చంద్రయాన్‌-3  ‌ప్రయోగంతో భారత్‌.. అమెరికా, చైనా, రష్యాల సరసన చేరబోతోంది. చంద్రయాన్‌-2 ‌వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో నాలుగేళ్ల తర్వాత ఈ ప్రయోగం చేపట్టింది. నాసా కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక పాన్‌ ఇం‌డియా సినిమా కోసం వెచ్చించిన మొత్తంతోనే  దీనిని పూర్తి చేసింది. ఇస్రో ప్రయత్నం ప్రాథమిక స్థాయిలో విజయవంతం కాగా, చంద్రుడిపై రోవర్‌ ఆగస్టులో కాలుమోపనుంది. ఇంత చవకగా అంత పెద్ద ప్రయత్నం చేసిన ఇస్రోకు ప్రపంచదేశాలన్నీ జేజేలు పలుకుతున్నాయి.

‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్‌-3 ‌కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసు కెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు సెల్యూట్‌’’ అని ప్రశంసించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఇస్రో దాదాపు నాలుగేళ్లుగా ఈ మిషన్‌పై పని చేస్తోంది. జులై 14వ తేదీ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్‌-3 ‌స్పేస్‌‌క్రాఫ్ట్ ‌విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీన్ని బాహుబలి రాకెట్‌గా అభివర్ణించిన ఇస్రో ఆ తరువాత దానికి లాంచ్‌ ‌వెహికల్‌ ‌మార్కు-3 గా పేరు పెట్టింది. చంద్రయాన్‌-3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్‌ ‌సోమనాథ్‌ ‌ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశలూ పూర్తయ్యాయి.

24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై కాలుమోపుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ఇది అనుకున్న రీతిలో సురక్షితంగా సాగితే ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం అయినట్టు లెక్క.

కౌంట్‌డౌన్‌ ‌పూర్తయిన వెంటనే రాకెట్‌ ‌నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో దశ పూర్తయిన వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలలో హర్షాతి రేకాలు వ్యక్తం అయ్యాయి. 3.5లక్షల కిలోమీటర్ల ప్రయాణానంతరం చంద్రయాన్‌- 3 ‌చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. ప్రస్తుతం స్పేస్‌ ‌క్రాఫ్ట్ ఆరోగ్యం సజావుగా ఉందని, అది కక్ష్యలోనే పరిభ్రమిస్తోందని ఇస్రో తాజాగా వెల్లడించింది. దీని గమనాన్ని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

చంద్రయాన్‌-3 ‌లక్ష్యాలు…

  1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్‌ అయ్యేలా చేయడం
  2. రోవర్‌ ‌సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం
  3. శాస్త్రీయ పరిశోధనలు

2020 జనవరిలో ఇస్రో తొలిసారిగా చంద్రయాన్‌-3‌పై ప్రకటన చేసింది. డిజైన్‌పై పని చేస్తున్నామని, త్వరలోనే అసెంబ్లింగ్‌ ‌పూర్తవుతుందని వెల్లడించింది. చంద్రయాన్‌-2 ‌కన్నా పకడ్బందీగా దీన్ని డిజైన్‌ ‌చేశారు. ముఖ్యంగా ల్యాండర్‌ ‌లెగ్స్‌ని మరింత దృఢంగా తయారుచేశారు. దీనిని 2021లోనే ప్రయోగించాలని భావించినా కోవిడ్‌ ‌కారణంగా వాయిదా వేశారు. అప్పటికే ప్రొపల్షన్‌ ‌సిస్టమ్‌ ‌టెస్టింగ్‌ ‌పూర్తయ్యింది. జులై 14న ప్రయోగం చేపడతామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ల్యాండర్‌, ‌రోవర్‌ ‌మాడ్యూల్‌ ‌వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ ‌క్రాఫ్ట్ ‌చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో ల్యాండ్‌ అవుతుంది. ప్రొపల్షన్‌ ‌మాడ్యూల్‌ ‌భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గురుత్వా కర్షణకు అనుగుణంగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ ‌విడిపోతుంది. లాంచ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెలరోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్‌ ‌దిగుతుంది. అయితే, చంద్రుడిపై సూర్యోదయం ఎలా ఉందన్న దానిపైనే ల్యాండింగ్‌ ఎప్పుడన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే.. ల్యాండింగ్‌ ‌కూడా జాప్యమవుతుంది. అదే జరిగితే…ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్‌ ‌చేస్తుంది. కానీ…ఈ మిషన్‌లో కీలకమైన అంశం ఇదే. ల్యాండింగ్‌కి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌సహా పలువురు కీలక నేతలు ప్రశంసలు కురిపించారు. చంద్రయాన్‌-3‌తో భారతదేశం యావత్‌ ‌ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ‌పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులంతా ఇస్రో సైంటిస్ట్‌లకు అభినందనలు తెలిపారు.

గత అనుభవాల నుంచి పాఠాలు

చంద్రయాన్‌ -2 ‌ప్రయోగం చేపట్టిన 2019 సెప్టెంబర్‌ 6‌వ తేదీన దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అనుకోని అవాంతరాల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇస్రో శాస్త్రవేత్తలంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈసారి కచ్చితంగా విజయం సాధించాల్సిందేనన్న పట్టుదలతో పనిచేశారు. ఈ ప్రాజెక్ట్‌కి అయిన ఖర్చు రూ.615 కోట్లు. దాదాపుగా త్రిబుల్‌ ఆర్‌ ‌సినిమాకు వెచ్చించిన మొత్తం అది. ఇంత తక్కువ మొత్తంలో ప్రయోగం చేపట్టటం సాధ్యమా అని అందరూ ముక్కున వేలేసు కుంటున్నారు. స్పేస్‌‌క్రాఫ్ట్‌లో ప్రొపల్షన్‌ ‌మాడ్యూల్‌, ‌ల్యాండర్‌ ‌మాడ్యూల్‌, ‌రోవర్‌ ఉం‌టాయి. ఇవే చంద్రుడిపై ఉన్న కీలక సమాచారాన్నంతా భూమికి చేరవేస్తాయి. ఈ మూన్‌ ‌రేస్‌లో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా చంద్రుని మీద సురక్షితంగా దిగగలి గాయ. ఇప్పుడు భారత్‌ ‌వంతు వచ్చింది. చంద్రయాన్‌ -3 ‌విజయం సాధిస్తే, అమెరికా, రష్యా, చైనాతోపాటు భారత్‌ ‌కూడా చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుడిపైకి అత్యాధునికమైన పరికరాలను మోసుకెళుతున్నారు.

గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం చంద్రయాన్‌-3‌కి ఉందని ఇస్రో చీఫ్‌ ఎస్‌ ‌సోమనాథ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. అదనంగా కెమెరాలు అమర్చారు. సాఫ్ట్‌వేర్‌నీ మెరుగుపరిచారు. ఏదైనా ముప్పు తలెత్తితే ప్రమాదాలను పసిగట్టేలా సాంకేతిక మార్పులు చేశారు.

 ఇస్రో భవిష్యత్‌ ‌లక్ష్యాలు

చంద్రయాన్‌-1‌లో ఆర్బిటర్‌, ‌మూన్‌ ఇం‌పాక్ట్ ‌ప్రోబ్‌ ‌ప్రయోగించారు.

చంద్రయాన్‌-2‌లో ఆర్బిటర్‌తో పాటు, ల్యాండర్‌, ‌రోవర్‌ ‌కూడా పంపించారు.

చంద్రయాన్‌-3‌లో… ఆర్బిటర్‌ ‌లేకుండా ల్యాండర్‌, ‌రోవర్‌ ‌మాత్రమే పంపిస్తున్నారు. ఈ ప్రయోగంలో చంద్రయాన్‌-2‌లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే ఉపయోగించుకోనున్నారు.

చంద్రయాన్‌-3‌లో సాధించిన విజయాలను బట్టి, సేకరించిన సమాచారాన్ని బట్టి చంద్రయాన్‌-4, ఆ ‌తర్వాత వరస ప్రయోగాలు కొనసాగుతాయి. అవన్నీ విజయవంతమవుతూ ఉంటే రాబోయే రోజుల్లో చేపట్టే ప్రయోగాల్లో మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపిస్తారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయోగాలు కూడా జరుగుతున్నాయ. ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్‌ ‌కూడా ఇందులో భాగమే. భారత తొలి వ్యోమగామి రాకేశ్‌ ‌శర్మ, రష్యాకు చెందిన సోయజ్‌ ‌వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇలా ఇతర దేశాల సాయంతో కాకుండా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో మానవుల్ని అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌ ‌యాన్‌ ‌ప్రయోగాల్ని ఇస్రో చేపట్టబోతోంది.

ముందున్న సవాళ్లివి..

చంద్రయాన్‌ ‌ప్రయోగాల్లో ఇప్పటి వరకూ ప్రయోగించిన ఆర్బిటర్లు కానీ, ల్యాండర్లు, రోవర్లు కానీ వేటినీ తిరిగి భూమ్మీదకు తీసుకురావాల్సిన పనిలేదు. కానీ వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపిస్తే వాళ్లను సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాల్సి ఉంటుంది. అందుకోసం క్రూ మాడ్యూళ్లను తయారు చేయాలి.

నాసా పంపిన విధంగా సాధ్యమైనంత తక్కువ కాలంలో చంద్రుడిని చేరేలా భారీ రాకెట్లను నిర్మిం చాల్సి ఉంటుంది. చంద్రుడి మీద దిగేలా మానవ సహిత ల్యాండర్లను పంపించడమే కాదు.. సదరు ల్యాండర్‌ ‌తిరిగి భూమికి తిరిగి రావాలంటే చంద్రుడికి కొంత ఎత్తులో కమాండ్‌ ‌మాడ్యూల్‌ ‌కూడా ఉండాలి.

ఈ కమాండ్‌ ‌మాడ్యూల్‌ ‌నుంచే ల్యాండర్‌ ‌చంద్రుడి మీద దిగి, అక్కడ వ్యోమగాములు పరిశోధనలు చేసిన తర్వాత, తిరిగి వాళ్లు అదే ల్యాండర్‌ ‌మాడ్యూల్‌లో తిరిగి చంద్రుడి ఉపరితలంపై ఉన్న కమాండ్‌ ‌మాడ్యూల్‌కి వచ్చి చేరాలి. ఆ తర్వాత ఈ కమాండ్‌ ‌మాడ్యూల్‌ను తిరిగి భూమికి తీసుకురావాలి.

ఈ ప్రయోగాలన్నీ పది రోజుల లోపు వ్యవధిలోనే పూర్తి చేయాలి. దీనికి అత్యాధునిక సాంకేతికత, భారీ రాకెట్లు తయారు చేయాలి. చంద్రుడి మీద వాతావరణం సరిగా ఉండదు. అంతరిక్షంలో ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువకు పడిపోతుంది. ఇక్కడ కూడా రాకెట్లు ప్రయాణించేలా క్రయోజనిక్‌ ఇం‌జిన్లను రూపొందించాలి.ఇవన్నీ సాధించే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది.

మరోవైపు అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ ‌పెట్టు బడులను భారత్‌ ‌స్వాగతిస్తోంది. చంద్రయాన్‌-3 ‌విజయవంతమైతే ఆ పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయి. 2020లో ఇండియన్‌ ‌స్పేస్‌ ఎకానమీ విలువ 9.6 బిలియన్‌ ‌డాలర్లుగా ఉంది. 2025నాటికి ఇది 13 బిలియన్‌ ‌డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఈ రంగానికి సంబంధించి 140 కంపెనీలున్నాయి. మూన్‌ ‌రేస్‌లో దూసుకుపోతున్న ఇండియా అమెరికాకి చెందిన మూన్‌ ‌మిషన్‌ ఆర్టెమిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైతే విదేశాల సహకారమూ తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. అంతరిక్ష రంగంలో పట్టు సాధించాలన్న భారీ లక్ష్యంతో ఉంది. మూన్‌ ‌మిషన్‌ ‌కోసం చైనా, రష్యా చేతులు కలిపాయి. కానీ భారత్‌ ‌మాత్రం సొంతగా ఈ మిషన్‌ని చేపట్టింది.


చంద్రయాన్‌ -3 ‌విడిభాగాలు హైదరాబాద్‌లో తయారీ

చంద్రయాన్‌ -3 ‌విడిభాగాలు హైదరాబాద్‌లో రూపుదిద్దుకోవటం తెలుగు వారికి, తెలంగాణ వారికి గర్వకారణమని చెప్పాలి. చంద్రయాన్‌-2 ‌వైఫల్యంతో పాఠాలు నేర్చుకున్న ఇస్రో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్‌-3 ‌విడిభాగాలను హైదరాబాద్‌లో తయారు చేశారు. కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌ ‌లోని నాగసాయి ప్రెసిషన్‌ ఇం‌జినీర్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థ కొన్ని స్పేర్‌ ‌పార్ట్‌లను రూపొందించింది. రోవర్‌, ‌ల్యాండర్‌, ‌ప్రొపల్షన్‌ ‌మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను ఇక్కడే తయారు చేశారు. కంపెనీ యజమాని డీఎన్‌ ‌రెడ్డి 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 శాటిలైట్లలో పలు విడిభాగాలు అందిస్తూ వచ్చారు. చంద్రయాన్‌-3 ‌విజయాన్ని ప్రభుత్వం, శాస్త్రవేత్తలతోపాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు.


పిట్టల్ని తోలే టెక్నిక్‌తో…
మాములుగా వడిశెలలో రాయి పెట్టి కొట్టిన దానికంటే గిరగిరా తిప్పి విసిరితేనే రాయి ఎక్కువ దూరం వెళ్తుంది. ఇదే సిద్ధాంతాన్ని అచ్చంగా అమలు చేస్తున్న ఇస్రో చంద్రుడిపై ప్రయోగాలకు ఉపయోగిస్తోంది. దాని వల్ల తక్కువ వ్యయంతో ప్రయోగాన్ని చేపట్టగలిగింది.


–  డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE