‘నాన్నా! నన్ను నీతో ఇంటికి తీసుకెళ్లవా!’

తండ్రి చేతులు రెండూ పట్టుకుని పోలీస్‌ ‌వ్యాన్‌ ‌నుంచి ఆ బాలిక అక్షరాలా విలపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాలలో ఒక వారం క్రితమే దర్శనమిచ్చింది. ఇకపై చూడగలనా? కలుసుకోగలనా? అన్నట్టు తండ్రి చేతులను గట్టిగా పట్టుకుని ఆమె ముద్దు పెట్టుకుంది. తనతో ఇంటికి తీసుకువెళ్లమని అడుగుతూనే ఉంది. ఇంతలోనే వ్యాన్‌ ‌కదిలిపోయింది. ఆ తండ్రి ప్రపంచంలోని నిస్సహాయతనంతా భుజం మీద మోస్తున్నంత భారంగా వెనుదిరిగాడు. ఆ బాలికకు సొంతింటికి వెళ్లాలని ఉంది. తండ్రికి తీసుకుపోవాలనీ ఉంది. కానీ… జూన్‌ 9‌వ తేదీన జరిగిన విచారణలో లార్ఖానా (పాకిస్తాన్‌) ‌న్యాయస్థానం ఆ బాలిక మాటలు నమ్మలేదు. ఇంతకీ ఆ బాలికను పాకిస్తాన్‌ ‌ముస్లింలు ముగ్గురు మారణాయుధాలతో వచ్చి అపహరించారు. మతం మార్చి ఒక ముస్లిం మతస్థుడికి ఇచ్చి పెళ్లి కూడా చేసేశారు. తండ్రీ, ఒక వర్గం మీడియా గగ్గోలు పెట్టడంతో కేసు కోర్టు వరకు వచ్చింది. అప్పుడు జరిగిందీ సన్నివేశం. మతమార్పిడికి గురై, మనసుకు నచ్చని, నరకం వంటి జీవితంలోకి ప్రవేశించడానికి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పినా, ఏ బాలిక మాటనూ ఏ పాకిస్తాన్‌ ‌న్యాయస్థానమూ అంత త్వరగా పట్టించుకోదు. సాధ్యమైనంత వరకు నమ్మదు. ఇప్పుడు జరిగినది అదే. హిందువుల ఇళ్ల నుంచి బలవంతంగా బాలికలను ఎత్తుకు వెళ్లి మతం మార్చి వివాహం చేసినట్టు బాధితురాలు చెప్పినా చాలా వరకు కోర్టులు నమ్మడం లేదు. ఆ బాలిక వాదనను కేవలం ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడిగా పరిగణించి తీర్పులు చెబుతున్నాయి. వియోన్‌ అనే మాధ్యమం ఈ జూన్‌ 11‌న ఇచ్చిన తాజా కథనమిది.


ఆగస్ట్ 15, 1947‌న భారత్‌, ‌పాకిస్తాన్‌ అనే రెండు దేశాలు ఏర్పడిన తరువాత పాకిస్తాన్‌ అనే ఆ దుర్మార్గపు దేశంలో, మానవత్వానికి కనీసం చోటు లేని ఆ నేలలో ఈ రోజుకి కూడా హిందువులు అగచాట్లు పడుతూనే ఉన్నారు. ఇంకా విచిత్రం- అక్కడ మిగిలి ఉన్న హిందువుల పరిస్థితే కాదు, ప్రాణాలు అరచేత పట్టుకుని భారతదేశానికి వచ్చిన వారి పరిస్థితి కూడా అంత భద్రంగా ఏమీ లేదు. లియాఖత్‌ అలీ-నెహ్రూ ఒప్పందం గురించి చెప్పా లంటే, అదొక భ్రూణహత్య. పాక్‌లోని మైనారిటీలకు అంటే హిందువులకు ఆ దేశ ప్రభుత్వం, భారత్‌లోని మైనారిటీలకు భారత ప్రభుత్వం పూచీ పడాలి. వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు. ఆ ఒప్పందం అమలులోకి రాక ముందే మరణించింది. లేకుంటే రాజస్తాన్‌కు వచ్చి ఉంటున్న పాకిస్తానీ హిందువులను ఏప్రిల్‌ ‌మండుటెండలో ఇళ్లు ఖాళీ చేయిస్తారా? ఆ ఇళ్లు కూల్చేస్తారా? కానీ రొహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ప్రతి సెక్యులర్‌ ‌రాజకీయ పార్టీ ఘోషిస్తూనే ఉంటుంది. లవ్‌ ‌జిహాద్‌ ‌శుద్ధ అబద్ధమని ముస్లిం మౌల్వీలతో కలసి వంత పాడుతుంది. ముస్లింల అత్యాచారాల గురించిన సమాచారం కాస్త వెలుగులోకి వచ్చినా ఈ పార్టీలు సహించలేవు. కశ్మీర్‌ ‌ఫైల్స్ అబద్ధాలనీ, కేరళ స్టోరీ కట్టుకథల పుట్ట అని వాదించడం ఇందుకే. కానీ గడచిన 75 సంవత్సరా లలో పాకిస్తాన్‌ అనే ‘రోగ్‌’ ‌దేశంలో లెక్కలేనన్ని కశ్మీరీ ఫైల్స్, ఊహకు కూడా అందనన్ని కేరళ స్టోరీలు పోగుపడి ఉన్నాయి. ఈ అకృత్యాలకు మూలం వారి మతం వారికి చేసిన బోధనలు. పరమత సహనానికి చోటు ఇవ్వని వారి జీవన విధానం. అందుకే మైనర్‌ ‌బాలికలను అంత హింసకు గురి చేస్తున్నా అత్యధిక ఇస్లాం మతగురువులు దానిని సమర్ధిస్తూనే ఉన్నారు. ఆ అత్యాచారాలకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. పాక్‌ ‌రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, పోలీసులు ఎక్కువ మంది హిందూ  బాలికలకు అన్యాయం చేయడానికే సదా సిద్ధంగా ఉంటున్నారు. ఇదంతా పాకిస్తాన్‌లో మిగిలిపోయిన హిందూ కుటుంబాల అనంత క్షోభ. ఇస్లాం కోరలలో చిక్కుకుపోయిన హిందువుల దీనస్థితి. హిందువులు హక్కులకు అర్హులు కాదన్నట్టు, వారు ఏం చెప్పినా నమ్మక్కరలేదన్నట్టు వ్యవహరించే ఉదారవాద కబోదులు పాకిస్తాన్‌ ‌టుడే పత్రిక ఏప్రిల్‌ 18, 2022‌న ఇచ్చిన ఒక వార్తను చూడడం మంచిది.

‘గాంధారా, ఆర్‌ఎఫ్‌ఈ/ఆర్‌ఎల్‌ ఇచ్చిన వివరాల ప్రకారం సింధ్‌ ‌ప్రాంతంలో ఏకంగా ‘మతమార్పిడుల కర్మాగారం’ నడుస్తున్నది. అక్కడ హిందూ బాలికలను బాహాటంగానే మతం మారుస్తున్నారు. తరువాత ముస్లింలకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి పెళ్లి ఒక్క హిందూ అబ్బాయికీ జరగలేదు. అవి ఇచ్చిన నివేదిక ప్రకారం ఏటా 1000 మంది హిందూ మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది సింధ్‌ ‌ప్రాంతం వారే. ఈ ఉదంతాలన్నింటి వెనుక కచ్చితంగా వినిపించే పేరు భర్చుండి దర్గా షరీఫ్‌ అధిపతి మియాన్‌ ‌మిథుదే. ఆ దర్గా ఘోట్కిలో ఉంది’ అని రాసింది. మియాన్‌ ఎం‌దరో హిందూ బాలికలను మతం మారుస్తున్నట్టు రుజువు చేసే వీడియోలు ఉన్నాయి. అక్టోబర్‌ 2, 2012 ‌నాటి ‘డాన్‌’ ‌పత్రిక ఇచ్చిన వివరాలు దిగ్భ్రాంతి కలిగించేటట్టు ఉన్నాయి. మార్చి 1, 2008 నుంచి నవంబర్‌ 30, 2011 ‌మధ్య కాలంలో 116 మంది హిందూ, 27 మంది క్రైస్తవ బాలికలను అపహరించారు. ఈ విషయాన్ని సింధ్‌ ‌మైనారిటీ వ్యవహారాల మంత్రి మోహన్‌ ‌లాల్‌ ‌తెలియచేశారు. ఇవి కేవలం బాలికల మీద జరుగుతున్న అత్యా చారాలు. ఇస్లాం మరొక మతం జాడను అంగీకరిం చదు. ఆ మతగ్రంథం ఏం చెప్పినా అనుయాయులు మాత్రం మతసహనం అంటే ఏమిటో తెలియనివారే. పాకిస్తాన్‌లో ఎన్ని వందల హిందూ ఆలయాల మీద దాడులు జరిగాయో కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. వారి ఆచార వ్యవహారాల మీద ఆంక•లు అమలవు తున్నాయి. కాగా, హిందూ బాలికల అపహరణ గురించి భారతీయ పత్రికల కంటే పాకిస్తాన్‌ ‌పత్రికలే ఎక్కువ వివరాలు ఇచ్చాయంటే అతిశయోక్తి కాదు. డాన్‌తో పాటు డైలీ ఖావిష్‌, ‌ది న్యూస్‌, ‌ది ఎక్స్‌ప్రెస్‌ ‌ట్రిబ్యూన్‌ ‌వంటి పత్రికలలో కూడా ఆ వార్తలకు చోటు కల్పించారు.

వియోన్‌ ‌మాధ్యమం ఇచ్చిన ఆ కథనం ప్రకారం సింధ్‌ ‌ప్రావిన్స్‌కు చెందిన ఒక హిందూ కుటుంబం దయనీయ గాథ ఇది. ఆ బాలిక పేరు సోహానా శర్మ. ఈమెకు ప్రైవేటు చెప్పడానికి నియమించు కున్న అఖ్తర్‌, అతడి మిత్రులు కలసి ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఆ బాలిక వయసు కేవలం 14 ఏళ్లు. ఆమెను అపహరించి సింధ్‌ ‌ప్రాంతంలోనే ఖాజీ అహ్మద్‌ ‌తాలూకాకు పంపించారు. తన ఇంటికి ముగ్గురు సాయుధులు వచ్చారనీ, వారే అఖ్తర్‌ ‌గబోల్‌, ‌ఫైజన్‌ ‌జాట్‌, ‌సారంగ్‌ ‌ఖాష్కేలి అనీ, ఆయుధాలతో బెదిరించి తన కుమార్తెను ఎత్తుకు పోయారనీ సోహానా తండ్రి దిలీప్‌కుమార్‌ ‌చెప్పారు. ఆయన పోలీసులను ఆశ్రయించారు. కొద్దిరోజులకు సోహానా వీడియో కాల్‌లో కనిపించి, జరిగినదంతా తండ్రికి చెప్పింది. మీడియా గొడవ పడలేక పోలీసులు ఆమెను అహ్మద్‌ ‌తాలూకాలోని ఒక ఇంటి నుంచి తీసుకువచ్చారు.

సోహానా తల్లి జమ్నా కథనం ప్రకారం, అఖ్తర్‌ ఆ ‌బాలికను లక్ష రూపాయలు అప్పు అడిగాడు. ఆమె తన తల్లితో ఈ విషయం చెప్పింది. దీనితో జమ్నా ఇలాంటి విషయాలు తన కూతురుతో మాట్లాడవద్దని హెచ్చరించింది. ఇది జరిగిన ఒకరోజు తరువాతే అతడు సాయుధులైన ఇద్దరు వ్యక్తులతో కలసి వచ్చి ఇంట్లోని డబ్బు, నగలు, వాటితో పాటు బాలికను ఎత్తుకుపోయాడు. డబ్బు, నగలు తీసుకుపొమ్మని, బాలికను మాత్రం వదలిపెట్టాలని ఎంత బతిమాలినా వారు వినలేదని జమ్నా చెప్పారు. తన కుమార్తె మతం మారిందంటూ, ఇష్ట ప్రకారమే ఒక ముస్లింను వివాహం చేసు కున్నదంటూ అఖ్తర్‌ ‌కోర్టుకు చూపించినవన్నీ నకిలీ పత్రాలేనని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల బాలిక సంతకంతో ఉన్న ఇలాంటి పత్రాలకు ప్రభుత్వాధికారులు ఎలా ఆమోదముద్ర వేస్తారని కూడా ఆయన నిలదీశారు. నిజానికి బాలికలను ఎత్తుకుపోయి, మతం మార్చి పెళ్లి చేసుకోవడం సింధ్‌ ‌ప్రాంతంలోని హిందూ కుటుంబాలకు అతి పెద్ద బెడదగా మారిపోయింది. ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకంగా మొన్న మార్చి మాసంలోనే పాకిస్తాన్‌ ‌దారావర్‌ ఇత్తేహాద్‌ అనే సంస్థ కరాచీ ప్రెస్‌క్లబ్‌ ‌నుంచి సింధ్‌ అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించవలసి వచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నిరసన ప్రదర్శనలో ఇలా బాలికలక• దూరమైన కుటుంబాలు పాల్గొన్నాయి. నిజానికి ఇలా ముస్లిం ఉన్మాదుల బారినపడిన బాలికలు తిరిగి సొంతింటికి చేరుకోవడం అనేది నూటికో కోటికో ఒక్కసారేనని దారావర్‌ ఇత్తేహాద్‌ అధ్యక్షుడు శివ కాచి చెప్పారు. తమ సంస్థ ఎంత ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం ఆ బాలికలను తిరిగి అప్పగించడానికి ఏ మాత్రం అంగీకరించరని ఆయన అన్నారు. గడచిన ఏడాది నుంచి చూసినా ఇలాంటి కేసులు డజన్ల కొద్దీ ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. వారంతా మైనర్‌ ‌బాలికలే. మొన్న మార్చి 19న ఘోట్కీ అనే చోట ఉన్న మీర్‌పూర్‌ ‌మథేలో నుంచి అపహరించిన షీలా మేఘ్వార్‌ ‌కావచ్చు, చాందా మహరాజ్‌, ‌సిమ్రాన్‌ ‌కుమారి, పూజా కుమారి, సత్రాన్‌ ఓద్‌, ‌కవితా భీల్‌, ‌విజయ్‌ ‌కుమారి, ఇప్పుడు సోహానా.. అంతా బాలికలే. గత ఏడాది జూన్‌లో కరీనా కుమారి అనే బాలిక తనను బలవంతంగా మతం మార్చి, ఒక ముస్లింకు ఇచ్చి పెళ్లిచేశారని కోర్టులో చెప్పింది. ఆ దుర్ఘటనకు ముందు, అంటే మార్చిలోనే సత్రాన్‌ ఓద్‌, ‌కవితా భీల్‌, అనితా భీల్‌ అనే ముగ్గురు బాలికలను అపహ రించుకుపోయి మతం మార్చారు. అపహ రించుకు పోయిన ఎనిమిది రోజులలోనే ముగ్గురు ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసినా, విజ్ఞాపనలు అందించినా కూడా ఆ ముగ్గురు బాలికల ఆచూకీ ఈనాటికీ తెలియలేదు.

2018లో 13 మంది హిందూ బాలికలను అపహరించారని, వారి కుటుంబీకుల అనుమతి లేకుండా వారికి పెళ్లిళ్లు చేశారని పాకిస్తాన్‌ ‌మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకటించింది. నిజాలకూ, ఈ లెక్కలకూ ఏమీ సంబంధం లేదని హిందువులు ఆక్రోశిస్తున్నారు. డాహర్కి ప్రాంత హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న అమీత్‌ ‌కుమార్‌ ఆవేదన గమనిస్తే పాకిస్తాన్‌ అనే రాక్షస రాజ్యంలో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది. ‘హిందూ కుటుంబంలో ఒక మహిళ ఒక ఆడశిశువుకు జన్మనిస్తే మేమంతా బెంబేలెత్తిపోతున్నాం’ అన్నారాయన. డాహర్కి హిందూ హక్కుల సంఘం ‘ముఖియా’ (అధినేత) అయిన అమీత్‌ ‌పాకిస్తాన్‌లో జీవితమంటే పీడకలలా ఉందని వాపోయారు. అపహరణలు, మతమార్పిడులు, బలవంతపు పెళ్లిళ్లకు భయపడి బాలికలను హిందూ కుటుంబాల వారు పాఠశాలలకు పంపడం కూడా మానేశారని ఆయన చెప్పారు. ఎక్కడో నడిరోడ్డు మీదే కాదు, పట్టపగలే కాదు, ఆఖరికి ఇండ్లలో చొరబడి కూడా ఆడపిల్లలను ఎత్తుకు పోతున్నారు. ఈ ప్రాంతంలో ఏ హిందువును పలకరించినా ఇలాంటి ఒక దీనగాథ వారి నోటి నుంచి వెలువడుతుందని అదే ప్రాంతానికి చెందిన దేవన్‌లాల్‌ అన్నారు. ఈయన మేనకోడలు సిమ్రాన్‌కు కూడా ముస్లిం దుండగులు అదే గతి పట్టించారు. పాఠశాల విద్యార్థిని సిమ్రాన్‌ ‌మే, 2019లో తన తల్లితో కలసి మోల్‌ ‌మాతా మందిర్‌కు వెళ్లింది. అక్కడ హఠాత్తుగా మాయమైపోయింది. దుండగులు బాలికలను అపహరించి లైంగిక అత్యాచారం జరుపుతారు. తరువాత కోర్టులో తాము చెప్పిన మాటలనే చెప్పమంటారు. ఇలాంటి కేసులు తాను డజన్ల కొద్దీ చూశానని ఆయన చెప్పారు. కానీ మతపెద్దలు, కోర్టులు, పోలీసులు అంతా హిందూ బాలికలే ఐచ్ఛికంగా వచ్చి మతం మారుతున్నారని చెబుతున్నారు. కేవలం హిందూ బాలికలే ఎందుకు మతం మారడానికి ఉవ్విళ్లూరు తున్నారు? ముస్లిం అబ్బాయిలతో ‘లేచిపోతున్నారు’. ఏ ముస్లిం బాలిక హిందూ యువకుడితో ఎందుకు రావడం లేదని దేవన్‌లాల్‌ ‌ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం వెతకడానికి బుర్రలు బద్దలు కొట్టుకోనక్కరలేదు. పాకిస్తాన్‌లో హిందువులను తుడిచిపెట్టడమే దీని వెనుక ఉన్న కుట్ర. అది హత్యల ద్వారా కావచ్చు, లైంగిక అత్యాచారాలతో కావచ్చు, సామాజికంగా కుంగదీయడం ద్వారా కావచ్చు. ఇదంతా జిహాద్‌లో భాగం. లైంగిక అత్యాచారం జిహాద్‌లో అంతర్భాగమే.

ఈ సంవత్సరం జనవరి 23న టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా వెలువరించిన మరొక వార్త చూద్దాం. ఈ వార్త ద్వారా తెలిసేదేమిటంటే, కన్యలకే కాదు, వివాహితలకు కూడా అక్కడ రక్షణ లేదు. ఇదే సింధ్‌ ‌ప్రాంతం నుంచి ఒక వివాహితను కొందరు అపహ రించుకుపోయారు. మతం మారాలని ఆదేశించారు. అందుకు ఆమె నిరాకరించింది. దీనితో అత్యా చారానికి పాల్పడ్డారు. ఈ దురాగతమంతా ఉమర్‌కోట్‌లోని సామారోలో జరిగిందని ఆమె ఒక వీడియోలో వెల్లడించింది. తన మీద ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో అనే ఇద్దరు, వారి సన్నిహితులు ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా చెప్పిందామె. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు కలసి మీర్‌పుర్కాస్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట బైఠాయించినా కూడా ఫలితం దక్కలేదు. హిందూ బాలికలను ఎంచుకుని మరీ ఎత్తుకు వెళ్లడం, మతం మార్చి పెళ్లి చేసుకోవడం సింధ్‌ ‌ప్రాంతంలో సర్వసాధారణ దృశ్యంగా మారి పోయింది. అక్కడి థార్‌, ఉమర్‌కోట్‌, ‌మీర్‌పుర్కాస్‌, ‌చోట్కీ, ఖైరాపూర్‌లలో హిందూ జనాభా ఎక్కువగా ఉంది. 207 మిలియన్‌ ‌జనాభాలో హిందువులు 2.1 శాతం కాగా, క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు. మొత్తం జనాభాలో హిందువులు 75 లక్షలు. అంతర్జాతీయ మీడియా సంస్థ అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌ ఇచ్చిన వివరాల ప్రకారం ఏటా పాకిస్తాన్‌లో వేయి మంది బాలికలను మతం మార్చి పెళ్లిళ్లు చేసు కుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సింధ్‌ ‌ప్రాంతంలోని పేద హిందూ కుటుంబాల బాలికలే. కరీనా కుమారి గాథ ఇందుకు మరొక ఉదాహరణ. ఈమెను జూన్‌ 6, 2022‌న దక్షిణ సింధ్‌ ‌ప్రాంతంలో అపహరించారు. ఆమె తండ్రి సుందర్‌ ‌మల్‌ ‌చేసిన విన్నపాలకు కరిగి మొత్తానికి ఆమెను నవాబ్‌షా కోర్టులో ప్రవేశపెట్టారు. తనను బలవంతంగా మతం మార్చి ఖలీల్‌ అనే వాడికి ఇచ్చి పెళ్లి చేశారని ఆమె న్యాయమూర్తికి చెప్పింది. అయినా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించకుండా మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అమ్మనాన్నల దగ్గరకే తనను పంపించాలని ఆ బాలిక కోరినా ఆ న్యాయమూర్తి వినలేదు. ‘మేమంతా పేదలం. కోర్టు దాకా రావడానికి బస్సు ఖర్చులు చూసుకోవడం కూడా కష్టమే. ఇవాళ కోర్టులో మా అమ్మాయి సత్యమే చెప్పింది. కోర్టు ఆమెను విడిపించి, దోషులను కఠినంగా శిక్షించాలి’ అని సుందర్‌ ‌మల్‌ ‌కోరాడు. ఈ కేసు వాదించిన దిలీప్‌కుమార్‌ ‌మంగ్లానీ కూడా వీరి దుస్థితి గురించి తెలియచేశారు. ఈ కేసులలో పోలీసులు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు.

పూజా కుమారి గాథ మరింత దయనీయమైనది. రోహ్రీ అనే ప్రాంతానికి చెందిన ఈ బాలికను ఒక ముస్లిం మతోన్మాదుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఇదే ఆమె చేసిన పాపం. కొద్దిరోజుల తరువాత తన సహచరులతో వచ్చి ఆమెను వారి ఇంటి ముందే కాల్చి చంపాడు. శాంతా మేఘ్వార్‌ అనే వివాహిత హిందూ మహిళను నలుగురు దుండగులు అపహ రించారు. ఈమె తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేయలేదు. కారణం ఒక్కటే- వాళ్లు అడిగిన రూ. 5,000 ఆమె ఇవ్వలేదు. నాటి సింధ్‌ ‌ముఖ్యమంత్రికి కూడా ఆ తల్లి మొరపెట్టు కుంది.

పాకిస్తాన్‌లో ఇలాంటి వాళ్ల పశుప్రవృత్తికి అంతేలేనట్టు కనిపిస్తుంది. అక్టోబర్‌ 28, 2022‌న ది హిందూ ప్రచురించిన వార్త ఇదే చెబుతుంది. కేవలం పదేళ్ల బాలికను అపహరించి మతం మార్చారు. ఎనభయ్‌ ఏళ్లున్న ముస్లింతో పెళ్లి చేశారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ‌మీడియా కూడా అక్టోబర్‌ 22‌న వెలువరించింది. ఇది కూడా సింధ్‌ ‌ప్రాంతంలోనే షేక్‌ ‌భిర్ఖియో అనే చోట జరిగింది. దుండగులు ఎత్తుకుపోయిన ఆ పదేళ్ల బాలిక పేరు మీనా బజాని. ఎత్తుకెళ్లిన వాళ్లు జమీందార్‌ ‌ములావ్ల రషీద్‌, అతని మనుషులు. ఇతడే ఎనభయ్‌ ఏళ్ల వృద్ధుడు. ఇతడి భార్య ఎప్పుడో మరణించింది. ఇలాంటి కేసులన్నింటిలోను పోలీసులు నిందితుల వైపే నిస్సిగ్గుగా నిలబడడం కనిపిస్తుంది. ఉదా హరణకు, తన భార్యను అపహరించుకు పోయారని నస్రపూర్‌లో రవికుర్మీ అనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన కుర్మీ భార్య ఆచూకీని పోలీసులు తరువాత కనుగొన్నారు. అయితే ఆమె ఇష్టానుసారం ఇస్లాం స్వీకరించిందని, ఇష్టానుసారమే ఒక ముస్లింను పెళ్లి చేసుకున్నదని పోలీసులు రవికుర్మీకి చెప్పారు (మీనా మేఘ్వార్‌ను కూడా నస్రపూర్‌లోనే అపహరించారు). ఇక నలుగురు బిడ్డల తల్లి గొరి కోహ్లీ. ఈమెను ఖిప్రో అనే చోట అపహరించారు. తరువాత ఆమె ఐజాజ్‌ ‌మర్రి అనే ముస్లింను పెళ్లి చేసుకుందని చెప్పారు. ఇంతకీ ఆమెను అపహరించినది అతడే. ఐజాజ్‌ ఆ ‌ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న మనిషి. దీనితో గొరి కోహ్లీ భర్త విన్నపాలను ఎవరూ ఆలకించలేదు. ఆమెను రక్షిస్తామంటూ పోలీసులు తన వద్ద రూ. 15 వేలు లంచంగా తీసుకున్నారని, చివరికి ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుందని చెప్పారని అతడు వాపోయాడు.

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా హిందువులకు న్యాయం చేయాలన్న దృఢ సంకల్పమేదీ అక్కడి ప్రభుత్వంలో, ప్రజాప్రతినిధులలో కానరాదు. 2021 అక్టోబర్‌లో పాకిస్తాన్‌ ‌పార్లమెంటరీ సంఘం తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌ను ఈ సంఘం తిరస్కరించిందని మత వ్యవహారాల మంత్రి నూరుల్‌ ‌హక్‌ ‌ఖాద్రి ప్రకటించారు. అలాంటి చట్టం తేవడానికి దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవంటాడా మంత్రి. అంతేనా, అలాంటి చట్టమే తీసుకువస్తే దేశంలో శాంతియుత వాతావరణం భగ్నమవు తుందని కూడా చెప్పాడు. నిజానికి అలాంటి చట్టం మైనారిటీలకు మేలు చేయకపోగా, వారి మీద ఇంకా దాడులు జరుగుతాయని కూడా కొత్త భాష్యం వెలగబెట్టాడు. ఇవన్నీ పాకిస్తాన్‌ ‌ప్రఖ్యాత వార్తాపత్రిక ‘డాన్‌’ ‌వెల్లడించిన అంశాలే. జూలై 16, 2019న హిందూ బాలికల అపహరణ అంశాన్ని సింధ్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా చర్చించింది. బలవంతపు మతమార్పిడుల నుంచి రక్షణను హిందూ బాలికలకే పరిమితం చేయకుండా అందరికీ వర్తింపచేయాలన్న షరతుతో బిల్లును ఆమోదించారు. కానీ తరువాత అదే అసెంబ్లీ ఈ బిల్లును తిరస్కరించింది. ఇలాంటి బిల్లు తేవడానికి జరిగిన తతంగం నిజంగా ప్రహసనమే. 2016లో సింధ్‌ ‌ప్రాంతీయ అసెంబ్లీ బలవంతపు మతాంతరీకరణలను నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. కానీ ఆ బిల్లు మీద సంతకం చేయవద్దంటూ ముస్లిం మతపెద్దల నుంచి గవర్నర్‌కు తాఖీదులు అందాయి. దీనితో ఆ బిల్లు చట్టం కాలేదు. తరువాత 2020లో పాకిస్తాన్‌ ‌సెనేట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సెనేట్‌ ‌స్థాయీ సంఘం ఈ బిల్లునే తిరస్కరించింది. ఇందుకు నిరసనగా కృష్ణకుమారి కోహ్లీ అనే హిందూ పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ సభ్యుడు సభ నుంచి వాకౌట్‌ ‌చేశారు. ఇంతకీ భారతదేశంలోని ఏ ముస్లిం బాలికకైనా ఇంతటి అవమానం జరిగిందా? జరగకూడదనే మనం కోరుకుందాం. కానీ పాకిస్తాన్‌ అనే దేశంలో హిందూ బాలికల పట్ల జరుగుతున్న అమానుషాల గురించి కనీసం గొంతెత్తవద్దా?

పోలీసులు సహకరించిన కేసులలో మాత్రం అపహరణకు గురైన బాలికలు తల్లిదండ్రుల వద్దకు చేరగలిగారు. అయితే చాలా పరిమితం. అందులో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కేసు రీనా మేఘ్వార్‌ అపహరణోదంతం, తిరిగి సొంతింటికి చేరడం. ఆమెను 2022 జూలైలో అపహరించారు. అయితే పోలీస్‌ అధికారి బదీన్‌ ‌షబ్బీర్‌ అహ్మద్‌ ‌సెథార్‌ ‌కలగ చేసుకోవడంతో ఆమె బయటపడింది. పలుకుబడి కలిగిన వ్యక్తులు, కింది స్థాయి పోలీసు ఉద్యోగులలో అవినీతి, స్థానిక రాజకీయాలు హిందూ బాలికలను ఇలాంటి స్థితిలోకి నెట్టేశాయని అన్నారాయన. రీనాను అపహరించి, మతం మార్చినప్పటికీ న్యాయమూర్తి ఆమెను తల్లి దండ్రులకు అప్పగించవలసిందని తీర్పు చెప్పారు.

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి తెలిసినదే. అయినా వారు తమ బాలికల రక్షణ కోసం పడుతున్న పాట్లు, ప్రయత్నాలు చెప్పుకోదగినవి. ఈ సంవత్సరం మార్చిలో సింధ్‌, ‌పంజాబ్‌ ‌ప్రాంతాలకు చెందిన పలు జిల్లాల నుంచి 100 మంది సామాజిక కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీని వెనుక కరాచీ కేంద్రంగా పనిచేసే ఔరత్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఈ సందర్భంగా హిందువుల మీద జరుగుతున్న దాడులు, వాటి పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి గురించి పలువురు బాహాటంగానే ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. ఎత్తుకుపోతున్నది మైనర్‌ ‌బాలికలనే. కానీ పోలీసులు, న్యాయ వ్యవస్థలోని ఉద్యోగులు, వారు బాలికలు కాదనీ, మేజర్లేననీ, వారు తమ ఇష్టం మేరకు వివాహం చేసుకునే హక్కు ఉన్నవారేనని వాదిస్తున్నారు. ఒక దశాబ్దం నుంచి సింధ్‌ ‌ప్రాంత హిందూ కుటుంబాలు ఈ బెడదతోనే బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నాయన్నది నిజం.

ఈ సమస్య 2019 నుంచి భారత్‌ ‌దృష్టిలో ఉన్నది. ఆ సంవత్సరం ఫిబ్రవరి ప్రాంతంలో జరిగిన ఇద్దరు హిందూ బాలికల అపహరణ తరువాత, నాటి విదేశ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్‌ ‌మొత్తం వివరాలు పంపవలసిందని పాకిస్తాన్‌లోని ఇండియన్‌ ‌హైకమిషన్‌ను ఆదేశించారు. ఆ బాలికలను కూడా అపహరించి, మతం మార్చారని, వివాహాలు చేశారని వార్తలు వచ్చాయి. ఆ ఇద్దరు బాలికలు కూడా సింధ్‌ ‌ప్రాంతీయులే. ఆ బాలికలను (15, 13 ఏళ్లవాళ్లు) హిందువులకు పవిత్రమైన హోలీ రోజున అపహ రించారు. భారత్‌లో పాకిస్తాన్‌ ‌రాయబారిని పిలిచి ఆ దేశంలో అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న ఆపహరణలు, మతాంతరీకరణల పట్ల భారత్‌ ‌నిరసన తెలియచేసింది. ఇదంతా పాక్‌ అం‌తర్గత విషయమని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫావద్‌ ‌చౌదురి ట్వీట్‌ ‌చేశారు. నేను అక్కడ జరిగిన• ఇద్దరు బాలికల అపహరణ గురించి మా రాయబార కార్యాలయాన్ని అడిగాను. కానీ మీ స్పందనను బట్టి మీ ఆత్మ న్యూనతా భావం బాగానే బయటపెట్టుకున్నారని సుష్మ తిరిగి ఘాటుగా జవాబిచ్చారు.

‘‘గడచిన 200 సంవత్సరాలలో ఒక్క హిందు వును కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చలేదు.’’ ఇది మియాన్‌ ‌మిథు సగర్వంగా ఇచ్చిన ప్రకటన. అంతేకాదు, హిందువులుగాని, ఇతర విశ్వాసాలు ఉన్నవారు గాని, వారు ఎవరైనా పురుషులు, స్త్రీలు, బాలబాలికలు తమకి తామే మా దగ్గరకి వచ్చి తమ ఇష్టానుసారం మతం మార్చు కున్నారు అని కూడా మియాన్‌ ‌చెప్పాడు. మియాన్‌ ‌భర్చుండి షరీఫ్‌లో ‘పీర్‌’ ‌పదవిలో ఉన్నవాడు. అంటే ఇస్లాం మతగురువు. అసలు పేరు మియాన్‌ అబ్దుల్‌ ‌హక్‌. ‌క్లుప్తంగా అంతా మియాన్‌ ‌మిథు అంటారు. ఇతడు గతంలో పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ సభ్యుడు. పాకిస్తాన్‌ ‌నేషనల్‌ అసెంబ్లీలో సభ్యుడిగా కూడా కొంతకాలం ఉన్నాడు. నిజానికి ఇతడి మీద మతమార్పిడులకు సంబంధించి ఎన్నో ఆరోపణలు, కేసులు ఉన్నాయి. దానితో పాటు పలుకుబడి కూడా ఎక్కువే.

2015లో ఇమ్రాన్‌ఖాన్‌ ఇతడిని తన పార్టీ పాకిస్తాన్‌ ‌తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌లో చేరమని కోరాడంటేనే ఇతడి ప్రభావం ఎంతటిదో అంచనా వేయవచ్చు. అయితే మియాన్‌ను పార్టీలోకి పిలిచినందుకు హిందువులలో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. దీనితో తరువాత మియాన్‌ను ఇమ్రాన్‌ ‌కూడా దూరంగా ఉంచాడు. చిత్రంగా పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ కూడా మియాన్‌కు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించింది. కారణం, ఒక మతమార్పిడి కేసు 2012లో బయటపడడమే. రింకిల్‌ ‌కుమారి అనే హిందూ బాలికను ఇతడు బలవంతంగా మతం మార్చాడు. అది మతమార్పిడే గానీ, బలవంతపు మార్పిడి కాదని మియాన్‌ ‌వాదించడం మొదలు పెట్టాడు. రింకిల్‌ ‌కుమారి ఏమైందో, ఎలా ఉన్నదో కూడా తరువాత ప్రజల దృష్టికి ఇతడే తీసుకువచ్చాడు కూడా. ఫర్యాల్‌ ‌బీబీ (మతం మార్చిన తరువాత రింకిల్‌కి పెట్టిన పేరు) ఖురాన్‌ అధ్యయనం పూర్తి చేసిందని, ఉమ్రా కార్యక్రమం పూర్తయిన తరువాత పాకిస్తాన్‌కు కూడా చేరుకుందని, మదర్సాలలో ఖురాన్‌ ‌బోధిస్తున్నదని మియాన్‌ ‌చెప్పాడు. కొత్తగా మతం మారిన వారికి, ప్రేమ వివాహం కోసం ఇస్లాంలోకి వచ్చిన వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జిహాద్‌ను ఇతడు బాహాటంగానే సమర్ధించాడు. 2019 సెప్టెంబర్‌లో ఇతడు హఠాత్తుగా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కాడు. ఒక పాఠశాలకు చెందిన హిందూ ప్రిన్సిపాల్‌ ‌మత దూషణకు పాల్పడ్డాడంటూ ఘోట్కి జిల్లాలో మియాన్‌ అల్లకల్లోలం సృష్టించాడు. ఆయన దైవదూషణకు పాల్పడినందుకు నిరసనగా ప్రజలే రోడ్లు ఎక్కారని, నిజానికి తన కుమారుడు, బంధువులు అల్లర్లను నిరోధించే ప్రయత్నం చేశారని విలేకరుల ముందు వాదించాడు. అలాగే సాచో సత్రామ్‌దాస్‌ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు వచ్చిన ఆరోపణలను కూడా అతడు నిరాకరించాడు. ఆ సందర్భంగానే ఇతడు అన్నమాట- ‘గడచిన 200 ఏళ్లుగా ఏ ఒక్కరు బలవంతంగా ఇస్లాంలోకి రాలేదు. ఇష్టానుసారమే వచ్చారు’. ఇది ఒక మతం గురించి ప్రబోధించే మతగురువు చెప్పే మాటేనా? అది దైవ వచనాలు పలికే నోరేనా? లేకుంటే మరేదేనైనా? అతడూ, అతడి మతం కూడా అవే చెబుతున్నాయి కాబట్టి మరీ విస్తుపోనక్కరలేదు. కానీ మానవ హక్కులు అంటూ నిరంతరం కూతలు కూసే, గుండెలు బాదేసుకునే భారతీయ మేధావుల బుద్ధి ఏ బురదలో పొర్లుతోంది? వీళ్లకి హిందూ బాలికల ఆత్మగౌరవం గురించి పట్టదా? కేవలం మైనారిటీ బాలికల ఆత్మగౌరవాలే ముఖ్యమా? భారతదేశంలో మైనారిటీల యోగక్షేమాల గురించి నిరంతరం కుమిలిపోయే అమెరికా బేవార్స్ ‌సంఘాలకు ఇదంతా కనపడదేం? వినపడదేం? కళ్లూ చెవులూ కుళ్లి పోయాయా? ఇక ఐక్యరాజ్యసమితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అదొక నపుంసక అంతర్జాతీయ సంస్థ కదా! కశ్మీర్‌లో హిందువులపైన జరిగిన అత్యాచారాలనూ పట్టించుకోలేదు. పాకిస్తాన్‌ ‌హిందువులూ దానికి పట్టరు. సోహాన్‌, ‌రాధ, రవీనా, రీనా, షీలా మేఘ్వార్‌, ‌చాందా మహరాజ్‌, ‌సిమ్రాన్‌ ‌కుమారి, పూజాకుమారి, సత్రాన్‌ ఓద్‌, ‌కవితా భీల్‌, ‌విజయ్‌ ‌కుమారి, రింకిల్‌.. ‌లెక్కకు అందనంత మంది ఆ పేదింటి బాలికలకు, పాకిస్తాన్‌లో బతుకుతున్న ఆ పేద కుటుంబాలకు ఎవరు దిక్కు? ఎక్కడ రక్షణ? ఆ బాలికల ఆత్మగౌరవానికి ఎవరు హామీ?

××××××××

నిలువెత్తు దగా…

రవీనా మేఘ్వాల్‌ అనే బాలికది సోహన్‌ ‌గాథకు దగ్గర పోలిక ఉన్న ఉదంతం. అయితే ఇందులో దగా, మోసం ఊహకు కూడా అందవు. రవీనా దక్షిణ సింధ్‌ ‌ప్రాంతానికి చెందిన మైనర్‌ ‌బాలిక. ఈమెను సంజార్‌ ‌చాంగ్‌ ‌ప్రాంతం నుంచి అపహరించి కరాచీకి తరలించారు. హిందువుల హక్కుల కోసం పోరాడే పాకిస్తాన్‌ ‌ధారావర్‌ ఇతేహాద్‌ ‌సాయంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు దర్యాప్తు జరిపి ఆ బాలికను సురక్షితంగా మీర్‌పుర్కాస్‌కు తీసుకువచ్చారు. ఆమెను అపహరించినది ఒక కుటుంబం. రవీనా తన ఇష్టం మేరకే ఇంటి నుంచి వచ్చి, మతం మారి ముస్లింను పెళ్లి చేసుకున్నదని ఆ కుటుంబం యథా ప్రకారం పాత కథనాన్నే వినిపించింది. జూన్‌ 10‌న రవీనాను, ఆమెను అపహరించిన వ్యక్తి జామో ఖాన్‌ను తాండో అల్లాహ్యార్‌ ‌కోర్టులో ప్రవేశపెట్టారు. జామో ఖాన్‌, అతడి న్యాయవాది రవీనాకీ, జామో ఖాన్‌కీ పెళ్లి జరిగినట్టు చెప్పే పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ న్యాయమూర్తి సాబా ఒమర్‌ ‌కాస్త మానవత్వం ఉన్నవాడు కాబోలు. జామోఖాన్‌ ‌జాతీయ గుర్తింపు కార్డు చూపించమని అడిగాడు. దీనితో అతి పెద్ద మోసం బయటపడింది. అతడు అసలు పాకిస్తాన్‌ ‌పౌరుడు కూడా కాదు. అతడి వద్ద ఉన్నది కేవలం అఫ్ఘానిస్తాన్‌ ‌జాతీయ గుర్తింపు కార్డు. వెంటనే ఆ బాలికను సంక్షేమ గృహానికి పంపించ వలసిందని ఆదేశించాడు. ఆమె వాంగ్మూలాన్ని తరువాత నమోదు చేస్తామని చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడడానికి రవీనాకు అనుమతి కూడా ఇచ్చాడు. తనను బలవంతంగా అపహరించి మతం మార్చారని ఆమె కోర్టులోనే మీడియా ముందు విలపించింది. కరాచీలోని ఒక ఇంటిలో ఎవరో నిఖా జరిపారని తెలియచేసింది. ఇటీవలి కాలంలో, కేవలం కొన్ని నెలల కాలంలోనే ఇలాంటి వివాదాలు కోర్టులలో వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయవలసిందిగా బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

××××××

ఎదురు తిరిగిన రాధ

ఉమర్‌కోట్‌కు చెందిన రాధ అనే 18 బాలిక కథ ఇది. ఆమె తనను అపహరించిన వారి మాట విన్నట్టే నటించి, కోర్టులో ఎదురు తిరిగింది. దానితో బయటపడింది. అంతేకాకుండా జరిగినదానికి దుఃఖిస్తూ కూర్చోకుండా సాధారణ జీవితం ఆరంభించింది. ఆమెను ఒకసారి మీడియా వెంటపడి మరీ వివరాలు అడిగింది. తన పదహారేళ్ల వయసులో ఓ సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఉండగా అలీ నవాజ్‌ అనేవాడు అపహరించాడు. ఒక ఇంటిలోకి తీసుకుపోయి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె అపహరణకు గురైందంటూ రాధ తండ్రి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. రాధను షర్హండి దగ్గరి గ్రామంలో బంధించినట్టు ఆయనకు తెలిసింది. ఇది మీర్‌పుర్కాస్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరధిలో ఉంది. ఆ బాలికను వెంటనే హాజరు పరచవలసిందిగా కోర్టు ఆదేశించింది. నవాజ్‌, అతడి దుర్మార్గపు మిత్రులు రాధను బెదిరించారు. తను ఇష్టం మేరకు మతం మారాననీ, నవాజ్‌ను పెళ్లి చేసుకున్నాననీ చెప్పమన్నారు. అలా చెప్పకపోతే రాధ తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. తీరా కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత రాధ వాస్తవాలు చెప్పేసింది. తనను అపహరించి, మూడు నెలల పాటు లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డారని ఆమె వెల్లడించింది. ఇకపై నీవు ఎవరితో ఉంటావని రాధను న్యాయమూర్తి ప్రశ్నించారు. అమ్మా నాన్నలతోనే ఉంటానని ఆమె చెప్పింది. అందుకు న్యాయమూర్తి అనుమతించారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram