దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం నడుస్తోంది. దాదాపు నెలరోజుల పాటు ఓట్ల జాతర కొనసాగుతోంది. ఏడు దశలుగా సాగుతోన్న ఈ సమరంలో నాలుగో దశ యుద్ధానికి తెరపడింది. మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి. దేశ పాలనా పగ్గాలు ఎవరికి దక్కుతాయో నిర్ణయించే ఈ మెగా ఓట్ల జాతరపై ఒక్క మనదేశంలోనే కాదు….ప్రపంచ దేశాలు కూడా ఓ కన్నేసి చూస్తున్నాయి. స్వతంత్ర భారతావనిలో ఈ స్థాయిలో ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికలు ఇవే. గతంలో ఎన్నడూ, ఏనాడూ ఈ స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ భారతావనిలో జరుగుతున్న ఎన్నికల గురించి చర్చించలేదు. మరి.. ఇలాంటి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ‌ఘట్టం ముగిసింది. నాలుగో విడతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో పూర్తి ప్రశాంతంగా పోలింగ్‌ ‌ముగిసింది. కానీ.. ఆంధప్రదేశ్‌లో పార్లమెంటుతో పాటు.. అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడంతో సహజంగానే ప్రాధాన్యత పెరిగింది. పోటీ తత్వం ఎక్కువ కనిపించింది. చెదురుమదురు ఘటనలకు తోడు.. హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పులకూ దారి తీశాయి. పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి.

ఇటు.. తెలంగాణలో చూస్తే.. లోక్‌సభ స్థానాలకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ‌జరిగింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీకి మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోలింగ్‌ ‌తంతు కొనసాగింది. ఎన్నికల ప్రచారం మొదటినుంచీ హాట్‌ ‌హాట్‌గా కొనసాగింది. భారతీయ జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలుకొని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా, ముఖ్యనేతలు యోగీ ఆదిత్యనాథ్‌, ‌జేపీ నడ్డా సహా కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయస్థాయి నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. విడతల వారీగా.. ప్రచార పర్వంలో భాగస్వాములయ్యారు. అటు.. కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు.. పలువురు జాతీయస్థాయి నేతలు ప్రచారం చేశారు.

ఇక, మొన్నటిదాకా తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మాత్రం చతికిల పడింది. కనీస పోటీలో కూడా లేకుండా పోయిందన్న విశ్లేషణలు సాగాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేశాయి.

మరోవైపు.. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ ‌శాతం ఆశాజనకమైన నమోదయ్యింది. కొద్దిరోజులుగా ఠారెత్తించిన ఎండలు.. పోలింగ్‌ ‌జరిగిన మే 13వ తేదీకి శాంతించాయి. మధ్యాహ్నం సమయంలో కూడా పెద్దగా ఎండ తాకిడి కనిపించకపోవడంతో.. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్‌శాతం పెరిగింది. వాతావరణం అనుకూ లించిన ఫలితంగా గత యేడాది కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్‌ ‌నమోదయ్యింది. సాయంత్రం ఆరు గంటలకే పోలింగ్‌ ‌సమయం ముగిసిపోగా.. అప్పటివరకూ క్యూలైన్లలో ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించడంతో.. రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా కొన్ని పోలింగ్‌ ‌కేంద్రాల్లో ఓటింగ్‌ ‌కొనసాగిన దృశ్యాలు కనిపించాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్‌ ‌నమోదైంది.

ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతంగా ఉన్న పోలింగ్‌ ‌క్రమక్రమంగా అంతకంతకూ పెరిగింది. 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతంగా, సాయంత్రం 5 గంటలకు 61.16 శాతానికి పెరిగింది. రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే తుది రిపోర్టు వచ్చేనాటికి పోలింగ్‌ ‌శాతం మరింత పెరగవచ్చునని చెప్పారు. 10 స్థానాల్లో పోలింగ్‌ ‌శాతం 70 దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జంటనగరాలు హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌మల్కాజ్‌గిరి, చేవెళ్ల మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా 60 నుంచి 70 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా చూస్తే… ఆదిలాబాద్‌- 72.96, ‌పెద్దపల్లి- 67.88, కరీంనగర్‌- 72.33, ‌నిజామాబాద్‌- 71.50, ‌జహీరాబాద్‌- 74.54, ‌మెదక్‌- 74.38, ‌మల్కాజ్‌గిరి- 50.12, సికింద్రాబాద్‌- 48.11, ‌హైదరాబాద్‌- 46.08, ‌చేవెళ్ల- 55.45, మహబూబ్‌నగర్‌- 71.54, ‌నాగర్‌కర్నూల్‌- 68.86, ‌నల్గొండ- 73.78, భువనగిరి- 76.47, వరంగల్‌- 68.29, ‌మహబూబాబాద్‌-70.68, ‌ఖమ్మం- 75.19 శాతం పోలింగ్‌ ‌రికార్డయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్‌ ‌నమోదు అయింది.

ఇక జిల్లాల వారీగా చూస్తే భువనగిరిలో అత్యధికంగా 76.47 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. అత్యల్పంగా ఎప్పటిలాగే హైదరాబాద్‌లో తక్కువ ఓటింగ్‌ ‌నమోదైంది. మెట్రో నగరంలో 46.08 శాతం పోలింగ్‌ ‌నమోదైంది.

ఇక రెండు స్థానాల్లో మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్‌ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్‌ ‌శాతం నమోదైంది. కాంగ్రెస్‌ ‌బలంగా ఉన్న.. ఆ పార్టీ కంచుకోటలుగా భావించే నల్గొండ, ఖమ్మం పార్లమెంట్‌ ‌స్థానాల్లో గత ఎన్నికల కంటే తక్కువ ఓటింగ్‌ ‌శాతం నమోదైంది. నల్గొండ పార్లమెంట్‌ ‌స్థానంలో 2019లో 74.15 శాతం పోలింగ్‌ ‌నమోదు కాగా.. ఈసారి మాత్రం 73.78 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. ఇక ఖమ్మం స్థానంలో 2019లో 75.30 శాతం నమోదు కాగా.. ఈసారి 75.19 శాతం పోలింగ్‌ ‌నమోదైంది.

దేశమంతటా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పోలింగ్‌ ‌పూర్తయినా.. జూన్‌ 4‌వ తేదీనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో, అప్పటిదాకా రాజకీయ పార్టీలన్నింటికీ టెన్షన్‌ ‌తప్పదు. అయితే, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడిన తర్వాత మొదటినుంచీ ఉన్న వాతావరణం.. ఎన్నికల వేళ ఓటర్ల ట్రెండ్‌, ‌పోలింగ్‌ ‌రోజు ముఖ్యంగా యువ ఓటర్ల ఉత్సాహం చూస్తే.. ఆదినుంచీ అనుకున్న ఫలితాలే ప్రస్ఫటమవు తాయన్న సంకేతాలు వచ్చేశాయి.

ప్రధానంగా తెలంగాణలో రాజకీయ పార్టీల పరిస్థితులు, వాటికి ఉన్న ఆదరణ గమనిస్తే.. భారత రాష్ట్ర సమితి కనీస పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల మాట. పోలింగ్‌ ‌సమీపిస్తున్న వేళ.. కేసీఆర్‌ ‌షరామామూలు గానే ఫామ్‌హౌజ్‌ ‌నుంచి బయటకు వచ్చి బస్సుయాత్ర చేపట్టినప్పటికీ ఆయన ప్రసంగశైలిలో అధికార దర్పం స్పష్టంగా కనిపించింది. ఇంకా అధికారంలో ఉన్నట్లుగానే ఆయన ప్రసంగమంతా సాగింది. ఎదుటివాళ్లను తక్కువ చేయడం, దూషణలతో హీటెక్కించడం వంటి పరిణామాలకు కారణమయ్యారు.

ఇక, తెలంగాణలో జాతీయ పార్టీలైన భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల ముఖాముఖి పోరుకు కూడా ఓ కారణముంది. గత నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో సహజంగానే ప్రభుత్వంపై ఉండే ఆసక్తి, అనుకూల పరిస్థితులు ఆ పార్టీకి కాస్త ఊపును తీసుకొచ్చాయి. ఇక భారతీయ జనతాపార్టీ క్షేత్ర స్థాయిలో బలం పుంజుకోవడం.. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ఛరిష్మా ఆ పార్టీకి జోష్‌ను తీసుకొచ్చాయి. అంతేకాదు.. ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపించగలిగే పార్టీలు కాకుండా.. జాతీయస్థాయిలో సత్తాచాటే పార్టీపైనే జనం మొగ్గుచూపారు. దేశంలో ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి మూడోసారి జనంలోకి వచ్చింది.

ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రతిష్ట ముందెన్నడూ లేని విధంగా ఎవరెస్టు శిఖరమంతగా ఎగిసిపడుతోంది. ఓ రకంగా ప్రపంచాన్ని శాసించే శక్తి మంతమైన దేశంగాభారత్‌ అవతరించబోతోంది. ఆ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి కూడా. ఈ పరిస్థితుల్లో ప్రజలు.. ముఖ్యంగా ఓటర్లు చైతన్య వంతమైనట్లు కనిపించారు. ఈ పరిస్థితులకు తోడు.. సోషల్‌ ‌మీడియా ఈ ఎన్నికలను బాగా ప్రభావితం చేసింది. సోషల్‌ ‌మీడియా ద్వారా ఓటర్లు చైతన్య వంతులయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని, ప్రాధాన్యతను, ఓటర్ల బాధ్యతను సోషల్‌ ‌మీడియా తెలియజెప్పింది. ఫలితంగా స్థానిక అంశాలను పక్కనబెట్టిన ఓటర్లు.. కేవలం జాతీయ స్థాయి అంశాలు, దేశ రక్షణ, దేశ నిర్మాణం, దేశ సార్వభౌమాధికారం మాత్రమే చూసి ఓటేసినట్లు స్పష్టమవుతోంది.

 కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఔన్నత్యాన్ని పెంచిన అంశమే కేంద్రీకృతంగా ఓటు పక్రియ కొనసాగింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వాళ్లు కూడా ఈ సారి కమలం గుర్తుకు ఓటేశామని బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా మారే సందర్భం సమీపించింది. ఫలితంగా తెలంగాణలో బీజేపీకి డబుల్‌ ‌డిజిట్‌ ‌ఖాయమన్నది స్పష్టమయ్యింది.

సుజాత గోపగోని,

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE