జూలై 29 సి.నారాయణరెడ్డి జయంతి

ఆధునికాంధ్ర కవుల్లో నిత్యనూతన కవి, నిరంతర కవి డా।। సి.నారాయణరెడ్డి. సంప్రదాయాన్ని జీర్ణించుకున్న అభ్యుదయ కవి, సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ‘తెరకవి’. పద్యాన్ని హృద్యంగా, గేయాన్ని శ్రవణపేయంగా, వచన కవిత్వంలో కూడా అంత్యప్రాసలు అలవోకగా ప్రయోగించి కవితా ప్రియుల మన్ననలందుకున్న మహాకవి. సి.నా.రె.దాదాపు 70 కావ్యాలూ, వేలాది సినీ గీతాలు రాశారు.ఆధునిక విమర్శలో ప్రామాణికమైన ‘‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయము- ప్రయోగములు’’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు.

 ఆయనకు జీవితాంతం కవిత్వం నిత్య వ్యాపకం. ‘కవిత్వం రాయకుంటే ఏ.సి.గదిలో ఉన్నా ఉక్కపోస్తుంది’ అనేవారు. వేలాది సాహితీ ప్రసంగాలతో శ్రోతలను అలరించిన ఆయన ప్రజ్ఞ అనితర సాధ్యం.

సి.నా.రె. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన 1931వ సంవత్సరం జూలై 29వ తేదీన కరీంనగర్‌ ‌జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. ఆయన పాఠశాల విద్యాభ్యాసం సిరిసిల్ల, కరీంనగర్‌, ‌హనుమాజీ పేటలో సాగింది. హైదరాబాద్‌ ‌చాదర్‌ఘాట్‌ ‌కళాశాలలో 1949లో ఇంటర్మీడియట్‌ ‌చదివారు. ఉస్మానియా విశ్వవిద్యా లయం నుండి 1954నాటికి ఎం.ఏ. పట్టా పొందారు. కొన్నాళ్లు నిజాం కళాశాలలో లెక్చరరుగా పనిచేశారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్య వేక్షణలో ‘‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయ ములు – ప్రయోగ ములు’’ అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘పిహెచ్‌.‌డి’ డిగ్రీ పొందారు. ఇది ఎందరో ఆధునిక పరిశోధకులకు ప్రామాణిక గ్రంథం.

1963 నుండి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన ప్రతిభకు నిదర్శనాలుగా ప్రతిష్ఠాత్మకమైన పదవులెన్నో వరించాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేడ్కర్‌ ‌సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా గణనీయమైన సేవలందించారు.

మహాకవిగా, సినీ గేయకవిగా, వక్తగా, గొప్ప సాహితీవేత్తగా, ప్రతిభా వంతుడైన ఆచార్యుడిగా, పరిశోధనా పర్యవేక్షకుడిగా, పరిపాలనా దక్షుడిగా ప్రతి రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు.

‘‘సాహిత్యం ద్వారా గ్లామర్‌ ‌గడించిన అపురూపమైన ఏకైక వ్యక్తి సి.నా.రె’’ అని చెప్పిన ఆచార్య ఎన్‌.‌గోపి మాటలు స్తవాలు కాదు, వాస్తవాలు. సి.నా.రె. 1952 నుండి 2017 దాకా నిరంతరం రచనలు చేశారు. పద్య కవిగా కలం పట్టి హృద్యమైన కవితా ఖండికలు రాశారు. అద్భుతమైన చారిత్రక గేయ కావ్యాలు రాశారు. వచన కావ్యాలు తనదైన శైలిలో అప్రయత్న ప్రాస విన్యాసాలతో రూపొందించి సాహితీ ప్రియులను అలరించారు.

సి.నా.రె రచనలు

నవ్వని పువ్వు, అజంతా సుందరి (గేయ నాటికలు). జాతిరత్నం, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు (చారిత్రక కావ్యాలు) అక్షర గవాక్షాలు, మధ్య తరగతి మందహాసం, మంటలూ- మానవుడూ, ఉదయం నా ‘హృదయం’, మార్పు నా తీర్పు, ఇంటిపేరు చైతన్యం, రెక్కలు, నడక నాతల్లి, ‘కాలం అంచుమీద’, కవిత నా చిరునామా, నిరంతరం ఆరోహణ, దృక్పథం, కలసాక్షిగా (వచన కవితా సంపుటాలు), విశ్వంభర (సమగ్ర వచన కావ్యం) భూమిక, మట్టి మనిషి, ఆకాశం (దీర్ఘ వచన కావ్యాలు) సమదర్శనం (ముక్తక కావ్యం), ప్రపంచపదులు (విశిష్ట కావ్యం), తెలుగు గజళ్లు, సమీక్షణం, మావూరు మాట్లాడింది (వ్యాస సంపుటాలు), మీరాబాయి, శిఖరాలు – లోయలు (అనుసృజనలు), ముచ్చటగా మూడు వారాలు – ‘‘మలేసియా తెలుగువాణి’’, సోవియట్‌ ‌రష్యాలో పదిరోజులు, పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్య గ్రంథాలు),

పగలే వెన్నెల (చలనచిత్ర గీతాల సంకలనం), ‘‘పాటలో ఏముంది – నా మాటలో ఏముంది?’’ (సినిమా పాటల విశ్లేషణ), ‘‘సి.నా.రె. ఛలోక్తులు’ వంటి గ్రంథాలన్నీ ప్రసిద్ధాలు.

అవార్డులు – బిరుదులు

ఆయన రచనలకెన్నో అవార్డులు లభించాయి. ఆయన అందుకోని జాతీయస్థాయి అవార్డులు లేవు. ‘మాటలూ – మానవుడూ’ కావ్యానికి రాజా లక్ష్మీఫౌండేషన్‌ అవార్డు లభించింది. ఆయన కావ్యాలకు సోవియట్‌ ‌ల్యాండ్‌ ‌నెహ్రూ అవార్డు, కుమారన్‌ ఆశాన్‌ అవార్డు, భారతీయ భాషా పరిషత్తు కలకత్తా వారి ‘భిల్వార్‌’ అవార్డు లభించాయి.

‘విశ్వంభ’• కావ్యానికి పతిష్ఠాత్మక మైన జ్ఞానపీఠ అవార్డు (1988) లభించింది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ అవార్డు అందుకున్న కవి సి.నా.రె. భారత ప్రభుత్వం 1992లో ఆయనను ‘పద్మభూషణ్‌’‌తో సత్కరించింది.

సి.నా.రె. కవితా విశేషాలు

ఆయన చెప్పినట్లు ‘‘నా పేరు కవి / ఇంటిపేరు చైతన్యం / ఊరు సహజీవనం / తీరు సమభావనం / నా వచనం బహువచనం / సామ్యవాదం / కవిత్వం నా మాతృభాష / ఇతివృత్తం మానవత్వం’’- సహజీవనం, సమభావం – సామ్యవాదం – మానవతా దృక్పథం. సి.నా.రె. కవిత్వంలో ప్రధానాంశాలు. ఆయన కవిత్వం పాత కొత్తల మేలుకలయిక. కవిత్వానికి అవసరమైన గురజాడ తత్త్వాన్ని, శ్రీశ్రీ అభ్యుదయ వారసత్వాన్ని జీర్ణించుకున్న మహాకవి. అభ్యుదయం – శాంతి – విప్లవం – మానవత – సమతలు ఆయనకు పంచప్రాణాలు. అన్నింటిలో ప్రధానంగా మానవతావాదం గుబాళిస్తుంది. ఆయన కవితకు మానవత జయ పతాక.

నూతన ధోరణులన్నింటినీ ఆహ్వానించే సమన్వయ ధోరణికి ఆయన నిలువుటద్దం. ఆయన కవితా ఉద్యమాలన్నింటినీ సమర్థించారు. వివాదం లేని కవితా బంధువుగా వ్యవహరించారు.

తెలంగాణా సాహిత్యోద్యమంలో క్రమశిక్షణ గల సైనికునిలా పనిచేసినపుడు పృథక్తివాదాన్ని (విభజనవాదం) నిర్భయంగా ఖండించి తన కలాన్ని, గళాన్ని మేళవించి జనాన్ని ప్రబోధించినపుడు… దానవతా విలయతాండ వాన్ని తిరస్కరించి, మానవతా మహనీయ రూపానికి హారతులెత్తినప్పుడూ నారాయణ రెడ్డిలో అనంత చైతన్యాన్ని నేను కళ్లారా చూశాను’’- అన్న దాశరథి మాటల్లో సి.నా.రె.లోని దీక్షాదక్షత, సమైక్యతా ప్రబోధం, మానవతావాదం స్పష్టమవుతున్నాయి.

‘‘నారాయణరెడ్డి తిలక్‌లాగా రెండంచుల పదనుగల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలడూ, అమృతం కురిపించగలడూ’’ అన్న కుందుర్తి మాటల్లో సి.నా.రె కవితా ప్రతిభద్యోతకమవు తుంది. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం సి.నా.రె. కవితా తత్త్వాన్ని వివరిస్తూ ‘‘విశ్వమానవ హృదంతరాళాల్లోని జలపాతాల సవ్వడినీ, విప్లవ వేడినీ రంగరించి తన కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న మహాశిల్పి. పద్యం నుండి గేయానికీ, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ ‘పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవీంద్రులు రెడ్డిగారు. మనిషి లోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితలో కీర్తించడం రెడ్డిగారి మతం’ – అన్న మాటలు అక్షర సత్యాలు.

ఆధునికాంధ్ర కవితారంగంలో సాటిలేని మేటి కవి. నిరంతరం ప్రతిభ గుబాళించిన నిత్య నూతన నవయువకవి సినారె. ఆయన భౌతికంగా దూరమైనా సాహితీ ప్రియుల గుండెల్లో చిరస్మరణీయులు. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి. ఆ మహనీయునికిదే నివాళి.

– డా।।పి.వి.సుబ్బారావు,  రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌, 9849177594

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram