– జమలాపురపు విఠల్‌రావు

ఐక్య రాజ్య సమితి మానవాళినంతటినీ స్వర్గధామంలోకి తీసుకుపోవడానికి సృష్టించినది కాదు. కానీ మనుషులను నరకం బారి నుంచి తప్పించడానికి ఉద్దేశించినది మాత్రమే అన్నాడొక ప్రముఖుడు. కానీ కశ్మీర్‌ను మాత్రం ఐక్య రాజ్యసమితి ఏడున్నర దశాబ్దాల పాటు నరకంలోనే నిలబెట్టి ఉంచింది. కశ్మీర్‌ ‌భూతల స్వర్గం అనే మాటను ప్రపంచం మరచిపోయేందుకు తన వంతు పాత్రను కూడా నిర్వహించింది. ఐరాస కశ్మీర్‌ ‌వ్యవహారంలో అతి పెద్ద వైఫల్యం. దాని పాత్ర చరిత్రాత్మక తప్పిదం. లోయలో శాంతిభద్రతల విషయంలో ఐరాసది కేవలం సలహదారు పాత్ర మాత్రమే. కానీ ఆ లోయ తలరాత దాని చేతిలోనే ఉందని మన కాంగ్రెస్‌ ‌నాయకత్వం నమ్మినట్టు కనిపిస్తుంది.  1947లో భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌విభజన జరిగిన వెంటనే తలెత్తిన ఈ సమస్య ఇప్పటికీ రగులుతూనే ఉంది. రావణకాష్టం అన్నదానికి గొప్ప ఉదాహరణ. 75 ఏళ్ల నుంచి కశ్మీర్‌కూ, ఆక్రమిత కశ్మీర్‌కూ మధ్య పడిన ఇనుపతెరను ఐరాస కాస్త కూడా కదపలేకపోయింది. ఆక్రమిత కశ్మీర్‌ ‌స్వేచ్ఛ కోసం ఘోషిస్తున్నా కూడా ఐరాసకు వినిపించడం లేదు. సమితి వ్యవహారాలకు సంబంధించి కశ్మీర్‌ ‌సమస్యకు కనుచూపు మేరలో కూడా పరిష్కారం కనిపించడంలేదు. 

మొత్తం 565 సంస్థానాలలో జునాగఢ్‌, ‌హైదరాబాద్‌ ‌సమస్యలు పరిష్కారం అయినప్పటికి కశ్మీర్‌ ‌సంస్థానం సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. భారత్‌కు ఒక సవాలుగా మారిపోయింది. విలీనం గురించి రెండు దేశాల మధ్య వివాదం తలెత్తగానే భారత్‌ ‌సమస్యను ఐక్య రాజ్యసమితి భద్రతామండలి పరిధిలోకి తీసుకువెళ్లింది. సమితి తీర్మానం 39 (1948) చేసింది. ఫలితమే యునైటెడ్‌ ‌నేషన్స్ ‌కమిషన్‌ ‌ఫర్‌ ఇం‌డియా అండ్‌ ‌పాకిస్తాన్‌ ఏర్పాటు. తరువాత 1950, 1951, 1952,1957, 1965, 1971లలో కూడా తీర్మానాలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి పరిధిలో సమస్య ఉండగానే భారత్‌, ‌పాక్‌ ‌రెండు పర్యాయాలు యుద్ధాలు చేశాయి. కార్గిల్‌ ‌ఘర్షణ జరిగింది. కొన్నివందల సార్లు కాల్పులు జరిగాయి. కశ్మీర్‌ను చూపుతూ పాకిస్తాన్‌ ‌భారత్‌లోని ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోను విధ్వంసానికి పాల్పడింది. వేలాది ప్రాణాలు తీసింది. 1990లో కశ్మీర్‌ ‌లోయ నుంచి పండిత్‌ ‌వర్గాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి పెద్ద ఎత్తున హింస మొదలైంది. వీటిలో దేనినీ ఆపే శక్తి సమితికి లేదని తేలి పోయింది. కశ్మీర్‌ ‌రక్తపాతం పట్ల, హింస పట్ల, అమాయకుల చావుల పట్ల, ఆఖరికి ముస్లిం మతోన్మాదం పట్ల, మైనారిటీల హక్కుల హరణ పట్ల సమితిది కేవలం మౌన ప్రేక్షకపాత్ర. కశ్మీర్‌ ‌పోరాటానికి (అక్కడి ఉగ్రవాదానికి) పాకిస్తాన్‌ అం‌డగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షులు ఎన్నోసార్లు బాహాటంగానే ప్రకటించారు. అయినా సమితిలో రావలసిన కదిలిక రాలేదు. భారత్‌లో మైనారిటీలకు రక్షణ లేదంటూ వెలువడే ప్రకటనలలోని నిజాన్ని బయటకు చెప్పడానికి అది ముందుకు రాలేదు. సమితిలో జరిగేదల్లా అమెరికా పాదాల నీడలో వ్యభిచారమే అన్నాడొక విమర్శకుడు. ఇటీవలి కాలంలో చైనా చేతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలుబొమ్మగా మారిందన్న అపవాదు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిగా సంస్కరించాలని మోదీ అన్నమాటలు అక్షరసత్యాలు.

కశ్మీర్‌లో ఐరాస నిర్వహించిన పాత్ర ఏమిటి? శాంతిని స్థాపించిందా? అది నేతి బీరలో నేయి చందంగానే ఉంటుంది. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ‌మద్దతుతో విద్రోహ కార్యకలాపాల చరిత్ర 1989 నుంచి కొత్త పుంతలు తొక్కింది. నిజానికి 1978- 88 మధ్యకాలంలో పాకిస్తాన్‌ ఆరవ అధ్యక్షుడిగా పనిచేసిన జియా ఉల్‌ ‌హక్‌ ‌పాకిస్తాన్‌ను ఇస్లామీక రించి రాజకీయాల్లో, పాలనా వ్యవస్థలో, సైన్యంలో ఇస్లామిస్టులను ప్రవేశపెట్టడంతో ఈ విద్రోహ కార్యకాలపాలకు బీజం పడింది. ఈ విద్రోహ గ్రూపుల్లో ఒకవర్గం పూర్తి స్వాతంత్య్రం కోరుతుండగా మరోవర్గం పాకిస్తాన్‌లో కలవాలన్న లక్ష్యంతో పని చేసింది. తమలోని అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అహింసామార్గాన్ని ఎంచుకునే వర్గాల సంఖ్య పరిమితం కావడం పాకిస్తాన్‌కు అనుకూలంగా మారిన ఫలితంగా 1988 నుంచి భారత్‌కు వ్యతిరేకంగా హింసాత్మక శక్తుల ప్రాబల్యం పాక్‌ ‌ప్రభుత్వం, ఐఎస్‌ఐ ‌ప్రోద్బలంతో బాగా పెరుగుతూ వచ్చింది. 1987లో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి ఫరూక్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. దీనివల్ల ప్రజాస్వామ్యం కొనసాగడం పరిస్థితి అట్లా ఉంచితే విద్రోహాలకు ఈ ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకంగా మారింది. ముఖ్యంగా కొంతమంది అసెంబ్లీ సభ్యులే ఏకంగా విద్రోహ గ్రూపులను నిర్వహించడం మొదలైంది. ఫలితంగా 1988లో రాష్ట్రంలో ఆందోళనలు, సమ్మెలు, దాడులు విపరీతంగా పెరిగిపోయి చివరకు 1990 నాటికి పతాక స్థాయికి చేరాయి. కేవలం కశ్మీర్‌ ‌కోసం మూడు యుద్ధాలుచేసి పరాభవం పాలైన తర్వాత పాకిస్తాన్‌కు చెందిన ఐ.ఎస్‌.ఐ. ‌జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్‌ ‌ముజాహిద్దీన్‌లకు మద్దతునివ్వడం మొదలు పెట్టింది. సరిగ్గా ఇదేకాలంలో వివిధ ఇస్లామిక్‌ ‌రాడికల్‌ ‌భావజాలాలు పుట్టుకొచ్చి, క్రమంగా వేర్పాటువాదం, ఇస్లామిక్‌ ‌ఛాందసవాదంగా రూపుదిద్దుకుంది. పెద్దసంఖ్యలో జిహాదీ ముస్లిం తీవ్రవాదులు పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌నుంచి, జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించడం ప్రధాన కారణం. వీరంతా అఫ్ఘానిస్తాన్‌•లో సోవియట్‌ ‌యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడినవారు. ఈ సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలని భారత్‌ ఎన్నిసార్లు హితవు చెప్పినా పాకిస్తాన్‌ ‌వినిపించుకో లేదు. 2017 మార్చి నాటికి ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈ విద్రోహకాండలో 41 వేల మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 14వేల మంది ప్రజలు, 5వేల మంది భద్రతా బలగాలు, 22 వేల మంది మిలిటెంట్లు ఉన్నారు. ఈ మరణాల్లో అత్యధిక శాతం 1990-2000 మధ్యకాలంలో చోటు చేసుకున్నవే కావడం గమనార్హం. 2015లో నాటి పాక్‌ అధ్యక్షుడు పర్వెజ్‌ ‌ముషార్రఫ్‌ అప్పట్లో మాట్లాడుతూ.. 1990 ప్రాంతంలో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలిచిందన్న సత్యాన్ని స్వయంగా అంగీకరించారు. అమెరికాకు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ ‌ఫారెన్‌ ‌రిలేషన్స్ ‌సంస్థ, అల్‌ఖాయిదా దాని అనుబంధ సంస్థ జైషే మహమ్మద్‌లు కశ్మీర్‌లో ఉగ్రవా దాన్ని ప్రోత్సహిస్తున్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది. పాక్‌ ‌సైన్యంలోని సీనియర్‌ అధికార్లు మిలిటెంట్లు, క్రిమినల్‌ ‌గ్రూపులకు మద్దతునిస్తున్నారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత సుఫీ జర్నలిస్ట్ ‌స్టీఫెన్‌ ‌సులేమాన్‌ ‌స్కివార్జ్ ‌పేర్కొనడం గమనార్హం.

ఉగ్రవాదాన్ని అరికట్టే చర్యలేవి?

2001, అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీపై బాంబు దాడి (27 మంది మరణించారు), 2001 డిసెంబర్‌లో పార్లమెంట్‌పై దాడి (దాడికి పాల్పడిన ఐదుగురు సహా 14 మంది మరణించారు), 2003, జులై 13న శ్రీనగర్‌లోని ఖాసిమ్‌ ‌నగర్‌ ‌మార్కెట్‌లో బాంబు దాడి (27 మంది మరణం), ఆల్‌ ‌పార్టీ హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌నేత అబ్దుల్‌ ‌ఘనీలోన్‌ ‌హత్య, 2005లో శ్రీనగర్‌లో సైనిక వాహనంపై దాడి, 2005 జులై 29న బాద్‌షా చౌక్‌ ‌దాడి, 2005, అక్టోబర్‌ 18‌న జమ్ముకశ్మీర్‌ ‌విద్యాశాఖ మంత్రి గులాం నబీలోన్‌ ‌హత్య, 2016, సెప్టెంబర్‌ 18‌న యురి దాడి (18 మంది మరణించారు), 2019, ఫిబ్రవరి 19న పుల్వామా దాడి (38 మంది సిఆర్‌పీఎఫ్‌ ‌జవాన్ల వీరమరణం) ఇవన్నీ.. మిలిటెంట్ల దాడులు. వీటికితోడు డిసెంబర్‌ 24,1999‌న ఉగ్రవాదులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్ ‌విమానాన్ని హైజాక్‌ ‌చేసి కందహార్‌కు తీసుకెళ్లారు. దీనిపై మీడియాలో విపరీతంగా ప్రచారం రావడంతో విమాన ప్రయాణికుల రక్షణ విషయంలో తీవ్ర ఒత్తిడికి గురైన ప్రభుత్వం ఉగ్రవాది మౌలానా మసూద్‌ అజర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 18, 2007న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలి 68 మంది మరణించారు. ఈ రైలు న్యూఢిల్లీ-లాహోర్‌ ‌మధ్య నడిచేది. 2008లో ముంబయిలో పదిమంది ఉగ్రవాదులు జరిపిన దాడిలో 173 మంది మరణించగా 308 మంది గాయపడ్డారు. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నా వీటిని అరికట్టే విషయంలో మాత్రం ఐరాస ప్రేక్షక పాత్రకే పరిమితమైందని చెప్పక తప్పదు.

పాక్‌ ఉక్కుపాదాల కింద పీఓకే

మరి పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిస్థితేంటి? 1980-90 మధ్యకాలం నుంచి ‘జిహాద్‌’ ‌పేరుతో మతమౌఢ్య శక్తులు అక్కడి యువత మెదళ్లలో విషం నింపి శిక్షణలు ఇచ్చి కలాష్నికోవ్‌ ‌రైఫిల్స్ ఇచ్చి అత్యంత శక్తిమంతమైన భారత సైన్యం పైకే ఎగదోసాయి. కశ్మీర్‌ను విముక్తం చేయాలంటూ టీవీలు, న్యూస్‌పేపర్లు, మసీదుల్లో చేసిన విపరీత ప్రచారం చివరకు పీఓకే అభివృద్ధిని నిరోధించడమే కాదు అక్కడి మానవ సంపద విధ్వంసానికి దారితీసింది. స్వర్గతుల్యమైన ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆవిర్భ విస్తుందంటూ యువకులను మభ్యపెట్టి విధ్వంసం వైపు నడిపించిన పాపం ఇప్పుడు పీఓకేను కట్టికుడుపుతోంది. జిహాదీ ఉద్యమం వల్ల హత్యలు, లూటీలు పెరిగిపోయాయి. ఫలితంగా మానవ మరణాలు, ఆస్తి విధ్వంసాలు, పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవడమే కాదు, కాల్పుల విరమణ రేఖకు ఇరువైపులా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను బలవంతంగా బడి మానిపించడం వల్ల వారి బాల్యం ఛిద్రమైంది. జిహాద్‌ ‌పేరుతో సకల సౌకర్యాలు అనుభవించింది పాక్‌ ‌జనరల్స్, ‌రాజకీయ నాయకులు, మతపెద్దలు, జిహాద్‌ ‌కౌన్సిల్‌, ‌ఫ్రీడమ్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందినవారు మాత్రమేనని న్యూస్‌ ఇం‌టర్వెన్షన్‌ ‌వరల్డ్ ‌పేర్కొంది. మానవాభివృద్ధి ప్రాజెక్టులకు కాకుండా విధ్వంస కార్యకలాపాలకు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన ఫలితం ఇప్పుడు పీఓకే అనుభవిస్తోంది. నేడు కశ్మీర్‌కు స్వేచ్ఛ కావాలంటూ ప్రచారాలు చేసేవారిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని న్యూ ఇంటర్వెన్షన్‌ ‌వరల్డ్ ‌పేర్కొంది. గత 75 సంవత్సరాల అస్థిరత తర్వాత ఇప్పుడు జిహాదీ ఉగ్రవాదం నుంచి విముక్తమైన జమ్ముకశ్మీర్‌ ‌శాంతిసుస్థిరతల వైపు వేగంగా పయనిస్తుండగా, ఒకవైపు దుర్భర దారిద్య్రం మరో పైపు అణచివేత చర్యలతో దయనీయ పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌ప్రజలపై, పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, సైన్యం 15వ రాజ్యాంగ సవరణ పేరుతో ఉక్కుపాదం మోపడానికి ప్రయతిస్తున్నాయి. 26 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ ‌ప్రకారం పీఓకే ఆర్థిక అధికారాలు పాక్‌ ‌ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు మొదలుకాగా, అమల్లోకి వచ్చినట్లయితే పీఓకే ప్రావెన్స్‌కున్న ప్రస్తుత స్థాయి మరింత దిగజారడం ఖాయం. నిజానికి 2022, జూన్‌ 29‌నే పాకిస్తాన్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌జస్టిస్‌ అం‌డ్‌ ‌పార్లమెంటరీ అఫైర్స్ అం‌డ్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ఈ ‌డాక్యుమెంట్‌కు తుది రూపం ఇచ్చింది. ముసాయిదాను పరిశీలించడానికి అప్పట్లో ఒక కమిటీని పాక్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఏర్పాటయ్యే కశ్మీర్‌ ‌కౌన్సిల్‌లో 7గురు పాక్‌, ఆరుగురు పీఓకె సభ్యులు ఉంటారు. పీఓకేకు సంబంధించి కశ్మీర్‌ ‌కౌన్సిల్‌ ‌రూపొందించే చట్టాలను, పీఓకే లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో చర్చించ డానికి వీల్లేదు. పీఓకే కోర్టులు కూడా వీటిని విచారించడానికి వీల్లేదు. పీఓకే వార్షిక బడ్జెట్‌ను కూడా ఈ కౌన్సిల్‌ ‌రూపొంది స్తుంది. ఆఖరికి విద్యా సంస్థల్లో పాఠ్యప్రణాళికను కూడా ఇదే తయారు చేస్తుంది. గత నాలుగేళ్లుగా మౌలిక సదుపాయాల కొరత, విద్యుత్‌ ‌కోతలు, నీటి సరఫరా లేక నానా అగచాట్లు పడుతున్న పీఓకే ప్రజల నెత్తిమీద పాక్‌ ‌ప్రభుత్వం, సైన్యం ఉమ్మడిగా రుద్దుతున్న నిరంకుశ పాలనకు చిహ్నమిది. నేడు పీఓకేలో ఆకలికేకలు మిన్నంటు తున్నా పట్టించుకునే దిక్కులేదు. 70 ఏళ్లుగా హింసను ఎగదోసి, విధ్వంసానికి కారకులైన వారు పీఓకే ప్రజలకు చూపిస్తున్న ‘స్వర్గం’ ఇదే! అయితే ఇవేవీ ఐక్యరాజ్య సమితికి ఏమాత్రం పట్టలేదు. భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌మధ్య శాంతియుత వాతావరణం కోసం ఐరాస సాగించిన యత్నాలు ఎన్నడూ సఫలం కాకపోవడమే ఇందుకు నిదర్శనం.

ప్రపంచ వ్యాప్తంగా కూడా శాంతి స్థాపన, యుద్ధాల నివారణలో ఐక్యరాజ్య సమితి వైఫల్యాలు సుస్పష్టం. 1945లో ఐక్యరాజ్య సమితి (యు.ఎన్‌) ఏర్పాటైన దగ్గరి నుంచి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు జరిగాయి వీటిల్లో కొన్ని ఇంకా జరుగుతున్నాయి కూడా. మరి సంస్థ ప్రధాన లక్ష్యమైన శాంతిస్థాపన, వివాదాల పరిష్కారం విషయంలో ఇంతవరకు సఫలీకృతమైన దాఖలాలు కనిపించవు. ఇందుకు ప్రధాన కారణం సంస్థలోని ఐదు శాశ్వత సభ్యత్వ దేశాలకున్న వీటో అధికారం! ఈ వీటో అధికారమే సంస్థ వైఫల్యాలకు మూలకారణ మని చెప్పాలి. తమకున్న ఈ ప్రత్యేక అధికారాన్ని మరో దేశాలతో పంచుకోవడం వీటికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌)‌ని ‘1945లో కనుగొన్న స్తబ్ద యంత్రాంగం’గా అంటే ‘వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా విస్తరణకు నోచని’ సంస్థ అని పేర్కొనడం సహేతుకం. ఇప్పటి వరకు మొత్తం 11 సార్లు ప్రపంచంలో వివిధ దేశాల్లో శాంతిస్థాపన విషయంలో ఐక్యరాజ్య సమితి విఫలం కావడానికి ఈ శాశ్వత సభ్యదేశాల అహంకార వైఖరే ప్రధాన కారణం. 1948లో యూదుల దేశం ఇజ్రాయిల్‌ ఏర్పాటైన దగ్గరి నుంచి ఇప్పటివరకు పాలస్తీనా సమస్యకు ఒక పరిష్కారం లభించలేదు. యూఎస్‌- ‌వియత్నాం యుద్ధం ముగిసి కంబోడియాలో జరిగిన అంతర్యుద్ధం అనంతరం ఖ్మెర్‌రూజ్‌ ‌కంబోడియాను నియంత్రణలోకి తీసుకొని ఆల్ట్రా మావోయిజాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని సోషలిస్టు దేశంగా మార్చిన తర్వాత చోటుచేసుకున్న మారణకాండలో రెండు మిలియన్ల మంది మరణించినా ఐరాస ఖ్మెర్‌రూజ్‌ను గుర్తించింది. 1991లో సోమాలియా నిరంకుశ పాలకుడు మహమ్మద్‌ ‌సయ్యద్‌ ‌బారే పదవీచ్యుతుడైన తర్వాత, వైరి వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణ దశాబ్దాల పాటు కొనసాగింది. 1992లో మానవతా సహాయం అందించేందుకు యూఎన్‌ ‌తన సహాయక సిబ్బందిని పంపినప్పటికీ, అక్కడ ప్రభుత్వమంటూ లేకపోవడంతో, యూఎన్‌ అధికారుల పైనే దాడులు జరిగాయి. ఇక్కడ యూఎన్‌ ‌వైఫల్యం కారణంగా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 1994లో రువాండాలో సైన్యం, రువాండ్‌ ‌ప్యాట్రియాట్రిక్‌ ‌ఫ్రంట్‌ ‌మధ్య భీకర పోరు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చోటుచేసుకున్న అతిపెద్ద జాతి విధ్వంసంగా దీన్ని పేర్కొంటారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని నిరోధించేందుకు హుటు తెగ ఆధిపత్యంలోని ప్రభుత్వం పది మంది యూఎన్‌ ‌పీస్‌ ‌కీపింగ్‌ అధికారులను చంపేసింది. కేవలం మూడు నెలల కాలంలో హుటు తెగవారు 8 లక్షల మంది టుట్సీ జాతి ప్రజలను చంపేశారు. ఈ భయంకర మైన హింసాకాండ విషయంలో యూఎన్‌ది కేవలం ప్రేక్షకపాత్రే. 1992లో బోస్నియా, హెర్జిగోవినా రెఫరెండం తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. తర్వాత బోస్నియా సెర్బ్‌లు, బోస్నియా ప్రభుత్వ సహాయంతో యుద్ధానికి దిగారు. చివరకు 1995లో 8 వేల మందిని బోస్నియన్‌ ‌దళాలు చంపేశాయి. మిగిలిన వారు బతుకుజీవుడా అని యూఎన్‌ ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతానికి వెళ్లినా, పెద్దగా ఆయుధాలు లేని డచ్‌ ‌దళాలు వీరికి తగిన రక్షణ కల్పించలేక పోయాయి. 2003లో సూడాన్‌ ‌పశ్చిమ ప్రాంతంలో డార్ఫర్‌లో పెద్దఎత్తున విధ్వంసకాండ చెలరేగింది. అరబ్‌యేతర రైతులపై ఖర్టుమ్‌ ‌ప్రభుత్వం వివక్ష చూపుతున్నదన్న కారణంగా ఈ హింసాకాడ పెచ్చరిల్లింది. ఇందులో రెండు లక్షల మంది మరణించగా 2.5 మిలియన్ల మంది నిరాశ్రయు లయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూఎన్‌ 26 ‌వేల మంది శాంతి పరిరక్షక దళాన్ని పంపింది. అంతర్జాతీయ క్రిమినల్‌ ‌కోర్టు దేశాధ్యక్షుడు ఒమర్‌ ‌హస్సన్‌ అల్‌ ‌బషీర్‌పై యుద్ధనేరాల కింద అరెస్ట్ ‌వారెంట్‌ ‌జారీ చేసింది. 2003లో యు.ఎస్‌. ‌నేతృత్వంలో ఇరాక్‌పై జరిపిన దాడి సందర్భంగా పదిలక్షల మంది మరణించారు. 2011లో సిరియాలో చోటుచేసుకున్న ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులపై ఉగ్రవాదులనే నెపంతో బషర్‌ అల్‌ అషాద్‌ ‌ప్రభుత్వం కాల్పులు జరిపించింది. అల్‌ఖైదా ఉగ్రవాదులను విడుదల చేసిన తర్వాత దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. ఇక్కడి ఘర్షణల్లో వివిధ దేశాలు కలుగజేసుకోవడం విషాదం. సిరియా సంక్షోభం కారణంగా 6.3 మిలియన్ల మంది దేశం వదిలి పారిపోయారు. మరో 6.2 మిలియన్ల మంది దేశంలోనే నిరాశ్రయులుగా మిగిలి పోవాల్సి వచ్చింది. 2011లో దక్షిణ సూడాన్‌ ‌స్వతంత్ర దేశమైంది. దిన్‌కా జాతికి చెందిన దేశాధ్యక్షుడు సల్వాకీర్‌, ‌న్యూయర్‌ ‌జాతికి చెందిన మాజీ ఉపాధ్యక్షుడు రెయిక్‌ ‌మాఛర్‌ల మధ్య విభేదాలు సివిల్‌వార్‌కు దారితీయడంతో 3,82,000 మంది మరణించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను ఐరాస ఏనాడూ తప్పుపట్ట లేదు. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్రకు ప్రత్యక్ష ఉదాహరణలు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram