– వి. భాగయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యకారిణి సదస్యులు

అప్పటికి విద్యుత్తు లేదు. పారిశ్రామిక విప్లవం రాలేదు. కానీ భారత్‌కు స్వయంసేవకత్వం ఉంది. ఆర్థిక సమృద్ధి, స్వావలంబన ఉన్నాయి. శ్రమించే వారి కోసం వ్యవసాయమున్నది. వ్యవసాయం మీద ఆధారపడిన కుటీరపరిశ్రమలు ఉన్నాయి. ఇది ఈ దేశ వాస్తవిక చిత్రం. బ్రిటిష్‌ ‌వారొచ్చి వ్యవసాయాన్ని దెబ్బకొట్టారు. ఫలితంగా కుటీర పరిశ్రమలు కుంగిపోయాయి. గాంధీజీ ప్రొడక్షన్‌ ‌బై మాసెస్‌ అన్నారు. మాస్‌ ‌ప్రొడక్షన్‌ ‌కాదు. ఇప్పుడు పారిశ్రామిక రంగం ఏం చేస్తోంది? మాస్‌ ‌ప్రొడక్షన్‌ ‌చేసి ప్రచారంతో వినియోగదారుల నెత్తిన రుద్దుతున్నది. సంపదంతా కొద్దిమంది చేతులలోకి చేరుతోంది. కొన్ని దేశాలు ప్రపంచం మొత్తాన్ని అదుపులోకి ఉంచుతున్నాయి. గ్రామాల్లో కష్టపడి, చెమటోడ్చి సంపాదించినదంతా పట్టణాలకు తరలిపోతున్నది. అనివార్యంగా వలసలు ఉంటాయి. గ్రామాలకు ఆర్థిక స్వావలంబన రాదు. ఇదే కొనసాగితే గ్రామాలు ఎప్పటికీ బాగుపడవు. అందుకే ఎప్పటికైనా మళ్లీ మనం వికేంద్రీకరణతో కూడిన ఉత్పత్తుల వైపు మళ్లాలి. ఇందుకు ఒక సోపానమే ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌. ఇది నిర్వహిస్తున్నదే కృషి విజ్ఞాన కేంద్రం. ఆధునిక దృష్టితో, అందరి ప్రయోజనాలు, ప్రయోగదృష్టితో గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దేశ పునర్నిర్మాణం చేయడమే ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం. నాడు స్వాతంత్య్రం కోసం సంగ్రామం జరిగితే, నేడు జరుగుతున్న మహా సంగ్రామం గ్రామ వికాసం కోసం.

స్వదేశీ అంటే అర్థం, ఈ దేశంలో తయారైన వస్తువు అనే కాదు. ఈ జిల్లాలో చేసిన ఉత్పత్తులూ ఈ జిల్లా వారూ వాడాలి, పక్క జిల్లా వారూ వాడాలి. అవసరమైనవి పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవాలి. ఇదీ అసలు స్వదేశీ ఆలోచన. వందేమాతర ఉద్యమ సమయంలో ఉన్న స్వదేశీ భావన తరువాత వచ్చిన స్వదేశీ ఉద్యమాలలో తక్కువ. నాడు మనం చాలా ఉత్పత్తులను గ్రామాల్లో ఉత్పత్తి చేసుకున్నాం. వాటి ఆధారంగా మళ్లీ స్వరాజ్య సమరంలో గాంధీజీ కొన్ని విషయాలు ముందు పెట్టారు. అయితే, గాంధీజీ చేతితో వడికిన ఖాదేయే వాడండి, మిల్‌ ‌ఖాదీ వద్దన్నారు. దానిని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు పరమ పూజ్యనీయ డాక్టర్‌జీ అంగీకరించలేదు. ఎందుకంటే మనమే నష్టపోతాం. మిల్లు ఖాదీ అయినప్పటికీ స్వదేశీయే. ఇక్కడ ఉత్పత్తి వికేంద్రీకరణ ప్రధానం. అంటే డిఫెన్స్‌లో మిసైల్‌ ‌టెక్నాలజీ, విమానాల తయారీ అంశం మాత్రమే కాదు. సబ్బులు, టూత్‌ ‌పేస్ట్‌లు, నూనె, షాంపు, ఉప్పు, పప్పు ఇవన్నీ. ఫినాయిల్‌ ఉం‌ది. దాని పరిశ్రమ ఎక్కడో ఉంది. శ్రీకాకుళం జిల్లా గ్రామాలకు రవాణా అవుతుంది. ఆ రవాణాతో రేటు పెరుగుతుంది. అంటే ఏ వస్తువుకైతే రవాణాతో పనిలేదో అది ఈ జిల్లాలో తయారుకావాలి. ఇందుకోసమే ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌తో చిన్న ప్రయోగం ప్రారంభించాం. వారు ఫినాయిల్‌ ఉత్పత్తి చేశారు. కీళ్లనొప్పికి మందు, వాస్‌లీన్‌ ‌తయారుచేశారు. ఇవన్నీ వికారాబాద్‌ ‌జిల్లాలోని గ్రామాలలో ఉత్సాహంగా కొంటున్నారు. బట్టల సబ్బులు సహా అన్నీ ఏ రకమైన రసాయనం చుక్క లేకుండా తయారుచేశారు. ఇలా జరగాలి ఉత్పత్తి. ఉత్పత్తికి గ్రామీణ, గిరిజన ప్రాంతంలో దొరికే ముడి వస్తువులను వాడాలి. ఈ ప్రాంత ప్రజలకి డబ్బు అందాలి. ఉత్పత్తిలో గ్రామీణ యువ కులు, యువతులు భాగం కావాలి. ఉదాహరణకు, తాండూరు దగ్గర జింగుర్తి గ్రామం. ఇక్కడ కొన్ని ఉత్పత్తులు ఇదే తరహాలో మొదలవుతాయి. ఇందుకోసం 10,15 కిలోమీటర్ల దూరం నుంచి యువకులుగానీ, యువతులుగానీ సైకిళ్ల మీద రావాలి. సాయంత్రం ఇంటికి వెళ్లిపోవాలి. రవాణా ఖర్చు ఉండకూడదు. డీజిల్‌ ‌వృధా కాదు. కాలుష్యం నివారించవచ్చు. ఇలాంటి ఉత్పత్తిని 2,3 ఏళ్లలో ప్రారంభిస్తాం. తరువాత ఇలాంటి కేంద్రాలు 4,5 జిల్లాలకు విస్తరింపచేస్తారు. బ్రాండ్‌ ఇదే. ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్‌ ‌కావచ్చు, గ్రామభారతి కావచ్చు గో ఆధారిత ఉత్పత్తి సంస్థ, విజయవాడ కావచ్చు, గాయత్రీ పరివార్‌, ‌రవిశంకర్‌ ‌గురూజీ… వీళ్లందరు ఇందుకు బాధ్యతలను స్వీకరించాలి. స్వీకరిస్తున్నారు కూడా. ఇది స్పర్థ మాత్రం కాదు. వీటి ధ్యేయం లాభం, లబ్ధి కూడా కావు. పనిచేసే వారికి ఎక్కువ డబ్బు చేరాలి. గ్రామాల్లో వ్యాపారస్తులకు పదిశాతం లాభం రావాలి. సంస్థకు పది శాతం మిగలాలి. వినియోగ దారుడికి కూడా లాభసాటిగా ఉండాలి. ఇలాంటి ఆశయంతో ఇప్పటికి సుమారు 100 వస్తువులు తయారు చేశారు. ఇది ఒక పక్రియ.

 రెండో పక్రియ ఎఫ్‌పిఓ (ఫార్మర్స్ ‌ప్రొడ్యుసర్‌ ఆర్గనైజేషన్‌). ‌దీనిమీద ప్రధానమంత్రి విశేష శ్రద్ధ చూపుతున్నారు. ఎఫ్‌పిఓలో డైరెక్టర్స్ ఉం‌టారు. మొదట రైతు ఉత్పత్తి చేస్తే, దాని మీద వేరేవారు వ్యాపారం చేసేవారు. రైతుకు తగిన ఆదాయం వచ్చేదికాదు. వ్యాపారస్తులకు వెళ్లేది. ఫార్మర్స్ ‌ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌లో రైతే వ్యాపారం చేయవచ్చు. అందులో డైరెక్టర్లు నిజాయతీపరులు కావాలి. రెండవది వాల్యూ ఎడిషన్‌ ‌కావాలి. అంటే ధాన్యం అమ్మకూడదు, బియ్యం అమ్మాలి. కందులు అమ్మకూడదు, కందిపప్పు అమ్మాలి.

తునికిలో ఏకలవ్య గ్రామీణ వికాస కేంద్రం నిర్వహిస్తున్న డా।।రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రంలో క్యారెట్‌ ‌చిప్స్, ‌వంకాయ చిప్స్ ‌తయారు చేశారు. గాలికి పడిపోయిన మామిడికాయలను మామూలుగా రైతులు పారేస్తారు. వాటినే కడిగి అక్కడ చిప్స్ ‌తయారుచేశారు. నష్టపోయామనుకున్న చోట రైతుకు ఆదాయం వస్తున్నది. ఇవన్నీ సామాన్య రైతులకు, రైతు కుటుంబాలకు అందాలి. శాస్త్రవేత్త డాక్టర్‌ ‌భార్గవి ఇవన్నీ చూస్తారు. ఆ ఎఫ్‌పిఓలో 700 మంది సభ్యులున్నారు. ఈ 700 మంది ద్వారా డైరెక్టర్లు వాల్యు ఎడిషన్‌ ‌చేసి మార్కెటింగ్‌ ‌చేయవచ్చు. ఇదొక మోడల్‌. ‌దీన్ని విజయవంతం చేయటానికి శాస్త్రజ్ఞులు, మార్కెటింగ్‌ ‌నిపుణులు, సంస్థలు, ముఖ్యంగా యువతీ, యువకులు దీన్నర్థం చేసుకోవాలి. ముందుకు వెళ్లాలి. ఇదొక భాగం.

రెండవ భాగం-ఇవన్నీ చేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం బాగా నడవాలంటే పనిచేసే నిజాయతీ పరులైన ట్రస్టీలు కావాలి. బయటి కంపెనీలు డైరెక్టర్లకు లక్షలలో ముట్టచెబుతాయి. ఇక్కడ ఆ డబ్బులు రావు. పైగా ఖర్చు. వ్యక్తిగత ప్రయోజనం కోసం కాక, సమాజం కల్యాణం కోసం పనిచేయాలి. కాబట్టి సామాజిక సేవా భావనతో వ్యక్తులు రావాలి. వ్యక్తికి 55 ఏళ్లు నిండిన తరువాత ఇంకా కుటుంబం కోసం పనిచేయకూడదు. బాధ్యతలన్నీ తీరిపోతే సమాజం కోసం పనిచేయాలి. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నవారు కూడా సమయం కేటాయించాలి. వీరంతా కలసి పనిచేయాలి.

ఇలాంటి స్టార్టప్‌, ఇం‌క్రిమెంటల్స్ ‌కోసమని ఇపుడు ప్రభుత్వం షెడ్యూల్టు కాస్ట్, ‌షెడ్యూల్డు ట్రైబ్స్ ‌యువతీ యువకులకు కోట్ల రూపాయలు కేటాయి స్తున్నది. వ్యక్తులు నిజాయతీపరులైతే, సామర్థ్యం ద్వారా ముందుకు వెళతారు. ఇపుడు అనేకమంది యువకులు ఏదో ఉద్యోగం చేస్తుంటారు. అలా కాకుండా అగ్రికల్చరల్‌ ‌బీఎస్‌సీ పూర్తయినవారు గ్రామాల కోసం ఉద్యోగం చేయాలి. మన పాలిటెక్నిక్‌ ‌కాలేజీలలో అధ్యాపకులుగా పనిచేయాలి. సిబ్బంది లోటును తీర్చాలి. చాలామంది ఉద్యోగం దొరకలే దంటారు. సంస్థలు మనుషులు దొరకడంలే దంటాయి. వాస్తవం ఏమిటంటే వీళ్లు గ్రామాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. లక్షలలో జీతం కావాలంటున్నారు. కానీ గ్రామాలలో ఉంటూ, గౌరవప్రదంగా జీవించడం నేర్చుకోవాలి. గ్రామీణ వికాసంలో చదువుకోసం, కుటీర పరిశ్రమల కోసం, వ్యవసాయం కోసం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం, మార్కెటింగ్‌ ‌పని కోసం, సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామస్తులకు అందించడం కోసం యోగ్యమైన వ్యక్తులు ముందుకు రావాలి. వాళ్లు ఈ సేవను ఉద్యోగంగా భావించాలి. కృషి విజ్ఞాన కేంద్రం అలాంటి వారికి రూ.50వేల వరకు వేతనం ఇస్తుంది. అది ఎక్కువ కాకున్నా, తక్కువ కూడా కాదు. దానికి భార్యాభర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

గ్రామమంటే భగవంతుడు చేసిన నిర్మాణం. అక్కడ అంతా సంపదే. ప్రతీ వస్తువు ఆదాయ వనరే. చింతచెట్టు, వేపచెట్టు, మునగాకూ సంపత్తే. గోమూత్రం, గోమయం సంపదే. అయితే వీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాడుకోవాలి. ఆ ఉత్పత్తులు ఎగుమతి చేయాలి. ఇది నేటి యువతీ యువకుల, చదువుకున్నవాళ్ల కర్తవ్యం కావాలి. పట్టణాల్లో సంపత్తే లేదు, పైగా అంతా ఖర్చు. అయితే గ్రామాల్లో పుట్టి పెరిగిన యువకుడు కూడా ఎమ్‌ఎస్‌సి, బీటెక్‌ ‌చదివిన తరువాత అతనికి గ్రామం గురించి తెలియడంలేదు. గ్రామంలో వేపచెట్ల నుంచి నూనె వస్తుంది, దానితో ఎంత లాభముంటుందని తెలుసుకోవడం లేదు. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు. కుంకుడుకాయ నుంచి లాభముంది. కుంకుడుతో పతంజలి వారికి విశేష లాభం చేకూరుతున్నది. రసాయనాలతో నిమిత్తం లేకుండా ఆ ఉత్పత్తులను గ్రామంలో చేస్తే పతంజలి కంటే ఎక్కువ డబ్బు, లాభం వస్తాయి. దీని గురించి ఆలోచించే, మార్కెటింగ్‌ ‌చేసే వ్యక్తులు, సైంటిస్టులు అందరు గ్రామాల్లో ఉండాలి. పెద్ద కష్టం కాదు.

ఇలాంటి గ్రామీణ వికాసంలో గ్రామీణులు భాగస్వాములుగా ఉండాలి. గ్రామ వికాస సమితి ఏర్పడాలి. ప్రభుత్వ సాయం తప్పక ఉపయోగించు కోవాలి. కానీ, గ్రామీణుల సమష్టి కృషి దీనికి ఆధారంగా ఉండాలి. ఆ గ్రామంలో దొరికే ప్రకృతి సిద్ధమైన వనరుల ద్వారా ఉత్పత్తి చేస్తూ, మార్కెటింగ్‌ ‌చేస్తూ గ్రామానికి ఆదాయం తీసుకురావాలి. ఉప్పు వంటి కొన్ని వస్తువులు అన్నిచోట్లా ఉత్పత్తి చేయలేం. అవి తెప్పించికోవాలి. ఇపుడు రిఫైన్డాయిల్‌ ‌వాడుతున్నారు. సర్వరోగాలకు కారకమైనది. కాబట్టి వేరుశనగ నూనె తయారుచేసి అమ్ముతున్నారు. పూర్వం గానుగలు గ్రామ గ్రామాన ఉండేవి. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం దెబ్బతీశారు. ఇందుకు స్వదేశీయులు కూడా సహకరించారు. గాంధీజీ చెప్పే స్వరాజ్యంలో ఉత్పత్తిని వికేంద్రీకరించాలి. ఇవాళ మనం చేయగలిగిన పని ఇది.హెర్బల్‌ ‌పార్క్‌ల అభివృద్ధి కూడా ఇందులో భాగమే. జింగుర్తిలో కూడా హెర్బల్‌ ‌పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పార్క్‌ను రామచంద్ర మిషన్‌వారు అభివృద్ధి చేస్తున్నారు. వారు ప్రపంచంలోని వృక్ష, ఔషధి జాతులను కాపాడుతున్నారు. రామచంద్రమిషన్‌, ‌గాయత్రీపరివార్‌, ‌రవిశంకర్‌ ‌గురూజీ ఎవరెవరైతే మంచిపనిచేస్తున్నారో వారందరి సహకారం తీసుకోవాలన్నదే ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌ ఉద్దేశం.

 ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఆరులక్షల గ్రామాలలో బ్రతికే యువకులు వలస వెళ్లిపోతే దేశం ఏమైపోతుంది? ఇంతమందికి భోజనం, పనులు దొరకాలంటే గ్రామమే దిక్కు. ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ఏం ‌చేస్తుంది? మళ్లీ కంపెనీ పెడుతుంది. డబ్బులన్నీ వాళ్లకే వెళ్తాయి. మరో సంస్థ లేని కారణంగా వాటికే గవర్నమెంట్‌ ‌సబ్సిడీ ఇస్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకపోవడమూ కారణమే. కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భాగస్వామ్యం కష్టం. ఎందుకంటే అప్పనంగా డబ్బు వస్తే చాలన్న భావన పెరిగింది. అందుకే సేవా సంస్థలు ముందుకు రావాలి.

ఈ మహత్కార్యం కోసం కొంతమంది పూర్తి సమయ కార్యకర్తలు కావాలి. పట్టభద్రులైనవారు ఐదేండ్ల పాటుగా స్వచ్ఛందంగా సేవ చేయాలి. తర్వాత గ్రామాల్లో నివసిస్తూ స్టార్టప్‌లు ప్రారంభించాలి. వీటికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. రూర్కేలాలో స్టార్టప్‌ ‌కోసమని ఒక ప్రొఫెసర్‌ ‌విద్యార్థులతో, రైతులతో కలిసి రెండేళ్లు పనిచేయగానే కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు ఇచ్చింది. ఎవరి సిఫారసు లేదు. ఈ మొత్తం సమాచారం అందరికీ వెళ్లాలి.

ఇందులో హిందూత్వ పాత్ర ఏమి•న్న ప్రశ్న రావచ్చు. గ్రామంలో వ్యవసాయం ఊపందుకోవడం, భూరక్షణ, పోషణ, చెట్లు పెంచడం, పర్యావరణ పరిరక్షణ, గ్రామంలో సమరసత తేవడం, గ్రామాన్ని ఆర్థిక స్వావలంబన చేయడం-ఇదంతా హిందుత్వమే. ఇప్పటివరకు హిందుత్వం ఒక పక్రియ అనుకున్నాం. రామజన్మ భూమి కట్టాలి… ఇవన్నీ కలిపి హిందుత్వం. హిందుత్వం అనే శబ్దం మాటిమాటికి చెప్పడం కంటే హిందుత్వ క్రియను ఇలా చూపాలి. హిందూత్వ మాట వింటే కొందరు ఈ పనిని బీజేపీ హైజాక్‌ ‌చేస్తుందేమోనని వ్యతిరేకిస్తారు. మన సంస్కృతి ప్రకారం భూమిని భక్తిగా పోషించాలి. భూమినీ, ప్రకృతినీ కలుషితం చేయకూడదు. ఇది కూడా హిందూత్వమే.


కేవీకే ఇక్కడ ఉండడం మా అదృష్టం

మెదక్‌ ‌కృషి విజ్ఞాన కేంద్రం స్థాపించిన నాటినుంచి సంస్థ సేవలు వినియోగించుకుంటున్న రైతు రామకృష్ణా గౌడ్‌ (‌కంచన్‌పల్లి, మెదక్‌ ‌జిల్లా). ఐదు ఎకరాలలో సేద్యం చేస్తున్నారీయన. రెండు కుంటలలో 14 రకాల పంటలు వేశారు. అన్నీ కూరగాయలే. కాకర, సొర, బీర, పొట్ల, వంకాయ, బెండ (ఎరుపు, ఆకుపచ్చ), గోరు చిక్కుడు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, దుబ్బ బచ్చలి, చుక్కకూర, గంగవాయిలు కూర పండిస్తున్నారు. కొత్తిమీర, మెంతికూర, గంగవాయిలు కూర -మూడూ కలిపి మల్టీ లేయర్‌ ‌ఫార్మింగ్‌ ‌చేస్తున్నారు. ఈ పంటల రక్షణకు కావలసిన జీవామృతం, దశపర్ణ కషాయం తయారీ విధానమే కాదు, అందుకు అవసరమైన డ్రమ్ములను కూడా కేంద్రమే అందించింది. ‘సేంద్రియ పద్ధతిలో పండించిన కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఆర్థికంగా కూడా బాగుంది. మందులు, ఎరువులూ వేసి పెంచిన కూరగాయలు పెద్దగా నిల్వ ఉండవు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు వారంపాటు ఏమీ కాకుండా నిల్వ ఉంటాయి. మందులతో పండించే పంట నాలుగు మాసాలు ఉంటుంది. అదే సేంద్రియ పద్ధతులలో సాగు చేస్తే ఆరు మాసాలు ఉంటుంది. రెండు మాసాల పాటు అదనంగా దిగుబడి వస్తుంది. పైగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. వారానికి నా ఇంటి కూరగాయల ఖర్చు ఐదు వందల రూపాయలు. ఇప్పుడు ఆ ఖర్చు తగ్గింది’ అని చెప్పారు గౌడ్‌.

About Author

By editor

Twitter
YOUTUBE