– లంకా దినకర్‌, ‌B.com.,F.CA.

చట్టాల అమలులో వివక్ష రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కాకూడదు. చట్టాల అమలులో పౌరులందరికి సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతున్నది. మన రాజ్యాంగాన్ని రాసే సమయంలో అన్ని ప్రకరణలను, ముఖ్యంగా ప్రాథమిక హక్కులను పొందుపరచే అంశంలో రాజ్యాంగ పరిషత్‌ ‌లోతుగా అధ్యయనం చేసి పార్లమెంటుకు పంపింది. అక్కడ చర్చ అనంతరం ఆమోదించిన అంశాలే నేడు మన రాజ్యాంగంలో ప్రకరణలుగా ఉన్నాయి. వాటి ఆధారంగా అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. కాలమాన పరిస్థితుల దృష్ట్యా యుసీసీ (ఉమ్మడి పౌరస్మృతి) వంటి అంశాలను అనుకూలతలను బట్టి భవిష్యత్తులో అమలు చేసే విధంగా ఆదేశికసూత్రాలలో చేర్చారు. అంటే దీర్ఘకాలం వాటిని ఆదేశికసూత్రాలకు పరిమితం చేయమని కాదు. ఇందుకు సంబంధించిన చట్టాలను భవిష్యత్తులో చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మెజారిటీ సభ్యుల అనుకూల ఓటింగ్‌తో రాజ్యాంగ పరిషత్‌ ‌ముసాయిదా కమిటీ చైర్మన్‌ ‌డా. బీఆర్‌ అం‌బేడ్కర్‌ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత ఆధారిత పర్సనల్‌ ‌లాలో అవసరమైన మార్పులు చేర్పుల ద్వారా వ్యక్తుల ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నది ఆ నిర్ణయం ఉద్దేశం.

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి కొంతవరకు దేశ విభజన నేపథ్యం కూడా ఉంది. పాకిస్తాన్‌ ఏర్పడినప్పటికీ ఇష్టమున్న మైనార్టీలు భారత పౌరులుగా కొనసాగవచ్చనీ, విభజిత పాక్‌ ‌ప్రాంతంలో ఉన్న హిందువులు, బౌద్దులు, సిక్కులు, క్రైస్తవులు కావాలనుకుంటే అక్కడి పౌరులుగా కొనసాగ వచ్చని నిర్ణయం తీసుకున్నారు. తరువాత భారతదేశంలో నివసిస్తున్న మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్‌ ‌వంటి ప్రత్యేక హక్కులు కావాలని పార్లమెంట్‌లో ఆ వర్గనాయకులు కోరారు. ఈ అంశం మీద రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్‌ ‌పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ప్రత్యేక దేశం ఇచ్చిన తరువాత వారికి మత ప్రాతిపదికన ప్రత్యేక హక్కులకు అవకాశం లేదని చెప్పారు. మరోవంక సమానత్వ స్ఫూర్తితో పౌరులందరికి కుల, మత, జాతి, వర్ణ, లింగ వివక్ష లేకుండా రాజ్యంగం ద్వారా ప్రాథమిక హక్కులు ఇచ్చారు. అవి, సమానత్వపు హక్కు (ఆర్టికల్‌ 14 ‌నుండి 18 వరకు), వాక్‌ ‌స్వాతంత్య్రం, దేశంలో నివసించే హక్కు, ఆర్థిక స్వేచ్ఛ తదితర హక్కులు (ఆర్టికల్‌ 19 ‌నుండి 22 వరకు), బలవంతపు దోపిడీ నివారించే హక్కు (ఆర్టికల్‌ 23 ‌నుండి 24 వరకు), మత స్వేచ్ఛ (ఆర్టికల్‌ 25 ‌నుండి 28 వరకు), సాంస్కృతిక, విద్య హక్కు (ఆర్టికల్‌ 29 ‌నుండి 30 వరకు), రాజ్యాంగ పరిహారపు హక్కు (ఆర్టికల్‌ 32 ‌నుండి 35 వరకు).

ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చిన యూసీసీ వెనుక స్ఫూర్తి – ఒకే దేశం-అందరికి సమాన చట్టం. అందరికి చట్టాలు సమానంగా అమలు చేయాలన్న భావన నిజమైన సెక్యులర్‌ ‌భావన. ముఖ్యంగా ఒక వర్గం మహిళల ప్రాథమిక హక్కులు హరించే విధంగా పర్సనల్‌ ‌లా రూపంలో ఉన్న ప్రత్యేక చట్టాలు అమలైతే అది ఏ విధమైన సెక్యులరిజం? దానికి మద్దతు ఇచ్చేవారు సెక్యులరిస్టులు ఎలా అవుతారు? తప్పు చేసిన వారికి లేదా బాధితులకు అవకాశాలను బట్టి పబ్లిక్‌ ‌లాను వినియోగించుకుంటూ, వారికి వ్యక్తిగత లబ్ధి కోసం మాత్రం పర్సనల్‌ ‌లా అంటే కొంతమంది జీవితాలు దారుణ వివక్షకు గురి అవుతాయి. ఇది వాస్తవంగా కనిపిస్తున్నదే అయినా, ఉమ్మడి పౌరస్మృతి చర్చకు వచ్చినప్పుడు ఉదార వాదం, సెక్యులరిజం అంటూ మాట్లాడేవారందరు మౌనం దాల్చడం బుజ్జగింపు రాజకీయాల కోసమే.

దీనికి మధ్యప్రదేశ్‌, ఇం‌దోర్‌కు చెందిన షాబానో బేగం కేసు పెద్ద ఉదాహరణ. సుప్రీంకోర్టు తీర్పుని కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం రాజీవ్‌ ‌గాంధీ నేతృత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా నీరు గార్చింది. భారత సమాజం తల దించుకునే విధంగా వ్యవహరించి షాబానో వంటి పేద మహిళల ప్రాథమిక హక్కులు కాలరాచింది. 62 ఏళ్ల షాబానో విడాకుల అనంతరం సెక్షన్‌ 125 ‌సిఆర్పీసి క్రింద చట్ట ప్రకారం నెలవారీ నిర్వహణ ఖర్చులను తన భర్త నుండి పొందే అవకాశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినప్పటికీ కోల్పోయింది. సుప్రీం కోర్ట్ ‌తీర్పును తొక్కిపెడుతూ నాటి కేంద్రం తెచ్చిన చట్టం మైనార్టీ మహిళలకు శరాఘాత మయింది. పర్సనల్‌ ‌లా మాటున ఇటువంటి అసమానతలు ఉన్నందున రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ ‌కోసం ఆర్టికల్‌ 44 ‌ని పొందుపరిచారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు తగిన సమయంలో చట్టం చేయాలని నిర్దేశించారు. ఆయన దృష్టిలోని వాస్తవికతకు ఇది అద్దం పడుతున్నది. రాజకీయ అవసరాల కోసం నిత్యం డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌పేరును నిత్యం ఉచ్చరించేవారు యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ ‌విషయంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఎందుకు గౌరవించరు?

యూసీసీ స్ఫూర్తి ఎంతటిదో గోవా అనుభవాలు కూడా చెబుతున్నాయి. గోవాలో చిరకాలంగా పోర్చు గీస్‌ ‌వారి వల్ల యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ అమలులో ఉంది. 2019 నాటి జొస్‌ ‌పౌలో కౌటిం’ కేసులో సుప్రీం కోర్టు గోవాలో ఏ ఇబ్బంది లేకుండా యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ అమలు జరుగుతున్న సంగతిని గుర్తు చేసింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1981లో గోవాలోనూ పర్సనల్‌ ‌లా ను ప్రవేశపెట్టే యోచనతో ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడి మైనార్టీ మహిళలు, యువకులు తామంతా యూనిఫామ్‌ ‌సివిల్‌ ‌కోడ్‌ ‌క్రిందనే జీవిస్తామని చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించారు. అయితే, గోవా యూసీసీ వల్ల అక్రమ సంబంధంతో విడాకుల విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఆ లోపాన్ని కూడా కొత్త యూసీసీ ద్వారా నివృత్తి చేసే అవకాశం ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కోసం, వారు శాంతి సామరస్యాలతో కలిసి జీవించడానికి, సమానత్వం కోసం సంస్కరణలను తీసుకువచ్చింది. నేడు ఉమ్మడి పౌరస్మృతి తేవడం ద్వారా దేశ మహిళలందరి హక్కుల పరిరక్షణకు ప్రయత్నం చేస్తున్నది. గతంలో ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌నిషేధ చట్టాన్ని రూపొందించి నప్పుడు మైనార్టీల ఆచార వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం అంటూ కొందరు రెచ్చగొట్టారు. కేంద్ర ప్రభుత్వ మంచి ఉద్దేశాలను వ్యతిరేకించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎ ‌రద్దు చేసినప్పుడు కొన్ని రాజకీయ ప్రేరేపిత వర్గాలు వ్యతిరేకించాయి. కానీ నేడు కశ్మీరీలు ఆర్థిక స్వావలంబనతో శాంతియుతంగా జీవిస్తున్నారు. సీఏఏ చట్టం విషయంలోను ఇదే విష ప్రచారం జరిగింది. దీని ద్వారా దేశంలో మైనార్టీల పౌరసత్వం రద్దు చేస్తారని చెప్పి కొంతమందిని ఉసిగొల్పారు. ఈ చట్టం ద్వారా దేశంలో ఎవరైనా పౌరసత్వం పోగొట్టుకున్నారా అంటే ఇప్పుడు సమాధానం లేదు.

యూసీసీ దేశంలో నివసించే వారందరికీ చట్టాలు సమానంగా వర్తించేలా చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడమంటే దేశంలో సమానత్వాన్ని శాశ్వతంగా సమాధి చేయడమే.

ట్రిపుల్‌ ‌తలాక్‌, ఆర్టికల్‌ 370 ‌రద్దు, సీఏఏ అనంతరం ఒక వర్గం హక్కులు హరించివేస్తారంటూ ప్రచారం చేసిన వారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన, జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో 80 కోట్ల మంది లబ్దిదారు లలో అన్ని వర్గాలు ఉన్నాయా, లేదా? పీఎంఏవై గృహాల 1.20 కోట్ల లబ్దిదారులలో అన్ని వర్గాలు ఉన్నాయా, లేదా? అయుష్మాన్‌ ‌భారత్‌ ‌క్రింద 10.70 కోట్ల కుటుంబాలకు సంబంధించిన 50 కోట్ల లబ్ధిదారుల కోసం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ. 50,000 కోట్లు అన్ని వర్గాలకు అందాయా? లేదా? 45.70 కోట్ల జనధన్‌ ‌ఖాతాల ద్వార గత 9 సంవత్సరాలలో లబ్ధిదారులకు జరిగిన రూ.30 లక్షల కోట్ల నగదు బదిలీలో అన్ని వర్గాలు ఉన్నాయా? లేదా? రైతులకు ప్రతి సంవత్సరం పెట్టుబడి సహయం కోసం ఇచ్చే రూ. 6000లో అన్ని వర్గాలు ఉన్నాయా? లేదా? కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన 220 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్‌ను అన్ని వర్గాలు అందుకున్నాయా?  లేదా? భారతదేశంలో అర్హులైన అందరికి సమాన హక్కుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నా ఒక వర్గాన్ని ఓట్ల కోసం రెచ్చగొట్టడం ఇంకా ఎంతకాలం?

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram