జూన్‌ 29 ‌తొలి ఏకాదశి

శ్రీమహావిష్ణువు దివ్యదేహం నుంచి వెలువడిన సత్త్వరూప సమున్నత శక్తి ఏకాదశి. ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు కాగా అధిక మాసంలో ఆ సంఖ్య 26కు పెరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ/తొలి ఏకాదశి, మహాఏకాదశి, దివ్య ఏకాదశి అంటారు. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పుపై ఆ రోజే యోగనిద్రకు ఉపక్రమిస్తాడని విష్ణు పురాణం పేర్కొంటోంది. అందుకే  ఈ తిథిని హరివాసరం, శయనైకాదశి, సర్వేశామేకాదశి’ అని వ్యవహరిస్తారు. శ్రీహరి యోగనిద్రలోనే అంతర్వీక్షణతో జగత్‌ ‌రక్షణకోసం చింతిస్తూ స్థితికారకత్వాన్ని కొనసాగిస్తాడు. ఈ ధ్యాన పరంపర నాలుగు నెలల పాటు అంటే కార్తిక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష ఆచరిస్తారు.

విష్ణువు తన నుంచి వ్యక్తమైన యోగమాయతో మురుడు అసురునితో యుద్ధం చేస్తూ సింహవతి అనే గుహలో అలసటతో విశ్రమిస్తాడు. అది తెలిసిన అసురుడు మాయోపాయంతో శ్రీహరి మీదికి దండెత్తగా, ఆయన శరీరం నుంచి శక్తిరూపంలో ఉద్భవించిన యోగమాయ మురాసురుడిని సంహ రిస్తుంది. దేవదేవుడు ఆ యోగమాయనే ‘ఏకాదశి’ తిథిగా అనుగ్రహించి, అది  త•నకు ఇష్టమైన ఏకాదశిగా తిథిగా పూజలందుకుంటుందని వరమిచ్చాడని పురాణగాథ.

ఆ రోజంతా ఉపవాసం ఉండి, విష్ణు నామ స్మరణతో రాత్రి జాగరణ చేస్తారు. సత్వగుణ ప్రధాను డైన పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరేవారు సాత్త్వికాహార స్వీకరణతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. కడుపునిండా భోనానికి బదులు సాత్వికాహారం తీసుకుని కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతారు. దీనినే ‘ఏకాదశీ ఏకభుక్త వ్రతం’ అంటారు. ఇతర వ్రతాలను కామ్యార్థసిద్ధికి ఆచరిస్తే ఈ వ్రత పరమార్థం మోక్షం. అందుకే దీనికి ‘మోక్షవ్రతం’ అని పేరు. అనాదిగా సాధువులు, భక్త జనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహా పతివ్రత సతీ సక్కుబాయి ఈ ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఖగోళపరంగా చూస్తే సూర్యగమనంలో వచ్చే ప్రధాన మార్పులకు సంకేతాలు ఉత్తర దక్షిణాయ నాలు. ‘ఆయనం’ అంటే ప్రయాణం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణించడమని అర్థం. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించడం ఉత్తరాయనం కాగా, ఆగ్నేయానికి దగ్గరగా ఉద యించడం దక్షిణాయనం. ఈ కాలంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడని ఖగోళ శాస్త్రం చెబుతోంది. తొలి ఏకాదశినాడు దక్షిణా యనం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. .

చాతుర్మాస్యదీక్ష

శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష పాటిస్తారు. పూర్వకాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్షను చేపట్టేవారట. ఇప్పటికీ కొందరు పాటి స్తున్నా, మఠాధిపతులు, యతులు విధిగా ఆచరిస్తారు. దీక్షాపరులు నాలుగు నెలలపాటు (కార్తిక శుద్ధ ఏకాదశి వరకు) ఆహార నియమాలను కఠిన నిష్ఠతో పాటిస్తారు. ప్రయాణాలు చేయరు. సన్యాసి ఏ గ్రామంలోనూ ఒక్క రాత్రికి మించి బస చేయరాదని నియమం కాగా, ఈ నాలుగు నెలలు దానికి మినహా యింపు ఉంటుంది.

దీక్ష స్వీకరణకు అవాంతరాలు ఏర్పడితే పూర్ణిమ నాడు మొదలు పెట్టవచ్చని పెద్దలు చెబుతారు (ప్రస్తుతం అత్యధికులు గురుపూర్ణిమ నాడే ప్రారం భిస్తున్నారు). దీక్ష ప్రారంభం ఎప్పుడైనా కార్తిక శుద్ధ ద్వాదశి నాడే ముగుస్తుంది.

గోపద్మ వ్రతం

గోపద్మ వ్రతాన్ని కూడా తొలి ఏకాదశి నాడే ఆరంభిస్తారు. కార్తిక శుక్ల ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు కొనసాగించాలని పురాణాలు చెబుతున్నాయి. పల్లెవాసులు,పశు సంపద గలవారు పశువుల పాకలో ఈ వ్రతాన్ని చేస్తారు. ఆ అవకాశం లేనివారు పూజాగదిలో నిర్వహిస్తారు. ఆయా ప్రదేశాలను శుభ్రపరచి బియ్యం పిండితో పద్మాల రంగవల్లిదిద్ది, పీఠంపై శ్రీమహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని విగ్రహం ఉంచి అర్చిస్తారు.

రైతులకూ పండుగ

ఏరువాకలానే ‘తొలి ఏకాదశి’ రైతుల పండుగ. పైరుకు చీడపీడలు సోకకూడదని,అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సేద్యం సాగాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు. మొక్కజొన్న, జొన్న పేలాలను పొడి చేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజున కొద్దిసేపైన తప్పని సరిగా పొలం పని చేయాలన్నది ఒక నమ్మకం. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి లావాదేవీలు నిర్వహిస్తారు. ‘జీతగాళ్ల’ను కుదుర్చు కోవడం, ఉన్న వారిని కొనసాగించేలా ఒప్పందం చేసుకోవడం పల్లెసీమల్లో ఒకనాటి ముచ్చట. పితృదేవతలకు పేలాల పిండి ఇష్టమని చెబుతారు. వారికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు. శాస్త్రీయ కోణంగా చూస్తే, వర్షరుతువు ఆరంభంలో ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవు తుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది.‘స్వామి కార్యం… స్వకార్యం’ అన్నట్లు ఈ తిథినాడు దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE