భూరక్షణ కోసం నేడు ప్రజలంతా కలసికట్టుగా, గట్టిగా పోరాడవలసిన అవసరం వచ్చిందని తునికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌తాండ్ర వినోద్‌రావు అన్నారు. భూమిని రక్షించుకుకోవడానికి, రైతాంగాన్ని నిలబెట్టుకోవడానికి కూడా సేంద్రియ వ్యవసాయమే దిక్కు అని ఆయన చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు.

కృషి విజ్ఞాన కేంద్రం ఆధారంగా ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌ ‌నిర్వహిస్తున్న కార్యక్రమమంతా ప్రయోగం, ప్రయోజనం, సంప్రదాయాల మేళవింపు అని అనుకోవచ్చునా?

నేను ఈ భూమి పుత్రుడిని. ఈ భూమి నా తల్లి అన్నది భారతీయమైన భావన. అలాగే మనం ఏం తింటామో అలాగే ఆలోచిస్తాం. మన ఆలోచనలే మనలను మలుస్తాయి… నడిపిస్తాయి. ఈ రెండు అంశాలను ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా ఆమోదిస్తున్నది. రెండూ పరస్పరం సంబంధం ఉన్నవే కూడా. భూమి ఆరోగ్యం చెడిపోతే వ్యవసాయోత్పత్తులు ఆరోగ్యకరమైనవని ఎలా అనగలం? అప్పుడు మనం తినే ఆహారం సరైనదెలా అవుతుంది? మన కన్నతల్లికి ఆరోగ్యం బాగుండకపోతే వైద్యుడిని సంప్రదిస్తాం. స్వస్థత చేకూరేదాకా చాలా చేస్తాం. చేయాలి. కానీ మనమంతా భూమాత అని పిలుస్తూ, పూజిస్తున్న భూమి ఆరోగ్యం చెడిపోతూ ఉంటే ఏం చేస్తున్నాం? పర్యావరణం కలుషితమై పోతున్నదని చెప్పుకుంటున్నాం. అందులో భూమికి జరుగుతున్న చేటును గురించి తక్కువగా మాట్లాడు తున్నాం. భూపోరాటాలతో పాటు భూరక్షణ పోరా•ం గురించి కూడా అంతా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం చాలా ఉంది. చిన్న ఉదాహరణ: 1960 దశకం నాటి మాట. అప్పుడు మట్టిలో కార్బన్‌ ‌కంటెంట్‌ 2 ‌నుంచి 3 శాతాం వరకు ఉండేది. ఇప్పుడు అది 0.1 శాతం నుంచి 0.4 శాతానికి పడిపోయింది. భూమి చాలా బలహీనమైపోయింది. ఇందుకు ప్రధాన కారణం- రసాయనాలను అధిక మొత్తంలో వినియోగించడం. అది కూడా తప్పుడు పద్ధతులతో వినియోగించడమే. 1960 దశకంలో ఒక కిలో యూరియా వినియోగిస్తే 50 కిలోల తిండిగింజలు వచ్చేవి. ఇప్పుడు ఒక కిలో యూరియాకి 9 కిలోల ఆహార ధాన్యాలే ఉత్పత్తి అవుతున్నాయి.

 సేంద్రియ వ్యవసాయంతో ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చునని విజ్ఞాన కేంద్రం కృషి చేస్తున్న మాట నిజం. దీని క్రమం, ప్రయాణం ఎలా ఉంటాయి?

నేలతల్లి ఆరోగ్యం మొదట బాగుపడాలి. అదే సమయంలో రైతు ఆదాయం పెరగాలి. ఈ రెండింటినీ ఏకకాలంలో సాధించగలిగేది సేంద్రియ వ్యవసాయమే. ఈ వాస్తవాన్ని మా కృషి విజ్ఞాన కేంద్రం పెద్దలు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. అలాగే దానిని అమలు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఫలితమే కృషి విజ్ఞాన కేంద్రాల స్థాపన. తునికి కేంద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నూరు శాతం సేంద్రియ సేద్యం మీదనే దృష్టి పెట్టింది. పని ఎక్కువే కావచ్చు. నేల రక్షణ ప్రధానం కాబట్టి జీవన ఎరువులు (కషాయాలు) వాడాలి.

కృషి విజ్ఞాన కేంద్రాలు ఏమిటి? ఎలా ప్రారంభ మయ్యాయి?

సేంద్రియ సాగు యజ్ఞంలో కృషి విజ్ఞాన కేంద్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఇలాంటి కేంద్రాలు దేశం నలుమూలలా దాదాపు 730 ఉన్నా యి. కేంద్ర ప్రభుత్వ సాయంతో పని చేస్తున్నాయి. తునికి కేంద్రం 2017లో ఏర్పాటయింది. కరోనా ఒక విధ్వంసమే అయినా, అది జనంలో ఒక ఆలోచనను తీసుకువచ్చింది. శరీరంలో రోగ నిరోధక శక్తి అవసరం ఎంతో గుర్తించడం, అందుకు ప్రధానంగా కావలసినది ఆరోగ్యదాయకమైన ఆహారమని తెలుసు కోవడంతో దానినెలా సంపా దించాలి? అనే అన్వేషణ మొదలైంది. మందులు, రసాయనాలతో కూడిన కలుషిత ఆహారం కాకుండా, నిజంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం కోసం అన్వేషణ మొదలయింది. సేంద్రియ సేద్యంతో వచ్చిన ఉత్పత్తులకు ఆదరణ పెరగడం మొదలైంది. తునికి హైదరాబాద్‌ ‌మహా నగరానికి సమీపంలోనే ఉన్నది కనుక, దీనిని అందుకు ఉపయోగించుకో వాలన్న ఆలోచన కూడా వచ్చింది. సేంద్రియ సేద్యంతో కూరగాయలు, పళ్లు పండించి ప్రజల ఆరోగ్యాన్ని సాధ్యమైనంత వరకు రక్షించాలన్న ఆశయం కూడా ఇందులో ఉంది. దీనితో రైతుకు ఆదాయం కూడా బాగుంటుంది.

సేంద్రియ, రసాయనిక సేద్యాలకి మధ్య  ప్రధాన వైరుధ్యం ఏమిటి?

తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునే క్రమంలో రైతులు రకరకాల మందులు వాడతారు. అధిక దిగుబడి పేరుతో ఎరువులు వేస్తారు. అవి మోతాదు మించుతూ ఉంటాయి. నిజానికి వీటి ప్రభావం చల్లిన చోటుకే పరిమితం కాదు. మొత్తం జీవరాశుల మీద, ప్రకృతిపైన ఉంటుంది. మానవాళినీ వదలదు. కేన్సర్‌, ‌కాలేయం, ఊపిరి తిత్తులు దెబ్బతినడం, వ్యంధ్యత్వం ఇంకా ఎన్నో రుగ్మతలు చుట్టు ముడతాయి. ఇవన్నీ నిపుణుల సిఫారసులకు అనుగుణంగా  మందులు వాడకపోవడంవల్ల వచ్చే పరిణామాలు. ఇందుకు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులతో సేద్యం చేస్తే పైన చెప్పిన సమస్యలు రావు. ఖర్చు తగ్గి, సేద్యం లాభదాయక మవుతుంది. ఇందుకు జీవ నియంత్రణ ప్రయోగశాల ఏర్పాటు చేశాం. ఇందులో ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్‌, ‌బయో పెస్టిసైడ్స్ ‌తయారుచేసి ఇస్తాం. ఇవే బయో ఇన్‌పుట్స్. ‌తక్కువ ధరకే ఇస్తాం. ఇది ఒకే సారి బహుళ ప్రయోజనాలను ఇస్తుంది. మామిడితోటలో వర్మి కంపోస్ట్ ‌తయారు చేస్తే భూమి బాగుపడుతుంది. తోటకు బలం. రైతుకు దీనితో లాభం.

హరిత విప్లవం, అధిక దిగుబడులువంటి అభిప్రాయాలు జనంలో చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే, ఈ పెద్ద దేశంలోని ఇంత పెద్ద జనాభాకి సరిపోయే ఆహారం సమకూర్చాలంటే రసాయనిక ఎరువులు, మందులు, పురుగు మందులతో సేద్యం చేస్తేనే అది సాధ్యమన్న దృఢ విశ్వాసం ఎక్కువమంది పాలకులకు కూడా ఉంది. ఈ ఆలోచన భూసార రక్షణ అన్న ప్రధాన అంశాన్ని దారుణంగా కుంగ దీసింది. నూరేళ్ల క్రితం మన దేశం కూడా సేంద్రియ సేద్యమే చేసింది. ఇప్పుడు మళ్లీ సేంద్రీయ సేద్యానికి వెళదామని చెబుతుంటే ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?

సేంద్రియ సేద్యం గురించి రైతులోకం ఎదుట పెట్టే ముందు, ఆ సవాళ్ల గురించి కృషి విజ్ఞాన కేంద్రం పెద్దలు ఆలోచించారు. అవన్నీ ఊహిం చినవే. నిజానికి అదంతా మన సంప్రదాయ సేద్య విధానానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేసుకోవడమే. అలా అని దిగుబడులలో తగ్గుదల కూడా లేదు. ఈ విధానంలో దిగుబడి తక్కువ కాదని తరువాత రుజువైంది. అయినా మొదట నాలుగైదు సవాళ్లు ఎదురయ్యాయి. అవి సవాళ్లే గానీ, సేంద్రియ సేద్యానికి నిగూఢంగా సమాజంలో ఉన్న గౌరవాన్ని మాత్రం మా దృష్టికి తెచ్చాయి. అందుకే వాటిని సవాళ్లగా పరిగణిస్తూనే పరిష్కారాలను కూడా అందిస్తున్నాం.

సేంద్రియ పద్ధతులలో సాగు యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియడం లేదు. కొందరికి తెలిసినా అవి అందుబాటులో లేవు. ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పద్ధతిలోనే కూరలు, పళ్లు పండించడం ఆరంభించాం. ఆ పద్ధతిలోనే ప్రస్తుతం ఇక్కడ 20 రకాల పంటలు పండిస్తున్నారు. వీటన్నిటి యాజమాన్య పద్ధతులు కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చాం.

సేంద్రియ సేద్యానికి అవసరమైన నాణ్యమైన, తక్కువ ధరలో ఉండే ముడి సరుకులు కూడా అందుబాటులో లేవు. అంటే, నాణ్యమైన, నమ్మకమైన స్థాయి కలిగిన బయో ఉత్పత్తులు. కాబట్టి మేమే పంచగవ్య వంటి గో ఉత్పత్తులు, వర్మి కంపోస్ట్ ‌మొదలైనవి తయారు చేసి కర్షకులకు సరఫరా చేస్తున్నాం. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని కూడా స్థాపించాం.

పోస్ట్ ‌హార్వెస్ట్ ‌సవాలు ఒకటి. అంటే, రైతు పంట కోత, అది  వినియోగదారునికి చేరడానికి మధ్య కాలంలో జరిగే నష్టం. ఈ నష్టాలు తక్కువేమీ కాదు. 35శాతం నుంచి 40శాతం వరకు ఆ నష్టాలు ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. ఈ నష్టాలు ఎక్కువగా ఆకుకూరలలో ఎదురవుతాయి. అవి త్వరగా పాడైపోతాయి. ఈ నష్టాలు తగ్గించాలి. అందుకు మ్యాప్‌ (ఎంఏపీ, మోడిఫైడ్‌ ఎట్మాస్ఫియర్‌ ‌ప్యాకింగ్‌) ‌సాంకేతిక పద్ధతితో పోస్ట్ ‌హార్వెస్ట్ (‌పంటకోత అనంతర) నష్టాలను బాగా తగ్గించేందుకు ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి.

వినియోగదారులకు ఒక ప్రశ్న ఎదురవు తుంటుంది. తనకు కనిపించినవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా? అని. అది వాస్తవమే! అయితే అవి ఎక్కడ పండినవి అని అడుగుతూ ఉంటారు. నిజంగానే సేంద్రియ పద్ధతులలో సాగు చేసినా, రసాయనిక ఎరువులు వేసి పండించినవైనా ఆ క్షణంలోనే తేడా తెలియదు. కాబట్టి దీనికి కృష్టి విజ్ఞాన కేంద్రం సర్టిఫికేషన్‌ను ప్రారంభిస్తున్నాం. ఇందులో పద్ధతి ఎలా ఉంటుందంటే సేంద్రియ సాగులో ఉన్న రైతుకు ఒక క్యూఆర్‌ ‌కోడ్‌ ఇస్తాం. దాని మీద వినియోగదారుడు ఫోన్‌తో స్కాన్‌ ‌చేసినట్టయితే ఆ పంట, దాని వివరాలు, ఇతర వాస్తవాలు మన కృషి విజ్ఞాన కేంద్రం వెబ్‌ ‌సైట్‌లో కనిపిస్తాయి. ఇది వినియోగదారుడికి నమ్మకం కలిగిస్తుందనే మేం అనుకుంటున్నాం.

ఈ నాలుగు అంశాలు పరస్పరం సంబంధం ఉన్నవే. అంటే యాజమాన్య పద్ధతులు, బయో ఇన్‌పుట్స్ ‌లేదా ముడిసరుకులు అందించడం, మోడిఫైడ్‌ ఎట్మాస్ఫియర్‌ ‌ప్యాకింగ్‌, ‌సర్టిఫికేషన్‌, ‌క్యూఆర్‌ ‌కోడ్‌. ఇప్పుడు, మార్కెట్‌తో సేంద్రియ రైతులను అనుసంధానం చేసే ప్రయత్నం కూడా ఉంది. ప్రస్తుతం మన పంటలు ఈ ప్రాంతంలోనే  4000 కుటుంబాలకు చేరుతున్నాయి. ఇలా ఒక పూర్తి సర్కిల్‌ను నిర్మించడం బహుశా ఇక్కడే జరిగిందని చెప్పవచ్చు. అయినా, ఇది ఒక ఆరంభం మాత్రమేనని మేం అనుకుంటున్నాం.

అంటే వినియోగదారులు, వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని అనుకోవచ్చునా?

ఆ సేద్యానికి అవసరమైన అన్ని వనరులు అందిస్తే సేంద్రియ వ్యవసాయం చేస్తామని రైతులు చెబుతున్నారు. నిజానికి చాలామంది రైతులు ఈ సేద్యానికి నూరు శాతం అనుకూలమే. ఈ ఉత్పత్తులు మాకు చేరిస్తే తాము కూడా మార్కెట్‌లో ఉంచుతామని వ్యాపారులు చెప్పారు. కొంతమంది ఇంటి అవసరాల కోసం సేంద్రియ వ్యవసాయం చేస్తామని ముందుకొచ్చారు. వారినీ ప్రోత్సహి స్తున్నాం. ఈ వ్యవసాయమే చేయాలనుకున్న మెదక్‌ ‌జిల్లా రైతాంగానికి బయో ఇన్‌పుట్‌ ‌కేంద్రాన్ని ప్రారంభించాం. మన సేంద్రియ ఉత్పత్తులు అంటే అమృతాహారమే. దీనిగురించి ప్రభుత్వాలు, ప్రజలు అంతా ప్రచారం చేసినట్టయితే అందరికీ లాభం. వ్యవసాయం లాభదాయకమవుతుంది. దేశమంతా వీటికి గిరాకీ ఉంటుంది. భూమాతను రక్షించుకున్నవాళ్ల మవుతాం.దేశంలో సేంద్రియ సేద్యం, ఉత్పత్తులు పెరిగితే ప్రపంచ ఆహారోత్పత్తులలోను భారత్‌ అ‌గ్ర దేశంగా వెలుగొందుతుంది.

బయట క్షేత్రాలలో ఫలితాలు ఎలా ఉన్నాయి?

కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2015లో తమ ఇంటర్నల్‌ ‌జర్నల్‌లో ఒక విషయం చెప్పారు. దాని ప్రకారం రసాయనిక సాగుబడి లాభాలు తెలుస్తాయి. కానీ అంతకు మించి ప్రయోజనాలు మన రైతులకు దక్కాయి. ఇదంతా సాధ్యమైందంటే కారణం- మా శాస్త్రవేత్తల బృందం దీక్ష. అటారీ సహకారం, ఏకలవ్య ఫౌండేషన్‌ ‌పెద్దల ప్రోత్సాహం, దాతల ఔదార్యాలే.

రైతులకు తర్ఫీదు ఎలా ఉంది? ఎవరికైనా ఇక్కడ తర్ఫీదు ఇస్తారా?

ఇక్కడ రైతులందరికీ తర్ఫీదు ఇస్తారు. వారంపాటు శిక్షణ తరగతులు కూడా ఉంటాయి. బస, భోజనం ఉచితం. త్వరలో వ్యవసాయ పర్యాటకం కూడా ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఒకరోజు గడిపి వెళ్ల వచ్చు. లేదా నేర్చుకొనేందుకురావచ్చు. ఆసక్తి ఉన్నవారందరినీ మేం ఆహ్వానిస్తున్నాం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram