిసెప్షనిస్ట్ అదిరిపోయింది.

అయిదు నిమి•షాల తర్వాత ఆమె ఫోన్‌ ‌మోగింది.

‘‘నేను గోవింద్‌ని మాట్లాడుతున్నాను’’.

‘‘తులసీదేవిని మాట్లాడుతున్నాను. ఎలా వున్నావు బాబూ…’’

‘‘మీరా… బాగున్నానమ్మా…’’

‘‘అంకుల్‌ ‌మీ దగ్గర వున్నారని తెలిసింది. ఆయన్తో నేను మాట్లాడాలి’’.

‘‘నిన్ననే లండన్‌ ‌వెళ్లారు’’.

‘‘నిజమా… నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వున్నారు. మీ శ్రీమతి…’’

‘‘అవన్నీ ఓ రోజు పర్సనల్‌గా వచ్చి మీతో మాట్లాడతాను’’.

‘‘రామకృష్ణగారు అక్కడ ఎన్ని రోజులు వుంటారు?’’

‘‘చెప్పలేను. నేను రెండు రోజుల్లో బయలు దేరుతున్నాను అక్కడికే’’.

‘‘మంచిది బాబూ…’’ అంది తులసి.

——–

రసజ్ఞ, రామకృష్ణ, రిత్విక్‌ ‌లండన్‌ ‌నగర వీధులు తిరుగుతున్నారు. యూనివర్సిటీ అంతా చూపించింది. ప్రొఫెసర్స్‌నీ, తన ఫ్రెండ్స్‌నీ పరిచయం చేసింది. రిత్విక్‌ని అంతకు ముందు పరిచయం చేసాడు. మనం ఓ మేగజైన్‌ ‌తీసుకు వస్తున్నాం అని చెప్పాడు.

‘‘చాలా మంచి పని చేస్తున్నారు’’ అంది రసజ్ఞ.

‘‘నాన్న ముంబయ్‌లో హాస్పటల్‌ ‌కోసం స్థలం తీసుకుంటానంటే వద్దన్నాను తాతా’’ అంది.

‘‘ఎందుకనమ్మా’’.

‘‘మనకి ఇంత జీవితం ఇచ్చింది మన తెలుగునేల. నాకు అక్కడ సేవ చేయాలని వుంది. అలా అని మిగతా ప్రాంతాలంటే నాకు ఇష్టం లేదని కాదు. మీరు స్థాపించిన హాస్పటల్స్ ‌వున్నాయి. వాటిని డెవలప్‌ ‌చేయాలని వుంది. అలాగే నాకు రీసెర్చ్ ‌మీద ఇంట్రెస్ట్ ‌వుంది. వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధుల మీద పరిశోధన చేయాలని వుంది’’.

‘‘చాలా మంచి పనులు పెట్టుకున్నావు. నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది’’ అన్నాడు.

రిత్విక్‌కి రసజ్ఞని చూడటం, ఆ అమ్మాయిలోని మెచ్యూరిటీ గమనించటం ఉత్తేజకరంగా వుంది.

‘‘మీ పక్కన వుండి వుంటే నేను ఎప్పటికప్పుడు అనేక విషయాల గురించి మాట్లాడి వుండే దాన్ని తాతగారూ’’.

‘‘ప్రతి మనిషి జీవితంలోనూ బ్యాడ్‌ ‌పిరియడ్‌ ‌వుంటుంది రసజ్ఞా! నాకు అవన్నీ కరిగిపోతున్నాయి అనిపిస్తోంది’’.

అప్పుడు లండన్‌ ‌నగరం మీద చిరుజల్లులు కురుస్తున్నాయి.

అత్యంత మనోహరంగా వుందా దృశ్యం.

అప్పుడు రసజ్ఞ ఫోన్‌ ‌మోగింది.

‘‘సరయూ’’ అంది దాదాపు అరిచినట్లు..

‘‘తాతగారి ఫోన్‌ ‌నెంబర్‌ ‌కావాలి. అర్జెంట్‌గా నేను మాట్లాడాలి’’.

‘‘ఫోన్‌ ‌నెంబర్‌ ‌నా దగ్గర లేదు. ఆయనే నా పక్కన వున్నారు’’.

‘‘రియల్లీ…’’ అని అరిచింది. రామకృష్ణ ఫోన్‌ అం‌దుకున్నాడు.

‘‘గ్రాండ్‌ ‌పా నేనూ, రాహుల్‌ ‌నిన్ను కలవాలి. ఎప్పుడు వస్తున్నారు?’’

‘‘నేనే రావాలా? నువ్వు రాకూడదా’’.

‘‘అలా అంటారా… మేం రెండు రోజుల్లో మీ దగ్గరికి వస్తున్నాం’’ అంది.

‘‘రామ్మా… ఇద్దరి మనవరాళ్లతో యు.కె. అంతా చుట్టేద్దాం’’.

‘‘ఇంకా నయం ప్రపంచమంతా అనలేదు కమింగ్‌ ‌గ్రాండ్‌ ‌పా’’ అంది సరయూ.

——-

రసజ్ఞ రామకృష్ణ, రిత్విక్‌లని హోటల్‌ ‌దగ్గర డ్రాప్‌ ‌చేసాక తన రూమ్‌కి బయలుదేరింది. దారిలో వుండగా తులసి నుండి ఫోన్‌.

‘‘‌మీ తాతగారు లండన్‌ ‌వచ్చారంట కదా!’’

‘‘అవునమ్మమ్మా… ఇప్పుడే తాత దగ్గర్నుండి రూమ్‌కి వెళ్తున్నాను. లేక పోతే నీతో మాట్లాడించే దాన్ని’’.

‘‘ఫోన్‌లో కాదులే… నేను బయలుదేరి వస్తున్నాను’’.

‘‘నిజంగానా… ఇంకో విషయం చెప్పనా… సరయూ కూడా ఫోన్‌ ‌చేసింది’’.

‘‘ఏంటి సమస్య?’’

‘‘సమస్య కాదు. తాతగారితో మాట్లాడటానికి తను కూడా రెండు మూడు రోజుల్లో లండన్‌ ‌రాబోతోంది’’.

‘‘ఇన్ని శుభవార్తలు చెబితే ఒక్కసారి గుండె ఆగిపోదూ… మీ తాతను చూసేదాకా అయినా ఈ గుండెని కొట్టుకోనీ’’ అంది.

‘‘నీ గుండె ఆగిపోయినా నేను మళ్లీ లబ్‌ ‌డబ్‌ అనిపిస్తాను’’.

‘‘అదెలా? నా గుండెని ఎవరికయినా డొనెట్‌ ‌చేస్తావా?’’

‘‘కాదు. నా దగ్గర మంత్రం వుంది’’ అనగానే హాయిగా, బిగ్గరగా తులసి నవ్వుతోంది. ‘‘జాగ్రత్త అమ్మమ్మా… సంతోషంలోనూ గుండెలు కొట్టుకో వటం మానేస్తాయి’’.

‘‘పొనీవోయ్‌. ఇం‌కెంత కాలం కొట్టుకుంటుంది’’ అంది.

రసజ్ఞకి కారు వెనక్కి తిప్పి హోటల్‌కి వెళ్లి అమ్మమ్మ విషయం తాతకి చెప్పాలనిపించినా బలవంతాన ఆ కోర్కెని అణచుకుంది.

———–

రామకృష్ణకి రిత్విక్‌తో ఎంతో చెప్పాలని వుంది. ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి రకరకాల దృశ్యాలు చిన్న తనం నుండి కదులుతున్నాయి. అమ్మా-నాన్నా-బడి-స్నేహితులు-తులసి. అక్కడ ఆగిపోయాడు.

అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించింది. అలా రాసుకుంటున్నాడు. అది గమనించాడు రిత్విక్‌… ‘‘ఏమయింది సర్‌’’ అన్నాడు. ‘‘ఛాతిలో నొప్పిగా వుంది. గ్యాస్‌ అనుకుంటాను’’.

‘‘అలా అనుకోవద్దు సర్‌’’ అని ఫోన్‌ అం‌దు కున్నాడు. ‘‘ఎవరికి’’ అంటున్నాడు. రసజ్ఞ ‘‘అంకుల్‌ ‌చెప్పండి’’ అంది. ‘‘సర్‌ ‌ఛాతి నొప్పి అంటున్నారు’’. ‘‘నేను బయలుదేరి వస్తున్నాను’’ అంది. అంతలోనే ‘‘మీ దగ్గర సార్బిటాల్‌ ‌వుంటే తాతగారి నాలుక కింద పెట్టమనండి’’ ‘‘ఉంది’’ అన్నాడు.

అరగంటలో రసజ్ఞ వచ్చింది. స్టెతస్కోప్‌తో హార్ట్ ‌బీట్‌ని చూస్తుంటే ఆయన కళ్లల్లో ఆనందం.

‘‘మనం హాస్పటల్‌కి వెళ్దాం తాతా’’ అంది.

‘‘నాకేం కాదు నువ్వు అనవసరంగా కంగారు పడొద్దు’’.

‘‘మీ ముందు వుంది మనవరాలు కాదు. డాక్టర్‌ ‌రసజ్ఞ’’ అంది.

ఆయన మాట్లాడలేదు. అప్పటికప్పుడు అంబులెన్స్ ‌వచ్చింది. మరో ఇరవై నిమిషాల తర్వాత రామకృష్ణని ఐ.సి.యులోకి తీసుకు వెళ్లారు. ఉదయానికల్లా స్టెంట్‌ ‌వేసారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram